'వారి కష్టాలకు తెలంగాణ ప్రభుత్వమే కారణం'
ఢిల్లీ: తెలంగాణ పత్తి రైతుల కష్టాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వ తప్పిదమే కారణమని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఆరోపించారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో శుక్రవారం ఆయన మీడియాతో సమావేశమయ్యారు. 90 శాతం మంది రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుర్తింపు కార్డులివ్వలేదని విమర్శించారు. పత్తి రైతుల విషయంలో తమ బాద్యతను విస్మరించి, వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు తెలంగాణ సర్కార్ కేంద్రంపై విమర్శలు చేస్తోందని ఆయన మండిపడ్డారు.
వరంగల్ జిల్లాకు అన్యాయం చేసే విధంగా దేవాదుల ప్రాజెక్టు డిజైన్ మార్చుతున్నారంటూ బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం వద్ద నుంచి దేవాదుల ప్రాజెక్టు కోసం రూ. 63 కోట్లు తీసుకుని వృథా కేంద్ర మంత్రి చేశారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయకుండా సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ ప్రభుత్వానికి దత్తాత్రేయ సూచించారు. ప్రాజెక్టుల డిజైన్లు మార్చేటప్పుడు ప్రతిపక్షాలను సంప్రదించాలని అన్నారు. వరంగల్ టీఆర్ఎస్ విజయం ఖాయం అయితే ఉప ఎన్నికల ప్రచారంలో ఏడుగురు మంత్రులు ఎందుకు పని చేస్తారంటూ ఎద్దేవా చేశారు.