
బాపట్లలో యాక్ట్ కేబుల్ కార్యాలయం
మొత్తం కనెక్షన్లు నాకు ఇచ్చేసేయండి
కాదంటే నియోజకవర్గం వదిలి వెళ్లిపోండి
ఇసుక, బుసక, గ్రావెల్, గ్రానైట్, బియ్యం... ఏది దొరికినా అమ్మకానికి పెట్టి అక్రమార్జన..! రాబడి ఉందనుకుంటే ఏ ఒక్కరినీ, సంస్థలను వదలకుండా వేధింపులు..! అధికారంలోకి వచ్చిందే తడవుగా ఇదీ పచ్చ నేతల బరితెగింపు..! ఇప్పుడు వారు బెదిరింపుల పర్వానికీ తెరలేపారు..! తాజాగా బాపట్ల పచ్చ నేత చూపు యాక్ట్ కేబుల్ టీవీపై పడింది. ఇక్కడ తాను చెప్పిందే ‘యాక్ట్’ అంటూ సంస్థను నియోజకవర్గం నుంచి తరిమేసి మొత్తం కనెక్షన్లు తన కేబుల్ టీవీకి మళ్లించుకునేందుకు ఆయన ఎత్తు వేశారు. ఇందుకోసం శక్తిమంతమైన యాక్ట్ యాజమాన్యాన్నే బెదిరించారు. ఆయన బరితెగింపు జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం కాగా కూటమి ప్రభుత్వంలోనూ చర్చకు దారితీసింది.
–సాక్షి ప్రతినిధి, బాపట్ల
కార్యాలయానికి పిలిపించుకుని బెదిరింపుల పర్వం
బాపట్ల పచ్చ నేత నియోజకవర్గంలో 30 ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది యాక్ట్ కేబుల్ యాజమాన్యం. ఇప్పుడు దానినే బెదిరిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. సంస్థకు ఉన్న 32 వేల కనెక్షన్లు తనకు అప్పగించి నియోజకవర్గం వదిలిపెట్టాలని బాపట్ల పచ్చ నేత హుకుం జారీ చేశారు. ఇటీవల యాక్ట్ కేబుల్‌కు చెందిన అసిస్టెంట్ మేనేజర్ మొదలు ఉద్యోగులందరినీ తన కార్యాలయానికి పిలిపించుకుని మరీ అల్టిమేటం జారీ చేశారు.
‘మీ కనెక్షన్లన్నీ మా సోదరుడి కేబుల్ టీవీకి బదలాయించండి’అని ఆదేశించారు. కాదూ.. కూడదంటే నియోజకవర్గంలో ఉండలేరన్నారు. వెళ్లకపోతే పోలీసు కేసులు పెట్టిస్తానని బెదిరించారు. ‘మీరంతా చిన్న ఉద్యోగులు.. యాక్ట్‌ను నమ్ముకుని కేసుల్లో ఇరుక్కోవద్దు’ అంటూ తనదైన శైలిలో సూచనలు చేశారు. తక్షణం ఉద్యోగాలు వదలి వెళ్లిపోవాలని ఆల్టిమేటం ఇచ్చారు. ఈ విషయం యాక్ట్ యాజమాన్యానికి తక్షణమే చేరవేయాలని కూడా సూచించారు.
తన మాట ఖాతరు చేయకుండా పార్టీ పెద్దలు, లేదా మీ సంస్థకు పరిచయమున్న మంత్రులతో ఫోన్లు చేయించినా వినేది లేదని పచ్చనేత ఖరాకండిగా చెప్పారు. నాతో పెట్టుకోవద్దంటూ ఇలా నేరుగానే బెదిరించారు. యాజమాన్యంతో మీరే మాట్లాడాలని యాక్ట్ ఉద్యోగులు సూచించగా ‘మీ యాజమాన్యంతో మాట్లాడేంత తక్కువ స్థాయి వ్యక్తిని కాదు నేను. అవసరమనుకుంటే వారే నా వద్దకు రావాలి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వారంలో వెళ్లకపోతే కేసులే..
వారం రోజుల్లో బాపట్ల వదలి వెళ్లాలని, లేదంటే ఎలా పనిచేస్తారో చూస్తామని.. వరుస కేసులు పెట్టి అంతుచూస్తామని యాక్ట్ ఉద్యోగులకు పచ్చ నేత ఫైనల్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో.. మేనేజ్‌మెంట్ దృష్టికి తీసుకెళ్తామని, వారు ఒప్పుకోవాలి తప్ప తామేమీ చేయలేమని చెప్పి యాక్ట్ ఉద్యోగులు వెనుదిరిగినట్లు తెలిసింది.
తర్వాత పచ్చనేత సమీప బంధువు వచ్చి నియోజకవర్గానికి సంబంధించి 50 శాతం వాటా ఇస్తే ఓకే చెప్పిస్తానని యాక్ట్ ఉద్యోగుల వద్ద బేరం పెట్టినట్లు సమాచారం. ఇక బెదిరింపుల క్రమంలో ఇటీవల తమ కేబుల్‌ను కట్ చేశారన్న సాకు చూపి కర్లపాలెం పరిధిలో యాక్ట్ ఉద్యోగిపై అక్రమ కేసు నమోదు చేయించినట్లు తెలిసింది. ఇదే కాకుండా ఇటీవల పలుసార్లు యాక్ట్ ఉద్యోగులను పోలీసు ఫిర్యాదుల పేరుతో వేధిస్తున్నట్లు చెబుతున్నారు.
ఇన్నేళ్లలో ఎప్పుడూ చూడలే..
పచ్చ నేత బెదిరింపులను యాక్ట్ యాజమాన్యం కొందరు ప్రభుత్వ పెద్దల దృష్టికి సైతం తెచ్చినట్లు సమాచారం. వాస్తవానికి యాక్ట్ డిజిటల్ టీవీ బలమైన మీడియా సంస్థ. దేశంలోనే మూడో అతిపెద్ద కేబుల్, ఇంటర్‌నెట్ కంపెనీ. నాన్ టెలికంలో దేశంలో నంబర్‌వన్ స్థానంలో ఉంది. దేశ వ్యాప్తంగా 20 వేల మంది ఉద్యోగులు ఈ సంస్థలో పనిచేస్తున్నారు.
బాపట్ల నియోజకవర్గంలో 30 ఏళ్ల నుంచి 32 వేల కనెక్షన్లతో ఉంది. ఏడాదిన్నర క్రితం బాపట్ల పచ్చనేత తన రాజకీయ అవసరాల కోసం లోకల్ కేబుల్ పెట్టారు. తర్వాత అధికారంలోకి రావడంతో ఏకంగా బలమైన యాక్ట్ కేబుల్‌ను కనెక్షన్లు తనకు అప్పగించి వెళ్లాలని బెదిరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్నేళ్లలో ఏ నాయకుడూ తమను బెదిరించలేదని, మొదటిసారి బాపట్లలో ఇలాంటి పరిస్థితి చూస్తున్నామని యాక్ట్ యాజమాన్యం పేర్కొంటోంది.
Comments
Please login to add a commentAdd a comment