సాక్షి ప్రతినిధి, గుంటూరు, సాక్షి, నరసరావుపేట: సిద్ధం... ఈ మాట వింటేనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సమరోత్సాహంతో ఎన్నికల యుద్ధానికి కదం తొక్కుతున్నారు.. మరోవైపు ఈ సభలకు వస్తున్న ప్రతిస్పందన చూసి ప్రతిపక్ష నేతలు మాత్రం ఓటమి భయంతో వణికిపోతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధం పేరిట ఇప్పటికే మూడు సభలు నిర్వహించి గడచిన నాలుగేళ్ల పది నెలల కాలంలో ప్రజలకు చేసిన మేలును వివరించడంతో పాటు ప్రజలకోసం పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న మూకుమ్మడి కుట్రను వివరిస్తున్నారు.
► అందులో భాగంగా నేడు చివరి సిద్ధం సభ బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలోని పి.గుడిపాడులో జరగనుంది. ఇందులో పల్నాడు, గుంటూరు, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు జిల్లాల నుంచి పెద్దఎత్తున పార్టీ కార్యకర్తలు, అభిమానులు, సామాన్య ప్రజలు హాజరుకానున్నారు.
► చరిత్రలో నిలిచేపోయే ఈ సభలో పాల్గొనాలని పల్నాడు జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. జననేత సందేశం వినాలని ఆత్రుతతో ఉన్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రసంగాన్ని ప్రతి ఇంటికీ చేర్చి మరోసారి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడేలా చూడటమే లక్ష్యంగా నేడు వీరు సిద్ధం సభకు వెళ్లనున్నారు.
► గుంటూరు జిల్లాలో గుంటూరు పశ్చిమ నుంచి మంత్రి విడదల రజని, తూర్పు నుంచి నూరి ఫాతిమా, తాడికొండ నుంచి మేకతోటి సుచరిత, ప్రత్తిపాడు నుంచి బలసాని కిరణ్‌కుమార్, తెనాలి నుంచి అన్నాబత్తుని శివకుమార్, మంగళగిరి నుంచి ఎమ్మెల్యే ఆర్కే, సమన్వయకర్త మురుగుడు లావణ్య, పొన్నూరు నుంచి అంబటి మురళీకృష్ణ, గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారు రోశయ్య నేతృత్వంలో జన సమీకరణకు సన్నాహాలు పూర్తి అయ్యాయి.
ఇప్పటికే వాహనాలు సిద్ధం చేశారు.
►పల్నాడు జిల్లాలో సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు, మాచర్ల నుంచి ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గురజాల నుంచి ఎమ్మెల్యే కాసు మహే‹Ùరెడ్డి, నరసరావుపేట నుంచి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పెదకూరపాడు నుంచి ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, వినుకొండ నుంచి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, చిలకలూరిపేట నుంచి సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో శ్రేణులు పెద్ద ఎత్తున సభకు తరలి వెళ్లడానికి సన్నద్ధం అవుతున్నారు.
► బాపట్ల జిల్లాలో బాపట్ల నుంచి ఎమ్మెల్యే కోన రఘుపతి, అద్దంకి నుంచి సమన్వయకర్త పానెం చిన హనిమిరెడ్డి, రేపల్లె నుంచి సమన్వయకర్త ఈవూరి గణే‹Ù, ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు, చీరాల నుంచి ఎమ్మెల్యే కరణం బలరాం, సమన్వయకర్త వెంకటేష్, పర్చూరు నుంచి సమన్వయకర్త ఎడం బాలాజీ, వేమూరు నుంచి సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు నేతృత్వంలో శ్రేణులు కదం తొక్కనున్నాయి.
సొంత వాహనాల్లో ప్రయాణం
పల్నాడు జిల్లాలోని ఏడు నియోజకవర్గాలలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు ఇప్పటికే పలు మార్లు సిద్ధం సభ సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి భారీ సంఖ్యలో ప్రజలు సభకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్ సీపీ అభిమానుల కోరిక మేరకు సభకు వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో వాహనాలు ఏర్పాటు చేశారు. మరికొంత మంది కార్యకర్తలు తాము సొంతగా వాహనాలు ఏర్పాటు చేసుకొని సభకు వెళ్లనున్నారు. వీటితో నేడు దారులన్నీ సిద్ధం సభ వైపునకు మళ్లాయి. ఇప్పటికే మంచి జోష్ మీద ఉన్న వైఎస్సార్ సీపీ క్యాడర్ నేడు సిద్ధం సభ వేదికగా సీఎం వైఎస్ జగన్ ఇచ్చే సందేశంతో మరింత పెరిగిన ఉత్సాహంతో రానున్న ఎన్నికల్లో పనిచేసి, పార్టీ అఖండ విజయానికి కృషి చేయనున్నారు.
ట్రాఫిక్ మళ్లింపు ఇలా..
నగరంపాలెం: బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలో ఆదివారం జరగనున్న ‘సిద్ధం’ సభకు సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హాజరుకానున్నారు. సభకు ప్రజలు భారీగా తరలిరానున్నారు. అటుగా రాకపోకలు సాగించే ప్రయాణికులు/ వాహనచోదకులకు ఇబ్బందులు తలెత్తకుండా వాహనాలను దారి మళ్లించినట్లు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఇలా వెళ్లాలి..
► విజయవాడ, గుంటూరు నుంచి జాతీయ రహదారిపై ఒంగోలు, చెన్నై వైపు వెళ్లే వాహనాలు బుడంపాడు అడ్డరోడ్ మీదగా పొన్నూరు, బాపట్ల, చీరాల, త్రోవగుంట వైపుగా వెళ్లాలి.
► గుంటూరు నగరం నుంచి ఒంగోలు వెళ్లే వాహనాలు ఏటుకూరు జంక్షన్ నుంచి ప్రత్తిపాడు, పర్చురు, ఇంకొల్లు, నాగులుప్పలపాడు, త్రోవగుంట వైపు వెళ్లాలి.
► గుంటూరు నుంచి నరసరావుపేట మీదుగా ఒంగోలు వెళ్లే వాహనాలు చుట్టుగుంట, పేరేచర్ల, ఫిరంగిపురం, నరసరావుపేట, సంతమాగులూరు అడ్డరోడ్డు జంక్షన్, అద్దంకి, మేదరమెట్ల మీదుగా వెళ్లాలి.
► 16వ నంబర్ జాతీయ రహదారిపై బొల్లాపల్లి టోల్ ప్లాజా నుంచి బొల్లాపల్లి, మేదరమెట్ల వరకు ఎటువంటి వాహనాలకు అనుమతిలేదు. సిద్ధం సభ వాహనాలకు మాత్రమే అనుమతి. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి వాహనాల దారి మళ్లింపు అమల్లోకి వస్తోందని జిల్లా ఎస్పీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment