pastor
-
పాస్టర్ ప్రవీణ్ కేసులో లోతైన దర్యాప్తు: సీఐడీ ఎస్పీ
సాక్షి, అమరావతి/గుంటూరు: పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి కేసులో లోతైన దర్యాప్తు జరుగుతున్నదని, ఈ కేసుకు సంబంధించి సోషల్ మీడియాలోనూ, మీడియాలోనూ ఊహాజనిత కథనాలు ప్రచురించవద్దని ఏపీ సీఐడీ ఎస్పీ జీఆర్ రాధిక స్పష్టం చేశారు. కేసు వివరాలను ఆమె గురువారం ఓ ప్రకటనలో వివరించా రు. పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి వీడియోను చూసిన గుంటూరుకు చెందిన సింగం వెంకట శ్రీలక్ష్మీనారాయణ ఈ ఏడాది జనవరి 12న సీఐడీకి ఫిర్యాదు చేశారు. ‘హిందూ దేవుళ్ల విగ్రహాలు ఫేక్ అని, తాను ఎన్నో విగ్రహాలను అవమానించానని, అనేక గ్రామాలను క్రైస్తవ గ్రామాలుగా మార్చానంటూ’ పాస్టర్ ప్రవీ ణ్ చక్రవర్తి అన్న వ్యాఖ్యలు ఉన్న సీడీని ఫిర్యాదుకు జత చేశారు. దీనిపై మం గళగిరి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 1/2021 సెక్షన్ 153/ఎ, 153 బి(1)(సి), 505(1)(సి), 505(2), 295(ఎ), 124(ఎ), 115 రెడ్ విత్ 66 తీవ్రమెన సెక్షన్లపై కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేసిన సీఐడీ బృందం పాస్టర్ ప్రవీణ్‌ను జనవరి 13న అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించడంతో అదే రోజు అర్ధరాత్రి జైలుకు తరలించారు. ఈ కేసులో మరింత విచారణ కోసం ప్రవీణ్‌ను కస్టడీకి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించడంతో జనవరి 20 నుంచి మూడు రోజుల పాటు అనుమతించింది. ప్రస్తుతం ప్రవీణ్‌ను గుంటూరులోని సీఐడీ రీజినల్ కార్యాలయంలో విచారిస్తున్నారు. జనవరి 23తో అతని కస్టడీ ముగుస్తుంది. కాగా, ప్రజలను రెచ్చగొట్టేలా, మతాలను కించపరిచేలా మీడియాలో కథనాలు ప్రచురిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని ఎస్పీ రాధిక హెచ్చరించారు. -
బాబుగారి శవ రాజకీయాలు
-
‘ఖాకీ’ ఓవరాక్షన్
పెద్దపల్లి రూరల్: పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసుల ఓవరాక్షన్ వివాదాస్పదమైంది. రహదారి పక్కనే వాహనాన్ని నిలుపుతారా అంటూ మంగళవారం ఓ పాస్టర్‌పై పోలీసులు దాడి చేయడం.. వాహనం టైరులో నుంచి గాలి తీసి అత్యుత్సాహం ప్రదర్శించడం గొడవకు దారితీసింది. తన భర్తను ఎందుకు కొడతావంటూ పోలీసులను పాస్టర్ భార్య నిలదీయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హైదరాబాద్‌లోని అబ్దులాపూర్ మెట్ట ప్రాంతానికి చెందిన పాస్టర్ అశోక్‌కుమార్ కుటుంబంతో కలసి మారుతివ్యాన్‌లో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని క్రైస్తవ ప్రార్థన మందిరానికి వెళ్లారు. అక్కడ ప్రార్థనల అనంతరం తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరారు. మార్గమధ్యంలో పెద్దపల్లిలోని కమాన్ప్రాంతంలో టిఫిన్ చేసేందుకు ఆగారు. ఇంతలో అటుగా వచ్చిన ట్రాఫిక్ సీఐ బాబురావు, ఇతర సిబ్బంది వాహనం తీయాలని ఆదేశించారు. వాహనంలోనే కూర్చుని చంటి పిల్లలకు టిఫిన్ తినిపిస్తున్న అశ్విని తొందరలోనే వెళతామని చెప్పినా వినిపించుకోని ట్రాఫిక్ పోలీసులు అత్యుత్సాహంతో వాహనం టైరులోని గాలి తీశారు. గాలి తీయొద్దు.. వెళ్లిపోతామంటూ బతిమాలిన అశోక్‌కుమార్‌పై చేయి చేసుకున్నారు. తన భర్తపై ఎందుకు చేయి చేసుకుంటారంటూ అశ్విని తిరగబడింది. ఆగ్రహం చెందిన పోలీసులు.. అశోక్‌కుమార్‌తోపాటు వారిబంధువులు గండయ్య, అనిల్, అశ్విని, ఇద్దరు చిన్నపిల్లలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గాలిలేని వ్యాన్‌ను పోలీసులే నెట్టి పక్కకు తరలించారు. ట్రాఫిక్ పోలీసులు అనుసరించిన తీరుపై అశ్విని తీవ్రంగా మండిపడ్డారు. తాము ఏ నేరం చేశామని చేయి చేసుకుంటారని అధికారులను ప్రశ్నించింది. పార్కింగ్ స్థలం చూపితే వాహనాన్ని అక్కడే నిలిపేవారమని, నిబంధనలను పాటించలేదని భావిస్తే జరిమానా విధించాలే కానీ ఎందుకు చేయిచేసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్ఐ రవికుమార్‌ను వివరణ కోరగా పెద్దపల్లి కమాన్ ప్రాంతంలో జరిగిన వ్యవహారంలో మోటారు చట్ట ప్రకారం జరిమానా విధించి వదిలేశామన్నారు. -
పాస్టర్ లైంగిక వేధింపులు.. నిర్ఘాంతపోయిన అధికారులు!
