ఉన్నత విద్యలో యువతుల హవా | Young women in higher education | Sakshi
Sakshi News home page

ఉన్నత విద్యలో యువతుల హవా

Published Thu, Nov 21 2024 5:42 AM | Last Updated on Thu, Nov 21 2024 5:42 AM

Young women in higher education

దేశంలో పెరిగిన పీహెచ్‌డీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు

ఉన్నత విద్యారంగంపై సీఐఐ–డెలాయిట్‌ నివేదిక

సాక్షి, అమరావతి: ఉన్నత విద్యలో యువతులు ఆధిపత్యం సాధిస్తున్నారు. దేశంలో తొలిసారిగా యువకుల కంటే యువతుల అధిక సంఖ్యలో ఉన్నత విద్యా కోర్సుల్లో చేరుతున్నారు. 

ఉన్నత విద్యా సంస్థల్లో చేరికలను సూచించే గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో (జీఈఆర్‌)లో 2017–18 నుంచి యువకులను యువతులు అధిగవిుంచారు. యువకుల జీఈఆర్‌ 28.4శాతం ఉండగా.. యువతుల జీఈఆర్‌ 28.5శాతంగా నమోదైంది. 

2017–22 మధ్య ఐదేళ్లలో ఉన్నత విద్యా రంగంలో వచ్చిన విశేష మార్పులు దేశ ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం కనబరుస్తోందని భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ)–డెలాయిట్‌ సంయుక్త అధ్యయన నివేదిక–2024 వెల్లడించింది. సీఐఐ–డెలాయిట్‌ సంయుక్తంగా 2017–22 మధ్య కాలంలో దేశ ఉన్నత విద్యా రంగం తీరుతెన్నులను విశ్లేషించాయి.

ఆ నివేదికలోని ప్రధాన అంశాలు ఇవీ....
» దేశంలో ఉన్నత విద్యను అందించే కాలేజీల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2017లో దేశంలో 39,050 కాలేజీలు ఉండగా 2022 నాటికి 42,825కు పెరిగాయి.
»  ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థుల ప్రవేశాన్ని సూచించే ‘గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో(జీఈఆర్‌) చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగింది. 2017–18లో జీఈఆర్‌ 24.6శాతం ఉండగా... 2021–22 నాటికి 28.4శాతానికి పెరగడం విశేషం.
» ఉన్నత విద్యా సంస్థల్లో యువతుల జీఈఆర్‌ కూడా పెరగడం సానుకూల పరిణామం. యువతుల జీఈఆర్‌ 2017–18లో 25.6శాతం ఉండగా 2021–22నాటికి 28.5శాతానికి పెరిగింది. 
» ఉన్నత విద్యా సంస్థల్లో యువకుల జీఈఆర్‌ 2017–18లో 24.6శాతం ఉండగా, 2021–22నాటికి 28.4 శాతానికి చేరింది. ఈ ఐదేళ్లలోను యువతుల జీఈఆర్‌ అధికంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.
» ఉన్నత విద్యా సంస్థల్లో అధ్యాపకులు, విద్యార్థుల నిష్పత్తి కూడా క్రమంగా తగ్గుతోంది. ఐదేళ్లలో ఉన్నత విద్యా రంగంలో అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయడంతో ఇది సాధ్యపడింది. 2017–18లో 25 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు ఉండగా... 2021–22 నాటికి 23 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు ఉన్నారు.
 » ఇక దేశంలో ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలు గణనీయంగా పెరిగాయి. 2017–18లో దేశంలో మొత్తం 1,61,412 మంది పీహెచ్‌డీ కోర్సుల్లో  చేరారు. 2021–22లో ఏకంగా 2,12,522 మంది పీహెడ్‌డీ కోసం ఎన్‌రోల్‌ చేసుకోవడం విశేషం. 
» పోస్టు గ్రాడ్యూయేట్‌ కోర్సుల్లో 2017–18లో 29.40 లక్షల మంది విద్యార్థులు చేరగా... 2021–22 విద్యా సంవత్సరంలో 37.50 లక్షల మంది విద్యార్థులు చేరారు. అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో 2017–18లో 2.64 కోట్ల మంది విద్యార్థులు చేరగా, 2021–22 విద్యా సంవత్సరంలో 3.07కోట్ల మంది ప్రవేశంపొందారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement