‘418 చెరువులు నింపేలా చర్యలు తీసుకుంటాం’ | Minister Errabelli Dayakar rao Review With Devadula Project Managers | Sakshi
Sakshi News home page

‘418 చెరువులు నింపేలా చర్యలు తీసుకుంటాం’

Published Tue, Aug 20 2019 10:10 AM | Last Updated on Tue, Aug 20 2019 10:10 AM

Minister Errabelli Dayakar rao Review With Devadula  Project Managers - Sakshi

ఉమ్మడి జిల్లా పరిధిలో దేవాదుల ప్రాజెక్టు కింద ఉన్న దేవాదుల నీటి విడుదలపై సమీక్ష నిర్వహిస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

సాక్షి  వరంగల్‌ : జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా వరంగల్‌ ఉమ్మడి జిల్లాకు సాగునీరు అందించేందుకు ప్రణాళిక ఖరారైంది. అక్టోబర్‌ 10వ తేదీ వరకు దశల వారీగా ఈ ప్రాజెక్టు కింద ఉన్న 418 చెరువులను నింపేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. దేవాదుల ఎత్తిపోతల పథకం నీటి విడుదల ప్రణాళిక 2019–20పై హైదరాబాద్‌లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోమవారం సమీక్ష నిర్వహించారు. జనగామ జెడ్పీ చైర్మన్‌ పి.సంపత్‌రెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపేట, పరకాల, భూపాలపల్లి, జనగామ ఎమ్మెల్యేలు టి.రాజయ్య, అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, ఎం.యాదగిరిరెడ్డి, దేవాదుల ప్రాజెక్టు సీఈ బంగారయ్య, ఎస్‌ఈ సుధాకర్‌రెడ్డి, జనగామ జేసీ ఓ.జే.మధు, డీసీపీ శ్రీనివాసరెడ్డితో పాటు సాగునీటి శాఖ, రెవెన్యూ, పోలీసు అధికారులు పాల్గొన్నారు. 

చెరువులకు చేరేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు
ఈసారి మంచి వర్షాలు రావడంతో గోదావరి నదికి గణనీయ స్థాయిలో వరద ఉందని... దీన్ని వినియోగించుకునేలా రిజర్వాయర్ల నుంచి చెరువులకు నీరు తరలించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమీక్షా సమావేశంలో ఆదేశించారు. ‘వరంగల్‌ ఉమ్మడి జిల్లాలోని జనగామ జిల్లా మినహా అంతటా చెరువుల్లోకి నీరు చేరాయి. వర్షాభావం తక్కువగా ఉండే జనగామ జిల్లాకు దేవాదుల ప్రాజెక్టుతోనే నీరు అందుతుంది. ఖరీఫ్‌లో పంటలు పండేలా చెరువులకు నీటిని చేరవేయాలి. 418 చెరువులు నింపేలా చర్యలు తీసుకుంటాం’ అని మంత్రి అన్నారు. నీటి విడుదల ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని, ఆటంకం కలిగించే వారిని ఉపేక్షించేది లేదన్నారు.

ఈ విషయంలో అందరికీ అవగాహన కల్పించేలా గ్రామాల్లో డప్పు చాటింపు చేయాలని, పంపులు, తూములు, కట్టలను ధ్వంసం చేసే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ విషయంలో ఎమ్మెల్యేల పూర్తి సహకారం ఉంటుందని, సాగునీరు కచ్చితంగా చివరి వరకు చేరుతుందనే ధీమాను రైతులకు కల్పించాలని సూచించారు. పోలీసులు పెట్రోలింగ్‌తోపాటు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలన్నారు. దేవరుప్పుల, సింగరాయపల్లి, కడివెండి, శాతాపురం చెరువులను నింపేలా ప్రణాళిక ఉండాలని.. ఉప్పుగల్, చెన్నూరు, పాలకుర్తి రిజర్వాయర్ల పనులను త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. అలాగే, వర్ధన్నపేట, పరకాల రైతులకు ఇబ్బంది లేకుండా దేవాదుల నీరు తరలించేలా పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి దయాకర్‌రావు ఆదేశించారు. 

