
పదో తరగతి ఫలితాల్లో స్పష్టంగా కనిపించిన ప్రభుత్వ తీరు
విద్యా రంగంలో బెడిసికొట్టిన కూటమి సర్కారు ప్రయోగాలు
గత ఏడాది కంటే ఉత్తీర్ణతలో 5.55 శాతం తగ్గుదల నమోదు
నిరుడు వందశాతం ఉత్తీర్ణత స్కూళ్లు 2,800.. ఈసారి 1,680
పరీక్షలకు 6,14,459 మంది విద్యార్థుల హాజరు.. 4,98,585 మంది పాస్
84.09 శాతం బాలికలు, 78.31 శాతం బాలురు ఉత్తీర్ణత
93.90 శాతంతో పార్వతీపురం మన్యం జిల్లా ప్రథమం
47.64 శాతంతో చివరి స్థానంలో అల్లూరి జిల్లా
1,680 పాఠశాలల్లో 100 శాతం.. 19 పాఠశాలల్లో ‘జీరో’
ఇంగ్లిష్ మీడియంలో 83.19 శాతం.. తెలుగు మాధ్యమంలో 58.59 శాతం
మే 19 నుంచి 28 వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ
ఈ నెల 30 వరకు ఫీజు చెల్లింపునకు అవకాశం
ఆలస్య రుసుముతో మే 18 వరకు గడువు
ఉపాధ్యాయుల సర్దుబాటులో సాగదీతతో చేదు ఫలితం
అప్పర్ ప్రైమరీ పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల తొలగింపుతో చేటు
సాక్షి, అమరావతి: విద్యా సంవత్సరం మధ్యలో ప్రారంభించిన ఉపాధ్యాయుల సర్దుబాటు సెప్టెంబరు వరకు సాగదీత.. అప్పర్ ప్రైమరీ (యూపీ) పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల తొలగింపు.. ఇలా పాఠశాల విద్యలో కూటమి ప్రభుత్వం చేసిన ప్రయోగాలు బెడిసికొట్టాయి. పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఫలితాలు దిగజారాయి. గత ఏడాది కంటే ఉత్తీర్ణత 5.55 శాతం తగ్గింది. పదో తరగతి ఫలితాలను బుధవారం విద్యాశాఖ మంత్రి నారా లోకే‹శ్ ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి ఆన్‌లైన్‌లో విడుదల చేశారు.
⇒ ఈ ఏడాది పరీక్షలకు 6,19,286 మంది రిజిస్టర్ చేసుకోగా, 6,14,459 మంది హాజరయ్యారు. వీరిలో 4,98,585 మంది (81.14 శాతం) ఉత్తీర్ణత సాధించారు. పాసైన వారిలో బాలికలు 2,53,278 మంది (84.09 శాతం), బాలురు 2,45,307 మంది (78.31 శాతం) ఉన్నారు.
⇒ ఈ ఏడాది పరీక్షలు ఇంగ్లిష్ మీడియంతో పాటు తెలుగు మీడియంలోనూ రాసేందుకు అవకాశం కల్పించారు.
⇒ ఇంగ్లిష్ మీడియంలో రాసిన 5,60,864 మందిలో 4,66,586 మంది (83.19 శాతం), తెలుగు మీడియంలో 49,519 మందికి గాను 29,012 మంది (58.59 శాతం) ఉత్తీర్ణులయ్యారు.
⇒ మొత్తం విద్యార్థుల్లో 65.36 శాతం ప్రథమ, 10.69 శాతం ద్వితీయ, 5.09 శాతం మంది విద్యార్థులు తృతీయ శ్రేణి సాధించారు.
టాప్‌లో మన్యం.. చివరిలో అల్లూరి జిల్లాలు
పదో తరగతి ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా 93.90 శాతంతో టాప్‌లో నిలిచింది. వరుసగా మూడో ఏడాది ఈ ఘనతను అందుకుంది.
⇒ 47.64 శాతం ఉత్తీర్ణతతో అల్లూరు సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో ఉంది.
⇒ మొత్తం 11,819 ఉన్నత పాఠశాలల (4,879 ప్రైవేటు, మిగిలినవి ప్రభుత్వ యాజమాన్యంలోనివి) నుంచి విద్యార్థులు పరీక్షలు రాశారు. 1680 పాఠశాలలు 100 శాతం ఫలితాలను సాధించాయి. 19 ‘సున్నా’ ఫలితాలను నమోదు చేశాయి.
నేటి నుంచి రీ కౌంటింగ్‌కు అవకాశం
పరీక్షలు తప్పిన, మార్కులు తక్కువగా వచ్చిన విద్యార్థులు రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌కు విద్యాశాఖ అవకాశం కల్పించింది. పాఠశాల విద్యా శాఖ వెబ్‌సైట్‌లో వారివారి స్కూల్ లాగిన్‌లో గురువారం నుంచి మే 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రీకౌంటింగ్‌కు రూ.500, రీ వెరిఫికేషన్‌కు రూ.1000 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
మే 19 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ
పదో తరగతి పరీక్షల్లో విఫలమైన విద్యార్థుల కోసం పాఠశాల విద్యా శాఖ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు షెడ్యూల్ ప్రకటించింది. మే 19 నుంచి 28వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యా శాఖ పేర్కొంది. త్వరలోనే టైమ్ టేబుల్ విడుదల చేయనున్నట్టు పేర్కొంది. విద్యార్థులు గురువారం నుంచి ఈ నెల 30వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని, ఆలస్య రుసుముతో జూన్ 18 వరకు గడువు ఇచ్చింది.
కనిపించని మెరుపులు
వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో విజయవంతమైన విద్యా సంస్కరణలతో మెరుగైన ఫలితాలను సాధించింది. రెండేళ్ల పాటు కోవిడ్–19తో సరిగా తరగతులు జరగక, పరీక్షలు నిర్వహించకపోయినా, 2022–23 విద్యా సంవత్సరంలో 933 స్కూళ్లు పదో తరగతి ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదు చేశాయి.
⇒ 2023–24 విద్యా సంవత్సరంలో 100 శాతం ఉత్తీర్ణత సాధించిన వాటి సంఖ్య 2,803కు పెరగడంతో పాటు జీరో ఫలితాలు సాధించినవి 17కి తగ్గాయి.
⇒ తాజాగా 2024–25 విద్యా సంవత్సరంలో 100 శాతం ఉత్తీర్ణత సాధించిన స్కూళ్లు 1,680కి తగ్గిపోగా, జీరో ఫలితాల స్కూళ్ల సంఖ్య 19కి పెరిగింది.
సివిల్స్ సాధిస్తా
పది ఫలితాల్లో 600 మార్కులు సాధించిన నేహాంజని
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో కాకినాడకు చెందిన యాళ్ల నేహాంజని 600కు 600 మార్కులు సాధించి విశేష ప్రతిభ చూపింది. ప్రాథమిక విద్య నుంచి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధిస్తోంది. ప్రణాళికాబద్ధంగా చదివి కాకినాడ చరిత్రలో పదిలో నూటికి నూరుశాతం మార్కులతో ఘనత చాటింది. సివిల్స్ సాధించి పేద ప్రజలకు సేవ చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు నేహాంజని తెలిపింది. తండ్రి శ్రీనివాసరావు ప్రైవేట్ ఉద్యోగి కాగా తల్లి గంగాభవానీ గృహిణిగా ఉన్నారు. తమ విద్యార్థిని వై.నేహాంజని స్టేట్ టాపర్‌గా నిలిచిందని భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు.
ఓపెన్ పది, ఇంటర్ ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో 2024–25 విద్యా సంవత్సరంలో ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహించిన పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలను కూడా మంత్రి లోకేశ్ బుధవారం విడుదల చేశారు. 26,679 మంది పదో తరగతి పరీక్షలు రాయగా, 10,119 మంది (37.93 శాతం) ఉత్తీర్ణులవగా, ఇంటర్మీడియట్‌లో 63,668 మందికి గాను 33,819 మంది (53.12 శాతం) విజయం సాధించారు.
రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఈ నెల 26 నుంచి మే 5 వరకు ఏపీ ఆన్‌లైన్ సర్వీస్ సెంటర్ల నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ నరసింహారావు తెలిపారు. ప్రతి సబ్జెక్టు రీకౌంటింగ్‌కు రూ.200, రీ వెరిఫికేషన్ కు రూ.రూ.1000 ఫీజుగా చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. పది, ఇంటర్ మే–2025 పరీక్షలు రెగ్యులర్ పదో తరగతి పరీక్షలతో కలిపి నిర్వహించనున్నట్టు తెలిపారు.