మావోయిస్టులు తూర్పు గోదావరి జిల్లాకి చెందిన ఓ చర్చి పాస్టర్ కుమారుడిని కిడ్నాప్ చేశారు. ఫాదర్ కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... లక్ష్మీపురం చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తున్న ఊకే కన్నయ్య ఇంటికి శుక్రవారం అర్ధరాత్రి సుమారు వంద మంది సాయుధ మావోయిస్టులు వచ్చారు. ఇంటి తలుపులు ఆయుధాలతో పగులగొట్టి కొందరు లోపలికి ప్రవేశించారు. అక్కడ నిద్రిస్తున్న యువకులను నిద్ర లేపి.. పాస్టర్ కన్నయ్య ఎవరని ప్రశ్నించారు.
కన్నయ్య దేవుని సువార్త చెప్పడానికి ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా ప్రాంతానికి వెళ్లారని వారు చెప్పారు. మావోయిస్టుల్లో ఒకరు ఓ యువకుడిని కన్నయ్య పెద్ద కుమారుడు ఇస్సాకు అని గుర్తించారు. ఇస్సాకు కళ్లకు గంతలు, చేతులకు తాళ్లు కట్టి వెంట తీసుకువెళ్లారు. అడ్డుకోబోయిన కుటుంబసభ్యులను పక్కకు నెట్టి, కన్నయ్యను తమ వద్దకు రమ్మని చెప్పాలని హెచ్చరించారు.
ఈ ఘటనతో లక్ష్మీపురం గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కన్నయ్య అలియాస్ ఏలియా 13 ఏళ్ల క్రితం ఛత్తీస్‌గఢ్‌లోని మైత ప్రాంతం నుంచి లక్ష్మీపురం వలస వచ్చి, న్యూ బెతస్త ట్రైబల్ మినిస్ట్రీని స్థాపించారు. ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో 52 చర్చిలు ఏర్పాటు చేసి గిరిజనులకు క్రీస్తు బోధనలు చేస్తున్నారు.
గిరిజనుల మత మార్పిడులపై మావోయిస్టులు పలుమార్లు కనకయ్యను హెచ్చరించారు. గత ఏడాది కూడా కనకయ్యను అపహరించడానికి ఇంటికి వచ్చినట్లు సమాచారం. అప్పట్లో కనక్క మావోయిస్టులకు దొరక కుండా తప్పించుకుని పారిపోయారు. దీంతో మరో సారి మావోయిస్టులు కనకయ్యను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. ఆయన లేకపోవడంతో కుమారుడిని పట్టుకుపోయారని కుటుంబసభ్యులు చెపుతున్నారు. కాగా మతమార్పిడుల కారణంగానే కన్నయ్యపై మావోయిస్టులు ఆగ్రహంతో ఉన్నారని తెలిసిందని పోలీసులు కూడా చెపుతున్నారు.
పాస్టర్ కుమారుడిని ఎత్తుకెళ్లిన మావోయిస్టులు
Published Sat, Oct 31 2015 7:21 PM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM
Advertisement