సాక్షి, నిజామాబాద్: తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ నియామకంలో మరోసారి వివాదం చోటుచేసుకుంది. ఈసీ సమావేశంలో రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ యాదగిరి నియామకయ్యారు. ఈ నేపథ్యంలో వీసీ రవీందర్ స్పందిస్తూ రిజిస్ట్రార్‌ను నియమించే అధికారం ఈసీకి లేదన్నారు. దీంతో, రిజిస్ట్రార్ కుర్చీలో ప్రొ. కనకయ్యను వీసీ కూర్చెబెట్టారు.
ఇదిలా ఉండగా.. అక్రమాలు, అవకతవకలకు పాల్పడిన తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్ రవీందర్ గుప్తాపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ పాలకమండలి ఏకవాక్య తీర్మానం చేసింది. గురువారం హైదరాబాద్‌లోని కొత్త సచివాలయంలో తెయూ 59వ పాలకమండలి సమావేశం జరిగింది. వీసీ హాజరు కాకపోవడంతో సమావేశానికి ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాకాటి కరుణ చైర్మన్‌గా వ్యవహరించారు.
గత నెల 19, 26, ఈ నెల 5, 12వ తేదీల్లో వరుసగా నిర్వహించిన 55, 56, 57, 58 సమావేశాల్లో చేసిన తీర్మానాల విషయమై సమావేశంలో సమీక్షించారు. 60వ సమావేశాన్ని జూన్ 3న నిర్వహించాలని, అదేవిధంగా వర్సిటీకి రిజిస్ట్రార్‌గా యాదగిరిని కొనసాగించాలని నిర్ణయించారు. అయితే ఈ నెల 15న వర్సిటీలోని రిజిస్ట్రార్ గదికి తాళం తీయించకుండా చేయడంతో అప్పటి నుంచి రిజిస్ట్రార్ యాదగిరి ఆ చాంబర్‌కు రావడం లేదు.
ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి యాదగిరి కొనసాగింపు గురించి ప్రస్తావించారు. అయితే సమావేశానికి యాదగిరి హాజరు కాలేదు. ఇదిలా ఉండగా వీసీ వ్యవహారాలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. తగిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.
పాలక మండలి సమావేశంలో సమీక్షించిన అంశాల్లో వీసీ అక్రమాలపై ఏసీబీ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, పోలీసు కేసులు, ముగ్గురు రిజిస్ట్రార్ల నుంచి దుర్వినియోగమైన నిధుల రికవరీ, విద్యావర్ధిని సస్పెన్షన్, సర్వీసు పుస్తకాల టాంపరింగ్ అలాగే కనకయ్యపై పెట్టాల్సిన క్రిమినల్ కేసులు, బడ్జెట్, ఐదుగురు సభ్యుల బృందం చేయాల్సిన దర్యాప్తు తదితర అంశాలు ఉన్నాయి. ఈ సమావేశంలో ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్, పాలకమండలి సభ్యులు వసుంధరాదేవి, గంగాధర్‌గౌడ్, మారయ్యగౌడ్, రవీందర్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్, నసీమ్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: ఓవైపు విగ్రహాలకు అభిషేకం.. మరోవైపు ఈవో జలకాలాట
Comments
Please login to add a commentAdd a comment