cotton farmers
-
ధరలేక దిగాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ధాన్యం రైతు దగా పడుతున్నట్లుగానే పత్తి రైతు కూడా చిత్తవుతున్నాడు. మద్దతు ధర కల్పనకు తేమ శాతం సాకుతో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) మోకాలడ్డుతుంటే అంతర్జాతీయ మార్కెట్‌ను సాకుగా చూపి వ్యాపారులు సిండికేట్‌గా మారిపోయారు. ఫలితంగా గతంలో ఎన్నడూలేని విధంగా పత్తి ధర పతనమైందని.. సర్కారు తీరువల్ల పెట్టుబడి కూడా దక్కడంలేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. రాష్ట్రంలో పత్తి సాధారణ విస్తీర్ణం 14.91 లక్షల ఎకరాలు. గతేడాది 15 లక్షల ఎకరాల్లో సాగవగా ఈ ఏడాది 9.82 లక్షల ఎకరాల్లో సాగైంది. వరదలు, వర్షాలకు తోడు గులాబీ తెగులు ప్రభావంతో ఎకరాకు 4–6 క్వింటాళ్లకు మించి దిగుబడి రావడంలేదంటున్నారు. ఈ ఏడాది కనీస మద్దతు ధరగా మధ్యస్థ రకానికి క్వింటా రూ.7,121, పొడవు రకానికి రూ.7,521గా కేంద్రం నిర్ణయించింది. కానీ, ఈ ఏడాది తొలితీత ప్రారంభానికి ముందే మార్కెట్లో ధరల పతనం మొదలైంది. గతేడాది క్వింటా రూ.10వేలకు పైగా పలికిన పత్తి ప్రస్తుతం మార్కెట్లో గ్రేడ్‌ను బట్టి క్వింటా రూ.4వేల నుంచి రూ.5,800 మించి పలకడంలేదు. మరోవైపు.. ఏటా అక్టోబరు మూడోవారంలో ప్రారంభం కావాల్సిన సీసీఐ కేంద్రాలు ఈ ఏడాది నవంబరు 11నాటికి కానీ ప్రారంభం కాలేదు. పైగా.. 33 ఏఎంసీల పరిధిలో 61 జిన్నింగ్ మిల్లులు ఏర్పాటుచేయాలని సంకలి్పంచగా, 45 జిన్నింగ్ మిల్లుల్లో మాత్రమే కొనుగోళ్లు మొదలయ్యాయి. సుదూర ప్రాంతాల్లో కేంద్రాలు.. ఇక కొనుగోలు కేంద్రాలను మారుమూలనున్న మిల్లుల వద్ద ఏర్పాటుచేయడంతో రవాణా, లోడింగ్ చార్జీలు రైతులకు తడిసిమోపెడవుతున్నాయి. ఉదా.. వైఎస్సార్ జిల్లాలో ఒక్క కేంద్రం ఏర్పాటుచేయలేదు. ఈ జిల్లాకు చెందిన రైతులు నంద్యాలకు తీసుకెళ్లి అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అలాగే, గుంటూరు జిల్లా తాడికొండ రైతులు కూడా 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రత్తిపాడు మండలంలోని కోయపాలెం మిల్లుకు వెళ్లాల్సి వస్తోంది. పోనీ ధర పెరిగే వరకు నిల్వచేసుకుందామనుకుంటే క్వింటాకు రూ.400–500 వరకు అద్దెలు చెల్లించాల్సి రావడంతో చేసేదిలేక అయినకాడకి అమ్ముకుంటున్నారు. తేమ శాతం పేరిట కొర్రీలు..కేంద్ర నిబంధనల మేరకు 8 శాతం తేమతోనే పత్తిని కొనుగోలు చేస్తారు. ఆ తర్వాత 12 శాతం వరకు ఒక్కో శాతం చొప్పున ఎమ్మెస్పీ ధరలో కోత విధిస్తారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, కర్నూలు జిల్లాల్లో పత్తి పిందె, పూతకొచ్చే దశలో కురిసిన అధిక వర్షాల కారణంగా తేమ శాతం 15–30 శాతం చొప్పున నమోదవుతుండగా, ప్రస్తుతం కురుస్తున్న మంచు ప్రభావంతో పెరుగుతున్న తేమశాతం రైతులకు ఇబ్బందికరంగా మారింది. కేంద్రాల్లో ఏర్పాటుచేసిన రెండు రకాల యంత్రాల్లో ఒక్కోదాంట్లో ఒక్కో రీతిలో తేమ శాతం నమోదవడంతో రైతులు నష్టపోతున్నారు. జిన్నింగ్ పరిశ్రమల యాజమాన్యాలతో సీసీఐ అధికారులు కుమ్మక్కై సర్వర్ నెమ్మదిగా ఉందని, తేమ శాతం ఎక్కువగా ఉందనే సాకులు చెబుతూ మద్దతు ధర దక్కనీయకుండా చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. తేమ శాతం అధికంగా ఉన్న పత్తిని నిల్వచేస్తే రంగు మారుతుండగా, నాణ్యమైన దిగుబడులొచి్చన చోట కేంద్రాలు ఏర్పాటుచేయకపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్లలేక రైతులు అయినకాడకి అమ్ముకోవల్సిన దుస్థితి ఏర్పడింది.ఒక్క కేంద్రం కూడా ఏర్పాటుచేయలేదు.. మా జిల్లాలో ఒక్క కేంద్రం కూడా ఏర్పాటుచేయలేదు. ఫలితంగా నంద్యాల జిల్లాలోని కేంద్రానికి వెళ్లాల్సి వస్తోంది. ఇక్కడి నుంచి వేలకు వేలు ఖర్చుపెట్టి లారీల్లో పత్తిని తీసుకుకెళ్తే అక్కడ నిమ్ము ఎక్కువగా ఉందని నాణ్యతలేదని రేటు తగ్గించేస్తున్నారు. మా జిల్లా నుంచి ఎవరు వెళ్లడంలేదు. ఇక్కడే అమ్ముకుంటున్నారు. గతేడాది మద్దతు ధరకు మించి పలికింది. ఈ ఏడాది రూ.6 వేలకు మించి పలకడంలేదు. దీంతో పాతది, ఇప్పటిదీ కలిపి దాదాపు 400 క్వింటాళ్ల పత్తిని ఇంట్లోనే ఉంచుకున్నాను. – నంద్యాల భాస్కర్‌రెడ్డి, రాజుపాలెం, వైఎస్సార్ జిల్లా ఎకరాకు రూ.5వేల నష్టం.. గతేడాది నవంబరులోనే గుంటూరు, ఒడిశా, రాయగడ, గుణుపూర్ ప్రాంతాలకు చెందిన వర్తకులు క్వింటా రూ.7వేలకు పైగా కొనుగోలు చేశారు. కానీ, ఈ ఏడాది రూ.6వేలకు మించి కొనడంలేదు. ఇలా అయితే ఎకరాకు రూ.3వేల నుంచి రూ.5వేల వరకు నష్టపోవాల్సి వస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఏ ఒక్కరికీ లభించడంలేదు. – పెద్దకోట జగన్నాథం, కర్లెం, కొత్తూరు మండలం, శ్రీకాకుళం జిల్లా -
ఏపీలో పత్తి కొనుగోలులో జాప్యం: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి,ఢిల్లీ:ఏపీలో పత్తి రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని,పత్తి కొనుగోలులో జాప్యం జరుగుతోందని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఎక్స్(ట్విటర్)లో సోమవారం(నవంబర్ 25) ఆయన ఒక పోస్టు చేశారు. ‘పత్తి ధరలు పడిపోవడంతో రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏపీలో కేవలం 20 పత్తి కొనుగోలు కేంద్రాలు మాత్రమే పనిచేస్తున్నాయి.కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి.కొంత తేమ ఉన్న పత్తిని కూడా కొనుగోలు చేసేలా సీసీఐకి ఆదేశాలు ఇవ్వాలి’అని విజయసాయిరెడ్డి కోరారు. -
ఖమ్మం పత్తి మార్కెట్ లో పత్తి రైతులతో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ
-
పత్తి రైతుకు ‘ధర’హాసం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పత్తి రైతులకు మంచి ధర దక్కాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఏటా నవంబర్ మొదటి వారంలో కొనుగోళ్లకు శ్రీకారం చుడుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఈ ఏడాది పత్తి ధరల్లో హెచ్చుతగ్గుల నేపథ్యంలో ఈ నెల 25వ తేదీ నుంచే కొనుగోలు కేంద్రాలు తెరవాలని నిర్ణయించింది. రాష్ట్రంలో పత్తి పండించిన ఏ ఒక్క రైతు నష్టపోకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా ముందుగానే పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయిస్తోంది. 12.85 లక్షల టన్నుల దిగుబడులు రాష్ట్రంలో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 14.13 లక్షల ఎకరాలు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో 13.50 లక్షల ఎకరాల్లో పత్తి సాగవగా.. 12.85 లక్షల టన్నుల దిగుబడులు వస్తాయని అంచనా. ఇటీవలే కనీస మద్దతు ధరలను ప్రభుత్వం ప్రకటించింది. ఏటా క్వింటాల్‌కు రూ.200 నుంచి రూ.300 వరకు పెంచుతుండగా, తొలిసారి ఏకంగా రూ.640 మేర పెంచింది. పొడుగు పింజ రకానికి క్వింటాల్‌కు రూ.7,020, మీడియం రకానికి రూ.6,620 చొప్పున కనీస మద్దతు ధర నిర్ణయించింది. ప్రస్తుతం ఆదోని మార్కెట్‌కు రోజుకు 3 నుంచి 5 వేల క్వింటాళ్ల పత్తి వస్తుండగా.. క్వింటాల్‌కు రూ.7 వేల నుంచి రూ.7,400 వరకు పలుకుతోంది. అప్రమత్తమైన ఫ్రభుత్వం కనీస మద్దతు ధరకు కాస్త అటూ ఇటుగా మార్కెట్ ధరలు ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా కొనుగోళ్లకు ఏర్పాట్లు చేసింది. 34 ఏఎంసీలతో పాటు 50 జిన్నింగ్ మిల్లుల వద్ద కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా క్వింటాల్‌కు రూ.13 వేల వరకు ధర లభిస్తుందని అంచనా వేస్తున్నారు. నిబంధనలు ఇవీ తేమ 8 లేదా అంతకంటే తక్కువ శాతం ఉండాలి. 8 శాతం కంటే పెరిగిన ప్రతి ఒక్క శాతం తేమకు ఒక శాతం చొప్పున మద్దతు ధరలో రూ.70.20 చొప్పున తగ్గిస్తారు. 12 శాతానికి మించి తేమ ఉన్న పత్తిని కొనుగోలు చేయరు. పత్తి పింజ పొడవు 29.50 ఎంఎం నుంచి 30.50 ఎంఎం వరకు ఉండవచ్చు. మైక్రో నైర్ విలువ నిర్ణీత పరిధి కంటే తక్కువ లేదా ఎక్కువ ఉంటే ప్రతి 0.2 విలువకు క్వింటాల్‌కు రూ.25 తగ్గిస్తారు. పత్తిలో దుమ్ము, ధూళి, చెత్తా, చెదారం లేకుండా చూసుకోవాలి. గుడ్డు పత్తికాయలు, రంగుమారిన, పురుగు పట్టిన కాయలను వేరు చేసి శుభ్రమైన పత్తిని మాత్రమే తీసుకురావాలి. నీళ్లు జల్లిన పత్తిని కొనుగోలు చేయరు. కౌడు పత్తి, ముడుచుకుపోయిన పత్తిని మంచి పత్తిలో కలపరాదు. గోనె సంచుల్లో కానీ లేదా లూజు రూపంలో మాత్రమే తీసుకు రావాలి. ప్లాస్టిక్ సంచుల్లో తీసుకొస్తే కొనుగోలుకు అనుమతించరు. ఆర్బీకేల్లో నమోదుకు శ్రీకారం ఈ–పంట నమోదు ఆధారంగా సీఎం యాప్ ద్వారా వాస్తవ సాగుదారుల నుంచి నేరుగా పత్తి కొనుగోలు చేయనున్నారు. రైతులు తమ సమీపంలోని ఆర్బీకే కేంద్రంలో ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకాల నకలుతో పేరు నమోదు చేసుకొని టోకెన్ తీసుకోవాలి. ఆ టోకెన్‌లో పేర్కొన్న తేదీన పత్తిని నిర్ధేశించిన యార్డు లేదా జిన్నింగ్ మిల్లుకు తీసుకెళితే.. నిర్ధేశిత గడువులోగా రైతు ఖాతాలకు నగదు జమ చేస్తారు. తొందరపడి అమ్ముకోవద్దు మార్కెట్లో ధరలు ఎమ్మెస్పీకి కాస్త అటూఇటుగా ఉండడంతో ముందుజాగ్రత్త చర్యగా ఈ నెల 25వ తేదీ నుంచి కొనుగోలు కేంద్రాలు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పంట నమోదు ప్రామాణికంగా ఆర్బీకేల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతుల నుంచి కనీస మద్దతు ధరకు కొనుగోలు కొనుగోలు చేస్తాం. మార్కెట్లో ధరలు పెరిగే అవకాశం ఉన్నందున తొందరపడి రైతులెవరూ అమ్ముకోవద్దని చెబుతున్నాం. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా మంచి ధరలు వచ్చే అవకాశాలున్నాయి. – రాహుల్ పాండే, కమిషనర్, మార్కెటింగ్ శాఖ -
రోడ్డెక్కిన పత్తిరైతులు
ఆసిఫాబాద్ అర్బన్: పత్తికి గిట్టుబాటుధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కుమురంభీం జిల్లా రైతులు రోడ్డెక్కారు. జిల్లా రైతు హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆసిఫాబాద్‌లోని అంబేడ్కర్ చౌక్ వద్ద హైదరాబాద్–నాగ్‌పూర్ అంతర్రాష్ట్ర రహదారిపై బైఠాయించారు. విత్తనాలు, ఎరువులు, కూలిరేట్లు పెరగడంతో పెట్టుబడి రెట్టింపు అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీసీఐ ఆధ్వర్యంలో క్వింటాల్‌కు రూ.15 వేలు చెల్లించి రైతులను ఆదుకోవాలని కోరారు. అక్కడి నుంచి నేరుగా కలెక్టరేట్‌కు ర్యాలీగా వెళ్లి ధర్నా నిర్వహించారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వివిధ సంఘాల నాయకులు వచ్చి రైతులకు మద్దతు పలికారు. అనంతరం కలెక్టర్‌కు రైతులు వినతిపత్రం అందజేశారు. సీసీఐ అధికారులు, మిల్లుల యజమానులు, రైతు సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించేవిధంగా ప్రభుత్వానికి నివేదిస్తామని కలెక్టర్ రాహుల్‌రాజ్ హామీ ఇచ్చారు. -
నకిలీ విత్తనాలతో నిండా ముంచారు
గద్వాల రూరల్: నకిలీ విత్తనాలను కట్ట బెట్టి తమను నిండా ముంచేశారని, ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని జోగుళాంబ గద్వాల జిల్లాలోని పత్తి రైతులు డిమాండ్ చేశారు. జిల్లాలోని ఉండవెల్లి, అలంపూర్, మానవపాడు మండలాలకు చెందిన రైతులు కలెక్టరేట్‌కు గురువారం పెద్ద సంఖ్యలో తరలివచ్చి ధర్నా చేశారు. భూత్పూర్ వద్దనున్న కంపెనీ నకిలీ బీటీ పత్తి విత్తనాలు తమకు కట్టబెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విత్తనాలతో సుమారు 20 వేల ఎకరాల్లో సాగు చేస్తే.. పంట దిగుబడి రాలేదని, దీనికి నకిలీ విత్త నాలే కారణమని వాపోయారు. ఇదే విష యమై వ్యవసాయ శాఖ అధికారులకు ఫి ర్యాదు చేస్తే.. క్షేత్ర పరిశీలనకు వచ్చిన శాస్త్రవేత్తలు సీడ్ కంపెనీలకు అమ్ముడు పోయి తప్పుడు నివేదిక ఇచ్చారని ఆరోపి ంచారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి నకిలీ విత్తనాలు ఇచ్చిన కంపెనీపై, తప్పుడు నివేదిక ఇచ్చిన వ్యవసాయ శాస్త్ర వేత్తలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన ప్రత్తి రైతుకు ఎకరా కు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలన్నారు. కలెక్టర్ తమకు స్పష్టమై న హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. మధ్యా హ్నం కలెక్టరేట్ ఎదుటే సామూహిక భోజ నాలు చేశారు. అనంతరం కలెక్టరేట్ ఏఓ మదన్మోహన్కు వినతిపత్రం అందజేశా రు. కార్యక్రమంలో రైతు సంఘం నాయ కులు ఆంజనేయులు, లక్ష్మీకాంతరెడ్డి, రామాంజనేయులు, నాగన్న, ఎర్రన్న, జైలు, నారాయణరెడ్డి, భీంరెడ్డి, రఫీక్ తదితరులు పాల్గొన్నారు. -
AP: ఏడేళ్ల తర్వాత రికార్డు స్థాయిలో సాగు.. వెలుగులీనుతోన్న తెల్లబంగారం
సాక్షి, అమరావతి: పత్తి రైతు పంట పండింది. తెల్లబంగారం వెలుగులీనుతోంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రికార్డుస్థాయిలో సాగవడమే కాదు.. దిగుబడులు కూడా భారీగా వచ్చేలా కనిపిస్తోంది. చరిత్రలో ముందెన్నడు లేని రీతిలో గతేడాది క్వింటాల్ రూ.13 వేలకుపైగా పలకడంతో ఈ ఏడాది రెట్టించిన ఉత్సాహంతో రైతులు పత్తిసాగువైపు మళ్లారు. వేరుశనగ సాగుచేసే రైతులు సైతం ఈ ఏడాది పత్తి సాగుచేశారు. ఫలితంగా సాగువిస్తీర్ణం బాగా పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో కనీస మద్దతు ధర కంటే రూ.3 వేలకుపైగా ఎక్కువగా పలుకుతున్న ధర నిలకడగా ఉండడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. రాష్ట్రంలో పత్తి సాధారణ సాగువిస్తీర్ణం 14.73 లక్షల ఎకరాలు. 2019–20లో 16 లక్షల ఎకరాల్లో సాగవగా, 2020–21లో 14.50 లక్షల ఎకరాల్లో, 2021–22లో 13.32 లక్షల ఎకరాల్లో సాగైంది. గతేడాది అకాల వర్షాలు, తెగుళ్ల ప్రభావంతో 12.29 లక్షల టన్నుల దిగుబడులు నమోదయ్యాయి. 2022–23 ఖరీఫ్ సీజన్లో రికార్డు స్థాయిలో 16.50 లక్షల ఎకరాల్లో సాగైంది. పత్తి చరిత్రలో 2014–15లో 16.35 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. ఇప్పటివరకు అదే రికార్డు. ఈ రికార్డును అధిగమించే స్థాయిలో ఈ ఏడాది 16.50 లక్షల ఎకరాల్లో పత్తి వేశారు. 2014–15లో 15.50 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. ఈ ఏడాది 17.85 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని మొదటి ముందస్తు అంచనాగా లెక్కించారు. సీజన్ పూర్తయ్యేనాటికి దిగుబడి 20 లక్షల టన్నులకుపైగానే రావచ్చని భావిస్తున్నారు. నిజంగా ఆ స్థాయిలో వస్తే దిగుబడుల్లో కూడా కొత్త రికార్డు నమోదయ్యే అవకాశం ఉంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సమయానుకూలంగా కురుస్తున్న వర్షాలు పత్తికి మేలు చేస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తెగుళ్లు ప్రభావం తక్కువగా ఉందని చెబుతున్నారు. ఏటా కలవరపెట్టే గులాబీ తెగులు కూడా ఈ ఏడాది కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడం రైతులకు కలిసొచి్చంది. పత్తి ఎక్కువగా సాగయ్యే కర్నూలు, గుంటూరు ప్రాంతాల్లో బోర్లకింద ఈసారి ఎకరాకు 15–20 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం క్వింటాల్ కనీస మద్దతు ధర.. పొడుగుపింజ పత్తికి రూ.6,380, మధ్యస్థ పత్తికి రూ.6,080గా ప్రకటించింది. గతేడాది క్వింటాల్ రూ.13 వేలవరకు పలికిన ధర ప్రస్తుతం రూ.9,501 ఉంది. ప్రస్తుతం మార్కెట్లో నిలకడగా ఉన్న ధర సీజన్ పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యే నాటికి మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. రెండేళ్ల పాటు పత్తికి కనీస మద్దతు ధర లభించకపోవడంతో ప్రభుత్వం జోక్యం చేసుకుని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా 2019–20లో 13 లక్షల క్వింటాళ్లు, 2020–21లో 18 లక్షల క్వింటాళ్ల చొప్పున రైతుల నుంచి కనీస మద్దతు ధరకు కొనుగోలుచేసింది. గతేడాది కూడా 50 మార్కెట్ యార్డులతోపాటు 73 జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. సాగువిస్తీర్ణం తగ్గడం, అంతర్జాతీయంగా కాటన్ యార్న్ ధరలు పెరగడంతో పత్తికి రికార్డుస్థాయి ధర పలికింది. ఫలితంగా రైతులు ఈ కేంద్రాల వైపు కన్నెత్తి చూడలేదు. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధాన పత్తి మార్కెట్‌గా పేరొందిన కర్నూలు జిల్లా ఆదోని యార్డుకు వ్యాపారులు క్యూ కట్టారు. గతేడాది 6.13 లక్షల క్వింటాళ్ల పత్తి యార్డుకు రాగా ఈ ఏడాది ఇప్పటికే 1.80 లక్షల క్వింటాళ్ల పత్తి వచి్చంది. ప్రస్తుతం సగటున రోజుకు ఆరువేల క్వింటాళ్ల చొప్పున ఈ యార్డుకు వస్తోంది. సీజన్ పూర్తిస్థాయిలో ప్రారంభమైతే రోజుకు 15 వేల నుంచి 20 వేల క్వింటాళ్ల వరకు వస్తుందని అంచనా వేస్తున్నారు. కనీసం ఈసారి 7–10 లక్షల క్వింటాళ్ల వరకు వస్తుందని అంచనా వేస్తున్నారు. ధర నిలకడగా ఉంది గత సీజన్లో రికార్డుస్థాయిలో ధర పలికింది. గరిష్టంగా క్వింటాల్ రూ.13 వేలకుపైగా పలికింది. ఆ తర్వాత కాస్త తగ్గినప్పటికీ ప్రస్తుతం ధర రూ.9,501 వద్ద ఉంది. యార్డుకు రోజుకు సగటున ఆరువేల క్వింటాళ్ల చొప్పున పత్తి వస్తోంది. ఈరోజు 1,044 లాట్స్ (4,957 క్వింటాళ్లు) పత్తి వచి్చంది. – బి.శ్రీకాంతరెడ్డి, కార్యదర్శి, ఆదోని మార్కెట్‌యార్డు, కర్నూలు జిల్లా అవసరం ఉండదనుకుంటున్నాం ప్రభుత్వాదేశాలతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. మార్కెట్లో రికార్డుస్థాయిలో ధర పలకడంతో వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేశారు. రైతులెవరు మా కేంద్రాలను ఆశ్రయించలేదు. ఫలితంగా క్వింటా పత్తి కూడా కొనుగోలు చేయలేదు. గతేడాది రికార్డుస్థాయిలో రూ.13 వేలకుపైగా పలికింది. ప్రస్తుతం 9,500 వరకు పలుకుతోంది. గత సీజన్ మాదిరిగానే ధర పెరిగే అవకాశం ఉంది. ఈసారి కూడా కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదనే భావిస్తున్నాం. – జి.సాయిఆదిత్య, ఏజీఎం, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా -
మిర్చి, పత్తి రైతుల సమస్యలు పరిష్కరించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సరైన వ్యవసాయ విధానం లేకనే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రుణ ప్రణాళిక లేకపోవడం, పంటలను సకాలంలో కొనుగోలు చేయకపోవడంతోపాటు నకిలీ, కల్తీ విత్తనాలు, పురుగుమందుల కారణంగా రైతులు అప్పులపాలై దిక్కుతోచనిస్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి, పత్తి రైతుల సమస్యలు పరిష్కారించాలని కోరుతూ మంగళవారం సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగలేఖ రాశారు. మిర్చి, పత్తి రైతుల పరిస్థితి తనను ఎంతగానో కలచివేసిందని పేర్కొన్నారు. ఒక్క మహబూబ్‌బాద్ జిల్లాలోనే రెండు నెలల్లో 20 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవాలని కోరారు. రైతులకు ఒక్క ఎకరాకు లక్ష రూపాయల పెట్టుబడి అవుతుందని, ప్రతి రైతుకు రూ. 6 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు అప్పు ఉందని, అప్పులబాధలు భరించలేక రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత రైతు కుటుంబాలకు వెంటనే రూ. 25 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని, లక్ష రూపాయల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత రైతు కుటుంబాల ప్రైవేట్ అప్పుల విషయమై ప్రభుత్వం బాధ్యత వహించాలని, ఆ కుటుంబాల్లోని పిల్లలను ప్రత్యేక కేటగిరీ కింద గుర్తించి ప్రభుత్వం ఉచితంగా చదివించాలని కోరారు. కౌలు రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని, కల్తీ, నకిలీ పురుగుమందుల నివారణకు పటిష్టమైన కార్యాచరణ చేపట్టాలన్నారు. రైతువేదికలను పునరుద్ధరించి, వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించి రైతులను ఆదుకోవాలని లేఖలో రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
పత్తి బంగారమైంది
సాక్షి, అమరావతి: పత్తి రైతుకు ఈ ఏడాది పండగే అయింది. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం, అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడంతో తెల్ల బంగారమే అయింది. కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)కంటే ఎక్కువే రైతుకు లభిస్తోంది. ప్రస్తుతం పత్తి ఎమ్మెస్పీ క్వింటాల్‌కు రూ.6,025 ఉండగా, మార్కెట్లో రూ.8,800 పలుకుతోంది. ఇది రూ.10వేల వరకు వెళ్లవచ్చని అంచనా వేస్తున్నారు. తగ్గిన విస్తీర్ణం.. పెరిగిన డిమాండ్ రాష్ట్రంలో పత్తి సాధారణ విస్తీర్ణం 14.73 లక్షల ఎకరాలు. గతేడాది 14.91లక్షల ఎకరాల్లో సాగైంది. ఈ ఏడాది 12.86 లక్షల ఎకరాల్లోనే సాగైంది. గతేడాది 10.46 లక్షల మిలియన్ టన్నుల దిగుబడి రాగా, ఈ ఏడాది 9.33 లక్షల మిలియన్ టన్నులు వస్తుందని అంచనా. ఈ ఏడాది క్వింటాల్ పొడుగు పింజ పత్తి రూ.6025, మధ్యస్థ పత్తి రూ.5,726గా కనీస మద్దతు ధర నిర్ణయించారు. గత రెండేళ్లలో ఎమ్మెస్పీ లభించకపోవడంతో ప్రభుత్వం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా 2019–20లో 13 లక్షల క్వింటాళ్లు, 2020–21 లో 18 లక్షల క్వింటాళ్ల పత్తిని 44,440 మంది రైతుల నుంచి ఎమ్మెస్పీకి కొనుగోలు చేసింది. ఈ ఏడాది 50 మార్కెట్ యార్డులతో పాటు 73 జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. దీంతో వ్యాపారులు రేటు తగ్గించే అవకాశం లేకుండా పోయింది. సీజన్ ఆరంభం నుంచి మంచి ధర పలుకుతోంది. రాష్ట్రంలో పత్తి సాగు విస్తీర్ణం తగ్గింది. కొన్ని ప్రాంతాల్లో దిగుబడి పెరిగినప్పటికీ, అకాల వర్షాలతో కొన్ని చోట్ల దిగుబడి తగ్గింది. మొత్తం మీద చూస్తే దిగుబడి తగ్గింది. దీంతో డిమాండ్ పెరిగింది. దీనికి నాణ్యత కూడా తోడవడంతో పత్తి రైతుకు ఎక్కువ ధర లభిస్తోంది. కోవిడ్ నేపథ్యంలో అంతర్జాతీయంగా దూది వినియోగం పెరడం, కాటన్ యార్న్ ధరలు పెరగడం కూడా పత్తి ధరల పెరుగుదలకు కారణాలుగా చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కాటన్ సీడ్‌కు కూడా మంచి రేటొస్తోంది. క్వింటాల్‌కు కనిష్టంగా రూ.3,180 గరిష్టంగా రూ.3,620 పలుకుతోంది. ఆదోని ‘పత్తి’ యార్డుకు మహర్దశ పత్తికి మంచి ధర వస్తుండటంతో దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధాన పత్తి మార్కెట్‌గా పేరొందిన కర్నూలు జిల్లా ఆదోని యార్డుకు వ్యాపారులు క్యూ కడుతున్నారు. ఇక్కడకు ఏపీతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల పత్తి రైతులొస్తుంటారు. సీజన్ ప్రారంభం నుంచి సోమవారం వరకు 2 లక్షల క్వింటాళ్ల పత్తి అమ్మకాలు జరిగాయి. రోజుకు వెయ్యి మంది రైతులు 25 వేల క్వింటాళ్ల పత్తిని తీసుకొస్తున్నారు. క్వింటాల్ రూ.8,670కు అమ్ముకున్నా నేను మూడెకరాల్లో పత్తి సాగు చేస్తున్న. ఈ ఏడాది ఎకరాకు 9 క్వింటాళ్ల వరకు వస్తోంది. సోమవారం ఆదోని యార్డులో క్వింటాలు రూ.8,670 చొప్పున 8 క్వింటాళ్లు అమ్మాను. గతంలో ఎప్పుడూ ఇంత ధర రాలేదు. చాలా ఆనందంగా ఉంది. – కే.వీరన్న, పరవతపురం, కర్నూలు జిల్లా గత ఏడాదికంటే ధర పెరిగింది నేను 2 ఎకరాల్లో పత్తి వేశా. మొదటి కోతలో 3 క్వింటాళ్లు రాగా క్వింటాల్ రూ.6,800కు అమ్మాను. రెండో కోతలో 5 క్వింటాళ్ల దిగుబడి రాగా రూ.7,500కు అమ్ముకున్నా. గతేడాదికంటే ఈసారి మంచి ధర వస్తోంది. – షేక్,ఖాసీం, పెద్దవరం, కృష్ణా జిల్లా లాట్‌కు 10 మంది పోటీపడుతున్నారు అనూహ్యంగా పెరిగిన ధరతో పత్తి కొనుగోలుకు వ్యాపారులు క్యూకడుతున్నారు. ఈసారి నాణ్యమైన పత్తి అధికంగా వస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా మన యార్డులో లాట్‌కు పది మంది తక్కువ కాకుండా పోటీపడుతున్నారు. మంచి ధర పలుకుతోంది. – బి. శ్రీకాంతరెడ్డి, కార్యదర్శి, ఆదోని మార్కెట్‌యార్డు, కర్నూలు జిల్లా ఈసారి మంచి రేటొస్తుంది అంతర్జాతీయంగా పత్తికి డిమాండ్ పెరగడంతో రాష్ట్రంలోని రైతుల నుంచి పత్తి కొనుగోలుకు వ్యాపారులు పోటీపడుతున్నారు. సోమవారం అత్యధికంగా క్వింటాల్‌కు రూ.8,800 ధర పలికింది. రోజురోజుకు పెరుగుతున్న ధరను బట్టి చూస్తుంటే ఈసారి క్వింటాల్ రూ.9500కు పైగా పలుకుతుందని అంచనా వేస్తున్నాం. రూ.10 వేల మార్కును అందుకున్నా ఆశ్చర్య పోనక్కర్లేదు. జి.సాయిఆదిత్య, ఏజీఎం, సీసీఐ కర్నూలు జిల్లా కౌతలం మండలం తోవి గ్రామానికి చెందిన ఈ రైతు పేరు టి.నాగరాజు. 15 ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. గత ఏడాది కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) క్వింటాల్‌కు రూ.5,825. అయినా మార్కెట్లో క్వింటాల్ రూ. 4,800 మించి ధర లేదు. దీంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో కనీస మద్దతు ధర (క్వింటాల్ రూ.6,025)కు విక్రయించాడు. ప్రభుత్వ కేంద్రం లేకపోతే తక్కువ ధరకు వ్యాపారులకే అమ్ముకోవాల్సి వచ్చేది. అతను ఖరీఫ్‌లో కూడా పత్తి సాగు చేయగా ఎకరాకు 9–10 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఈసారి వ్యాపారులే మంచి రేటు ఇస్తుండటంతో సోమవారం ఆదోని మార్కెట్ యార్డులో క్వింటాల్ రూ.8,800కు అమ్ముకోగలిగాడు. అంటే ఎమ్మెస్పీ (రూ.6,025) కంటే రూ.2,775 అధికంగా వచ్చింది. పెట్టుబడిపోను ఎకరాకు రూ.49 వేలు లాభంతో ఆనందంగా ఇంటికెళ్లాడు. -
గ్రేట్ జర్నీ..పత్తి రైతుల కాగడా..
ఆమె ఓ ఉద్యమజ్యోతి. తాను వెలుగుతూ... పదిమందికి వెలుగులు పంచే కాగడా. ‘ఏ ఫ్రేడ్ హిస్టరీ – ద జర్నీ ఆఫ్ కాటన్ ఇన్ ఇండియా’లో వత్తిలా కాలిపోతున్న పత్తి రైతు జీవితాన్ని రాశారు. ఇంగ్లిష్ లిటరేచర్ చదివిన ఓ యువతి సామాజిక కార్యకర్తగా, మల్కా పరిరక్షకురాలిగా రూపాంతరం చెందడానికి దారి తీసిన పరిస్థితులను వివరిస్తుందా పుస్తకం. డెబ్బై ఐదేళ్లు దాటిన ఉజ్రమ్మ లైఫ్ జర్నీతోపాటు పెట్టుబడిదారుల గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా ఆమె తన ఉద్యమాన్ని మౌనంగా విస్తరింపచేస్తున్న వైనం కనిపిస్తుంది. అభ్యుదయ హైదరాబాదీ ఉజ్రమ్మ హైదరాబాద్‌లో అభ్యుదయ కుటుంబంలో పుట్టారు. నానమ్మ ఉద్యమస్ఫూర్తి వల్ల తమ కుటుంబంలో ఆడపిల్లల చదువుకు మార్గం సుగమమైందని చెప్పారామె. చిన్నాన్న సజ్జత్ జహీర్ కమ్యూనిస్ట్ భావాల ప్రభావం తన మీద ఉందంటారామె. సామాజికాంశాల మీద స్పందించే తత్వం చిన్నాన్న నుంచే వచ్చిందని చెప్పే వజ్రమ్మ ఉద్యమపోరు బ్రిటిష్ కాలంలోనే మొదలైంది. విదేశాల స్పిన్నింగ్ మిల్లులు సూచించిన పత్తి వంగడంతో మనదేశంలో పంట పండించడం మొదలైననాడే ఆమె పత్తి రైతుల ఆత్మహత్యలను ఊహించగలిగారు. ఆ దోపిడీ పత్తితో ఆగదని, దానికి అనుబంధ రంగమైన చేనేతకు కూడా ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. కష్టం మనది... లాభం వాళ్లది ‘‘మనదేశంలో రకరకాల వాతావరణం, భౌగోళిక వైవిధ్యతల కారణంగా ప్రాంతానికి ఒక రకం పత్తి పండుతుంది. ఆ పత్తి నుంచి వచ్చే దారం, ఆ దారంతో నేసే దుస్తులలోనూ భిన్నత్వం ఉంటుంది. ఇంతటి వైవిధ్యతను కాలరాసింది ఒక్క స్పిన్నింగ్ యంత్రం. విదేశాల్లో ఏర్పాటైన వస్త్ర పరిశ్రమలకు ముడిసరుకు కావాలి. ఆ ముడిసరుకు వాళ్లు తయారు చేసుకున్న యంత్రాలకు అనుగుణంగా ఉండాలి. అందుకోసం మన రైతులకు పత్తి గింజలనిచ్చి... ‘పంట పండించండి, ఉత్పత్తిని మేమే కొంటాం’ అని చెప్పారు. అలా పత్తి గింజ వాళ్లదైంది, దారం వాళ్లదే అయింది. దారం ధరను నిర్ణయించే అధికారమూ వాళ్లదే అయింది. దాంతో చేనేత రంగం ముడిసరుకు సమస్యలో పడిపోయింది. మనది కాని వంగడం తో తెగుళ్లు ఎక్కువ. దాంతో పత్తిని పండించే రైతు బతుకుకు లాభాలు వస్తాయనే భరోసా లేదు. దారం ధర నిర్ణయించేది వాళ్లే... దాంతో చేనేత మగ్గం అంధకారంలో మగ్గిపోయింది. లాభాలు మాత్రం స్పిన్నింగ్ మిల్లులవి. లాభాలను బట్టే సమాజంలో గౌరవాల స్థాయిలో కూడా ఎంతో తేడా. పత్తి రైతు, చేనేతకారుడు ఈ విషవలయం నుంచి బయటపడి ఆర్థికంగా బలపడాలి. దేశంలో అనేక ప్రాంతాల్లో పత్తి రైతులను, చేనేత పరిశ్రమలను స్వయంగా చూశాను. చేనేతకారులు తమ ఉత్పత్తులు మార్కెట్ చేసుకోవడానికి ‘దస్తకార్ ఆంధ్ర’ రూపకల్పనలో పనిచేశాను. పదమూడేళ్లు గా మల్కా పరిరక్షణ మీద దృష్టి పెట్టాను. మల్కా అంటే ఖాదీ వంటి ఒక వస్త్ర విశేషం. ఇలాంటిది ప్రపంచంలో మరెక్కడా ఉండదు. సిరిసిల్లలో డెబ్బై కుటుంబాలు మల్కా పరిరక్షణలో పని చేస్తున్నాయి. యూరప్, యూఎస్‌లు తాము అనుసరిస్తున్న సైన్స్‌కి మోడరన్ సైన్స్ అని ఒక ముద్ర వేసుకుని, థర్డ్ వరల్డ్ కంట్రీస్‌ని తమ గుత్తాధిపత్యంలోకి తెచ్చుకోవడానికి కుట్ర పన్నాయి. మన యువతకు చెప్పేది ఒక్కటే. విదేశాల మీద ఆధారపడే పరిస్థితి నుంచి మనం బయట పడాలి. మన పత్తి నుంచి దారం తీయడానికి అధునాతన యంత్రాలను కనిపెట్టండి. మన పత్తి, మన దారం, మన నేత... వీటన్నింటికీ మనమే ధర నిర్ణయించగలిగిన వాళ్లమవుతాం’’ అంటారామె. సెలబ్రిటీల సెలబ్రిటీ ఉజ్రమ్మ నిరాడంబరంగా ఉంటారు. సెలబ్రిటీలు ఆమెతో ఫొటో తీసుకోవాలని ముచ్చటపడతారు. చేనేత అనగానే ముఖం చిట్లించే వారి చేత ‘ఐ లైక్ హ్యాండ్ వీవెన్ ఇండియన్ కాటన్’ అని స్టైలిష్‌గా పలికిస్తున్నారామె. పత్తి రైతు బతుకుకు కొరివి పెడుతున్న కంపెనీల బారి నుంచి రైతు జీవితానికి కాగడా పట్టే ప్రయత్నం చేస్తున్నారు. తన ఉద్యమానికి వారసులుగా కొత్తతరం చేనేతకారులను తయారు చేస్తున్నారు. వారి కోసం మెహిదీపట్నంలో మల్కా మార్కెటింగ్ ట్రస్ట్ ద్వారా మార్కెటింగ్ మెళకువలు నేర్పిస్తున్నారు ఉజ్రమ్మ. – వాకా మంజులారెడ్డి -
పత్తి రైతులు ఆందోళన చెందొద్దు
సాక్షి, హైదరాబాద్: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ), రాష్ట్ర ప్రభుత్వ పరస్పర సహకారం ద్వారా పత్తిని రైతుల నుంచి చివరి కిలో దాకా మధ్య దళారుల వ్యవస్థ లేకుండా కేంద్రం కొనుగోలు చేస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి వెల్లడించారు. పత్తిలో 12 శాతం తేమ ఉంటే క్వింటాల్‌కు రూ.5,232కు కొనుగోలు చేయాలని, మూడు నుంచి ఏడు రోజుల్లోగా రైతుల ఖాతా ల్లోకి నేరుగా నగదు జమచేయాలని సీసీఐను కేంద్రం ఆదేశించిందని, రైతులు ఆందోళన చెందొద్దని కోరారు. శనివారం సీసీఐ సీజీఎం (మార్కెటిం గ్) ఎస్కే పాణిగ్రాహి, సీసీఐ జీఎం అతుల్ ఖాలా, రాష్ట్ర మార్కెటింగ్ శాఖ జేడీ శ్రీనివాస్, వరంగల్ రీజినల్ మేనేజర్ జయకుమార్ తదితరులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాగా, కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్‌పై రాష్ట్ర పోలీసులు వ్యవహరించిన తీరుపై నివేదిక తెప్పించుకుంటామని కిషన్‌రెడ్డి చెప్పారు. శుక్రవారం రాత్రి ఈ సంఘటన తన దృష్టికి రాగానే డీజీపీతో, ఎంపీ సంజయ్‌తో మాట్లాడినట్టు చెప్పారు. ఇదిలా ఉండగా జి.కిషన్‌రెడ్డి ఆస్ట్రేలియా వెళ్లనున్నారు. ఈ నెల 6,7,8 తేదీల్లో జరిగే ఉగ్రవాద ప్రభావిత దేశాల హోంమంత్రుల అంతర్జాతీయ సదస్సులో ఆయన పాల్గొంటారు. -
పత్తి రైతుల కష్టం దళారుల పాలేనా?
సాక్షి, వనపర్తి : జిల్లా పత్తి రైతులు పండించిన పంట ఉత్పత్తులను మరోసారి దళారుల చేతిలో పెట్టాల్సిందేనా.. అన్న ప్రశ్నలు జిల్లాలో సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఏటా జిల్లాలో సుమారు ఎనిమిది వేల ఎకరాలకు పైచిలుకు పత్తి సాగవుతోంది. పండించిన పంటల ఉత్పత్తులను విక్రయించేందుకు వనపర్తి ప్రాంత రైతులు సుదూర ప్రయాణం చేసి జడ్చర్లలోని బాదేపల్లి మార్కెట్లో విక్రయించాలి. వ్యయప్రయాసలు ఎందుకని భావించే రైతులు స్వగ్రామంలోనే దళారులకు పత్తిని విక్రయించటం గత కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. వనపర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ మంత్రిగా పదవిలో ఉన్నారు. అయినా జిల్లాలో పత్తిరైతులకు మద్ధతు ధర కల్పించేందుకు సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదు. ఈసారి జిల్లాలో కనీసం ఒక్కటైనా సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తారన్న రైతుల, వ్యవసాయ అధికారుల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. ఈ విషయం బహుశా మంత్రి నిరంజన్‌రెడ్డి దృష్టికి రాకపోయి ఉండవచ్చు. కానీ.. జిల్లాలో ఎక్కువగా పత్తిసాగు చేసే ఖిల్లాఘనపురం, పెద్దమందడి, గోపాల్పేట, వనపర్తి మండలాల పరిధిలోని రైతుల ఆశలు నీరుగారాయని చెప్పవచ్చు. సీసీఐ కొనుగోలు కేంద్రంలో పత్తి పంటను విక్రయిస్తే భారత ప్రభుత్వం ఇచ్చిన ఎంఎస్పీ (మినిమమ్ సపోర్టింగ్ ప్రైజ్) ధర క్వింటా రూ.5,550 తప్పక లభిస్తుంది. ఇదివరకు అడిగేవారులేక ప్రస్తుత వనపర్తి జిల్లా పరిధిలో కనీసం ఒక్కసారికూడా సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదు. రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ మంత్రి సొంత జిల్లాలో ఈసారైనా సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తారనే ఆశ ఉండేది. దళారుల చేతుల్లో రైతు చిత్తు జిల్లాలో పత్తి సాగు చేస్తున్న రైతులు పంటల ఉత్పత్తులను వాహనాల్లో ఇతర ప్రాంతాల్లోని మార్కెట్‌కు తీసుకువెళ్లలేక గ్రామాలకు వచ్చే దళారులకే విక్రయిస్తున్నారు. వచ్చేందే రేటు.. ఇచ్చిందే మద్దతుధర అన్నట్లుగా వ్యవహారం నడుస్తుండేది. మంత్రి హయాంలో పరిస్థితి మారుతుందని రైతులు భావించారు. ఇకనైనా మంత్రి నిరంజన్‌రెడ్డి స్పందించి జిల్లాలో ఎక్కువగా పత్తిసాగు చేసే ప్రాంతంలో సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయిస్తే బాగుంటుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో 7,295 ఎకరాల్లో పత్తిసాగు జిల్లా వ్యవసాయశాఖ అధికారుల అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుత ఖరీఫ్‌లో 7,295 ఎకరాల్లో పత్తిసాగు చేశారు. జిల్లాలో 14 మండలాలు ఉండగా వనపర్తి నియోజకవర్గం పరిధిలోని ఖిల్లాఘనపురం, పెద్దమందడి, గోపాల్పేట, వనపర్తి మండలాల్లోనే ఎక్కువగా పత్తి సాగు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మిగతా మండలాల్లో కొంతమేర సాగయినట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఖరీఫ్‌లో జిల్లా సాధారణ పత్తిసాగు విస్తీర్ణం 8,315 ఎకరాలు కాగా 7,295 ఎకరాల్లో పత్తిసాగు చేశారు. గత ఏడాది 6,795, అంతకుముందు ఏడాది ఖరీఫ్‌లో 10,950 ఎకరాల్లో సాగు చేశారు. మార్కెటింగ్ సౌకర్యం సక్రమంగా ఉంటే జిల్లాలో పత్తిసాగు మరింత పెరిగే అవకాశం ఉంది. వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏటా విరివిగా జిల్లాలో ఏర్పాటు చేస్తున్న కారణంగా ఏటేటా జిల్లాలో వరిసాగు విస్తీర్ణం పెరుగుతోందని చెప్పవచ్చు. సీసీఐ కొనుగోలు కేంద్రాలకు కసరత్తు కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా.. అధికారులు ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. జిల్లా నుంచి మార్కెటింగ్‌శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపించినా వనపర్తి జిల్లాలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. పత్తి రైతులకు మరోసారి విక్రయాల అవస్థలు తప్పేలాలేవు. కేంద్రం ఏర్పాటు చేయాలి మంత్రి చొరవతో ఈసారి పత్తిసాగు ఎక్కువగా చేసే మా ప్రాంతంలో సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి. ఏటా పండించిన పత్తిని మార్కెట్‌కు తీసుకువెళ్లలేక గ్రామాలకే వచ్చి కొనుగోలు చేసే దళారులకు విక్రయించేది. మా ప్రాంతంలో సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తే ప్రభుత్వం ఇచ్చే మద్ధతు ధరకే రైతులమంతా పత్తిని విక్రయించుకుంటాం. – శేఖర్‌గౌడ్, రైతు, అప్పారెడ్డిపల్లి, ఖిల్లాఘనపురం మండలం ప్రతిపాదనలు పంపించాం జిల్లాలో సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపించాము. సీసీఐ కొనుగోలు కేంద్రాలు మార్కెట్ యార్డులోగానీ, జిన్నింగ్ మిల్లులులోగానీ ఏర్పాటు చేస్తారు. వనపర్తి జిల్లా పరిధిలో నేషనల్ హైవే 44పై ఒక్కటే ఉంది. ఇప్పటివరకు జిల్లాలోని నాలుగు మార్కెట్ యార్డులలో ఎక్కడా విక్రయానికి పత్తి రాలేదు. – స్వరణ్‌సింగ్, డీఎం, మార్కెటింగ్, వనపర్తి జిల్లా -
వానమ్మ.. రావమ్మా..
సాక్షి, ఆదిలాబాద్: వానమ్మ.. రావమ్మా.. అంటూ తొలకరి వర్షాల కోసం ఆదిలాబాద్ రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు. వర్షాలు మురిపిస్తాయనుకుంటే అసలు జాడనే లేకపోవడంతో దిగాలు చెందుతున్నారు. జిల్లాలో మృగశిర కార్తె ప్రవేశంతోనే రైతులు పత్తి విత్తనాలు వేశారు. అక్కడక్కడ చిన్నపాటి చినుకులు పడడమే తప్పా.. పెద్ద వర్షాల జాడలేదు. అయినా నీటివసతి ఉన్న రైతులు వితనాలు వేసేశారు. దీంతో మిగతా రైతులు ఆగమాగం అవుతున్నారు. ఒకరిని చూసి మరొకరు భూమిలో విత్తనం వేస్తున్నారు. ఇప్పటికే 20 నుంచి 30 శాతం మంది పత్తి విత్తనాలు పెట్టారు. ఇక వరుణుడి కటాక్షం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ రెండుమూడు రోజుల్లో వర్షాలు కురువని పక్షంలో పెట్టుబడిలోనే నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అప్పటికి.. ఇప్పటికీ గతేడాది తొలకరి వర్షాలు రైతులను మురిపించాయి. పోయినేడు ఇదే సమయానికి 70 శాతం మంది రైతులు పత్తి విత్తనాలు నాటారు. సాధారణంగా జిల్లాలో రైతులు పత్తి పంటను అధిక విస్తీర్ణంలో పండిస్తారు. జిల్లాలో అన్ని పంటలు కలిపి 2 లక్షల హెక్టార్ల వరకు సాగయ్యే పరిస్థితి ఉండగా, అందులో పత్తి పంటనే 1.47 లక్షల హెక్టార్లలో సాగవుతుంది. ఈ ఏడాది వర్షాల రాక ఆలస్యం కావడంతో రైతులు పత్తి విత్తనాలు నాటడంలో డోలయాన పరిస్థితి కనిపిస్తోంది. నీటి సౌకర్యం ఉన్న కొంత మంది బడా రైతులు పత్తి విత్తనాలు నాటడంతో వర్షాధారంపై ఆధారపడి పంటలు పండిస్తున్నారు. వారిని చూసి పలు వురు చిన్న, సన్నకారు రైతులు కూడా విత్తనాలు వేశారు. ఈ రెండుమూడు రోజులు వర్షాలు పడితే నే ఆ విత్తనం మొలకెత్తే అవకాశం ఉంది. లేదంటే భూమిలోనే విత్తు నాశనమయ్యే పరిస్థితి ఉంది. అంతా రెడీ.. వర్షాకాలం మొదలుకావడంతో పంటలు వేయడానికి రైతులు సర్వం సిద్ధం చేసుకున్నారు. దుక్కులు దున్ని చదును చేశారు. ఇక విత్తనాలు, ఎరువులు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటున్నారు. అయితే తొలకరి ఆశాజనకంగా లేకపోవడంతో రైతన్న కొట్టుమిట్టాడుతున్నాడు. ధైర్యం చేసి తెచ్చిన విత్తనాలను నాటితే వర్షాలు రాక చెయ్యికి అందదు. ఈ పరిస్థితుల్లో మళ్లీ విత్తనాలు నాటాల్సి వస్తోంది. కష్టాల్లో కర్షకుడు ఏటా ప్రకృతి వైపరిత్యాలతో కర్షకుడు ఏదో రీతిన నష్టపోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. గతేడాది తొలకరి జోరుగా మురిపించగా, ఆ తర్వాత వర్షాలు ముఖం చాటేయడంతో పెట్టుబడి గణనీయంగా పెరిగి రైతు ఆర్థిక పరిస్థితి కుదేలైంది. పంట చేతికొచ్చే సమయంలో అతివృష్టి కారణంగా పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇసుక మేటలతో చేల్లు ధ్వంసమయ్యాయి. రైతులు నష్టపోయా రు. ఇలా రైతన్నను భారీ వర్షాలు అప్పట్లో దెబ్బతీశాయి. సాహసం చేయడం పత్తి రైతుకు అలవాటైంది. మృగశిర కార్తె ప్రవేశంతో పత్తి విత్తనం నాటిన పక్షంలో సరైన సమయంలో పత్తికి పూత, కాత వస్తుందనే నమ్మకంతో రైతులు ఈ సమయంలో విత్తు నాటేందుకు సాహసం చేసే పరిస్థితి కనిపిస్తుంది. తీవ్ర వర్షాభావం గతేడాదితో పోల్చితే ఈసారి తీవ్ర వర్షాభావం కనిపిస్తోంది. జిల్లాలోని ఆదిలాబాద్ రూరల్, మావల, జైనథ్ మండలాల్లో తీవ్ర వర్షాభావం కనిపిస్తోంది. సాధారణ వర్షం కంటే –60 శాతం నుంచి –99 శాతం వరకు తక్కువ వర్షపాతం ఉంటే దానిని తీవ్ర వర్షాభావంగా పరిగణిస్తారు. ప్రస్తుతం పై మూడు మండలాల్లో ఈ పరిస్థితి కనిపిస్తుంది. –20 శాతం నుంచి –59 శాతం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైతే దానిని వర్షాభావ పరిస్థితిగా పరిగణిస్తారు. జిల్లాలోని బేల, నార్నూర్, గాదిగూడ, ఇంద్రవెల్లి, గుడిహత్నూర్, తలమడుగు, నేరడిగొండ, ఇచ్చోడ, సిరికొండ, ఉట్నూర్‌లలో ఈ పరిస్థితి ఉంది. సాధారణ వర్షపాతం కంటే –19 శాతం నుంచి +19 శాతం వరకు వర్షం కురిస్తే దానిని సాధారణ వర్షపాతంగా పరిగణిస్తారు. బజార్హత్నూర్, బోథ్ మండలాల్లో ఈ పరిస్థితి ఉంది. ఇక సాధారణ వర్షపాతం కంటే +20 శాతం, అంతకంటే ఎక్కువ కురిస్తే దానిని అతివర్షపాతంగా పరిగణిస్తారు. జిల్లాలో ప్రస్తుతం ఒక తాంసి, భీంపూర్ మండలాల్లోనే అధిక వర్షపాతం కురిసింది. -
పత్తి వైపే మొగ్గు..
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలోనే ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో అధిక విస్తీర్ణంలో పత్తి పంటనే సాగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయ శాఖాధికారుల సాగు విస్తీర్ణం అంచనా ప్రకారం.. గతేడాది కంటే ఈ ఏడాది కొంత పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు చెబుతున్నారు. గతేడాది గులాబీరంగు పురుగు ఉధృతి, నకిలీ విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మొదట్లో వర్షాలు కురిసినా ఆ తర్వాత వరుణుడు ముఖం చాటేయడంతో దిగుబడి కూడా ఆశించినంత రాలేదు. దీంతో పెట్టుబడి ఖర్చులు సైతం రాలేని పరిస్థితి ఎదురైంది. కొంతమంది రైతులు గులాబీపురుగు ఉధృతితో పత్తి పంటను ముందుగానే తొలగించారు. ఈ దశలో మరోసారి పత్తి సాగుకు సిద్ధమవుతున్న అన్నదాతకు ఆ దిశగా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని వ్యవసాయ శాఖాధికారులు చెబుతున్నారు. కానీ రైతులకు మాత్రం ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం లేదని తెలుస్తోంది. 65శాతం పత్తినే.. జిల్లాలో అధిక శాతం మంది రైతులు పత్తివైపే మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 2 లక్షల హెక్టార్లు ఉంది. అయితే ఇందులో పత్తి పంట గతేడాది 1లక్ష 30వేల హెక్టార్ల వరకు సాగు కాగా, ఈసారి మరో 10వేల హెక్టార్లు అధికంగా సాగయ్యే అవకాశాలు ఉన్నాయని ఆ శాఖాధికారులు చెబుతున్నారు. పత్తి తర్వాత 30వేల హెక్టార్లలో సోయాబీన్, 20వేల హెక్టార్లలో కంది సాగయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. పత్తి విత్తన ప్యాకెట్లు జిల్లాకు 8 లక్షలు అవసరం ఉండగా, 14లక్షల ప్యాకెట్లు అందుబాటులో ఉంచనున్నట్లు చెబుతున్నారు. ప్యాకెట్ ధర రూ.730 ఉంటుందని పేర్కొన్నారు. వరుణుడి కరుణ కోసం ఎదురుచూపు గతేడాది మే చివరి వారం, జూన్ మొదటి వారంలో కూడా భారీగా వర్షాలు కురువడంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమైంది. జూన్ మొదటి, రెండో వారంలోనే విత్తనాలు వేశారు. అయితే ఈసారి జూన్ మొదటి వారం గడిచినా వర్షం జాడలేకుండా పోయింది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రుతుపవనాలు మొదటి వారంలోనే వస్తాయని వాతావరణ శాఖాధికారులు చెప్పినా మరో వారం రోజులపాటు ఆలస్యమయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. భా రీ వర్షాలు కురిస్తే తప్పా చిరుజల్లులకు విత్తనాలు విత్తితే నష్టపోవాల్సి వస్తోందని శాస్త్రవేత్తలు సూచి స్తున్నారు. గతంలో పలుసార్లు తొలకరి వర్షాలు కురువగానే పత్తి విత్తనాలను వేయడం, ఆ తర్వా త వర్షాలు ముఖం చాటేయడంతో భూమిలో విత్తనం మాడిపోయి నష్టాలు చవిచూశారు. ఒకటికి రెండుసార్లు కూడా విత్తనాలు వేసిన పరిస్థి తి ఎదురైంది. గతేడాది తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు రైతుకు రూ.4వేల చొప్పున మేలోనే రైతులకు చెక్కుల రూపంలో అందించిన విషయం విధితమే. ఈసారి రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నామని అధికారులు చెబుతున్నా ఇంకా 10శాతం మంది రైతుల ఖాతా ల్లో డబ్బులు జమ అయినట్లు కనిపించడం లేదు. పెట్టుబడి సాయం త్వరగా అందిస్తే దళారులను ఆశ్రయించకుండా పెట్టుబడి కోసం వినియోగించే అవకాశం ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. నకిలీ విత్తనాలతో జాగ్రత్త.. ఏటా రైతులు నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి మోసపోతూనే ఉన్నారు. ఈసారి కూడా జిల్లాలో కొంతమంది దళారులు రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే గ్రామాల్లో నకిలీ విత్తనాలు, బీటీ–3 పేరిట విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అయితే నకిలీ విత్తనాల గురించి గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించాల్సిన వ్యవసాయశాఖ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడంతో రైతులు నకిలీ విత్తనాలతో మరోమారు మోసపోయే ప్రమాదం లేకపోలేదని పలువురు అభిప్రాయ పడుతున్నారు. గతేడాది కొంతమంది రైతులు నకిలీ విత్తనాలు వేసి తీవ్రంగా నష్టపోయారు. పంట దిగుబడి రాక అవస్థలు పడ్డారు. పత్తి మొక్కలు ఏపుగా పెరిగినా ఎకరానికి ఒకట్రెండు క్వింటాళ్ల దిగుబడి మాత్రమే రావడంతో పెట్టిన పెట్టుబడి సైతం రాలేని దుస్థితి ఎదురైంది. -
ధర కోసం పత్తి రైతుల ఆందోళన
ఆదిలాబాద్: పత్తికి ఓ వ్యాపారి పెట్టిన ధరను మిగిలినవారు సైతం పెట్టాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి రైతులు బుధవారం ఆందోళనకు దిగారు. దీంతో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. పత్తి ధర పెరుగడంతో ఆది లాబాద్ మార్కెట్‌యార్డ్‌కు పెద్దఎత్తున రైతులు పత్తి తీసుకొచ్చారు. ఉదయం నిర్వహించిన వేలంపాటల్లో ఓ వ్యాపారి క్వింటా పత్తికి రూ. 4,800 ధర పెట్టేందుకు ముందుకు వచ్చాడు. ఈ క్రమంలో రైతులు తమ పత్తికి అంతే ధర పెట్టాలని కోరగా మిగిలిన వ్యాపారులు అంగీకరించలేదు. దీంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పత్తి కొనుగోళ్లు జరగలేదు. నాయకులు, మార్కెట్ కమిటీ అధికారులు రంగంలోకి దిగి వ్యాపారులకు నచ్చజెప్పడంతో చివరకు రూ.4,800కు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు బుధవారం 10 వేల క్వింటాళ్ల పత్తి వచ్చినట్లు మార్కెట్ కమిటీ కార్యదర్శి అన్నెల అడెల్లు తెలిపారు. -
సంక్షోభంలో వ్యవసాయ రంగం
కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో రైతు చాకలి శేషన్న 3.7 ఎకరాల పొలంలో పత్తిని సాగుచేశారు. అనూహ్యంగా మొన్న కురిసిన వర్షాలకు.. మొక్కబాగానే ఎదిగింది. ఎకరాకు సుమారు 30 నుంచి 35వేల రూపాయల పెట్టుబడికూడా పెట్టారు. శేషన్న భార్య, ఇద్దరు కొడుకులు, కోడళ్లు.. మొత్తం కుటుంబంలోని ఆరుగురు పెద్దవాళ్లు... ఇదే పొలంమీద తన ఆశలు పెట్టుకున్నారు. కాని గులాబీరంగు పురుగు వారిని నట్టేటాముంచేసింది. పత్తికాయలోకి పురుగు చొరబడి మొత్తం తినేసింది. ఇప్పుడు 3.7 ఎకరాలకు కనీసం 4 క్వింటాళ్లు కూడా దిగుబడి రాలేదు. దీన్ని మార్కెట్‌కు తరలించి అమ్ముదామంటే క్వింటాలుకు కేవలం రూ.1500 నుంచి రూ.2 వేలు మాత్రమే ఇస్తున్నారు. కూలీకూడా గిట్టే పరిస్థితి లేకపోవడంతో పొలంలోనే వదిలేయాలని ఆ కుటుంబం నిర్ణయించుకుంది. సాక్షి, కర్నూలు: ఈ ఏడాది రబీ పంటగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో సుమారు 6.37 లక్షల హెక్టార్లలో పత్తిని పండిస్తే అందులో అత్యధికంగా 2.57 లక్షల హెక్టార్లమేర కర్నూలులోనే సాగుచేశారు. నంద్యాల బెల్టు మొదలుకుని.. ఇటు కర్నూలు పశ్చిమప్రాంతానికి వచ్చే కొద్దీ పత్తిసాగు విస్తృతంగా ఈ పంట వేశారు. గడచిన నాలుగేళ్లుగా అష్టకష్టాలు పడ్డ రైతులు.. గత ఆగస్టులో కురిసిన భారీవర్షాలతో పెద్ద ఆశలే పెట్టుకున్నారు. మొదట్లో మొక్కలు బాగా ఎదిగాయి. మంచి దిగుబడుల కోసం రైతులు.. మరింత జాగ్రత్తగా పత్తి తోటలను సాకారు. కాని అంతలోనే గులాబీరంగు పరుగు.. పత్తిపంటలను నాశనం చేసేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ ఇది ఒకేసారి పాకింది. సాధారణ వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేసినప్పుడు పంటలను నష్టపరిచే పురుగుల, తెగుళ్లను గమనించి ఆమేరకు వెంటనే కార్యాచరణ ప్రణాళిక తయారుచేయాలి. కాని ఈసారి మాత్రం ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పూర్తిగా నంద్యాల ఉప ఎన్నికల్లో మునిగిపోయారు. లింగాకర్షక బుట్టలను వెంటనే రైతులకు అందించి పత్తి పొలాల్లో పెట్టి ఉంటే.. ఈ పరిస్థితి వచ్చేది కాదు. కాని ప్రభుత్వం ఎక్కడా ఆ పని చేయలేదు. ఈ ఏడాది సబ్సిడీ మీద కూడా ఈ బుట్టలను సరఫరా చేయలేదని రైతులు చెప్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇన్ని లక్షల హెక్టార్లలో పంట నాశనం అయిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రైతులు భారీగా నష్టపోయారు. మరోవైపు ఉల్లిరైతు కంట కన్నీళ్లు ఆగడంలేదు. రాష్ట్రంలో అత్యధికంగా ఈ పంటను కర్నూలు రైతులు సాగుచేస్తున్నారు. తర్వాత కడప, అనంతపురం జిల్లాల్లోకూడా ఉల్లిసాగు కనిపిస్తోంది. రైతులనుంచి సరుకు పూర్తికాగానే.. ఒకేసారి రిటైల్ దుకాణాల్లో ధరలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం రిటైల్ దుకాణాల్లో ఉల్లి ధర కిలో దాదాపు రూ.50లు పలుకుతోంది. కాని ఇక్కడ రైతులకు దక్కే ధర కిలో 3 నుంచి 4 రూపాయలు మాత్రమే. గతేడాది గిట్టుబాటు ధరలు కూడా రాకపోవడంతో.. రైతులు పొలాల్లోనే ఉల్లిని వదిలేసిన సందర్భాలు ఉన్నాయి. మొక్క జొన్న రైతు పరిస్థితి కూడా అగమ్యగోచరంగా ఉంది. ప్రస్తుతం క్వింటాలుకు 1180 రూపాయల చొప్పున కొనుగోలుచేస్తున్నారు. కనీస మద్దతు ధర రూ.1420లు ప్రకటించినప్పటికీ.. రైతుకు మాత్రం ఆ ధర కూడా దక్కడంలేదు. కొంతమంది టీడీపీ నేతలు రైతుల వద్ద నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి.. వాటిని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తరలించి.. క్వింటాలుకు దాదాపు 250 నుంచి 300 రూపాయలవరకూ సంపాదిస్తున్నారని కొంతమంది రైతులు ఆరోపిస్తున్నారు. ఒక్క కర్నూలు జిల్లాలోని రాష్ట్రంలో అత్యధికంగా 37వేల హెక్టార్లలో మొక్కజొన్నను సాగుచేస్తున్నారు. ఈ రబీ సీజన్లో ఒక్క కర్నూలు జిల్లాలోనే 64752 హెక్టార్లలో కందిని పండిస్తున్నారు. ప్రభుత్వం రూ.5450 మద్దతు ధర ప్రకటించినప్పటికీ.. రైతు మాత్రం రూ.3500కు అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఈ రబీ సీజన్లో పంట వచ్చాక.. ఈ ధరైనా ఉంటుందా, లేదా అని రైతుల ఆందోళన చెందుతున్నారు. శనగ రైతుల పరిస్థితి కూడా అలానే ఉంది. రాష్ట్రంలోనే అధికంగా కర్నూలు జిల్లాలో 1.4 లక్షల హెక్టార్లమేర పంటను సాగుచేస్తున్నారు. కూలీ డబ్బులు గిట్టుబాటు కావాలన్నా.. కనీసం రూ.6వేలు ధర ఉండాలన్నది రైతుల డిమాండ్. కాని ప్రస్తుతం 4400 రూపాయలు కనీస మద్దతు ధరగా ఉంది. గడచిన సీజన్లో రూ.3 వేలకే తెగనమ్ముకున్న రైతులు.. ఈసారి ధరపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పత్తికొండ, కోడుమూరు ప్రాంతంలో ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్‌కు రైతులు తమ కష్టాలు చెప్పుకున్నారు. దళారుల కారణంగా ఎలా నష్టపోతున్నదీ పలు సందర్భాల్లో వివరించారు. పంట పొలాల పరిశీలన సమయంలో, మార్గమధ్యలో అర్జీలద్వారా రైతుల నుంచి వైఎస్ జగన్ సమగ్ర వివరాలు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే కోడుమూరులో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో కొన్ని కీలక హామీలను వెల్లడించారు. ప్రతిఏటా మే మాసంలో పెట్టుబడి సహాయం కింద రూ.12500 ఇస్తామన్న ప్రకటనతో రైతులు హర్షం వ్యక్తంచేశారు. పంటలకు గిట్టుబాటు ధర కోసం ప్రభుత్వం నుంచి రూ.3వేల రూపాయలను స్థిరీకరణ నిధి ఏర్పాటుచేస్తామని స్పష్టం చేశారు. దీన్ని వల్ల ప్రభుత్వానికి నష్టంవచ్చినా ఫర్వాలేదని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. విపత్తుల సమయంలో రైతులను ఆదుకునేందుకు వీలుగా రూ.2వేల కోట్లతో ఒక విపత్తు నిధిని కూడా ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. దీంతోపాటు కేంద్రం నుంచి వచ్చే సాయాన్ని కూడా కలుపుతామన్నారు వైఎస్ జగన్. తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న రైతులు... వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు తమలో భరోసా నింపాయని చెప్తున్నారు. -
ప్రతి మండలంలో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు
-
‘సుడి’గుండంలో రైతన్న!
సాక్షి, హైదరాబాద్/జగిత్యాల: అకాల వర్షాలు, వాతావరణంలో అనూహ్య మార్పులు.. వాటి కారణంగా దాడి చేస్తున్న తెగుళ్లు, సమస్యలు రాష్ట్రంలో రైతులను నిలువునా ముంచుతున్నాయి. గులాబీరంగు పురుగు దాడి, రంగు మారడంతో ఇప్పటికే పత్తి రైతులు నష్టపోగా.. అటు దోమపోటు కారణంగా వరి రైతు తలపట్టుకుంటున్నాడు. గింజ దశ దాకా బాగానే ఉన్న వరి పంట దోమపోటు కారణంగా దెబ్బతినడంతో ఆందోళనలో మునిగిపోయాడు. వేలకు వేలు ఖర్చు చేసి పురుగుమందులు కొట్టినా ఫలితం లేక ఆవేదనలో పడ్డాడు. చివరికి పంటను కోసే కూలీలకు సరిపడా సొమ్ము కూడా రాని దుస్థితిలో.. కష్టపడి పండించిన పంటకు నిప్పు పెడుతున్నాడు. ఐదు లక్షల ఎకరాల్లో.. ఈ ఏడాది ఖరీఫ్‌లో 18.85 లక్షల ఎకరాల్లో వరినాట్లు పడ్డాయి. ఇటీవలి వర్షాలు, సుడి దోమ దాడి కారణంగా మూడో వంతు పంటకు నష్టం జరిగినట్లు అంచనా. భారీ వర్షాలకు 50 వేల ఎకరాల్లో వరి దెబ్బతిన్నట్లు నిర్ధారించగా... 5 లక్షల ఎకరాల్లో సుడిదోమ పంజా విసిరిందని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల నల్లగొండ జిల్లాలో వ్యవసాయ శాస్త్రవేత్తల బృందం పర్యటించింది. ముఖ్యంగా బీపీటీ 5204, ఎంటీయూ 1010, ఆర్ఎన్ఆర్ 1504, కేఎన్ఎం 118 రకాలకు దోమపోటు ఎక్కువగా ఆశించినట్లు గుర్తించింది. ఇందులో బీపీటీ 5204 పంట బాగా దెబ్బతిన్నట్లు తేల్చింది. ఆ జిల్లాలో ఏకంగా 50 నుంచి 60 శాతం పంట దెబ్బతిన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వాతావరణంలో మార్పులు, తేమ శాతం పెరగడం వల్లే సుడిదోమ ఉధృతి పెరిగిందని చెబుతున్నారు. అలాగే నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, వరంగల్, కరీంనగర్ జిల్లాలలో వరికి కాండం తొలిచే పురుగు, సుడిదోమ ఉధృతి ఉన్నట్లు జయశంకర్ వ్యవసాయ వర్సిటీ అధ్యయనంలో తేలింది. సగం దిగుబడి స్వాహా: వరిలో దోమపోటు సోకితే ఏకంగా 50 శాతం దిగుబడి తగ్గిపోతుంది. సెప్టెంబర్– నవంబర్ మధ్య ఎక్కువగా ఆశించే సుడిదోమ.. మొక్కల మొదళ్లలో చేరి రసాన్ని పీల్చేస్తుంది. దీంతో పంట లేత పసుపురంగులోకి మారి.. సుడులు సుడులుగా ఎండిపోతుంది. రాత్రి ఉష్ణోగ్రతలు 21–23 డిగ్రీల సెల్సియస్, పగటి ఉష్ణోగ్రతలు 25–30 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గిపోయినప్పుడు ఈ దోమ విజృంభణ ఎక్కువగా ఉంటుంది. యూరియా ఎక్కువ మోతాదులో వాడినప్పుడు ఈ దోమ ఎక్కువగా ఆశిస్తుంది. నాలుగైదు రోజుల్లోనే పొలమంతా విస్తరిస్తుంది. సుడిదోమ ఆశిస్తే పిలక దశలో 10–15 శాతం నష్టం, ఈనే దశలో అయితే 40 శాతం, గింజ దశలో అయితే 70–80 శాతం నష్టం జరుగుతుంది. మందులు చల్లినా ఫలితమేదీ..? దోమపోటు నివారణ కోసం పురుగు మందులను చల్లినా పెద్దగా ప్రయోజనం కల్పించడం లేదని.. పైగా సాగు ఖర్చు పెరుగుతోందని రైతులు వాపోతున్నారు. దోమపోటు నివారణ మందులను చల్లడానికి ఒక్కో ఎకరాకు ఒకసారికి రూ. వెయ్యి వరకు ఖర్చవుతుంది. ఆవేదనతో పంటకు నిప్పు దోమపోటుతో పంట ఎండిపోవడం.. పంటకోసిన కూలీలకు అయ్యే వ్యయమైనా వచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతులు ఆవేదనలో మునిగిపోతున్నారు. చివరికి ఏం చేయాలో అర్థంగాక పంటకు నిప్పు పెడుతున్నారు. సూర్యాపేట మండలంలో దాదాపు 25 ఎకరాల్లో రైతులు వరికి నిప్పు పెట్టినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. - జగిత్యాల జిల్లాకు చెందిన ఈ రైతు ఎడ్మల నచ్చరెడ్డి. నాలుగెకరాల్లో సన్నరకం వరి వేశాడు. గింజ దశలో దోమపోటు వచ్చింది. ఇప్పటికే ఐదారు వేలు ఖర్చుపెట్టి పురుగుమందులు కొట్టాడు. పొలంలో పాయలు సైతం తీశాడు. అయినా దోమ ఉధృతి ఆగలేదు. రూ.50 వేల దాకా నష్టం జరిగిందని.. ప్రభుత్వం పరిహారం అందించాలని వాపోతున్నాడు. యూరియా ఎక్కువ వాడొద్దు వాతావరణ పరిస్థితుల కారణంగా ఎక్కు వగా దోమపోటు వచ్చింది. నత్రజని (యూరి యా)ఎకరాకు 30 కిలోలు మించి వాడినా దోమ పెరుగుతుంది. దోమపోటు కొద్దిగా వచ్చిన సమయంలోనే రక్షణ చర్యలు చేపట్టడం మంచిది. దోమ తరచుగా ఆశించే ప్రాంతాల్లో దోమ పోటును తట్టుకునే రకాలను సాగు చేయాలి. ప్రతి 2 మీటర్లకు 20 సెం.మీ. వెడల్పు బాటలు వదిలి, పొలాన్ని ఆరబెట్టాలి. – ఎం.వెంకటయ్య, శాస్త్రవేత్త, పొలాస మూడో వంతు సోకితేనే బీమా దోమపోటుకు పంటల బీమా పథకం కింద పరిహారం పొందే వీలుంది. అయితే గ్రామం యూనిట్‌గా మూడో వంతు వరికి దోమపోటు సోకితేనే రైతులకు పరిహారం వస్తుంది. దీనిపై మరింత అధ్యయనం చేసి పరిహారం ఇప్పించేందుకు కృషిచేస్తాం.. –పార్థసారథి, వ్యవసాయశాఖ కార్యదర్శి -
పత్తి రైతులను పట్టించుకోరా?
-
పత్తి రైతులను పట్టించుకోరా?
రాయచోటి రూరల్ /చింతకొమ్మ దిన్నె: రాష్ట్రవ్యాప్తంగా 6.36 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేసిన రైతులు తీవ్ర నష్టాల పాలైనా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం, అధికారులు ఇంత నిర్దయగా వ్యవహరిస్తుంటే రైతులేం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. మీరైనా ఈ పరిస్థితి చూడండని మీడియా ప్రతినిధుల ముందు ఆవేదన చెందారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా రెండవ రోజు మంగళవారం సాయంత్రం ఆయన వేంపల్లె మండలంలో పత్తి రైతుల బాధలను ఆలకించారు. వారి అభ్యర్థన మేరకు పొలాలకు వెళ్లి పరిశీలించారు. మూడెకరాల్లో రూ.లక్ష ఖర్చు పెట్టి సాగు చేసి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఆశ పడితే అకాల వర్షాలు, తెగుళ్లు పత్తి పంటను పూర్తిగా తినేశాయని వేంపల్లె ఎస్సీ కాలనీకి చెందిన కౌలు రైతు కుందాజయన్న కన్నీరు మున్నీరయ్యారు. తమ పొలంలో కూడా పత్తి పంటది ఇదే పరిస్థితి అనీ, పంటను నమ్ముకుని నిలువునా మునిగి పోయామని పెండ్లిమర్రికి చెందిన మరో రైతు కొండారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులను చూసిన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ తీవ్రంగా చలించారు. మూడెకరాలకు క్వింటా కూడా రాలేదు వేంపల్లె మండలం వైఎస్ నగర్‌కు చేరుకున్న జగన్‌ను పత్తి రైతు జయన్న కలిశారు. తన పరిస్థితి చూడాలని వేడుకున్నారు. దీంతో జగన్ పత్తి పంట సాగుచేసిన భూమిలోకి వెళ్లారు. 10 క్వింటాళ్లు పండాల్సిన మూడు ఎకరాల భూమిలో క్వింటాలు దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేని విషయాన్ని గుర్తించారు. మూడు ఎకరాల భూమి గుత్తకు తీసుకుని లక్ష అప్పు చేసి పత్తి సాగు చేశానని జయన్న కళ్ల నీళ్లు పెట్టుకున్నాడు. ఎకరాకు రూ.8వేలు లెక్కన కౌలు లెక్క (డబ్బు) కూడా ఇచ్చానని చెప్పారు. పంట చేతికొచ్చి అప్పులు తీర్చి కొంచమైనా మిగులుతుందని అనుకుంటా ఉంటే ఉన్నట్టుండి పడిన వానలు, తెగుళ్లు, కాయతొలిచే పురుగులు కాయలోని పత్తినంతా నాశనం చేశాయని జగన్‌కు తన పరిస్థితి వివరించుకున్నారు. తనకు నలుగురు ఆడబిడ్డలని, పంటలు పెట్టి అంతా నష్టపోతే సంసారాన్ని ఎట్టా సాకాలో మీరే చెప్పండని తీవ్రంగా బాధపడ్డారు. అన్నిచోట్లా పత్తిరైతుల పరిస్థితి ఇలానే ఉందని, ప్రభుత్వంపై నష్టపరిహారం అందించేలా పోరాడాలని పెండ్లిమర్రి మండలానికి చెందిన మరో రైతు కొండారెడ్డి కోరారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎవ్వరూ క్షమించరు ఈ ఏడాది రాష్ట్రంలో 6.36 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పత్తి సాగు అయ్యిందని, 80శాతం మేర రైతులు పెట్టుబడులు కూడా నష్టపోయారని జగన్‌కు అక్కడే ఉన్న వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి వివరించారు. వైఎస్సార్ జిల్లాలో 24వేల హెక్టార్లలో పత్తి పంట సాగు చేసిన రైతులు పూర్తిగా నష్టపోయారని చెప్పారు. పత్తి పంట నష్టంపై కౌలు రైతులు, ఎంపీ, ఎమ్మెల్యేలతో కలసి రైతు సంఘం నాయకులు జిల్లా కలెక్టర్ దృíష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని బాధిత రైతులు చెప్పారు. నష్టపోయిన పత్తిపంటను ఏ అధికారీ ఇప్పటివరకు పరిశీలించలేదని వాపోయారు. ప్రభుత్వం, అధికారులు ఇంత దారుణంగా వ్యవహరిస్తుంటే రైతులు ఎవరి దగ్గరికి వెళ్లాలని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం రైతుల పట్ల ఎంత దారుణంగా వ్యహరిస్తోందో చూడండని మీడియా ప్రతినిధులను కోరారు. ఇంత నీచమైన ప్రభుత్వాన్ని ఎవరూ ఎప్పటికీ క్షమించరనీ, అధైర్య పడకుండా ఉండాలని, అందరికీ మంచి రోజులు వస్తాయని రైతులను ఓదార్చారు. జగన్ వెంట మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అంజాద్ బాషా, రవీంద్రనాథరెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబు, కడప, కర్నూలు జిల్లాల వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షులు సంబటూరు ప్రసాదరెడ్డి, శివరామిరెడ్డి, భరత్‌కుమార్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి ఉన్నారు. ప్రజాసంకల్ప యాత్రలో కత్తి వేంపల్లెలో ప్రజాసంకల్ప యాత్రలో పాల్గొని జననేత జగన్‌కు సంఘీభావం తెలిపేందుకు వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలం బుగ్గలపల్లెకు చెందిన కత్తి రమేష్ అనే మరుగుజ్జు ఉత్సాహంగా తరలివచ్చాడు. అతడిని చూసిన జగన్ ఆప్యాయంగా పలకరించి తనతోపాటు పాదయాత్రలో నడిచేందుకు అవకాశం కల్పించారు. జగన్ దృష్టికి ఏఎన్ఎం, ఆశావర్కర్ల సమస్యలు రాయచోటి రూరల్: వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు తమ సమస్యలను మంగళవారం ప్రజాసంకల్ప యాత్రలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. సెకండ్ ఏఎన్ఎంలను రెగ్యులరైజ్ చేయాలని, ఆశావర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. చంటి బిడ్డలతో ఎదురుచూపులు జగన్మోహన్రెడ్డి రాకకోసం వేంపల్లె మండలం రాజారెడ్డి కాలనీ వద్ద మహిళలు చంటి బిడ్డలతోసహా గంటన్నరపాటు ఎదురు చూశారు. జగనన్న వస్తాడని, తమ బిడ్డలను దీవిస్తాడని వేచి ఉన్నట్లు వారు చెప్పారు. అక్కడికి చేరుకున్న జగన్ చిన్నారులను ఎత్తుకుని ముద్దాడారు. దీంతో వారి తల్లులు సంబరపడిపోయారు. జగన్‌కు చిన్నారి ముద్దు వేంపల్లె పట్టణంలో జరిగిన ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా తమ సమస్యలను చెప్పుకునేందుకు వచ్చిన వారితో జగన్ మాట్లాడారు. ఈ సమయంలో చంటిపిల్లాడికి ఒక అరుదైన అవకాశం దొరికింది. అతడు తనను దగ్గరకు తీసుకున్న జగన్‌కు ముద్దు పెట్టాడు. పిల్లలను ముద్దాడే జగన్‌ను తానే ముద్దాడానన్న సంతోషం ఒక బాబుకు దక్కింది. అక్కడున్న జనాలు ఈ సంఘటనను ఆసక్తిగా తిలకించారు. బియ్యం ఇచ్చి రెండున్నర ఏళ్లు అయింది.. వేంపల్లె పట్టణంలో 13వ వార్డుకు చెందిన ఎల్లమ్మ అనే వృద్ధురాలు తనకు రేషన్‌షాపులో బియ్యం ఇచ్చి రెండున్నర ఏళ్లు అయింది నాయనా అంటూ తన సమస్యను జగన్మోహన్రెడ్డికి చెప్పుకుంది. వేలిముద్ర పడలేదని పలుసార్లు తిప్పుకున్నారని, చివరకు బియ్యం, కిరోసిన్, చెక్కర, పామాయిల్ ఏవీ లేకుండా చేశారు నాయనా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె సమస్యను సావధానంగా విన్న జగన్ మనం ఎంతో దుర్మార్గమైన పాలనలో ఉన్నామని అన్నారు. వృద్ధురాలి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానిక నాయకులకు సూచించారు. బడుగుల సంక్షేమం జగన్‌తోనే సాధ్యం ‘‘మాది విజయవాడ. పాన్ షాప్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాను. నాలాంటి లక్షలాది మందికి వైఎస్ రాజశేఖరరెడ్డి సాయపడ్డారు. ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ‘108’ లాంటివి ఇప్పుడు మూలనపడ్డాయి. అవి మళ్లీ అమలు కావాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలి. బడుగు బలహీన వర్గాల సంక్షేమం జగన్‌తోనే సాధ్యం. అందుకే నేను సైతం పాదయాత్రలో పాల్గొంటున్నా.. జగన్ మాకు ఆదర్శం. ఆ అభిమానంతోనే స్వయంగా ఇడుపులపాయకు వచ్చా’’ – పరమపటేల్ శ్రీనివాస్, సింగ్‌నగర్, విజయవాడ జగన్‌ను కలసిన పులివెందుల నాయకులు వేంపల్లె: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండవ రోజు పాదయాత్ర సందర్భంగా మంగళవారం ఉదయం వేంపల్లె పట్టణంలోని మాలవంక వద్ద ఏర్పాటు చేసిన బస వద్ద పులివెందుల నియోజకవర్గ నాయకులతో మాట్లాడారు. అందర్నీ పేరుపేరునా ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని సమస్యలను నాయకులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఏడాది ఆగితే మన ప్రభుత్వం వస్తుందని, అన్ని సమస్యలను తీరుస్తానని జగన్ వారికి హామీ ఇచ్చారు. జగన్‌కు కృతజ్ఞతలు: ఎమ్మెల్సీ గోపాల్‌రెడ్డి వేంపల్లె నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అధికారంలోకి రాగానే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్)ను రద్దు చేస్తానని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రకటించడంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, ఏపీఎన్జీవోస్ మాజీ అధ్యక్షుడు వెన్నపూస గోపాల్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం వైఎస్ జగన్‌ను కలసి కృతజ్ఞతలు తెలిపారు. -
‘సమితులు’ ఏం చేస్తున్నట్లు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమితులను గాడిన పెట్టడంలో వ్యవసాయశాఖ వైఫల్యంపై సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ఇతర వ్యవసాయ ఉన్నతాధికారులతో జరిగిన సమా వేశంలో సమితుల పనితీరుపై సీఎం అసంతృప్తి వ్యక్తంచేసినట్లు సమాచారం. మార్కెట్‌కు పత్తి సహా ధాన్యం తరలివస్తోంది. ఇటీవలి వర్షాల కారణంగా అనేకచోట్ల పత్తి రంగు మారడం, తేమశాతం అధికంగా ఉండటంతో వ్యాపారులు రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడంలేదు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి సమయంలో సంబంధి త రైతులకు అండగా ఉండాల్సిన సమన్వయ సమితి సభ్యులు ఎక్కడా పత్తాలేకుండా పోయారన్న అభిప్రా యం వ్యక్తమవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో వారు పత్తి వ్యాపారులతో మాట్లాడటం, సీసీఐ కొనుగోలు కేంద్రాలను సందర్శించడం, మార్కెట్ కమిటీ చైర్మ న్లు, కార్యదర్శులను కలవడం, రైతులకు నచ్చజెప్ప డం వంటి పనుల్లో నిమగ్నమై ఉండాలి. కానీ అటువంటి పరిస్థితి లేదన్న భావన ప్రభుత్వంలో నెలకొంది. రైతులు పత్తితో వ్యవసాయ మార్కెట్లకు తరలివస్తుంటే ఎక్కడా వారి తరఫున సమితి సభ్యులు వచ్చిన దాఖలాలు లేవు. ‘గ్రామ, మండల సమితులు ఏర్పాటు చేశారు. వాటికి సభ్యులను, సమన్వయకర్తలను నామినేట్ చేశారు. సభ్యులు రైతులకు అన్ని విధాలా అండగా ఉంటున్నారా?’అని ఆ సమావేశంలో సీఎం ప్రశ్నించినట్లు తెలిసింది. అడుగడుగునా అందుబాటులో ఉండాల్సింది.. ‘అన్ని వర్గాలకూ సంఘాలున్నాయి. కానీ రైతులు అసంఘటితంగా ఉన్నారు. వారిని సంఘటితం చేసేందుకే రైతు సమితులను ఏర్పాటు చేశాము’అని ప్రభుత్వం చెప్పింది. రాష్ట్రంలో గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి రైతు సమన్వయ సమితుల ఏర్పాటు జరుగుతోంది. రాష్ట్రంలో 10,733 గ్రామ రైతు సమన్వయ సమితులు, 559 మం డల సమితులు, 30 జిల్లా సమితులను ఏర్పాటు చేయాలి. ఇప్పటికి గ్రామ రైతు సమన్వయ సమితు లు పూర్తయ్యాయి. 559 మండల సమితులకు గాను దాదాపు 530 సమితులు ఏర్పాటయ్యాయని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. విత్తనం వేసే దగ్గర నుంచి పంట పండించి మార్కెట్‌కు చేరి గిట్టుబాటు ధర లభించే వరకు రైతులకు అడుగడుగునా సమితులను అందుబాటులో ఉంచాలన్నది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. పంటకు గిట్టుబాటు ధర రాకుంటే వ్యాపారులతో చర్చించి సరైన ధర ఇప్పించడంలోనూ వీరు కీలకపాత్ర పోషించాలని సర్కారు స్పష్టంగా చెప్పింది. సరైన ధర రాకుంటే వచ్చే వరకు రైతుల పక్షాన ఉండాలని కూడా చెప్పింది. శిక్షణ పొందారు... సైలెంట్ అయ్యారు రైతులకు ఎలా సాయపడాలన్నదానిపై గ్రామ, మండల రైతు సమన్వయ సమితులకు ప్రభుత్వం జిల్లాల్లో శిక్షణ ఇచ్చింది. ఆ శిక్షణకు వ్యవసాయ మంత్రి శ్రీనివాసరెడ్డి, ఆ శాఖ కమిషనర్ జగన్మోహన్ ప్రత్యేకంగా హెలీకాఫ్టర్లో వెళ్లి వచ్చారు. ఇంత చేసినా కీలకమైన తరుణంలో సమితి సభ్యులు సైలెంట్ అయ్యారు. పత్తి రైతులు పంటకు గిట్టుబాటు ధర రాక అల్లాడిపోతున్నారు. మార్కెట్లో వారిని దళారులు దోపిడీ చేస్తున్నారు. సోయాబీన్‌కూ సరైన ధర రావడంలేదని రైతులు ఆందోళన చేస్తున్నారు. గిట్టుబాటు ధర రావడంలేదని ప్రతిపక్షమంతా ఆందోళన వ్యక్తంచేస్తోంది. ఇటువంటి తరుణంలో సమితి సభ్యులంతా ఏమయ్యారన్న ప్రశ్న ప్రభుత్వాన్ని పట్టిపీడిస్తోంది. వారిని నడిపించడంలో వ్యవసాయశాఖ వైఫల్యం చెందిందన్న భావన నెలకొంది. -
ఇది ప్రభుత్వ దోపిడీయే!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ప్రకృతి సహకరించక, తెగుళ్ల కారణంగా దిగుబడి తగ్గి ఇప్పటికే ఆందోళనలో ఉన్న రైతన్నకు వ్యాపారుల మాయాజాలం మరింత వేదన కలిగిస్తోంది. సీసీఐ కొనుగోళ్లు చేయకపోవడం, మద్దతు ధర దక్కకపోవడం, వ్యాపారులు నానా సాకులు చెబుతూ అతితక్కువ ధర చెల్లిస్తుండటంతో కడుపు మండిన రైతన్న ఆందోళనకు దిగుతున్నాడు. అసలు ప్రభుత్వమే తమ వద్ద దోచుకుంటోందంటూ మండిప డుతున్నాడు. బుధవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో రైతులు.. తమ ఆవేదనను, క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితిని కళ్లకు కట్టేలా నిరసన తెలిపారు. ‘పత్తి ధరలపై బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పింది? అధికారంలోకి వచ్చాక హామీ ఇచ్చిన ధర ఎంత? ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ఎంత? క్షేత్రస్థాయిలో ఈ రోజు తమ పత్తికి పలికిన ధర ఎంత? తాము నష్టపోయిన మొత్తం ఎంత?’ అనే వివరాలతోపాటు ఈ నష్టాన్ని ప్రభుత్వం దోచుకున్న ట్లేనంటూ ఫ్లెక్సీలు, బ్యానర్లతో వినూత్నంగా ప్రదర్శించా రు. ఆరుగాలం శ్రమించి ఉత్పత్తిని మార్కెట్‌కు తీసుకొస్తే వ్యాపారులు కుమ్మక్కై అడ్డగోలుగా దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారుల ఇష్టారాజ్యం వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్ (సీఏసీపీ) అంచనా ప్రకారం క్వింటాల్ దిగుబడికి ఖర్చు ఎంత అవుతుందో దానికి 50 శాతం కలిపి మద్దతు ధర ఇవ్వాలి. పత్తికి రూ.6,564 గిట్టుబాట ధర వస్తే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుందని స్వామినాథన్ కమిషన్ కూడా పేర్కొంది. ఈ రెండు అంశాలను గత పార్లమెంటు ఎన్నికల సందర్భంగా బీజేపీ తమ మేనిఫెస్టోలో పెట్టింది. తాము అధికారంలోకి వస్తే వాటిని అమలు చేస్తామని ప్రకటించిం ది. కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటై మూడున్న రేళ్లు దాటిపోతున్నా ఇవేవీ అమల్లోకి రాలేదు. ఇక ప్రస్తుతం పత్తికి క్వింటాల్‌కు రూ.4,320 మద్దతు ధర (ఎంఎస్పీ)గా ప్రకటించింది. అయితే ఇందులోనూ పత్తి నాణ్యత, తేమ శాతంపై సీసీఐ అడ్డగోలు నిబంధనలు విధించింది. రైతులు తెస్తున్న పత్తి ఆ నిబంధనల ప్రకారం లేదంటూ కొనుగోలు చేయడం లేదు. దీంతో వ్యాపారులు, ట్రేడర్లు ఇష్టానుసారం ధరలు నిర్ణయిస్తున్నారు. కేవలం రూ.1,500 నుంచి రూ.3,000 వరకు మాత్రమే చెల్లిస్తున్నారు. పూర్తి నాణ్యౖ మెన, నిబంధనల ప్రకారం ఉన్న పత్తికి కూడా గరిష్టంగా రూ.4,000 వరకు మాత్రమే ఇస్తున్నారు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ హామీలు, వాస్తవాలపై ఆందోళన రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో ఈనెల 20న ‘ప్రభుత్వం రైతులను మోసం చేసింది.. దీనిపై ప్రధాని మోదీని లెక్కలు అడుగుదాం’ అనే నినాదంతో ఢిల్లీలో కిసాన్ ముక్తియాత్రను చేపట్టనున్నారు. ఇందుకోసం తెలంగాణ, ఏపీల్లోని ప్రధాన మార్కెట్లలో ముక్తి వికాస్, మానవ హక్కుల వేదిక, రైతు స్వరాజ్య వేదికలతోపాటు సుమారు 40 ప్రజా సంఘాల నాయకులు పత్తి రైతుల వద్ద వివరాలు సేకరిస్తున్నారు. ఈ మేరకు బుధవారం జమ్మికుంట మార్కెట్లో పత్తికి మద్దతు ధర అమలు, కొనుగోళ్ల తీరుపై పరిశీలన జరిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ నిర్లక్ష్యం, వ్యాపారుల దోపిడీపై రైతులతో కలసి నిరసన తెలుపుతు న్నారు. ‘ప్రభుత్వం మమ్మల్ని దోచుకుంటోంది’ అనే పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి.. ఆయా రైతుల పేర్లు, గ్రామం, తెచ్చిన పత్తి, చెల్లించిన ధర, స్వామినాథన్ నివేదిక ఆధారం గా అందాల్సిన ధర, మద్దతు ధర, ప్రభుత్వం దోచుకున్నది ఎంత..’’ అనే వివరాలు రాస్తున్నారు. మొత్తంగా ‘కిసాన్ ముక్తియాత్ర’ కార్యక్రమానికి ఐదు వేల మంది రైతులు, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులు, రైతు సంఘాల నాయకులు, ప్రజాసంఘాల నేతలు వెళ్లనున్నారు. ఈ చిత్రంలో ఆవేదనతో కనిపిస్తున్న మహిళా రైతు ఉనుగూరి కమల. జయశంకర్ జిల్లా మొగుళ్లపల్లి మండలం పిడిసిల్ల గ్రామం. ఆమె ఖరీఫ్‌లో ఆరెకరాల్లో పత్తి సాగు చేసింది. గులాబీరంగు పురుగు కారణంగా దిగుబడి పడిపోయింది. 65 మంది కూలీలతో పత్తి ఏరితే 11 బస్తాలు (7 క్వింటాళ్లు) వచ్చింది. దానిని బుధవారం జమ్మికుంట మార్కెట్‌కు తీసుకొచ్చింది. వ్యాపారులు ఆ పత్తిని పరిశీలించి.. కాయ, తేమ ఉందని, గుడ్డి పత్తి అంటూ క్వింటాల్‌కు రూ.1,500 చొప్పున మాత్రమే చెల్లించారు. అంత తక్కువ ధర చెల్లించడంతో కమల కన్నీరు పెట్టుకుంది. పత్తి ఏరిన కూలీల కోసమే రూ.15 వేలు ఖర్చయింది. దానిని అమ్మితే రూ.10,500 మాత్రమే చేతికి వచ్చాయంటూ ఆవేదనకు గురైంది. అటు మూడెకరాల్లో వరి సాగు చేస్తే దోమపోటు సోకి దెబ్బతిన్నదని విలపించింది. సాగును నమ్ముకుంటే అప్పులు, కన్నీళ్లే మిగిలాయంటూ ఆందోళన వ్యక్తం చేసింది. రైతులకు పంట నష్టం చెల్లించాలి ‘‘ప్రభుత్వం హామీ ఇచ్చిన ధర కాకుండా ఎంఎస్పీని ప్రకటించింది. అది కూడా అందని పరిస్థితి ఉంది. అకాల వర్షాలతో పత్తి రైతులు చాలా నష్టపోయారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన ధరను వెంటనే అమల్లోకి తేవాలి. బుధవారం సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. కానీ ఒక్క రైతు వద్ద కూడా కొనుగోలు చేయకుండా ట్రేడర్స్‌కు వదిలేశారు. సీసీఐ కంటే ట్రేడర్సే ఎక్కువ ధర చెల్లిస్తున్నారంటూ బుకాయిస్తున్నారు. నష్టపోయిన రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారం చెల్లించాలి..’’ – విస్స కిరణ్‌కుమార్,రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కమిటీ సభ్యుడు -
ఆక్రందనకు లాఠీ జవాబా?
సందర్భం ట్రేడర్ల మాయాజాలంతో తాము దారుణంగా మోసపోతున్నామని రైతులు మార్కెట్ యార్డుల్లో నిరసనకు దిగుతున్నారు. కడుపుమండి రోడ్లపై బైఠాయి స్తున్న రైతులపై పోలీసులను ప్రయోగించడం పరిష్కారమేనా? గత పదేళ్లలో ఎన్నడూ లేనంత వ్యవసాయ సంక్షోభాన్ని తెలం గాణ రైతాంగం ఎదుర్కొం టోంది. పంట చేతికొచ్చే తరు ణంలో కురిసిన కుండపోత వర్షాలకు పత్తి, వరి, మక్క, సోయాబీన్ పంటలు దారు ణంగా దెబ్బతిన్నాయి. వరి కోతకొచ్చే సమయంలో వర్షాలు విడవకుండా పడటంతో గింజలు రాలడం, వెన్నులపైనే మొలకెత్తడం, ధాన్యం రంగు మారడం లాంటి సమస్యలు తలెత్తాయి. లక్షన్నర ఎకరాల్లో వరి నేల పాలైంది. పత్తి రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఎన్నడూ లేని విధంగా క్వింటాలుకు వెయ్యి నుంచి మూడు వేలకు మించి చెల్లించేది లేదని వ్యాపారులు కూడబలుక్కున్నా ప్రశ్నించే నాథుడే లేడు. ఈసారి పత్తి సాగు విస్తీర్ణం పెరిగిందని ప్రభుత్వానికి తెలుసు. అంతర్జాతీయంగా పత్తి దిగుబడులు 10 శాతం పెరగ నున్నాయని ఇంటర్నేషనల్ కాటన్ అడ్వయిజరీ కమిటీ (ఐసీఏసీ) కూడా ముందే ప్రక టించింది. ఈ నేపథ్యంలో ఏ ప్రభుత్వమైనా 4 నెలల ముందే ధరలు పతనం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మద్దతు ధరగా ప్రకటించిన రూ. 4,320కు రూపాయి కూడా తగ్గకుండా కొనుగోలు జరిగేలా ప్రభుత్వం మార్కెట్లో జోక్యం చేసుకుని ఉండాల్సింది. పత్తి కొనుగోలుకు కాటన్ కార్పొరేషన్ (సీసీఐ) కేంద్రాలు పెంచేలా కేంద్రంపై ఒత్తిడి చేస్తామని ప్రకటనలైతే వచ్చాయి. కానీ సీపీఐ అక్టోబరు పది నుంచి తెరిచిన కొనుగోలు కేంద్రాల్లో ఒక్క క్వింటాలు కూడా సేకరించ లేదు. సెప్టెంబరు రెండో వారం నుంచి నెల రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. పూత కాయగా మారే దశలో పడిన వర్షాల వల్ల కాపు తగ్గింది. చేతికొచ్చిన పత్తి కూడా నాణ్యత తగ్గింది. వ్యాపారులు కుమ్మక్కు కాకుండా పోటీ నెలకొల్పే లక్ష్యంతో ఏర్పాటైన సీసీఐ కేంద్రాలు ట్రేడర్ల చెప్పుచేతుల్లో నడుస్తున్నాయి. సర్వర్ పని చేయడం లేదని, తేమ 12 శాతానికి మించి ఉందని సీసీఐ అధికారులు కొనుగోళ్లను నిలిపి వేయడం వ్యాపారులకు లాభం కలిగించడం కోసం కాదా? నాణ్యత దెబ్బతిన్న విషయం సీసీఐ, రాష్ట్ర ప్రభు త్వాలకు తెలియందేమీ కాదు. అంతా సరిగా ఉంటే ఎవరి జోక్యం లేకుండానే అమ్మకాలు, కొనుగోళ్లు జరిగి పోతాయి. వర్షాల తాకిడికి పత్తి నల్లబడటం, తేమ చేర డంలో రైతుల ప్రమేయం ఏముంటుంది? అన్ని రకాలు పెట్టుబడులు పెట్టి పంట సేకరణ సమయంలో సంభ వించిన ఉపద్రవాలకు వారిని బాధ్యులను చేసి ధరలు పతనం చేస్తే ఇక ప్రభుత్వాలు ఎందుకు? రైతులపట్ల తనకు నిజంగా బాధ్యత ఉందని రాష్ట్ర ప్రభుత్వం నిరూ పించుకోవాలంటే 15 శాతం తేమ ఉన్నా పత్తి కొనుగోళ్లు జరిగేలా చూడాలి. ప్రతి క్వింటాలుపైన 3వేల రూపా యల బోనస్ ఇస్తే తప్ప పత్తి రైతుల పెట్టుబడి చేతికి రాదు. వరి పండించిన రైతులకు ఎకరానికి రూ. 5 వేలు చెల్లించాలి. తక్షణమే ప్రభుత్వం దీనిపై ప్రకటన చేయాలి. గత ఏడాది మంచి రాబడి రావడంతో ఈసారి రైతులు పత్తి సాగుకు ఎగబడ్డారు. దాదాపు 45 లక్షల ఎకరాల్లో, కిందటేడాది కంటే 26.5 శాతం ఎక్కువ విస్తీర్ణంలో పత్తి సాగు చేశారు. వర్షాల వల్ల పూత కాయ లుగా ఏర్పడక ఆరు క్వింటాళ్లు కూడా దిగుబడి రాని పరి స్థితి. పైగా పగిలిన పింజల్లోకి నీరు చేరి నల్లబడి నాణ్యత పోయింది. గులాబి రంగు కాయ తొలిచే పురుగు విరుచు కుపడి మరో 10 లక్షల ఎకరాల్లో పంట నాశనమైంది. పంటను సేకరించడానికి కూలీలకు కిలోకు 10 రూపాయల చొప్పున చెల్లించాల్సి వస్తోంది. ఇది క్వింటా లుకు రూ. వెయ్యి అవుతోంది. గ్రామాల్లో కూలీల సమస్య ఉండటం, చేలలో ఇంకా బురద ఆరకపోవడం వల్ల సేకరణ కష్టంగా మారింది. నాణ్యత లోపం, అధిక తేమ పేరుతో క్వింటాలుకు రూ. వెయ్యి నుంచి మూడు వేలు మాత్రమే దక్కితే ఇక వారు పెట్టిన పెట్టుబడి సంగతేమిటి? అంతా అనుకూలంగా ఉండి పది క్వింటా ళ్లపైన పండితేనే రైతుకు బొటాబొటిగా పెట్టుబడి చేతికి వస్తుంది. పదిహేను క్వింటాళ్లు పండితేగానీ నాలుగు పైసలు చేతిలో మిగలవు. పత్తి క్వింటాలుకు రూ. 7 వేలు దక్కేలా చూడాలని రైతులు ఎప్పటినుంచో కోరుతు న్నారు. తెలంగాణలో పత్తి సాగు వ్యయం గణనీయంగా పెరిగిందని హెక్టారుకు రూ. 84,045కు చేరిందని ప్రభుత్వ ప్రణాళిక శాఖ ప్రచురించిన ‘సోషియో ఎక నమిక్ అవుట్‌లుక్–2017’ కూడా స్పష్టం చేస్తోంది. ఇన్ని తెలిసిన ప్రభుత్వం తీరా పంట చేతికొచ్చే సమయంలో రైతులను ఆదుకొనే దిశగా ప్రయత్నించక పోవడం దారుణం. మార్కెట్లలో ట్రేడర్లు కుమ్మక్కవుతుంటే జోక్యం చేసుకోవాల్సిన బాధ్యతను ప్రభుత్వం విస్మ రిస్తోంది. ట్రేడర్ల మాయాజాలంతో తాము దారుణంగా మోసపోతున్నామని రైతులు మార్కెట్ యార్డుల్లో నిరస నకు దిగుతున్నారు. కడుపుమండి రోడ్లపై బైఠాయించి ప్రభుత్వ జోక్యాన్ని డిమాండు చేస్తున్నారు. పోలీసులను ప్రయోగించి వాళ్లను చెదరగొట్టవచ్చనుకుంటే అది సమ స్యను మరింత జటిలం చేయటమే అవుతుంది. తమను ఆదుకోవాలని వారు చేస్తున్న ఆక్రందనే వివిధ రూపాల్లో నిరసనగా కనిపిస్తుంది. ఎవరూ జోక్యం చేసుకోకపోతే ఆత్మహత్యలకు దారి తీస్తుంది. అప్పుడు ఎవరేం చేసినా ప్రయోజనం ఉండదు. దేశంలో రైతుల బలిదానాలు ఎక్కువ జరుగుతున్న రెండో రాష్ట్రంగా ప్రభుత్వం ఇప్ప టికే అపప్రథను మూట కట్టుకుంది. రైతులను ఆదుకునేం దుకు తక్షణం స్పందించకపోతే మొదటి స్థానం కోసం ప్రయత్నిస్తోందని భావించక తప్పదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాసకర్త ఎమ్మెల్సీ, తెలంగాణ ఫోన్: 98669 11221 -
పత్తి రైతుకు మద్దతు
సాక్షి, హైదరాబాద్: పత్తి రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. పత్తికి మద్దతు ధర కల్పిస్తామని, అంతకంటే ఎక్కువ ధర వచ్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు 3 శాతం పత్తి మాత్రమే మార్కెట్‌కు వచ్చిందని చెప్పారు. వర్షాలతో తడిసిన పత్తికి మాత్రమే తక్కువ ధర వస్తోందని.. ఎక్కువ శాతం పత్తికి కనీస మద్దతు ధర కంటే ఎక్కువ వస్తోందని పేర్కొన్నారు. పంట రుణమాఫీ, పంటలకు మద్దతు ధర, వ్యవసాయ సంబంధిత అంశాలపై అసెంబ్లీలో బుధవారం లఘు చర్చ జరిగింది. విపక్ష సభ్యుల ప్రశ్నలు, సందేహాలపై సీఎం కేసీఆర్ మాట్లాడారు. రైతులకు కనీస మద్దతు ధరలు ఇప్పించే విషయంలో తమ ప్రభుత్వం అన్ని రకాలుగా ముందుంటోందని చెప్పారు. రాష్ట్రంలో వడ్ల కొనుగోలు విషయంలో గత ప్రభుత్వాలు చేయలేని విధంగా తమ ప్రభుత్వం చేసిందన్నారు. కేసీఆర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. మద్దతు ధరలో ఇబ్బందులేమీ లేవు భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) రాష్ట్రాల్లో వడ్లు కొనుగోలు చేయడం 2011 నుంచే నిలిపివేసింది. అప్పట్నుంచి రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. మా ప్రభుత్వం వచ్చాక రికార్డు స్థాయిలో వడ్లు కొనుగోలు చేశాం. 2016–17లో రూ.8,083 కోట్లతో రైతుల నుంచి కొనుగోలు చేశాం. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ఎఫ్‌సీఐ కొత్త విధానం తెచ్చింది. అప్పుడు ఇప్పటిలో సగం మొత్తం కూడా కేటాయించలేదు. నిరంతర ఉచిత కరెంటు, సాగునీటిపై ప్రభుత్వం చొరవతో పంటలు బాగా పండాయి. 97 లక్షల టన్నుల ఉత్పత్తి వచ్చింది. మా కండ్లు మండలేదు. ప్రభుత్వం చొరవ తీసుకుని రిజర్వ్ బ్యాంకు వద్ద రుణ పరిమితిని పెంచుకుంది. రైతులకు కనీస మద్దతు ఇప్పించేందుకు రూ.8 వేల కోట్లతో వడ్లు కొనుగోలు చేసింది. ఈ ఏడాది వరి పంట ఇప్పుడే వస్తోంది. ప్రస్తుతం 200 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఇవి 5 వేలకు చేరతాయి. రాష్ట్రంలో ఇప్పుడే వడ్లు, మక్కలు, పెసలు, కందుల వంటి పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలో ఇబ్బందులేమీ లేవు. పత్తి విషయంలోనే కొంచెం ఆలోచించాలి. నానిన పత్తిని కొనాలె. రాష్ట్రంలో విస్తారంగా కురిసిన వర్షాలతో కొన్ని ప్రాంతాల్లోని పత్తి తడిసింది. సాధారణంగా పత్తిని మూడు నుంచి ఐదుసార్లు ఏరుతరు. రాష్ట్రంలో ఈ సారి 48 లక్షల ఎకరాల్లో పత్తిని సాగుచేశారు. 30 లక్షల టన్నులు ఉత్పత్తి అవుతుందని అంచనా ఉంది. ఇప్పటివరకు 92 వేల టన్నులే మార్కెట్‌కు వచ్చింది. ఇంకా 29 లక్షల టన్నులు రావాలి. మార్కెట్‌కు వచ్చిన పత్తిలో 50 శాతానికి కనీస మద్దతు ధర కంటే ఎక్కువే వచ్చింది. ఆదిలాబాద్, నారాయణఖేడ్ మార్కెట్లకు మహారాష్ట్ర నుంచి రైతులు వచ్చి పత్తి అమ్ముతున్నారు. వాళ్ల రాష్ట్రంలో కంటే ఇక్కడ అధిక ధర వస్తోందని చెబుతున్నారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీపీఐ) మొత్తం పత్తిని కొనదు. కనీస మద్దతు ధర వచ్చేలా జోక్యం చేసుకుంటుంది. ఎక్కువ శాతం పత్తిని ప్రైవేటు వ్యాపారులు, జిన్నింగ్ మిల్లుల యజమానులే కొనుగోలు చేస్తారు. కేంద్రం పత్తికి క్వింటాల్‌కు రూ.4,300 కనీస మద్దతు ధర ఖరారు చేసింది. బయట ధర వస్తుండడంతో సీసీఐ వద్దకు వెళ్లడం లేదు. ఎక్కువగా తడిసిన పత్తిని కొనుగోలు చేసేందుకు సీసీఐ నిరాకరిస్తోంది. పత్తి కొనుగోలుపై ఈ రోజు పత్రికలలో వార్తలు వచ్చాయి. పత్తి ఉత్పత్తిలో మన రాష్ట్రం దేశంలోనే రెండు, మూడు స్థానంలో ఉంది. భవిష్యత్తు పరిస్థితులను అంచనా వేసే వరంగల్‌లో మెగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటుకు శంకుస్థాపన చేశాం. అక్కడ ఎక్కువగా స్పిన్నింగ్ మిల్లులు ఏర్పాటవుతాయి. ప్రభుత్వపరంగా విడుదల కావాల్సిన రాయితీలు ఇస్తే రాష్ట్రంలో స్పిన్నింగ్ మిల్లులను ఏర్పాటు చేస్తామని, ఎక్కువ పత్తి కొంటామని పారిశ్రామికవేత్తలు ముందుకువచ్చారు. పత్తి రైతుకు ఎంఎస్పీ, అంతకంటే ఎక్కువ ధర వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇస్తున్నా. ఉచిత విద్యుత్ మొదలుపెట్టింది వైఎస్సార్‌గారు.. ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వడం గౌరవనీయులు వైఎస్ రాజశేఖరరెడ్డిగారు మొదలుపెట్టారు. ఇది ఎవరూ కాదనలేని సత్యం.. మేం కాదంటే అది తప్పు అవుతుందా? అది అందరం అంగీకరించాల్సిందే. ఇప్పుడు మేం నిరంతర కరెంట్ ఇస్తున్నాం. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో కరెంటు వినియోగం 3 వేల మెగావాట్ల నుంచి 4 వేల మెగావాట్ల మధ్య ఉండేది. నిరంతర సరఫరాతో ఇప్పుడు 10 వేల మెగావాట్లకు చేరింది. పక్కరాష్ట్రంలోనే కాదు మంచి ఎక్కడ ఉన్నా తీసుకోవాలి. అయితే పక్కరాష్ట్రంలో ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. అన్ని రకాల పంట రుణాలు మాఫీ చేస్తామని అక్కడ చెప్పారు. కానీ రెండు విడతలు మాత్రమే ఇచ్చారు. 56 అంశాలను పెట్టి ఏదో చేశారు. పక్కరాష్ట్రం మన కంటే దేంట్లోనూ ఇదిగా లేదు. వడ్డీ భారం ఎక్కడుందో చెప్పండి.. రాష్ట్రంలో రైతుల పంట రుణాల మాఫీ విషయంలో మా వైఖరి నిరూపించాం. రుణమాఫీ ప్రక్రియ ముగిసింది. రాష్ట్రంలోని 35.30 లక్షల మంది రైతులకు రూ.16,124 కోట్ల రుణాలను మాఫీ చేశాం. కరీంనగర్ జిల్లాకు చెందిన ఆర్థిక సంఘం మాజీ సలహాదారు జీఆర్‌రెడ్డి సూచన మేరకు నాలుగు దశల్లో పూర్తిగా చెల్లించాం. వేల కోట్ల రూపాయలను చెల్లించిన మాకు వంద, రెండొందల కోట్లు చెల్లించడానికి ఇబ్బందా? రుణమాఫీ అయిన రైతులకు వడ్డీ భారం పడిందని గతంలో శాసనసభలో విపక్ష నేత జానారెడ్డిగారు చెప్పినప్పుడు నేను స్పష్టంగా చెప్పాను. అలాంటి వారు ఎవరైనా ఉంటే జాబితా ఇవ్వండి. వారికి ఇవ్వాల్సిన మొత్తం చెల్లిస్తామని సభలోనే చెప్పా. ఆ తర్వాత బ్యాంకర్లను ఈ అంశంపై సమాచారం కోరాం. ఎక్కడా వడ్డీ చెల్లింపు అంశం లేదని చెప్పారు. మా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజల వద్దకు వెళ్లిన సందర్భంలోనూ ఎవరు ఇలాంటి ఫిర్యాదులు ఇవ్వలేదు. ఆ సమయంలో ఒంటరి మహిళలు తమకు ఆసరా కావాలని కోరారు. వారికి పింఛన్ విషయంలో వెంటనే నిర్ణయం తీసుకుని అమలు చేస్తున్నాం. వడ్డీ భారం విషయం ఏమీ లేదని బ్యాంకర్లు, అధికారులు చెప్పారు. రుణాలు మాఫీ అయినట్లు ఫామ్–ఎఫ్ జారీ చేస్తున్నట్లు బ్యాంకర్లు చెప్పారు. ప్రజలకు సమస్యలు ఉంటే ఒక్క కాంగ్రెస్ వారి వద్దకే రారు. మా పార్టీకి ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఈ విషయంపై ఫిర్యాదులు రావాలి. ఇప్పుడు మరోసారి చెబుతున్నా. రుణమాఫీ అయి వడ్డీ భారం పడిన వారు ఎవరైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి. అసెంబ్లీ జరుగుతోంది. సమావేశాలు ముగిసేలోపు అయినా.. మరో పది రోజుల్లో అయినా ఫర్వాలేదు అలాంటి రైతుల వివరాలు ఉంటే తీసుకురండి. స్పీకర్‌కు ఇవ్వండి. వెంటనే వాటిని ఇక్కడే పరిశీలించి అవసరమైన చెల్లింపులు జరుపుతాం. రూ.16 వేల కోట్లు చెల్లించినప్పుడు... ఇంకో వందో, మూడొందల కోట్లు భారమవుతాయా? రైతులకు మొదటి విడత రుణమాఫీ జరిగినప్పుడే బ్యాంకులు రెన్యూవల్ చేశాయి. నిజమైన రైతులు అనేవారు రుణమాఫీ విషయంలో ఆలస్యం చేయరు. ఆలస్యం అయిందంటే ఏదో మతలబు ఉంటుంది. మెదక్ జిల్లా కౌడిపల్లిలో నకిలీ పాస్బుక్కులతో బ్యాంకు అధికారులు రుణాలు తీసుకున్నారు. కచ్చితంగా రైతు అయితే మాఫీ విషయంలో ఆలస్యం జరగదు. అయినా సరే వడ్డీ భారం ఉన్న రైతుల వివరాలు ఉంటే తీసుకు రండి. ఖమ్మం జిల్లాలో అటవీ ప్రాంతాల్లోని రైతులకు రుణ మాఫీ, వడ్డీ భారం విషయం గతంలో పరిశీలించాం. ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే వారి జాబితాతో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వస్తే పరిశీలిస్తా. నకిలీలపై ఉక్కుపాదం కల్తీ, నాసిరకం విత్తనాల విషయంలో కఠినంగా వ్యవహరించాలి. ఈ విషయంలో రైతులు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలె. బ్రాండెడ్ కంపెనీలు నాణ్యత విషయంలో రాజీపడవు. ధర విషయంలో తగ్గింపులు ఉండవు. మోసగాళ్లు నాసిరకం విత్తనాలు తయారు చేసి తక్కువ ధరకు అమ్ముతరు. కొందరు రైతులు చేతిలో డబ్బుల్లేని సందర్భాల్లో, ఉద్దెర వస్తుందనో ఇలాంటివి కొంటరు. తర్వాత అన్యాయానికి గురవుతరు. నాసిరకం విత్తనాలు అమ్మిన ఏడుగురిపై పీడీ చట్టం పెట్టాం. నకిలీ విత్తనాలకు ఈ చట్టం వర్తించదని వారు కోర్టుకు వెళ్లారు. పీడీ యాక్టులో ఇటీవల నాసిరకం విత్తనాలను చేర్చాం. దీనిపై ఆర్డినెన్స్ తెచ్చాం. దీన్నే ఇప్పుడు సభలో చట్టం చేయబోతున్నాం. రాళ్ల వానలతో నష్టపోయిన రైతులకు రూ.20 కోట్ల చెల్లింపులు జరపాల్సి ఉంది. వీటిని విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చా. విపత్తులతో నష్టపోతే ఇచ్చేది నష్టపరిహారం కాదు. కేవలం సహాయ చర్య మాత్రమే. నష్టం వేల కోట్ల రూపాయల్లో ఉంటుంది. వారికి ఇచ్చేది అప్పటికి ఆసరాగా ఉండేలా కొంతే ఉంటుంది. దీన్ని నష్టపరిహారం అనడం సరికాదు. పంటల బీమా విషయంలో కేంద్ర ప్రభుత్వం మరికొన్ని సవరణలు చేస్తోంది. రైతు యూనిట్‌గా పథకం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరుపున ప్రతిపాదించాం. బోనస్ ఇవ్వాలి: కె.జానారెడ్డి, సీఎల్పీ నేత రాష్ట్రంలో పంట రుణాలను ఒకేసారి మాఫీ చేయాలని గతంలో డిమాండ్ చేశాం. సాధ్యం కాదని నాలుగు దశల్లో చేస్తామని చెప్పారు. తొలిదశ రుణమాఫీ జరిగిప్పుడు మిగిలిన మొత్తానికి వడ్డీ పడుతుందని, దాన్ని ప్రభుత్వమే భరించాలని కోరాం. అసెంబ్లీలోనే సీఎం కేసీఆర్ దీనిపై హామీ ఇచ్చారు. ఇప్పటివరకు నెరవేర్చలేదు. వడ్డీ భారంపై బ్యాంకులతోనే నివేదికలు తెప్పించండి. పంటలకు మద్దతు ధరలు కల్పించాలి. పక్క రాష్ట్రంలో వడ్డీ మాఫీపై చేసినట్లుగా ఇక్కడా చేయాలి. వరి, కంది, పత్తి వంటి పంటలకు కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో మాదిరిగా బోనస్ ఇవ్వాలి. పత్తికి కనీసం వెయ్యికి తగ్గకుండా బోనస్ ఇవ్వాలి. సీఎం కొన్ని విషయాలలో బాగా ఉదారంగా ఉంటారు. రూ.3 వేల బోనస్ ఇచ్చినా మంచిదే. వడ్డీ భారం భరించాలి: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే రుణ మాఫీ దశల వారీగా చేయడం వల్ల రైతులపై వడ్డీ భారం పడింది. ప్రభుత్వం ఈ వడ్డీని భరించాలి. తహశీల్దార్లు, ఎమ్మెల్యేలతో దరఖాస్తులు తెప్పించేలా సీఎం ప్రకటన చేయాలి. వారం రోజులు గడువు ఇస్తే జాబితా తెప్పిస్తాం. పరిహారం చెల్లించలేదు: జి.కిషన్‌రెడ్డి, బీజేఎల్పీ నేత రాష్ట్రంలో రైతులు తక్కువ మంది మాత్రమే పంటల బీమా పథకంలో చేరుతున్నారు. పంట నష్టపరిహారం చెల్లింపులో కంపెనీల తీరు సరిగా లేదు. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినా కంపెనీలు రైతులకు చెల్లించలేదు. విపత్తుల పరిహారాన్ని ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేయలేదు. నాసిరకంపై చర్యలేవి?: సండ్ర వెంకటవీరయ్య, టీడీపీ ఎమ్మెల్యే కల్తీ విత్తనాలతో రైతులు నష్టపోతున్నారు. నాసిరకం వరి, పత్తి, మిరప విత్తనాలతో ఈ ఏడాది ఖమ్మం జిల్లాలో రైతులు నష్టపోయారు. వినియోగదారుల ఫోరంలో రైతులు కేసులు వేస్తే వ్యవసాయ శాఖ సరైన వాదనలు వినిపించడం లేదు. ఎంత నష్టం జరిగిందనేది ఇప్పటికీ చెప్పలేదు. ఏజెన్సీ ప్రాంతంలో రుణమాఫీ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. అర్హులు ఇంకా ఉన్నారు. చెల్లింపులు జరపాలి. మేం మేలురకం.. మీరు నాసిరకం వ్యవసాయ అంశాలపై జరిగిన చర్చల్లో సీఎం చేసిన వ్యాఖ్యలు అందరినీ నవ్వించాయి. పత్తి రైతులకు కనీస మద్దతు ధక్కడం లేదని, బోనస్ ఇవ్వాలని ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి అన్నారు. ఆ తర్వాత సీఎం మాట్లాడుతూ.. ‘ఏ పంటకైనా నాణ్యతోనే ధర ఉంటుంది. మేలు రకంగా ఉన్న పంటకు ఒక ధర.. నాసిరకంగా ఉన్న పంటకు ఇంకో ధర పలుకుతది. తేమ శాతాన్ని బట్టి పత్తి ధర నాలుగు రకాలుగా ఉంది. కేంద్ర ప్రకటించిన ధరలోనే ఇలా ఉంది. ఇదే అంశం రాజకీయాలకు వర్తిస్తుంది. ఎవరేం చేస్తున్నారో ప్రజలు, రైతులు చూస్తున్నారు. అంతిమంగా వారే నిర్ణయిస్తారు. అందరం ప్రజలకు దగ్గరకు వెళ్లాల్సిందే. అయితే వేర్వేరు జెండాలతో వెళ్తాం. మేలు రకం వారికి మేలు ధర, నాసిరకం వారికి నాసిరకం ధర పలుకుతుంది. అప్పుడు(గత ఎన్నికల్లో) మేం మేలురకం అయ్యాం. మీరు నాసిరకం అయ్యారు. మళ్లీ వెళ్తాం. ఎవరు మేలురకమో, ఎవరు నాసిరకమో ప్రజలు నిర్ణయిస్తారు’అని అనడనంతో అన్ని పార్టీల సభ్యులు ఒక్కసారిగా నవ్వారు. -
పత్తి రైతులకు అండగా ఉందాం
సాక్షి, హైదరాబాద్: పత్తి రైతులకు అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి జిన్నింగ్ మిల్స్ యాజమాన్యాలు కూడా తమవంతు సహకారం అందించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు కోరారు. జిన్నింగ్ మిల్స్ పరిశ్రమకు అవసరమైన సాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రైతులు మార్కెట్‌కు తెస్తున్న పత్తికి గిట్టుబాటు ధర అందించడంలో భాగంగా ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం రాష్ట్రంలోని జిన్నింగ్ మిల్స్ యాజమాన్యాలతో సమావేశమై ప్రభుత్వానికి సహకరించాలని పిలుపునిచ్చారు. మంత్రుల పిలుపునకు స్పందించిన జిన్నింగ్ మిల్స్ సంఘం అధ్యక్షుడు రవీందర్ రెడ్డి.. తమకు ప్రభుత్వం నుంచి రావలసిన ప్రోత్సాహకాలను వెంటనే విడుదల చేయాలని కోరారు. దీనికి స్పందించిన మంత్రులు.. సుమారు రూ. వంద కోట్ల ప్రోత్సాహకాల బకాయిలు వెంటనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఖాయిలాపడ్డ జిన్నింగ్ మిల్స్‌ను తెరిపిం చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌ను కేటీఆర్ ఆదేశించారు. ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ వ్యవస్థను ఈ ఖాయిలాపడ్డ జిన్నింగ్‌మిల్స్‌ను పునఃప్రారంభించేందుకు ఉపయోగించుకోవాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ శాఖ వేసిన జరిమానాలను ఎత్తివేయాలని పరిశ్రమ ప్రతినిధులు చేసిన విజ్ఞప్తికి మంత్రి కేటీఆర్ స్పందిస్తూ దీనికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నేటి నుంచి కొనుగోళ్లు పెంచండి.. ప్రభుత్వ ప్రోత్సాహకాలను అందిపుచ్చుకుని జిన్నింగ్ పరిశ్రమ ప్రతినిధులు బుధవారం నుంచే పత్తి కొనుగోళ్లు పెంచాలని మంత్రులు ఈటల, హరీశ్ రావు, కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఇటీవల గుజరాత్లో జరిగిన ఓ సమావేశంలో సౌత్ ఇండియా మిల్స్ అసోసియేషన్ చైర్మన్ సెంథిల్ కుమార్‌ను కలిశానని, తెలంగాణలో పండిస్తున్న పత్తి నాణ్యమైనదని ఆయన చెప్పారని మంత్రి కేటీఆర్ తెలిపారు. నాణ్యమైన పత్తిని పండిస్తున్న తెలంగాణ రైతన్నను ఉన్నత స్థితికి తీసుకెళ్లాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పం అని పేర్కొన్నారు. జిన్నింగ్ మిల్స్ యజమానులు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే త్వరలోనే రాష్ట్రంలో డిలింట్, సాల్వెంట్ పరిశ్రమ పార్కును నెలకొల్పుతామని ప్రకటించారు. వరంగల్‌లో ఇటీవల సీఎం శంకుస్థాపన చేసిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో తమకు కూడా పరిశ్రమలు పెట్టుకునే అవకాశం ఇవ్వాలని జిన్నింగ్ మిల్స్ ప్రతినిధులు చేసిన విజ్ఞప్తికి మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు పాల్గొన్నారు. -
పంటకు 'మంట'
