క్లిక్ చేస్తే బుక్ చేస్తారు
పెరుగుతున్న సైబర్ నేరాలు
వెలుగులోకి రోజుకొక సరికొత్త మోసం
కేవైసీ లింక్‌తో దోచేస్తారు
అందాలను ఎరవేస్తారు
పెరుగుతున్న సాంకేతికతతో పాటు సైబర్ నేరాలు(Cyber Crime) సైతం పెచ్చుమీరుతున్నాయి. రోజుకొక మోసంతో కేటుగాళ్లు కోట్లలో కొళ్లగొడుతున్నారు. ఒకరికి ఒకరు కనిపించకుండా, ముఖ పరిచయం లేకపోయినా లింక్ సిస్టమ్‌లా వీళ్లు పనిచేస్తున్నారు. సామాన్యుల నుంచి సంపన్న వర్గాలు, యువతీ, యువకుల నుంచి వృద్ధుల వరకు అమాయక ప్రజలంతా వీరి బాధితులే.
సెల్‌లో లింకే కదా అని క్లిక్ చేస్తే మిమ్మల్ని బుక్ చేస్తారు. ఇలాంటి మోసాలతో రూ.లక్షలు పోగొట్టుకుని పరువు సమస్యతో పోలీసులకు ఫిర్యాదులివ్వలేక అనేకమంది సతమతం అవుతున్నారు. ఈ సైబర్ నేరాలపై అవగాహనకు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. – శ్రీకాకుళం క్రైమ్
అందమైన వల.. చిక్కారో విలవిల
మనుషులను కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేసే పద్ధతి ఎక్స్‌టార్సన్. అలాగే అందమైన అమ్మాయిలను ఎరవేసి, తర్వాత బెదిరించి డబ్బులు దోచుకోవడం సెక్స్‌టార్సన్. వాట్సాప్, ఫేస్‌బుక్, టిండర్ (డేటింగ్ యాప్), ఇన్‌స్ట్రాగామ్ (Instagram) వంటి సోషల్ మీడియా యాప్‌ల ద్వారా మనలో ఉండే బలహీనతలను క్యాష్ చేసుకుని సైబర్ నేరగాళ్లు సెక్స్‌టార్సన్ పద్ధతిలో మోసాలు చేస్తుంటారు.
వీరు బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) వంటి రాష్ట్రాల నుంచి నెట్‌వర్క్ నడుపుతున్నట్లు దర్యాప్తు విభాగాలు చెబుతున్నాయి. సంపన్న వర్గాలకు చెందిన వృద్ధులు, యువత అధికంగా ఈ మాయలో పడుతుండటం విశేషం. వీరితో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు, వ్యాపారులు, రాజకీయవేత్తలు సైతం వందల సంఖ్యలో మోసపోతున్నారు.
ఎలా చేస్తారంటే..
సైబర్ కేటుగాళ్లు అమ్మాయి పేరుతో ఉన్న నకిలీ ఫేస్‌బుక్ (ఇతర యాప్స్) ఐడీని క్రియేట్ చేసి సెలెక్ట్ చేసుకున్న వ్యక్తికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతారు. యాక్సెప్ట్ చేయగానే ముందుగా చాటింగ్.. అలా నంబర్లు ఇచ్చిపుచ్చుకోవడం.. ఆ తర్వాత వాట్సాప్‌లో వ్యక్తిగత సమాచారం (వ్యక్తిది) తెలుసుకుని అడల్ట్ కంటెంట్, న్యూడ్ చాట్ చేసుకునేవరకు కథ తీసుకెళ్తారు.
అనంతరం చాట్ నుంచి వీడియో కాల్స్‌లోకి లాగి అవతలివైపు నుంచి రికార్డ్ చేసిన ఓ న్యూడ్ వీడియోను వాట్సాప్ కాల్‌లో లైవ్‌లాగా చిత్రీకరించి ఎదుటి వ్యక్తిని న్యూడ్‌చాట్‌లోకి తీసుకొస్తారు. వెంటనే మొత్తం కాల్ రికార్డ్ చేసి అదే వ్యక్తి వాట్సాప్‌కు వీడియోను షేర్ చేసి డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తారు. లేదంటే యూట్యూబ్‌లో పెడతామని బెదిరిస్తారు.
అప్రమత్తతే ఆయుధం
» సైబర్ మోసానికి గురయ్యేవారు గోల్డెన్ అవర్‌లో తక్షణమే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలి.
» www.cybercrime.gov.in పోర్టల్‌లో ఆన్‌లైన్ ఫిర్యాదివ్వాలి. సంబంధిత బ్యాంకు ప్రతినిధులను సంప్రదించి ఖాతాలను ఫ్రీజ్ చేయించాలి. పరిధి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించాలి.
» ఎవరైనా బ్యాంకులో మ్యూల్ ఖాతా తమకు తెలియకుండా వేరే వ్యక్తులు తెరవాలనుకుంటే వెంటనే 1930 సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేయాలి. అంతేకాక ఆర్టీజీఎస్ ద్వారా రూ.2 లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని సేవింగ్స్ అకౌంట్ నుంచి కరెంట్ అకౌంట్‌కు బదిలీ చేస్తే ఖాతాదారులను అప్రమత్తం చేయాలి.
ఈ మోసాలు పరిశీలిస్తే..
» శ్రీకాకుళం జిల్లాలో ఓ ప్రముఖ కుటుంబానికి చెందిన వ్యక్తి తనకున్న బలహీనతతో ఫేస్‌బుక్‌లో అమ్మా యి పరిచయం కాగానే మాటామాటా కలిపాడు. ఆమె కూడా వీడియో కాల్ మాట్లాడటం, న్యూడ్ గా కనిపించడంతో తనూ న్యూడ్‌గా మారి కొంతకాలం ఆనందం పొందాడు. అక్కడికి కొద్దిరో జులకు ఆ అమ్మాయి న్యూడ్ వీడియోలు బయటపెడతానంటూ భయపెట్టి రూ.5 లక్షలు కావా లని బ్లాక్ మెయిల్ చేసింది. బయట తెలిస్తే పరు వు పోతుందని చేసేదేమీలేక డబ్బులు వేసేశాడు.
» జిల్లాలోని ఒక ప్రముఖ వైద్యుడు తెలియని లింక్ క్లిక్ చేయడంతో హాయ్ అని ఓ అమ్మాయి వాట్సాప్ మెసేజ్ పెట్టింది. రిప్లయ్ ఇవ్వడంతో న్యూడ్ వీడియో కాల్స్ తరచూ చేసేది. అక్కడికి కొద్దిరోజులకు వీడియోలు బయటపెడతామంటూ, డిజిటల్ అరెస్టు అవుతావంటూ ఢిల్లీ పోలీస్ సెటప్‌తో కొందరు వ్యక్తులు స్కైప్‌కాల్‌లో దర్శనమవ్వడంతో వాళ్లడిగిన రూ.18.50 లక్షలు చదివించేశారు.
» శ్రీకాకుళం రూరల్ మండలంలో సంపన్న వర్గానికి చెందిన ఓ వృద్ధుడు అశ్లీల వీడియోలు చూసే అలవాటుండడంతో అందులో ఓ మెసేజ్ రావడంతో ఆన్సర్ చేశాడు. ఓ ఇద్దరు యువతుల ముఖాలతో ఉన్న పురుషులు వీడియో కాల్‌లో కనిపించి వృద్ధునికి మత్తెక్కే మాటలతో మైమరిపించగా వృద్ధుడు న్యూడ్‌గా మారాడు. తక్షణమే ఆ వీడియోలు వృద్ధునికి పంపించి రూ.10 లక్షలు డిమాండ్ చేయగా. రూ.6 లక్షల వరకు సమర్పించేశాడు.
» ఇదే తరహాలో ఏఐ సాయంతో జిల్లాలో ఓ మహిళా అధికారికి మోసం చేసే క్రమంలో ఆమె అప్రమత్తం అవ్వడంతో త్రుటిలో సైబర్ ఉచ్చునుంచి తప్పించుకున్నారు.
జాగ్రత్తగా ఉండాలి
ఏ బ్యాంకు కూడా ఆన్‌లైన్ కేవైసీ వివరాలు అడగదు. అపరిచితులు పంపే లింక్‌లు ఓపెన్ చేయరాదు. వాళ్లు మన ఫోన్‌ను హ్యాక్ చేసే సమయంలో మన అకౌంట్‌లో డబ్బులు ఎంత ఉంటే అంత మాయం చేస్తారు. డబ్బులు లేకపోతే ఏమీ చేయలేరు. ఎప్పటికప్పుడు మన ఖాతాను పరిశీలిస్తుండాలి.
సెక్స్‌టార్షన్‌కు గురయ్యేవారు తామేదో తప్పు చేసినట్లు భావించి భయపడి పరువు సమస్యతో ఫిర్యాదు చేయకపోతే సైబర్ నేరగాళ్లకు మీరే బలమైన ఆయుధాన్ని ఇచ్చిన వారవుతారు. తక్షణమే ఫిర్యాదు చేస్తే ఆపద నుంచి బయటపడవచ్చు. – కేవీ మహేశ్వరరెడ్డి, ఎస్పీ, శ్రీకాకుళం జిల్లా
Comments
Please login to add a commentAdd a comment