ఒంగోలు (ప్రకాశం) : అభం శుభం తెలియని పిల్లలు వారు.. 8 నుంచి 16 ఏళ్లలోపు వారు.. దైవ వాక్యం నిత్యం ప్రతిధ్వనించే చోట తమ పిల్లలకు మంచి జరుగుతుందంటూ తల్లిదండ్రులు ధైర్యంగా ఉన్నారు. తమ సమీపంలోని పాస్టర్ల సహకారంతో 53 మంది బాలికలు స్థానిక క్లౌపేటలో ఉన్న యూసీఎల్‌ఐ పాఠశాలలో చేర్పించారు. ఆ హాస్టల్‌కు అనుబంధంగా ఉన్న హోమ్‌లో (పాఠశాలకు ఎదురుగా ఉన్న కమ్యూనిటీ హాలు పైభాగంలో) వసతి ఏర్పాటు చేశారు. ఆ పాఠశాలలో బాలల సంరక్షణ కమిటీ నిర్వహించిన ఆకస్మిక తనిఖీతో సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బయటకు చెప్పుకునేందుకు సిగ్గుపడే విధంగా 76 ఏళ్ల జోసఫ్ పాస్టర్ తమకు అశ్లీల చిత్రాలు చూపిస్తూ లైంగికంగా వేధిస్తున్నారంటూ పలువురు బాలికలు చెప్పడంతో అధికారులు నిర్ఘాంతపోయారు. వెలుగులోకి ఇలా.. ఇటీవల బీహార్ రాష్ట్రంలో ఒక స్వచ్ఛంద సంస్థ ముసుగులో బాలికలపై లైంగిక దాడులు ఘటన వెలుగులోకి వచ్చిన విషయం విదితమే. ఈ ఘటన వెలుగులోకి రాగానే కేంద్ర ప్రభుత్వంతో పాటు సుప్రీంకోర్టు సీరియసైంది. సుప్రీం ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాలు తమ పరిధిలోని బాలికల హోమ్‌లను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు రావడం, అందులో భాగంగా మన రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అరుణ్‌కుమార్ కూడా అన్ని జిల్లాలకు ఇదే ఆదేశం పంపించారు. అందులో భాగంగా గురువారం ఉదయం 9.30 గంటల సమయంలో బాలల సంరక్షణ కమిటీ చైర్మన్ సీహెచ్ భారతి, స్వచ్ఛంద సంస్థకు సంబంధించిన సభ్యురాలు హేనా, జిల్లా ప్రొబెషనరీ ఆఫీసర్ హెచ్ ఫరూఖ్‌బాషా తదితరులు స్థానిక క్లౌపేటలో యూసీఎల్‌ఐ పాఠశాలకు చేరుకున్నారు. హోమ్‌లో ఉంటున్న బాలికలను పిలిపించారు. హాస్టల్ నివేదిక ప్రకారం హోమ్‌లో 53 మంది పిల్లలు ఉండాలి. కానీ అక్కడ కేవలం 46 మంది మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. నిబంధనల ప్రకారం కమిటీ సభ్యులు ముందుగా బాలికలకు ఒక తెల్ల కాగితం ఇచ్చి సమస్యలు ఏమైనా ఉంటే తెలియజేయాలని కోరారు. ఈ క్రమంలో పలువురు బాలికలు తాము ఎదుర్కొంటున్న విషయాన్ని తెలియజేయడంతో అధికారులు బిత్తర పోయారు. బాలికల నుంచి మధ్యాహ్నం వరకు రిపోర్టు తీసుకున్నారు. సంబంధిత బాలికలతో విడివిడిగా మాట్లాడారు. అర్ధరాత్రి వరకు పాస్టర్ జోసఫ్ ఆయనతో పాటు ఉండాలని ఆదేశిస్తారని, ఈ క్రమంలో తమకు అశ్లీల వీడియోలు చూపించి అలా చేయాలంటూ తమను వేధిస్తున్నాడంటూ భోరుమన్నారు. అంతేకాకుండా తమను తాకరాని చోట తాకుతూ శారీరకంగా కూడా వేధిస్తున్నారంటూ కన్నీటిపర్యంతమయ్యారు. పాస్టర్ జోసఫ్ అరెస్టు బాలల సంరక్షణ కమిటీ వెంటనే దీనిపై పక్కా ప్రణాళిక అమలు చేసింది. ఎవరికీ ఏ మాత్రం అనుమానం రాకుండా పూర్తిగా పిల్లలను తమ అదుపులోనే ఉంచుకుంది. బాలికలను అదే హోమ్‌లో ఉంచడం శ్రేయస్కరం కాదని నిర్ణయించుకుంది. జిల్లా అధికారులతో మాట్లాడి ఒక బస్సులో వారందరినీ అధికారులు స్థానిక రామ్‌నగర్ మూడోలైన్‌లో ఉన్న బాలసదన్‌కు తరలించారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో బాలల సంరక్షణ కమిటీ జిల్లా ప్రొబెషనరీ అధికారిగా విధులు నిర్వహిస్తున్న హెచ్ ఫరూఖ్‌బాషా స్థానిక టూటౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడం, పోలీసులు అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల సమయంలో ఐపిసి 304, 509 సెక్షన్లతోపాటు 2012 పోక్సా చట్టంలోని సెక్షన్ 10,12,14ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం పాస్టర్ జోసెఫ్‌ను అరెస్టు చేశారు. శుక్రవారం ఉదయం బాలల సంరక్షణ కమిటీ చైర్మన్ సీహెచ్ భారతి మీడియాతో మాట్లాడారు. బాలికలు లైంగిక దాడులను తమ దృష్టికి తేవడంతో వారికి రక్షణ కల్పించేందుకు బాలసదన్‌కు తరలించామని వివరించారు. అంతే కాకుండా బాలల హక్కులకు భంగం కలిగించే వారు ఎంతటివారైనా వారికి శిక్షపడేంత వరకు విశ్రమించేది లేదన్నారు. మధ్యాహ్నం ఒంగోలు టూటౌన్ సీఐ సురేష్‌రెడ్డి ఆధ్వర్యంలో జోసఫ్‌ను ఎక్సయిజ్ మేజిస్ట్రేట్ వద్ద హాజరు పరచడంతో 14 రోజుల రిమాండ్ విధించారు. అధికారుల ఆగ్రహం విషయం మీడియాలో ప్రసారం కావడంతో సీఎం పేషీ నుంచి జిల్లా అధికారులను హెచ్చరించినట్లు తెలుస్తోంది. బాల సదన్‌కు విచారణకు వెళ్లిన ఓ అధికారి ఎందుకు మీడియాతో మాట్లాడారు? ఇది రాష్ట్ర ప్రభుత్వానికి అప్రతిష్ట కాదా.. అంటూ హెచ్చరించినట్లు విశ్వసనీయంగా అందిన సమాచారం. దీంతో ఘటన పెద్దదైనా అధికారులు ఎవరూ మీడియాతో మాట్లాడేందుకు ముందుకు రాలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా రెండో జాయింట్ కలెక్టర్ మార్కండేయులు, మహిళా హక్కుల కమిషన్ సభ్యురాలు తమ్మిశెట్టి రమాదేవి, చైల్డ్‌లైన్ ప్రతినిధి బీవీ సాగర్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి టి.రాజా వెంకటాద్రి, ఒంగోలు డీఎస్పీ బి.శ్రీనివాసరావు తదితరులు బాలసదన్‌కు చేరుకొని బాలికలను విచారించారు. హోమ్ రిజిస్టర్ ప్రకారం మొత్తం 53 మంది బాలికలు ఉండాలని, ప్రస్తుతం 46 మంది బాలికలు మాత్రమే ఉన్నారు. మిగిలిన ఏడుగురు ఏమయ్యారు? ఇళ్లకు ఏమైనా వెళ్లారా? అనేది కూడా విచారించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో భాగంగానే ఒంగోలు మండల విద్యాశాఖ అధికారిని కూడా శనివారం పాఠశాలను విజిట్ చేసి రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. హాస్టల్ సీజ్‌కు నేడో రేపో ఉత్తర్వులు బాలికలు ఆశ్రయం పొందుతున్న హాస్టల్‌ను మూసివేయాలని కలెక్టర్ నిర్ణయించినట్లు సమాచారం. వివిధ విభాగాల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా అనాథ బాలికలు లేదా బాలురను స్వచ్ఛంద సంస్థలు హాస్టళ్లలో చేర్చుకునే క్రమంలో తప్పనిసరిగా సీడబ్ల్యూసీ నుంచి అనుమతి పొందాల్సి ఉన్నా ఇంత వరకు ఈ హాస్టల్ పరిధిలోని 53 మందిలో ఒక్కరికీ అనుమతి లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వాటితో పాటు హాస్టల్ నిర్వహణకు సొంత నిధులు వినియోగిస్తున్నారా? లేక విదేశీ సంస్థల నుంచి ఏమైనా నిధులు తీసుకుంటున్నారా? విదేశీ నిధులు అయితే ఏ కారణంతో పొందుతున్నారనేది కూడా పోలీసు శాఖ కూపీలాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలసదన్‌లో ఉన్న బాలికలు కేవలం జిల్లా నుంచే కాకుండా వినుకొండ తదితర ప్రాంతాల నుంచి కూడా వచ్చినట్లు సమాచారం. తల్లిదండ్రులను పిలిపించి వారి సూచనల మేరకు బాలికలను సమీపంలోని కస్తూరిబా గాం«ధీ బాలికా విద్యాలయాల్లో చేర్పించాలని అధికారులు నిర్ణయించారు. -
అధికారం అండతో చర్చి కూల్చివేత
చెరుకుపల్లి(రేపల్లె): టీడీపీ నాయకులు క్రైస్తవ ప్రార్థన మందిరాన్ని కూల్చివేసిన ఘటన గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం బలుసులపాలెంలో గురువారం జరిగింది. టీడీపీ నాయకుడు కొనకాల రవికిరణ్, మరి కొంతమంది సెవెన్త్‌డే చర్చిని కూల్చివేశారు. ఆ సమయంలో పాస్టర్ ఏసురత్నం ఒక్కరే చర్చిలో ఉన్నాడు. టీడీపీ నాయకులు ఒక్కసారిగా దౌర్జన్యానికి దిగడంతో భయపడి పాస్టర్ చెరుకుపల్లికి పారిపోయారు. ఈ సమాచారం దళిత, క్రైస్తవ సంఘాల పెద్దలకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దళిత, క్రైస్తవ సంఘాల నాయకులు శుక్రవారం పోలీస్‌స్టేషన్‌కు చేరి ఆందోళన చేపట్టడానికి సిద్ధమవడంతో అధికారులు స్పందించారు. అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. టీడీపీ నాయకులు కూలగొట్టిన చర్చి పునఃనిర్మాణాన్ని చేపట్టేలా దళిత, క్రైస్తవ సంఘాలతో చర్చలు నిర్వహించి పరిస్థితిని చక్కదిద్దారు. -
రెండో వివాహం చేసుకున్న పాస్టర్‌పై కేసు
మిర్యాలగూడ రూరల్, నల్గొండ : రెండో వివాహం చేసుకున్న పాస్టర్‌పై మిర్యాలగూడ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం కేసు నమోదయ్యింది. ఎస్ఐ డి.సైదాబాబు తెలిపిన వివరాల ప్రకారం.. మండలం పరిధిలోని ఊట్లపల్లి గ్రామంలో చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తున్న అంజిబాబు అలియాస్ స్టిఫెన్ పది సంవత్సరాల క్రితం మండలంలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన అములమ్మను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు కుమారులు జన్మించారు. నేరేడుచర్ల మండల కేంద్రాన్ని చెందిన రజిత అనారోగ్యాని గురికావడంతో చర్చికి వచ్చి ప్రార్థనలు చేసేంది. ఆమెకు స్టిఫెన్ మాయమాటలు చెప్పి ప్రేమపేరుతో రెండు నెలల క్రితం రెండో వివాహం చేసుకున్నాడు. విషయం తెలిసిన మొదటి భార్య అములమ్మ సోమవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో స్టిఫెన్‌తో పాటు రెండో వివాహానికి సహకరించిన మరో పది మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పాస్టర్ ముసుగులో అఘాయిత్యం
జెడ్ మేడపాడు (మండపేట): విధి వంచితురాలైన దివ్యాంగురాలిపై పాస్టర్ ముసుగులో ఓ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమె గర్భం దాల్చడంతో అధికారపార్టీ నేతల అండతో రాజీకి ప్రయత్నించాడు. విషయం బయటకు పొక్కడంతో స్థానికులు అతడిని పోలీసులకు అప్పగించారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలంలోని జెడ్ మేడపాడులో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి కుటుంబసభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... జెడ్ మేడపాడుకు చెందిన 22 ఏళ్ల యువతి పుట్టు మూగ కావడంతోపాటు పోలియో సోకి రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో తమ్ముడు రాంబాబు వద్ద ఉంటోంది. రాంబాబు ఉదయాన్నే రైస్ మిల్లులో ఊక మోసేందుకు వెళుతుంటాడు. అతడి భార్య కూలి పనికి వెళుతుంటుంది. బాధితురాలు ఇంటి వద్దనే ఉంటుంది. ఇదిలా ఉండగా మండలంలోని అర్తమూరుకు చెందిన ఓశెట్టి దుర్గారావు అలియాస్ రాజారావు (60) భార్య చనిపోగా 20 ఏళ్ల క్రితమే జెడ్ మేడపాడు వచ్చేసి మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఇంటింటికీ తిరిగి ఇనుస సామాను సేకరించి అమ్ముతుంటాడు. సాయంత్రం సమయంలో పాస్టర్‌గా చలామణి అవుతూ ఇంటింటికీ వెళ్లి ప్రార్థనలు చేస్తుంటాడు. ఈ క్రమంలో వికలాంగ యువతికి పింఛన్ సొమ్ములు ఇప్పించేందుకంటూ ఆమెను రాజారావు తన మోటారు సైకిల్‌పై తీసుకెళుతుండేవాడు. వారం కిందట యువతి తీవ్ర కొడుపునొప్పితో బాధపడుతుండటంతో రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లగా, ఏడు నెలల గర్భంతో ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ఈ విషయమై కుటుంబసభ్యులు యువతిని ప్రశ్నించగా రాజారావు తనను తల్లిని చేసినట్టుగా సైగల ద్వారా తెలిపింది. దీనిపై ఆయన్ని నిలదీయడంతో గ్రామంలో అధికార పార్టీకి చెందిన పెద్దలను ఆశ్రయించాడు. పుట్టే బిడ్డను ఆశ్రమంలో చేర్పించడంతోపాటు మూగ యువతికి రూ.50 వేలు చెల్లించాలని పెద్దలు నిర్ణయించినట్టు రాంబాబు, స్థానికులు తెలిపారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలని హెచ్చరించారు. ఈ విషయం తెలిసి బాధితురాలి ఇంటికి సోమవారం మీడియా వెళ్లడంతో అసలు విషయం వెలుగుచూసింది. పాస్టర్‌నని చెప్పుకుంటూ తన సోదరిని గర్భవతిని చేశాడంటూ రాంబాబు కన్నీటి పర్యంతమయ్యాడు. అనంతరం స్థానికులు రాజారావు ఇంటికెళ్లి అతడిని పోలీసులకు అప్పగించారు. బాధితురాలికి న్యాయం చేయాలని పోలీసులను కోరారు. విచారించి తగిన చర్యలు తీసుకుంటామని రూరల్ ఎస్ఐ శివప్రసాద్ తెలిపారు. -
పాస్టరు అనుమానాస్పద మృతి
తెనాలి: తెనాలి రూరల్ మండలం కొలకలూరులో క్రైస్తవ సేవలో జీవిస్తుండే పాస్టరు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఆయనకు పింఛను ఆశ చూపి, బ్యాంకులో ఉన్న అతడి డబ్బును స్వాహా చేయడమే కాకుండా, పోలీసులకు ఫిర్యాదు చేస్తారనే భయంతో గుట్టుచప్పుడు కాకుండా హతమార్చారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇందులో తెలుగుదేశం పార్టీకి చెందిన ‘స్థానిక’ ప్రజాప్రతినిధి భర్త ఆరుంబాక రాజేష్‌ది ప్రధాన పాత్రగా దళితవాడ ప్రజలు ఆరోపిస్తున్నారు. పోలీసులకు స్థానికులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. కొలకలూరు దళితవాడకు చెందిన ఉన్నం సుబ్బారావు అలియాస్ దానియేలు (65) నూతనంగా ఇల్లు నిర్మించుకున్నారు. కొత్తగా నిర్మించుకున్న ఆ ఇంటికి ఇంకా ప్లాస్టింగ్ చేయలేదు. కిటికీలకు తలుపుల్లేవు. ఇల్లంతా ఇనుప కమ్మెలు, బస్తాలతో అస్తవ్యస్తంగా ఉంది. భార్య, కుమార్తె, అల్లుడు వేరొక గ్రామంలో నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయాన్నే పాస్టరు సుబ్బారావు నిద్రిస్తున్న మంచంపైనే విగతజీవుడై ఉండడాన్ని ఇరుగుపొరుగు గమనించి, పోలీసులకు ఫిర్యాదుచేశారు. రూరల్ ఎస్ఐ అనిల్‌కుమార్ వచ్చి శవపరీక్షకు తరలించేందుకు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. సుబ్బారావును హత్య చేశారని, పోలీసు జాగిలాన్ని రప్పించాలని స్థానికులు పట్టుబట్టడంతో పోలీసు జాగిలాన్ని రప్పించారు. అనంతరం డీఎస్పీ స్నేహిత వచ్చి స్థానికులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. పాస్టరు సుబ్బారావు ఇటీవల తనకున్న కొద్దిపాటి పొలం, స్థలం విక్రయించాడు. బాకీలు తీర్చగా మిగిలిన డబ్బులో రూ.5 లక్షలను కొలకలూరు ఆంధ్రాబ్యాంకు, తెనాలి స్టేట్‌బ్యాంకులో వేసుకుని, లక్ష రూపాయలను తన దగ్గర ఉంచుకొన్నాడు. పాస్టరుకు పింఛను ఇప్పిస్తానని దళితవాడకే చెందిన టీడీపీ స్థానిక ప్రజాప్రతినిధి భర్త ఆరుంబాక రాజేష్ ఆశ చూపాడు. ఆధార్ కార్డు, బ్యాంకు పుస్తకాలు తీసుకున్నాడు. ఖాతాలో డబ్బు ఉన్నట్టు తెలుసుకుని, సంబంధించిన ఏటీఎం కార్డులను కాజేసి, రోజుకు కొంత చొప్పున నగదును ఏటీఎంల నుంచి డ్రా చేశాడు. ఏటీఎం కార్డులు కనిపించక ఆందోళన చెందిన పాస్టరు సుబ్బారావు బ్యాంకుకు వెళ్లి వాకబు చేశాడు. ఏటీఎంల నుంచి మొత్తం తీశేశారని తెలుసుకుని నిర్ఘాంతపోయాడు. ఈనెల 20వ తేదీన రూరల్ పోలీస్‌స్టేషనుకు వెళ్లి ఎస్ఐకు ఫిర్యాదుచేయగా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు రాసిచ్చి, బ్యాంకు స్టేట్మెంట్లు తీసుకురమ్మని పురమాయించారు. మరుసటిరోజు గ్రామంలోని ఆంధ్రాబ్యాంకుకు వెళ్లి స్టేట్మెంటు తీసుకున్నాడు. ఈ విషయాన్ని బ్యాంకు మేనేజరు శ్రీనివాస్ ధ్రువీకరించారు. ఇతర డాక్యుమెంట్లను సమకూర్చుకుని మంగళవారం తెనాలి వెళ్లేందుకు సిద్ధమైన సుబ్బారావు శవమై కనిపించాడు. బ్యాంకు నుంచి తీసుకున్న స్టేట్మెంట్లు కూడా మాయం అయ్యాయి. పర్సులో రూ.7 వేల నగదు అలాగే ఉంది. పోలీసు జాగిలం, ఆ పరిసరాల్లోనే కొద్దిసేపు తిరిగింది. టీడీపీ స్థానిక ప్రజాప్రతినిధి భర్త ఆరుంబాక రాజేష్ తన తండ్రికి చెందిన బ్యాంకు ఖాతా నుంచి రూ.5.50 లక్షలు ఏటీఎంల ద్వారా తీసుకున్నారని, అతడే తన తండ్రిని హత్య చేసి ఉంటాడని సుబ్బారావు కుమార్తె కోడూరు శారాకుమారి లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందజేశారు. పోలీసులు టీడీపీకి కొమ్ముకాస్తున్నారు–అన్నాబత్తుని శివకుమార్ ఫిర్యాదు ఇచ్చినా నమోదు చేసుకోకుండా పోలీసులు ప్రదర్శించిన అలసత్వమే పాస్టరు ఉన్నం సుబ్బారావు హత్యకు దారితీసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెనాలి సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ ఆరోపించారు. ఇందులో అధికార పార్టీ స్థానిక నేతల హస్తముందని, పోలీసు అండ చూసుకొనే హత్యకు కూడా పూనుకున్నారని ఆరోపించారు.సుబ్బారావు హత్య కేసులో నిజమైన నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ తరఫున న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. -
రోడ్డు ప్రమాదంలో పాస్టర్ మృతి
జహీరాబాద్ టౌన్: మండలంలోని కొత్తూర్(బి) ట్రైడెంట్ చెక్కెర కర్మగారం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పిచరాగడికి చెందిన పాస్టర్ మృతి చెందినట్లు జహీరాబాద్ రూరల్ ఎస్ఐ. శ్రీకాంత్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం..కోహీర్ మండలం పిచరాగడికి చెందిన పసుల రాజు(45) న్యాల్కల్ మండలంలోని గంగ్వార్ చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం గంగ్వార్ నుంచి పిచరాగడికి మోటారు సైకిల్‌పై వెళ్తున్న క్రమంలో కొత్తూర్(బి) ట్రైడెంట్ కర్మాగారం గేటు ముందు కల్వర్ట వద్ద గుర్తు తెలియని వాహనం అతడి మోటార్ సైకిల్‌ను ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన పాస్టర్ అక్కడిక్కడే మృతి చెందాడు. భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ. శ్రీకాంత్ తెలిపారు. -
విద్యుత్‌షాక్‌తో కెనడా పాస్టర్ మృతి
కొత్తగూడెంరూరల్: భద్రాద్రి జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో శుక్రవారం విద్యుత్ షాక్‌తో కెనడా దేశానికి చెందిన ఒక పాస్టర్ మృతిచెందారు. అతడిని కాపాడబోయిన మరో పాస్టర్కు గాయాలయ్యాయి. కెనడాకు చెందిన సాల్మన్, నేతన్ పాస్టర్లను కొత్తగూడేనికి చెందిన జాన్ జోసఫ్ విజిటింగ్ వీసా మీద భారతదేశానికి పిలిపించారు. శుక్రవారం గుడ్‌ఫ్రైడే సందర్భంగా సాల్మన్, నేతన్లు దేవుని సందేశాలను బోధించారు. అనంతరం జాన్ జోసఫ్‌కు చెందిన ఒక భవనంలో వీరిద్దరికీ వసతి కల్పించారు. సాల్మన్ ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీలో నిల్చుని ఉండగా, పక్కనున్న 11 కేవీ విద్యుత్ వైరుకు ప్రమాదవశాత్తు చేయి తగిలింది. దీంతో ఆయన షాక్‌కు గురయ్యారు. సాల్మన్‌ను కాపాడేందుకు నేతన్ వెళ్లగా, ఆయనకు సైతం విద్యుత్ షాక్ తగిలింది. ఈ ఘటనలో సాల్మన్ మృతి చెందగా, నేతన్ కొత్తగూడెంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు -
బాలికపై చర్చి పాస్టర్ అత్యాచారయత్నం
♦ ఆలస్యంగా వెలుగుచూసిన వైనం ♦ పోలీసుల అదుపులో కామాంధుడు రేణిగుంట : ప్రజలకు మంచిని బోధించే పాస్టర్ బుద్ధి వక్రమార్గం పట్టింది. ఒక బాలికపై అఘాయిత్యానికి ప్రయత్నించిన సంఘటన రేణిగుంట మండలంలో ఆలస్యంగా వెలుగుచూసింది. స్థాని కుల కథనం మేరకు.. రేణిగుంట మండలం కుర్రకాల్వ పద్మానగర్‌లో నివాసముంటున్న చర్చి పాస్ట ర్ పన్నీరు సెల్వం (54) నాలుగు రోజుల క్రితం తన ఇంటి సమీపంలో ఉం టున్న ఒక బాలిక(12)ను మాయమాటలతో ఇంటిలోకి తీసుకెళ్లాడు. ఆమెతో మత్తు మందు కలిపిన శీతల పానీయాన్ని తాగించి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. ఇంతలోనే బాలిక తేరుకుని కేకలు వేయడంతో స్థానికులు కామాంధునికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. గాజులమండ్యం పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడు పన్నీరుసెల్వంను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలికను చికిత్స నిమిత్తం తిరుపతి రుయాకు తరలించినట్టు రేణిగుంట డీఎస్పీ నంజుండప్ప తెలిపారు. బాలికపై కన్నేసిన కామాంధుడు మూడు నెలలుగా కోరిక తీర్చమని వేధిస్తున్నట్లు సమాచారం -
వజ్రాలు దొరికాయ్!
-
వజ్రాలు దొరికాయ్!
ఫ్రీటౌన్: అకస్మాత్తుగా అదృష్టం కలిసిరావడమంటే ఇదే... సియెర్రా లియోన్‌లోని మైన్స్‌లో పనిచేసే ఓ పాస్టర్కు 706 క్యారెట్ల భారీ వజ్రం దొరికింది. ఇప్పటిదాకా దొరికిన అతిపెద్ద వజ్రాల్లో ఇది పదో వజ్రమని చెబుతున్నారు. ఇక్కడి కొనొ ప్రాంతంలో వజ్రాల కోసం వెతుకుతూ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వచ్చినవారిలో పాస్టర్ ఇమ్మాన్యుయేల్ మొమో ఒకరు. తనకు దొరికిన వజ్రాన్ని ప్రభుత్వానికి పన్ను చెల్లించిన తర్వాత అధికారికంగా విక్రయిస్తానని మొమో తెలిపారు. నాలుగు శాతం సొమ్మును తీసుకొని ప్రభుత్వమే అధికారికంగా దీనికి విలువ కూడా కడుతుందని, ఆ తర్వాత వజ్రాన్ని విక్రయించుకునేందుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని అనుమతులను ఇస్తుందని, అప్పుడే అమ్మకానికి పెడతానని మొమో చెబుతున్నాడు. 14 ఏళ్ల కుర్రాడికి కూడా.. ఇదిలాఉండగా అర్కాన్సాస్‌కు చెందిన ఓ బాలుడికి కూడా 7.44 క్యారెట్ల అరుదైన వజ్రం దొరికింది. ఇక్కడి స్టేట్ పార్క్ వజ్రాలకు ఫేమస్. దీంతో పార్క్‌లో వజ్రాల కోసం వెతికేందుకు వచ్చిన ప్రతిఒక్కరి దగ్గర 10 డాలర్ల సొమ్మును రుసుముగా వసూలు చేస్తారు. వజ్రాలు దొరుకుతాయనే ఆశతో కాకపోయినా సరదాగా విహరించేందుకు కూడా ఇక్కడికి చాలా మంది వస్తుంటారు. అలా వచ్చినవారిలో 14 ఏళ్ల క్యాలెల్ లాంగ్‌ఫోర్డ్‌ను ఈసారి అదృష్టం వరించింది. గోధుమ రంగులో కనిపించిన ఓ రాయిని చేతిలోకి తీసుకున్న లాంగ్‌ఫోర్డ్.. సాధారణ రాయి కాదని గుర్తించి, తండ్రికి చెప్పడంతో చివరకు అది ఓ అరుదైన వజ్రమని తేలింది. అయితే ఇప్పటిదాకా ఈ పార్కులో దొరికిన 75000 వజ్రాల్లో ఇది ఏడో అతిపెద్ద వజ్రమని చెబుతున్నారు. అరుదైనది కావడంతో దీని విలువ సాధారణ వజ్రాల కంటే ఎక్కువే ఉంటుందని అంచనావేస్తున్నారు. -
కర్ర, కరెంటు వైరుతో బాలుడికి చిత్రహింసలు
మిన్నెసోటా: పన్నెండేళ్ల బాలుడిని ఓ పాస్టర్ క్రూరంగా హింసించాడు. ఈ సంఘటన అమెరికాలోని మిన్నెసోటా నగరంలో వెలుగు చూసింది. తన నమ్మకాన్ని కాదన్నందుకే బాలుడిని పాస్టర్ హింసించాడని పోలీసులు తెలిపారు. పాస్టర్ డాంగ్ వూక్(51) చర్చికి వచ్చిన బాలుడిని బంధించినట్లు చెప్పారు. ఆ తర్వాత కర్ర, ఎలక్ట్రిక్ వైర్లతో నాలుగు రోజుల పాటు చిత్రహింసలు పెట్టినట్లు వెల్లడించారు. అతని చెర నుంచి ఎలాగోలా తప్పించుకున్న బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దేవుడు ప్రత్యక్షం కావడానికే తనను హింసిస్తున్నానని పాస్టర్ చెప్పినట్లు పేర్కొన్నాడు. నాలుగు రోజుల పాటు తనను దారుణంగా కొట్టి హింసించినట్లు తెలిపాడు. కాగా, పాస్టర్ తనయుడు జో సియోగ్ కిమ్(19) కూడా వేరొకరిని వేధించిన కేసులో ఏడాది క్రితం అరెస్టయ్యాడు. -
దేవుని భయమూ ఉండాలి!
పాస్టర్గారు చర్చిలో ప్రసంగం చేస్తున్నారు. చర్చి బయట గుమ్మానికి ఒకవైపు యేసుక్రీస్తు బొమ్మలు, మరోవైపు సాతాను బొమ్మలు పెట్టి ఆ రెండింటిలో ఒకటి పట్టుకొమ్మంటే మీరు దేన్ని తీసుకుంటారు? అని ఆయన ప్రశ్నించారు. యేసుప్రభువు బొమ్మ.. కావాలన్నారంతా! ‘ఒకవేళ యేసుక్రీస్తుది చెక్కబొమ్మ, సాతానుది బంగారం బొమ్మ అయితే దేన్ని తీసుకుంటారు?’ అని అడిగారాయన. చర్చిలో అంతా నిశ్శబ్దం. జవాబు అర్థమైంది. దేవుని ప్రేమను, గొప్పదనాన్ని విశ్వాసి జీవనశైలి ద్వారానే లోకం స్పష్టంగా తెలుసుకుంటుంది. అందుకే క్రియలు లేని విశ్వాసం మృతప్రాయం అంటుంది బైబిలు (యాకోబు2:17). ధనప్రలోభంతో విశ్వాస భ్రష్టులైన ఆదిమ కాలపు భార్యాభర్తలు అననీయ, సప్పీర. యేసు ఉంటే చాలనుకున్న నాటి చాలామంది విశ్వాసులు తమ ఆస్తులమ్మి ఆ డబ్బంతా తెచ్చి అపొస్తలుల పాదాల వద్ద పెడుతున్న రోజులవి. అననీయ, సప్పీర కూడా తమ పొలం అమ్మారు. కాని దాంట్లో కొంత దాచుకొని మిగిలిన మొత్తం తెచ్చిచ్చారు. పొలాన్ని మీరింతటే అమ్మారా అని పేతురు ప్రశ్నిస్తే అంతకే అమ్మామంటూ ఇద్దరూ కూడబలుక్కొని మరీ అబద్ధమాడారు. అంతే! దేవుని ఉగ్రతకు లోనయ్యారు. దేవుడంటే భక్తి మాత్రమే కాదు. దేవుని భయమూ ఉండాలి. దేవుని కోసం వారు పొలం అమ్మి తమ భక్తిని చాటుకున్నారు. కాని అందులో కొంత దొంగిలించి తమది దేవుని భయం కరువైన దొంగభక్తి అని రుజువు చేసుకున్నారు. అర్పణలు, ఆరాధనలు, పాటలు, ప్రార్థనలు, ప్రసంగాలు, సాక్ష్యాలు ఇవన్నీ భక్తితో ముడిపడిన అంశాలు. అయితే జీవితంలో యథార్థత, సచ్ఛీలత దేవుని భయంతో ముడిపడిన అంశాలు. కుటుంబావసరాల కోసం పొలం అమ్మి ఉంటే అందులో దేవునికి మేమేమీ ఇవ్వలేమని తెలిసి ఉంటే అసలు సమస్యే లేదు. కాని ఆదిమ సంఘంలో దేవునికి ధారాళంగా ఇస్తున్న చాలామంది కంటే ఆత్మీయంగా తాము తక్కువేమీ కాదని గొప్పలు చెప్పుకునేందుకు పొలం అమ్మగా వచ్చిన డబ్బంతా ఇస్తున్నామని అబద్ధం చెప్పారు. కాని ‘ఆత్మీయత’ను నటించబోయి, తమ జీవితాన్ని నాశనం చేసుకున్నారు వారు. దేవునికి ఎంతో హేయమైననది వేషధారణ! కరడుకట్టిన పాపుల పట్ల కూడా యేసుక్రీస్తు కరుణ చూపించాడు. కాని పరిసయ్యల వంటి వేషధారులను సున్నం కొట్టిన సమాధుల్లారా! అంటూ ఎంతో పరుషమైన పదజాలంతో సంబోధించాడు. అననీయ, సప్పీరా లేని ఆత్మీయతను చూపించుకునే గొప్పలకు పోయి చరిత్రహీనులయ్యారు. సమాజంలోని అన్ని రంగాల్లోనూ పదార్థవాదం (మెటీరియలిజం) ప్రబలి డబ్బే కేంద్రంగా సాగుతున్న ‘అధర్మయుగం’లో మనం జీవిస్తున్నాం. దేవుడు మనను చూడడులే అనుకున్నారు వారిద్దరూ. దేవుడు చూడటమే కాదు అక్కడికక్కడ తక్షణ తీర్పునిచ్చి తన ఉగ్రతను బయలుపర్చాడు! ధనంతో నిమిత్తం లేని నిష్కల్మషమైన దేవుని ప్రేమ బీద, గొప్ప తేడా లేకుండా అందరినీ తన వద్దకు ఆకర్షిస్తుంది. ఇది తిరుగులేని వాస్తవం. దేవుని పట్ల యథార్థత కలిగిన విశ్వాసులు, కుటుంబాలు, చర్చిలు ధనాపేక్షకు, ప్రలోభాలకు అతీతంగా ఉంటారు. - రెవ.టి.ఎ.ప్రభుకిరణ్ -
గాడ్ గా మారిన గ్యాంగ్‌స్టర్!
ఒకప్పుడు అది బార్..జపాన్ రాజధాని టోక్యో శివార్లలోని కవాగుచి నగరంలో ఆ బార్ ఉంటుంది. దాని పేరు ఇప్పుడు 'జూన్ బ్రైడ్'గా మారింది. బయటినుంచి చూస్తే ఈ బార్ ఉన్న భవనం పెద్దగా ఏమీ మారలేదు. కానీ లోపలికి వెళ్లి చూస్తేనే.. ఎంతో మార్పు కనిపిస్తుంది. ఒకప్పుడు బార్ గర్ల్స్ నృత్యాలు చేసే ప్రదేశంలో ఇప్పుడు చక్కని ప్రశాంతమైన వేదిక ఉంటుంది. దాని ఎదురుగా వరుసలో పేర్చిన కూర్చీలు అందంగా కనిపిస్తాయి. చుట్టూపక్కల ప్రజలు మౌనంగా ఆ విశాలమైన గదిలోకి వచ్చి కూర్చుంటారు. ఇందులోని చాలామంది ఒకప్పుడు ఈ బార్ కు తాగడానికి వచ్చేవాళ్లు. కానీ ఇప్పుడు అందుకు రాలేదు. ఇప్పుడు వాళ్లకు ఇదొక ఆధ్యాత్మిక ధామం. భక్తి, ముక్తి గురించి గురుబోధనలు విని పులకించే ప్రదేశం. ఇంతలోనే వారందరూ గురువుగారు అని పిలుచుకునే సెన్సీ తాత్సుయా షిండో రానే వచ్చారు. ప్రసన్నవదనంపై చిరు దరహాసం, ఎదురుగా కూచ్చున్న భక్తుల కళ్లలో వెలుగు. అతీతమైన శక్తి కూడగట్టుకొని భక్తి, ఆధ్యాత్మిక బోధనలను షిండో చేస్తుంటే ఎదురుగా ఉన్నవారు తన్మయత్వంలో మునిగిపోయారు. 44 ఏళ్ల షిండో చూడటానికి చిన్న వయస్కుడిగానే కనిపిస్తారు. ముఖంపై చెరుగని చిరునవ్వు. చుట్టూ వందమంది శిష్యులు. ఎప్పుడు ఛలోక్తులు విసురుతూ నవ్వుతూ కనిపిస్తారు. తన చీకటి గతం గురించి కూడా జోకులు వేస్తుంటారు. 'ఒకప్పుడు మేం శత్రువులం. ఒకరినొకరు కాల్చుకునేవాళ్లం. ఇప్పుడు మేమంతా కలిసి ఒకే దేవుడిని స్తుతిస్తున్నాం' అంటారు షిండే. ఇప్పుడు పాస్టర్ గా మారి ఆధ్యాత్మిక వేత్త అయిన షిండే ఒకప్పుడు గ్యాంగ్ స్టర్. 17 ఏళ్ల ప్రాయంలోనే క్రూరమైన జపనీస్ మాఫియా ప్రపంచం 'యాకుజా'లోకి ఆయన అడుగుపెట్టారు. ఇప్పుడు తన శిష్యులుగా ఉన్న పలువురు ఒకప్పటి తన మాఫియా గ్యాంగ్ లో అనుచరులే. మాఫియాలో విచ్చలవిడి ధనం సంపాదించే అవకాశముండటం, విలాసవంతమైన జీవితం, అందాలపై వ్యామోహం తనను అటువైపు నడిపించాయని, యుక్తప్రాయంలో చెడ్డవ్యక్తులే తనకు హీరోలుగా కనిపించేవారని ఆయన గుర్తుచేసుకుంటారు. కటోరమైన నేర ప్రపంచమైన యాకుజా పట్ల టీనేజ్ యువత పెద్ద సంఖ్యలో ఆకర్షితులయ్యేవాళ్లు. చెల్లాచెదురైన ఇతర కుటుంబాల నుంచి వచ్చిన యువతలాగే షిండో కూడా ఈ మాఫియాకు ఆకర్షితుడయ్యాడు. ఈ చీకటి ప్రపంచంలోని వ్యక్తుల విధేయత, సోదరభావం ఉండేది. అయితే, ఈ అండర్ వరల్డ్ లోకి లోతుగా వెళ్లేకొద్ది తాను చెల్లిస్తున్న రక్తపు మూల్యం అతనిపై తీవ్ర ప్రభావం చూపింది. 'నా బాస్ హతమయ్యాడు. ఆధిపత్య పోరాటంలో ప్రజలు పెద్దసంఖ్యలో చనిపోయారు. కాళ్లూ,చేతులు కోల్పోయారు. నాతోపాటు మాదక ద్రవ్యాల వ్యాపారం చేసిన ఓ వ్యక్తి మత్తుమందు బారిన పడి చనిపోయాడు. ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయి. ఎన్నో మరణాలు,ఆకస్మిక మరణాలు చూశాను. నా మార్గదర్శిని కూడా నా కళ్లెదుటే పొడిచి చంపారు' అని షిండో తన గతాన్ని గుర్తుచేసుకుంటారు. 22 ఏళ్ల ప్రాయంలోనే పలుసార్లు అరెస్టయి మూడుసార్లు జైలుపాలైన షిండో జీవితంలో క్రమంగా పరివర్తన మొదలైంది. 32 ఏళ్ల వయస్సులో ఓ సహచర వ్యక్తితో ఓ ఏడెనిమిదేళ్లు గడిపారు. ఈ ఏకాంతవాసంలో బైబిల్ చదువుతుండగా తనకు దేవుడు దర్శనమిచ్చాడని ఆయన చెప్తారు. అలా ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతూ.. ఆధ్మాత్మిక బోధనలు చేస్తూ ఒక దశాబ్దకాలంగా ఆయన దేవుడి మనిషిగా మారిపోయారు. ఆయన నమ్మకస్తులైన అనుచరులు ఆయనను దేవుడిగానే కొలుస్తారు. ప్రతి ఏడాది ఆయన ఆధ్మాత్మిక బోధనలు వినే భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇటీవల యాకుజా మాజీ సభ్యుడు, మాజీ గ్యాంగ్ స్టర్ హిరో కూడా తాజాగా ఆయన శిష్యుడిగా మారిపోయాడు. ఐదేళ్లు అజ్ఞాతంలో ఉన్న గ్యాంగ్ స్టర్ హిరో ఇప్పుడు పూర్తిగా ఆధ్మాత్మిక బాట పట్టారు. ఒకప్పుడు జపాన్ లో బలంగా ఉన్న అండర్ వరల్డ్ ప్రపంచం యాకుజా కూడా ఇటీవలికాలంలో క్రమంగా క్షీణించిపోతున్నది. -
మతబోధకుడికి జీవితఖైదు
ప్యోంగ్ యాంగ్: దక్షిణ కొరియా, అమెరికాల సహకారంతో దేశంలో అలజడులు సృష్టించి, ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నించాడన్న ఆరోపణలపై ఓ మత గురువుకు జీవితఖైదు విధించింది ఉత్తరకొరియా. 60 ఏళ్ల హెయాన్ సూ లిమ్ అనే మతబోధకుడు.. గడిచిన 18 ఏళ్లుగా వరుస కుట్రలు పన్నుతూ ఉత్తర కొరియాను ఆగంపట్టించేందుకు ప్రయత్నించాడని, నేరం నిరూపణ అయినందున జీవితఖైదు విదించినట్లు ప్యోంగ్ యాంగ్ ప్రభుత్వ వర్గాలు బుధవారం ప్రకటించాయి. -
పాస్టర్ కుమారుడిని ఎత్తుకెళ్లిన మావోయిస్టులు
మావోయిస్టులు తూర్పు గోదావరి జిల్లాకి చెందిన ఓ చర్చి పాస్టర్ కుమారుడిని కిడ్నాప్ చేశారు. ఫాదర్ కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... లక్ష్మీపురం చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తున్న ఊకే కన్నయ్య ఇంటికి శుక్రవారం అర్ధరాత్రి సుమారు వంద మంది సాయుధ మావోయిస్టులు వచ్చారు. ఇంటి తలుపులు ఆయుధాలతో పగులగొట్టి కొందరు లోపలికి ప్రవేశించారు. అక్కడ నిద్రిస్తున్న యువకులను నిద్ర లేపి.. పాస్టర్ కన్నయ్య ఎవరని ప్రశ్నించారు. కన్నయ్య దేవుని సువార్త చెప్పడానికి ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా ప్రాంతానికి వెళ్లారని వారు చెప్పారు. మావోయిస్టుల్లో ఒకరు ఓ యువకుడిని కన్నయ్య పెద్ద కుమారుడు ఇస్సాకు అని గుర్తించారు. ఇస్సాకు కళ్లకు గంతలు, చేతులకు తాళ్లు కట్టి వెంట తీసుకువెళ్లారు. అడ్డుకోబోయిన కుటుంబసభ్యులను పక్కకు నెట్టి, కన్నయ్యను తమ వద్దకు రమ్మని చెప్పాలని హెచ్చరించారు. ఈ ఘటనతో లక్ష్మీపురం గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కన్నయ్య అలియాస్ ఏలియా 13 ఏళ్ల క్రితం ఛత్తీస్‌గఢ్‌లోని మైత ప్రాంతం నుంచి లక్ష్మీపురం వలస వచ్చి, న్యూ బెతస్త ట్రైబల్ మినిస్ట్రీని స్థాపించారు. ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో 52 చర్చిలు ఏర్పాటు చేసి గిరిజనులకు క్రీస్తు బోధనలు చేస్తున్నారు. గిరిజనుల మత మార్పిడులపై మావోయిస్టులు పలుమార్లు కనకయ్యను హెచ్చరించారు. గత ఏడాది కూడా కనకయ్యను అపహరించడానికి ఇంటికి వచ్చినట్లు సమాచారం. అప్పట్లో కనక్క మావోయిస్టులకు దొరక కుండా తప్పించుకుని పారిపోయారు. దీంతో మరో సారి మావోయిస్టులు కనకయ్యను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. ఆయన లేకపోవడంతో కుమారుడిని పట్టుకుపోయారని కుటుంబసభ్యులు చెపుతున్నారు. కాగా మతమార్పిడుల కారణంగానే కన్నయ్యపై మావోయిస్టులు ఆగ్రహంతో ఉన్నారని తెలిసిందని పోలీసులు కూడా చెపుతున్నారు. -
పదో తరగతి చదివే సమయంలో లొంగదీసుకుని..
చింతగట్టు(హసన్‌పర్తి) : ఓ విద్యార్థిని పదో తరగతి చదివే సమయంలో లొంగదీసుకున్నాడో ప్రబుద్ధుడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి విందులు, వినోదాలకు తీసుకెళ్లాడు. నాలుగేళ్లుగా వెంట తిరిగి.. చివరికి ఇప్పుడు తనకేమి సంబంధం లేదని ముఖం చాటేయడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రరుుంచింది. బాధితురాలి కథనం ప్రకారం.. చింతగట్టు శివారులోని సుభాష్ నగర్‌కు చెందిన మేకల అనూష, అదే ప్రాంతానికి చెందిన నద్దునూరి అనిల్ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో అనిల్ హైదరాబాద్‌లో రెండేళ్లు పాస్టర్‌గా శిక్షణ పొందాడు. ఆ సమయంలోనూ తాను తరచూ హైదరాబాద్ వెళ్లేదానినని అనూష తెలిపింది. శిక్షణ పూర్తరుున తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించిన అతడు.. తీరా శిక్షణ పూర్తరుున తర్వాత పెళ్లి మాటెత్తితే దాట వేస్తూ వచ్చాడు. గత మూడు నెలలుగా ఫోన్ చేయడం మానేశాడు. మూడు రోజుల క్రితం ఫోన్ చేసి పెళ్లి గురించి అడగగా.. సమాధానం చెప్పకుండా సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ చేశాడని చెప్పింది. దీంతో తాను పోలీసులను ఆశ్రయించినట్లు వివరించింది. అరుుతే అతడిపై కేసు పెట్టొద్దని.. ఎలాగైనా పెళ్లి జరిపించేలా చూడాలని అనూష వేడుకుంటోంది. కొలిక్కిరాని పంచారుుతీ అనూష ఫిర్యాదుతో పోలీసులు ఇరువురిని పిలిచి సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఇరువర్గాల పెద్దలు కూర్చుని సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు. నాలుగు గంటలపాటు ఇరువైపుల పెద్దల మధ్య వాదోపవాదాలు జరిగాయి. అయినా సమస్య కొలిక్కిరాలేదు. దీంతో బాధితురాలు తనకు న్యాయం చేయాలని కోరుతూ దీక్షకు దిగింది. అతడి ఇంటి ముందు టెంట్ వేసి కూర్చోగా.. స్థానిక మహిళలు ఆమెకు అండగా నిలిచారు. -
పాస్టర్‌పై దాడి ఘటనను ఖండించిన క్రైస్తవులు
వికారాబాద్, న్యూస్‌లైన్: వికారాబాద్ సియోన్ చర్చి పాస్టర్ సంజీవులుపై దాడికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు ఏ.చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. శుక్రవారం రాత్రి సియోన్ చర్చిలో గుర్తుతెలియని దుండగులు పాస్టర్ సంజీవులపై కత్తులతో దాడి చేసి హత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. దాడిని నిరసిస్తూ ఆదివారం క్రైస్తవులు వికారాబాద్‌లోని సియోన్ చర్చి నుంచి పట్టణంలోని ఎంఆర్పీ, బీజేఆర్, ఎన్టీఆర్ చౌరస్తాల మీదుగా భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎస్పీ కార్యాలయం ఎదుట రహదారిపై ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా నిందుతులను వెంటనే శిక్షించాలని నినాదాలు చేశారు. అనంతరం జిల్లా ఎస్పీ రాజకుమారికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. పాస్టర్‌పై దాడి చేసిన దుండగులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులు దురదృష్టకరం అన్నారు. ఎస్పీ రాజకుమారి మాట్లాడుతూ.. పాస్టర్‌పై దాడికి పాల్పడిన వారిని గుర్తించి అరెస్టు చేసేందుకు ఇప్పటికే ముగ్గురు సీఐలతో మూడు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దుశ్చర్యను అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు సంయమనం పాటించి సహకరించాలని కోరారు. త్వరలో నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని ఆందోళనకారులకు హామీ ఇచ్చారు. ఘటనలో ప్రస్తుతం ఎవరూ సాక్షులు లేరని, పాస్టర్ భార్య ఓ దుండగుడిని చూసిందని, ఆమె ప్రస్తుతం షాక్‌లో ఉందన్నారు. ప్రజలు వదంతులను నమ్మొద్దని ఎస్పీ రాజకుమారి సూచించారు. శాంతియుతంగా ఉండి కేసు దర్యాప్తునకు సహకరించాలని సూచించారు. అనంతరం పలువురు పాస్టర్లు మాట్లాడుతూ.. దుండుగులు ఇలాంటి దాడులకు పాల్పడడం హేయమని అన్నారు. పాస్టర్‌పై దాడి చేసిన దుండగులను పోలీసులు ఇప్పటివరకు గుర్తించకపోవడం దురదృష్టకరమని చెప్పారు. పాస్టర్లు నీతిని ప్రభోదిస్తారని, వారికి కీడు చేయడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో ఫాస్టర్లు రెవరెండ్ కృపావరం, హైకోర్టు న్యాయవాది శ్రీని సుందర్, ఎలియాజర్, ఏసుదాసు, కృపానందరావు, సుదర్శన్, జైపాల్, రవి, జోసెఫ్, సైనస్, జె. ఎలియాజర్, కుమార్, దేవదాసు, మోహన్, దేవదానం, ఉదయ్‌కుమార్, ప్రవీణ్, దేవదాసు తదితరులు ఉన్నారు. స్తంభించిన ట్రాఫిక్ పాస్టర్‌పై జరిగిన దాడిని నిరసిస్తూ క్రైస్తవులు ఎస్పీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలపడంతో భారీగా ట్రాఫిక్ దాదాపు అర్ధగంట సేపు పూర్తిగా స్తంభించింది. అనంతరం పోలీసులు వాహనాలను నియంత్రించారు.