సాక్షి, హైదరాబాద్/తల్లాడ/బోయినపల్లి/బేల: ఇటు ప్రకృతి.. అటు పురుగులు.. ఓ వైపు వ్యాపారుల మాయాజాలం.. మరోవైపు ప్రభుత్వాల నిర్లక్ష్యం.. నలువైపుల నుంచీ దాడితో పత్తి రైతు చిత్తవుతున్నాడు. ప్రకృతి పగబట్టి నట్లుగా అవసరమైనప్పుడు వాన కురవక.. వద్దనుకున్నప్పుడు వరుస వర్షాలతో అతలాకుతలం అవుతున్నాడు. సీజన్లో తొలుత మంచి వర్షాలు కురిశాయని విత్తనాలు వేస్తే.. ఆ తర్వాత వర్షాలు కురవక కొంత, నాసిరకం విత్తనాలతో మొలకెత్తక మరికొంత నష్టపోయాడు. తర్వాత వర్షాల మధ్య విరామం (డ్రైస్పెల్)తో గులాబీరంగు కాయతొలుచు పురుగు ఉధృతంగా సోకి పత్తిపంట దెబ్బతిన్నది. ఇంతా చేసి దిగుబడి దశ దాకా వస్తే.. అనవసర సమయంలో అధిక వర్షాలు పడి పత్తి రంగు మారింది, తేమ శాతం పెరిగిపోయింది. ఆఖరుకు మిగిలిన ఆ కాస్త పత్తినీ మార్కెట్‌కు పట్టుకొస్తే.. వ్యాపారుల మాయాజాలం, ప్రభుత్వాల నిర్లక్ష్యం, సీసీఐ అడ్డగోలు నిబంధనలు మరింతగా కుంగదీశాయి. కనీసం పత్తి ఏరే కూలీలకు సరిపడా సొమ్ముకూడా రాని దుస్థితిలో రైతులు పంట పండించిన చేతులతోనే దానికి నిప్పు పెడుతున్నారు. పత్తి ఏరడం కూడా వృథా అనుకుంటూ కన్నీళ్లతో పంటను దున్నేస్తున్నారు. పండించిన చేతితోనే నిప్పు గులాబీ పురుగు ఉధృతితో పంట దెబ్బతినడంతో ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగిడి గ్రామ రైతులు పత్తి పంటకు నిప్పు పెట్టారు. ఆదివారం గ్రామానికి చెందిన సామ నర్సారెడ్డి 9 ఎకరాలు, ఉపేందర్ 6, సునీల్ 5, కన్నె గణేశ్ 9 ఎకరాల్లో పత్తి చేనును దహనం చేశారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఖాదర్‌గూడెంకు చెందిన ఔరగొండ పోశయ్య ఆరున్నర ఎకరాల్లో పత్తి పంట వేశారు. పంట దెబ్బతిని, దిగుబడి సరిగా లేక.. పంట మొత్తాన్ని తొలగించి దహనం చేసేశారు. సాగు పెట్టు బడి కోసం చేసిన అప్పులు భారం మిగిలిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీసీఐ నిబంధనల శాపం పత్తి కొనుగోళ్లకు సంబంధించి భారతీయ పత్తి సంస్థ (సీసీఐ) విధించిన నిబంధనలు కఠినంగా ఉండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇటీవలి వర్షాలతో రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పత్తి నల్లబడింది. అటు వాతావరణంలో మార్పులతో పత్తిలో తేమ శాతం ఎక్కువగా ఉంటోంది. దీంతో నిబంధనలకు అనుగుణంగా లేదంటూ సీసీఐ పత్తిని కొనుగోలు చేయడం లేదు. సీసీఐ నిబంధనల ప్రకారం పత్తిలో 8 శాతం తేమ ఉంటే క్వింటాల్‌కు రూ. 4,320కు, 9 శాతముంటే రూ. 4,277కు, 10 శాతముంటే రూ. 4,234, 11 శాతముంటే రూ. 4,190కి, 12 శాతం తేమ ఉంటే రూ. 4,147కు కొనుగోలు చేయాలి. అంతకుమించి తేమ శాతం ఉంటే సీసీఐ కొనుగోలు చేయదు. ప్రస్తుతం రాష్ట్రంలో పత్తి నాణ్యంగా ఉన్నా గాలిలో తేమ ఎక్కువగా ఉండటంతో పత్తిలోనూ తేమ శాతం ఎక్కువగా ఉంటోంది. దానిని సాకుగా చూపుతూ సీసీఐ అధికారులు పత్తి కొనుగోలు చేయడం లేదు. దీంతో వ్యాపారులు పత్తికి రూ.3 వేల నుంచి రూ.4 వేలలోపే చెల్లిస్తూ రైతులను దగా చేస్తున్నారు. కేంద్రంలో చలనం లేదు: హరీశ్‌రావు తేమ శాతం ఎక్కువగా ఉన్న పత్తిని, రంగు మారిన పత్తిని బీ, సీ గ్రేడ్ల కింద సీసీఐ కొనుగోలు చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా, లేఖలు రాసినా కేంద్ర ప్రభుత్వం లో చలనం లేదని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రం పత్తి రైతులకు బాసటగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పత్తి రైతుల సమస్యలపై ఆదివారం సచివాల యంలో జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులతో హరీశ్‌రావు సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సెప్టెం బర్, అక్టోబర్లలో కురిసిన అకాల వర్షాలకు పత్తి పంట దెబ్బతి న్నదని చెప్పారు. పత్తి రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, ఇందుకు పూర్తి సహకారం అందించాలని జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులను కోరారు. నాణ్యమైన పత్తిని మద్దతు ధర కన్నా ఎక్కువ ధరకు కొనుగోలు చేయాలని.. రంగు మారిన, ఎక్కువ తేమ ఉన్న పత్తిని కూడా కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. తేమ శాతం ఒకసారి నిర్ణయించాక మళ్లీ ఎక్కువ తక్కువంటూ కోతలు వేయవద్దని, చార్జీల పేరి సొమ్ము వసూళ్లు చేయకూడదని సూచించారు. రైతులకు నష్టం కలిగించే చర్యలను సహించబోమని, క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. ఇక ఇన్పుట్ సబ్సిడీ, ఇతర ప్రోత్సాహకాలకు సంబంధించి జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులు పలు సమస్యలను ప్రస్తావించారని.. వాటిని సీఎం కేసీఆర్, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హరీశ్‌రావు చెప్పారు. రైతులు కూడా తొందరపడి తక్కువ ధరకు పత్తి అమ్ముకోవద్దని.. త్వరలోనే పత్తికి మంచి డిమాండ్ ఉంటుం దని సూచించారు. రాష్ట్రంలో 80 సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని, 120 జిన్నింగ్ మిల్లులను కూడా కొనుగోలు కేంద్రాలుగా ప్రభుత్వం గుర్తించినట్టు హరీశ్‌రావు చెప్పారు. సమావేశంలో మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, జిన్నిం గ్ మిల్లుల అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, మార్కెటింగ్ జాయింట్ డైరెక్టర్ లక్ష్మణుడు తదితరులు పాల్గొన్నారు. గత్యంతరం లేకనే.. ‘‘సరిగా దిగుబడి లేకపోవడం, అక్కడక్కడా వచ్చిన కొద్ది పత్తి కూడా తీయాలంటే కూలీల ఖర్చుకు కూడా సరిపోయేలా లేదు. అందుకే పత్తి పంటను తీసేస్తున్నాం..’’ – గొడుగునూరి లక్ష్మీరెడ్డి, రైతు వర్షాలతో పంట దెబ్బతింది ‘‘ఈసారి పత్తి బాగా ఎదిగింది. కానీ అధిక వర్షాలతో పూత, పిందె రాలిపోతోంది. కొద్దిగా నిలిచినా ఉపయోగం కనిపించట్లేదు. అందుకే తొలగిస్తున్నాం..’’ – వేమిరెడ్డి గురవారెడ్డి, రైతు ఆశ చచ్చి.. కడుపు మండి.. గతేడాది రాష్ట్రంలో పత్తికి మంచి డిమాండ్ కనిపించింది. మద్దతు ధరకు మించి మరీ రైతుకు గిట్టుబాటు అయింది. దాంతో ఈ సారి రాష్ట్రవ్యాప్తంగా రైతులు పత్తి పంట వైపు మొగ్గుచూపారు. దీంతో సాధారణ విస్తీర్ణం కంటే అధికంగా పత్తి సాగయింది. కానీ ప్రకృతి సహకరించలేదు. తొలుత వర్షాలు బాగానే కురిసినా.. తర్వాత డ్రైస్పెల్ ఏర్పడటం, గులాబీ కాయతొలుచు పురుగు దాడి, పత్తి దిగుబడి దశలో వర్షాలతో పంట బాగా దెబ్బ తినిపోయింది. దాంతో రైతుల ఆశలు అడియాసలయ్యాయి. చివరికి పెట్టుబడులు కూడా తిరిగిరాని పరిస్థితి ఏర్పడింది. చివరికి ఆశ చచ్చిపోయి.. కడుపు మండిన రైతులు తాము పండించిన పంటను తమ చేతులతోనే తొలగించేస్తున్నారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా దేశాయిపల్లిలో నిమ్మ అంజిరెడ్డి అనే రైతు మూడెకరాల్లోని పత్తి పంటను ట్రాక్టర్‌తో దున్నించేశారు. పంట ఇటీవలి వర్షాలతో రంగు మారింది. ఏరి విక్రయించినా కనీస ధర కూడా లభించే రిస్థితి లేదని.. సమీపంలోని మార్కెట్ యార్డుల్లో ఉన్న సీసీఐ కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభం కాలేదని.. దాంతో పంటను తొలగించానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా తల్లాడ పరిసరాల్లోని పలువురు రైతులు కూడా కొద్దిరోజులుగా పత్తి పంటను ట్రాక్టర్లు, రోటవేటర్లతో దున్నించేస్తున్నారు. నారాయణపురం, తల్లాడ గ్రామాల్లో ఇప్పటికే 30 మంది రైతులు వంద ఎకరాల్లో పత్తికి కలుపు మందు కొట్టి దున్నించారు. పెనుబల్లి, కల్లూరు, వేంసూరు మండలాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. -
ఆదిలాబాద్‌లో పత్తి రైతుల ఆందోళన
-
పుట్టెడు కష్టాల్లో పత్తి రైతులు
-
ఆదిలాబాద్‌లో పత్తి రైతుల ఆందోళన
సాక్షి,ఆదిలాబాద్/ఖమ్మం వ్యవసాయం: ఆదిలాబాద్‌లో పత్తి రైతులు ఆందో ళన బాట పట్టారు. తేమ పేరిట ధరను అడ్డగోలుగా తగ్గించడంపై బుధవారం నిరసన వ్యక్తం చేస్తూ మార్కెట్‌యార్డులో బైఠాయించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆందోళన కొనసాగినా వ్యాపారులతో అధికారుల చర్చలు కొలిక్కి రాలేదు. దీంతో యార్డు నుంచి రోడ్డుపైకి వచ్చిన రైతులు రాస్తారోకో చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో అధికారులు చేతులెత్తేశారు. తేమ విషయంతో మొదలు.. ఆదిలాబాద్ మార్కెట్లో ఉదయం 8.30 గంటలకు పత్తి ధర కోసం వేలం నిర్వహించారు. 8 శాతం తేమ ఉన్న పత్తి క్వింటాలుకు రూ.4,570 ధర నిర్ణయించారు. యార్డు నుంచి జిన్నింగ్‌కు వెళ్లిన తర్వాత మళ్లీ తేమ శాతాన్ని చూస్తూ క్వింటాలుకు రూ.3,800 వరకే ఇస్తున్నారంటూ ఆక్రోశం వ్యక్తం చేశారు. 8 శాతం నుంచి కాకుండా 12 శాతం నుంచి తేమను పరిగణన లోకి తీసుకోవాలని, ఆపై అదనంగా వచ్చే తేమ శాతానికి ధర కోత విధించాలని కోరుతూ ఆందోళనకు దిగారు. దీంతో కొనుగోళ్లు నిలిచిపోయాయి. జేసీ కృష్ణారెడ్డి మంత్రి జోగురామన్నతో సమస్యపై వివరించగా, వ్యాపారులు, రైతుల మధ్య చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని సూచించారు. వ్యాపారులు దిగిరాకపోవడంతో పరిస్థితిలో మార్పు రాలేదు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు సుమారు 25వేల క్వింటాళ్ల వరకు పత్తిని రైతులు వాహనాల్లో తీసుకొచ్చారు. ఆందోళన కారణంగా కొనుగోళ్లు నిలిచిపోవడంతో వాహనాలు ముందుకు కదలలేదు. విపక్షాలు రాజకీయ లబ్ధి కోసమే కుట్ర చేస్తున్నాయని మంత్రి జోగు రామన్న ఆరోపించారు. ఖమ్మం మార్కెట్‌కు బుధవారం సుమారు 30వేల బస్తాల పత్తి విక్రయానికి వచ్చింది. 24,700 బస్తాల పత్తి విక్రయానికి వచ్చినట్లు రికార్డు అయింది. బాగా ఆరబెట్టి గ్రేడింగ్ చేసి విక్రయానికి తెచ్చిన పత్తిని కూడా వ్యాపారులు కుంటిసాకులు చెబుతూ క్వింటాల్‌కు సగటున రూ. 2,500 నుంచి రూ.3 వేలకు మించి ధర పెట్టడం లేదు. -
దళారీ తానా.. సీసీఐ తందానా!
సాక్షి, హైదరాబాద్ : తేమశాతం పేరుతో వ్యాపారులు పత్తి రైతును చేస్తున్న దగా అంతాఇంతా కాదు. రైతుకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) దక్కని పరిస్థితుల్లో అండగా ఉండాల్సిన సీసీఐ పత్తా లేకుండా పోయింది. వ్యాపారులు, దళారులతో సీసీఐ కుమ్మక్కైందని రైతులు ఆరోపిస్తున్నారు. తాజాగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ను ‘సాక్షి’ ప్రతినిధి పరిశీలించారు. దళారులు, వ్యాపారులు కలసి రైతును నిలువుదోపిడీ చేస్తున్నట్టు స్పష్టమైంది. రాష్ట్రంలోనే కీలకమైన ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సీసీఐ తీరు ఇంత దారుణంగా ఉంటే ఇక మారుమూల ప్రాంతాల్లో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల పరిస్థితి ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. ధర రావడం లేదని సీసీఐ కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్దామంటే అక్కడ కనీసం ఒక్కరు కూడా లేరని రైతులు గగ్గోలు పెడుతున్నారు. పత్తి వ్యాపారులతో సీసీఐ అధికారులు కుమ్మక్కై కొనుగోలు కేంద్రం వద్ద అందుబాటులో లేకుండా పోయారు. దీంతో వ్యాపారులు చేస్తున్న అన్యాయాన్ని చెప్పుకునేందుకు రైతులకు ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. వ్యాపారులు ఎంత చెబితే అదే ధర... ఏం చెబితే అదే నడుస్తోంది. ఒకరకంగా మార్కెట్లో వ్యాపారులు, దళారుల మాఫియా నడుస్తోంది. యంత్రాలు లేకుండానే తేమ నిర్ధారణేంటి? పత్తిలో 8 శాతం తేమ ఉంటే క్వింటాలుకు రూ.4,320, 9 శాతం ఉంటే రూ. 4,277, 10 శాతం ఉంటే రూ.4,234, 11 శాతం ఉంటే రూ.4,190కి, 12 శాతం ఉంటే రూ.4,147 చొప్పున కొనుగోలు చేయాలి. రైతులు తెచ్చిన బస్తాలను తేమ శాతం గుర్తించే యంత్రాలతో పరిశీలించి ఇలా ధర ఖరారు చేయాలి. కానీ ఖమ్మం మార్కెట్‌కు తెస్తున్న పత్తిలో కనీసం రెండు మూడు శాతాన్ని కూడా ఇలా యంత్రంతో పరిశీలించడం లేదు. తేమ శాతం పరిశీలించకుండానే వ్యాపారులు అడ్డగోలుగా ధర నిర్ణయించేస్తున్నారు. చేతితో పైపైన చూసి అశాస్త్రీయంగా ధర నిర్ధారిస్తున్నారు. ఇక్కడి మార్కెట్లో దాదాపు 50 మంది పత్తి వ్యాపారులుంటే ఇద్దరంటే ఇద్దరే తేమ శాతం గుర్తించే యంత్రాలను తెచ్చి అక్కడక్కడ పరిశీలిస్తున్నారు. వర్షానికి నల్లరంగులోకి మారిన పత్తి ధర క్వింటాలుకు రూ.2–3 వేల మధ్యే కొంటున్నారు. ఇక నాణ్యత కలిగిన పత్తికి ఎంఎస్పీ రూ.4,320 ఇవ్వాల్సి ఉండగా... మార్కెట్లో మాత్రం రూ.3,500 నుంచి రూ.4 వేల మధ్యే కొనుగోలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా మార్కెట్ అధికారులు చోద్యం చూస్తున్నారు. రూ.2,500కే అమ్మేశా: నాకు ఐదెకరాలుంది. పత్తి, వరి సాగు చేస్తున్నా. నాలుగెకరాల్లో పత్తి సాగుచేశా. పత్తి అమ్మితే ఎంతో ఆదాయం వస్తుందని ఆశపడ్డా. కానీ వర్షాలకు దెబ్బతిన్నది. తొలి తీతలో 2 క్వింటాళ్ల మేర వచ్చింది. అమ్మకానికి తెచ్చా. నాణ్యత లేదని క్వింటాలుకు రూ.2,500 ఇచ్చారు. కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా పూడని పరిస్థితి ఏర్పడింది. పంట సాగుపై రూ.1.50 లక్షల వరకు నష్టం వచ్చేలా ఉంది. పత్తి వేసి నష్టాల పాలవుతున్నా. వచ్చే ఏడాది వ్యవసాయానికి దూరంగా ఉండాలని బావిస్తున్నా. -- పల్లెనుల యూసూబు, అల్లీపురం, ఖమ్మం అర్బన్ మండలం నా జీవితంలో ఇంత దారుణం చూడలేదు ఆరెకరాల్లో పత్తి వేశా. మొదటి తీతలో వచ్చిన 20 బస్తాల పత్తిని ఆరబెట్టి అమ్మకానికి తెచ్చా. వర్షాలకు కొద్దిగా రంగు మారింది. కానీ తేమశాతం నిబంధనల ప్రకారమే ఉంది. వ్యాపారులు క్వింటాలుకు రూ.2,500 ధర పెట్టారు. రూ.3 వేలకైనా కొనండని ప్రాధేయపడ్డా. ఎంత మాత్రం కనికరించలేదు. మరీ అడిగితే మాకొద్దు అని సమాధానం చెప్పారు. 45 ఏళ్ల వ్యవసాయ జీవితంలో ఇంతటి దారుణం ఎప్పుడూ చూడలేదు. కిలో పత్తి తీసినందుకు కూలీలు రూ.12 చొప్పున తీసుకుంటున్నారు. అంటే పత్తి ధరలో సగం కూలీలకే పోతుంది. పెట్టుబడుల్లో సగం కూడా పూడని పరిస్థితి ఉంది. పత్తి సాగు ద్వారా ఈ ఏడాది సుమారు రూ.1.80 లక్షల నష్టం వచ్చేట్లు ఉంది. --పగడవరపు రామకృష్ణ, గోపవరం, కొణిజర్ల మండలం, ఖమ్మం జిల్లా వ్యాపారులదే రాజ్యం పత్తిని తేమ శాతానికి అనుగుణంగా గ్రేడింగ్ చేసి తెచ్చా. కానీ క్వింటాలుకు రూ. 4,100కే కొనుగోలు చేశారు. ఇంతకంటే దారుణమేముంది? మంచి ధర పలికే కాలంలో ఇలాంటి పత్తి క్వింటాలుకు రూ.7–8 వేలు పలికింది. ఇప్పుడు వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సీసీఐ అడ్రస్ లేదు. ఎక్కడున్నారో కూడా తెలియడంలేదు. రైతు మందు తాగి చావాల్సిన పరిస్థితి తెస్తున్నారు. -- కొమ్ము నాగయ్య, లచ్చగూడెం, చింతకాని మండలం, ఖమ్మం జిల్లా వ్యాపారులను కూర్చొబెట్టి మాట్లాడుతున్నాం వ్యాపారులను కూర్చొబెట్టి రైతులకు సరైన ధర ఇచ్చేలా మాట్లాడుతున్నాం. ఇటీవల కురిసిన వర్షాలతో ధర తక్కువగానే పలుకుతోంది. నిబంధనల ప్రకారం లేకపోవడంతో ధర తక్కువగా ఉంటోంది. తేమ శాతం ఆధారంగానే నిబంధనల ప్రకారం వ్యాపారం జరుగుతోంది. -- రత్నం సంతోష్‌కుమార్, మార్కెట్ కమిటీ కార్యదర్శి, ఖమ్మం మరి రైతులు ఎక్కడకు పోవాలి? ఇది ఖమ్మం మార్కెట్లో భారత పత్తి సంస్థ (సీసీఐ) ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం! ఫ్లెక్సీ తప్ప ఎక్కడా కొనుగోలు కేంద్రం కనిపించడం లేదే అనుకుంటున్నారా? అయినా ఇది కొనుగోలు కేంద్రమే. ఇలా కేవలం ఒక ఫ్లెక్సీని ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గోడకు తగిలించేశారు. దాన్నే కొనుగోలు కేంద్రం అనుకోమన్నారు. అక్కడ సీసీఐ సిబ్బంది ఒక్కరూ లేరు. కాంటా లేదు. తేమ శాతం గుర్తించే యంత్రమూ లేదు. కనీసం ఓ కుర్చీ కూడా లేదు!! -
పత్తి రైతుకు YSRCP మద్ధతు
-
పత్తి రైతును ముంచిన భారీ వర్షాలు
-
పెద్దపల్లిలో పత్తి రైతుల ఆందోళన
పెద్దపల్లి: వ్యాపారులు సరైన ధర చెల్లించటం లేదంటూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పత్తి రైతులు ఆందోళనకు దిగారు. స్థానిక మార్కెట్‌కు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మంగళవారం దాదాపు 200 మంది రైతులు సుమారు 5000 బస్తాల పత్తిని తీసుకువచ్చారు. ఉదయం కొనుగోళ్లు ప్రారంభం అయిన తర్వాత క్వింటాలుకు రూ.5,300 వరకు వ్యాపారులు ధర చెల్లించారు. అయితే, ఆ తర్వాత ట్రేడర్లు గ్రేడును బట్టి రూ. 5100 అంతకంటే తక్కువ మాత్రమే చెల్లిస్తామంటూ మొండికేసుక్కూర్చున్నారు. దీంతో రైతులు ఆందోళన ప్రారంభించారు. కొనుగోళ్లు నిలిపివేశారు. రైతుల ధర్నాతో ఎస్సై శ్రీనివాస్ అక్కడికి చేరుకుని వారితో మాట్లాడారు. మద్దతు ధర రూ.4,800 కంటే తక్కువ చెల్లిస్తే తాను వ్యాపారులతో మాట్లాడి ఒప్పిస్తానని శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. అయితే, శనివారం వరకు రూ.5600 వరకు పలకగా రెండు రోజుల్లోనే పడిపోవటం ఏమిటని రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ అయిలయ్య, ఎస్సై శ్రీనివాస్ రైతులు, ట్రేడర్లను సమావేశపరిచి చర్చలు సాగిస్తున్నారు. -
పత్తి రైతులకు పాత నోట్లే ఇస్తున్నారు
-
దళారుల దోపిడీని అడ్డుకోవాలి: భట్టి
ఖమ్మం అగ్రికల్చర్: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో దళారుల దోపిడీని అరికట్టాలని తెలంగాణ కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఆయన శుక్రవారం అఖిలపక్షాల నాయకులతో కలిసి మార్కెట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పత్తి రైతులతో మాట్లాడి ఇబ్బందులను తెలుసుకున్నారు. పత్తికి డిమాండ్ తగ్గిందంటూ దళారులు, వ్యాపారులు కలిసి రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. పత్తి క్వింటాలుకు రూ.7,500 చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయనతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, సీపీఐ, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నేతలు పాల్గొన్నారు. -
‘పత్తి రైతులకు అన్యాయం చేస్తున్నారు’
జమ్మికుంట: పత్తి రైతులకు మార్కెట్లో న్యాయం జరిగే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని కరీంనగర్ జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు వాసుదేవరెడ్డి, క్యార్యదర్శి వెంకట్‌రెడ్డి తెలిపారు. గురువారం వారు జమ్మికుంట పత్తి మార్కెట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో హెచ్చుతగ్గులు పేరుతో పత్తి రైతులకు నష్టం కలిగించటం తగదన్నారు. రైతులకు మార్కెట్లో అందుబాటులో ఉండాల్సిన మార్కెట్ కార్యదర్శి దరిదాపులకు కూడా రావటం లేదని ఆరోపించారు. మార్కెట్లో రైతులకు కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సిబ్బంది వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నారని తెలిపారు. అనంతరం వారు మార్కెట్ కమిటీ చైర్మన్ పింగిలి రమేశ్‌తో సమావేశమై రైతుల సమస్యలను వివరించి, పరిష్కరించాలని కోరారు. లేకుంటే తాము ఆందోళనలు చేపడతామని హెచ్చరించా -
పోటెత్తిన పత్తి.. తగ్గిన ధర
జమ్మికుంట : జమ్మికుంట మార్కెట్లో తెల్లబంగారానికి ధర తగ్గడంతో రైతులు తెల్లబోయారు. వారం వ్యవధిలోనే క్వింటాల్‌కు రూ.400 ధర పడిపోవడంతో రైతులు గందరగోళంలో పడ్డారు. సోమవారం జమ్మికుంట మార్కెట్‌కు వివిధ ప్రాంతాల నుంచి రైతులు దాదాపు ఆరువేల బస్తాల్లో మూడు వేల క్వింటాళ్ల పత్తి తీసుకొచ్చారు. అలాగే రెండు వందల పైగా వాహనాల్లో 2131 క్వింటాళ్లు లూజ్ పత్తి వచ్చింది. మొదట బస్తాల వద్ద మార్కెట్ చైర్మన్ పింగిళి రమేష్, వైస్‌చైర్మన్ రాజేశ్వర్‌రావు, కార్యదర్శి వెంకట్‌రెడ్డి సమక్షంలో వేలంపాట ప్రారంభించారు. నాణ్యమైన పత్తికి గరిష్ట ధర రూ.4960 పలుకడంతో రైతులు విస్మయానికి గురయ్యారు. పత్తి ఎక్కువగా రావడంతో వ్యాపారులు, అడ్తిదారులు ధరలు తగ్గించి కొనుగోళ్లు చేపట్టారని ఆరోపించారు. నిన్న మొన్నటి వరకు మార్కెట్లో క్వింటాల్ పత్తికి రూ.5370 వరకు ధరలు పలికారుు. మున్ముందు ధరలు పెరుగుతాయని రైతులు ఆశించగా.. వారం రోజుల్లోనే అంతా తారుమారైంది. లూజ్ పత్తికి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.5వేలు, కనిష్టంగా రూ.4560 వరకు ధరలు చెల్లించారు. బస్తాల్లో వచ్చిన పత్తి క్వింటాల్ రూ.3800 నుంచి రూ.4200 వరకు కోనుగోలు చేశారు. వారం రోజుల్లోనే క్వింటాల్‌కు ఏకంగా రూ.400 వరకు తగ్గడంతో పత్తి అమ్మలా... వద్దా అని రైతులు సందిగ్ధంలో పడ్డారు. దీపావళి పండగ సమయంలో పత్తికి మంచి ధరలు పలుకుతున్నాయని సంతోషపడ్డ రైతులు ఇప్పుడు పరేషాన్ అవుతున్నారు. పత్తి మార్కెట్లో సోమవారం నుంచి కచ్చితంగా ఈ-నామ్ కొనుగోళ్లు అమలు చేస్తామని ప్రకటించిన మార్కెటింగ్ శాఖ అధికారులు ఆ విషయూన్ని మరిచిపోయారు. ఆన్లైన్ కొనుగోళ్లపై అధికారులు ఊసెత్తకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. ఆన్లైన్ కొనుగోళ్లు ఎందుకు ప్రారంభించడం లేదో ఎవరికి అర్థం కావడం లేదు. వ్యాపారులు నేరుగా వేలంపాడటం కంటే ఆన్లైన్లో బిడ్డింగ్ చేయడం పత్తికి ఎక్కువ ధర పలుకుతుందని, ఈ-నామ్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయూలని రైతులు కోరారు. -
పత్తి విత్తన కంపెనీలు మోసగించాయి..
- నష్టపరిహారం ఇవ్వడంలేదని రైతుల ఆందోళన - వ్యవసాయ కమిషనరేట్‌లో 3 గంటలపాటు ధర్నా సాక్షి, హైదరాబాద్: పత్తి రైతులు మళ్లీ ఆందోళనబాట పట్టారు. విత్తన కంపెనీలు నష్టపరిహారం చెల్లించడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహికో, నూజివీడు తదితర పత్తి కంపెనీల చేతుల్లో మోసపోయి పంట కోల్పోయిన రంగారెడ్డి జిల్లా రైతులు శుక్రవారం హైదరాబాద్‌లోని వ్యవసాయశాఖ కమిషనరేట్‌లో ఆందోళన చేశారు. వ్యవసాయ శాఖ డెరైక్టర్ ప్రియదర్శిని చాంబర్ ముందు 3 గంటలపాటు ధర్నా చేశారు. నినాదాలతో కమిషనరేట్ ప్రాంగణం హోరెత్తింది. రంగారెడ్డి జిల్లా నవాబుపేట, వికారాబాద్ సహా ఇతర మండలాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున ధర్నాకు తరలివచ్చారు. రైతులు, నేతలను డెరైక్టర్ తన ఛాంబర్‌కు పిలిచి మాట్లాడారు. గత ఖరీఫ్‌లో ఆయా కంపెనీల పత్తి విత్తనాలు వేశామని, ఏపుగా పెరిగినా కాయ కాయలేదని రైతులు పేర్కొన్నారు. నష్టపరిహారం కోసం ఇదివరకు ఆందోళన చేయగా దీనిపై కమిటీని ఏర్పాటు చేశారని చెప్పారు. నష్టపరిహారంగా ఎకరానికి రూ. 24 వేలు ఇవ్వాలని కమిటీ నిర్ణయించినా కంపెనీలు ఒక్క పైసా ఇవ్వలేదని, కేవలం రూ. 6 వేలు మాత్రమే ఇస్తామని చెబుతున్నాయని రైతులు విమర్శించారు. కంపెనీలతో మాట్లాడి 15 రోజుల్లోగా సమస్యను పరిష్కరిస్తానని డెరైక్టర్ హామీఇచ్చారు. కానీ, 8 రోజుల్లోగా పరిష్కరించాలని, తర్వాత మళ్లీ కమిషనరేట్‌కు వస్తామని రైతులు తేల్చి చెప్పారు. ధర్నాలో భారత కిసాన్ సంఘ్ అధ్యక్షుడు టి.అంజిరెడ్డి, ప్రధానకార్యదర్శి ఎం.శ్రీధర్‌రెడ్డి, కోశాధికారి రంగారావు తదితరులు పాల్గొన్నారు. -
విత్తన పత్తి రైతులకు పరిహారం చెల్లించాలి
► ఎమ్మెల్యే డీకే ఆరుణ ► చలో అసెంబ్లీని భగ్నం చేసిన పోలీసులు దోమలగూడ : నష్టపోయిన గద్వాల విత్తన పత్తి రైతులకు కంపెనీలు నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ రైతాంగ సమితి ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్కు నుంచి రైతులు చేపట్టిన చలో అసెంబ్లీని పోలీసులు అడ్డుకొని అరెస్టులతో భగ్నం చేశారు. తెలంగాణ రైతాంగ సమితి, రైతు సంఘం ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద వేర్వేరుగా రైతులు ధర్నా నిర్వహించారు. అనంతరం తెలంగాణ రైతాంగ సమితి ఆధ్వర్యంలో రైతులు ప్రదర్శనగా చలో అసెంబ్లీ చేపట్టారు. అప్రమత్తమైన పోలీసులు అనుమతి లేదంటూ రైతులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు బలవంతంగా రైతులను అరెస్టు చేసి గాంధీనగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ధర్నాలో టీజేఏసీ చైర్మన్ కోదండరాం, ఎమ్మెల్యే డీకే అరుణ, రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్, ఏఐకేఎస్ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి, రైతు సంఘం ఉపాధ్యక్షుడు టి. సాగర్, ప్రసాదరావు తదితరులు, రైతాంగ సమితి ధర్నాలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముడుపు నర్సింహరెడ్డి, సహాయ కార్యదర్శి జక్కుల వెంకటయ్య, నాయకులు సాయన్న, జి గోపాల్, పి రామిరెడ్డి, గోవింద్, శంకర్‌రెడ్డి మాట్లాడారు. గద్వాల డివిజన్లో ఆరు మండలాల్లో దాదాపు 50వేల ఎకరాల్లో 20వేల మంది రైతులు పత్తి విత్తనాలను పండిస్తారని, వీరికి కావేరి, అంకుర్, రాశి, బయోసీడ్, నూజివీడు, జేకే అగ్రి జెనిటిక్స్, సత్య తదితర కంపెనీలు విత్తనాలు సరఫరా చేస్తాయని అన్నారు. విత్తనపత్తికి కాంట్రాక్ట్ వ్యవసాయ చట్టం ప్రకారం రైతుకు, కంపెనీకి రాతపూర్వక ఒప్పందం ప్రకారంగా జరగాలని, రైతుకు గిట్టుబాటు ధర, పెట్టుబడి, సాంకేతిక సహకారం కంపెనీ ఇవ్వాలని అన్నారు. రైతులను దోచుకుంటున్నారు విత్తన కంపెనీలు దళారుల ద్వారా రైతులకు విత్తనాలు సరఫరా చేస్తారని, వీరు రైతులు పండించిన విత్తనాల ధర విషయంలోనూ, పెట్టుబడి కోసం ఇచ్చిన డబ్బులపై వడ్డీరూపంలో రైతులను దోచుకుంటున్నారని అన్నారు. రెండు దశాబ్దాలుగా గద్వాలలో కొనసాగుతున్న దోపిడి ఇది అని వాపోయారు. విత్తన బాంఢాగారం గురించి హోరె త్తిస్తున్న ప్రభుత్వం విత్తన కంపెనీల వల్ల మోసపోయిన రైతుల గురించి నోరు మెదపక పోవడం శోచనీయమన్నారు. గద్వాలలో విత్తన కంపెనీలు, దళారులు కలిసి రైతులపై కొనసాగిస్తున్న దోపిడీ, దౌర్జన్యాలకు బంగారు తెలంగాణలోనూ అంతం లేదా? అంటూ ప్రశ్నించారు. కంపెనీల ఒత్తిళ్లకు తలొగ్గి ప్రభుత్వం ఇచ్చిన జీఓ 458ని అమలు చేయక పోవడాన్ని చూస్తే కంపెనీల ప్రభుత్వమా, ప్రజా ప్రభుత్వమా అనే సందేహం కలుగుతుందన్నారు. ప్రభుత్వ ఆదేశానుసారం కంపెనీలు రైతులకు 60 శాతం పెట్టుబడి న ష్టాన్ని పరిహారంగా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. -
పత్తి రైతుల ఆందోళన
జిల్లాలోని ఎనుమాముల మార్కెట్‌యార్డులో మంగళవారం పత్తిరైతులు ఆందోళనకు దిగారు. పత్తి ధర రోజు రోజుకూ తగ్గిస్తున్నందుకు నిరసనగా ధర్నా నిర్వహించారు. పత్తి ధర వెంటనే పెంచి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పత్తి ధర మరింత తగ్గిస్తే ఇక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని రైతులు హెచ్చరించారు. -
వ్యవసాయ మార్కెట్‌కు తాళం వేసిన రైతులు
కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌యార్డ్‌కు పత్తి రైతులు బుధవారం తాళాలు వేశారు. పత్తి ధర క్రితం రోజు కంటే బుధవారం రూ.100 మేర తగ్గించి క్వింటాల్‌కు రూ.4500కే కొనుగోలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. అలాగే, తరుగు పేరుతో 50 కిలోలకు కోత పెడుతున్నారని మండిపడ్డారు. రెండు గంటల పాటు మార్కెట్ యార్డ్‌కు తాళాలు వేసి నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వారితో చర్చలు జరిపారు. -
'పత్తి రైతులను ఆదుకోవాలి'
కొత్తూరు: శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో పాడైన పత్తి పంటను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ బుధవారం పరిశీలించారు. నష్ట పోయిన పత్తి రైతులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కొత్తూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించినందున ప్రతి సెంటు పంటకు నష్టపరిహారం ఇవ్వాలని, పారదర్శకంగా సర్వే నిర్వహించాలని ఆయన కోరారు. -
అప్పుల ఊబిలో పత్తి రైతులు
-
కేంద్ర మంత్రిపై మండిపడ్డ హరీష్
హైదరాబాద్: కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తికి మద్దతు ధర పెంచుతామని ఆశచూపి రైతులను మోసం చేసింది బీజేపీనే అని హరీష్ పేర్కొన్నారు. పత్తి కొనుగోలు చేయడంలో సీసీఐ నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. ఈ విషయంపై కేంద్ర మంత్రులకు మొర పెట్టుకున్నా స్పందించనే లేదని దత్తాత్రేయను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. పత్తి కొనుగోలు చేయాల్సిందే కేంద్ర ప్రభుత్వమే.. రాష్ట్ర ప్రభుత్వానికి ఇందులో సంబంధం లేదన్నారు. మహారాష్ట్రలో పత్తికి బోనస్ ఇస్తున్నారనడం అవాస్తవమని, కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యల్ని హరీష్ తీవ్రంగా ఖండించారు. -
'వారి కష్టాలకు తెలంగాణ ప్రభుత్వమే కారణం'
ఢిల్లీ: తెలంగాణ పత్తి రైతుల కష్టాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వ తప్పిదమే కారణమని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఆరోపించారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో శుక్రవారం ఆయన మీడియాతో సమావేశమయ్యారు. 90 శాతం మంది రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుర్తింపు కార్డులివ్వలేదని విమర్శించారు. పత్తి రైతుల విషయంలో తమ బాద్యతను విస్మరించి, వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు తెలంగాణ సర్కార్ కేంద్రంపై విమర్శలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. వరంగల్ జిల్లాకు అన్యాయం చేసే విధంగా దేవాదుల ప్రాజెక్టు డిజైన్ మార్చుతున్నారంటూ బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం వద్ద నుంచి దేవాదుల ప్రాజెక్టు కోసం రూ. 63 కోట్లు తీసుకుని వృథా కేంద్ర మంత్రి చేశారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయకుండా సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ ప్రభుత్వానికి దత్తాత్రేయ సూచించారు. ప్రాజెక్టుల డిజైన్లు మార్చేటప్పుడు ప్రతిపక్షాలను సంప్రదించాలని అన్నారు. వరంగల్ టీఆర్ఎస్ విజయం ఖాయం అయితే ఉప ఎన్నికల ప్రచారంలో ఏడుగురు మంత్రులు ఎందుకు పని చేస్తారంటూ ఎద్దేవా చేశారు. -
'పత్తి రైతుల నోట్లో కేంద్రం మట్టికొడుతోంది'
హైదరాబాద్: తెలంగాణ పత్తి రైతులను కేంద్రం పట్టించుకోవడం లేదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర పత్తి రైతుల నోట్లో కేంద్రం మట్టికొడుతోందంటూ ఆయన విమర్శించారు. పేదల కోసం కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ ఒక్క పథకాన్నైనా ప్రవేశపెట్టిందా అని ఈ సందర్భంగా ఈటల ప్రశ్నించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతోనైనా కేంద్రానికి కనువిప్పు కలగాలని మంత్రి హితవు పలికారు. -
పత్తి రైతులను ఇబ్బంది పెట్టొద్దు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ సాక్షి, విజయవాడ బ్యూరో: పత్తి కొనుగోళ్లలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన మంగళవారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో కరువు నివారణ, వ్యవసాయ అనుబంధ శాఖలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. పత్తి కొనుగోళ్ల సందర్భంగా సాకులు చెప్పి రైతులను ఇబ్బంది పెట్టొద్దని సీసీఐ అధికారులను కోరారు. కచ్చితమైన ధర లభించేలా చూడాలని, ఆన్లైన్ చెల్లింపుల ద్వారా అక్రమాలకు కళ్లెం వేయాలని సూచించారు. అవసరమైతే పత్తి కొనుగోళ్లను రోజువారీగా పరిశీలిస్తానన్నారు. రాష్ట్రంలో కరువు తీవ్రతను అధిగమించేందుకు చర్యలు చేపట్టాలని బాబు చెప్పారు. 196 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించామని తెలిపారు. ఈ నెల 7 నాటికి మరికొన్నింటిని కరువు మండలాలుగా ప్రకటిస్తామన్నారు. గతేడాది ఉద్యాన రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ బకాయిలను నవంబర్ 6లోగా చెల్లించాలని ఆదేశించారు. ఖాయిలా పరిశ్రమలపై అధ్యయనం ఖాయిలా పడిన, సమస్యల్లో చిక్కుకున్న పరిశ్రమలపై సమగ్ర అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు. జూట్, చక్కెర, ఫెర్రో అల్లాయిస్, టెక్స్టైల్స్ పరిశ్రమలపై ఆ యన మంగళవారం సమీక్ష నిర్వహించారు. -
దూదిపువ్వు దుఃఖం
♦ పత్తి రైతు కన్నీళ్ల సాగు ♦ దిగుబడి రాక.. గిట్టుబాటు లేక విలవిల ♦ ఎకరాకు రూ.30 వేల పెట్టుబడి.. ఆదాయం మాత్రం 15 వేల లోపే ♦ మార్కెట్‌కు వెళ్తే మద్దతు కరువు.. దగా చేస్తున్న వ్యాపారులు ♦ వానల్లేక చేతికందకుండా పోయిన 60% పంట ♦ 10 వేల కోట్ల మేర నష్టం ♦ ఆత్మహత్య చేసుకుంటున్న వారిలో 60% మంది పత్తి రైతులే కరుణ లేని వరుణుడు కాటేశాడు.. ఊరించిన చినుకు ముఖం చాటేసింది.. అప్పుల నేలపై చిగురించిన మొక్కకు కన్నీళ్లే నీళ్లయ్యాయి.. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు ‘దళారీ’ చీడ పట్టింది.. అటు ప్రకృతి నుంచి ఇటు ప్రభుత్వం దాకా ఎవరి ‘మద్దతు’ లేక రైతన్న బతుకులు తెల్లారిపోయాయి! తమ జీవితాలను బంగారం చేస్తుందనుకున్న ‘తెల్ల బంగారం’ రైతుల బతుకులను నిలువునా కూల్చింది. ఓ అంచనా ప్రకారం రాష్ట్రంలో ఇప్పటిదాకా 1,640 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. అందులో దాదాపు 984 మంది (60%) పత్తి రైతులే ఉండడం వారి దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. పెట్టుబడులు నేలపాలు తెలంగాణలో ఈసారి రైతులు రికార్డు స్థాయిలో పత్తి సాగు చే శారు. వరి విస్తీర్ణానికి మూడు రెట్లు అధికంగా సాగైంది. ఖరీఫ్‌లో 14.2 లక్షల ఎకరాల్లో వరి సాగు (54%) కాగా... పత్తి 41.95 లక్షల ఎకరాల్లో (103%) సాగైంది. జూన్ నెలలో రుతు పవనాలు చురుగ్గా ఉండటంతో భారీ వర్షాలు కురిశాయి. పరిస్థితి ఆశాజనకంగా ఉండటంతో రైతులు పత్తి వైపు మొగ్గుచూపారు. కానీ ఆ తర్వాత జూలై, ఆగస్టులో వాన చినుకు రాక వేసిన పత్తి ఎండిపోయింది. ఒక అంచనా ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 60 శాతం పైగా పత్తి ఎండిపోయింది. మహబూబ్‌నగర్ జిల్లాలోనైతే 90 శాతానికి పైగా పత్తి చేతికందకుండా పోయింది. మెదక్, రంగారెడ్డి జిల్లాల్లోనూ అదే పరిస్థితి. ఒక్కో ఎకరానికి రైతు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకూ పత్తిపై పెట్టుబడి పెడుతుండగా.. ఆదాయం మాత్రం రూ.15 వేల లోపే ఉంటోంది. పంట ఎండిన చోట పెట్టుబడులన్నీ నేలపాలయ్యాయి. కాస్త చేతికందిన చోట దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. సాధారణంగా పంట బాగుంటే పత్తి దిగుబడి ఎకరాకు 12 నుంచి 15 క్వింటాళ్ల వరకు రావాలి. కానీ ప్రస్తుతం 3 నుంచి 5 క్వింటాళ్లకు మించి రాలేదు. అప్పుల పాలవుతున్నాం... ఈయన పేరు చెరుకుమల్ల రామారావు. ఖమ్మం జిల్లా కారేపల్లి. నాలుగెకరాల్లో పత్తిసాగుకు ఎకరానికి రూ.25 వేల చొప్పున అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టాడు. కానీ ఎకరానికి ఆరు క్వింటాళ్లే దిగుబడి వచ్చింది. ప్రైవేట్ వ్యాపారులు క్వింటాలుకు రూ.3,500 ఇస్తామంటున్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇస్తేనే కొంతయినా అప్పులు తీరుతాయని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. తెగులుతో పంట నాశనమైంది.. ఈ రైతుల పేరు వెంకటేశ్వర్లు. ఖమ్మం జిల్లా కారేపల్లి. తనకున్న 3 ఎకరాల్లో పత్తి పంట సాగు చేస్తే.. పంటకు ఎండు తెగులు సోకి నాశనమై పోయింది. ఎకరాకి రూ.25 వేల చొప్పున పెట్టుబడి పెట్టి పంట సాగుచేస్తే.. వర్షాభావ పరిస్థితులు వచ్చి పంటకు ఎండు తెగులు సోకింది. కొద్దో గొప్పో కాసిన కాయలను కోతుల మందలు కొరికి పడేశాయి. 3 ఎకరాల్లో 9 క్వింటాళ్ల పత్తి వచ్చింది. తేమ శాతం పేరుతో ప్రైవేట్ వ్యాపారులు క్వింటాలుకు రూ.3,200 ధర పెట్టారు. ఆస్తి అమ్మినా అప్పులు తీరవు.. మేం నలుగురు ఆడపిల్లలం. నేను పెద్ద కూతుర్ని. మా నాన్నకు కొడుకులు లేక నన్ను పుట్టింట్లోనే ఉండమన్నారు. పెళ్లయి 20 ఏళ్లయినా పొలంలోనే పనిచేసుకుంటూ వచ్చాను. పంటలు సరిగా పండక మా నాన్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆస్తి మొత్తం అమ్మినా అప్పులు తీరవు. ఎలా బతకాలో అర్థం కావడం లేదు. పి. భాగ్యమ్మ, యాపదిన్నె, అయిజ మండలం, మహబూబ్‌నగర్ జిల్లా మద్దతు ఏదీ? ప్రస్తుతం 50 శాతానికి పైగా పత్తి కొనుగోళ్లు జరిగాయి. కానీ రైతులెవరికీ కనీస మద్దతు ధర రాలేదు. సీసీఐ కొనుగోళ్లు కూడా అరకొరగానే జరిగాయి. సర్కారు ప్రకటించిన మద్దతు ధర రూ.4,100 కాగా.. రైతులకు రూ.3,500కు మించి ఇవ్వడం లేదు. అటు పంటలు ఎండడం, ఇటు అరకొర దిగుబడులు, మరోవైపు మద్దతు ధర అందక మూడు విధాలా రైతు చిత్తయ్యాడు. పంటలు ఎండడం, పెట్టుబడులు నేలపాలవడం, దళారుల చేతిలో మోసపోవడంతో రైతులు మొత్తమ్మీద రూ.10 వేల కోట్ల మేరకు నష్టపోయారు. ఆత్మహత్యల్లో పత్తి రైతులే ఎక్కువ ఈ ఏడాది సాగైన అన్ని పంటల విస్తీర్ణం 86.65 లక్షల ఎకరాలు. అందులో పత్తి 41.95 లక్షల ఎకరాల్లో (48.41%) సాగైంది. మొత్తం 55.52 లక్షల మంది రైతులు అన్ని పంటల సాగులో పాలు పంచుకుంటుంటే.. అందులో పత్తి రైతులు దాదాపు 26.56 లక్షల మంది ఉన్నారు. వారిలో 85 శాతం మంది సన్నచిన్నకారు రైతులే. పంట కోసం భారీగా పెట్టుబడులు పెట్టడం, కొందరు రెండుమూడు సార్లు బోర్లు బావులు తవ్వించడం, బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో పెద్దఎత్తున రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించారు. అప్పులు కట్టలేక కుదేలయ్యారు. సోమవారం నాటికి రైతు సంఘాలు వేసిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1,640 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. అందులో దాదాపు 984 మంది పత్తి రైతులేనని సమాచారం. స్వామినాథన్ సిఫార్సులేమయ్యాయి? స్వామినాథన్ సిఫార్సులను పదే పదే ప్రస్తావించే పాలకులు వాటి అమలుకు మాత్రం ముందుకు రావడం లేదు. స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం.. రైతు పెట్టిన ఉత్పత్తి ఖర్చు (పెట్టుబడి), ఆ ఉత్పత్తి ఖర్చులో సగం.. ఈ రెండింటినీ కలిపి కనీస మద్దతు ధరగా ప్రకటించాలి. ఆ ప్రకారం చూస్తే అధికారిక లెక్కల ప్రకారం క్వింటాలు పత్తికి రైతు పెట్టే ఉత్పతి ఖర్చు రూ. 5,200. అం దులో సగం రూ.2,600. ఈ రెం డింటినీ కలిపితే రూ.7,800. ఇదే పత్తి కనీస మద్దతు ధర కావాలి. కానీ కేంద్రం దాన్ని పట్టించుకోలేదు. అందులో సగం ధరకు కూడా వ్యాపారులు కొనుగోలు చేయడం లేదు. వైఎస్ తన హయాంలో వ్యాపారులు పత్తిని క్వింటాలుకు రూ.7,200 కొనుగోలు చేశారు. ఇన్నేళ్లు గడిచినా ఆ ధర కాదు కదా.. రైతుకు కనీస మద్దతు ధరా గగనమవుతోంది. -
కరీంనగర్లో ఆందోళనకు దిగిన పత్తిరైతులు
-
అన్నదాత ఆత్మహత్య
ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం కిష్టారంలో అప్పుల పాలైన ఓ అన్నదాత ఆత్మహత్య చేసుకున్నాడు. చింతా రమేష్ నాలుగు ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. ఇందుకోసం రూ.లక్ష వరకు అప్పు చేశాడు. పత్తి పంటలో పిందెలు రాకపోవడంతో మనస్తాపం చెందిన రమేష్ సోమవారం ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. -
రైతులను ఆదుకోవడంలో సర్కారు విఫలం: ఉత్తమ్
రైతులను ఆదుకోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం ఉత్తమ్‌కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు నేడరిగొండ మండలంలోని తేజాపూర్‌లో పత్తి పంటలను పరిశీలించారు. నకిలీ విత్తనాల వల్ల కలుగుతున్న నష్టంపై వారి నుంచి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ... తేమ శాతం పేరుతో పత్తి రైతులను దగా చేస్తున్నారని అన్నారు. ఈ పర్యటనలో కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు. -
పత్తి రైతు చిత్తు!
♦ నిండా ముంచుతున్న వ్యాపారులు, దళారులు ♦ ఇష్టారీతిన ధర నిర్ణయం.. ట్రాక్టర్ పత్తిలో 40 కిలోలు కోత ♦ మార్కెట్ కాంటాతో పనిలేకుండా సొంతంగా తూకం ♦ నూటికి రూపాయిన్నర అదనపు కమీషన్ ♦ సాక్షి కథనాలతో స్పందించిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ ♦ జమ్మికుంట మార్కెట్లో ఆకస్మిక తనిఖీ ♦ అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరిక సాక్షి ప్రతినిధి, కరీంనగర్ /జమ్మికుంట: వర్షాభావం నుంచి ఎరువుల కొరత దాకా ఎన్నో ఎదురుదెబ్బల్ని తట్టుకున్న రైతన్న... చివరకు వ్యాపారులు, దళారుల చేతిలో చిత్తయిపోతున్నాడు. అంతో ఇంతో వచ్చిన దిగుబడిని అమ్ముకుందామని మార్కెట్ కేంద్రాలకు వెళితే.. అడుగడుగునా దోపిడీకి గురవుతున్నాడు. తూకం మొదలు కమీషన్ వరకు, మద్దతు ధర మొదలు తరుగు వరకు.. వ్యాపారుల మాయాజాలంలో నిండా మునిగిపోతున్నాడు. మార్కెటింగ్ శాఖ అధికారులే ఈ మోసానికి సహకరిస్తున్నారు. ఈ బాగోతంపై ‘సాక్షి’ ప్రచురించిన కథనాలపై కరీంనగర్ జిల్లా కలెక్టర్ స్పందించారు. శుక్రవారం జమ్మికుంట పత్తి మార్కెట్లో ఆకస్మిక తనిఖీ చేశారు. మోసాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. దళారులకు అప్పగించేశారు! కరీంనగర్ జిల్లాలో 11 కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లను చేపట్టాల్సి ఉన్నా... ఇప్పటివరకు కరీంనగర్, జమ్మికుంట, చొప్పదండి, గంగాధర, హుస్నాబాద్ మార్కెట్లలోనే ప్రారంభించారు. ప్రభుత్వం కొనుగోళ్లు ప్రారంభించినట్లు తెలియగానే రైతులు ఆరు రోజులుగా రోజూ దాదాపు 10 వేల క్వింటాళ్ల పత్తిని మార్కెట్లకు తీసుకొస్తున్నారు. కానీ సీసీఐ అధికారులు ఏదో ఒక సాకు చెబుతూ కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతులు విధిలేక వ్యాపారులు, మిల్లర్లకు అమ్ముకోవాల్సి వస్తోంది. నిండా మోసం..: నిబంధనల ప్రకారం మార్కెట్ కార్యాలయాల్లోని వేబ్రిడ్జ్‌ల వద్దే తూకం వేయాలి. పత్తి తేమ శాతం, నాణ్యత, ధర నిర్ధారణ విషయంలో మార్కెటింగ్ శాఖ మార్గదర్శకాలను అనుసరించాలి. ఎంత తూకం వేస్తే అంత బరువుకు ధర చెల్లించాలే తప్ప బరువులో కోత విధించడానికి వీల్లేదు. అలాగే 2 శాతం కమీషన్ మాత్రమే తీసుకోవాలి.కానీ కరీంనగర్ జిల్లా జమ్మికుంట మార్కెట్లో ఇవేవీ అమలుకావడం లేదు. మార్కెట్లో వేబ్రిడ్జ్ ఉన్నా... వ్యాపారులు అక్కడ తూకం వేయనీయడం లేదు. తమకు అనుకూలమైన కాటన్ మిల్లుల వద్ద తప్పుడు తూకం వేస్తూ దోపిడీ చేస్తున్నారు. దీనికితోడు ట్రాక్టర్లో పత్తిని తెస్తే 40 కిలోలు, ట్రాలీలో తెస్తే 20 కిలోల చొప్పున కోత విధిస్తూ మిగతా బరువుకు మాత్రమే సొమ్ము చెల్లిస్తున్నారు. ఇక 2 శాతం కమీషన్‌కు అదనంగా ‘క్యాష్ కటింగ్’ పేరిట ప్రతి రూ.వందకు మరో రూపాయిన్నర మినహాయించుకుంటున్నారు. ఇలా రూ.లక్షకు రూ.1,500, ప్రతి ట్రాక్టర్‌కు 40 కిలోల పత్తి కోతతో మరో రూ.1,600 రైతు నష్టపోతున్నాడు. తప్పుడు తూకం, తక్కువ ధర తో నిండా మునిగిపోతున్నాడు. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం.. కరీంనగర్ జిల్లాలో గత ఆరు రోజులుగా రూ.20 కోట్లకుపైగా పత్తి వ్యాపారం జరగగా.. అందులో రైతులు రూ.5 కోట్లదాకా నష్టపోయినట్లు తెలుస్తోంది. కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. పత్తి కొనుగోళ్లలో మోసాలపై ‘సాక్షి’లో రెండు రోజుల పాటు వరుస కథనాలు రావడంతో.. కరీంనగర్ జిల్లా పాలనా యంత్రాంగంలో కదలిక వచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ ఆకస్మికంగా జమ్మికుంట మార్కెట్‌ను తనిఖీ చేశారు. మార్కెటింగ్ శాఖ ఏడీ ప్రకాష్, తహసీల్దార్ రజనితో కలిసి రైతుల వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులంతా మూకుమ్మడిగా తమ బాధను వెళ్లగక్కారు. ‘‘మేం తెచ్చిన పత్తిని సీసీఐ అధికారులు కొనుగోలు చేయడం లేదు. వ్యాపారులు ఇష్టారీతిన ధర నిర్ణయిస్తూ అడ్డగోలుగా దోచుకుంటున్నారు. రూ.2,500 నుండి రూ.3,750 దాకా మాత్రమే ఇస్తున్నారు తప్ప ఒక్కరికి కూడా సీసీఐ నిర్ణయించిన ధర చెల్లించడం లేదు. పైగా ట్రాక్టర్‌కు 40 కిలోల చొప్పున కోత విధిస్తున్నారు. మార్కెట్ వేబ్రిడ్జ్‌పై కాకుండా సొంత కాంటాలపై తూకం వేస్తున్నారు. కాస్ట్ కటింగ్ పేరిట రూ.వందకు రూపాయిన్నర చొప్పున మినహాయించుకుంటున్నారు. మీరేమో ఆత్మహత్య చేసుకోవద్దు. ధైర్యంగా ఉండండని చెబుతున్నారు. అసలే కాలంలేక బాధపడుతున్నం. ఇక్కడికొస్తే అడ్తిదారులు, వ్యాపారుల దోపిడీతో చస్తున్నాం. ఇట్లయితే మేం బతికేదెట్లా..?’’అని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కలెక్టర్ నీతూప్రసాద్ తీవ్రంగా స్పందించారు. ‘‘కాస్ట్ కటింగ్, సొంతంగా తూకం వేసుకోవడం, ట్రాక్టర్‌కు 40 కిలోల చొప్పున పత్తిని మినహాయించుకోవడం వంటివి నిబంధనలకు పూర్తి విరుద్ధం. ఇకపై అలా జరిగితే లెసైన్సు రద్దు చేస్తాం. క్రిమినల్ కేసు పెడతాం. గతంలో ఇక్కడ సీబీఐ దాడులు చేసి విచారణ జరుపుతున్న విషయాన్ని మర్చిపోవద్దు..’’ అని వ్యాపారులను హెచ్చరించారు. -
అమాత్యుడొచ్చినా.. ఆగని దోపిడీ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సాక్షాత్తూ అమాత్యుడే తమ పక్షాన నిలబడ్డారని ఆనందించిన అన్నదాత సంతోషం అరగంటకే ఆవి రైంది. జమ్మికుంట మార్కెట్ నుంచి మంత్రి వెళ్లిపోగానే సీసీఐ అధికారులు, పత్తి మిల్లర్లు తమ అసలు స్వరూపాన్ని బయటపెట్టారు. తొలిరోజు మాదిరిగానే రెండోరోజు సైతం సీసీఐ అధికారులు పత్తిని కొనుగోలు చేయలేదు. గురువారం మార్కెట్‌కు ఏకంగా 10వేల క్వింటాళ్లకుపైగా పత్తి వచ్చినా పట్టించుకోలేదు. చివరకు సీసీఐ నిబంధనల ప్రకారం లూజ్పత్తిని తీసుకొచ్చినా.. 8 శాతంలోపే తేమ ఉన్నా కొనలేదు. మంత్రి ఈటల ఉన్న సమయంలో నాలుగు ట్రాలీల్లోని లూజ్పత్తిని కొనుగోలు చేస్తున్నట్లు చెప్పిన అధికారులు ఆయన వెళ్లాక వాటిని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. దీంతో బిత్తరపోవడం రైతుల వంతైంది. మధ్యాహ్నం వరకు వేచిచూసిన రైతులు ఇక చేసేదేమీలేక షరా మామూలుగానే తెచ్చిన పత్తిని మిల్లర్లు, వ్యాపారులు చెప్పిన రేటుకే కట్టబెట్టి వెనుదిరిగారు. క్వింటాల్‌కు రూ.వెయ్యికిపైగా నష్టం సీసీఐ నిబంధనల ప్రకారం 8శాతం తేమ కలిగిన పత్తి క్వింటాల్‌కు రూ.4100 ధర చెల్లించాలి. కానీ జమ్మికుంట మార్కెట్లో గురువా రం 10 వేల క్వింటాళ్లకుపైగా పత్తి వచ్చినా కనీసం ఏ ఒక్క రైతుకూ మద్దతు ధర లభించలేదు. 8 శాతం లోపు తేమ కలిగిన పత్తికి కూడా కనీసధర చెల్లించేందుకు వ్యాపారులు నిరాకరించారు. కనిష్టంగా క్వింటాల్‌కు రూ.2500 నుంచి గరిష్టంగా రూ.3,850 వరకు పత్తిని కొనుగోలు చేశారు. రకరకాల సాకుతో రూ.3,850కు మించి ధర చె ల్లించకపోవడం గమనార్హం. రెండోరోజు మార్కెట్ కొనుగోళ్లను పరిశీలిస్తే కనీస మద్దతు ధర కంటే సగటున వెయ్యి రూపాయల తక్కువకు పత్తిని కొనుగోలు చేశారు. ఈ లెక్కన జమ్మికుంట మార్కెట్లో ఒక్కరోజే రూ.కోటికిపైగా రైతులకు నష్టం వాటిల్లినట్లయింది. బిత్తర పోయిన పత్తి రైతన్న మంత్రి ఈటల గురువారం జమ్మికుంట మార్కెట్‌కు వస్తూనే లూజ్పత్తి తీసుకొచ్చిన రైతుల వాహనాల వద్దకు వెళ్లారు. అక్కడ మొదటి వరసలో లూజ్పత్తి వాహనం ముందున్న సైదాపూర్ మండలంలోని శివరామపల్లికి చెందిన ముదాం రాజయ్య వద్దకు వెళ్లారు. ఆ సమయంలో సీసీఐ అధికారులు లూజ్ పత్తి నాణ్యతను పరిశీలించగా తేమ శాతం 7లోపు ఉన్నట్లు తేలింది. నిబంధనలకు అనుగుణంగా పత్తిని తెచ్చిన రాజయ్యను మంత్రి స్వయంగా అభినందించారు. తన చేత్తో స్వీట్ కూడా తినిపించారు. ఆ వాహనం ముందు కొబ్బరికాయ కొట్టి తూకం ప్రారంభించి ముందుకు కది లారు. మద్దతు ధరకు ఢోకా లేదని మురిసిపోయాడు. కానీ మంత్రి వెళ్లాక సీన్ రివర్స్ అయ్యింది. రైతు గుర్తింపు కార్డు లేదని సీసీఐ అధికారులు తూకం వేయడం నిలిపివేయడంతో బిత్తరపోయాడు. సాయంత్రం వరకు సీసీఐ అధికారులు కొంటారని ఎదురుచూసిన రాజయ్య చివరకు విసిగిపోయి తక్కువ ధరకే పత్తిని వ్యాపారికి అమ్మేసి ఇంటిదారి పట్టాడు. గుర్తింపు కార్డులు తెచ్చుకున్న రైతులదీ దాదాపు ఇదే పరిస్థితి. గురువారం 120 వాహనాల్లో లూజ్పత్తిని తీసుకొచ్చిన రైతుల్లో పలువురికి గుర్తింపు కార్డులున్నప్పటికీ సీసీఐ అధికారులు కొనేందుకు ఆసక్తి చూపలేదు. -
ఈటల ను నిలదీసిన పత్తిరైతులు
మంత్రి ఈటెలకు రైతుల నిరసన సెగ తగిలింది. కరీంనగర్ లో పర్యటిస్తున్న మంత్రిని పత్తి రైతులు నిలదీశారు. జమ్మికుంట మార్కెట్ యార్డుకు వచ్చిన మంత్రిని వారు ఘెరావ్ చేశారు. మా గోడు మీకు పట్టదా అంటూ నిలదీశారు. అనంతరం రైతులు ఆందోళనకు దిగారు. -
లారీ కిందపడిన బైక్.. ఒకరి మృతి
వేగంగా వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించిన ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి లారీ వెనక చక్రాల కింద పడటంతో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ వారి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన వరంగల్ జిల్లా మామ్నూరులోని టీఎస్ఎస్పీ 4వ బెటాలియన్ సమీపంలో బుధవారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళితే.. పెరికేడు మండలం ఎడ్లపల్లి గ్రామానికి చెందిన ఎడ్లపల్లి బోసు(40), వెంకటేశ్వర్రావు(50), మరంశెట్టి సత్యనారాయణ(36) వరంగల్ మార్కెట్లో పత్తి అమ్మి తమ ద్విచక్రవాహనాలపై వరంగల్-ఖమ్మం రహదారిలో ఇంటికి బయలు దేరారు. టీఎస్ఎస్పీ 4వ బెటాలియన్ సమీపంలో పక్క నుంచి వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించారు. ఇదే సమయంలో ఎదురుగా మరో వాహనం వస్తుండటంతో అదుపుతప్పి లారీ వెనక చక్రాల కింద పడ్డారు. ఈ ఘటనలో సత్యనారాయణ అక్కడికక్కడే మృతిచెందగా.. మిగతా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను 108 సాయంతో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పత్తి రైతు కన్నెర్ర
సాక్షి ప్రతినిధి, వరంగల్: వ్యాపారుల మాయాజాలం, అధికారుల కక్కుర్తి, ప్రభుత్వ నిర్లక్ష్యం కలసి ఈసారీ పత్తి రైతుల పొట్టకొడుతున్నాయి. మద్దతు ధరపై ఏటా జరుగుతున్న మోసం ఈ సీజన్లోనూ మొదలైంది. భారత పత్తి సంస్థ (సీసీఐ) కొనుగోళ్లు మొదలుపెట్టిన తొలిరోజే రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) అందలేదు. ఈసారి మద్దతు ధర క్వింటాల్‌కు రూ.4,100 ప్రకటించగా... మంగళవారం వరంగల్ మార్కెట్లో వ్యాపారులు ఇచ్చింది రూ.3,000 నుంచి రూ.3,300 మాత్రమే. తమ కష్టమంతా కళ్లముందే దోపిడీ చేస్తుండడంతో కడుపు మండిన రైతులు ఆందోళనకు దిగారు. బస్తాల్లో తెచ్చిన పత్తిని కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల నిరసనతో మార్కెట్లో కొనుగోళ్లు చాలాసేపు నిలిచిపోయాయి. మొదలు పెట్టగానే.. రాష్ట్రంలో ఈ ఏడాది 16.32 లక్షల హెక్టార్లలో పత్తి సాగుకాగా.. దాదాపు 150 లక్షల క్వింటాళ్ల దిగుబడి ఉంటుందని అంచనా. 2015-16 మార్కెట్ సీజన్లో పత్తికి రూ.4,100 మద్దతు ధరగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పత్తి కొనుగోళ్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 84 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు సీసీఐ ప్రకటించింది. ఈనెల 10 నుంచి కొనుగోళ్లు చేపడతామని ప్రకటించినా.. సెలవుల పేరుతో 12వ తేదీ నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. మంగళవారం వరంగల్‌లోని ఎనుమాముల మార్కెట్లో పత్తి కొనుగోళ్లు చేపట్టారు. మార్కెట్‌కు రైతులు 24 వాహనాల్లో లూజుగా(బస్తాల్లో కాకుండా నేరుగా), విడిగా మరో 50 వేల బస్తాల్లో పత్తిని తెచ్చారు. అయితే సీసీఐ అధికారులు కొనుగోలుకు ముందే నిబంధనల సాకులు మొదలుపెట్టారు. వాహనాల్లో లూజుగా తెచ్చిన పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తామన్నారు. అలా తెచ్చిన పత్తికే తేమ పరీక్షలు చేశారు. 15 వాహనాల్లోని పత్తికి మద్దతు ధర చెల్లించారు. మిగతా తొమ్మిది వాహనాల్లోని పత్తిని తేమ సాకు చెప్పి తిరస్కరించారు. ఇక బస్తాల్లో పత్తిని తెచ్చిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వ్యాపారుల దోపిడీ ఇలా.. సీసీఐ తిరస్కరించిన, బస్తాల్లో తెచ్చిన పత్తిని వ్యాపారులు కొనుగోలు చేశారు. దాదాపు 80 శాతం పత్తికి రూ.3,000 నుంచి రూ.3,300 మధ్య ఇస్తామన్నారు. మిగతా 20 శాతం పత్తికి రూ.3,920 ధర పెట్టారు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. బస్తాల్లో తెచ్చిన పత్తిని సీసీఐ కొనుగోలు చేయాలంటూ పత్తి కార్యాలయాన్ని ముట్టడించారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమయంలో పోలీసులు వచ్చి రైతులను నియంత్రించారు. కరీంనగర్ జిల్లాకు చెందిన సాంబయ్య అనే రైతు కొంత పత్తిని కాల్చే ప్రయత్నం చేశారు. కొద్దిగా పొగలు కమ్ముకోవడంతో మార్కెట్లోని ఫైరింజన్ వచ్చింది. కొద్దిగా అంటుకున్న పత్తిపై సిబ్బంది నీళ్లు చల్లి ఆర్పారు. అనంతరం కొందరు రైతులు మార్కెట్ కార్యాలయానికి వచ్చి పత్తికి క్వింటాల్‌కు రూ.6 వేలు చొప్పున ధర ఇవ్వాలని, బస్తాల్లో తెచ్చిన పత్తిని కొనుగోలు చేయాలని అక్కడికి వచ్చిన వరంగల్ ఆర్డీవోకు వినతిపత్రం ఇచ్చారు. మార్కెటింగ్ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు నిరసన తెలిపిన కొందరిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ఖమ్మం, కరీంనగర్లోనూ ఇదే తీరు.. ఖమ్మం జిల్లాలో ఇప్పుడిప్పుడే పత్తి మార్కెట్లకు వస్తోంది. సీసీఐ ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలను తెరవకపోవడంతో రైతులను వ్యాపారులు, దళారులు నిండా ముంచుతున్నారు. తేమ శాతం సాకుతో రూ.3000 నుంచి రూ.3,500 మధ్యలో కొనుగోలు చేస్తున్నారు. ఈనెల 15 నుంచి జిల్లాలోని 8 కేంద్రాల్లో సీసీఐ పత్తిని కొనుగోలు చేయనుంది. ఇక మంగళవారం కరీంనగర్ మార్కెట్ యార్డులో సీసీఐ కొనుగోలు కేంద్రం ప్రారంభించినా... తేమ సాకుతో కొనుగోళ్లు చేపట్టలేదు. 12 శాతం తేమ ఉంటేనే కనీస మద్దతు ధర రూ.4,100 చెల్లిస్తామని చెప్పడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేసారు. సీసీఐ కేంద్రం ప్రారంభానికి వచ్చిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఈ విషయాన్ని మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్ దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలోని జమ్మికుంట, కరీంనగర్, గంగాధర, చొప్పదండి, పెద్దపల్లి యార్డుల్లోనూ సీసీఐ కేంద్రాల జాప్యంతో వ్యాపారులు రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు. ఇప్పటికే సుమారు 10 వేల క్వింటాళ్ల పత్తిని వ్యాపారులు సగటున రూ.3 వేల చొప్పున కొనుగోలు చేశారు. మేం తెచ్చింది పత్తి కాదా..? మార్కెట్‌కు 16 బస్తాల పత్తిని తెచ్చిన. బస్తాలల్ల తెచ్చిన్నని సీసీఐ అధికారులు కొనరట. మేము తెచ్చింది పత్తి కాదా. నిమ్ముతో సహా మంచిదో కాదో చూసుకోండి. లూజుగా తేవాలంటే వ్యాను కిరాయి తక్కువ అయితదా. ఏందీ మోసం? - గుండారపు స్వామి, మొగుళ్లపల్లి అంతా మోసపు మాటలు నేను 21 బస్తాల పత్తిని వరంగల్ మార్కెట్‌కు తీసుకువచ్చిన. ఇక్కడ క్వింటాలుకు రూ.3,350 ధర పెట్టారు. మరి ప్రభుత్వం చెబుతున్న మద్దతు ధర ఏది. సీసీఐ అధికారులు ఏరి. అంతా మోసపు మాటలు. అందరు కలసి దోచుకోవడమే లెక్క. - జోడు కనకయ్య, జమ్మికుంట -
వరంగల్ జిల్లాలో రోడ్డెక్కిన పత్తిరైతులు
-
10లోపు పత్తి రైతులందరికీ గుర్తింపు కార్డులు
హైదరాబాద్ : తెలంగాణ వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారుల సమావేశం శనివారం జరిగింది. పత్తి రైతుల సమస్యలపై చర్చ ఈ సమావేశంలో చర్చించారు. తెలంగాణ పత్తి రైతులందరికీ గుర్తింపుకార్డుల జారీ చేయాలని నిర్ణయం జరిగింది. అక్టోబర్ 10 నుంచి 17లోపు కాటన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 84 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయటంతో పాటు, ఈ నెల 10లోపు పత్తి రైతులందరికీ గుర్తింపు కార్డులు పంపిణీ చేయనున్నారు. కాగా ఈ ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన పత్తి రైతుల వివరాలు, వారు సాగుచేసిన పంట వివరాలతో కూడిన కార్డును వారికి అందచేయనున్నారు. పత్తిసాగు చేపట్టిన రైతులకు ఇక నుంచి రెవెన్యూశాఖ, గుర్తించిన ఐడీ కార్డు జారీ చేయనున్నారు. -
పత్తి రైతుల ఆందోళన
నేరేడుగొండ(ఆదిలాబాద్): కల్తీ పత్తి విత్తనాలు ఇచ్చి తమను మోసం చేశారని పత్తి రైతులు ఆందోళన చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా నేరేడుగొండ మండలం తేజాపూర్ గ్రామానికి చెందిన రైతులు ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన పత్తి విత్తనాలు కొనుగోలు చేశారు. అవి సరిగా మొలకెత్తలేదు. ఒకవేళ మొలకెత్తినా పూత, కాయ దశకి వచ్చేసరికి చెట్లు ఎండిపోయాయి. దీంతో ఆగ్రహించిన సుమారు 300 మంది రైతులు విత్తనాల ప్యాకెట్లతో గురువారం నాడు మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. -
పట్టురైతుల సమస్యలపై పోరాడతాం
దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో పట్టు రైతులకు ప్రయోజనం చేకూరిందని, చంద్రబాబు ప్రభుత్వంలో వారికి తీవ్ర అన్యాయం జరుగుతోందని వైఎస్ జగన్ అన్నారు. అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్రలో భాగంగా మడకశిర-కదిరేపల్లి దారిలో వెళుతూ పక్కనే ఉన్న లక్ష్మీనరసప్ప అనే పట్టురైతు పొలంలోకి ఆయన వెళ్లారు. పట్టురైతులంతా అక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా పట్టురైతుల సమస్యలపై ఆయన ఆరా తీశారు. వారి సమస్యలు విన్నాక మాట్లాడుతూ.. ‘వైఎస్ హయాంలో పట్టుగూళ్ల ధర కిలో రూ.400-450 ఉండేది. ఇది కాకుండా పవర్‌లూమ్స్ ప్రభావాన్ని తగ్గించి, పట్టు రైతులు, కార్మికులకు మేలు చేసేందుకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి చైనా సిల్క్ దిగుమతులపై సుంకాన్ని 31 శాతానికి పెంచారు. ఇప్పుడు పట్టుగూళ్ల ధర 120 రూపాయలకు తగ్గిపోయింది. దిగుమతి సుంకాన్ని కేంద్రం 5 శాతానికి తగ్గించింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎకరాకు రూ.25-28 వేలు ఖర్చు వస్తోంది. కానీ రైతులకు పెట్టుబడి కూడా రావడం లేదు. వైఎస్ హయాంలో పవర్‌లూమ్స్‌లో పాలిస్టర్, జరీ వాడకుండా తనిఖీలు చేసేవారు. దీంతో స్వచ్ఛమైన జరీదారంతోనే హ్యాం డ్లూమ్స్ నడిచేవి. ఇప్పుడు తనిఖీలు కూడా లేవు. పట్టు రైతులు తీవ్రంగా నష్టపోతున్నా చంద్రబాబుకు కనపడడం లేదు’’ అని విమర్శించారు. అన్ని సమస్యలూ సావధానంగా విన్న జగన్మోహన్రెడ్డి.. దిగుమతి సుంకం అంశంతోపాటు ఇతర సమస్యలనూ వైఎస్సార్సీపీ ఎంపీలు పార్లమెంట్లో లేవనెత్తుతారని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కూడా చంద్రబాబుకు బుద్ధివచ్చేలా ఒత్తిడి తెచ్చి పట్టురైతులకు న్యాయం జరిగేలా పోరాడతామని ధైర్యం చెప్పారు. -
పత్తిరైతుల సమస్యపై కేంద్రానికి లేఖ: వైఎస్ జగన్
అనంతపురం : పత్తిరైతుల సమస్యలను పార్లమెంట్లో తమ పార్టీ ఎంపీలు ప్రస్తావిస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. పత్తిరైతుల సమస్యలు తీర్చాందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రానికి తాను లేఖ రాస్తానని ఆయన రైతులకు భరోసా ఇచ్చారు. అనంతపురం జిల్లాలో వైఎస్ జగన్ చేపట్టిన రైతు భరోసా యాత్ర ఆదివారం ఆరో రోజుకు చేరుకుంది. యాత్రలోభాగంగా ఈ రోజు కదిరేపల్లి వద్ద మల్బరి తోటను ఆయన పరిశీలించారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను రైతులు ఈ సందర్భంగా వైఎస్ జగన్‌కు విన్నవించారు. దిగుమతి సుంఖాన్ని కేంద్రం తగ్గించడంతో చైనా నుంచి అత్యధికంగా సిల్క్ దిగుమతి అవుతుందని వారు తెలిపారు. దీని వల్ల మల్బరి సాగు చేసే రైతులు నష్టపోతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పత్తిరైతులకు ప్రత్యేక ప్రోత్సాహం ఇచ్చారని వారు ఈ సందర్భంగా వైఎస్ జగన్‌కు గుర్తు చేశారు. ఎకరాకు రూ. 28 వేలు పెట్టుబడి పెట్టినా...రూ. 30 వేల ఆదాయం కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ కూడా వర్తింపచేయలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ పైవిధంగా స్పందించారు. -
పత్తికి వాన దెబ్బ!
సాక్షి, హైదరాబాద్: రుతుపవనాలు, అల్పపీడనం కారణంగా కురుస్తున్న ఎడతెరపి లేని వర్షాలతో పత్తిరైతుకు కొత్త కష్టం వచ్చింది. కొద్దిరోజుల కింద వేసిన పత్తి విత్తనాలు వారంగా కురుస్తున్న వానల కారణంగా కుళ్లిపోతాయేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. దానివల్ల మళ్లీ విత్తనాలు వేయాల్సి వస్తుందని.. అది ఆర్థికంగా ఎంతో భారమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు మూడు రోజులు ఇలాగే వర్షాలు కొనసాగుతాయని వాతావరణశాఖ ప్రకటించిన నేపథ్యంలో.. ఇప్పటికే వేసిన పత్తి విత్తనాలు మొలకెత్తక కుళ్లిపోయే అవకాశముందని వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా పత్తిని నల్లరేగడి నేలల్లో వేస్తారని, వాటిలో మొలకెత్తని విత్తనాలు పాడైపోతాయని చెబుతున్నారు. 7.3 లక్షల ఎకరాల్లో సాగు ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ఆశాజనకంగా ప్రారంభమైంది. రెండు మూడేళ్లతో పోలిస్తే ఈసారి కాలం కలిసివచ్చింది. సీజన్ ప్రారంభమైన జూన్ ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు సాధారణం కంటే ఎక్కువగా 134 శాతం వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లాలోనైతే ఏకంగా 319 శాతం అదనంగా కురిసింది. రుతుపవనాల ప్రారంభానికి ముందే వర్షాలు రావడంతో రైతులు మొదట పత్తి విత్తనాలే వేశారు. వ్యవసాయశాఖ వేసిన లెక్కల ప్రకారం 7.31 లక్షల ఎకరాల్లో పత్తి సాగు ప్రారంభమైంది. అయితే విత్తనాలు వేశాక వర్షాలు ఊపందుకున్నాయి. అనేకచోట్ల కుంభవృష్టి కురుస్తోంది కూడా. దీంతో పొలాల్లో నీరు నిలుస్తుండడంతో ఇంకా మొలకెత్తని పత్తి విత్తనాలు భూమిలోనే కుళ్లిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు తాత్కాలికంగా నిలిచిపోతే.. పత్తి విత్తనాలు మొలకెత్తుతాయని, ఆ తర్వాత వర్షాలు వచ్చినా నష్టం లేదని చెబుతున్నారు. ఇదే సమయంలో వాతావరణశాఖ మాత్రం మరో రెండుమూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. రూ.100 కోట్ల నష్టం! రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో 7.31 లక్షల ఎకరాల్లో పత్తి విత్తనాలు వేయగా.. అందులో ఈ ఆరు జిల్లాల్లోనే 6.35 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. దీంతో ఈ జిల్లాల్లోని 5.5 లక్షల ఎకరాల్లో పత్తి విత్తనం కుళ్లిపోయే ప్రమాదం ఉందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఒక్కో ఎకరంలో రెండు ప్యాకెట్ల పత్తి విత్తనాలు వేస్తారు. ఒక్కో ప్యాకెట్ ధర రూ.930.. ఈ లెక్కన రైతులు దాదాపు రూ.100 కోట్లకుపైగా నష్టపోయే అవకాశముందని అంటున్నారు. -
పత్తి రైతుకు నకిలీ దెబ్బ
గుంటూరు నుంచి నకిలీ విత్తనాల దిగుమతి కమీషన్లు ఇస్తూ గుట్టుచప్పుడు కాకుండా ప్యాకింగ్ చేయిస్తున్న వైనం పడకేసిన విజిలెన్స్.. పట్టించుకోని వ్యవసాయాధికారులు పత్తిరైతును నకిలీ విత్తనాలు చిత్తు చేస్తున్నాయి. మిగతా పంటలకు విత్తనాలను అందిస్తున్న ప్రభుత్వం పత్తి విత్తనాలు మాత్రం అందించడం లేదు. దీంతో బయటి మార్కెట్లోనే కొనాల్సి వస్తోంది. దీనిని ఆసరాగా తీసుకున్న వ్యాపారులు బయట నుంచి నకిలీ విత్తనాలు తెచ్చి అంటగడుతున్నారు. ఈ విత్తనాలు వేసిన రైతులు సరైన దిగుబడి రాక నష్టాల పాలవుతున్నారు. ప్రతి ఏటా ఇదే తంతు జరుగుతున్నా.. వాటిని నియంత్రించడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. మహబూబ్ నగర్ వ్యవసాయం: ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పత్తి రైతులు విత్తనాల సేకరణలో పడ్డారు. అయితే, వర్షాలకంటే ముందుగానే నకిలీ పత్తి విత్తనాలు జిల్లాను ముంచెత్తాయి. అక్కడక్కడా అధికారుల తనిఖీల్లో బయటపడుతున్నాయి. నకిలీ విత్తనాల ముఠా మాఫీయాగా ఏర్పడ్డారు. ప్రధాన కంపెనీలకు చెందిన బ్రాండ్ల పేరుతో నకిలీ విత్తనాలను తయారు చేయిస్తున్నారు. వాటిని తమకు అనుకూలంగా వ్యవహరించే డీలర్లకు చేరవేస్తూ అక్కడి నుండి రైతులకు అంటగడుతున్నారు. గుంటూరుకు కొందరు పత్తి విత్తనాల వ్యాపారులు.. జిల్లాలోని కొందరు సీడ్స్ డీలర్లు, స్థానిక నాయకులు కలిసి ఈ దందా నిర్వహిస్తున్నట్టు సమాచారం. నకిలీ దందా ఇలా.. గుంటూరుకు చెందిన వ్యక్తులు అక్కడి నుంచి తక్కువ ధరకు దాదాపు కిలో రూ.100-200 లెక్కన నాసిరకం విత్తనాలు కొనుగోలు చేసి తమ రహస్య ప్రదేశాలకు చేరవేస్తున్నారు. వాటిని ఎక్కువగా పత్తి సాగుచేసే గద్వాల, ధరూర్, అచ్చంపేట, కల్వకుర్తి, మిడ్జిల్, భూత్పూర్, షాద్‌నగర్ తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ మాఫియా దాదాపుగా 20చోట్ల వీటిని అమ్మేందుకు కొందరు వ్యక్తుకు బాధ్యత అప్పగించింది. వీరికి ప్యాకేట్కు రూ.100 నుంచి రూ.150 చొప్పున ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇలా ఒప్పందం కుదుర్చుకున్న వ్యక్తుల్లో గతంలో సీడ్ కంపెనీలో పనిచేసి మానేసిన వ్యక్తులు, పత్తివిత్తనాల ప్యాకింగ్‌లో అనుభవం ఉన్న వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు. వీరికి నకిలీ విత్తనాల పంపిణీ నుండి ప్యాకింగ్ చేసేందుకు పౌచ్‌లు(ఖాళీప్యాకేట్ లు), విత్తనాలకు బీటీ రంగులు అద్దడానికి రంగు, ప్యాకింగ్ హీట్మిషన్, తుకాల నిర్వహణకు కాంటాలను మాఫీయా సభ్యులే సమకురుస్తున్నారు. ఇలా వీటి ప్యాకింగ్‌కు కావాల్సిన కూలీల ఖర్చులను, రవాణాకు మాఫీయా సభ్యులే అదనంగా భరిస్తారు. దుకాణదారులే సూత్రధారులు జిల్లాలో లెసైన్స్ పొందిన కొందరు సీడ్ దుకాణందారులు ఇందులో కీలకంగా వ్యవహరిస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ మార్జీన్మనీ సంపాదించవచ్చనే ఆశతో కొందరూ డీలర్లు మాఫియాతో చేతులు కలిపారు. వీరంతా తమకు అనుకూలంగా ఉండే మరికొందరు డీలర్లను కలుపుకుని ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. పత్తివిత్తనాలు ఎక్కువగా అమ్ముడయ్యే ప్రాంతాలలో ఒక్కరిద్దరు దుకాణదారులను గుర్తించి వారికి ఎక్కువ మార్జిన్‌మనీ ఆశ చూపి పంపిణీ చేస్తున్నారు. ఈ అక్రమ వ్యాపారం ఎక్కువగా కల్వకుర్తి, గద్వాల్, షాద్‌నగర్, మిడ్జిల్, వంగూరు, ఐజ, ధరూర్, భూత్పూర్, అచ్చంపేట, బిజినపల్లి, నాగర్‌కర్నూల్, కోస్గి, నారాయణపేట మండలాల్లో కొందరు దుకాణాదారులు కీలకంగా వ్యవహరిస్తురనే ఆరోపణలున్నాయి. ప్రధాన కంపెనీల బ్రాండ్ల మాదిరిగా తయారీ... బహిరంగ మార్కెట్ ఎక్కువగా అమ్ముడుపోయే ప్రధాన కంపెనీ (కావేరి, జాదు, వ సంత సీడ్స్, నూజీవీడు సీడ్స్ వంటి కంపెనీలకు చెందిన )రకాల మాదిరిగా పౌచ్‌లను ప్రింట్ చేయించి విత్తనాల తయారీకి ఉపయోగిస్తున్నారు. ఇలా తయారు చేసిన విత్తనాలను గుట్టుచప్పుడు కాకుండా షాపులకు చేరవేస్తున్నారు. మార్కెట్లో వీటిని దర్జాగా అమ్మేస్తున్నారు. తప్పుడు ధ్రువపత్రాలతో మరికొందరు.. సీడ్ విత్తనాలను ప్యాకింగ్ చేసి అమ్మేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన కొన్ని కంపెనీలు తప్పుడు చిరునామాతో అధికారులను బురడీ కొట్టిస్తూ నకిలీ విత్తనాలు తయారు చేస్తున్నారు. కొందరు వ్యక్తులు హైదరాబాద్ నగరం, మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం, కర్ణాటక వంటి ప్రాంతాలలోని చిరునామాతో ప్యాకింగ్ అండ్ మార్కెటింగ్‌కు అనుమతులు పొందుతున్నారు. తీరా చూస్తే అదే అడ్రస్‌పై దొంగచాటుగా గ్రామీణ ప్రాంతాల్లో తయారు చేస్తున్నారు. దీంతో అధికారులు వారు చిక్కడం లేదు. గద్వాల్, జడ్చర్ల, భూత్పూర్, కల్వకుర్తి వంటి ప్రాంతాలలో కొందరు హైదరాబాద్,మహబూబ్‌నగర్ పట్టణం అడ్రస్‌లతో అనుమతులు పొంది రహస్య ప్రదేశాలలో రాత్రివేళ్లలో ప్యాకింగ్ చేస్తున్నారు. ఇలా దొంగచాటుగా ప్యాకింగ్ చేసిన వాటిలో కొన్నింటిని ఇతర ప్రాంతాలకు తరలించగా మరికొన్నింటిని సొంతంగా సీడ్దుకాణం లెసైన్స్ పొంది అమ్మేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఏదో అడపా దడపా తప్ప పూర్తిస్థాయిలో వీటిని నివారించడంలో విజిలెన్స, వ్యవసాయాధికారులు శ్రద్ధ కనబర్చడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
నిలువునా దగా...
రాష్ట్రంలో పత్తి రైతుల దీన స్థితి మద్దతు ధర ఇవ్వని సీసీఐ.. నిలువునా ముంచుతున్న వ్యాపారులు వర్షాభావం కారణంగా బాగా తగ్గిపోయిన దిగుబడి నాణ్యత లేదంటూ రూ. 250 వరకూ సీసీఐ కోత దళారులతో కుమ్మక్కు.. బినామీ రైతుల పేరిట కొనుగోళ్లు అధికారుల అండతో రెచ్చిపోయిన ప్రైవేటు వ్యాపారులు, దళారులు ధరలో క్వింటాల్‌కు నాలుగైదు వందల వరకూ దోపిడీ రైతుల పరిస్థితి అగమ్యగోచరం.. పెట్టుబడులూ దక్కని దుస్థితి ఆవేదనతో ఆత్మహత్యకు పాల్పడుతున్న రైతులు కొద్దినెలల్లోనే పదుల సంఖ్యలో బలవన్మరణాలు సాక్షి, నెట్వర్క్: కాలం కలసిరాక ఒకటికి రెండు సార్లు వేసిన విత్తనాలతో పెట్టుబడి బాగా పెరిగింది. వానలు సరిగా కురవక పత్తి దిగుబడి తగ్గింది. ఆ కాస్త దిగుబడికీ మద్దతు ధర ఇవ్వకుండా సీసీఐ దెబ్బకొట్టింది. తేమ శాతం, పింజ పొడవు పేరిట నిలువునా ముంచింది. దళారులు, వ్యాపారులకు మాత్రం ‘సరైన’ ధర కట్టబెట్టింది. ఏదోలా అమ్ముకునే దుస్థితిని రైతుకు తెచ్చిపెట్టింది. తెగించి వ్యాపారులకు అమ్ముకున్న రైతులకు మాత్రం నిండా నష్టాలు, కష్టాలు, కన్నీళ్లే మిగిలాయి. ప్రతీసారిలాగే ఈసారి కూడా పత్తి రైతు నిలువునా దోపిడీకి గురయ్యాడు. సీసీఐతో పాటు దళారులు, వ్యాపారులు కలసి పత్తి రైతును నిలువునా ముంచారు. రైతులకు అండగా నిలవాల్సిన సీసీఐ (భారత పత్తి సంస్థ) కూడా ధరలో అధికారికంగానే కోతపెట్టడం గమనార్హం. క్వింటాలుకు రూ.4,050 కనీస మద్దతు ధర ఇవ్వాల్సి ఉండగా... తేమ శాతం, స్టేఫుల్ లెన్త్ (పింజ పొడవు) తదితర నాణ్యతల పేరుతో సీసీఐ రూ. 3,800 చొప్పున మాత్రమే చెల్లిస్తోంది. అంతేకాదు తేమ పేరుతో కొద్దిరోజులు కొనుగోళ్లను సీసీఐ నిలిపివేయడంతో... రైతులు పత్తిని దళారులు, ప్రైవేటు వ్యాపారులకు విక్రయించాల్సి వచ్చింది. దీంతో వారు. రూ. 3,550 నుంచి రూ. 3,650 వరకే పత్తిని కొనుగోలు చేశారు. దాదాపుగా ఒక్కో క్వింటాల్‌పై నాలుగె దు వందల వరకు దండుకున్నారు. పెరిగిన భారం... ఖరీఫ్ ప్రారంభంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా పత్తి విత్తనాలు మొలకెత్తలేదు. దాంతో రెండు, మూడు సార్లు విత్తుకోవాల్సి వచ్చింది. దీనికి తోడు చుక్కలనంటిన ఎరువులు, పురుగు మందుల ధరలతో సాగు వ్యయం విపరీతంగా పెరిగింది. ఒక్కో ఎకరం పత్తి సాగుకు రైతులు వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది. కానీ వర్షాలు లేక దిగుబడి ఎకరానికి నాలుగైదు క్వింటాళ్లకు తగ్గిపోయింది. దీనికితోడు మద్దతు ధర దక్కక... రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. చేతికందిన పంటనంతా విక్రయిస్తే కనీసం పెట్టుబడి కూడా రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్కువ ధరకు పత్తిని విక్రయిస్తే.. అప్పులే మిగులుతుండడంతో ఆవేదన చెందిన రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పంట కోసం పెట్టిన పెట్టుబడులు, చేసిన అప్పులు కళ్ల ముందే మెదిలి ఖమ్మం మార్కెట్ యార్డులో గొర్రెముచ్చు వెంకటి అనే రైతు గుండెపోటుతో మృతి చెందిన ఘటన పత్తి రైతు దయనీయ స్థితికి అద్దం పడుతోంది. తెలంగాణలో పత్తి పంట సాధారణ సాగు విస్తీర్ణం 15.32 లక్షల హెక్టార్లుకాగా.. ఈ ఏడాది 16.21 లక్షల హెక్టార్లలో సాగయింది. ప్రధానంగా ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ, ఖమ్మం, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాలో పత్తి అధికంగా సాగు చేశారు. వ్యాపారులతో కుమ్మక్కు.. 2004-07 మధ్య సీసీఐ పత్తి కొనుగోళ్లలో జరిగిన భారీ అక్రమాలపై ఇటీవల సీబీఐ దృష్టి సారించింది. తాజాగా సీసీఐ అధికారుల నివాసాలపై దాడులు చేసి కోట్ల రూపాయల నగదు, బంగారం స్వాధీనం చేసుకుంది కూడా. అయితే ఈ ఏడాది కూడా సీసీఐ పత్తి కొనుగోళ్లలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయి. సీసీఐ అధికారులు దళారులతో కుమ్మక్కై బినామీ రైతుల పేరుతో అక్రమ కొనుగోళ్లకు తెరలేపారు. రైతులు తెచ్చిన పత్తిలో తేమ అధికంగా ఉందంటూ కొనుగోళ్లకు తిరస్కరించిన సీసీఐ అధికారులు... అదే పత్తిని రైతుల నుంచి దళారులు కొనుగోలు చేసి తీసుకువస్తే కనీస మద్దతు ధర కట్టబెట్టారు. బినామీ రైతుల పేరుతో ఈ డబ్బులు చెల్లించారు. ఇలా ఒక్కో క్వింటాల్‌పై సుమారు రూ. 400 వరకు దళారులు, సీసీఐ అధికారులు కలిసి పంచుకున్నారు. మార్కెట్‌కు రైతులు తీసుకొస్తున్న పత్తిలో చాలా వరకు బ్రోకర్లే తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. రైతుల పేరిట బినామీ పట్టా పాస్‌బుక్, బ్యాంక్ ఖాతాలను సృష్టించి సీసీఐకి ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో సీసీఐ ఇప్పటివరకు 49.89 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసింది. ఇందులో సుమారు 30 శాతానికిపైగా పత్తి దళారుల వద్ద కొనుగోలు చేసినదేననే అంచనా. ఈ లెక్కన క్వింటాల్‌కు రూ.400 చొప్పున 15 లక్షల క్వింటాళ్లకు సుమారు రూ. 60 కోట్ల మేరకు సీసీఐ అధికారులు, దళారులు కలిసి దండుకున్నారనే ఆరోపణలున్నాయి. కరీంనగర్ జిల్లాలో సీసీఐ 25.64 లక్షల క్వింటాళ్లను కొనుగోలు చేయగా.. అందులో సుమారు 10 లక్షల క్వింటాళ్ల పత్తిని బినామీ రైతుల పేరిట వ్యాపారులే విక్రయించినట్లు ఆరోపణలున్నాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ దాదాపుగా ఇదే పరిస్థితి. పెట్టుబడికీ దిక్కులేదు.. ‘‘ప్రైవేటు అప్పు చేసి నాలుగున్నర ఎకరాల్లో పత్తి వేసిన. 90 వేల దాకా ఖర్చయింది. వానలు పడలె.. కరెంటు లేక పంటకు నీళ్లు అందలె. దానితోటి దిగుబడి ఎకరానికి నాలుగు క్వింటాళ్లు కూడా దాటలేదు. అప్పుకు అసలు, వడ్డీతో కలిపి లక్ష రూపాయలకు చేరింది. కానీ పత్తి అమ్మితే రూ. 70 వేలు కూడా రాలేదు. దీంతో నష్టమే మిగిలింది. ప్రభుత్వమే ఆదుకోవాలి..’’ - నర్సింగ్, బీంసారి, ఆదిలాబాద్ నష్టాలే మిగిలాయి.. ‘‘పదిహేను ఎకరాల్లో పత్తి సాగు చేసిన. వానలు పడక మొదటిసారి వేసిన విత్తనాలు మొలకెత్తలేదు. మరోసారి వేసుకోవాల్సి వచ్చింది. అయినా కాలం లేక దిగుబడి సరిగా రాలేదు. గతేడాది 130 క్వింటాళ్ల దిగుబడి వస్తే... ఈ సారి 70 క్వింటాళ్లు కూడా రాలేదు. మూడు లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే రెండున్నర లక్షలు వచ్చినాయి. నష్టాలె మిగిలాయి.’’ - లస్మారెడ్డి, సుంకిడి, తలమడుగు వానల్లేక దెబ్బ పడ్డది.. ‘‘ఈ ఏడాది వర్షాలు సరిగా పడక పంట దిగుబడి బాగా తగ్గింది. ఎకరాకు 5 క్వింటాళ్లకు మించలేదు. కాలం సరిగా కాకపోవడంతో మూడు సార్లు విత్తనాలు వేయాల్సి వచ్చింది. తగ్గిన దిగుబడితో కనీసం పెట్టుబడి కూడా పూడలేదు. రెండు ఎకరాలు సాగుచేస్తే 15 బస్తాల దిగుబడి వచ్చింది. క్వింటాల్‌కు రూ. 3,500 మాత్రమే ధర పెట్టారు.’’ - చవగాని వెంకటరామయ్య, రాయగూడెం, ఖమ్మం జిల్లా వ్యాపారుల సరుకే కొన్నారు.. ‘‘ప్రభుత్వం పత్తి కొనుగోలుకు సీసీఐ కేంద్రాన్ని ఏర్పాటు చేసినా... రైతులకు ఎంత మాత్రం ఉపయోగపడ లేదు. వ్యాపారులు రైతుల దగ్గర పత్తిని రూ. 3,300 నుంచి రూ. 3,600 దాకా కొని.. దానిని సీసీఐ కేంద్రాల్లో రూ. 4,050 వరకు అమ్ముకుంటున్నారు. సీసీఐ కేంద్రాలతోటి వ్యాపారులే లాభపడుతున్నారు.’’ - పండుగ శేషాద్రి, ముష్టికుంట్ల, ఖమ్మం జిల్లా -
పత్తిపై కత్తి
-
పత్తి రైతు దగా..
