Devadula project
-
2026 మార్చిలో ‘దేవాదుల’ ప్రారంభం
సాక్షి ప్రతినిధి, వరంగల్: దేవాదుల ప్రాజెక్టు పెండింగ్ పనులు 2026 మార్చి లోపు వందశాతం పూర్తి చేసి, అదే నెలలో సోనియాగాంధీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. ఏడాదిలో 300 రోజుల పాటు 60 టీఎంసీల నీటిని వినియోగించుకుని ఏడు జిల్లాలను సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును శుక్రవారం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, నీటిపారుదల శాఖ నిపుణులతో కలిసి ఆయన సందర్శించారు.దేవాదుల పంప్‌హౌస్ వద్ద ప్రాజెక్ట్ పురోగతిపై ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిర్దేశిత గడువులోపు దేవాదుల పూర్తి చేసి 5.57 లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తామని చెప్పారు. సమ్మక్క సారక్క బరాజ్ ఎన్వోసీ కోసం ఛత్తీస్‌గఢ్‌ను ఒప్పిస్తామన్నారు. ధరలు పెరగడంతో ఇరిగేషన్ ప్రాజెక్టులకు భూసేకరణ ఇబ్బందిగా మారిందని, ఇందుకోసం ప్రత్యేక ఐఏఎస్ అధికారిని నియమిస్తున్నామని తెలిపారు. కాలపరిమితిని పెట్టి వీలైనంత త్వరగా సీతారామసాగర్, పాలమూరు–రంగారెడ్డిలను పూర్తి చేసి వినియోగంలోకి తెస్తామని చెప్పారు. ప్రతి ప్రాజెక్టులో వేల కోట్ల స్కాం ఇరిగేషన్ శాఖను అడ్డుపెట్టుకొని మాజీ సీఎం కేసీఆర్ డెకాయిట్లా వ్యవహరించారని, ప్రతి ప్రాజెక్టులో వేల కోట్ల స్కాం జరిగిందని ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును నాశనం చేశారని, ఇరిగేషన్ ప్రాజెక్టులపై అవగాహన లేకుండా తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో ప్రాజెక్ట్‌ల పేరుతో రూ.1.81 లక్షల కోట్ల నిధులు ఖర్చుపెట్టారని, రూ.14 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉంచారని వెల్లడించారు. రూ.1.81 లక్షల కోట్ల నిధులను ఖర్చు చేసినా లక్ష ఎకరాలకు కూడా అదనంగా సాగునీరు ఇవ్వలేకపోయారని విమర్శించారు. దేవాదుల ప్రాజెక్టు పెండింగ్ బిల్లులను తప్పనిసరిగా చెల్లిస్తామని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. 15 ఏళ్లుగా నత్తనడకన దేవాదుల: పొంగులేటి దేవాదుల ప్రాజెక్ట్ పనులు 15 ఏళ్లుగా నత్తనడకలో సాగాయని మంత్రి పొంగులేటి విమర్శించారు. దీనికోసం మరో 3 వేల ఎకరాల భూసేకరణ నవంబర్ 15 లోపు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఇచి్చన హామీ మేరకు, భూములకు నష్టపరిహారం చెల్లిస్తామని తెలిపారు. మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, గండ్ర సత్యనారాయణరావు, మురళీ నాయక్, యశస్వినిరెడ్డి, కేఆర్ నాగరాజు, ప్రభుత్వ కార్యదర్శి ప్రశాంత్ జీవన్‌పాటిల్, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ పాల్గొన్నారు. చెరువులు ఆక్రమిస్తే ఊపేక్షించం సాక్షి, యాదాద్రి: రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు, కుంటలు ఎవరు ఆక్రమించినా ఉపేక్షించేది లేదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో ఉన్న నీటిపారుదల వనరులపై ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. గత పదేళ్లలో అన్ని శాఖల కంటే ఎక్కువగా నష్టపోయింది నీటిపారుదల శాఖే అని అన్నారు. సీఎం ఆలోచనల మేరకు మూసీ నదిలో నీటి లభ్యతను పెంచుతామన్నారు. అంతకు ముందు హన్మాపురం వద్ద బునాదిగాని కాలువను మంత్రులు పరిశీలించారు. రుణమాఫీకి మరో రూ.500 కోట్లు: పొంగులేటి రైతు రుణమాఫీ కోసం అవసరమైమే అదనంగా మరో రూ.500 కోట్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ఇంకా ఇవ్వాల్సిన రూ.13 వేల కోట్లతో పాటు అవసరమైతే మరిన్ని నిధులు ఇస్తామన్నారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అ«ధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వేముల వీరేశం, మందుల సామేల్, మల్రెడ్డి రంగారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కలెక్టర్ హనుమంతు కే.జెండగే, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. -
దేవాదుల పైప్‌లైన్ లీకేజీ
దామెర: దేవాదుల పైప్‌లైన్ లీకేజీతో ఒక్కసారిగా నీరు నింగిని తాకే విధంగా పైకి ఎగజిమ్మింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా దామెర మండలం పులుకుర్తి సమీపంలో శనివారం చోటుచేసుకుంది. పులుకుర్తిలోని దేవాదుల పంప్ హౌజ్ నుంచి భీంఘన్‌పూర్ పంప్‌హౌజ్‌కు నీటిని పంపింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పులుకుర్తి శివారులో శనివారం ఉదయం గేట్‌వాల్వ్ లీకేజీ కావడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు నీరు ఎగిసిపడింది. దీంతో సమీపప్రాంతం మొత్తం జలమయమైంది. పులుకుర్తి గ్రామానికి చెందిన రైతు పండుగ రవి తన రెండెకరాల పొలంలో ఇటీవల నాట్లు వేయగా పొలం పూర్తిగా మునిగిపోయింది. లీకేజీ విషయమై సంబంధిత అధికారులకు, సిబ్బందికి సమాచారం అందించినప్పటికీ ఎవరూ స్పందించడం లేదని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలోనూ పైప్‌లైన్ లీకేజీతో రెండెకరాల పత్తి పూర్తిగా మునిగి నష్టం వాటిల్లిందని రవి వాపోయారు. -
మల్లన్నసాగర్ నుంచే దేవాదులకు గోదావరి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుతం సిద్ధం చేసిన మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి దేవాదుల ప్రాజెక్టులోని తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు అనుసంధానించే తుది ప్రణాళిక ఖరారైంది. దేవాదుల ప్రాజెక్టులో నీరందని చివరి ఆయకట్టు ప్రాంతాలకు పూర్తి భరోసా ఇచ్చేలా మల్లన్నసాగర్ నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా నీరందించే పనులు చేపట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. మొత్తంగా రూ.405 కోట్లతో గ్రావిటీ కెనాల్ తవ్వడం ద్వారా దేవాదులలోని సుమారు 1.30 లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందించేలా కార్యాచరణను త్వరలోనే మొదలుపెట్టనుంది. నిజానికి దేవాదుల ప్రాజెక్టులో భాగంగా గంగాపురం ఇంటేక్ పాయింట్ నుంచి నీటిని ఎత్తిపోస్తూ 6.21 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాల్సి ఉంది. నిర్ణీత ఆయకట్టుకు నీటిని తరలించాలంటే 200 కిలోమీటర్లకుపైగా నీటి తరలింపు చేయాల్సి ఉంది. తపాస్‌పల్లి రిజర్వాయర్ వరకు నీటిని తరలించాలంటే కనీసంగా 460 మీటర్ల మేర నీటిని ఎత్తిపోయాల్సి ఉంటుంది. ఇది వ్యయప్రయాసలతో కూడుకున్నది కావడంతో తపాస్‌పల్లి కింది ఆయకట్టుకు కాళేశ్వరం జలాలను తరలించేలా ప్రణాళికలు రూపొందించాలని గతంలోనే సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో మల్లన్నసాగర్ నుంచి 10.06 కిలోమీటర్ల మేర గ్రావిటీ కెనాల్ నిర్మించి రోజుకు 1,600 క్యూసెక్కుల నీటిని కనీసం 4 నెలలపాటు తరలించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందులో ఓపెన్కెనాల్తోపాటు 3.60 కిలోమీటర్ల మేర సొరంగం నిర్మించాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదనతో కనీసం 13 నుంచి 14 టీఎంసీల నీటిని తరలించడం ద్వారా తపాస్‌పల్లి కింద నిర్ణయించిన 74,955 ఎకరాలతోపాటు, కొన్నబోయినగూడెం, వెల్దండ, లద్దనూరుతోపాటే దారి పొడవునా ఉండే చెరువుల కింద మరో 55 లక్షల ఎకరాలు కలిపి మొత్తం 1.30 లక్షల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదనను కేబినెట్ సైతం ఆమోదించినట్లు తెలుస్తోంది. -
కాళేశ్వరంలో మళ్లీ ఎత్తిపోతలు
కాళేశ్వరం/మంథని: కాళేశ్వరం పథకం ద్వారా మళ్లీ నీటి ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కన్నెపల్లి లక్ష్మీపంపుహౌస్లో ఆదివారం ఇంజనీరింగ్ అధికారులు రెండు మోటార్లను ఆన్ చేసి ఎత్తిపోతలను ప్రారంభించారు. లక్ష్మీపంపుహౌస్ నుంచి ఇప్పటికే 11 మోటార్లతో 22 పంపుల ద్వారా గడిచిన రెండు సీజన్లలో నీటిని ఎత్తిపోసిన విషయం తెలిసిందే. కాగా, గతేడాది ఆగస్టులో భారీ వర్షా లతో ఇంజనీర్లు మోటార్లను నిలిపివేశారు. అప్పటి నుంచి పంపుహౌస్‌లో ఎత్తిపోతలు జరగలేదు. లక్ష్మీబ్యారేజీకి జలకళ: ఈ నెల 1 నుంచి మేడిగడ్డ లక్ష్మీబ్యారేజీలోని 85 గేట్లు మూసివేసి నీటిని నిల్వచేస్తున్నారు. బ్యారేజీ పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీలు కాగా ప్రస్తుతం 16 టీఎంసీల వరకు నిల్వ ఉంది. మేడిగడ్డ నుంచి కాళేశ్వరం వరకు బ్యాక్ వాటర్ 20 కిలోమీటర్ల మేరకు పెరగడంతో ప్రభుత్వం ఆదేశాలతో అధికారులు తాజాగా ఎత్తిపోతలు ప్రారంభించారు. 10.5 టీఎంసీల లక్ష్యం: లక్ష్మీపంపుహౌస్ మోటార్ల ద్వారా డెలివరీ సిస్టర్న్‌లో ఎత్తిపోసే నీరు.. అక్కడి నుంచి గ్రావిటీ కాల్వ ద్వారా 13.5 కిలోమీటర్ల దూరాన ఉన్న అన్నారం సరస్వతీ బ్యారేజీలోకి చేరుతుంది. అక్కడి నుం చి ఎగువన ఉన్న లోయర్ మానేరుకు 8 టీఎంసీలు, ఎల్లం పల్లికి 2.5 టీఎంసీలు.. మొత్తం కలిపి 10.5 టీఎంసీల నీటిని తరలించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, ఏకకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీ, సరస్వతి, పార్వతి, నంది, గాయత్రి పంపుహౌస్‌లలో రెండు చొప్పున మొత్తం పది మోటార్లు రన్ చేస్తున్నారు. వీటి ద్వారా ఒక చోటనుంచి మరో చోటుకు నీటిని ఎత్తిపోస్తున్నారు. 3,150 క్యూసెక్కుల నీటిని మిడ్‌మానేరుకు, అక్కడి నుంచి ఎల్ఎండీకి తరలించనున్నారు. ఎల్ఎండీ ప్రాజెక్టులోకి 8 టీఎంసీల నీరు బోయినపల్లి(చొప్పదండి): కాళేశ్వరం నుంచి ఎత్తిపోతల ప్రారంభం కావడంతో దానికి అనుగుణంగా శ్రీరాజరాజేశ్వర (మిడ్‌మానేరు) ప్రాజెక్టు నుంచి దిగువన ఉన్న కరీంనగర్ ఎల్ఎండీ ప్రాజెక్టులోకి ఆదివారం సాయంత్రం నీటి ని విడుదల చేశారు. మిడ్‌మానేరు ప్రాజెక్టు 12, 13 గేట్లను ఎత్తడంతో ఒక్కో గేటు ద్వారా 1,500 క్యూసెక్కుల చొప్పు న 3 వేల క్యూసెక్కుల నీరు ఎల్ఎండీ ప్రాజెక్టులోకి వెళ్తోంది. గాయత్రి పంప్‌హౌస్ నుంచి వరద కాలువ మీదుగా మిడ్‌మానేరు ప్రాజెక్టులోకి 3 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో చేరుతోంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 25.57 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. మిడ్‌మానేరు నుంచి ఎల్ఎండీ ప్రాజెక్టులోకి 8 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నారు. దేవాదుల పంపింగ్ షురూ కన్నాయిగూడెం(ములుగు): దాదాపు ఐదు నెలల తర్వాత దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా నీటి పంపింగ్ మళ్లీ ప్రారంభమైంది. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద ఉన్న జె.చొక్కారావు దేవాదుల పథకంలోని ఫేజ్–1, ఫేజ్–2లో ఒక్కో మోటారు చొప్పున శనివారం రాత్రి ఇంజనీరింగ్ అధికారులు ఆన్ చేశారు. ‘కాళేశ్వరం’ సందర్శనకు పర్యాటకులకు అనుమతి కాళేశ్వరం: దాదాపు 9 నెలల సుదీర్ఘ విరామం తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి కన్నెపల్లి లక్ష్మీ పంప్‌హౌస్ వద్ద పర్యాటకుల ప్రవేశానికి అధికారులు అనుమతులు ఇచ్చారు. కోవిడ్ నేపథ్యంలో గతేడాది మార్చి 20 నుంచి పర్యాటకులకు అనుమతులు ఇవ్వడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతేడాది జూన్ 8న ఆలయాలకు వెళ్లేందుకు భక్తులకు అనుమతులిచ్చినా.. ఇక్కడి పంప్‌హౌస్, బ్యారేజీల్లోకి మాత్రం బ్యారేజీ ఏజెన్సీ సంస్థలు అనుమతించడం లేదు. తాజాగా ఆదివారం నుంచి పంప్‌హౌస్‌లోకి పర్యాటకులను అనుమతిస్తున్నారు. -
పదహారేళ్లుగా ‘సా..గు’తున్న దేవ.. దేవా!
సాక్షి, హైదరాబాద్: గోదావరి జలాల వినియోగమే లక్ష్యంగా పదహారేళ్ల కిందట చేపట్టిన దేవాదుల ఎత్తిపోతల పథకం పనులు నత్తకే నడక నేర్పుతున్నాయి. 60 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తూ ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే ఈ పథకం పనులు ముక్కుతూ మూలుగుతూ సాగుతున్నాయి. పూర్తికాని భూసేకరణ, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, భారీ సొరంగాల నుంచి ఊరుతున్న నీటి ఊటలు పనులకు పరీక్ష పెడుతున్నాయి. ప్రాజెక్టు పనులను వేగిరం చేసేందుకు కార్పొరేషన్ల ద్వారా నిధులను సమకూరుస్తున్నా.. పనుల్లో జాప్యం జరుగుతుండటం ప్రభుత్వ పెద్దలనూ అసహనానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జూన్ నాటికైనా ప్రాజెక్టును పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యాలను విధించింది. ఈ ఎత్తిపోతల పథకాన్ని 2003–04లో రూ.6 వేల కోట్లతో ప్రారంభించారు. అంచనా వ్యయం ప్రస్తుతం రూ.13,445 కోట్లకు పెరిగింది. దీని కింద ఆయకట్టును 6.53 లక్షల ఎకరాలుగా నిర్ణయించగా, ఇంతవరకు 2.34 లక్షల ఎకరాలే సాగులోకి వచ్చాయి. మూడు దశల పనుల్లో మొదటి రెండు దశలు పూర్తయ్యాయి. అయితే ఇంకా కొంత ఆయకట్టుకు నీరందాల్సి ఉంది. మూడో దశ పనులు మాత్రం మొత్తంగా చిక్కుల్లో పడ్డాయి. రామప్ప నుంచి ధర్మసాగర్ వరకు భారీ టన్నెళ్లలో ఊరుతున్న నీటి ఊటలు, భూసేకరణ సమస్యతో పనులు మందగించాయి. దీనిపై అసంతృప్తితో ఉన్న సీఎం కేసీఆర్ స్వయంగా సీఎంఓ కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్‌ను రంగంలోకి దింపినా పనుల్లో పురోగతి లేదు. ముక్కుతూ, మూలుగుతూ ‘మూడో దశ’ ప్రాజెక్టు కోసం మొత్తంగా 31,383 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా, 28,793 ఎకరాలు సేకరించారు. మరో 2,590 ఎకరాలను సేకరించాల్సి ఉంది. భూసేకరణకు రూ.985 కోట్లు ఖర్చుచేశారు. ఫేజ్–3లో మొత్తంగా 12,368 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా, 9,778 ఎకరాలనే సేకరించారు. కోర్టు కేసులు, రైతులు ఎక్కువ పరిహారాన్ని డిమాండ్ చేయడం వంటివి భూసేకరణకు అడ్డం పడుతున్నాయి. ఇక, ఫేజ్Œ›–3లోని ప్యాకేజీ–1, 2 పనులు ఇప్పటికే పూర్తికాగా, ప్యాకేజీ–3 నుంచి ప్యాకేజీ–8 వరకు పనులకు సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ప్యాకేజీ–3లో రామప్ప నుంచి ధర్మసాగర్ వరకు నీటిని తరలించేందుకు తవ్వాల్సిన 49 కిలోమీటర్ల టన్నెల్లో.. 1.46 కి.మీ. మేర టన్నెల్ నిర్మాణం సలివాగు కింది నుంచి వెళ్లాల్సి ఉంది. 853 మీటర్ల టన్నెల్ తవ్వకానికే ఏళ్లుపట్టింది. ఇక్కడ 2012లో ఎదురైన ప్రమాదం నుంచి కోలుకొని దీన్ని తిరిగి పూర్తిచేయడానికి ఏకంగా ఎనిమిదేళ్లు పట్టింది. ప్రస్తుతం సలివాగు కింద టన్నెల్ పూర్తిచేసినా, ఊట కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మొన్నటి వర్షాలతో సమస్య ఇంకా పెరిగింది. డీవాటరింగ్ చేసేందుకు నెలకు డీజిల్ ఖర్చే కోటి రూపాయల వరకు ఉంటోంది. ప్యాకేజీ–4 కింద పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. ఈ పనుల్ని ప్రస్తుత ఏజెన్సీ నుంచి తొలగించి మరో ఏజెన్సీకి ఇవ్వాలని యోచిస్తున్నారు. ప్యాకేజీ–5లో 386 ఎకరాలు సేకరించాల్సి ఉండగా, నల్లబెల్లి మండలం రుద్రగూడెం వద్ద జాతీయ రహదారి క్రాసింగ్‌తో సమస్యలున్నాయి. ఈ పనులన్నీ పూర్తయితేనే ఫేజ్–3 కింద 2.42 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందనుంది. పనుల తీరును ‘కాగ్’తప్పుబట్టినా.. దేవాదుల పనుల్లో జాప్యాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) 2018లోనే తప్పుపట్టింది. ప్రాజెక్టు పనుల గడువు ఇప్పటికే 8సార్లు పొడిగించినా పూర్తి చేయలేకపోయారని, దీనివల్ల నిర్మాణ వ్యయం పెరుగుతోందని ఎత్తిచూపింది. నిర్మాణ సమయంలో ప్రాజెక్టు వ్యయం రూ.6వేల కోట్లు కాగా, దాన్ని ఒకమారు రూ.9,427 కోట్లకు, తర్వాత మళ్లీ సవరించి రూ.13,445 కోట్లకు చేర్చారని ఆక్షేపించింది. పెరిగిన వ్యయాలకు అనుగుణంగా ఆయకట్టుకు మాత్రం నీరందించలేకపోయారంది. ముఖ్యంగా భూసేకరణ, రహదారుల క్రాసింగ్ విషయంలో జరుగుతున్న జాప్యంతో ప్రాజెక్టు వ్యయం పెరుగుతున్న విషయాన్ని ఎత్తిచూపింది. ఈ నేపథ్యంలో పనులపై దృష్టిపెట్టిన ప్రభుత్వం వచ్చే ఏడాది జూన్ నాటికి ప్రాజెక్టును పూర్తిచేయాలని ఇరిగేషన్ శాఖకు లక్ష్యంగా పెట్టింది. వచ్చే జూన్ నాటికి పూర్తి చేస్తాం దేవాదుల ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరుగుతున్న మాట వాస్తవమే. భూసేకరణ సమస్యలు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో ఇబ్బందులున్నాయి. సీఎం కేసీఆర్ సూచనతో స్థానిక ప్రజాప్రతినిధులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్ల సమన్వయంతో సమస్యలు పరిష్కరిస్తూ పనులు పూర్తిచేసేలా ప్రణాళిక రచించాం. వచ్చే ఏడాది జూన్ నాటికి 1,200కుపైగా చెరువులకు నీళ్లిచ్చేలా పనులు ముగిస్తాం. భూసేకరణ ప్రక్రియకు అవసరమైన నిధులను విడుదల చేస్తాం. మిగతా పనులకు రుణాల ద్వారా నిధుల లభ్యత ఉంది. – రజత్‌కుమార్, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ. -
చురుగ్గా సాగుతున్న ‘సమ్మక్క’ బ్యారేజీ పనులు
వరంగల్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో 6.26 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో దేవాదుల జె.చొక్కారావు ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే, ఈ ఎత్తిపోతల పథకంలో భాగంగా మోటార్లు నడిచేలా నీరు నిల్వ ఉండాలన్నా.. సాగునీరు అందాలన్నా గోదావరి నదిపై చేపట్టిన సమ్మక్క బ్యారేజీ కీలకం. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద గోదావరి నదిపై ఈ బ్యారేజీ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నారు. తాజాగా ఇక్కడ గేట్లు బిగించే పనులు మొదలుపెట్టగా... నేరుగా సీఎం పేషీ నుంచి పర్యవేక్షణ కొనసాగుతోంది. అలాగే, ఇటీవల నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్ స్వయంగా పనులను పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు సమ్మక్క బ్యారేజీ పనులు, వివరాలపై ప్రత్యేక కథనం – ఏటూరునాగారం / కన్నాయిగూడెం సాక్షి, వరంగల్: గోదావరి నీటితో తెలంగాణలోని జిల్లాలను సస్యశ్యామలం చేయాలని సంకల్పంతో కంతనపల్లి బ్యారేజీ నిర్మాణానికి రూపకల్పన చేశారు. 2009 ఫిబ్రవరి 19న అప్పటి ఏటూరునాగారం మండలం కంతనపల్లిలో గోదావరి నదిపై సుజల స్రవంతి పీ.వీ.నరి్సంహారావు పేరుతో బ్యారేజ్ నిర్మించడానికి దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. అయితే కంతనపల్లి వద్ద బ్యారేజ్ నిర్మిస్తే ఎనిమిది గ్రామాలు పూర్తిగా, మరో 12 గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురవుతుండంతో ప్రాజెక్టు నిర్మాణ ప్రతిపాదనను తుపాకులగూడెం ప్రాంతానికి మార్చారు. తాజాగా ఈ బ్యారేజీ పేరును సమ్మక్క బ్యారేజీగా మార్చారు. క్రేన్ సాయంతో అమరుస్తున్న గడ్డర్లు నీటి లభ్యత ఆధారంగా బ్యారేజీ నిర్మాణం తుపాకులగూడెం వద్ద గోదావరిలో నీటి లభ్యత గరిష్టంగా 470 టీఎంసీలకు పైగా ఉంటుంది. దీంతో ఇక్కడ 83 మీటర్ల ఎత్తులో 6.94 టీఎంసీల నిల్వ సామర్థ్యం, 1.132 మీటర్ల పొడవు, 59 గేట్లతో బ్యారేజ్ పనులు చేపట్టారు. రూ. 2,121 కోట్లతో పరిపాలనా అనుమతులివ్వగా, రూ.1,700 కోట్లతో ఏజెన్సీలతో ఒప్పందం కుదిరింది. మిగతా నిధులను పరిహారం, ఇతరత్రా అంశాలకు వెచ్చించనున్నారు. కాగా, ఈ పనుల్లో ఇప్పటికే రూ.1100 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. మట్టి, కాంక్రీట్ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. 59 గేట్లలో 50 గేట్ల తయారీ పూర్తయింది. గేట్లు అమర్చే పనులు ప్రారంభించగా ఒక గేటు అమర్చడం పూర్తయింది. ఏప్రిల్ చివరి నాటికి మొత్తం గేట్లు అమర్చే ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రోడ్ బ్రిడ్జి స్లాబ్‌లు సైతం 40 వరకు పూర్తయ్యాయి. 30 పియర్ నిర్మాణాలు పూర్తి కాగా.. వాటి మధ్యలో నుంచే ప్రస్తుతం గోదావరి నీటి ప్రవాహం దిగువకు వెళ్తుంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో ఇక్కడ నీటి నిల్వ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఇంజనీర్లను ఆదేశించారు. అంతేకాకుండా గేట్లకు ప్రిసైటింగ్ ఐరన్ రోప్‌ను రక్షణగా అమర్చనున్నారు. ప్రస్తుతం రెండు మోటార్ల ద్వారానే.. దేవాదుల ఎత్తిపోతల పథకం విషయానికొస్తే మొదటి దశలో రెండు మోటార్లు, రెండో దశలో రెండు మోటార్లు, మూడో దశలో ఆరు మోటార్లను అమర్చారు. కానీ ప్రధానంగా రెండు పైపులైన్లు మాత్ర మే రిజర్వాయర్లకు అనుసంధానం చేసి ఉన్నాయి. దీంతో వాటి ద్వారానే నీటిని పంపించడం జరుగుతుంది. సమ్మక్క బ్యారేజ్ నిర్మాణం పూర్తయితే దేవాదుల వద్ద జలకళ సంతరించుకోనుంది. ఇప్పటికే పనులు జరుగుతున్న క్రమంలో కాపర్ డ్యామ్‌ను నిర్మించి నీరు దేవాదుల వద్ద నిల్వ ఉండే విధంగా చర్యలు చేపట్టారు. జలాశయాల్లో కావాల్సినంత నీరు ఉండడం వల్ల ప్రస్తుతా నికి మోటార్లను ప్రారంభించలేదు. పియర్స్‌లో కాంక్రీట్ నింపుతున్న ఎలివేటర్ బ్లూమర్ నాలుగు కిలోమీటర్ల మేర.. ఎగువ ఉన్న ప్రాజెక్టుల నీరు తుపాకులగూడెం బ్యారేజ్ వద్ద నిల్వ ఉండేలా బ్యారేజ్ స్లూయిస్ నిర్మాణం 70 నుంచి 71 మీటర్ల లెవల్ వరకు పనులు ఇప్పటి వరకే పూర్తి చేశారు. ఈ లెవల్లో 2.90 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వర్షాకాలంలో వరద మొదలయ్యే నాటికి ఒక్క టీఎంసీ నీటిని కూడా దిగువకు వదలొద్దన్న ఉద్దేశంతో జూలై, ఆగస్టు నాటికి బ్యారేజ్ ఎఫ్ఆర్ఎల్ 83 మీటర్ల మేర(6.94 టీఎంసీలు) నీరును నిల్వ చేసేలా పనులు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పనులు వేగంగా చేసి దేవాదుల కింద వరంగల్, కరీంనగర్‌లోని 6.26 లక్షల ఎకరాల ఆయకట్టకు సాగు నీరు అందించాలనే లక్ష్యాన్ని సమ్మక్క బ్యారేజ్ సాధ్యం చేయనుంది. కాగా, సమ్మక్క బ్యారేజీ వద్ద గేట్ల నిర్మాణం పూర్తయితే నాలుగు కిలోమీటర్ల మేర గోదావరిలో నీరు నిల్వ ఉంటుంది. ఇలా బ్యాక్ వాటర్ సమృద్ధిగా నిల్వ కాగానే.. దేవాదులలోని మోటార్లు నడిపి దిగువకు నీరు ఎత్తిపోస్తారు. సముద్రమట్టానికి 72 మీటర్ల దిగువన.. దేవాదుల ఎత్తిపోతల పథకం ఇన్‌టేక్‌వెల్ సముద్రమట్టానికి 72 మీటర్ల దిగువన మోటార్లును అమర్చారు. సమ్మక్క బ్యారేజ్ నుంచి దేవాదుల వరకు సుమారు 4 కిలోమీటర్ల మేర నీరు నిల్వ ఉండనుంది. నీరు 71 మీటర్ల మేర నిల్వ ఉంటే ఇన్టేక్వెల్లోని పది మోటార్లను ప్రారంభించి ఒక్కసారిగా నీరు ఎత్తిపోసే అవకాశముంది. పనులు కొనసాగుతున్నాయి.. సమ్మక్క బ్యారేజ్ పనుల్లో 7.50 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను పూర్తి చేశాం. ఒక గేటు పూర్తిగా బిగించాం. రెండో గేటు బిగింపు పనులు సాగుతున్నాయి. అయితే, 59 గేట్లకు గాను 58 గేట్లు సిద్ధం ఉన్నాయి. రాంత్రిబవళ్లు పనులు చేయిస్తూ త్వరగా బ్యారేజీ సిద్ధమయ్యేలా చూస్తున్నాం. – జగదీష్, ఈఈ, సమ్మక్క బ్యారేజ్ -
‘418 చెరువులు నింపేలా చర్యలు తీసుకుంటాం’
సాక్షి వరంగల్ : జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా వరంగల్ ఉమ్మడి జిల్లాకు సాగునీరు అందించేందుకు ప్రణాళిక ఖరారైంది. అక్టోబర్ 10వ తేదీ వరకు దశల వారీగా ఈ ప్రాజెక్టు కింద ఉన్న 418 చెరువులను నింపేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. దేవాదుల ఎత్తిపోతల పథకం నీటి విడుదల ప్రణాళిక 2019–20పై హైదరాబాద్‌లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోమవారం సమీక్ష నిర్వహించారు. జనగామ జెడ్పీ చైర్మన్ పి.సంపత్‌రెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపేట, పరకాల, భూపాలపల్లి, జనగామ ఎమ్మెల్యేలు టి.రాజయ్య, అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, ఎం.యాదగిరిరెడ్డి, దేవాదుల ప్రాజెక్టు సీఈ బంగారయ్య, ఎస్ఈ సుధాకర్‌రెడ్డి, జనగామ జేసీ ఓ.జే.మధు, డీసీపీ శ్రీనివాసరెడ్డితో పాటు సాగునీటి శాఖ, రెవెన్యూ, పోలీసు అధికారులు పాల్గొన్నారు. చెరువులకు చేరేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఈసారి మంచి వర్షాలు రావడంతో గోదావరి నదికి గణనీయ స్థాయిలో వరద ఉందని... దీన్ని వినియోగించుకునేలా రిజర్వాయర్ల నుంచి చెరువులకు నీరు తరలించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమీక్షా సమావేశంలో ఆదేశించారు. ‘వరంగల్ ఉమ్మడి జిల్లాలోని జనగామ జిల్లా మినహా అంతటా చెరువుల్లోకి నీరు చేరాయి. వర్షాభావం తక్కువగా ఉండే జనగామ జిల్లాకు దేవాదుల ప్రాజెక్టుతోనే నీరు అందుతుంది. ఖరీఫ్‌లో పంటలు పండేలా చెరువులకు నీటిని చేరవేయాలి. 418 చెరువులు నింపేలా చర్యలు తీసుకుంటాం’ అని మంత్రి అన్నారు. నీటి విడుదల ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని, ఆటంకం కలిగించే వారిని ఉపేక్షించేది లేదన్నారు. ఈ విషయంలో అందరికీ అవగాహన కల్పించేలా గ్రామాల్లో డప్పు చాటింపు చేయాలని, పంపులు, తూములు, కట్టలను ధ్వంసం చేసే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ విషయంలో ఎమ్మెల్యేల పూర్తి సహకారం ఉంటుందని, సాగునీరు కచ్చితంగా చివరి వరకు చేరుతుందనే ధీమాను రైతులకు కల్పించాలని సూచించారు. పోలీసులు పెట్రోలింగ్‌తోపాటు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలన్నారు. దేవరుప్పుల, సింగరాయపల్లి, కడివెండి, శాతాపురం చెరువులను నింపేలా ప్రణాళిక ఉండాలని.. ఉప్పుగల్, చెన్నూరు, పాలకుర్తి రిజర్వాయర్ల పనులను త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. అలాగే, వర్ధన్నపేట, పరకాల రైతులకు ఇబ్బంది లేకుండా దేవాదుల నీరు తరలించేలా పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి దయాకర్‌రావు ఆదేశించారు. ఎత్తిపోతల పంపింగ్ షెడ్యూల్ ఇలా... ధర్మసాగర్ రిజర్వాయర్ సౌత్(దక్షిణ) మెయిన్ కెనాల్ ద్వారా సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 21 వరకు మొత్తం 12 రోజులపాటు తొలి విడతగా నీటిని విడుదల చేసి 62 చెరువులు నింపుతారు. ధర్మసాగర్ రిజర్వాయర్ నార్త్(ఉత్తర) కెనాల్ ద్వారా ఈనెల 20 నుంచి సెప్టెంబర్ 4 వరకు 27 చెరువులకు నీరు విడుదల చేస్తారు. ధర్మసాగర్ నుంచి ఆర్.ఎస్.ఘన్పూర్ ఫేజ్–1 ద్వారా ఇప్పటికే 12 చెరువులకు నీరు వదిలారు. ధర్మసాగర్ నుంచి ఆర్.ఎస్.ఘన్పూర్ ఫేజ్–2 ద్వారా సోమవారం నాటికి 28 చెరువులకు నీరు వదిలినట్లు పేర్కొన్నారు. ఆర్.ఎస్.ఘన్పూర్ రిజర్వాయర్ కుడి ప్రధాన కాలువ ద్వారా సెప్టెంబర్ 11 నుంచి 25 వరకు మొత్తం 15 రోజులు 30 చెరువులకు, ఆర్.ఎస్.ఘన్పూర్ రిజర్వాయర్ 4 ఎల్ డిస్ట్రిబ్యూటరీ ద్వారా సెప్టెంబర్ 11 నుంచి 25 వరకు 42 చెరువులకు, ఆర్.ఎస్.ఘన్పూర్ – అశ్వారావుపల్లి మెయిన్ ప్రెజర్ వాల్వ్‌ల ద్వారా సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 10 వరకు 11 చెరువులకు నీటి విడుదల జరగనుంది. ఇక నవాబ్‌పేట రిజర్వాయర్ ద్వారా ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 10 వరకు 82 చెరువులకు, అశ్వారావుపల్లి రిజర్వాయర్ కుడి ప్రధాన కాలువ ద్వారా సెప్టెంబర్ 26 నుంచి అక్టోబరు 10 వరకు మొత్తం 15 రోజులపాటు తొలి విడత నీటి విడుదల చేసేలా ప్రణాళిక ఉంది. అశ్వారావుపల్లి రిజర్వాయర్ గ్రావిటీ మెయిన్ కెనాల్ ద్వారా సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 10 వరకు 11 చెరువులకు నీటి విడుదల జరగనుంది. చీటకోడూరు రిజర్వాయర్ రిజర్వాయర్ ప్రధాన కాలువ ద్వారా సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 10 వరకు, బొమ్మకూరు ఎడమ కాలువ ద్వారా ఆగస్టు 24 వరకు 6 చెరువులకు, కుడి కాలువ ద్వారా ఆగస్టు 26 వరకు10 చెరువులకు, బొమ్మకూరు ఫేజ్–2 లోని కన్నెబోయినగూడెం రిజర్వాయర్ ద్వారా ఆగస్టు 25 వరకు15 చెరువులకు, వెల్లండ రిజర్వాయర్ ద్వారా 11 చెరువులకు, తపాస్‌పల్లి ఎడమ కాలువ ద్వారా ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 9 వరకు 23 చెరువులకు, కుడి కాలువ ద్వారా 39 చెరువులకు నీరు విడుదల చేస్తారు. అలాగే ఐనాపూర్ రిజర్వాయర్ ద్వారా సెప్టెంబర్ 2 నుంచి 16వ తేదీ వరకు మొత్తం 15 రోజులపాటు నీటి విడుదల చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. -
వ్యక్తి దారుణ హత్య
సాక్షి, చిల్పూరు: జనగామ జిల్లా చిల్పూరు మండలం గార్లగడ్డ తండా పంచాయతీ పరిధిలోని మల్లన్నగండి దేవాదుల రిజర్వాయర్ సమీపంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి(45)ని హత్య చేశారు. ఈ సందర్భంగా తల, మొండెంను వేరు చేసి కేవలం మొండెం తీసుకొచ్చి రిజర్వాయర్‌లో వేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి మృతుడిని సమ్మక్క గద్ధెల సమీపంలోకి తీసుకొచ్చి పదునైన కత్తితో నరికారు. ఆ తర్వాత చున్నీతో మృతుడి కాళ్లు కట్టి లాక్కుంటూ రిజర్వాయర్ వద్ధకు ఈడ్చుకువచ్చినట్లు గుర్తించారు. అదే చున్నీ మరో చివరకు రాయి కట్టి మృతదేహం తేలకుండా రిజర్వాయర్‌లో వేసినట్లు తెలుస్తోంది. అయితే, అయితే చీకటిగా ఉండడంతో మృతదేహం గట్టు సమీపంలో రాళ్లకు తట్టి ఉండి పోయింది. కాగా, ఘటనా స్థలంలో లేడీస్ వాచ్ లభించడం, మృతదేహాన్ని చున్నీతో కట్టడంతో నేరంలో ఓ మహిళ కూడా పాల్గొని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు బుధవారం ఉదయం డీసీపీ వెంకటేశ్వరరెడ్డి, ఏసీపీ వెంకటేశ్వరబాబు, సీఐ రాజిరెడ్డి, ఎస్ఐ శ్రీనివాస్‌తో పాటు డాగ్‌స్క్వాడ్ చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. -
మళ్లీ మళ్లీ పొడిగింపు..!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర సత్వర సాగునీటి ప్రాయోజిత కార్యక్రమం (ఏఐబీపీ) కింద ప్రారంభమైన సాగునీటి ప్రాజెక్టుల పనులు ఇప్పట్లో పూర్తయ్యేలా లేవు. ఏఐబీపీ పరిధిలో ఉన్న 11 రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులను గత ఏడాది జూన్ నాటికే పూర్తి చేయాలని కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలున్నా అవి ఇప్పటికీ పూర్తి కాలేదు. చాలా ప్రాజెక్టుల కింద భూసేకరణ, నిధుల విడుదలలో జాప్యం వల్ల ప్రాజెక్టులను ఈ సీజన్లో పూర్తి చేయలేమని వచ్చే జూన్ వరకు గడువు పొడగించాలని నీటి పారుదల శాఖ కేంద్ర జల సంఘాని (సీడబ్ల్యూసీ)కి స్పష్టం చేసింది. పొడిగింపు జాబితాలో భారీ ఆయకట్టు లక్ష్యాలున్న దేవాదుల, ఇందిరమ్మ వరద కాల్వ, ఎస్సారెస్పీ–2, భీమా వంటి ప్రాజెక్టులు ఉండటం గమనార్హం. మూడు పూర్తి.. ఎనిమిది అసంపూర్తి.. ఏఐబీపీ కింద రాష్ట్రంలోని కొమురం భీం, గొల్ల వాగు, ర్యాలివాగు, మత్తడివాగు, పెద్దవాగు, పాలెంవాగు, ఎస్సారెస్పీ–2, దేవాదుల, జగ న్నాధ్పూర్, భీమా వరద కాల్వ ప్రాజెక్టులను గుర్తించిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుల నిర్మాణం కోసం రూ.24,719 కోట్లు అవసరం ఉండగా ఇప్పటికే 18,838 కోట్లు ఖర్చు చేశా రు. మరో రూ.5,881 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఈ మొత్తం అవసరాల్లో కేంద్రం తన సాయం కింద రూ.4,513 కోట్లు అందించాల్సి ఉండగా ఇంతవరకు రూ.3,949 కోట్లు అం దించింది. మరో రూ.564 కోట్ల మేర అందించాలి. ఈ ప్రాజెక్టులను 2014 నాటికే పూర్తి చేయాల్సి ఉన్నా ఇప్పటివరకు వాటి గడువును 4 సార్లు పొడిగించారు. 2017 మార్చిలో దీనిపై ప్రధాని మోదీ సమీక్షించినపుడు ఆ ఏడాది జూన్ నాటికే దేవాదుల, భీమా, ఎస్సారెస్పీ–2, మత్తడివాగులు పూర్తి చేస్తామని తెలిపింది. గొల్లవాగు, జగన్నాధ్‌పూర్ పెద్దవాగు, పాలెంవాగు, కొమురం భీం, ర్యాలివాగు, నీల్వాయిలను 2018 జూన్ నాటికి పూర్తి చేస్తామంది. గొల్లవాగు, ర్యాలివాగు, మత్త డి వాగే పూర్తయ్యాయి. మరో 8 ప్రాజెక్టుల పరిధిలో 15 వేల ఎకరాలు భూ సేకరణ చేయాల్సి ఉండటంతో ఆలస్యమయ్యాయి. భూ సేకరణలో జాప్యం: దేవాదుల ప్రాజెక్టుకు మొత్తంగా 14,965 హెక్టార్ల భూమి అవసరం ఉండగా, ఇంతవరకు 11వేల హెక్టార్లు సేకరించగా, మిగతా 3,900 హెక్టార్లను సేకరించాలి. దీంతో పాటే ఇందిరమ్మ వరద కాల్వ పనులకు అడ్డంకిగా మారిన జాతీయ రహదారి క్రాసింగ్ పనులను, భీమా, కొమురం భీంలో మిగిలిపోయిన భూ సేకరణను వేగిరం చేసి పనులు పూర్తి చేయాల్సి ఉండగా అది పూర్తవలేదు. దీంతో పనులు నెమ్మదించాయి. ఈ నేపథ్యంలో మంగళవా రం దీనిపై కాడా అధికారులతో కేంద్ర జల సంఘం సీఈ రంగారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇందులో ప్రాజెక్టు పూర్తికి కొత్త లక్ష్యాలను నిర్ణయించారు. పాలెంవాగును ఈ ఏడాది డిసెంబర్‌కు, దేవాదుల, ఎస్సారెస్పీ–2, భీమా, నీల్వాయి, కుమురం భీం, జగన్నాధ్పూర్లను వచ్చే ఏడాది జూన్ నాటికి, ఇందిరమ్మ వరద కాల్వ పనులను వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని నీటి పారుదల శాఖ హామీ ఇచ్చిం ది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సత్వ రం విడుదల చేస్తే నిర్ణీత సమయానికి పూర్తి చేయడం సాధ్యమేనని తేల్చి చెప్పింది. -
కొంత మోదం.. కొంత ఖేదం!
సాక్షి, హైదరాబాద్: గోదావరి నుంచి 60 టీఎంసీల నదీ జలాలను వినియోగించుకుంటూ చేపట్టిన దేవాదుల ఎత్తిపోతల పథకానికి అనేక ఆటుపోట్లు ఎదురవుతున్నాయి. తొలిరెండు దశల్లో అనుకున్న రీతిలో నీళ్లివ్వగలిగినా.. మూడో దశకు మాత్రం అవాంతరాలు వస్తున్నాయి. దీంతో మూడో దశ కింద మరో ఏడాదికి కానీ నీళ్లివ్వలేని పరిస్థితి తలెత్తుతోంది. దేవాదుల ప్రాజెక్టు ద్వారా 6.21 లక్షల ఎకరాలకు సాగు నీరిచ్చే లక్ష్యంతో ప్రభుత్వం మూడు దశలుగా విభజించి పనులు మొదలు పెట్టింది. రెండు దశల ద్వారా గతేడాది ఖరీఫ్‌లో గరిష్టంగా 7.93 టీఎంసీల నీటిని ఎత్తిపోసి 319 చెరువులను నింపారు. రబీలోనూ 3.5 టీఎంసీల నీటిని తరలించి తాగునీటి అవసరాలను తీర్చగలిగారు. ఈ ఏడాది ఖరీఫ్ నుంచి మరింత నీటిని ఎత్తిపోసి 395 చెరువులను నింపే లక్ష్యంతో అధికారులు పని చేస్తున్నారు. అనేక అడ్డంకులు.. పనుల్లో జాప్యం.. దేవాదుల మూడో దశ పనులను 8 ప్యాకేజీలుగా విభజించి.. 2.41 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలని నిర్ణయించారు. తొలుత ప్రతిపాదించిన 25 కిలోమీటర్ల టన్నెల్‌తో రామప్ప దేవాలయానికి ప్రమాదం పొంచి ఉందన్న కారణంతో.. టన్నెల్ ప్రతిపాదన పక్కనపెట్టి పైప్‌లైన్ వ్యవస్థ పనులను ప్రభుత్వం చేపట్టింది. ప్యాకేజీ–3లో భాగంగా రామప్ప నుంచి ధర్మసాగర్‌కు నీటిని తరలించాల్సి ఉంది. దీనికోసం ఆసియాలోనే అత్యంత పొడవైన 54 కి.మీ.ల మేర టన్నెల్ తవ్వాల్సి ఉంది. ఈ టన్నెల్‌ను సలివాగు చెరువు కింది నుంచి ప్రతిపాదించగా, 2011లో చెరువు కింది టన్నెల్ ప్రాంతం కుంగి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. దీంతో 16.93వ కి.మీ ప్రాంతంలో పనులు రెండేళ్లుగా ఆగిపోయాయి. ఇక్కడ ప్రస్తుతం అధునాతన పద్ధతుల్లో పనులు మొదలు పెట్టినా అవి మరో ఏడాదికి కానీ పూర్తయ్యే పరిస్థితి లేదు. మరోవైపు టన్నెల్ తొలి 7 కి.మీ. అటవీ మార్గంలో వెళ్తోంది. తవ్వకాలకు అటవీ అనుమతులు వచ్చినా.. ఇక్కడి భూమి పొరలు పూర్తిగా సున్నపురాయి, బొగ్గు నిక్షేపాలతో ఉండటంతో టన్నెల్ నిర్మాణం ముందుకు కదలడం లేదు. పనులు కొనసాగిస్తే టన్నెల్ కూలే ప్రమాదం నేపథ్యంలో ఇతర మార్గాన్వేషణ జరుగుతుండటంతో పనులు ఆలస్యం అవుతున్నాయి. టన్నెల్ 49వ కి.మీ. వద్ద పంప్‌హౌజ్ నిర్మాణం చేయాల్సి ఉండగా ఇక్కడి భూమి పొరలు అనుకూలంగా లేవు. దీంతో పంప్‌హౌజ్ పనులకు మరో ఏడాది ఆలస్యమయ్యే అవకాశం ఉంది. -
దాహం తీర్చనున్న ‘దేవాదుల’
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది నిండు వేసవిలోనూ గోదావరి జలాల లభ్యత పెరగనుంది. దేవాదుల దిగువన తుపాకులగూడెం బ్యారేజీలో భాగంగా నిర్మించిన కాఫర్ డ్యామ్ వల్ల లభ్యత జలాలు మరింత పెరిగాయి. జనవరి చివరి నుంచి ఇప్పటికి 16 కిలోమీటర్ల మేర గోదావరి నీరు నిలవడంతో ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల తాగునీటి ఇక్కట్లు తొలగనున్నాయి. కాఫర్ డ్యామ్‌తో నిలిచిన నీటిలో ఒక టీఎంసీ మేర నీటిని తరలించగా, జూలై నాటికి కనిష్టంగా నాలుగైదు టీఎంసీలు తరలించి రిజర్వాయర్ల ద్వారా తాగునీరు సరఫరా చేసేలా అధికారులు రంగం సిద్ధం చేశారు. తొలిసారి వేసవిలో మళ్లింపు.. ఏటా గోదావరిలో జూలై నుంచి నవంబర్ వరకు 120 నుంచి 130 రోజుల పాటే నీటి లభ్యత ఉంటుంది. ఆ రోజుల్లోనే దేవాదుల నుంచి పంపింగ్ సాధ్యపడుతుంది. వేసవిలో నీటి ఎద్దడి ఎదుర్కొనేందుకు వీలుగా తుపాకులగూడెం వద్ద కాఫర్ డ్యామ్ నిర్మించారు. నిజానికి దేవాదుల పంపుల ద్వారా తుపాకులగూడెంలో నిల్వ చేసే నీటిని తీసుకోవాలంటే 72 మీటర్ల వద్ద గోదావరి నీటిని ఆపాల్సి ఉంటుంది. ప్రస్తుతం అక్కడ 71 మీటర్ లెవల్లో 3 వేల క్యూసెక్కుల మేర గోదావరి ప్రవహిస్తోంది. ఇలాగే జూన్, జూలై వరకు ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని 72 మీటర్ల వద్ద నీటిని ఆపేలా జనవరిలో రెండో వారంలోనే కాఫర్ డ్యాం నిర్మించారు. జనవరి 30న దేవాదుల ఇన్‌టేక్ పంపులను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. దేవాదుల, మొదటి, రెండో దశలోని మోటార్ల ద్వారా ఇప్పటికే ధర్మసాగర్ (1.5 టీఎంసీ) రిజర్వాయర్‌కు ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోశారు. ధర్మసాగర్ నుంచి గండిరామారం (0.4 టీఎంసీ), బొమ్మకూరు (0.19 టీఎంసీ) రిజర్వాయర్‌కు నీటిని తరలించేలా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం కాగా, మార్చిలో బొమ్మకూరు నుంచి బోయినగూడెం (0.12 టీఎంసీ), లద్దనూరు (0.29 టీఎంసీ) రిజర్వాయర్లకు పంప్ చేయాలని నిర్ణయిం చారు. ఆ వెంటనే వెల్దండ (01.5 టీఎంసీ), తపాసుపల్లి (0.3 టీఎంసీ) రిజర్వాయర్లకూ వేసవిలో నీటిని తరలించి తాగునీటి లభ్యత పెంచేందుకు కసరత్తు చేస్తున్నారు.ర 300 చెరువులు.. 1.5 లక్షల ఎకరాలు.. ధర్మసాగర్ చెరువు నుంచే ఆర్ఎస్ ఘణపురం రిజర్వాయర్ అక్కడినుంచి అశ్వరావుపల్లి (0.71 టీఎంసీ), చిట్టకోడూర్ (0.30 టీఎంసీ) రిజర్వాయర్లను నింపే చర్యలు ప్రారంభమయ్యాయి. మొత్తంగా ఈ వేసవికి 4 నుంచి 5 టీఎంసీలు మళ్లించుకునే వెసులుబాటు కలగనుంది. ఈ నీటితో దేవాదుల కింద 300 చెరువులను నింపడంతో పాటు రొటేషన్ పద్ధతిన సుమారు 1.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించొచ్చని అధికారులు చెబుతున్నారు. గతంలో 2014లో 4.15 టీఎంసీ, 2015లో 7.3 టీఎంసీ, 2016లో 6.83 టీఎంసీ, 2017లో 7.93 టీఎంసీల నీటిని దేవాదుల నుంచి ఎత్తిపోయగా, ఈ ఏడాది ప్రథమార్ధంలోనే 4 నుంచి 5 టీఎంసీలు ఎత్తిపోసే అవకాశం ఉంది. అది ఈ ఏడాది చివరికి కనిష్టంగా 20 టీఎంసీలకు చేరే అవకాశం ఉంటుందని నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు గరిష్టంగా 319 చెరువులకు నీరివ్వగా, అది 500కు పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నాయి. -
దేవాదులతో సస్యశ్యామలం
ఏటూరునాగారం(ములుగు): ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో పంటకు నీరు అందిస్తామని, దేవాదుల మోటార్లతో 5 టీఎంసీల నీటిని ఎత్తిపోయిస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. మంగళవారం కన్నాయిగూడెం మండలం దేవాదులలోని మూడో దశ మోటార్లలో ఉన్న రెండు మోటార్లను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో కలిసి హరీష్‌రావు ప్రారంభించారు. అనంతరం హరీష్‌రావు మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రజలకు తాగు, సాగునీరు అందించేందుకు తుపాకులగూడెం బ్యారేజీ వద్ద 72మీటర్ల మేర నీటి సామర్థ్యం ఉండేవిధంగా కాపర్‌డ్యామ్ (మట్టికట్ట) నిర్మించి, అందులోని నీటిని దేవాదుల ఇన్‌టెక్‌వెల్‌కు పంపించామని తెలిపారు. అక్కడ ఉన్న నీటిని మోటార్ల ద్వారా భీంఘన్‌పూర్ రిజర్వాయర్‌కు తరలించడంతో అన్ని రిజర్వాయర్లు నిండుతాయని చెప్పారు. దీంతో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో సుమారు 5టీఎంసీల నీటిని తోడుకోవడం జరుగుతుందని వివరించారు. ఇక పాత వరంగల్ జిల్లా ప్రజలకు వేసవిలోనూ తాగునీటి సమస్య ఉండదన్నారు. రబీ సీజన్లో సుమారు 50వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. బ్యారేజీ పూర్తయితే 365 రోజులు.. 2019 ఆఖరు వరకు దేవాదుల మూడో దశ పనులను పూర్తి చేయించి, తుపాకులగూడెం గోదావరిపై బ్యారేజీ నిర్మాణం పూర్తయితే 365 రోజులపాటు 100 టీఎంసీల నీటిని తీసుకోవడం జరుగుతుందని మంత్రి హరీష్‌రావు వివరించారు. రూ.1800కోట్లతో రామప్ప చెరువు నుంచి గణపసముద్రం చెరువుకు పైపులైన్ నిర్మించి నీటిని తరలిస్తామని, అలాగే పాకాల చెరువులోకి దేవాదుల నీటిని మళ్లించేందుకు రూ.136 కోట్లు మంజూరు చేశామన్నారు. యాద్రాద్రిలోని గుండాల చెరువు, లక్నవరం చెరువు, నర్సం పేట వద్ద ఉన్న ఎర్రరంగయ్య చెరువులకు కూడా నీటిని తరలించేవిధంగా చర్యలు చేపట్టామన్నారు. పనులు ఇలా చేస్తే ఎలా? తుపాకులగూడెం బ్యారేజీ వద్ద చేపట్టిన పనులు నిర్లక్ష్యంగా చేస్తే ఎలా? అని ఫిబ్రవరి నెలలో లక్ష క్యూబీక్ మీటర్ల కాంక్రీట్ పనులు జరగాలని రిత్విక్, ఎస్ఈడబ్ల్యూ కాంట్రాక్టర్లను హరీష్‌రావు ఆదేశించారు. పనులు జాప్యమవుతున్నాయని ఇంజినీరింగ్ చీఫ్ నాగేంద్రరావును ప్రశ్నించారు. పనుల్లో వేగం పెంచకపోతే ఇబ్బంది పడతామని అన్నారు. ఆయన వెంట ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిగిరిరెడ్డి, ఎంపీ సీతారాంనాయక్, సివిల్‌సప్లయ్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఇంజినీరింగ్ చీఫ్ నాగేంద్రరావు, దేవాదుల సీఈ బంగారయ్య, దేవాదుల ఎస్ఈ చిట్టిరావు, తుపాకులగూడెం ఎస్ఈ వెంకటేశ్వర్రావు, ఎస్ఈడబ్ల్యూ ఎండీ.రాజశేఖర్, రిత్విక్ ఎండి.సీఎంరాజేష్, మెగా ఇంజినీరింగ్ వైస్‌ప్రెసిడెంట్ ఎన్.సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు. కాగా వెంకటాపురం(కె) సీఐ రవీందర్, కన్నాయిగూడెం ఎస్సై వెంకటేశ్వర్రావు, ఏటూరునాగారం ఎస్సై కిరణ్‌కుమార్, మంగపేట ఎస్సై మహేందర్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు మధ్య హరీష్‌రావు పర్యటన సాగింది. స్పెషల్, సీఆర్పీఎఫ్ పోలీసు బలగాలతో పెద్ద సంఖ్యలో మోహరించారు. -
ఎట్టకేలకు ‘లింగంపల్లి’కి తుది రూపు
సాక్షి, హైదరాబాద్: గోదావరి జలాలను వినియోగించుకునేందుకు చేపట్టిన దేవాదుల ప్రాజెక్టులో అదనపు నీటి నిల్వలు పెంచేందుకు కొత్త రిజర్వాయర్ నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది. సీఎం కేసీఆర్ ఏడాదిన్నర కిందట చేసిన సూచనలకు అనుగుణంగా 10.78 టీఎంసీల సామర్థ్యంతో కొత్త రిజర్వాయర్‌ను నిర్మించే ప్రణాళికలు ఎట్టకేలకు కొలిక్కి వచ్చాయి. ప్రముఖ సర్వే సంస్థ వ్యాప్కోస్ సమర్పించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను పునఃపరిశీలించిన నీటిపారుదలశాఖ... రూ. 3,672 కోట్లతో వరంగల్ జిల్లా ఘణపూర్ మండలం లింగంపల్లి వద్ద దీన్ని నిర్మించాలని నిర్ణయించింది. గోదావరికి వరద ఉండే మూడు నెలల కాలంలో ధర్మసాగర్ నుంచి నీటిని రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసేలా దీన్ని డిజైన్ చేసింది. ఈ రిజర్వాయర్‌తో 4,060 ఎకరాల మేర ముంపు ఉంటుందని తేల్చింది. నీటిని ఎత్తిపోసేందుకు 72 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుందని, ఏటా విద్యుత్ ఖర్చు రూ. 67.55 కోట్లు వరకు ఉంటుందని అంచనా వేసింది. రిజర్వాయర్‌ను రెండున్నరేళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ పనులను రెండు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనిపై ప్రభుత్వం నుంచి పరిపాలనా అనుమతులు రాగానే టెండర్ల ప్రక్రియ మొదలు కానుంది. -
'దేవాదుల పూర్తిచేసి చెరువులు నింపుతాం'
సిద్దిపేట: గోదావరిపై తుపాకులగూడెం వద్ద బ్యారేజ్ నిర్మించి రెండు పంటలకు నీరిస్తామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం కొమురవెళ్లి మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ఆయన అనంతరం చెరువును పరిశీలించి సాదాబైనామా ధ్రువపత్రాలను పంపిణీ చేశారు. ఆయన వెంట మండలి విప్ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘‘సాదాబైనామాలతో ఇప్పటివరకు 11 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందారు. పైసా ఖర్చు లేకుండా సాదా బైనామా ధ్రువపత్రం, ఆర్ఓఆర్, టైటిల్ డీడ్ పంపిణీ చేస్తున్నాం. దేవాదుల మూడో దశ పనులు పూర్తి చేసి చెరువులు నింపుతామని’’ ఆయన తెలిపారు. -
జూన్ నాటికి నాలుగు ప్రాజెక్టులు పూర్తి కావాలి
- దేవాదుల, రాజీవ్ భీమా, ఎస్సారెస్పీ–2,మత్తడివాగు ప్రాజెక్టులపై కేంద్రం - ఖరీఫ్‌లో ఆయకట్టుకు నీరివ్వాలని ఆదేశం - పీఎంకేఎస్‌వై కింద ఈ ప్రాజెక్టులకు కేంద్ర నిధులు - ఇటీవలే కేంద్ర జల వనరుల శాఖతో సమీక్షించి టార్గెట్లు పెట్టిన ప్రధాని మోదీ సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌వై)కింద సాయం పొందుతున్న 4 రాష్ట్ర ప్రాజెక్టులను జూన్‌లోగా పూర్తి చేయాలని కేంద్రం డెడ్‌లైన్ పెట్టింది. దేవాదుల, రాజీవ్ భీమా, ఎస్సారెస్పీ–2, మత్తడివాగు ప్రాజెక్టులను పూర్తి చేసి కచ్చితంగా ఖరీఫ్‌లో నిర్ణీత ఆయకట్టుకు నీరిందించాలని ఆదేశించింది. పీఎంకేఎస్‌వై పథకం కింద దేశంలో 99 సాగు నీటి ప్రాజెక్టులకు కేంద్రం సాయం అందిస్తోంది. అందులో ఈ ఏడాది జూన్ నాటికి 21 ప్రాజెక్టులు పూర్తి చేయాలని, 5.22లక్షల హెక్టార్లకు నీరందించాలని గత నెల 30న జరిగిన సమీక్ష సందర్భంగా ప్రధాని మోదీ కేంద్ర జల వనరుల శాఖను ఆదేశించారు. ఆ 21 ప్రాజెక్టుల్లో తెలంగాణకు చెందిన నాలుగు ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటి పనుల పూర్తికి నీటి పారుదల శాఖ కసరత్తు చేస్తోంది. ఈ ఏడాది 4.. వచ్చే ఏడాది 6: పీఎంకేఎస్‌వై కింద రాష్ట్రంలోని కుమ్రం భీం, గొల్లవాగు, ర్యాలివాగు, మత్తడివాగు, పెద్దవాగు, పాలెంవాగు, ఎస్సారెస్పీ–2, దేవాదుల, జగన్నాథ్‌పూర్, భీమా, వరద కాల్వ ప్రాజెక్టులను గుర్తించారు. వాటి నిర్మాణం కోసం మొత్తంగా రూ.25,027 కోట్లతో అంచనాలు రూపొందించగా.. రూ.17,357.35 కోట్లు ఖర్చు చేశారు. రూ.7,669.65 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఈ నిధుల కోసం కేంద్రాన్ని సంప్రదించిన రాష్ట్రం ఏఐబీపీ కింద నిధులు సమకూ ర్చాలని కోరింది. సానుకూలంగా స్పందించిన జల వనరుల శాఖ రూ.1,196 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. 2016–17లో రూ.537.65 కోట్లు విడుదల చేసింది. మిగతా నిధులు అందాల్సి ఉంది. ఈ 11 ప్రాజెక్టుల్లో దేవాదుల, రాజీవ్ భీమా, ఎస్సారెస్పీ–2, మత్తడివాగు ప్రాజెక్టులు జూన్ నాటికి పూర్తవాల్సి ఉండగా.. గొల్లవాగు, జగన్నాథ్‌పూర్ పెద్దవాగు, పాలెంవాగు, కుమ్రం భీం, ర్యాలివాగు, నీల్వాయి ప్రాజెక్టులు వచ్చే ఏడాది పూర్తి కావాల్సిన జాబితాలో ఉన్నాయి. వరద కాల్వ పనులు 2019 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. 11 లక్షల ఎకరాలకు నీరు.. ఈ ఏడాది జూన్ నాటికి నిర్ణయించిన ప్రాజెక్టులను పూర్తి చేస్తే గరిష్టంగా 11 లక్షల ఎకరాల మేర ఆయకట్టు సాగులోకి వస్తుంది. అయితే లక్ష్యం మేర ప్రాజెక్టులు పూర్తవ్వాలంటే భూసేకరణ ప్రక్రియ వేగిరం చేయడం, పునరావా స కార్యక్రమాలను పూర్తి చేయడం వంటివి యుద్ధప్రాతిపదికన చేయాల్సి ఉంది. దేవాదుల ప్రాజెక్టుకు 14,965 హెక్టార్ల భూమి అవసరం ఉండగా.. 10,428 హెక్టార్లు సేకరించారు. మిగతా 4,267 హెక్టార్లను సేకరించాల్సి ఉంది. ఇక వరద కాల్వ పనులకు అడ్డంకిగా మారిన జాతీయ రహదారి క్రాసింగ్ పనులను, భీమా, కుమ్రం భీం ప్రాజెక్టుల్లో మిగిలిపోయిన భూసేకరణను వేగిరం చేసి, పనులు సత్వరం పూర్తి చేయాల్సి ఉంది. ప్రభుత్వం ప్రస్తుతం ఈ అంశాలపై దృష్టి సారించి పనుల వేగిరానికి నడుం బిగించింది. -
దేవాదులకు మరో రూ.170కోట్లు
పీఎంకేఎస్‌వై కింద విడుదల చేసిన కేంద్రం ఫలించిన మంత్రి హరీశ్‌రావు చొరవ సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన (పీఎంకేఎస్‌వై) కింద రాష్ట్రం నుంచి ఎంపిక చేసిన మూడు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం రూ.226.67 కోట్లు విడుదల చేస్తూ గురువారం ఉత్తర్వులిచ్చింది. ఇందులో చొక్కారావు దేవాదుల ప్రాజెక్టుకు రూ.170 కోట్లు, రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకానికి రూ.54 కోట్లు, మత్తడి వాగు ప్రాజెక్టుకు రూ.2.67 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సాయంతో దేవాదులకు కేంద్రం చేసిన సాయం రూ.1,787.14కోట్లకు చేరగా, తెలంగాణ ఏర్పాటు తర్వాత ఏకంగా రూ.647కోట్లు విడుదల కావడం గమనార్హం. పీఎంకేఎస్‌వై కింద రాష్ట్రంలోని కొమ్రం భీం, గొల్లవాగు, ర్యాలివాగు, మత్తడివాగు, పెద్దవాగు, పాలెంవాగు, ఎస్సారెస్పీ-2, దేవాదుల, జగన్నాథ్‌పూర్, భీమా, వరద కాల్వ ప్రాజెక్టులను గుర్తించిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుల నిర్మాణం కోసం మొత్తంగా రూ.25,027 కోట్లు అవసరం ఉండగా.. ఇప్పటికే 15,720.42 కోట్లు ఖర్చు చేశారు. మరో రూ.9,306.75 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఈ నిధుల కోసం తెలంగాణ నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు పలుమార్లు కేంద్రాన్ని సంప్రదించారు. 2016 మొదట్లో హరీశ్ రావుని పీఎంకేఎస్‌వై కమిటీలో సభ్యుడిగా చేర్చడంతో నిధుల వేట పుంజుకుంది. ఇందులో భాగంగానే కేంద్ర సాయం కింద రూ.1,108 కోట్లు, నాబార్డ్ రుణం ద్వారా రూ.7,955 కోట్లు ఇచ్చేందుకు సమ్మతించింది. ఇందులో 2016-17లోనే కేంద్ర సాయం కింద రూ.1,108కోట్ల మేర ఇస్తామని తెలుపగా, అందులో తొలి విడతగా రూ.226.67కోట్లు విడుదల చేసింది. దేవాదులకు బ్రహ్మరథం.. గోదావరి జలాలను వినియోగించుకుంటూ 2.48 హెక్టార్ల ఆయకట్టుకు నీటిని ఇచ్చేందుకు నిర్ణయించిన దేవాదుల ప్రాజెక్టును 2006లో ఏఐబీపీలో చేర్చారు. దీని తొలి అంచనా రూ.6,016కోట్లు కాగా, 2009-10లో రూ.9,427 కోట్లకు సవరిం చారు. అనంతరం 20శాతం ఎస్కలేషన్‌ను కలిపి రూ.9,840.85కోట్లుగా వ్యయాన్ని తేల్చారు. ఈ నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 25, 75 నిష్పత్తిన భరించాలి. ఈ మొత్తం వ్యయంలో కేంద్ర సాయం రూ.2,460.02 కోట్లు అందాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.1,787.14కోట్ల సాయం అందింది. ఇందులో తెలంగాణ ఏర్పాటుకు ముందు వరకు 8 ఏళ్లలో రూ.1,139.26 కోట్లు విడుదల కాగా రాష్ట్ర ఏర్పాటు తర్వాత రూ.647.88 కోట్లు విడుదలయ్యాయి. ఇక పీఎంకేఎస్‌వై కమిటీలో మంత్రి హరీశ్‌రావు సభ్యుడైన ఈ ఏడాదిలోనే ఏకంగా రూ.470.50 కోట్లు విడుదలయ్యాయి. దేవాదుల ప్రాజెక్టు కోసం మొత్తంగా 14,965 హెక్టార్ల భూమి అవసరం ఉండగా, ఇప్పటివరకు 10,428 హెక్టార్లు సేకరించారు. మిగతా భూమిని సేకరించే ప్రక్రియ వేగం పుంజుకుంది. ఇది పూర్తవగానే పూర్తి నిధులు ప్రాజెక్టుకు అందనున్నాయి. కాగా ప్రాజెక్టులకు కేంద్ర నిధుల విడుదలపై మంత్రి హరీశ్‌రావు గురువారం ఒక ప్రకటన లో హర్షం వ్యక్తం చేస్తూ.. కేంద్ర మంత్రి ఉమాభారతికి కృతజ్ఞతలు తెలిపారు. -
ఫాస్ట్ ట్రాక్‌లో ‘దేవాదుల’
పనుల్లో వేగం పెంచాలని అధికారులకు హరీశ్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: దేవాదుల ప్రాజెక్టు పనులను ఫాస్ట్‌ట్రాక్ పద్ధతిలో పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. పదహారేళ్లుగా ఈ ప్రాజెక్టు నత్తనడకన సాగుతోందన్న ఆయన, ఇకపై పనుల్లో వేగం పెంచేందుకు అధికారులు సమన్వ యంతో పనిచేయాలని సూచించారు. సోమవారం ఇక్కడ జలసౌధలో ఆయన దేవాదుల పనులను సమీక్షించారు. ప్యాకేజీల వారీగా భూసేకరణ, నిర్మాణ పనులపై ఆరా తీశారు. వచ్చే ఖరీఫ్ నా టికి నర్సంపేట, ములుగు, భూపాల పల్లి, పరకాల అసెంబ్లీ నియోజకవర్గాల రైతాంగానికి సాగు నీరివ్వాలని సీఎం పట్టుదలతో ఉన్నట్టు మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో దేవాదుల పనులపై తనకు రోజూ నివేదిక ఇవ్వాలన్నారు. అలాగే ప్రతి శనివారం మధ్యాహ్నం 2 గంటలకు భూసేకరణపై సమీ క్షించాలని జనగామ కలెక్టర్‌ను ఆదేశించారు. వచ్చే ఖరీఫ్‌లో రామప్ప, పాకాల, లక్నవరం చెరువులను నింపేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని మంత్రి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. 123జీవో ప్రకారం భూసేకరణ పనులను వేగవంతం చేయాలని కోరారు. 2018 కల్లా దేవాదుల మూడో దశ పూర్తి చేయా లన్నారు. దేవాదుల ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింద నిధులి స్తోందని, 2018 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలంగాణ ప్రభుత్వం కేంద్రా నికి స్పష్టంగా హామీ ఇచ్చిందని తెలిపా రు. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయడానికి రిటైర్డు తహసీల్దార్లను ఔట్ సోర్సింగ్ కింద తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. కంతనపల్లిపైనా సమీక్ష కంతనపల్లి బ్యారేజీ పురోగతిని కూడా మంత్రి హరీశ్‌రావు సమీక్షిం చారు. 2017 డిసెంబర్‌కల్లా నీరందిం చేలా చూడాలని, రెండేళ్లలో ఈ బ్యారేజీని పూర్తి చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. పంప్ హౌస్‌లు పూర్తి కాకుండా మోటార్లు, ఇతర పరికరాలు సమకూర్చుకో రాదని ఏజెన్సీలను మంత్రి ఆదేశించారు. పౌరసరఫరాల కార్పొ రేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్ రావు, జనగామ జిల్లా కలెక్టర్ దేవసేన, ఈఎన్ సీలు మురళీధర రావు, విజయ ప్రకాశ్, దేవాదుల చీఫ్ ఇంజనీర్ బి.వెంకటేశ్వర్లు, ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్ పాండే తదితరులు పాల్గొన్నారు. -
జలయజ్ఞంలో దేవాదుల ప్రాజెక్టుకు ప్రాధాన్యత
-
‘దేవా’(దుల) ఇదేమిటి?
పంటలు ఎండినంక నీరు ఇస్తారా? నీళ్లు ఉన్నా విడుదల చేయని వైనం ఆందోళనకు సిద్ధమవుతున్న రెండు మండలాల రైతులు భీమదేవరపల్లి: అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. ధర్మసాగర్ రిజర్వాయర్‌లో పుష్కలంగా నీరున్నప్పటికీ దేవాదుల ఉత్తర కాలువ ద్వారా పంట పొలాలకు నీరందించేందుకు అధికారులు శ్రద్ధ చూపకపోవడంతో, మెట్ట ప్రాంత రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. గత 15 రోజుల నుంచి వరుణుడు మోహం చాటేయడంతో వందలాది ఎకరాల్లో మొక్కజొన్న, పత్తి పంటలు ఎండిపోతున్నాయి. పంటలకు నీరు అందించాల్సిన అధికారులు తమకేమి పట్టన్నట్లు వ్యవహరిస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. గోదావరి నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా వరంగల్ జిల్లా ధర్మసాగర్ రిజర్వాయర్‌లోకి పంపింగ్ అయ్యాక అందులో నుంచి దేవాదుల ఉత్తర కాలువ ద్వారా వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం దేవునూర్, సోమదేవరపల్లి గ్రామాల్లోని 2వేల ఎకరాలు హుస్నాబాద్, హుజురాబాద్ నియోజకవర్గాల పరిధిలోని భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి, ముల్కనూర్, కొప్పుర్, మాణిక్యాపూర్, హుజురాబాద్ మండలం కాట్రపల్లి, ఇప్పల్నర్సింగపూర్ ఎల్కతుర్తి మండలం దామెర, జగన్నాధపూర్, జీల్గుల, చింతలపల్లి, గోపాలపూర్, పెంచికల్‌పేట గ్రామాల్లోని 15 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. కాగా ఈ సంవత్సరం ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోగా గత 15 రోజులుగా ఎండలు తీవ్రం కావడంతో పంటలు ఎండుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో బావులు, చెరువుల్లోకి నీరు చేరలేదు. దాంతో రైతులు పంటలకు నీరు అందించడం గగనంగా మారింది. కాలువల్లో చెట్లు కాగా దేవాదుల ఉత్తర కాలువ అనేక చోట్ల గండ్లు పడడంతో ఇసుక, మట్టి కొట్టుక వచ్చి కాలువల్లో పేరుకుపోయాయి. ఇక అనేక చోట్ల కాలువల్లో చెట్లు పెరిగాయి. దీంతో నీరు విడుదల చేసిన పక్షంలో నీరు చాల మేరకు వధా అయ్యే పరిస్థితులున్నాయి. కాలువల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాల్సిన అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఇక దేవాదుల కాలువ మూలంగా పంటలకు నీరు అందే విషయం దేవుడెరుగు వర్షం నీరు వధాగా పోతుంది. ఇనుపరాతి గుట్ట నుంచి వచ్చే వర్షం నీరు అప్పాయి, మౌత కుంటలతో పాటుగా ఊర చెరువు, కొత్త చెరువుల్లోకి వరద నీరు వచ్చేవి. తద్వారా ఆయా కుంటలు, చెరువుల పరిధిలోని ఆయకట్టుకు సాగు నీరు అందేది. కాని ఉత్తర కాలువ బ్రిడ్జిలు సక్రమంగా నిర్మించకపోవడంతో వరద నీరు దేవాదుల కాలువలోకి వృధాగా పోతుంది. కాగా ఇటీవల దేవాదుల డీఈఈ రాంమోహన్ కాలువలను పరిశీలించి వెళ్లినప్పటికీ ఏలాంటి పనులు మాత్రం ప్రారంభం కాలేదు. S ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే విడుదల చేస్తాం – రాంమోహన్ డీఈఈ దేవాదుల ధర్మసాగర్ రిజర్వాయర్‌లో నీళ్లు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే ఉత్తర కాలువ ద్వారా సాగు నీరు అందిస్తాం. దేవాదుల కాలువ కాంట్రాక్టర్ కేతిరి సుదర్శన్‌రెడ్డి మృతి చెందడంతో మరమ్మతు పనుల్లో జాప్యం జరుగుతుంది. ఈ పనులను సైతం త్వరలో ప్రారంభిస్తాం. -
ఏడాదిలో దేవాదుల పూర్తి చేయాలి!
భూసేకరణ ప్రక్రియను వేగిరంచేయాలి అధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశాలు హైదరాబాద్: వచ్చే ఏడాది జూన్ నాటికి దేవాదుల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. దేవాదుల పథకానికి ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింద కేంద్రం నిధులిస్తోందని, ఈ దృష్ట్యా నిర్ణీత సమయంలోగా ప్రాజెక్టును పూర్తి చేయాలని, లేకుంటే కేంద్రం వద్ద తెలంగాణ ప్రతిష్టకు భంగం కలుగుతుందన్నారు. ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయడానికి సర్కిల్, డివిజన్ వారీగా యాక్షన్‌ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. సరిగా పనులు చేయని ఏజెన్సీలను తొల గించి వేరే ఏజెన్సీలకు పనులు అప్పగించాలన్నారు. బుధవారం ప్రాజెక్టుపురోగతి, భూసేకరణ సమస్యలు.. తదితరాలపై సచివాలయంలోని సీ బ్లాక్ నుంచి మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేవాదుల ప్రాజెక్టు పనుల్లో ఉదాసీనతను ఉపేక్షించేది లేదన్నారు. నష్కల్, చెన్నూరు, పాలకుర్తి రిజ ర్వాయర్ల పనులను వేగవంతం చేయాలన్నా రు. దేవాదుల కింద వరంగల్, నల్లగొండ, మెదక్ జిల్లాల్లో 9,199 ఎకరాల మేర భూసేకరణ జరగాల్సి ఉండగా, 3,121 ఎకరాలను సేకరించారని, మిగతా భూమిని త్వరగా సేకరించాలని సూచించారు. ఇందుకు రెవెన్యూ అధికారులతో పాటు ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకోవాలని, భూసేకరణలో చురుగ్గా పనిచేసే తహసీల్దార్లకు బాధ్యతలు అప్పగించాలని మంత్రి సూచించారు. ప్రధాని పర్యటన ముగిసిన అనంతరం రెండు రోజుల పాటు ఎస్సారెస్పీ రెండోదశ ప్రాజెక్టు పనులను పరిశీలిస్తానన్నారు. కాల్వల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, వ్యర్థాలను తొలగించాలని సూచించారు. ఎస్సారెస్పీ రెండో దశకు 2,490 ఎకరాలు సేకరించాల్సి ఉండగా ఇంకా 1,058 ఎకరాలు పెండింగ్‌లో ఉందని, దాన్ని పూర్తి చేయాలన్నారు. ఈ సమీక్షలో నీటిపారుదల శాఖ స్పెషల్ సెక్రటరీ ఎస్కే జోషి, ఈఎన్సీ మురళీధర్‌రావు, దేవాదుల సీఈ వెంకటేశ్వర్లు, ఓఎస్డీ శ్రీధర్‌దేశ్‌పాండే తదితరులు పాల్గొన్నారు. వచ్చే నెలలో ఎల్లంపల్లి నుంచి సాగుకు నీరు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఆశించిన స్థాయి లో నీరు చేరుతున్న దృష్ట్యా పంటలకు నీరిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోం ది. తొలివిడతగా ప్రాజెక్టు పరిధిలోని 30వేల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయిం చింది. సెప్టెంబర్ తొలివారంలో ఈ నీటి ని విడుదల చేయనున్నారు. ఈ మేరకు బుధవారం ప్రాజెక్టుపై సమీక్ష సందర్భం గా మంత్రి హరీశ్ అధికారులకు స్పష్టతనిచ్చారు. 20.18 టీఎంసీల సామర్థ్యము న్న ఎల్లంపల్లి ప్రాజెక్టులో తొలిసారిగా 17.51 టీఎంసీల నీరు చేరింది. మేడారం పంప్‌హౌస్, గంగాధరం పంప్‌హౌస్‌కు సంబంధించి ఈ నెల 25న ట్రయల్న్ ్రనిర్వహించాలని సూచించారు. -
పైప్‌లైన్ లీక్,ఎగసిపడుతోన్న నీరు
-
కొత్తగా సాగులోకి 2.61 లక్షల ఎకరాల ఆయకట్టు
- మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టుల కిందే 2 లక్షల ఎకరాలు - దేవాదుల కింద 58 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు - జూన్ నాటికి 7.32 లక్షల ఎకరాలకు నీరివ్వాలని లక్ష్యం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం ఏర్పడ్డాక నిర్మాణంలో ఉన్న భారీ, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల కింద ఇప్పటి వరకు కొత్తగా 2.61 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చింది. ఇందులో సుమారు 2 లక్షల ఎకరాల ఆయకట్టు ఒక్క మహబూబ్‌నగర్ జిల్లాలోనే సాగులోకి వచ్చినట్లు నీటి పారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత అత్యధికంగా దేవాదుల ప్రాజెక్టు కింద కొత్త ఆయకట్టు ఏర్పడిందని సాగునీటిశాఖ లెక్కలు తెలియజేస్తున్నాయి. రాష్ట్రంలో సాగుయోగ్యమైన మొత్తం భూమికి నీరందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1.37 లక్షల కోట్లతో 34 భారీ, మధ్యతరహా ప్రాజెక్టులను చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పటికే మూడు ప్రాజెక్టులు పూర్తికాగా, మరో 14 ప్రాజెక్టుల కింద పాక్షికంగా ఆయకట్టు వృద్ధిలోకి వచ్చింది. రాష్ట్రం ఏర్పాటు అనంతరం పాత ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు కొత్త ప్రాజెక్టులూ పూర్తి చేస్తామని ప్రభుత్వం మొదటినుంచీ చెబుతూ వస్తోంది. అయితే గతేడాదిలో పెద్దగా ఫలితాలు రాలేదు. 2014-15లో రూ.5,285.03 కోట్లు, 2015-16లో రూ.7,189.21 కోట్లను వ్యయం చేసింది. అయినప్పటికీ గతేడాది జూన్-జూలై నాటికి లక్ష్యంగా నిర్ణయించుకున్న 6 లక్షల ఎకరాల్లో 66,399 ఎకరాలకు మాత్రమే నీరందించగలిగారు. అయితే ఈ ఏడాది కాలంలో కొన్ని ప్రాజెక్టుల పరిధిలో భూసేకరణ, సహాయ పునరావాస పనులు కొలిక్కి రావడంతో అదనంగా 1,95,200 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించగలిగారు. ఇలా మొత్తంగా ఇప్పటివరకు 2.61 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చింది. ఇందులో కల్వకుర్తి కింద 1.47 లక్షలు, నెట్టెంపాడు కింద 23,700, భీమా ప్రాజెక్టు కింద 21వేల ఎకరాల ఆయకట్టు వృధ్ధిలోకి వచ్చింది. అలాగే దేవాదుల కింద 58,899 ఎకరాలు, పాలెంవాగు కింద 5,500, కొమురంభీమ్ కింద 2 వేల ఎకరాలు సాగులోకి వచ్చింది. కాగా ఈ ఏడాది జూన్ నాటికి 8 ప్రాజెక్టులను పూర్తి చేయాలని, 11 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేయాలని నీటి పారుదల శాఖ ప్రణాళిక రూపొందించుకుంది. వీటి ద్వారా మరో 7,32,264 ఎకరాలకు నీరందించాలని లక్ష్యంగా నిర్ణయించింది. -
ఎండిన గోదావరి
దేవాదుల వద్ద కనిపించని నీరు ఏటూరునాగారం : ఏటూరునాగారం మండలం దేవాదుల జె.చొక్కారావు ఎత్తిపోతల పథకం కింద నిర్మించిన దేవాదుల ఇన్ టేక్ వెల్ వద్ద గోదావరి ఎండిపోయింది. దీంతో తెలంగాణ మణిహారంగా భావించే ఈ ప్రాజెక్టు వద్ద ఇప్పుడు ఎడారిలా కనిపిస్తోంది. గోదావరి వరదను సకాలంలో ఉపయోగించుకోలేని అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టు నిశ్శబ్దంగా మారింది. దేవాదుల ప్రాజెక్టులో భాగంగా మొదటి దశలో రెండు మోటార్లు, రెండో దశలో రెండు మోటార్లు, మూడో దశలో ఆరు మోటార్లు అమర్చారు. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.13వేల కోట్లు వెచ్చించగా, తెలంగాణలోని 7.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. కానీ కేవలం ఒక లక్షకు నీరును సరఫరా ఇస్తున్నారు. కాగా, గత పాలకుల వివక్షతో దేవాదుల ప్రాజెక్టు దిగువన బ్యారేజీ నిర్మాణం చేపట్టకపోవడంతో ఈ రోజు ఎండిపోయిన గోదావరి చూడాల్సి వస్తోందని నిట్ రిటైర్డ ప్రొఫెసర్ పాండు రంగారావు ఆవేదన వ్యక్తం చేశారు. నీటిని తోడేందుకు మోటార్లు ఉన్నా.. నీరు లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. -
పనులు చేయని వారికే పట్టం
సాక్షి, హైదరాబాద్: చొక్కారావు దేవాదుల ప్రాజెక్టు మూడోదశ కాంట్రాక్టర్లపై నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రేమ కనబరుస్తోంది. అప్పగించిన పనులనే అర్ధంతరంగా ఆపేసిన కాం ట్రాక్టర్లకే మారిన డిజైన్, పెరిగిన అంచనాలతో కూడిన పనులను కట్టబెట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. తొలుత రూ.531 కోట్లు గా ఉన్న వ్యయ అంచనాలు మారిన డిజైన్ మేరకు రూ.1,349 కోట్లకు పెరగగా, ఆ పనులను కూడా టెండర్లు లేకుండానే అప్పగించేందుకు తాపత్రయపడుతున్నారు. దేవాదుల 3వ దశలో భాగంగా భీమ్ఘణపూర్ నుంచి రామ ప్ప చెరువును కలుపుతూ 49.6 క్యూసెక్కుల నీటిని తరలించేందుకు వీలుగా టన్నెల్ తవ్వకానికి సంబంధించిన రూ.531.70 కోట్ల పనులను 2008లో 4 కాంట్రాక్టు సంస్థల కన్షార్షియంకు అప్పగించారు. పనులను 2012 ఫిబ్రవరికి పూర్తి చేసేలా ఒప్పందం చేసుకున్నారు. అయితే పాలంపేట వద్ద టన్నెల్ పనుల్లో బ్లాస్టింగ్ వల్ల పక్కనే ఉన్న రామప్ప దేవాల యానికి పగుళ్లు ఏర్పడి దెబ్బతింటుందంటూ స్థానికులు అభ్యంతరాలు లేవనెత్తడంతో 2011 జూలై నుంచి పనులు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ పరిశీలన జరిపి ఆలయంపై పేలుళ్ల ప్రభావం పెద్దగా ఉండదని, అయినా చారిత్రక ఆలయం అయినందున 900 మీటర్ల అవతలకు టన్నెల్ పనులను తరలించాలని సూచించింది. తర్వా త రెండు మూడు ప్రత్యామ్నాయాలను పరిశీ లించి చివరికి.. భీమ్ఘణపూర్ నుంచి రామ ప్ప చెరువు వరకు ఇప్పుడున్న దేవాదుల ఫేజ్-2 పంప్‌హౌజ్, పైప్‌లైన్ వ్యవస్థకి సమాంతరంగా పైప్‌లైన్ వేయాలని నిర్ణయించారు. పనులు చేయని కాంట్రాక్టర్లకే... ముఖ్యమంత్రి సూచన మేరకు టన్నెల్‌కు బదులుగా పైప్‌లైన్ ద్వారా పనులు చేపడితే మొద ట వేసిన వ్యయ అంచనా రూ.531 కోట్లను దాటి రూ.1,349.59 కోట్లు ఉంటుందని నీటిపారుదల శాఖ తేల్చింది. దీనిలో పైప్‌లైన్‌కు రూ.784.68 కోట్లు, పంప్‌హౌజ్‌కు రూ.11.52కోట్లు, హైడ్రో మెకానికల్ పనులకు రూ.10.47 కోట్లు, ఎలక్ట్రో మెకానికల్ పనులకు 2.31కోట్లు, లేబర్ సెస్‌లకు రూ.266.91కోట్ల మేర అంచనాలు సిద్ధం చేశారు. తొలి అంచనాలతో పోలిస్తే పోలిస్తే రూ. 837 కోట్లు అదనంగా ఖర్చవుతుందని లెక్కలేశారు. ఈ పనులను పూర్తిగా మొదటి కాంట్రాక్టు సంస్థలకే అప్పగించాలని శాఖ ఇంజనీర్లు సిఫార్సు చేశారు. నిజానికి 2008లో రూ.511 కోట్ల పనులు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థలు 2011 వరకు మూడేళ్లలో కేవలం రూ.53.06 కోట్ల పనులు మాత్రమే చేశాయి. ఈ సంస్థలు అప్పటికే తీసుకున్న మొబిలైజేషన్ అడ్వాన్సులు మాత్రం రూ.53.17కోట్లు. కనీసం మొబిలైజేషన్ అడ్వాన్సుల మేర కూడా పని చేయలేదని కాంట్రాక్టు సంస్థలపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ప్రభుత్వ స్థాయిలోనూ ఆగ్రహం వ్యక్తమైంది. అయినా మళ్లీ ఆ కాంట్రాక్టు సంస్థలకే రూ. 1,349 కోట్ల పనులు కట్టబెట్టాలని అధికారులు సిఫార్సు చే శారు. తొలుత టన్నెల్‌గా ఉన్న డిజైన్ పైప్‌లైన్‌గా మారినా, అంచనాల్లో భారీ వ్యత్యాసమున్నా, వాటిని పరిగణనలోకి తీసుకోకుండా, కొత్తగా టెండర్లు పిలవకుండా పాత సంస్థలకే అప్పగించాలనడం చర్చనీయాంశమైంది. -
'వారి కష్టాలకు తెలంగాణ ప్రభుత్వమే కారణం'
ఢిల్లీ: తెలంగాణ పత్తి రైతుల కష్టాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వ తప్పిదమే కారణమని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఆరోపించారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో శుక్రవారం ఆయన మీడియాతో సమావేశమయ్యారు. 90 శాతం మంది రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుర్తింపు కార్డులివ్వలేదని విమర్శించారు. పత్తి రైతుల విషయంలో తమ బాద్యతను విస్మరించి, వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు తెలంగాణ సర్కార్ కేంద్రంపై విమర్శలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. వరంగల్ జిల్లాకు అన్యాయం చేసే విధంగా దేవాదుల ప్రాజెక్టు డిజైన్ మార్చుతున్నారంటూ బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం వద్ద నుంచి దేవాదుల ప్రాజెక్టు కోసం రూ. 63 కోట్లు తీసుకుని వృథా కేంద్ర మంత్రి చేశారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయకుండా సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ ప్రభుత్వానికి దత్తాత్రేయ సూచించారు. ప్రాజెక్టుల డిజైన్లు మార్చేటప్పుడు ప్రతిపక్షాలను సంప్రదించాలని అన్నారు. వరంగల్ టీఆర్ఎస్ విజయం ఖాయం అయితే ఉప ఎన్నికల ప్రచారంలో ఏడుగురు మంత్రులు ఎందుకు పని చేస్తారంటూ ఎద్దేవా చేశారు.