kanakayya
-
Telangana University: రిజిస్ట్రార్ నియామకంలో మళ్లీ వివాదం
సాక్షి, నిజామాబాద్: తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ నియామకంలో మరోసారి వివాదం చోటుచేసుకుంది. ఈసీ సమావేశంలో రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ యాదగిరి నియామకయ్యారు. ఈ నేపథ్యంలో వీసీ రవీందర్ స్పందిస్తూ రిజిస్ట్రార్‌ను నియమించే అధికారం ఈసీకి లేదన్నారు. దీంతో, రిజిస్ట్రార్ కుర్చీలో ప్రొ. కనకయ్యను వీసీ కూర్చెబెట్టారు. ఇదిలా ఉండగా.. అక్రమాలు, అవకతవకలకు పాల్పడిన తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్ రవీందర్ గుప్తాపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ పాలకమండలి ఏకవాక్య తీర్మానం చేసింది. గురువారం హైదరాబాద్‌లోని కొత్త సచివాలయంలో తెయూ 59వ పాలకమండలి సమావేశం జరిగింది. వీసీ హాజరు కాకపోవడంతో సమావేశానికి ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాకాటి కరుణ చైర్మన్‌గా వ్యవహరించారు. గత నెల 19, 26, ఈ నెల 5, 12వ తేదీల్లో వరుసగా నిర్వహించిన 55, 56, 57, 58 సమావేశాల్లో చేసిన తీర్మానాల విషయమై సమావేశంలో సమీక్షించారు. 60వ సమావేశాన్ని జూన్ 3న నిర్వహించాలని, అదేవిధంగా వర్సిటీకి రిజిస్ట్రార్‌గా యాదగిరిని కొనసాగించాలని నిర్ణయించారు. అయితే ఈ నెల 15న వర్సిటీలోని రిజిస్ట్రార్ గదికి తాళం తీయించకుండా చేయడంతో అప్పటి నుంచి రిజిస్ట్రార్ యాదగిరి ఆ చాంబర్‌కు రావడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి యాదగిరి కొనసాగింపు గురించి ప్రస్తావించారు. అయితే సమావేశానికి యాదగిరి హాజరు కాలేదు. ఇదిలా ఉండగా వీసీ వ్యవహారాలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. తగిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. పాలక మండలి సమావేశంలో సమీక్షించిన అంశాల్లో వీసీ అక్రమాలపై ఏసీబీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, పోలీసు కేసులు, ముగ్గురు రిజిస్ట్రార్ల నుంచి దుర్వినియోగమైన నిధుల రికవరీ, విద్యావర్ధిని సస్పెన్షన్, సర్వీసు పుస్తకాల టాంపరింగ్ అలాగే కనకయ్యపై పెట్టాల్సిన క్రిమినల్ కేసులు, బడ్జెట్, ఐదుగురు సభ్యుల బృందం చేయాల్సిన దర్యాప్తు తదితర అంశాలు ఉన్నాయి. ఈ సమావేశంలో ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్, పాలకమండలి సభ్యులు వసుంధరాదేవి, గంగాధర్‌గౌడ్, మారయ్యగౌడ్, రవీందర్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్, నసీమ్ పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: ఓవైపు విగ్రహాలకు అభిషేకం.. మరోవైపు ఈవో జలకాలాట -
ఆహారభద్రతే... ఆకలిచావులకు మందు!
కరోనా, అంతర్గత అస్థిర రాజకీయ పరిస్థితులు, కరువు కాటకాలు వంటి వాటివల్ల ప్రపంచంలో చాలా దేశాలలో ఆకలి చావులు అధికంగా ఉన్నాయనీ, కరోనా వైరస్ ప్రభావంతో పరిస్థితులు మరింత దిగజారాయనీ పేద రిక నిర్మూలన కోసం కృషి చేసే ‘ఆక్స్ ఫామ్’ సంస్థ వెల్లడించింది. ఆకలి కార ణంగా ప్రపంచంలో ప్రతి నిమిషానికి 11 మంది చనిపోతున్నారని ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే ఆకలితో మరణించిన వారి సంఖ్య ఆరు రెట్లు ఎక్కువగా వుంది అని అంచనా వేసింది. ఆ సంస్థ ‘ది హంగర్ ముల్టిప్లయిస్’ అనే పేరుతో నివేదికను విడుదల చేసింది. 2021 ఏడాది నివేదిక ప్రకారం ప్రపంచ జనాభాలో 10 శాతం జనాభా పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. 30 శాతం జనాభాకు తగిన ఆహారం దొరకడం లేదు. అదనంగా 11 కోట్ల మంది ప్రజలు ఆకలి కోరల్లో చిక్కుకోవడం, ప్రజా పంపిణీ వ్యవస్థ వైఫల్యం, లోపభూయిష్ఠమైన ఆహారభద్రత విధానం, నిరుద్యోగం, ఆహార కొరతల కారణంగా గత ఏడాదితో పోలిస్తే ఆకలితో మరణించిన వారి సంఖ్య అధికమవ్వడం వంటి విషయాలు ఈ నివేదిక వెల్లడించింది.. మన దేశంలో 2021–22లో 315 మిలియన్ టన్నుల రికార్డ్ స్థాయి ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగింది. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో భారత్ స్వయం సమృద్ధి దశకు చేరినా పోషకాహార లోపంతో బాధపడుతున్న జనాభా 2018లో 13.8 శాతం ఉండగా... 2020 నాటికి 15.3 శాతానికి పెరిగింది. ఆహారధాన్యాల ఉత్పత్తిలో మిగులు సాధించినప్పటికీ నిరుద్యోగం, పేదరికం వల్ల ప్రజల కొనుగోలు శక్తి ఆశించిన మేరకు పెరగలేదు. కొనుగోలు సామర్థ్యం కొరవడింది. పోషకాహారం లోపం వల్ల ఆకలి చావులు పెరుగుతున్నాయి. భారత్‌లో దాదాపు 14 శాతం ప్రజలు పోషకా హార లోపంతో, ఐదేళ్ల లోపు వయస్సున్న పిల్లలు 20 శాతం తక్కువ బరువుతో ఉన్నారు. 15–49 ఏళ్ల లోపు మహిళల్లో 52 శాతం రక్తహీనతతో సతమతమౌతు న్నారని అంచనాలు తెలుపుతున్నాయి. 2021 ప్రపంచ ఆకలి సూచీ జాబితాలో 116 దేశా లను చేర్చారు. ఇందులో భారతదేశం అట్టడుగున 101వ స్థానంలో ఉండటం విచారకరం. 2020లో భారతదేశం స్థానం 94 కాగా, 2021 నాటికి 101 స్థాయికి దిగజారింది. శ్రీలంక 65, బంగ్లాదేశ్ 76, పాకిస్తాన్ 92 స్థానాల్లో ఉండటం ఈ సందర్భంగా గమ నించాలి. ఆకలితో అల్లాడుతున్న ప్రజలు నివసించే ప్రాంతాలు గుర్తించి వారికి సకాలంలో ఆహార ధాన్యాలు అందించాలనీ, ఆకలితో ఎవ్వరూ చని పోకూడదనీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ చేసిన వ్యాఖ్యలైనా ప్రభుత్వాన్ని నిద్ర మేల్కొలుపు తాయేమో చూడాలి. ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత చట్టాన్ని అమలు చెయ్యాలి. ఆహార భద్రత అంటే బియ్యం, గోదుమలు ఇవ్వడం కాదు. దారిద్య్రరేఖకు కింద వున్నవారికి పౌష్టికాహారం అందించడం. అప్పుడే పేద వర్గాలలో ఆహార భద్రత కలుగుతుంది. ఆహార వ్యవసాయ సంస్థ ప్రకారం ప్రజలు ఆరోగ్య దాయక జీవితాన్ని పొందేందుకు అవసరమైన తగినంత సుర క్షిత పౌష్టికాహారం ప్రజలందరికీ అందించాలి. ప్రభుత్వ పంపిణీ విధానం ద్వారా పేదలకు ఆహార ధాన్యాలను సబ్సిడీ ధరలకు సరఫరా చేయాలి. అంగన్వాడీ పిల్లలకు పోషకాహారం సరఫరా చేయాలి. అణగారిన వర్గాలకు, గిరిజనులకు, మురికి వాడల్లో నివసించే వారికి ప్రభుత్వ పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాలు అందజేయాలి. అప్పుడే ప్రజలందరికీ ఆహార భద్రత చేకూరుతుంది. నేదునూరి కనకయ్య వ్యాసకర్త తెలంగాణ ఎకనామిక్ ఫోరం అధ్యక్షులు మొబైల్: 94402 45771 -
తెలంగాణ వర్సిటీ ఇన్చార్జి రిజిస్ట్రార్‌పై వేటు
సాక్షి, నిజామాబాద్: తెలంగాణ విశ్వవిద్యాలయంలో ప్రక్షాళన మొదలైంది. శనివారం ఉన్నత విద్యామండలి కమిషనర్ నవీన్ మిట్టల్ 5 గంటలపాటు పాలకమండలి సమావేశం నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అక్రమాలకు కేంద్ర బిందువుగా ఉన్న ఇన్చార్జి రిజిస్ట్రార్ కనకయ్యను ఆ పదవి నుంచి తప్పించారు. ఆయన స్థానంలో ప్రొఫెసర్ యాదగిరిని నియమించారు. పదేళ్ల అనుభవం అవసరమైన సీనియర్ ప్రొఫెసర్ పోస్టుకు కేవలం ఐదేళ్ల అనుభవం ఉన్న కనకయ్య తనకు తానే ఆర్డర్లు ఇచ్చుకుని, పాలకమండలి అప్రూవల్ అయినట్లుగా ప్రకటించుకొని యూజీసీ నిబంధనలను అతిక్రమించారని నవీన్ మిట్టల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్లికేషన్ చూపించమని అడిగినా కనకయ్య చూపించలేకపోయారు. దీంతో కనకయ్య సీనియర్ ప్రొఫెసర్ పోస్టుకు అనర్హుడని నవీన్ మిట్టల్ స్పష్టం చేశారు. కనకయ్యపై క్రమశిక్షణ చర్యల కోసం అప్పటికప్పుడే ఛార్జ్ మెమో తయారు చేశారు. అక్కడికక్కడే ప్రొ.యాదగిరికి రిజిస్ట్రార్‌గా ఛార్జ్ ఇప్పించి కనకయ్యను సమావేశం నుంచి బయటకు పంపించారు. అదేవిధంగా సీనియారిటీ లేని యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ నాగరాజును కూడా పాలకమండలి సమావేశం నుంచి నవీన్ మిట్టల్ బయటకు పంపారు. గత నెలలో అవుట్ సోర్సింగ్ విధానంలో చేపట్టిన 113 మంది అక్రమ నియామకాలను రద్దు చేస్తున్నట్లు వైస్ చాన్స్‌లర్ రవీందర్ గుప్తా ప్రెస్మీట్లో ప్రకటించారు. బోధన సిబ్బంది కొరత ఉన్న నేపథ్యంలో అన్నిరకాల డిప్యుటేషన్లను రద్దు చేసి అందరినీ వెనక్కు పిలవాలని మిట్టల్ ఆదేశించారు. నవంబర్ 1 నుంచి టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి బయోమెట్రిక్ కచ్చితంగా అమలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. నవంబర్ 27న హైదరాబాద్‌లో మరోసారి పాలకమండలి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అక్రమ నియామకాలు, ప్రమోషన్లు, ఇన్చార్జి రిజిస్ట్రార్ వ్యవహారాలపై ‘సాక్షి’లో వరుసగా ప్రచురితమైన కథనాలను కొందరు పాలకమండలి సభ్యులు బుక్లెట్ రూపంలో నవీన్ మిట్టల్‌కు అందించగా వీటిపై చర్చ జరిగింది. -
Muddasani Kanakaiah: మూగబోయిన పోరాట గొంతుక
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ జిల్లా కేంద్రంగా ప్రజా ఉద్యమాలు నిర్వహించి, పలు రాజకీయ పార్టీల్లో తనదైన ముద్ర వేసిన ముద్దసాని కనకయ్య(67) కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. శనివారం రాత్రి అక్కడే ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. 1970లో రాడికల్ ఉద్యమంలో ఆయన క్రియాశీలకంగా పని చేశారు. తర్వాత కాంగ్రెస్, బీఎస్పీ, టీఆర్ఎస్ పార్టీల్లో చురుకైన పాత్ర పోషించారు. విద్యార్థి ఉద్యమంలో అనేక నిర్బంధాలను ఎదుర్కొని, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమించారు. నాడు దొరల, భూస్వాముల, గడీల పాలనకు చరమగీతం పాడేందుకు విద్యార్థి ఉద్యమాన్ని నడిపారు. 1975 ఎమర్జెన్సీ కాలంలో మీసా చట్టం కింద అరెస్టయ్యారు. ప్రస్తుత ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్, మాజీ మేయర్ డి.శంకర్, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ లాంటి ప్రముఖులతో కలిసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. డీసీసీ ప్రధాన కార్యదర్శిగా, అర్బన్ బ్యాంక్ చైర్మన్‌గా పని చేశారు. ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీ సంతాపం.. ముద్దసాని కనకయ్య మృతి బాధాకరమని, ఎన్నో ఏళ్లు అనేక ఉద్యమాల్లో సహచరుడిగా ఉన్న ఆయన దూరమవ్వడం తాడిత, పీడిత ప్రజలకు తీరనిలోటని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్‌లు అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. -
పాస్టర్ కుమారుడిని ఎత్తుకెళ్లిన మావోయిస్టులు
మావోయిస్టులు తూర్పు గోదావరి జిల్లాకి చెందిన ఓ చర్చి పాస్టర్ కుమారుడిని కిడ్నాప్ చేశారు. ఫాదర్ కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... లక్ష్మీపురం చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తున్న ఊకే కన్నయ్య ఇంటికి శుక్రవారం అర్ధరాత్రి సుమారు వంద మంది సాయుధ మావోయిస్టులు వచ్చారు. ఇంటి తలుపులు ఆయుధాలతో పగులగొట్టి కొందరు లోపలికి ప్రవేశించారు. అక్కడ నిద్రిస్తున్న యువకులను నిద్ర లేపి.. పాస్టర్ కన్నయ్య ఎవరని ప్రశ్నించారు. కన్నయ్య దేవుని సువార్త చెప్పడానికి ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా ప్రాంతానికి వెళ్లారని వారు చెప్పారు. మావోయిస్టుల్లో ఒకరు ఓ యువకుడిని కన్నయ్య పెద్ద కుమారుడు ఇస్సాకు అని గుర్తించారు. ఇస్సాకు కళ్లకు గంతలు, చేతులకు తాళ్లు కట్టి వెంట తీసుకువెళ్లారు. అడ్డుకోబోయిన కుటుంబసభ్యులను పక్కకు నెట్టి, కన్నయ్యను తమ వద్దకు రమ్మని చెప్పాలని హెచ్చరించారు. ఈ ఘటనతో లక్ష్మీపురం గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కన్నయ్య అలియాస్ ఏలియా 13 ఏళ్ల క్రితం ఛత్తీస్‌గఢ్‌లోని మైత ప్రాంతం నుంచి లక్ష్మీపురం వలస వచ్చి, న్యూ బెతస్త ట్రైబల్ మినిస్ట్రీని స్థాపించారు. ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో 52 చర్చిలు ఏర్పాటు చేసి గిరిజనులకు క్రీస్తు బోధనలు చేస్తున్నారు. గిరిజనుల మత మార్పిడులపై మావోయిస్టులు పలుమార్లు కనకయ్యను హెచ్చరించారు. గత ఏడాది కూడా కనకయ్యను అపహరించడానికి ఇంటికి వచ్చినట్లు సమాచారం. అప్పట్లో కనక్క మావోయిస్టులకు దొరక కుండా తప్పించుకుని పారిపోయారు. దీంతో మరో సారి మావోయిస్టులు కనకయ్యను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. ఆయన లేకపోవడంతో కుమారుడిని పట్టుకుపోయారని కుటుంబసభ్యులు చెపుతున్నారు. కాగా మతమార్పిడుల కారణంగానే కన్నయ్యపై మావోయిస్టులు ఆగ్రహంతో ఉన్నారని తెలిసిందని పోలీసులు కూడా చెపుతున్నారు.