wannacry
-
కార్పొరేట్ ఇండియా చూపంతా వారిపైనే
ముంబై : వాన్నాక్రై, పెట్యా వంటి సైబర్ దాడులు ప్రపంచదేశాలను వణికిస్తున్నాయి. ఈ దాడులతో ఆర్థిక వ్యవస్థలు స్తంభిస్తున్నాయి. తమ ఐటీ సిస్టమ్‌లను కొల్లగడుతున్న సైబర్ దాడుల నుంచి బయటపడేందుకు కార్పొరేట్ ఇండియా దృష్టి అంతా ఇప్పుడు సైబర్ సెక్యురిటీ నిపుణులపై పడింది. ఈ దాడులను అరికట్టడానికి కంపెనీలు భారీగా సైబర్ నిపుణులను నియమించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. దీంతో సైబర్ సెక్యురిటీపై స్పెషలైజేషన్ చేసిన గ్రాడ్యుయేట్లకు భారీగా డిమాండ్ ఏర్పడింది. సైబర్ సెక్యురిటీ నిపుణులకు ఏర్పడుతున్న డిమాండ్‌తో యూనివర్సిటీలు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు సైతం దీనికి సంబంధించిన ప్రొగ్రామ్‌లను తమ క్యాంపస్‌లలో ప్రవేశపెడుతున్నాయి. గాంధీనగర్‌లోని గుజరాత్ ఫోరెన్సిక్ సైన్సస్ యూనివర్సిటీ ఆఫర్ చేసే సైబర్ సెక్యురిటీ అండ్ ఇన్సిడెంట్ రెస్పాన్స్, ఎంఎస్సీ ఇన్ డిజిటల్ ఫోరెన్సిక్ అండ్ ఇన్ఫర్మేషన్స్ అస్యూరెన్స్ కోర్సులు చేసిన గ్రాడ్యుయేట్లకు మంచి ఉద్యోగ ఆఫర్లు వచ్చినట్టు తెలిసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఈవై, కేపీఎంజీ, డెలాయిట్, పీడబ్ల్యూసీ, యాక్సిస్ బ్యాంకు, అడోబ్ వంటి కంపెనీలు ఈ గ్రాడ్యుయేట్లను నియమించుకున్నట్టు ఆ యూనివర్సిటీ చెప్పింది. గతేడాది కంటే కూడా ఈ ఏడాది ఆఫర్లు పెరిగాయని తెలిపింది. ర్యాన్సమ్వేర్ ఎటాక్స్ రూపంలో కంప్యూటర్లపై స్తంభింపజేస్తున్న సైబర్ మాయగాళ్లు, డబ్బులు చెల్లిస్తేనే కంప్యూటర్లను విడిచిపెడుతున్న సంగతి తెలిసిందే. దీంతో కార్యకలాపాలన్నీ అస్తవ్యస్థంగా మారుతున్నాయి. వాన్నాక్రై దాడి జరిగిన వారంలోనే పెట్యా రూపంలో మరో ఎటాక్ జరగడం ప్రపంచదేశాలను గడగడలాడిస్తోంది. ప్రస్తుతం సైబర్ ఎటాక్స్ మామూలు అయిపోయాయని, సంప్రదాయ నెట్వర్క్ స్పెషలిస్టుల కంటే ఎక్కువ మొత్తంలో నిపుణులు భారత్‌కు కావాల్సి ఉందని అనాలిస్టులు చెబుతున్నారు. అడ్వాన్స్డ్ అనాలిస్టులు, ఇన్సిడెంట్ రెస్పాన్స్ అనాలిస్టులు, పోస్టు-బ్రీచ్ నిపుణులు అవసరం ఎక్కువగా ఉందంటున్నారు. సైబర్ సెక్యురిటీ ప్రొఫిషినల్స్ వేతనాలు కూడా సాధారణ టెక్ ఉద్యోగస్తుల వేతనాల కంటే కూడా అత్యధికంగా ఉంటున్నాయని యాక్సిస్ బ్యాంకు మానవ వనరుల అధినేత రాజ్‌కమల్ వేంపతి చెప్పారు. క్యాంపస్ రిక్రూట్స్‌లోనే తాము వారికి సుమారు 7 లక్షల వరకు చెల్లిస్తున్నామన్నారు. -
భారీ సైబర్ దాడి
- మళ్లీ పడగవిప్పిన ర్యాన్సమ్వేర్.. - రష్యా, ఉక్రెయిన్, బ్రిటన్ సహా ఈయూ దేశాలు అతలాకుతలం - ఎయిర్‌పోర్టు, కార్యాలయాల్లో ఎక్కడిక్కడే నిలిచిన పనులు మాస్కో/లండన్: సైబర్ ఉగ్రవాదులు మరోసారి దాడికి తెగబడ్డారు. ర్యాన్సమ్వేర్ వైరస్‌తో మంగళవారం మరోమారు యూరప్ దేశాలపై విరుచుకుపడ్డారు. దీంతో రష్యా, ఉక్రెయిన్, బ్రిటన్, స్పెయిన్ తదితర దేశాల్లో కార్యకలాపాలు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. మొదటిగా రష్యాలోని అతిపెద్ద ఆయిల్ కంపెనీ సైబర్‌దాడికి గురైనట్లు గుర్తించారు. కొద్దిసేపటికే ఉక్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులోని కంప్యూటర్లు వైరస్ దాడికి గురయ్యాయి. ఈ రెండు దేశాల్లోని ఫార్మా, మీడియా, బయోటెక్నాలజీ తదితర కంపెనీలన్నీ వైరస్ బారిన పడటంతో గందరగోళం నెలకొంది. భారత్ సహా ఆసియాదేశాలు, అమెరికాలపై సైబర్‌దాడి ప్రభావం ఏమేరకు ఉందనేది తెలియాల్సిఉంది. అటు యూరప్‌లోని బ్రిటన్, స్పెయిన్‌లలోని పలు కంపెనీల ఆఫీసులు ర్యాన్సమ్ దాడికి గురైనట్లు వార్తలు వచ్చాయి. నెల రోజుల కిందటే ప్రపంచమంతా ర్యాన్సమ్వేర్ వాన్నాక్రై వైరస్ ధాటికి విలవిలలాడిన పరిస్థితి తెలిసిందే. ఇది చూశారంటే మీ ఫైల్స్ గోవిందా.. సైబర్‌దాడికి గురైన కంప్యూటర్ల స్క్రీన్లపై "If you see this text, then your files are no longer accessible, because they have been encrypted. Perhaps you are busy looking for a way to recover your files, but don't waste your time. Nobody can recover your files without our decryption service" అనే సందేశం ప్రత్యక్షమైంది. ఉక్రెయిన్‌కు భారీ దెబ్బ నేటి సైబర్ దాడితో అన్ని దేశాలకంటే ఎక్కువగా నష్టపోయింది ఉక్రెయినే అని ఆ దేశ ప్రధాని అన్నారు. ఎయిర్‌పోర్టు, కంపెనీల కార్యాలయాలన్నీ దాడికి గురయ్యాయని, గతంలో ఎప్పుడూ ఇంత నష్టాన్ని చవిచూడలేదని పేర్కొన్నారు. -
వాన్నా క్రై షాకింగ్: బ్యాంకింగ్ వ్యవస్థపై దాడి
న్యూఢిల్లీ: 'వానా క్రై రాన్సమ్వేర్' ప్రకంకపనలు త్వరలోనే భారత బ్యాంకింగ్ వ్యవస్థను తాకనున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాన్సమ్ వేర్ సైబర్ ఎటాక్ ప్రభావం తగ్గుముఖం పడుతున్నప్పటికీ దీని బారిన పడుతున్న సంఖ్య మరింత వేగంగా పెరిగే అవకాశం ఉందని ఐటీ నిపుణులు వినియోగదారులను హెచ్చరిస్తున్నారు. ఆ సంస్థల సంఖ్య వేగంగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. దీంతో వివిధ సంస్థలు, బ్యాంకులకు సైబర్ నిపుణులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. వానా క్రై ప్రభావం చాలా రాష్ట్రాలపై పడిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఎక్కడ దాడి జరిగింది అనేది చెక్ చేయడంలేదని సైబర్ సెక్యూరిటీ నిపుణుడు శుభ మంగళ ఏఎన్ఐ కి చెప్పారు. దాడుల తరువాతి ప్రకంకపనలు బ్యాంకింగ్ రంగంలో ప్రారంభంకానున్నాయనే అనుమానాలు వ్యక్తం చేశారు. మరో కొన్నిగంటల్లోనే బ్యాంకులు ప్రభావితమవుతాయని చెబుతున్నారు. ఈ మేరకు బ్యాంకులకు సమాచారం అందించామన్నారు. ఎందుకంటే వానాక్రై బారిన పడుతున్న విండోస్ ఆపరేటింగ్ సిస్టంతోనే ఏటీఏం నిర్వహరణ జరుగుతోందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలోనే సంస్థలు, వ్యాపారాలు మరియు ఇతర రంగాల వారికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడానికి, వ్యవస్థలను నవీకరించడానికి హెచ్చరించినట్టు తెలిపారు. మరోవైపు ఆన్లైన్ బ్యాంకింగ్, ఏటీఏం ట్రాన్సాక్షన్స్ చేయొద్దంటూ ఇప్పటికే సోషల్‌మీడియాలో హెచ్చరికలు, వార్తలు విపరీతంగా షేర్ అవుతున్నాయి. రానున్న రెండు మూడు రోజుల్లో ఏటీఎంలు మూతపడే అవకాశం ఉందన్నఅంచనాలు భారీగా నెలకొన్నాయి. కాగా 'వానా క్రై రాన్సమ్వేర్' ద్వారా కంప్యూటర్లను హ్యాక్ చేసింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 150కిపైగా దేశాల్లో వేల సైబర్ దాడులు జరిగినట్లు కాస్పర్‌స్కై ల్యాబ్ తన బ్లాగ్‌లో పేర్కొంది. ముఖ్యంగా మన దేశంలో పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ లాంటి రాష్ట్రాలు ప్రభావితమయ్యాయి. అయితే ద్చరిత్రలోనే అతిపెద్దదిగా భావిస్తున్న ఈ సైబర్ దాడిలో నేరగాళ్లు ద్రవ్య ప్రయోజనాలను పొందలేదని ఐబీ నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. -
కిల్లర్ వైరస్‌కు మందు దొరికింది!