ఎత్తిపోతల పంపింగ్‌ షెడ్యూల్‌ ఇలా...
ధర్మసాగర్‌ రిజర్వాయర్‌ సౌత్‌(దక్షిణ) మెయిన్‌ కెనాల్‌ ద్వారా సెప్టెంబర్‌ 9 నుంచి సెప్టెంబర్‌ 21 వరకు మొత్తం 12 రోజులపాటు తొలి విడతగా నీటిని విడుదల చేసి 62 చెరువులు నింపుతారు. ధర్మసాగర్‌ రిజర్వాయర్‌ నార్త్‌(ఉత్తర) కెనాల్‌ ద్వారా ఈనెల 20 నుంచి సెప్టెంబర్‌ 4 వరకు 27 చెరువులకు నీరు విడుదల చేస్తారు. ధర్మసాగర్‌ నుంచి ఆర్‌.ఎస్‌.ఘన్‌పూర్‌ ఫేజ్‌–1 ద్వారా ఇప్పటికే 12 చెరువులకు నీరు వదిలారు. ధర్మసాగర్‌ నుంచి ఆర్‌.ఎస్‌.ఘన్‌పూర్‌ ఫేజ్‌–2 ద్వారా సోమవారం నాటికి 28 చెరువులకు నీరు వదిలినట్లు పేర్కొన్నారు. ఆర్‌.ఎస్‌.ఘన్‌పూర్‌ రిజర్వాయర్‌ కుడి ప్రధాన కాలువ ద్వారా సెప్టెంబర్‌ 11 నుంచి 25 వరకు మొత్తం 15 రోజులు 30 చెరువులకు, ఆర్‌.ఎస్‌.ఘన్‌పూర్‌ రిజర్వాయర్‌ 4 ఎల్‌ డిస్ట్రిబ్యూటరీ ద్వారా సెప్టెంబర్‌ 11 నుంచి 25 వరకు 42 చెరువులకు, ఆర్‌.ఎస్‌.ఘన్‌పూర్‌ – అశ్వారావుపల్లి మెయిన్‌ ప్రెజర్‌ వాల్వ్‌ల ద్వారా సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 10 వరకు 11 చెరువులకు నీటి విడుదల జరగనుంది.

ఇక నవాబ్‌పేట రిజర్వాయర్‌ ద్వారా ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్‌ 10 వరకు 82 చెరువులకు, అశ్వారావుపల్లి రిజర్వాయర్‌ కుడి ప్రధాన కాలువ ద్వారా సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబరు 10 వరకు మొత్తం 15 రోజులపాటు తొలి విడత నీటి విడుదల చేసేలా ప్రణాళిక ఉంది. అశ్వారావుపల్లి రిజర్వాయర్‌ గ్రావిటీ మెయిన్‌ కెనాల్‌ ద్వారా సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 10 వరకు 11 చెరువులకు నీటి విడుదల జరగనుంది. చీటకోడూరు రిజర్వాయర్‌ రిజర్వాయర్‌ ప్రధాన కాలువ ద్వారా సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 10 వరకు, బొమ్మకూరు ఎడమ కాలువ ద్వారా ఆగస్టు 24 వరకు 6 చెరువులకు, కుడి కాలువ ద్వారా ఆగస్టు 26 వరకు10 చెరువులకు, బొమ్మకూరు ఫేజ్‌–2 లోని కన్నెబోయినగూడెం రిజర్వాయర్‌ ద్వారా ఆగస్టు 25 వరకు15 చెరువులకు, వెల్లండ రిజర్వాయర్‌ ద్వారా 11 చెరువులకు, తపాస్‌పల్లి ఎడమ కాలువ ద్వారా ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్‌ 9 వరకు 23 చెరువులకు, కుడి కాలువ ద్వారా 39 చెరువులకు నీరు విడుదల చేస్తారు. అలాగే ఐనాపూర్‌ రిజర్వాయర్‌ ద్వారా సెప్టెంబర్‌ 2 నుంచి 16వ తేదీ వరకు మొత్తం 15 రోజులపాటు నీటి విడుదల చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement