
అత్యధిక సైబర్ నేరాలు ఆ పేరుతోనే..
తర్వాత స్థానాల్లో రిటైల్, టెక్నాలజీ సంస్థలు
2025లో రూ.20 వేల కోట్లు కొల్లగొట్టొచ్చని అంచనా
సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ క్లౌడ్ సేక్ నివేదిక వెల్లడి
సాక్షి, అమరావతి: బ్రాండింగ్ ముసుగులో సైబర్ నేరగాళ్లు పేట్రేగిపోతున్నారు. బ్యాంకింగ్, ఆర్థిక సంస్థల పేర్లతోనే అత్యధికంగా నిధులు కొల్లగొడుతున్నారు. రిటైల్, టెక్నాలజీ రంగాల పేరిట మోసాలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇక సైబర్ నేరస్తులు నిధులు కొల్లగొట్టేందుకు ఫిషింగ్ యాప్‌లు, లింక్‌లనే ప్రధాన సాధనంగా చేసుకుంటున్నారు.
ప్రముఖ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ‘క్లౌడ్ సేక్’ దేశంలో సైబర్ నేరాల తీవ్రతపై తాజా నివేదికలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. 2025లో దేశంలో సైబర్ నేరగాళ్లు మరింతగా రెచ్చిపోయే అవకాశాలున్నాయని కూడా అంచనా వేసింది.
నివేదికలోని ప్రధాన అంశాలివి..
» బ్యాంకులు, ఆర్థిక సంస్థల పేరిట మోసాలే మొదటి స్థానంలో ఉన్నాయి. దేశంలో 39.5 శాతం సైబర్ నేరాలు బ్యాంకులు, ఆర్థిక సంస్థల పేరిటæ బురిడీ కొట్టించి నిధులు కొల్లగొడుతున్నారు.
» రెండు, మూడు స్థానాల్లో రిటైల్/ఈ–కామర్స్, టెక్నాలజీ సంస్థలున్నాయి. రిటైల్ సంస్థల పేరుతో 21.4 శాతం, టెక్నాలజీ సంస్థల పేరిట 12.5శాతం సైబర్ నేరస్తులు బురిడీ కొట్టిస్తున్నారు. ఇక టెలీ కమ్యూనికేషన్ల సంస్థలు(9.1శాతం), ట్రావెల్ సంస్థలు(8.6శాతం), రియల్ ఎస్టేట్ సంస్థలు(2.5శాతం), బీమా కంపెనీలు(1.9%) పేరిట కూడా సైబర్ నేరస్తులు మోసాలకు పాల్పడుతున్నారు.
» సైబర్ ముఠాలు అత్యధికంగా ఫిషింగ్ యాప్‌లు/లింకులనే తమ మోసాలకు సాధనంగా చేసుకుంటున్నాయి. ఫిషింగ్ యాప్‌లు/ లింకులు పంపి వాటిని క్లిక్ చేయగానే బ్యాంకు ఖాతాల్లో నిధులు కొల్లగొడుతున్నాయి. మొత్తం సైబర్ నేరాల్లో ఈ తరహా మోసాలు ఏకంగా 58% ఉండటం గమనార్హం.
» తర్వాత స్థానాల్లో సోషల్ మీడియా మాధ్యమాలున్నాయి. ఫేక్ ఫేస్‌బుక్ ఐడీల పేరిట 25.7శాతం, యూట్యూబ్ ద్వారా 5.8శాతం, ఎక్స్( ట్విట్టర్) ఖాతాల ద్వారా 3.2శాతం, ఇన్‌స్టాగామ్ ద్వారా 2.5శాతం సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు.
» సైబర్ నేరస్తులు 2025లో దేశంలో ఏకంగా రూ.20 వేల కోట్లు కొల్లగొట్టే అవకాశం ఉందని అంచనా. దేశంలో సైబర్ మోసాలపై ఏకంగా 25 లక్షలకు పైగా ఫిర్యాదులు నమోదయ్యే అవకాశం ఉంది. వాటిలో 41 శాతం వరకు బ్యాంకింగ్, ఆర్థిక సంస్థల పేరిట మోసాలే ఉంటాయని భావిస్తున్నారు. ఇక దేశంలో మోసపూరితమైన యాప్‌లు 83 శాతం, ఫేక్ సోషల్ మీడియా ఖాతాలు 65 శాతం పెరగొచ్చని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment