వసతి గదుల బుకింగ్‌లో డూప్లి‘కేటు గాళ్లు’
రాజస్థాన్, జైపూర్ నుంచి ఆపరేషన్
ఏపీ టూరిజం, ప్రైవేట్ రూమ్‌లపైనా టార్గెట్
నమ్మి మోసపోతున్న భక్తులు
అప్రమత్తంగా ఉండాలంటున్న దేవస్థానం అధికారులు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలానికి వచ్చే భక్తులపై సైబర్ నేరగాళ్లు వల వేశారు. ఆన్‌లైన్‌లో గదుల బుకింగ్ కోసం వెతికేవారే టార్గెట్‌గా డూప్లికేట్ వెబ్‌సైట్లు సృష్టించి పెద్ద మొత్తంలో డబ్బులు కొట్టేస్తున్నారు. అచ్చం శ్రీశైలం దేవస్థానం అధికారక వెబ్‌సైట్‌ను పోలి ఉండే ఫేక్ వెబ్‌సైట్ సృష్టించారు. అందులో వివరాలు నింపగానే సంబంధిత భక్తులకు ఫోన్ చేసి.. “వసతి గది కోసం మీరు చేసుకున్న బుకింగ్ కన్ఫర్మ్ అయింది.
మీరు వెంటనే మా ఫోన్ నంబర్‌కు ఫోన్ పే, గూగుల్ పే ఇతర యూపీఐ పేమెంట్ ఆప్షన్లతో డబ్బు చెల్లించండి. ఆ తర్వాత మీ గది బుకింగ్ డిటెయిల్స్ పంపిస్తాం’ అంటూ సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగుతారు. పేమెంట్ చేశాక ఫేక్ బుకింగ్ నంబర్లు పంపి మోసం చేస్తున్నారు. వాస్తవానికి వసతి గది కోసం దేవస్థానం కానీ, ఇక్కడి ప్రైవేట్ సత్రాలు, ఏపీ టూరిజం వారు కానీ పేమెంట్ కోసం ఫోన్ చేయరు.
పేమెంట్ అంతా ఆన్‌లైన్ గేట్‌వే ద్వారానే జరుగుతుంది. శ్రీశైల క్షేత్రంలో ఆర్జితసేవ టికెట్లు, వసతి గదుల విషయంలో దళారులు అధికమయ్యారు. వారికి అడ్డుకట్ట వేసేందుకు దేవస్థానం ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్ (మల్లన్న స్పర్శ దర్శనం) టికెట్లను వందశాతం ఆన్‌లైన్ చేసింది. అలాగే వసతి గదులను సైతం ఎక్కువ శాతం ఆన్‌లైన్ ద్వారానే కేటాయిస్తున్నారు. ఇదే ఆసరాగా సైబర్ నేరగాళ్లు భక్తులను మోసగిస్తున్నారు.
ఏపీ టూరిజంకూ తప్పని బెడద
భక్తుల సౌకర్యార్థం వీఐపీ కాటేజీలు, గణేశ సదన్, మల్లికార్జున సదన్, గంగా–గౌరీ సదన్, కుమార సదన్, పాతాళేశ్వరసదన్ తదితర పేర్లతో వసతి గదులను శ్రీశైల దేవస్థానం ఏర్పాటు చేసింది. వీటి బుకింగ్ విషయంలో భక్తులకు సౌకర్యంగా ఉండేందుకు ఆన్‌లైన్ సదుపాయాన్ని కల్పించింది. సైబర్ నేరగాళ్లు ముఠాగా ఏర్పడి దేవస్థానం వసతి గదుల పేర్లతో సమానంగా నకిలీ వెబ్‌సైట్లు తయారుచేసి వాటి ద్వారా భక్తులను మోసం చేస్తున్నారు.
కేవలం దేవస్థానానికి మాత్రమే కాకుండా శ్రీశైలంలో ఉన్న ఏపీ టూరిజం, శ్రీశైలంలోని ప్రైవేట్ సత్రాలకు సైతం ఫేక్ వెబ్‌సైట్ల బెడద తప్పడం లేదు. ఆయా సంస్థల పేరుతో నకిలీ వెబ్‌సైట్లు తయారు చేసి డబ్బు వసూలు చేస్తున్నారు. ఫేక్ వెబ్‌సైట్లను ఆశ్రయించి డబ్బు చెల్లించిన భక్తులు శ్రీశైలం వచ్చి సదరు సంస్థ రిసెప్షన్‌లో వారికి వచి్చన మెసేజ్‌ను చూపించగా అది ఫేక్ అని తేలిపోతుండటంతో లబోదిబో మంటున్నారు.
ఆ తర్వాత గదులు దొరకక ఇబ్బందులు పడుతున్నారు. సైబర్‌క్రైం పోలీసులు నకిలీ ఐడీలపై విచారణ చేయగా రాజస్థాన్, జైపూర్ వాటిని ఆపరేట్ చేస్తున్నట్లుగా గుర్తించారు.
అసలైన వెబ్‌సైట్లను గుర్తించండిలా..
శ్రీశైల దేవస్థానం అధికారికంగా www.srisailadevasthanam.org (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.శ్రీశైలదేవస్థానం.ఓఆర్‌జీ) వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసింది. ఈ వెబ్‌సైట్ ద్వారా ఆర్జితసేవలు, దర్శనం టికెట్లు, వసతి గదులు
పొందవచ్చు.
అలాగే aptemples.ap.gov.in (ఏపీటెంపుల్స్.ఏపీ.జీవోవీ.ఇన్) ద్వారా కూడా లాగిన్ అయి శ్రీశైల దేవస్థానం వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమకు కావాల్సిన సేవలను, వసతి గదులను పొందవచ్చు.
అలాగే srisailadevasthanam (శ్రీశైలదేవస్థానం) మొబైల్ యాప్‌ను ప్లే స్టోర్ ద్వారా ఇన్‌స్టాల్ చేసుకుని తద్వారా ఆయా సేవలను పొందవచ్చు.
భక్తులు అప్రమత్తంగా ఉండాలి
శ్రీశైల దేవస్థాన వెబ్‌సైట్లను పోలిన నకిలీ వెబ్‌సైట్ల పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలి. కంప్యూటర్‌పై పరిజ్ఞానం ఉన్నవారు మాత్రమే స్వయంగా వసతి, ఆర్జిత సేవా టికెట్లను పొందాలి. కంప్యూటర్ పరిజ్ఞానం లేనివారు కంప్యూటర్ సెంటర్లను ఆశ్రయించి ఆయా సేవలను పొందితే ఫేక్ ఐడీల బారిన పడకుండా ఉండవచ్చు. – డి.పెద్దిరాజు, శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి
Comments
Please login to add a commentAdd a comment