
1957 నుంచి జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇదే నిరూపితం
పురుషుల కన్నా మహిళలనే ఎక్కువగా వరించిన విజయం
2024లో పోటీ చేసిన పురుషుల్లో 6.2 శాతమే గెలుపు
మహిళలు 9.3 శాతం మంది విజయం
దేశంలో మహిళలు–పురుషులు–2024 నివేదిక వెల్లడి
ఆకాశంలో సగం.. అవనిలో సగం.. మహిళ. అటువంటి మహిళకు అవకాశం లభించాలే గానీ ఏ రంగంలోనైనా విజయబావుటా ఎగరవేయడం ఖాయమనడానికి.. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన మహిళలు–పురుషులు–2024 నివేదికే నిదర్శనం. మహిళలకు అవకాశం లభిస్తే అత్యధిక శాతం విజయం వారినే వరిస్తోందని 1957 నుంచి జరిగిన ప్రతి లోక్‌సభ ఎన్నికలోనూ నిరూపితమైందని నివేదిక వెల్లడించింది. – సాక్షి, అమరావతి
ఎన్నికల్లో పోటీ చేసే మహిళల సంఖ్యను పెంచడం వల్ల లోక్‌సభలో వారి ప్రాతినిధ్యం పెంచవచ్చని నివేదిక సూచించింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన మహిళల్లో 9.3 శాతం విజయం సాధించగా.. పురుషుల్లో 6.2 శాతం మంది గెలిచారు. కానీ లోక్‌సభలో ప్రాతినిధ్యం విషయానికి వస్తే మహిళల శాతం చాలా తక్కువగా ఉంది. 2024 ఎన్నికల్లో మొత్తం 544 లోక్‌సభ స్థానాల్లో 75 స్థానాల్లో(14 శాతం) మహిళలు విజయం సాధించారు. పశ్చిమబెంగాల్ నుంచి అత్యధికంగా 11 మంది మహిళా ఎంపీలు ఎన్నికయ్యారు.
కేంద్ర కేబినెట్‌లో మహిళల సంఖ్య కూడా సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. 1998లో కేంద్ర కేబినెట్‌లో 9.52 శాతం మహిళలు ఉండగా.. 2013లో మహిళా మంత్రులు 15.38 శాతం, 2015లో 17.78 శాతానికి పెరిగి.. 2024కు మళ్లీ 9.72 శాతానికి తగ్గిపోయింది. మహిళలకు మెరుగ్గా అవకాశాలు కల్పించగలిగితే.. దేశం అభివృద్ధి పథంలో మరింత వేగంగా ముందుకు దూసుకెళ్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
