
దుర్కిలో జరిగిన ఘటన నేపథ్యంలో ఇదే వాడినట్టు డాక్టర్ల అనుమానం
చెట్టు లేకుండానే లక్షల లీటర్ల కల్లు తయారు చేస్తున్న అక్రమార్కులు
డైజోఫాం, ఆ్రల్ఫాజోలం కంటే తక్కువ రేటుకే దొరికే రసాయనాలతో దందా
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కృత్రిమ కల్లు తయారీలో అక్రమార్కులు కొత్తదారులు వెతుకుతున్నారు. మొదట్లో క్లోరోహైడ్రేట్ రసాయనంతో కృత్రిమ కల్లు తయారు చేసేవారు. ప్రభుత్వం దీన్ని నిషేధించాక డైజోఫాం ఉపయోగించారు. ప్రస్తుతం కృత్రిమ కల్లు తయారీకి ఆల్ఫ్రాజోలం రసాయనం వాడుతున్నారు. ఖర్చు ఇంకా తగ్గించుకునేందుకు యాంటీ సైకోటిక్ డ్రగ్ వాడుతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అక్కడ తాగిన వారంతా అపస్మారక స్థితిలోకి..
ఈ నెల 7న కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం దుర్కి కల్లు డిపోలో కల్లు తాగినవారంతా అపస్మారక స్థితిలోకి వెళ్లారు. 69 మంది ప్రభావితం కాగా, ఇందులో 17 మందిపై తీవ్ర ప్రభావం చూపడంతో నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రిలో చేర్చి చికిత్స అందించారు. గత ఘటనలకు భిన్నంగా లక్షణాలు కనిపించడంతో క్షుణ్ణంగా పరిశీలించిన వైద్యులు కల్లు తయారీలో కలిపిన రసాయనాల విషయమై దృష్టిసారించారు.
బాధితులకు గంటల వ్యవధిలోనే నాడీవ్యవస్థ దెబ్బతినడంతోపాటు నాలుక దొడ్డుగా మారడం, డిస్టోనియా (మరమనిషి మాదిరిగా), రిజిడ్(గట్టిగా), సిరలు పడిపోవడం, నొప్పులు వంటి లక్షణాలు కనిపించాయి. దీంతో కొత్తగా ‘యాంటీ సైకోటిక్ గ్రూపు’నకు చెందిన డ్రగ్స్‌ను కల్లులో వాడినట్టు అనుమానిస్తున్నారు. ఈ డ్రగ్‌ను ‘మేజర్ మెంటల్ డిజార్డర్’ ఉన్నవారికి ఉపయోగిస్తారని వైద్యులు చెబుతున్నారు.
కల్లుపై ప్రయోగాలు.. ప్రాణాలతో చెలగాటం
తెల్లగా మెరుస్తూ, కలిపితే నురగ వస్తూ, పుల్లగా, తియ్యగా ఉంటూ కల్లులా భ్రమింపచేసేందుకు అక్రమార్కులు రసాయనాలను వాడుతున్నారు. ఇందుకోసం గతంలో క్లోరోహైడ్రేట్‌ను వాడేవారు. ప్రభుత్వం నిషేధించడంతో ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తెచ్చి కలుపుతున్నారు. కొంతకాలం డైజోఫాంతో కల్లు తయారుచేశారు.
ప్రస్తుతం ఆ్రల్ఫాజోలం ఉపయోగించి కృత్రిమ కల్లు తయారు చేస్తున్నారు. అయితే ఈ రసాయనాల ఖర్చును మరింతగా తగ్గించుకునేందుకుగాను అక్రమార్కులు ప్రయోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే యాంటీ సైకోటిక్ డ్రగ్ తెరపైకి వచ్చిందనే అనుమానాలున్నాయి. రసాయనాలతో తయారుచేసిన కల్లులో కుంకుడు కాయల రసం, శాక్రీన్ సైతం కలుపుతున్నారు.
కృత్రిమ కల్లు దందా ఇలా..
» కృత్రిమ కల్లు తయారీలో ఆల్ఫ్రాజోలం, డైజోఫాం, క్లోరోహైడ్రేట్, సిట్రిక్ యాసిడ్ లాంటి రసాయనాలతో పాటు పులుపు కోసం నిమ్మ ఉప్పు, తెలుపు కోసం సిల్వర్ వైట్, కప్ పౌడర్, తీపి కోసం శాక్రీన్, నురగ కోసం కుంకుడు రసం, యూరియా, సోడా యాష్, అమ్మోనియా మిశ్రమం, డ్రై ఈస్ట్ రసాయనాలను ఉపయోగిస్తున్నారు.
»2,400 సీసాల తయారీకి రూ.7,800 ఖర్చవుతోంది. ఒక్కో కల్లు ప్యాకెట్ రూ.20కి అమ్ముతున్నారు.
» ఒక్క నిజామాబాద్ నగరంలోనే ఒక్క తాటిచెట్టు కూడా లేకుండానే రోజుకు ఏకంగా 3 లక్షల లీటర్ల కృత్రిమ కల్లు తయారుచేస్తున్నారు.
డేంజర్.. ‘యాంటీ సైకోటిక్ డ్రగ్’
మేజర్ మెంటల్ డిజార్డర్ ఉన్న రోగులకు మాత్రమే యాంటీ సైకోటిక్ గ్రూపునకు సంబంధించిన డ్రగ్ వాడాలి. ఇష్టానుసారం వాడితే తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. – డాక్టర్ కె శివప్రసాద్, నిజామాబాద్ వైద్యకళాశాల ప్రిన్సిపల్, సైకియాట్రి ప్రొఫెసర్
కొత్త రసాయనం కలిపి తయారీ
దుర్కిలో కల్లు తాగిన వారిని వివిధ రకాలుగా పరిశీలించాం. ఆ్రల్ఫాజోలం, డైజోఫాం కాకుండా కొత్తగా మరో రసాయనం కలపడంతోనే బాధితుల్లో అనారోగ్య సమస్యలు తలెత్తాయి. – డాక్టర్ శ్రీనివాస్,నిజామాబాద్ జీజీహెచ్ సూపరింటెండెంట్