కిల్లర్ వైరస్‌కు మందు దొరికింది!
ప్రపంచం మొత్తాన్ని గడగడ వణికిస్తున్న రాన్సమ్‌వేర్ 'వాన్నాక్రై'కి మందు దొరికేసింది. హాంకాంగ్‌లోని ఓ సైబర్ సెక్యూరిటీ నిపుణుడు అనుకోకుండా ఒక కిల్లర్ స్విచ్‌ను కనుగొన్నారు. దాన్ని ఉపయోగిస్తే ఈ వైరస్ మన కంప్యూటర్‌ను ఏమీ చేయలేదట. ప్రస్తుతానికి వాన్నక్రైని ఆపగలిగే ఏకైక మందు ఇదొక్కటే. @MalwareTechBlog అనే ట్విట్టర్ హ్యాండిల్‌తో ఈ సైబర్ నిపుణుడు ట్వీట్ చేస్తున్నాడు. తాను అనుకోకుండా దీన్ని కనుగొన్నానని, అయితే మాల్‌వేర్ ఉపయోగించే ఒక డొమైన్ నేమ్‌ను రిజిస్టర్ చేయడం ద్వారా దాని విస్తృతిని ఆపచ్చని వివరించాడు. వాళ్లు రిజిస్టర్ కాని డొమైన్ మీద ఆధారపడుతున్నారని, దాన్ని రిజిస్టర్ చేయడం ద్వారా తాము మాల్‌వేర్ స్ప్రెడ్‌ను ఆపామని అతడు వివరించాడు. సైబర్ ఎటాక్‌ను నివారించాలంటే ప్రజలు అత్యవసరంగా తమ సిస్టమ్స్‌ను అప్‌డేట్ చేసుకోవాలని హెచ్చరించాడు. సంక్షోభం ఇంకా ముగిసిపోలేదని, వాళ్లు ఎప్పుడైనా కోడ్ మార్చి మరోసారి దాడికి ప్రయత్నించవచ్చని తెలిపాడు. శుక్రవారం నాడు ముందుగా లండన్‌లోని ఆస్పత్రుల నెట్‌వర్క్‌ను టార్గెట్ చేసిన హ్యాకర్లు, ఆ తర్వాత క్రమంగా ప్రపంచంలో చాలా దేశాలమీద దాడులు కొనసాగించారు. అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీలో ఉన్న ఒక లోపాన్ని కూడా వాళ్లు కనుగొన్నారు. హ్యాకర్లు రాన్సమ్‌వేర్ అనే టెక్నిక్ ఉపయోగించారు. దానివల్ల యూజర్ల ఫైళ్లన్నీ లాక్ అయిపోతాయి. వాటిని అన్‌లాక్ చేయాలంటే బిట్‌కాయిన్ల రూపంలో హ్యాకర్లకు వాళ్లు అడిగినంత మొత్తం చెల్లించుకోవాలి. బ్రిటిష్ ఆస్పత్రుల నుంచి రష్యా హోంశాఖ, స్పానిష్ టెలికం దిగ్గజం టెలిఫోనికా, అమెరికా డెలివరీ సంస్థ ఫెడెక్స్.. ఇలా అనేక సంస్థలు ఈ హ్యాకర్ల బారిన పడ్డాయి.
ఈ రాన్సమ్‌వేర్‌కు హాంకాంగ్ నిపుణుడు మందు కనుగొన్నా, అది అప్పటికే ఇన్ఫెక్ట్ అయిన కంప్యూటర్లకు మాత్రం పనిచేయదట. ఆ దాడి జరగకుండా కాపాడేందుకు ముందుగానే ఇచ్చే టీకా లాంటిదని మాత్రమే చెబుతున్నారు. వాళ్లు ఉపయోగిస్తున్న మాల్‌వేర్ పేరు డబ్ల్యుక్రై. అయితే అనలిస్టులు మాత్రం వాన్నాక్రై లాంటి ఇతర వేరియంట్లను కూడా ఉపయోగిస్తున్నారు. బ్రిటన్ ఆస్పత్రుల నెట్‌వర్క్‌ను వదలాలంటే వాళ్లు 300 డాలర్లు బిట్‌కాయిన్ల రూపంలో చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. మూడు రోజుల్లో ఆ మొత్తం చెల్లించకపోతే రెట్టింపు కట్టాల్సి వస్తుందని కూడా హెచ్చరించారు. ఏడు రోజుల్లోగా తమకు ఏమీ అందకపోతే మొత్తం ఫైళ్లన్నింటినీ డిలీట్ చేసేస్తామని బెదిరిస్తున్నారు. శనివారం ఉదయానికి 74 దేశాల్లో 45వేల సైబర్ దాడులు జరిగినట్లు యాంటీ వైరస్ సంస్థ కాస్పర్‌స్కీకి చెందిన పరిశోధకుడు కాస్టిన్ రెయు తెలిపారు.