
కాకినాడలో సమావేశమైన పాస్టర్లు
ఆయన మరణంపై సందేహాలెన్నో
రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారనే అనుమానం
ఉద్యమానికి సిద్ధమవుతున్న క్రైస్తవ సమాజం
నేడు పలు జిల్లాల్లో నిరసన ర్యాలీలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ/మచిలీపట్నంటౌన్/నగరంపాలెం(గుంటూరు వెస్ట్): ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం వెనుక మిస్టరీ నేటికీ వీడలేదు. ఘటన జరిగి వారం రోజులు గడిచినా రోజుకో మలుపు తిరుగుతూనే ఉంది. హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా రాజమహేంద్రవరానికి బుల్లెట్ బైక్‌పై వస్తున్న ప్రవీణ్ గత సోమవారం అర్ధరాత్రి దాటాక అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసులు ఆ రోజు నుంచీ ఇది రోడ్డు ప్రమాదమని పదేపదే చెబుతుండగా.. పోలీసుల వాదనతో క్రైస్తవ సమాజం తీవ్రంగా విభేదిస్తోంది.
ఇది ముమ్మాటికీ హత్యేనని, దీనివెనుక ఉన్న కుట్రను బయట పెట్టాలని క్రైస్తవ సంఘాలు ఘటన జరిగిన నాటినుంచీ డిమాండ్ చేస్తున్నాయి. ప్రవీణ్ మరణంపై క్రైస్తవ సంఘాలు సంధిస్తున్న అనేక ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి, పోలీసుల నుంచి నిర్దిష్టమైన సమాధానం రాకపోవడంతో అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. ప్రవీణ్‌ను పథకం ప్రకారమే అంతమొందించి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే దిశగా దర్యాప్తు జరుగుతోందనే అనుమానాన్ని క్రైస్తవ సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయమై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు క్రైస్తవ సంఘాలు ఏకతాటిపైకి వచ్చేందుకు సమాయత్తమవుతున్నాయి.
శాంతి ర్యాలీలకు పిలుపు
ప్రవీణ్ పగడాల మరణం వెనుక వాస్తవాలను బయటపెట్టాలని కోరుతూ సోమవారం రాజమహేంద్రవరంలో రాష్ట్రస్థాయిలో పాస్టర్ల సమావేశం నిర్వహిస్తున్నారు. ఆదివారం కాకినాడలో పాస్టర్లు మూర్తి రాజు, స్టీఫెన్ ఆనంద్ , అంకిత్‌రెడ్డి, ఎం.విజయకుమార్, ఏకే శామ్యూల్, ఎండీ రాజు, రత్నంబాబు, చార్లెస్, ఆలిండియా క్రిస్టియన్ కౌన్సిల్ (ఏఐసీసీ) ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, కాకినాడలోని వివిధ చర్చిల పాస్టర్లు హాజరై పాస్టర్ ప్రవీణ మరణంపై చర్చించారు.
సోమవారం శాంతి ర్యాలీ చేయాలని నిర్ణయించారు. తూర్పుగోదావరి, కాకినాడ సహా పలు జిల్లాల్లో సోమవారం భారీ ఎత్తున శాంతి ర్యాలీలు నిర్వహించేందుకు పాస్టర్ల అసోసియేషన్లు పిలుపునిచ్చాయి. కాగా, కృష్ణాజిల్లా మచిలీపట్నం, గుంటూరులో క్రైస్తవ, మైనారీ్ట, దళిత, ప్రజా సంఘాలు, సంఘ విశ్వాసులు శాంతి ర్యాలీలు నిర్వహించారు.
కేసులేమీ వద్దని టీడీపీ అధికార ప్రతినిధి అడగటమేంటి?
ప్రవీణ్ పగడాలది పక్కా ప్రణాళిక ప్రకారం చేసిన హత్య. దీనికి ఎన్నో ఆధారాలు కనిపిస్తున్నాయి. ప్రవీణ్ పెదాల మీద నరకడం లేదా కర్రతో కొట్టిన ఆనవాళ్లు ఉన్నాయి. భుజం మీద రాడ్డుతో కొట్టినట్టు స్పష్టంగా తెలుస్తోంది. తొడ దగ్గర కాలిపోయిన మార్క్స్ ఉన్నాయని చెబుతున్నారు. షర్టుపై కాళ్లతో తన్నిన షూ ప్రింట్స్ ఉన్నాయి. ప్రవీణ్ వాళ్ల ఫ్యామిలీకి ఫోన్‌లో ‘మీ అమ్మాయిని చంపేస్తాం. ఇక్కడ పోస్టుమార్టం వద్దు. మర్యాదగా తీసుకెళ్లిపోండి’ అనే బెదిరింపులు వచ్చాయి. – పాస్టర్ అజయ్‌బాబు, ప్రచార కమిటీ కన్వినర్, తెలంగాణ కాంగ్రెస్
‘చంద్రబాబూ.. నిన్ను ఆ దేవుడు క్షమించడు’
ప్రవీణ్ మరణానికి సంబంధించిన రిపోర్టులు తారుమారు చేసి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తే ‘చంద్రబాబూ.. నిన్ను ఆ దేవుడు క్షమించడు’. ఇది హత్య కాదు రోడ్డు ప్రమాదం అని తేల్చేయాలని చూస్తే రాష్ట్రంలోని లక్షలాది క్రైస్తవుల, జీసస్ ఆగ్రహానికి లోనవుతారు. అందరం కలిసి సుప్రీంకోర్టుకు వెళతాం. సీసీ కెమెరా రిపోర్టు ఎక్కడ? చిన్నబిడ్డ తప్పిపోతే వెంటనే సీసీ ఫుటేజీలతో పట్టుకుంటారు.
ఈ కేసు విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోంది. అసలు హోం మినిస్టర్ ఎవరో, వారు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో ఇప్పటివరకు తెలీదు. ఏదో బుక్ రాజ్యాంగం అంటూ ఆ దిశగా పని కానిస్తున్నారే తప్ప రాష్ట్రాభివృద్ధి వైపు ప్రభుత్వం అడుగులు వేయడం లేదు. వాస్తవాలను అధికారులు స్పష్టం చేయాలి. అవసరమైతే కేసును సీబీఐకి బదిలీ చేయాలి.
– కేఏ పాల్, అధ్యక్షుడు, ప్రజాశాంతి పార్టీ
సీఐడీ దర్యాప్తు జరిపించాలి
ప్రవీణ్ మృతిపై సీఐడీతో దర్యాప్తు జరిపించాలి. ఆయన మరణంపై అనేక అనుమానాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. క్రైస్తవులపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ రోజు విజయవాడ నుంచి రాజమహేంద్రవరం వచ్చే వరకు అసలు ఏం జరిగిందనేది బహిరంగ పరచాలి. – బ్రదర్ రిక్కి గూటం, జిల్లా అధ్యక్షుడు, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్, కాకినాడ
సహజ మరణం కాదు
ప్రవీణ్‌ది రోడ్డు ప్రమాదంలో జరిగిన మరణం కాదనే అనుమానాలు క్రైస్తవులకు ఉన్నాయి. ప్రమాదం జరిగిన చాలా సమయం తర్వాత మర్నాడు ఉదయం ఆ ప్రాంతానికి పోలీసులు వెళ్లారు. పూర్తి ఆధారాలు సేకరించిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయాలి. ఈ విషయాన్ని మతపరమైన అంశంలా చూడకుండా మానవత్వంతో ముందుకు వెళ్లి అందరి అనుమానాలు తీర్చాలి. ఆయన కాల్ హిస్టరీని మరింత లోతుగా పరిశీలన చేయాలి. – పర్ల డేవిడ్, ఒన్‌నెస్, సువార్తికుడు