Bedroom homes
-
Hyderabad: అపార్ట్మెంట్లోకి దూసుకొచ్చిన తూటా
మణికొండ: బైరాగిగూడలో ఓ అపార్ట్మెంట్ బెడ్రూం కిటికీ అద్దాల్లోంచి దూసుకువచ్చి గోడకు తగిలిన ఘటన శనివారం చోటుచేసుకుంది. నార్సింగి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బైరాగిగూడలోని ఓ అపార్ట్మెంట్ అయిదో అంతస్తులో సాఫ్ట్వేర్ ఉద్యోగి సిద్ధార్థ్ ఉంటున్నారు. శనివారం ఆయన ఉదయం తన భార్యతో కలిసి కిందకు వెళ్లి వాకింగ్ చేస్తున్నారు. ఇంతలోనే ఓ తూటా వీరి ఇంట్లోని బెడ్రూం కిటికీ అద్దాలను చీల్చుకుంటూ వచ్చి గోడకు తగిలింది. ఆ శబ్దానికి ఇంట్లోని పెంపుడు కుక్క పెద్దగా అరవటంతో వాకింగ్ చేస్తున్న సిద్ధార్థ్ ఇంట్లోకి వచ్చారు. కిటికీకి రంధ్రం ఉండటం, బెడ్రూంలో తుపాకీ తూటా కింద పడి ఉండటాన్ని గమనించి ఎవరో తన ఇంటిపై కాల్పులు జరిపారని భయాందోళనకు గురయ్యారు. నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి సీఐ హరికృష్ణారెడ్డి పరిశీలించారు. పక్కనే ఉన్న తెలంగాణ పోలీస్ అకాడమీ నుంచి వచ్చి ఉంటుందని, వారు శుక్రవారం నుంచి ఫైరింగ్ శిక్షణ ఇస్తున్నట్టు సమాచారం ఉందన్నారు. పక్కనే ఉన్న ఇబ్రహీంబాగ్ మిలిటరీ ఫైరింగ్ రేంజ్ నుంచి బుల్లెట్ వచ్చి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. ఫైరింగ్ రేంజ్‌లకు సమీపంలో అపార్ట్మెంట్లకు అనుమతులు ఇవ్వటం, ఇలాంటి సంఘటనలు జరిగితే ప్రాణనష్టం జరుగుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలోనూ ఇదే తరహాలో ఇబ్రహీంబాగ్ రెజిమెంట్ నుంచి మణికొండ క్వార్టర్స్‌లోకి బుల్లెట్లు వచ్చి పడ్డాయని స్థానికులు గుర్తు చేశారు. -
కేవలం రూ. 83కే ఇండిపెండెంట్ హౌస్.. ఎక్కడంటే?
ప్రస్తుతం ఇల్లు కొనాలన్నా, భూములు కొనాలన్నా ఎంత డబ్బు వెచ్చించాల్సి ఉంటుందో అందరికి బాగా తెలుసు. ఆఖరికి అద్దెకు ఉండాలన్నా వేలకు వేలు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అయితే అమెరికాలో ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ కేవలం రూ. 100 కంటే తక్కువ అని ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేస్తోంది. ఇందులో నిజమెంత? దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలోని ఒక ఇల్లు కేవలం ఒక డాలర్ కంటే తక్కువ (దాదాపు రూ. 83) అని తెలుస్తోంది. ఈ వార్త నిజమే అని చెబుతున్నారు. అది కూడా ఇండిపెండెంట్ హౌస్ కావడం గమనార్హం. ఇది 724 చదరపు అడుగుల విస్తీరణంలో ఉంది. ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఇల్లు బహుశా ఇదే అయి ఉంటుంది. ఇదీ చదవండి: కోట్లు సంపాదించేలా చేసిన భారత పర్యటన - ఇండియాలో అమెరికన్ హవా! ఈ చీపెస్ట్ హౌస్ ప్రస్తుతం శిధిలావస్థలో ఉన్నట్లు, దీనిని 1956లో నిర్మించినట్లు చెబుతున్నారు. ఈ ఇంటిని బాగు చేయడానికి కనీసం 25వేల నుంచి 45వేల డాలర్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందని వేలం వేయనున్న జిల్లో సంస్థ పేర్కొంది. మొత్తానికి ఇల్లు ఎంత శిధిలావస్థలో ఉన్నా కేవలం రూ. 83 లభించడం చాలా అరుదైన విషయం. -
విలువలే ‘ఇల్లు’వెత్తు ఆస్తి
మంగళగిరి: విలువలే నిలువెత్తు ఆస్తి అని ఆ మహిళ నిరూపించారు. తనకు ప్రభుత్వం ఇచ్చిన ఇంటిస్థల పట్టాను వెనక్కి ఇస్తూ అధికారులకు లేఖ రాశారు. తనకు ఇప్పటికే ఇల్లు ఉందని, ఈ స్థలం పేదలకు దక్కేలా చూడాలని కోరారు. ఆమె నిజాయితీని అధికారులు, పేదలు ప్రశంసిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. నగర పరిధిలోని యర్రబాలెంకు చెందిన దండిభొట్ల నాగసీత కనకదుర్గ 2019లో సొంతింటి కోసం దరఖాస్తు చేసుకోవడంతో ప్రభుత్వం అర్హురాలిగా గుర్తించింది. ఆ తర్వాత ఆమె భర్త సుబ్రమణ్య శర్మ పేరుతో 100 చదరపు గజాల స్థలం కొని బ్యాంకు రుణం తీసుకుని ఇల్లు నిర్మించుకున్నారు. అప్పటికే ఇంటి స్థలానికి అర్హురాలిగా ఎంపికైన కనకదుర్గ పేరుతో అధికారులు ఇంటిస్థల పట్టాను మంజూరు చేశారు. ఇటీవల పట్టాల పంపిణీ కార్యక్రమంలో అందించారు. అయితే తనకు సొంతిల్లు ఉందని, పేదలకు చెందాల్సిన సెంటు స్థలం తాను పొందడం భావ్యం కాదని భావించిన కనకదుర్గ ఆ పట్టాను వెనక్కి ఇస్తూ అధికారులకు లేఖ రాశారు. అనర్హులైనా.. అందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఇల్లు లేని పేదలకు ప్రభుత్వం స్థల పట్టాలు మంజూరు చేస్తోంది. అయితే వీటిని అనర్హులూ తీసుకుంటున్నారు. అప్పటికే తమ పేరు మీద ఆస్తులు, స్థలాలను ఇంట్లో వేరేవారి పేరు మీదకు మార్చి ఇంటిస్థలం, టిడ్కో గృహ పట్టాలు పొందుతున్నారు. ►నగరంలోని ఇందిరానగర్‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు ఇప్పటికి మూడు పారీ్టలు మారి ప్రస్తుతం టీడీపీ కండువా కప్పుకున్నాడు. ఆయనకు అనేక ఆస్తులున్నా తల్లి పేరున ఏ ఆస్తి లేకుండా చేసి టిడ్కో ఇల్లు పొందాడు. ఈ ఉదంతం నగరంలో చర్చనీయాంశమవుతోంది. ► కమర్షియల్ కాంప్లెక్స్‌తోపాటు నగరంలో మరో రెండు ఇళ్లు ఉన్న ఓ వ్యక్తి తన భార్య పేరున టిడ్కో ఇల్లు పొందడం గమనార్హం. ► యర్రబాలెంలో రెండు అంతస్తుల డాబాలో ఉండే ఓ మహిళ తనకు నెలకు రూ.25వేల వరకు అద్దెల రూపంలో ఆదాయం వస్తున్నా.. ఇంటిస్థల పట్టాను పొందారు. ఇలా అనేక మంది తమ పేర్ల మీద ఆస్తులు లేకుండా చేసుకుని ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే స్థలాలను అర్హులకు దక్కకుండా కాజేస్తున్నారు. ఇవన్నీ తెలిసినా నిబంధనల వల్ల అధికారులూ ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. కనకదుర్గను ఆదర్శంగా తీసుకుని అనర్హులు పొందిన ఇంటిస్థల పట్టాలను వెనక్కి ఇవ్వాలని అధికారులు, ప్రజలు కోరుతున్నారు. అనర్హులు ఉంటే పట్టాలు రద్దుచేస్తాం పేదల ఇళ్ళ స్థలాలను అనర్హులు పొంది ఉంటే కచ్చితంగా పట్టా రద్దు చేసి చర్యలు తీసుకుంటాం. అనర్హులను ఎంపిక చేసిన సిబ్బందిపైనా చర్యలు తప్పవు. అనర్హులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పట్టాలు వెనక్కి ఇచ్చి పేదలకు దక్కేలా సహకరించాలి. ఇంట్లో ఎవరికైనా స్థలం, ఆస్తి ఉండి స్థలాలు పొందిన అనర్హులు వెంటనే పట్టాలు వెనక్కి ఇవ్వాలి. – జీవీ రామ్‌ప్రసాద్, తహసీల్దార్, మంగళగిరి -
