మంగళగిరి: విలువలే నిలువెత్తు ఆస్తి అని ఆ మహిళ నిరూపించారు. తనకు ప్రభుత్వం ఇచ్చిన ఇంటిస్థల పట్టాను వెనక్కి ఇస్తూ అధికారులకు లేఖ రాశారు. తనకు ఇప్పటికే ఇల్లు ఉందని, ఈ స్థలం పేదలకు దక్కేలా చూడాలని కోరారు. ఆమె నిజాయితీని అధికారులు, పేదలు ప్రశంసిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. నగర పరిధిలోని యర్రబాలెంకు చెందిన దండిభొట్ల నాగసీత కనకదుర్గ 2019లో సొంతింటి కోసం దరఖాస్తు చేసుకోవడంతో ప్రభుత్వం అర్హురాలిగా గుర్తించింది.
ఆ తర్వాత ఆమె భర్త సుబ్రమణ్య శర్మ పేరుతో 100 చదరపు గజాల స్థలం కొని బ్యాంకు రుణం తీసుకుని ఇల్లు నిర్మించుకున్నారు. అప్పటికే ఇంటి స్థలానికి అర్హురాలిగా ఎంపికైన కనకదుర్గ పేరుతో అధికారులు ఇంటిస్థల పట్టాను మంజూరు చేశారు. ఇటీవల పట్టాల పంపిణీ కార్యక్రమంలో అందించారు. అయితే తనకు సొంతిల్లు ఉందని, పేదలకు చెందాల్సిన సెంటు స్థలం తాను పొందడం భావ్యం కాదని భావించిన కనకదుర్గ ఆ పట్టాను వెనక్కి ఇస్తూ అధికారులకు లేఖ రాశారు.
అనర్హులైనా..
అందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఇల్లు లేని పేదలకు ప్రభుత్వం స్థల పట్టాలు మంజూరు చేస్తోంది. అయితే వీటిని అనర్హులూ తీసుకుంటున్నారు. అప్పటికే తమ పేరు మీద ఆస్తులు, స్థలాలను ఇంట్లో వేరేవారి పేరు మీదకు మార్చి ఇంటిస్థలం, టిడ్కో గృహ పట్టాలు పొందుతున్నారు.
►నగరంలోని ఇందిరానగర్‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు ఇప్పటికి మూడు పారీ్టలు మారి ప్రస్తుతం టీడీపీ కండువా కప్పుకున్నాడు. ఆయనకు అనేక ఆస్తులున్నా తల్లి పేరున ఏ ఆస్తి లేకుండా చేసి టిడ్కో ఇల్లు పొందాడు. ఈ ఉదంతం నగరంలో చర్చనీయాంశమవుతోంది.
► కమర్షియల్ కాంప్లెక్స్‌తోపాటు నగరంలో మరో రెండు ఇళ్లు ఉన్న ఓ వ్యక్తి తన భార్య పేరున టిడ్కో ఇల్లు పొందడం గమనార్హం.
► యర్రబాలెంలో రెండు అంతస్తుల డాబాలో ఉండే ఓ మహిళ తనకు నెలకు రూ.25వేల వరకు అద్దెల రూపంలో ఆదాయం వస్తున్నా.. ఇంటిస్థల పట్టాను పొందారు. ఇలా అనేక మంది తమ పేర్ల మీద ఆస్తులు లేకుండా చేసుకుని ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే స్థలాలను అర్హులకు దక్కకుండా కాజేస్తున్నారు. ఇవన్నీ తెలిసినా నిబంధనల వల్ల అధికారులూ ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. కనకదుర్గను ఆదర్శంగా తీసుకుని అనర్హులు పొందిన ఇంటిస్థల పట్టాలను వెనక్కి ఇవ్వాలని అధికారులు, ప్రజలు కోరుతున్నారు.
అనర్హులు ఉంటే పట్టాలు రద్దుచేస్తాం
పేదల ఇళ్ళ స్థలాలను అనర్హులు పొంది ఉంటే కచ్చితంగా పట్టా రద్దు చేసి చర్యలు తీసుకుంటాం. అనర్హులను ఎంపిక చేసిన సిబ్బందిపైనా చర్యలు తప్పవు. అనర్హులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పట్టాలు వెనక్కి ఇచ్చి పేదలకు దక్కేలా సహకరించాలి. ఇంట్లో ఎవరికైనా స్థలం, ఆస్తి ఉండి స్థలాలు పొందిన అనర్హులు వెంటనే పట్టాలు వెనక్కి ఇవ్వాలి.
– జీవీ రామ్‌ప్రసాద్, తహసీల్దార్, మంగళగిరి
Comments
Please login to add a commentAdd a comment