కాలకూటవిషాన్ని జనం పైకి చిమ్ముతున్నారు! | Hyderabad Chemical Factories Release Their Waste In Water During Manufacturing Process | Sakshi
Sakshi News home page

కాలకూటవిషాన్ని జనం పైకి చిమ్ముతున్నారు!

Published Mon, Apr 5 2021 4:10 AM | Last Updated on Mon, Apr 5 2021 4:15 AM

Hyderabad Chemical Factories Release Their Waste In Water During Manufacturing Process  - Sakshi

రసాయన వ్యర్థాల చేరికతో కలుషితమైన నీరు

హైదరాబాద్‌: జీడిమెట్ల, కుత్భుల్లాపూర్‌ పరిసరాల్లో వంద వరకు బల్క్‌డ్రగ్, ఫార్మా, ఇతర రసాయనిక, రీసైక్లింగ్‌ పరిశ్రమలున్నాయి. వాటిల్లో ఉత్పత్తులను తయారు చేసే క్రమంలో ప్రమాదకర ఘన, ద్రవ రసాయన వ్యర్థాలు వెలువడుతున్నాయి.  తక్కువ గాఢత కలిగిన జల వ్యర్థాలను మల్టిబుల్‌ ఎఫెక్టివ్‌ ఎవాపరేటర్లు(ఎంఈఈ), ఆర్‌ఓలతో శుద్ధి చేసి బయటకు వదలాలి. కానీ పలు పరిశ్రమల్లో ఇలాం టి ఏర్పాట్లే లేవు. గాఢత అధికంగా ఉన్న వ్యర్థాలను జీడిమెట్ల, పటాన్‌చెరులోని శుద్ధి కేంద్రాలకు తరలించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నా.. ఆ ఊసే పట్ట డంలేదు. ఆయా పరిశ్రమల్లో వెలువడే ఘన వ్యర్థాలను దుండిగల్‌లోని డంపింగ్‌ యార్డుకు తరలించాల్సిన విషయాన్ని యాజమాన్యాలు ఎప్పుడో గాలి కొదిలేశాయి.

గుట్టుచప్పుడు కాకుండా ప్రమాదకర వ్యర్థాలను నాలాల్లోకి వదిలేస్తున్నారు. మరికొందరు అక్రమార్కులు పరిశ్రమల నుంచి వ్యర్థాలను సేకరించి డ్రమ్ముల్లో నింపి శివారు ప్రాంతా ల్లోని ఖాళీ స్థలాలు, అటవీ ప్రాంతాలు, చెరువులు, కుంటల్లో డంప్‌ చేస్తున్నా రు. ఒక్కో డ్రమ్ముకు రూ.100 నుంచి రూ.200 వరకు దండుకుంటున్నారు. ఇంకొందరు పరిశ్రమల ప్రాంగణంలోనే గోతులు తీసి వ్యర్థాలను పారబో స్తున్నారు. వ్యర్థాల డంపింగ్‌తో కుత్భుల్లాపూర్, జీడిమెట్ల, తదితర పారిశ్రామికవాడ లు, వాటి పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమయ్యాయి. 

భూగర్భజలాలు విషతుల్యం ఇలా.. 
ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్తలు ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో జరిపిన అధ్యయనంలో జీడిమెట్ల ప్రాంతంలో భూగర్భజలాలు విషతుల్యమైనట్లు తేలింది. ఆయా ప్రాంతాల్లో భూగర్భజలాలను ప్రయోగశాలలో పరిశీలించినప్పుడు ప్రమాదకరమైన ఆర్సెనిక్, నికెల్, కాడ్మియం తదితర ప్రమాదకర రసాయన, భార లోహాలు మోతాదుకు మించి భారీ స్థాయిలో ఉన్నట్లుగా తేలింది. జీడిమెట్ల, సుభాష్‌నగర్‌ పరిసర ప్రాంతాల్లోని మట్టిలోనూ ప్రమాదకర భారలోహాలు ఉన్నట్లు వెల్లడైంది. 

ప్రజలు కోరుతోందిది..
నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న, పారిశ్రామిక వ్యర్థజలాలను ఆరుబయట, బోరుబావుల్లోకి వదిలిపెడుతున్న పరిశ్రమలను మూసివేయాలి. పీసీబీ, టీఎస్‌ఐఐసీ, రెవెన్యూ, పోలీస్‌ తదితర శాఖ లకు చెందిన అధికారులతో కలిసి ప్రత్యేక బృందా లను రంగంలోకి దించాలి. ఆయా బృందాలు 24 గంటలపాటు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ఉల్లంఘనుల ఆట కట్టించాలి. నాలాలు, చెరువులు, మూసీ పరీవాహక ప్రాంతాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేసి వాటిని పీసీబీ, జీహెచ్‌ఎంసీ, పోలీసు కమిషనర్ల కార్యాలయంలోని టీవీలకు అనుసంధానించాలి.

పీసీబీ వివరణ ఇదీ..
జీడిమెట్ల ప్రాంతంలో పరిశ్రమల ఆగడాలపై ‘సాక్షి’పీసీబీ అధికారులను వివరణ కోరగా.. మా వద్దకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఆయా పరిశ్రమలకు నోటీసులు జారీ చేశామని చెప్పారు. నిబంధనల ప్రకారం నడుచుకోని పరిశ్రమలపై ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలపడం గమనార్హం.  

మేము పదేళ్లుగా సుభాష్‌నగర్‌లో ఉంటున్నం. మా నివాసాల మధ్య ఎలాంటి అనుమతులు లేకుండా రీసైక్లింగ్‌ యూనిట్లను నిర్వహిస్తున్నరు. రసాయనాలు నిండిన డ్రమ్ములు, కవర్లను ఇక్కడకు తీసుకొచ్చి రీసైక్లింగ్‌ చేస్తుండటంతో ఇళ్లల్లోకి విపరీతమైన దుర్వాసన వస్తోంది. కడిగిన నీటిని నాలాలు, రోడ్లపై పారబోస్తున్నరు. దీంతో తరచూ అనారోగ్యానికి గురై ఆస్పత్రుల పాలవుతున్నం. మా ఇళ్లలో బోరుబావుల్లోనూ విష రసాయనాలు నిండిన నీళ్లే వస్తున్నయ్‌. ఈ నీటిని తాగితే చర్మరోగాలు వస్తున్నయ్‌.


లక్ష్మి మనోవేదన ఇది..

ఈ ఆవేదన వీరిద్దరిది మాత్రమే కాదు..
జీడిమెట్ల, కుత్భుల్లాపూర్‌ పరిసరాల్లో నివసిస్తున్న 60 కాలనీలు, బస్తీల్లోని వేలాది మందిది. ఆ ప్రాంతంలో సుమారు వంద వరకు ఉన్న బల్క్‌డ్రగ్, ఫార్మా కంపెనీలు
వెదజల్లుతున్న విష రసాయన వ్యర్థాలతో గాలి, నీరు, నేల కాలుష్య కాసారంలా మారాయి. జనంపైకి విషం చిమ్ముతున్న పరిశ్రమల ఆగడాలు శ్రుతిమించుతుండటంతో వీరంతా ఆందోళన చెందుతున్నారు. కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమలను కట్టడిచేయడంలో పీసీబీ ప్రేక్షకపాత్రకే పరిమితమవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. – సాక్షి, హైదరాబాద్‌

‘మా మోడీ బిల్డర్స్‌ అపార్ట్‌మెంట్‌లో
450 కుటుంబాలు నివసిస్తున్నయ్‌. మా అపార్ట్‌మెంట్‌కు ఆనుకొని ఉన్న కోపల్లి ఫార్మా పరిశ్రమ నుంచి ఐదేళ్లుగా రాత్రిపూట విపరీతమైన దుర్వాసన వస్తోంది. గతంలో పీసీబీ అధికారులకు ఫిర్యాదు చేయగా జూలై 2019లో పరిశ్రమను మూసేశారు. తిరిగి 15 రోజుల్లోనే పరిశ్రమ మళ్లీ తెరుచుకుంది. రాత్రి, పగలు అన్న తేడా లేకుండా దుర్వాసన వస్తుండటంతో శ్వాస కోశవ్యాధులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నం’


–లింగారావు ఆవేదన ఇది..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement