దుద్యాల్ రైతుల్లో హర్షాతిరేకాలు
ఫార్మా కంపెనీలను అడ్డుకోగలిగామంటూ సంబరం
మాకు వ్యవసాయ భూములే దిక్కని స్పష్టికరణ
దుద్యాల్: వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండల పరిధిలోని ప్రలు గ్రామాల్లో ఫార్మా కంపెనీల ఏర్పాటు ప్రతిపాదనను ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో బాధిత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ పోరాటం ఫలించిందని, ప్రజల ప్రాణాలకు ఇబ్బంది కలిగించే ఫార్మా కంపెనీల రాకను అడ్డుకోగలిగామని పోలేపల్లి, రోటిబండ తండా, పులిచర్లకుంట తండా, లగచర్ల, హకీంపేట్ గ్రామాల ప్రజలు సంబరపడుతున్నారు. వ్యవసాయ భూములే తమ కు దిక్కని, ఇతర కంపెనీల ఏర్పాటుపై కూడా ప్రభుత్వం పునరాలోచించాలని కోరుతున్నారు.
లగచర్లలో భూసేకరణపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు వెళ్లిన కలెక్టర్ సహా ఉన్నతాధికారులపై స్థానికులు దాడి చేశారనే వార్తలు సంచలనం సృష్టించాయి. లగచర్ల ఘటన తర్వాత ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం గురించి దేశ వ్యాప్త చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని భావించిన సీఎం.. దుద్యాల్ మండలంలో ఫార్మా కంపెనీల ఏర్పా టును రద్దు చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫార్మా కంపెనీ ఏర్పాటుకు ఐదు గ్రామాల్లో 1,358.37 ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం భావించిన సంగతి తెలిసిందే.
అసలేం జరిగిందంటే..
ఫార్మా విలేజ్ కోసం భూములు సేకరించేందుకు మండల పరిధిలోని పోలేపల్లిలో గత అక్టోబర్ 18న ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో రైతులు తమ అభిప్రాయాలను వెల్లడించగా అధికారులు నమోదు చేసుకున్నారు. ఎలాంటి గొడవలు లేకుండానే సమావేశం పూర్తయింది. అనంతరం అక్టోబర్ 25న లగచర్లలో చేపట్టిన సమావేశానికి వస్తున్న కాంగ్రెస్ పార్టీ దుద్యాల్ మండల అధ్యక్షుడు అవుటి శేఖర్ వాహనాన్ని రోటిబండతండా వద్ద ఆపారు. ఈ సందర్భంగా ఆయన గిరిజనులను దుర్భాషలాడటంతో ఆగ్రహానికి గురైన తండా వాసులు ఆయనపై దాడికి ప్రయత్నించిన నేపథ్యంలో అప్పటి ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం అర్ధంతరంగా నిలిచిపోయింది.
ఆ తర్వాత నవంబర్ 11న లగచర్ల రైతుల ప్రజాభిప్రాయ సేకరణ కొరకు దుద్యాల్, లగచర్ల మధ్య సమావేశం ఏర్పాటు చేశారు. కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర ప్రసాద్, తహసీల్దార్ కిషన్ తదితరులు సమావేశ స్థలానికి చేరుకున్నారు. కానీ రైతులెవరూ అక్కడికి రాకపోవడంతో అధికారులు లగచర్లకు వెళ్లారు. గ్రామస్తులకు విషయం వివరించేందుకు ప్రయతి్నస్తుండగానే అధికారులపై దాడి తదనంతర పరిణామాలు చోటు చేసుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment