
దేవన్నపేటలోని దేవాదుల పంప్‌హౌస్
ఒక్క మోటారుపై ఆధారపడి ఉన్న 50–65 వేల ఎకరాల్లోని పంటల భవితవ్యం
దేవాదుల ఎత్తిపోతల కింద తీవ్ర నీటి కొరతతో పంటలు ఎండిపోయే ప్రమాదం
దేవన్నపేట పంప్‌హౌస్‌లో మొత్తం 3 మోటార్లు.. సాంకేతిక అడ్డంకులు తొలగించేందుకు నిపుణుల కృషి
కనీసం ఒక్క మోటారునైనా ప్రారంభించేందుకు ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు... నేడు సిద్ధమయ్యే చాన్స్.. అదే జరిగితే ధర్మసాగర్ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలు
సాక్షి, హైదరాబాద్: ఒక్క మోటార్‌పై 50 వేల నుంచి 65 వేల ఎకరాల్లోని పంటల మనుగడ ఆధారపడి ఉంది. దేవాదుల ప్రాజెక్టు కింద ప్రస్తుత యాసంగిలో సాగు చేస్తున్న ఈ పంటలు మరో రెండు వారాల్లో చేతికొచ్చే దశలో ఉండగా, తీవ్ర నీటి కొరత కారణంగా ఎండిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. దీంతో ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించింది. దేవాదుల ప్రాజెక్టు మూడో దశ కింద దేవన్నపేట వద్ద కొత్తగా నిర్మించిన పంప్‌హౌస్‌లో ఒక్కొక్కటి 31 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మూడు మోటార్లుండగా.. కనీసం ఓ మోటారునైనా యుద్ధప్రాతిపదికన వినియోగంలోకి తేవడం ద్వారా ఆ పంటలకు గోదావరి జలాలను మళ్లించడానికి విశ్వప్రయత్నాలు చేస్తోంది.
ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి గత 10 రోజులుగా అక్కడే ఉండి పంప్‌హౌస్‌ను సిద్ధం చేసే పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 18న రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి కడియం శ్రీహరిలు.. మోటార్‌ను ఆన్ చేసి నీటిని విడుదల చేసేందుకు పంప్‌హౌస్ వద్దకు చేరుకున్నారు. అర్ధరాత్రి వరకు నిరీక్షించినా సాంకేతిక సమస్యలు పరిష్కారం కాకపోవడంతో తిరిగి వచ్చేశారు.
ఇవి ఆస్ట్రియాకి చెందిన ఆండ్రీజ్ కంపెనీ మోటార్లు కావడంతో ఆ దేశం నుంచి సాంకేతిక నిపుణులు పంప్‌హౌస్‌కు చేరుకుని సాంకేతిక అడ్డంకులు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. శుక్రవారం నాటికి మోటారు సిద్ధం చేసి ధర్మసాగర్ రిజర్వాయర్‌లోకి నీళ్లను ఎత్తిపోసేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తామని నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ తాజాగా మంత్రి ఉత్తమ్‌కు సమాచారమిచ్చింది. అదే జరిగితే ధర్మసాగర్‌లో నిల్వలు పెరిగి అక్కడి నుంచి ఇతర రిజర్వాయర్లకు నీటిని తరలించి స్టేషన్‌ఘన్‌పూర్, హుస్నాబాద్, వరంగల్ వెస్ట్, వర్ధన్నపేట, పరకాల ప్రాంతంలోని పంటలకు సరఫరా చేసేందుకు అవకాశం కలగనుంది.
800 క్యూసెక్కులు సరఫరా చేస్తేనే..
దేవాదుల ఎత్తిపోతల కింద 1,28,280 ఎకరాల్లో ఆరుతడి, 70,350 ఎకరాల్లో వరి కలుపుకుని మొత్తం 1,98,630 ఎకరాలకు నీరు అందించాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల కింద రాష్ట్రంలో సాగుచేస్తున్న పంటలకు సరిపడా నీళ్లు అందుతుండగా, దేవాదుల ప్రాజెక్టు కిందే తీవ్రమైన నీటి కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో దేవన్నపేట పంప్‌హౌస్‌లోని ఒక మోటార్‌ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చి 800 క్యూసెక్కులను నీటిని సరఫరా చేయగలిగితే అంత మేరకు పంటలను రక్షించుకోగలుగుతామని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రమాదాలు నివారించే పనుల వల్లే ఆలస్యం
పంప్‌హౌస్ నిర్మాణం చాలా రోజుల కిందే పూర్తికాగా, రక్షణ చర్యల్లో భాగంగా పైపులకు సిమెంట్ ఇన్‌కేసింగ్ పనులు చేయాలని నిపుణులు సూచించారు. పంప్‌హౌస్ లోతు ఎక్కువగా ఉండడంతో నీళ్లు వెనక్కి తన్ని వచ్చినప్పుడు ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉందని గుర్తించడంతో ఈ సిఫారసు చేశారు. గత రెండు నెలలుగా ఈ పనులు జరుగుతుండగా, ఇప్పటికే రెండు మోటార్లకు సంబంధించిన పనులు పూర్తయ్యాయి. ఇందులో ఒక మోటార్‌ను తక్షణమే వినియోగంలోకి తేవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యేల నుంచి కూడా ఒత్తిడి పెరిగింది.
మూడో దశ పూర్తైతే ..రైతు దశ తిరిగినట్టే..!
సమ్మక్కసాగర్ బరాజ్ బ్యాక్‌వాటర్ నుంచి దేవాదుల ఎత్తిపోతల పథకం నీళ్లను తరలించనుండగా, ప్రస్తుతం సమ్మక్కసాగర్‌లో 2.5 టీఎంసీల నిల్వలున్నాయి. రోజూ 1500 క్యూసెక్కుల వరద వస్తోంది. దేవాదుల తొలిదశ కింద 5.18 టీఎంసీలు, రెండో దశ కింద 7.25 టీఎంసీలు, మూడో దశ కింద 25.75 టీఎంసీలు కలిపి మొత్తం 38.16 టీఎంసీల నీళ్లను ఎత్తిపోసి మొత్తం 5.57 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉంది. ఇప్పటికే తొలి రెండు దశల పనులు పూర్తయ్యాయి. మూడో దశ కూడా పూర్తైతే ప్రాజెక్టు కింద ఆయకట్టు రైతు దశ తిరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment