
సాక్షి, తాడేపల్లి: ప్రవీణ్ పగడాల మృతిపై లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరపున కోర్టులో పిల్ వేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్‌కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అందరినీ కలిపి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకుంటామని.. పాస్టర్ ప్రవీణ్ పగడాల పోస్ట్ మార్టం రిపోర్టులో స్పష్టత లేదన్నారు. ట్రావెల్ చేసింది.. ఆగింది.. మద్యం కొనుగోలు చేసింది ప్రవీణ్ కుమార్ అని ఎక్కడా నిరూపణ కాలేదు. చనిపోయిన వ్యక్తి ప్రవీణ్ కుమార్ అనేది తప్ప పోలీసులు చూపిన వీడియోల్లో అతను ప్రవీణ్ కుమార్ అని నిర్ధారణ కాలేదు’’ అని విజయ్ కుమార్ వివరించారు.
‘‘నాకు ఎన్నో పోస్టుమార్టం రిపోర్టులు చూసిన అనుభవం ఉంది. మద్యం సేవించడం వల్లే చనిపోయాడని పోస్టుమార్టంలో కావాలని రాసినట్లుంది. మద్యం తాగడం వల్లే చనిపోతే ఈ దేశంలో రాష్ట్రంలో ఇంతమంది ఎలా బతికున్నారు?. ప్రిలిమినరీ రిపోర్టులో ప్రవీణ్ కడుపులో 120 ఎంఎల్ ఫ్లూయిడ్ ఉందని రిపోర్టు ఇచ్చారు. ఈ ఫ్లూయిడ్‌లో అనుమానాస్పదమైన ఎలాంటి ఆల్కహాల్ లేదని ఇచ్చారు. ప్రిలిమినరీ రిపోర్టులో ఆల్కహాల్ లేదని చెప్పిన వైద్యులు.. ఫైనల్ రిపోర్టులో ఆల్కహాల్ ఉందని ఇవ్వడం చిత్రంగా ఉంది. ఎందుకు ఆల్కహాల్ గురించి ఇంతగా ప్రస్తావిస్తున్నారు. పోలీసులు మొదట చెప్పిన ప్రెస్ మీట్‌లో ఎక్కడా ఆల్కహాల్ గురించి ప్రస్తావన లేదు. తర్వాత ఒక స్టోరీని అల్లడం కోసం ఆల్కహాల్‌ను వాడుకున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి’’ అని విజయ్‌కుమార్ పేర్కొన్నారు.
‘‘పనిగట్టుకుని ఆల్కహాల్ ఉందని రిపోర్టులో రాశారని అనిపిస్తోంది. మొహం రాళ్లకు గుద్దుకున్నందుకు గాయాలయ్యాయన్నారు. మరి తలవెనుక గాయం ఎలా అయ్యింది?. వెల్లకిలా పడిన వ్యక్తి పై మోటార్ సైకిల్ ఎలా పడింది?. అనేక సందేహాలున్నాయి వాటికి ఎక్కడా సమాధానం లేదు. హర్షకుమార్ అరెస్టును మేం తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఏపీలో అసలు మానవహక్కులు ఉన్నాయా అని ప్రశ్నిస్తున్నాం. స్వేచ్ఛగా నిరసన తెలిపే హక్కు కూడా పౌరులకు లేదా?. రెండు సార్లు ఎంపీగా చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి వేధించడం పద్ధతేనా?. ముందస్తు అరెస్ట్ చేయడానికి ఒక విధానం ఉంటుంది.
మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్న కొద్ది ప్రవీణ్ కుమార్‌ది హత్యేనేమోనని అనుమానాలు బలపడుతున్నాయ్. ప్రవీణ్ మృతిపై మాట్లాడాలంటేనే భయపడేలా చేస్తున్నారు. మాట్లాడితే కేసులు పెడుతున్నారు. ద్రోహులెవరో తెలిసిపోతారని ప్రభుత్వం ఉలిక్కిపడుతుందనే అనుమానం కలుగుతోంది. ఒక్క మంత్రి కూడా మాట్లాడలేదు. పేదల ఓట్లు మీకు కావాలి?. పేదల భావాలతో మీకు పనిలేదా?’’ అంటూ విజయ్‌కుమార్ ప్రశ్నించారు.