2023లో రూ. 3.9 కోట్లు... 2024లో ఇప్పటివరకు రూ.27.4 కోట్లు కొల్లగొట్టిన సైబర్ కేటుగాళ్లు
వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టా, ఎక్స్‌లో అమాయకులకు వల
అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన టీఎస్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో
సాక్షి, హైదరాబాద్: స్టాక్ మార్కెట్‌లో తాము చెప్పే కంపెనీల్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశచూపి బ్యాంకు ఖాతాలు ఖాళీచేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. షేర్ల కొనుగోలు పేరిట అమాయకులకు గాలం వేసి రూ.కోట్లలో దోచుకుంటున్నారు. ఈ తరహా ఐపీఓ ట్రేడింగ్ మోసాలు ఇటీవల పెరిగినట్టు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది. కొత్తగా మార్కెట్‌లోకి వచ్చే ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్)లను ఇన్‌స్టిట్యూషన్ ఇన్వెస్ట్‌మెంట్ కింద కొనుగోలు చేయండి అంటూ సైబర్ నేరగాళ్లు నమ్మబలుకుతున్నట్టు పేర్కొంది. 2023లో ఈ తరహా కేసులు 627 నమోదు కాగా, బాధితులు రూ.3,91,54,683 పోగొట్టుకున్నట్టు టీఎస్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వెల్లడించింది. ఈ ఏడాదిలో రెండు నెలల్లోనే మొత్తం 213 కేసులు నమోదయ్యాయని, బాధితులు రూ.27,40,76,211 పోగొట్టుకున్నట్టు అధికారులు తెలిపారు.
ఇలా మోసగిస్తున్నారు..
సైబర్ మోసగాళ్లు తొలుత వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్ట్రాగామ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా యాప్‌ల ద్వారా లింక్‌లు పంపుతున్నారు. ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్స్(ఎఫ్‌పీఐ)ల వంటి ఇన్‌స్టిట్యూషనల్ విధానాల్లో ఐపీఓలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మబలుకుతున్నారు. ఈ ప్రకటనలు నమ్మి ఎవరైనా పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపితే, వారిని ఫేక్ ట్రేడింగ్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకునేలా సైబర్ నేరగాళ్లు ప్రోత్సహించి తమ అదీనంలో ఉండే బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు వేయించుకుంటారు.
నకిలీ యాప్‌లో బోగస్ డ్యాష్ బోర్డులను సృష్టించి వారికి లాభాలు వస్తున్నట్టుగా చూపుతున్నా రు. మరింత పెట్టుబడి పెడితే పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయ ని నమ్మిస్తారు. బాధితులు చివరకు తమ సొమ్మును డ్రా చేసుకునేందుకు ప్రయత్నించినప్పుడు మోసపోయిన విషయం తెలుస్తుంది. ఈ తరహా ట్రేడింగ్ మోసాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు హెచ్చరిస్తున్నా రు. ఒకవేళ తాము మోసపోయినట్టు గుర్తిస్తే బాధితులు వెంటనే 1930 టోల్‌ఫ్రీనంబర్‌లో లేదా cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment