వజ్రాలు దొరికాయ్!
ఫ్రీటౌన్: అకస్మాత్తుగా అదృష్టం కలిసిరావడమంటే ఇదే... సియెర్రా లియోన్‌లోని మైన్స్‌లో పనిచేసే ఓ పాస్టర్‌కు 706 క్యారెట్ల భారీ వజ్రం దొరికింది. ఇప్పటిదాకా దొరికిన అతిపెద్ద వజ్రాల్లో ఇది పదో వజ్రమని చెబుతున్నారు. ఇక్కడి కొనొ ప్రాంతంలో వజ్రాల కోసం వెతుకుతూ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వచ్చినవారిలో పాస్టర్ ఇమ్మాన్యుయేల్ మొమో ఒకరు. తనకు దొరికిన వజ్రాన్ని ప్రభుత్వానికి పన్ను చెల్లించిన తర్వాత అధికారికంగా విక్రయిస్తానని మొమో తెలిపారు. నాలుగు శాతం సొమ్మును తీసుకొని ప్రభుత్వమే అధికారికంగా దీనికి విలువ కూడా కడుతుందని, ఆ తర్వాత వజ్రాన్ని విక్రయించుకునేందుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని అనుమతులను ఇస్తుందని, అప్పుడే అమ్మకానికి పెడతానని మొమో చెబుతున్నాడు.
14 ఏళ్ల కుర్రాడికి కూడా..
ఇదిలాఉండగా అర్కాన్సాస్‌కు చెందిన ఓ బాలుడికి కూడా 7.44 క్యారెట్ల అరుదైన వజ్రం దొరికింది. ఇక్కడి స్టేట్ పార్క్ వజ్రాలకు ఫేమస్. దీంతో పార్క్‌లో వజ్రాల కోసం వెతికేందుకు వచ్చిన ప్రతిఒక్కరి దగ్గర 10 డాలర్ల సొమ్మును రుసుముగా వసూలు చేస్తారు. వజ్రాలు దొరుకుతాయనే ఆశతో కాకపోయినా సరదాగా విహరించేందుకు కూడా ఇక్కడికి చాలా మంది వస్తుంటారు. అలా వచ్చినవారిలో 14 ఏళ్ల క్యాలెల్ లాంగ్‌ఫోర్డ్‌ను ఈసారి అదృష్టం వరించింది. గోధుమ రంగులో కనిపించిన ఓ రాయిని చేతిలోకి తీసుకున్న లాంగ్‌ఫోర్డ్.. సాధారణ రాయి కాదని గుర్తించి, తండ్రికి చెప్పడంతో చివరకు అది ఓ అరుదైన వజ్రమని తేలింది. అయితే ఇప్పటిదాకా ఈ పార్కులో దొరికిన 75000 వజ్రాల్లో ఇది ఏడో అతిపెద్ద వజ్రమని చెబుతున్నారు. అరుదైనది కావడంతో దీని విలువ సాధారణ వజ్రాల కంటే ఎక్కువే ఉంటుందని అంచనావేస్తున్నారు.