కార్పొరేట్ ఇండియా చూపంతా వారిపైనే
కార్పొరేట్ ఇండియా చూపంతా వారిపైనే
Published Fri, Jun 30 2017 11:46 AM | Last Updated on Tue, Sep 5 2017 2:52 PM
ముంబై : వాన్నాక్రై, పెట్యా వంటి సైబర్ దాడులు ప్రపంచదేశాలను వణికిస్తున్నాయి. ఈ దాడులతో ఆర్థిక వ్యవస్థలు స్తంభిస్తున్నాయి. తమ ఐటీ సిస్టమ్‌లను కొల్లగడుతున్న సైబర్ దాడుల నుంచి బయటపడేందుకు కార్పొరేట్ ఇండియా దృష్టి అంతా ఇప్పుడు సైబర్ సెక్యురిటీ నిపుణులపై పడింది. ఈ దాడులను అరికట్టడానికి కంపెనీలు భారీగా సైబర్ నిపుణులను నియమించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. దీంతో సైబర్ సెక్యురిటీపై స్పెషలైజేషన్ చేసిన గ్రాడ్యుయేట్లకు భారీగా డిమాండ్ ఏర్పడింది. సైబర్ సెక్యురిటీ నిపుణులకు ఏర్పడుతున్న డిమాండ్‌తో యూనివర్సిటీలు, ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్లు సైతం దీనికి సంబంధించిన ప్రొగ్రామ్‌లను తమ క్యాంపస్‌లలో ప్రవేశపెడుతున్నాయి.
గాంధీనగర్‌లోని గుజరాత్ ఫోరెన్సిక్ సైన్సస్ యూనివర్సిటీ ఆఫర్ చేసే సైబర్ సెక్యురిటీ అండ్ ఇన్సిడెంట్ రెస్పాన్స్, ఎంఎస్‌సీ ఇన్ డిజిటల్ ఫోరెన్సిక్ అండ్ ఇన్‌ఫర్మేషన్స్ అస్యూరెన్స్ కోర్సులు చేసిన గ్రాడ్యుయేట్లకు మంచి ఉద్యోగ ఆఫర్లు వచ్చినట్టు తెలిసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఈవై, కేపీఎంజీ, డెలాయిట్, పీడబ్ల్యూసీ, యాక్సిస్ బ్యాంకు, అడోబ్ వంటి కంపెనీలు ఈ గ్రాడ్యుయేట్లను నియమించుకున్నట్టు ఆ యూనివర్సిటీ చెప్పింది. గతేడాది కంటే కూడా ఈ ఏడాది ఆఫర్లు పెరిగాయని తెలిపింది.
ర్యాన్సమ్‌వేర్ ఎటాక్స్ రూపంలో కంప్యూటర్లపై స్తంభింపజేస్తున్న సైబర్ మాయగాళ్లు, డబ్బులు చెల్లిస్తేనే కంప్యూటర్లను విడిచిపెడుతున్న సంగతి తెలిసిందే. దీంతో కార్యకలాపాలన్నీ అస్తవ్యస్థంగా మారుతున్నాయి. వాన్నాక్రై దాడి జరిగిన వారంలోనే పెట్యా రూపంలో మరో ఎటాక్ జరగడం ప్రపంచదేశాలను గడగడలాడిస్తోంది. ప్రస్తుతం సైబర్ ఎటాక్స్ మామూలు అయిపోయాయని, సంప్రదాయ నెట్‌వర్క్ స్పెషలిస్టుల కంటే ఎక్కువ మొత్తంలో నిపుణులు భారత్‌కు కావాల్సి ఉందని అనాలిస్టులు చెబుతున్నారు. అడ్వాన్స్డ్ అనాలిస్టులు, ఇన్సిడెంట్ రెస్పాన్స్ అనాలిస్టులు, పోస్టు-బ్రీచ్ నిపుణులు అవసరం ఎక్కువగా ఉందంటున్నారు. సైబర్ సెక్యురిటీ ప్రొఫిషినల్స్ వేతనాలు కూడా సాధారణ టెక్ ఉద్యోగస్తుల వేతనాల కంటే కూడా అత్యధికంగా ఉంటున్నాయని యాక్సిస్ బ్యాంకు మానవ వనరుల అధినేత రాజ్‌కమల్ వేంపతి చెప్పారు. క్యాంపస్ రిక్రూట్స్‌లోనే తాము వారికి సుమారు 7 లక్షల వరకు చెల్లిస్తున్నామన్నారు.
Advertisement
Advertisement