ఇంటర్నెట్, మొబైల్ డేటా వినియోగంతో దేశంలో ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సైబర్ మోసగాళ్లు రకరకాల పేర్లతో మభ్యపెట్టి, వేశాలు మార్చి అమాయకులను దారుణంగా వంచిస్తున్నారు. ఎంతోమంది వీరి బారిన పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ముంబయికి చెందిన 78 ఏళ్ల మహిళ సైబర్ స్కామ్(cyber scam)కు బలైంది. ఢిల్లీ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందంగా నమ్మబలికిన ఓ సైబర్ ముఠా చేతిలో ఏకంగా రూ.1.5 కోట్ల మేర నష్టపోయింది.
వివరాల్లోకి వెళితే.. దక్షిణ ముంబయిలో ప్రముఖ బిల్టర్‌గా పేరున్న ఓ వ్యక్తి, 78 ఏళ్ల మహిళ బంధువులు. కొన్ని వారాల క్రితం యూఎస్‌లో ఉన్న తన కుమార్తెకు ఆ మహిళ కొన్ని వంటకాలు పంపడానికి కొరియర్ సర్వీస్‌ను ఆశ్రయించింది. అక్కడే సైబర్ మోసం ప్రారంభమైంది. మరుసటి రోజు ఆమెకు కొరియర్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నట్లు ఒకరు కాల్ చేశారు. ఆమె ప్యాకేజీలో ఫుడ్ ఐటమ్స్‌తోపాటు ఇతర వస్తువులు ఉన్నాయని తెలిపాడు. ఆ ప్యాకేజీలో ఆధార్ కార్డ్, గడువు ముగిసిన పాస్‌పోర్ట్‌లు, క్రెడిట్ కార్డ్‌లు, చట్టవిరుద్ధమైన పదార్థాలు, 2,000 యూఎస్ డాలర్లు(Dollars) ఉన్నట్లు చెప్పాడు. మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఆమె కుట్రకు పాల్పడినట్లు సైబర్ మోసగాళ్లు ఫోన్లో తీవ్రంగా ఆరోపించారు.
ఒత్తిడిలో పూర్తి వివరాలు..
ఈ స్కామ్‌లో భాగంగా సైబర్ క్రైమ్ బ్రాంచ్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌తో సహా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులుగా నటిస్తూ పలువురు తర్వాత రోజుల్లో ఆమెను సంప్రదించారు. తమ వాదనలను ఆమె విశ్వసించేలా నటిస్తూ, మోసగాళ్లు(Fraudsters) పోలీసు యూనిఫామ్‌లో కనిపించేవారు. అరెస్ట్ వారెంట్లు, దర్యాప్తు నివేదికల వంటి నకిలీ పత్రాలను ఆమెకు చూపించి వీడియో కాల్స్ కూడా చేశారు. స్కామర్లు నకిలీ వారెంట్లు, విచారణ నివేదికలను వాట్సాప్‌లో చూపించినందున ఒత్తిడిలో మహిళ తన వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలను తెలియజేశారు. ఇన్వెస్ట్‌గేషన్(Investigation) సమయంలో ఆమె తన ఆస్తులను కాపాడుకోవాలనే తాపత్రయంలో వారిని ప్రభుత్వ అధికారులుగానే నమ్మి, మోసగాళ్లు అందించిన బ్యాంకు ఖాతాలకు రూ.1.51 కోట్లను బదిలీ చేసింది. కుటుంబ సభ్యులకు పూర్తి వివరాలు తెలియజేసి వారితో చర్చించి తాను మోసపోయానని గ్రహించింది.
ఇదీ చదవండి: ప్యాసివ్ ఫండ్స్.. కార్యాచరణ ప్రకటించిన సెబీ
అప్రమత్తత అవసరం
సైబర్ క్రైమ్ పోలీస్ హెల్ప్‌లైన్ ద్వారా పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి ముంబై సౌత్ సైబర్ సెల్‌కు కేసు బదిలీ చేశారు. మహిళ పంపిన నగదును త్వరగా ట్రాన్స్‌ఫర్ చేయడానికి మోసగాళ్లు పలు ఖాతాలను ఉపయోగించారని, దీంతో వారిని ట్రేస్ చేయడం కొంత క్షిష్టమవుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ నిపుణులు కోరారు. తెలియని వారు చేసిన కాల్స్‌ను లిఫ్ట్ చేసినా ఎలాంటి వివరాలు పంచుకోవద్దని చెప్పారు. ఫోన్‌లో వ్యక్తిగత సమాచారాన్ని చెప్పకూడదని తెలిపారు. అనుమానాస్పదంగా ఉంటే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment