
కరోనా తర్వాత నుంచి వినియోగదారుల ఆసక్తి
1700 చ.అ.ల నుంచి దాదాపు 2200 చ.అ.లకు..
కస్టమర్ల అభిరుచి మేరకు నిర్మిస్తున్న బిల్డర్లు
వెల్లడించిన అనరాక్–ఫిక్కీ హోమ్ బయ్యర్స్ సెంటిమెంట్ సర్వే
కరోనా తర్వాత నుంచి గృహ కొనుగోలుదారుల అభిరుచులు మారాయి. నివాస కొనుగోళ్ల ట్రెండ్‌ను కరోనాకు ముందు, ఆ తర్వాత అని విభజించాల్సిన పరిస్థితి వచ్చింది. కోవిడ్ కంటే ముందు ఇల్లు కొనాలంటే మొదటి ప్రాధాన్యత బడ్జెట్ ఎంత అనే.. కానీ, కరోనా తర్వాత బడ్జెట్ అంటే లెక్కేలేదు. విస్తీర్ణమైన ఇళ్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరో
మహమ్మారితో వర్క్ ఫ్రం హోమ్, ఆన్‌లైన్ క్లాసుల నేపథ్యంలో ఇంటిలో గడిపే సమయం పెరిగింది. మరోవైపు ఐసొలేషన్ కారణంగా విశాలమైన, ప్రత్యేక గదుల అవసరం ఏర్పడింది. దీంతో గృహ కొనుగోలుదారులు క్రమంగా విశాలమైన ఇళ్లకు మారిపోతున్నారు. అప్పటిదాకా 2 బీహెచ్‌కే వాసులు.. క్రమంగా 3 వైపు.. 3 బీహెచ్‌కే వాసులు నాలుగు పడక గదుల్లో ఉండేందుకు మొగ్గు చూపిస్తున్నారు. దీంతో గ్రేటర్‌లో ఇంటి విస్తీర్ణాలు క్రమంగా పెరుగుతున్నాయి. కస్టమర్ల అభిరుచులకు తగినట్టుగా డెవలపర్లు కూడా విశాలమైన ఇళ్లనే నిర్మిస్తున్నారు.
4 బీహెచ్‌కేకు ఆదరణ..
స్థిరమైన ధరలు, అధిక రాబడుల కారణంగా హైదరాబాద్‌లో ప్రాపర్టీలలో పెట్టుబడులకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపిస్తున్నారు. పెద్ద కుటుంబాలు, విలాసవంతమైన జీవనశైలి, ఆధునిక వసతులు కోరుకునేవారు ఎక్కువగా 4 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్లను కొనుగోలు చేస్తున్నారు. మియాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, కొంపల్లి, కూకట్‌పల్లి వంటి ప్రాంతాలలో 4 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. సైనిక్‌పురి, యాప్రాల్, నాచారం, మల్లాపూర్, తార్నాక, సికింద్రాబాద్ వంటి ప్రాంతాల్లోని యూనిట్లకూ ఆదరణ బాగానే ఉంది. వీటి సగటు ధర రూ.1.78 కోట్ల నుంచి ఉన్నాయి.
గ్రేటర్‌లో పెరిగిన విస్తీర్ణాలు..
హైదరాబాద్‌లో ఏటేటా అపార్ట్‌మెంట్ల విస్తీర్ణాలు పెరుగుతున్నాయి. 2014లో నగరంలో ఫ్లాట్ల సగటు విస్తీర్ణం 1,830గా ఉండగా.. 2018 నాటికి 1,600లకు తగ్గాయి. నాలుగేళ్లలో ఏకంగా ఫ్లాట్ల సైజు 13 శాతం తగ్గింది. కోవిడ్ కాలంలో ఇంట్లో గడిపే సమయం ఎక్కువైపోయింది. దీంతో ఇంటి అవసరం తెలిసొచ్చింది. వర్క్ ఫ్రం హోమ్, ఆన్‌లైన్ క్లాస్‌లతో ఇంట్లో ప్రత్యేక గది అనివార్యమైపోయింది. దీంతో ఇంటి విస్తీర్ణం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2019లో నగరంలో ఫ్లాట్ల సగటు విస్తీర్ణం 1,700 చ.అ.లుగా ఉండగా.. ఇప్పుడది ఏకంగా 2,200 చ.అ.లకు పెరిగింది.
45 శాతం డిమాండ్..
కరోనా కంటే ముందు లగ్జరీ గృహాలైన 4 బీహెచ్‌కే ఫ్లాట్లకు 27 శాతం డిమాండ్ ఉండగా.. ఇప్పుడది ఏకంగా 45 శాతానికి పెరిగిందని అనరాక్–ఫిక్కీ హోమ్ బయ్యర్స్ సెంటిమెంట్ సర్వే వెల్లడించింది. గత ఐదేళ్లలో దేశంలోని ఏడు నగరాల్లో అపార్ట్‌మెంట్ల విస్తీర్ణాలు 32 శాతం మేర పెరిగాయి. 2019లో సగటు ఫ్లాట్ సైజు 1,145 చ.అ.లుగా ఉండగా.. ఇప్పుడది 1,513 చ.అ.లకు పెరిగింది.