ప్రపంచం మొత్తాన్ని గడగడ వణికిస్తున్న రాన్సమ్వేర్ 'వాన్నాక్రై'కి మందు దొరికేసింది. హాంకాంగ్‌లోని ఓ సైబర్ సెక్యూరిటీ నిపుణుడు అనుకోకుండా ఒక కిల్లర్ స్విచ్‌ను కనుగొన్నారు. దాన్ని ఉపయోగిస్తే ఈ వైరస్ మన కంప్యూటర్ను ఏమీ చేయలేదట. ప్రస్తుతానికి వాన్నక్రైని ఆపగలిగే ఏకైక మందు ఇదొక్కటే. @MalwareTechBlog అనే ట్విట్టర్ హ్యాండిల్‌తో ఈ సైబర్ నిపుణుడు ట్వీట్ చేస్తున్నాడు. తాను అనుకోకుండా దీన్ని కనుగొన్నానని, అయితే మాల్వేర్ ఉపయోగించే ఒక డొమైన్ నేమ్‌ను రిజిస్టర్ చేయడం ద్వారా దాని విస్తృతిని ఆపచ్చని వివరించాడు. వాళ్లు రిజిస్టర్ కాని డొమైన్ మీద ఆధారపడుతున్నారని, దాన్ని రిజిస్టర్ చేయడం ద్వారా తాము మాల్వేర్ స్ప్రెడ్‌ను ఆపామని అతడు వివరించాడు. సైబర్ ఎటాక్‌ను నివారించాలంటే ప్రజలు అత్యవసరంగా తమ సిస్టమ్స్‌ను అప్డేట్ చేసుకోవాలని హెచ్చరించాడు. సంక్షోభం ఇంకా ముగిసిపోలేదని, వాళ్లు ఎప్పుడైనా కోడ్ మార్చి మరోసారి దాడికి ప్రయత్నించవచ్చని తెలిపాడు. శుక్రవారం నాడు ముందుగా లండన్‌లోని ఆస్పత్రుల నెట్‌వర్క్‌ను టార్గెట్ చేసిన హ్యాకర్లు, ఆ తర్వాత క్రమంగా ప్రపంచంలో చాలా దేశాలమీద దాడులు కొనసాగించారు. అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీలో ఉన్న ఒక లోపాన్ని కూడా వాళ్లు కనుగొన్నారు. హ్యాకర్లు రాన్సమ్వేర్ అనే టెక్నిక్ ఉపయోగించారు. దానివల్ల యూజర్ల ఫైళ్లన్నీ లాక్ అయిపోతాయి. వాటిని అన్‌లాక్ చేయాలంటే బిట్కాయిన్ల రూపంలో హ్యాకర్లకు వాళ్లు అడిగినంత మొత్తం చెల్లించుకోవాలి. బ్రిటిష్ ఆస్పత్రుల నుంచి రష్యా హోంశాఖ, స్పానిష్ టెలికం దిగ్గజం టెలిఫోనికా, అమెరికా డెలివరీ సంస్థ ఫెడెక్స్.. ఇలా అనేక సంస్థలు ఈ హ్యాకర్ల బారిన పడ్డాయి. ఈ రాన్సమ్‌వేర్‌కు హాంకాంగ్ నిపుణుడు మందు కనుగొన్నా, అది అప్పటికే ఇన్ఫెక్ట్ అయిన కంప్యూటర్లకు మాత్రం పనిచేయదట. ఆ దాడి జరగకుండా కాపాడేందుకు ముందుగానే ఇచ్చే టీకా లాంటిదని మాత్రమే చెబుతున్నారు. వాళ్లు ఉపయోగిస్తున్న మాల్వేర్ పేరు డబ్ల్యుక్రై. అయితే అనలిస్టులు మాత్రం వాన్నాక్రై లాంటి ఇతర వేరియంట్లను కూడా ఉపయోగిస్తున్నారు. బ్రిటన్ ఆస్పత్రుల నెట్‌వర్క్‌ను వదలాలంటే వాళ్లు 300 డాలర్లు బిట్కాయిన్ల రూపంలో చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. మూడు రోజుల్లో ఆ మొత్తం చెల్లించకపోతే రెట్టింపు కట్టాల్సి వస్తుందని కూడా హెచ్చరించారు. ఏడు రోజుల్లోగా తమకు ఏమీ అందకపోతే మొత్తం ఫైళ్లన్నింటినీ డిలీట్ చేసేస్తామని బెదిరిస్తున్నారు. శనివారం ఉదయానికి 74 దేశాల్లో 45వేల సైబర్ దాడులు జరిగినట్లు యాంటీ వైరస్ సంస్థ కాస్పర్స్కీకి చెందిన పరిశోధకుడు కాస్టిన్ రెయు తెలిపారు.