ఇల్లు కొనుక్కున్నా.. పట్టా వెనక్కి తీసుకోండి
మంగళగిరి: రాష్ట్రంలో ఇల్లులేని పేదవారు ఉండకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం పట్టాలు పంపిణీ చేస్తోంది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా యర్రబాలెంకు చెందిన దండిభొట్ల నాగసీత కనకదుర్గను అధికారులు అర్హురాలిగా గుర్తించి ఇటీవల ఆమెకు పట్టాను అందజేశారు. నిజానికి.. 2019లో తనకు సొంతిల్లు లేకపోవడంతో కనకదుర్గ అందుకోసం దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం తాజాగా అర్హురాలిగా గుర్తించింది. కానీ, 2019 అనంతరం తన భర్త దండిభొట్ల సుబ్రహ్మణ్య శర్మ పేరుతో వున్న వంద చదరపు గజాల స్థలాన్ని విక్రయించి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్‌ను కొనుగోలు చేసి ఈ ఏడాది మార్చి 23న రిజిస్ట్రేషన్ చేయించుకుని అందులో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో.. అప్పటికే ఇంటి స్థలానికి అర్హురాలిగా కనకదుర్గను ఎంపిక చేసిన అధికారులు ఆమె పేరున పట్టాను మంజూరుచేసి ఇటీవల అందరితో పాటు అందజేశారు. కానీ, తనకు సొంతిల్లు ఉండగా పేదలకు చెందాల్సిన సెంటు స్థలాన్ని తాను పొందకూడదని కనకదుర్గ గ్రహించి ప్రభుత్వం తనకు కేటాయించిన ఇంటి స్థలాన్ని రద్దుచేసి వేరొక అర్హురాలికి ఇవ్వాలంటూ రెవెన్యూ అధికారులకు ఆదివారం ఆమె లేఖ రాశారు. -
సురక్షితం.. సుందరం
* అందరికీ మంచినీరు కోసం 30 టీఎంసీల జలాశయాలు * త్వరలోనే రెండు మార్గాల్లో మెట్రో రైలుకూత * ఏడాది చివరికి అందుబాటులోకి ఔటర్ రింగ్ రోడ్డు * రూ.20వేల కోట్లతో 20 ప్రదేశాల్లో ఫ్లై ఓవర్లు, ఆకాశమార్గాలు * మూసీనది వెంట 42 కి.మీ.ల ఆరు వరుసల రహదారాలు * 13 మురికివాడల్లో లక్ష మందికి డబుల్ బెడ్రూం ఇళ్లు * టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో సాక్షి,సిటీబ్యూరో: హైదరాబాద్ మహా నగరాన్ని పూర్తి సురక్షిత.. సుందర ప్రాంతంగా తీర్చి దిద్దే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర సమితి మరోసారి తమ ప్రభుత్వ ప్రాథమ్యాలను వెల్లడించింది. శనివారం విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో హైదరాబాద్‌ను పూర్తి సురక్షితంగా తీర్చిదిద్ది.. నగర వాసులకు సుందర జీవితాన్ని అందించడమే లక్ష్యమని పేర్కొంది. మంచినీరు, పారిశుద్ధ్యం, నిరంతర విద్యుత్, ప్రజా రవాణాను మెరుగుపరిచే దిశగా మొత్తం 62 అంశాలతో కార్యాచరణను ప్రకటించింది. అందరికీ మంచినీరు నగర వాసులందరికీ సురక్షిత మంచి నీరందించే దిశగా 30 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యంతో శామీర్‌పేట, రాచకొండలలో భారీ రిజర్వాయర్ల నిర్మాణం చేపడుతున్నట్లు మేనిఫెస్టోలో టీఆర్ఎస్ పార్టీ పేర్కొంది. జంట జలాశయాల పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ అమలుతో పాటు కబ్జాలకు గురైన నాలుగు వేల చెరువుల పునరుద్ధరణ, హుస్సేన్ సాగర్ శుద్ధికి మురుగు నీటి కాల్వలను మళ్లిస్తామని టీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. మూసీ ఆధునికీకరణతో పాటు దీని వెంట ఉప్పల్ నుంచి లంగర్‌హౌస్ వరకు 42 కి.మీ.ల మేర ఆరు వరసలతో కూడిన రహదారిని నిర్మిస్తామని పేర్కొంది. రెండు మార్గాల్లో మెట్రో రైలు ఉప్పల్- మెట్టుగూడ, మియాపూర్ -అమీర్‌పేట మార్గంలో జూన్ నెల తరువాత మెట్రో రైలు రాకపోకలు ప్రారంభిస్తామని మేనిఫెస్టోలో టీఆర్ఎస్ తెలిపింది. ప్రస్తుతం ఉన్న 72 కి.మీ. మెట్రో రైలు మార్గాలను, 200 కి.మీ.కు విస్తరిస్తామని... ఎంఎంటీఎస్ మార్గాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి యాదగిరి గుట్ట వరకు పొడిగిస్తామని హామీనిచ్చింది. రూ. 20వేల కోట్లతో 20 ప్రదేశాల్లో ఫ్లై ఓవర్లు, ఆకాశమార్గాలు, 11 ప్రధాన కారిడార్లు, 50 గ్రిడ్ సపరేటర్లతో 2000 కి.మీ.ల నూతన రహదారుల నిర్మాణం ప్రారంభిస్తామని ప్రకటించింది. వచ్చే డిసెంబర్ నాటికి ఔటర్ రింగ్ రోడ్డును పూర్తి చేస్తామని తెలిపింది. లక్ష మందికి డబుల్ బెడ్ రూం ఇళ్లు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచే దిశగా ఇప్పటికే 22 లక్షల కుటుంబాలకు తడి-పొడి చెత్త సేకరణ డబ్బాలు పంపిణీ చేశామని, వ్యర్థాలకు 200 - 300 ఎకరాల విస్తీర్ణంలో 15 కొత్త డంపింగ్ యార్డులను ఏర్పాటు చేస్తామని పార్టీ తెలిపింది. 13 మురికివాడల్లోని 17 ప్రదేశాల్లో వచ్చే ఐదేళ్లలో లక్ష మందికి డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామని ప్రకటించింది. నగరంలోని 36 శ్మశాన వాటికల్లో అధునాతన సదుపాయాలు కల్పిస్తామని వెల్లడించింది. నగరానికి నిరంతర విద్యుత్ సరఫరాకు 420 కేవీ ప్రత్యేక లైన్‌తో పాటు రూ.1920 కోట్లతో నూతన సబ్స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నట్లు ప్రకటించింది. అన్ని వర్గాలకూ భద్రత నగరంలోని అన్ని వర్గాలకు భద్రత కల్పించడమే లక్ష్యంగా, ఇప్పటికే కొనుగోలు చేసిన ఇన్నోవా వాహనాలతో జీపీఎస్ అనుసంధానం చేస్తామని అధికార పార్టీ పేర్కొంది. 24 అంతస్తులతో నగర పోలీస్ కమిషనరేట్‌ను నిర్మించి, అధునాతన కమాండ్ కంట్రోల్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని తెలిపింది. నగరంలో 92 పట్టణ వైద్యశాలల ఆధునీకరణ, పరికరాల కొనుగోలుతో పాటు ఉస్మానియా, గాంధీ, నిమ్స్ ఆస్పత్రులకు వేర్వేరుగా బడ్జెట్ కేటాయిస్తున్నామని తెలియజేసింది.