గణనీయంగా పెరుగుతున్న సైబర్ మోసాలు
జనవరి–ఏప్రిల్ మధ్య దేశంలో అత్యధికంగా 7.40 లక్షల ఫిర్యాదులు
రూ.1,750 కోట్లకుపైగా ఆర్థిక దోపిడీకి గురైన భారతీయులు
ఒక్క మే నెలలోనే రోజుకు సగటున 7 వేలకు పైగా సైబర్ క్రైమ్ ఫిర్యాదులు నమోదు
ఫిర్యాదుల్లో 85 శాతం ఆన్‌లైన్ ఆర్థిక మోసాలే
దేశంలో సైబర్ మోసాలు వణుకు పుట్టిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ల ద్వారా పెరుగుతున్న ఆన్‌లైన్ లావాదేవీలను ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు రూ.కోట్లు కొట్టేస్తున్నారు. కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ నిర్వహించే సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో ఏకంగా 7.40 లక్షల ఫిర్యాదులు నమోదవడం సైబర్ ముప్పు తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ ఫిర్యాదుల ప్రకారం రూ.1,750 కోట్లు సైబర్ నేరగాళ్ల దోపిడీకి గురయ్యాయి.
ఆన్‌లైన్ పెట్టుబడి మోసం, గేమింగ్ యాప్‌లు, అల్గారిథమ్ మానిప్యులేషన్‌లు, అక్రమ రుణ యాప్‌లు, అశ్లీల వీడియోలతో బెదిరింపులు, ఓటీపీ స్కామ్‌లలో అమాయకులు చిక్కుకుని ఆరి్థకంగా నష్టపోతున్నారు. సైబర్ నేరగాళ్లు కాల్ స్పూఫింగ్, ప్రభుత్వ, బ్యాంకు అధికారులుగా నటిస్తూ ఆర్థిక లావాదేవీల వివరాల సేకరణ, ఆన్‌లైన్ టాస్క్‌ల ద్వారా సులభంగా డబ్బు సంపాదించవచ్చనే ఆశ చూపిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. ఫలితంగా 2019 నుంచి 2024 వరకు సైబర్ కేసుల్లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. –సాక్షి, అమరావతి
మే నెలలో రోజుకు 7 వేల ఫిర్యాదులు
ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) నివేదిక ప్రకారం ఈ ఏడాది మే నెలలో రోజుకు సగటున 7 వేల సైబర్ క్రైమ్ ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇది 2021–2023 మధ్య కాలంతో పోలిస్తే 113.7 శాతం అధికం కావడం ఆందోళన కలిగిస్తోంది. ఫిర్యాదుల్లో 85 శాతం ఆర్థిక ఆన్‌లైన్ మోసానికి సంబంధించినవి కావడం గమనార్హం. ఒక్క 2023లోనే ఐ4సీ డేటా ప్రకారం.. లక్షకుపైగా ఆన్‌లైన్‌లో పెట్టుబడి మోసాలను గుర్తించారు.
ఇక డిజిటల్ అరెస్ట్‌ల (వీడియో కాల్స్ స్కామ్‌లు) ఫలితంగా 2024 తొలి నాలుగు నెలల్లోనే 4,599 కేసులు నమోదవగా.. బాధితులు రూ.120 కోట్ల మేర నష్టపోయారు. 20 వేలకు పైగా ట్రేడింగ్ స్కామ్‌లు నమోదవగా.. సైబర్ నేరగాళ్లు రూ.1,420 కోట్లు కాజేశారు. ఇక 62,687 ఆన్‌లైన్ పెట్టుబడి మోసాల కేసుల్లో రూ.222 కోట్లు, డేటింగ్ యాప్‌ల వలలో 1,725 కేసుల్లో రూ.13.23 కోట్లు సైబర్ మోసాలకు పాల్పడ్డారు.
సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం ⇒
భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకున్న చాలామంది సైబర్ నేరగాళ్లు ఆగ్నేయాసియా ప్రాంతాల నుంచి మోసాలకు పాల్పడుతున్నారు. పుర్సాట్, కోహ్‌కాంగ్, కంబోడియాలోని సిహనౌక్విల్లే, మయన్మార్‌లోని మైవాడ్డీ, థాయ్‌లాండ్ వంటి ప్రాంతాల నుంచి ఈ ముఠాలు పని చేస్తున్నట్టు తెలుస్తోంది.
⇒
సైబర్ మోసాల కట్టడికి ఐ4సీ.. నాలుగు నెలల్లో దాదాపు 3.25 లక్షల మ్యూల్ బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేసింది. 5.30 లక్షల సిమ్ కార్డులను బ్లాక్ చేసింది. ⇒
అదనంగా సైబర్ నేరగాళ్ల కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తూ 3,401 సోషల్ మీడియా ఖాతాలు, వాట్సాప్ గ్రూపులను డీయాక్టివేట్ చేసింది.
⇒
గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే సందేశాలను నమ్మొద్దు. సులభంగా డబ్బు సంపాదన, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలంటూ ఇచ్చే అవకాశాలను విశ్వసించవద్దు. ⇒
అధికారిక చానల్స్ ద్వారా ఉద్యోగ ఆఫర్‌లు ప్రామాణికతలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలి ⇒
అవసరమైతే తప్ప సురక్షితమైన వెబ్‌సైట్‌లో మాత్రమే సున్నితమైన సమాచారాన్ని పంచుకోవాలి. ⇒
ఏదైనా అనుమానిత సైబర్ స్కామ్ గుర్తిస్తే వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోరి్టంగ్ పోర్టల్‌కు నివేదించాలి. తక్షణ సహాయం కోసం 1930కి కాల్ చేయాలి.
సైబర్ ఫిర్యాదుల్లో పెరుగుదల ఇలా..
2019 26,049
2020 2,57,777
2021 4,52,414
2022 9,66,790
2023 15,56,218
2024 7,40,957 (తొలి నాలుగు నెలల్లోనే)
Comments
Please login to add a commentAdd a comment