‘ముందు దగా.. వెనుక దగా.. కుడి ఎడమల దగా దగా’ అన్న మహాకవి శ్రీశ్రీ మాటలు పత్తి రైతుల విషయంలో అచ్చుగుద్దినట్టు సరిపోతాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పత్తిని విక్రయించేందుకు బోరాలతో కొనుగోలు కేంద్రానికి వచ్చిన రైతులకు అడుగడుగునా అన్యాయమే జరుగుతోంది. సరుకు కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లిన దగ్గరి నుంచి, చెక్కు చేతికొచ్చే వరకు ప్రతి దశలోనూ రైతు జేబుకు చిల్లుపెడుతున్నారు. పత్తి లోడు వాహనం లోనికి ప్రవేశించాలంటే గేట్పాస్, పనిచేసే సిబ్బందికి, కాటా వేసిన ముఠాకు ఎంతో కొంత డబ్బు ముట్టజెప్పాల్సిందే. ఇవన్నీ చాలవన్నట్లు బయ్యర్ పాసింగ్ చేసే సమయంలో నాణ్యత సాకుచూపి ఒక్కో బోరానికి నాలుగు నుంచి ఆరు కేజీల వరకు తగ్గించేస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే సరుకు కొనుగోలు చేయకుండా తిరస్కరిస్తున్నారు. ఈ ప్రక్రియలన్నీ ముగిసి, బిల్లు మంజూరైనా చేయి తడపనిదే చెక్కు రైతు చేతికి రావడం లేదు. ఈ అవకతవకల కారణంగా సీసీఐ కొనుగోలు కేంద్రానికి వెళ్లాలంటే రైతులు వెనకడుగు వేస్తున్నారు. చిలకలూరిపేటరూరల్ : పుడమితల్లినే నమ్ముకుని పత్తి పండించే కర్షకులు అడుగడుగునా దగాపడుతున్నారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పత్తి రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన ధరను అందిస్తామన్న నేతల హామీలు అమలులో పూర్తిగా విఫలమయ్యారుు. సాక్షాత్తు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట ప్రారంభించిన సీసీఐ కొనుగోలు కేంద్రంలోనే సీసీఐ సిబ్బంది, యార్డు ఉద్యోగులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. రైతులు తీసుకువచ్చిన పత్తిలో నాణ్యత లోపించిందని, నెమ్ము ఉందని బోరాల్లో కొంత పత్తిని తీసి లెస్‌లు విధిస్తున్నారు. ప్రశ్నించిన రైతులను బ్లాక్‌లిస్టులో (విక్రయానికి తీసుకువచ్చిన పత్తిని తిరస్కరిస్తున్నారు) చేరుస్తున్నారు. ఈ తలనొప్పుల కారణంగా సీసీఐ కేంద్రాలకు రాకుండా గ్రామాల్లోనే అందినకాడికి సరుకు అమ్మేసుకుంటున్నారు. కొనుగోళ్లు నాలుగో వంతే.. చిలకలూరిపేట, నాదెండ్ల, యడ్లపాడు మూడు మండలాల్లో రైతులు అధికశాతం 52,890 ఎకరాల్లో పత్తిని సాగు చేస్తున్నారు. ఈ పంట నుంచి ఎకరాకు పది క్వింటాళ్ల చొప్పున 5,28,900 క్వింటాళ్ల దిగుబడి లభిస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. వీటి ప్రకారం ఇప్పటికే నాలుగో వంతు, అంటే 1,32,225 క్వింటాళ్ల దిగుబడి లభించింది. కానీ ఇప్పటి వరకు చిలకలూరిపేట కొనుగోలు కేంద్రంలో 32,000 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. పత్తిదిగుబడి ప్రారంభంలో కొద్దిపాటి వర్షాలు పడ్డాయి. నాటి నుంచి పత్తిలో తేమ శాతం ఆధారంగా కొనుగోలు చేస్తామని అధికారులు ప్రకటించారు. పత్తి పింజ పొడవు 29.5 నుంచి 30.5 ఉండి, తేమశాతం(మైక్రోనైర్) 3.5 నుంచి 4.3గా ఉన్న పత్తికి ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధర రూ.4,050కు కొనుగోలు చేస్తామన్నారు. పింజ పొడవు 27.5 నుంచి 28.5, తేమ శాతం 3.5 నుంచి 4.7 ఉన్న పత్తిని రూ.3,950 అందిస్తామన్నారు. సీసీఐ ప్రకటనలతో హర్షించిన రైతులు అంతా నిజమేనని నమ్మారు. తీరా కేంద్రాల్లో ఆశించిన స్థారుులో చెల్లింపులు లేవు. లేని పోని కారణాలతో వేధిస్తూనే ఉన్నారు. పాసింగ్కు ముందు.. తర్వాత.. సరుకు లోనికి ప్రవేశించాలంటే గేట్పాస్ పేరిట వాచ్మెన్ ఆటోకి రూ.100, ట్రాక్టర్‌కి రూ.200 వసూలు చేస్తున్నారు. అక్కడ పనిచేసే సిబ్బంది బోరానికి రూ.40 చొప్పున గుంజుతున్నారు. ఒక పత్తి బోరెం కాటా వేస్తే రూ.5, యార్డుకు రూ.5, ముఠాకు మరో రూ.5 చెల్లించాల్సి వస్తోంది. బయ్యర్ పాసింగ్ చేసే సమయంలో పత్తిలో తేమశాతం అధికంగా ఉందని, గుడ్డికాయ ఎక్కువగా ఉందని, పత్తి పింజ పొడవు తగ్గిందని తదితర కారణాలు చూపుతూ ఒక్కో బోరెం నుంచి నాలుగు నుంచి ఆరు కేజీల వరకు లెస్ చేస్తున్నారు. అది కూడా ప్రతి బోరెం నుంచి పత్తిని తీయకుండా ఒక రైతుకు ఒక బోరెం నుంచి ఆ మొత్తాన్ని తీస్తున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం విక్రయించిన పత్తి తాలూకు బిల్లు మంజూరు అయ్యేందుకు మరో ఇరవై రోజులు పడుతుంది. ఈ సమయంలో రైతుల పేరుతో చెక్కు రాసినందుకు రూ.50 అదనంగా చెల్లించాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. వీటితో పాటు కొనుగోలు కేంద్రానికి వచ్చే ముందు అనేక పత్రాలను మార్కెట్ యార్డులో అందించాల్సి వ స్తోందని పేర్కొంటున్నారు. జిల్లా అధికారులు స్పందించి సీసీఐ కొనుగోళ్ల తీరును పర్యవేక్షించాలని రైతులు కోరుతున్నారు. నాణ్యతలేని బోరాల్లో రెండు కేజీలు తీస్తున్నాం.. మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సక్రమంగానే ఉన్నాయి. రైతులు తీసుకువచ్చిన పత్తిలో నాణ్యత లోపిస్తే తిరస్కరిస్తున్నాం. రైతులు తిరిగి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గుర్తించిన బోరెం నుంచి రెండు కేజీలు లెస్ చేస్తున్నాం. - వీరబాబు, సీసీఐ బయ్యర్, చిలకలూరిపేట. -
ఇష్టమైతే అమ్మండి.. లేదంటే మీ ఇష్టం
మేమిచ్చేదింతే..! గజ్వేల్: మేమిచ్చే ధర ఇది... ఇష్టమైతే అమ్మండి.. లేదంటే మీ ఇష్టం...అంటూ వ్యాపారులంతా ఒక్కటై రైతన్నలను దగా చేసేందుకు ప్లాన్ వేశారు. అంతేకాకుండా ఏకంగా పత్తి కొనుగోళ్లను నిలిపివేయడంతో అన్నదాతలు ఆగ్రహించారు. వెంటనే కొనుగోళ్లను చేపట్టడంతో పాటు గతంలో ఇచ్చిన ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఈ ఘటన గురువారం గజ్వేల్ మార్కెట్ యార్డులో ఉద్రిక్తతకు దారి తీసింది. పత్తి రైతులు రోజూలాగే గజ్వేల్ యార్డుకు పత్తిని తీసుకొని వచ్చారు. కానీ యార్డులో వ్యాపారులు దుకాణాలు తెరిచినా, కొనుగోళ్లు చేయకుండా కూర్చుండిపోయారు. రైతులు ఆరా తీస్తే ‘‘పత్తి ధర బాగా పడిపోయింది...మేం చెప్పిన ధరకైతే కొనుగోలు చేస్తం...లేదంటూ మీ ఇష్టం’’ అంటూ చేతులెత్తేశారు. నిజానికి నిన్నటి వరకు క్వింటాలు పత్తికి రూ.3,700 నుంచి రూ.3,900 వరకు చెల్లించిన వ్యాపారులు గురువారం మాత్రం రూ.3000 నుంచి రూ.3500 మాత్రమే చెల్లిస్తామని తెగేసి చెప్పారు. దీంతో ఆగ్రహించిన రైతులు యార్డు పక్కనే ఉన్న గజ్వేల్-తూప్రాన్ రహదారిపై బైఠాయించి ట్రేడర్ల తీరుపై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల రాస్తారోకో కారణంగా రాకపోకలకు 40 నిమిషాలకు అంతరాయం కలిగింది. రైతుల ఆందోళనకు గజ్వేల్ మాజీ జెడ్పీటీసీ బొల్లారం ఎల్లయ్య కూడా మద్దతు పలికారు. విషయం సమాచారం తెలుసుకున్న గజ్వేల్ ఎస్ఐ జార్జి సంఘటనాస్థలానికి చేరుకుని రైతులను సముదాయించారు. యార్డులో కొనుగోళ్లు జరిగేలా అధికారులతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. అనంతరం రైతుల ఆందోళన విరమింపజేసి వారితో కలిసి యార్డుకు వెళ్లారు. మార్కెట్ కమిటీ సూపర్వైజర్ వీర్శెట్టి, ఇతర వ్యాపారులతో మాట్లాడారు. పత్తి కొనుగోళ్లను నిన్నటి మొన్నటిలాగే క్వింటాలుకు రూ.3,700 పైగా చెల్లించాలని సూచించారు. దీంతో వ్యాపారులు లావాదేవీలు ప్రారంభించడంతో వివాదం సద్దుమణిగింది. ఇదిలా ఉండగా.. రైతులు తెస్తున్న పత్తిలో తేమ శాతం ఎక్కువగాఉండటం వల్ల ధర ఎక్కువ చెల్లించలేమని వ్యాపారులు వాదించడం గమనార్హం. ఇష్టమొచ్చినట్లు చేస్తుండ్రు.. కూలోళ్లకు ఇయ్యనీకి పైసల్లేక మూడు క్వింటాళ్ల పత్తి అమ్ముదామని ఈడికి వచ్చిన. సేట్లు ఇష్టమొచ్చినట్లు చేస్తుండ్రు. ముందుగల్ల అసలే పత్తి కొనుగోలు జేయమన్నరు. కొందరు మేం చెప్పిన రేటుకు ఇస్తే కొంటమన్నారు. గిదేం పద్ధతి..? కష్టం చేసుకొని బతికే రైతులను ముంచుతరా..? ఇప్పటికైన ఈడ కొనుగోళ్లు సరిగా జరిగేటట్టు సూడాలె. -తలకొక్కుల సత్యనారాయణ, రైతు, తిమ్మాపూర్, జగదేవ్‌పూర్ మండలం మస్తు దుఃఖమొస్తుంది ఆరుగాలం కష్టపడి పంట పండించిన పత్తిని ఇక్కడికి తెస్తే ధర సరిగా వస్తలేదు. సేట్లు సక్రమంగా కొనక సతాయిస్తుండ్రు. ఇవన్నీ జూస్తే మస్తు దుఃఖమొస్తుంది. ఇప్పటికైనా గజ్వేల్ యార్డులో పత్తి తేంగానే కిరికిరి పెట్టకుండా కొనేటట్టు చేయాలె. -బ్యాగరి శ్రీను, రైతు, రాయపోల్, దౌల్తాబాద్ మండలం 11జీజేడబ్ల్యూ01, 01ఎః గజ్వేల్‌లో వ్యాపారులు తీరుకు నిరసనగా పత్తి రైతుల రాస్తారోకో దృశ్యం. 11జీజేడబ్ల్యూ01బీ, 01సీః గజ్వేల్ యార్డులో పత్తి క్రయవిక్రయాలు నిలిచిపోయిన దృశ్యం. 11జీజేడబ్ల్యూ01డీః తలకొక్కుల సత్యనారాయణ. 11జీజేడబ్ల్యూ01ఈః బ్యాగరి శ్రీను. -
తెల్ల బంగారానికి తెగుళ్ల దెబ్బ
ఆకాశాన్నంటిన ఎరువులు, క్రిమిసంహారక మందులతో సతమతమవుతున్న పత్తి రైతుకు పిండి నల్లి, ఇతర తెగుళ్లు కూడా భయపెడుతున్నాయి. ఇప్పటి వరకు పత్తి పంటకు దాదాపు రూ.15 నుంచి రూ.20వేల వరకు పెట్టుబడి పెట్టారు. తీరా కాయ దశకు చేరుకునే సమయంలో తెగుళ్లు ఆశించడంతో దిగులు పట్టుకుంది. గిద్దలూరు సబ్ డివిజన్ పరిధిలోని నాలుగు మండలాల్లో దాదాపు 10,500 హెక్టార్లలో పత్తి పంట సాగుచేశారు. పంట సాగుచేసినప్పటి నుంచి పత్తి రైతులను ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది. పది రోజుల కిందటి వరకు వర్షాభావ పరిస్థితులతో పంట ఎదుగుదల లేక దిగుబడి తగ్గింది. అనంతరం కురిసిన వర్షాలతో కలుపు మొక్కలు పెరిగి పెట్టుబడి భారం పెరిగింది. వర్షం నిలిచిపోయిన తరుణంలో తిరిగి పత్తి పంటకు దోమ పోటు, పిండినల్లి సమస్య తీవ్రమైంది. ఎన్ని రకాల మందులు పిచికారీ చేసినా ఉధృతి తగ్గడం లేదని రైతులు తెలిపారు. ఈ ఏడాది పత్తి పంట దిగుబడి సగానికిపైగా పడిపోయే పరిస్థితి ఏర్పడింది. తెగుళ్లతో మొక్క పెరుగుదల నిలిచిపోయి వచ్చిన పూత, పిందెలు రాలిపోతున్నాయి. నివారణకు ఇవీ సూచనలు : పచ్చదోమ నివారణకు థయోమితాక్జిన్ లేదా, ఎసిటమిప్రైడ్ మందుల్లో ఏదో ఒకదానిని లీటరు నీటిలో 0.2 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. ఇమిడాక్లోప్రిడ్‌ను 10 లీటరు నీటికి 6 నుంచి 10 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేస్తే నివారించవచ్చని వ్యవసాయ అధికారి జి.మీరయ్య సూచించారు. పిండి నల్లి నివారణకు లీటరు నీటికి 3 మిల్లీలీటర్ల ప్రొఫెనోపాస్ మందును కలిపి పిచికారీ చేస్తే పూర్తిగా నివారించవచ్చన్నారు. ఆకులు ఎర్రగా మారినట్లు కనిపిస్తే అందుకు కిలో మెగ్నీషియం సల్ఫేట్‌ను పిచికారీ చేయాలన్నారు. -
పత్తి రైతుల సమస్యలు పరిష్కరించండి
కేంద్రమంత్రికి టీ కాటన్ మిల్లర్స్, ట్రేడర్స్ అసోసియేషన్ వినతి సాక్షి, న్యూఢిల్లీ: పత్తి కొనుగోళ్లలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ కాటన్ మిల్లర్స్, ట్రేడ ర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కేంద్ర చేనేత శాఖ మంత్రి సంతోష్ గంగ్వర్‌కి వినతిపత్రాన్ని సమర్పించారు. గుర్గావ్లో శనివారం నిర్వహించిన ఎన్ఐసీఏ(నార్త్ ఇండియా కాటన్ కార్పొరేషన్) సదస్సులో పాల్గొన్న కేంద్ర మంత్రిని అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం కలసింది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ద్వారా పత్తి సేకరణకు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, మద్దతు ధర చెల్లించడం వంటి అంశాల్లోని లోపాలను వారు మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు కేంద్రమంత్రులు రాధామోహన్‌సింగ్, బండారు దత్తాత్రేయ, నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ఈనెల 11న ఓ సమావేశాన్ని నిర్వహించామని, మరోసారి ఈనెల 17 సమావేశం కానున్నామని మంత్రి చెప్పినట్టు ప్రతినిధి బృందం వెల్లడించింది. -
తెలంగాణలో 113 పత్తి కొనుగోలు కేంద్రాలు పెంపు
న్యూఢిల్లీ: తెలంగాణలో 113 పత్తి కొనుగోలు కేంద్రాలు పెంచుతామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ హామీ చెప్పారు. కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్‌తో బుధవారం దత్తాత్రేయ సమావేశమయ్యారు. వీరితో పాటు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, గంగ్వార్ కూడా పాల్గొన్నారు. నలుగురు మంత్రులు తెలంగాణలో పత్తి రైతుల సమస్యలపై చర్చించారు. పత్తిలో తేమ ఎక్కువగా ఉన్నా కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేస్తామని రాధా మోహన్ సింగ్ తెలిపారు. పత్తి కొనుగోలులో ఎదురవుతున్న సమస్యల గురించి చర్చించామని చెప్పారు. దళారుల ప్రమేయం లేకుండా చర్చలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
పత్తి రైతుల సమస్యలను పరిష్కరిస్తాం: దత్తాత్రేయ
న్యూఢిల్లీ: పత్తి రైతుల సమస్యలను పరిష్కరిస్తామని కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) బండారు దత్తాత్రేయ అన్నారు. కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్‌తో బుధవారం దత్తాత్రేయ సమావేశమయ్యారు. వీరితో పాటు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, గంగ్వార్ కూడా పాల్గొన్నారు. నలుగురు మంత్రులు తెలంగాణలో పత్తి రైతుల సమస్యలపై చర్చించారు. -
పేరుకే కేంద్రం.. కొనుగోళ్లు శూన్యం
గజ్వేల్: పత్తి రైతుకు వెన్నుదన్నుగా నిలవాల్సిన సీసీఐ (కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా) కొనుగోళ్లలో చొరవ చూపడం లేదు. ఉత్పత్తులు మార్కెట్లోకి రావడం ఊపందుకున్నా, ఏదో కొన్నామంటే కొన్నామంటూ కేంద్రాలను నామమాత్రంగా నడిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే సీసీఐ ఇప్పటివరకు జిల్లాలో 1,327 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయగలిగింది. ఇదే అదనుగా భావించిన వ్యాపారులు రైతుల వద్ద మద్దతు ధర కంటే తక్కువగా రూ.3,300 నుంచి రూ. 3,700 పత్తిని కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే వేలాది క్వింటాళ్ల పత్తిని పక్కరాష్ట్రానికి తరలించి దండుకుంటున్నారు. తాము దగా పడుతున్నామని తెలిసి కూడా రైతన్నలు విధిలేని పరిస్థితుల్లో దళారులు ఇచ్చింది తీసుకుని ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అప్పగిస్తున్నారు. ‘మద్దతు’ ఇవ్వని సీసీఐ జిల్లాలో ఈసారి 1.25 లక్షల హెక్టార్లలో పత్తి సాగైంది. పరిస్థితులు కలిసి వస్తే సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా దిగుబడులు వచ్చే అవకాశముండేది. కానీ ఈసారి తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల అంతా తారుమారైంది. వర్షాభావం, కరెంటు కోతలతో సరిగా నీరందక దిగుబడిలో సగానికి సగం తగ్గింది. మరోవైపు చేతికందిన పంటకు కూడా మద్దతు ధర దక్కకపోవడం రైతులను కుంగదీస్తోంది. పత్తి రైతుకు మద్దతు కల్పించేందుకు జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట, తొగుట, జోగిపేట, జహీరాబాద్, వట్పల్లి, సదాశివపేటల్లో సీసీఐ(కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా) కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో ఇప్పటివరకు గజ్వేల్, సిద్దిపేట, జహీరాబాద్, జోగిపేట కేంద్రాలు మాత్రమే తెరిచారు. వీటిన్నంటిలో కలిపి ఇప్పటి వరకు మొత్తం 1,327 క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేశారు. ఇందులోనూ అత్యల్పంగా సిద్దిపేట సెంటర్లో కేవలం 32 క్వింటాళ్లు మాత్రమే అధికారులు కొనుగోలు చేశారు. ఇక గజ్వేల్‌లో సెప్టెంబర్ 20న కేంద్రం ప్రారంభమైతే, వాతావరణ ప్రతికూల పరిస్థితులు, సెలవుల కారణంతో ఐదంటే ఐదు రోజులే కొనుగోళ్లు జరిగాయి. దీంతో ఈ సెంటర్ నుంచి సీసీఐ 246 క్వింటాళ్ల పత్తిని రైతులనుంచి కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించడం అనివార్యంగా మారింది. దళారుల దందా మార్కెట్లోకి వస్తున్న పత్తిని అంచనా వేస్తున్న దళారులు సీసీఐ కంటే రెట్టింపు స్థాయిలో కొనుగోళ్లు జరిపారు. అయితే రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని రూ.3,300 నుంచి రూ.3,600 మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో ప్రభుత్వం ప్రకటించిన రూ. 3,750-రూ.4,050 మద్దతు ధర కూడా రైతులకు దక్కడం లేదు. గజ్వేల్‌లో ఇప్పటివరకు ప్రైవేట్ వ్యాపారులు సుమారు 500 క్వింటాళ్లకుపైగా పత్తిని కొనుగోలు చేశారు. గుజరాత్, మహారాష్ట్రలలో తెల్లబంగారానికి అధిక ధర పలుకుతుండడంతో వ్యాపారులంతా ఇక్కడ రైతులవద్ద తక్కువ ధరకు కొన్న పత్తిని పొరుగు రాష్ట్రాలకు తరలిస్తూ దండుకుంటున్నారు. ఈ లెక్కన ఒక్క గజ్వేల్ ప్రాంతంలోనే ధర రూపేణా రైతులు ఇప్పటికే లక్షల్లో నష్టపోయారు. జిల్లా అంతటా ఇదే పరిస్థితి నెలకొంది. -
పత్తి రైతు కంటతడి
జమ్మికుంట : వర్షాభావం... కరెంటు కోతలు పత్తి రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. తెగుళ్లు దిగుబడిపై ప్రభావం చూపుతున్నాయి. గిట్టుబాటు దేవుడెరుగు... పెట్టుబడి కూడా చేతికొచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. జిల్లాలో సాధారణ పత్తి సాగు విస్తీర్ణం 6లక్షల ఎకరాలు కాగా, వర్షాభావ పరిస్థితులతో 5.50లక్షల ఎకరాల్లో మాత్ర మే సాగయింది. ఖరీఫ్ ప్రారంభంలో అడపాదడపా కురిసినవానలకు రైతులు విత్తనాలు వేయ గా అప్పటి నుంచి వర్షాలు ముఖం చాటేశాయి. వర్షాధారంపై సాగు చేసిన పత్తికి నీళ్లందక ఎర్ర బొమ్మిడి తెగులు సోకింది. కాయదశలోనే మొక్కలు ఎండిపోయాయి. బావులు, బోర్ల కింద పత్తివేసిన రైతుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. కరెంటు కోతలు పెరగడంతో బావుల్లో నీళ్లున్నా.. వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా ఎకరాకు 8నుంచి 10 క్విం టాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉండగా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో 3 నుంచి 4 క్వింటాళ్లు కూడా చేతికి రావడం లేదని రైతులు వాపోతున్నారు. దీంతో కనీసం పెట్టుబడి కూడా చేతికి వచ్చే అవకాశం కనిపించడం లేదంటున్నారు. ఎండిపోతున్న పత్తి చేలలో చేతికి వచ్చిన పత్తిని ఏరుతూ రైతులు కంటనీరు పెడుతున్నారు. ఎవుసాన్ని నమ్ముకుంటే ఏటా అప్పులే మిగులుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. దక్కని మద్దతు ధర పత్తికి మద్దతు ధర క్వింటాల్‌కు రూ.4,050 కాగా, మొన్నటిదాకా రూ.3000 నుంచి రూ.3500 లోపే పలికింది. ప్రస్తుతం పత్తి ధరలు నిలకడగా పెరుగుతూ రూ.4000 వేలకు చేరుకున్నాయి. సాగుకోసం ఇప్పటివరకు ఎకరాకు రూ.20 వేల పెట్టుబడి కాగా, దిగుబడి ప్రకారం చూస్తే నష్టాలే మిగలుతున్నాయి. కౌలు రైతుల పరిస్థితైతి మరీ దారుణంగా ఉంది. సాగు చేసిన నష్టంతోపాటు కౌలుగా ఎకరాకు రూ.5 నుంచి రూ.10 వేల వరకు అదనంగా నష్టపోయే పరిస్థితి నెలకొంది. ఈ అప్పులెలా తీర్చాలని వారంతా ఆందోళన చెందుతున్నారు. కరెంటు కోతలు దెబ్బతీసినయ్.. నాకున్న రెండెకరాల్లో పత్తి వేసిన. వానల్లేక ఎండిపోవట్టిం ది. కరెంటు మోటారు పెడుదామంటే బాయిల నీళ్లున్న యి గానీ.. కరెంటు లేకపాయే.. వానల్లేకున్నా.. బాయిని నమ్ముకుని పత్తి పెడితే.. కరెంటు కోతలు దెబ్బదీసినయి. అక్కడక్కడ కొన్ని కాయలు.. ఎండలకు పగిలినయి. కూలీలను పెట్టి ఏరిపిద్దామంటే ఖర్చులు కూడా ఎల్లయి. నా భార్య, నేను పొద్దంతా ఏరితే నాలుగు బస్తాలు చేతికి రాలేదు. కరెంటు ఉంటే కనీసం పెట్టుబడి అయినా వచ్చేది. - పొనగంటి సంపత్, మోత్కులగూడెం, జమ్మికుంట కూలీ ఖర్చులు కూడా రావు.. నేను రెండెకరాల పత్తి పెట్టిన. వానల్లేక చేనంతా దెబ్బతిన్నది. పూతరాలిపోయి కాయలే పడలేదు. ఉన్నదంతా ఏరితే.. నాలుగు కింటాళ్లు కూడా వచ్చేటట్టు లేదు. చేను దిక్కు రావాలంటే కాలు కదుల్తలేదు. మొత్తం పెట్టుబడి యాభై వేల దాకా అయ్యింది. ఏరిన పత్తిని అమ్మితే కూలి డబ్బులు కూడా వస్తాయో రావో. ఎప్పుడూ గింత లాస్ కాలేదు. ఇప్పుడు ఏం చేయాల్నో ఏం అర్థమైతలేదు. - సుదర్శన్, మోత్కులగూడెం, జమ్మికుంట -
పత్తి కొనుగోలుపై తీవ్ర ఉత్కంఠ
ఆదిలాబాద్:పత్తిరైతుల దీనస్థితిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. పండిన పంటకు గిట్టుబాటు ధర రాక విలవిల్లాడుతున్నాడు. పత్తిరైతు అననుకూల వాతావరణ పరిస్థితులు తట్టుకుని సాగుచేసినా వచ్చిన దిగుబడిని అమ్ముకునేందుకు మార్కెట్ సౌకర్యం లేక తీవ్రంగా నష్టపోతున్నాడు. జిల్లాలో పత్తి కొనుగోలు తొలిరోజే ఉత్కంఠ పరిస్థితులకు దారితీసింది. ఆదివారం పత్తి కొనుగోలుకు వచ్చిన సీసీఐ(కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా) అధికారులు ఆంక్షలు పెట్టడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తిలో 12 శాతం తేమ మించితే కొనుగోలు చేయలేమని సీసీఐ అధికారులు తేల్చిచెప్పడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పత్తి కొనుగోలుకు ప్రయివేటు వ్యాపారులు కూడా ఆసక్తి చూపకపోవడంతో రైతలు తీవ్ర డైలామాలో పడ్డారు. ఇంకా పత్తికొనుగోలు ప్రారంభం కాకపోవడంతో రైతులు సీసీఐ అధికారులను దిగ్భందించి నిరసన చేపట్టారు. -
పత్తికి గిట్టుబాటు ధర కల్పించాలి
తెలంగాణ వైఎస్సార్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి హైదరాబాద్ : పత్తిరైతులను కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని తెలంగాణ వైఎస్సార్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. పత్తి పంటకు గిట్టుబాటుధర కల్పించాలని, పత్తిరైతులు ఆత్మహత్యలకు పాల్పడకుండా ప్రభుత్వాలు వెన్నుదన్నుగా నిలవాలని ఆయన కోరారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు జనక్‌ప్రసాద్‌తో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కాటన్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం ఇప్పటివరకు కొనుగోళ్లు మొదలుపెట్టలేదన్నారు. ప్రభుత్వం క్విటాల్‌కు రూ.4,050 ధర ఇస్తోందని, ఇది ఎంతమాత్రం గిట్టుబాటు కాదన్నారు. దళారులు రూ. మూడు వేలు మాత్రమే ధర చెల్లిస్తున్నారన్నారు. ఇటువంటి విషమ పరిస్థితులు కొనసాగితే రైతుల ఆత్మహత్యలు తప్పవన్నారు. దివగంత మహానేత వైఎస్సార్ సీఎంగా ఉన్నపుడు పత్తి క్వింటాల్‌కు రూ.7వేలు ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. ఖర్చుకు ఒకటిన్నరరెట్లుండాలి: స్వామినాథన్ కమిషన్ నివేదిక ప్రకారం, పంటకు ఖర్చుపెట్టిన దానిపై కనీసం ఒకటిన్నర రెట్లు గిట్టుబాటుధరలు ఉండాలని జనక్‌ప్రసాద్ అన్నారు. ప్రస్తుతం క్వింటాల్ పత్తి కోసం పెట్టుబడి ఖర్చు రూ.5,200 అవుతుందని, ఈ విధంగా గిట్టుబాటుధర వచ్చే విధంగా పత్తి రైతులను ఆదుకోవాలని కోరారు. ఖర్చులు, కొనుగోళ్లలో రైతులు లాభపడేలా చూడాలన్నారు. పత్తి ఎగుమతులకు అనుమతులు ఇస్తామని ప్రధాని మోడీ చెప్పారని, అది అమలు జరిగేలా చూడాలన్నారు. ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చేందుకు పాలకపక్షాలు కృషి చేయాల న్నారు. కాగా, ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు ఏపీలోని విశాఖతో పాటు ఉభయగోదావరి జిల్లా లు, ఇతర తుఫానుప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల ను ఆదుకోవడానికి తెంగాణ వైఎస్సార్సీపీ శక్తివంచన లేకుండా కృషిచేస్తుందని పొంగులేటి, జనక్‌ప్రసాద్‌లు చె ప్పారు. -
ప్రభుత్వం పత్తిరైతును ఆదుకోవాలి: పొంగులేటి
హైదరాబాద్: పత్తి కొనుగోలు చేయకపోవడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పత్తి సాగు 17 లక్షల ఎకరాలు ఉందని, కాని పత్తి కొనుగోలు కేంద్రాలను ఇప్పటి వరకు ప్రారంభించలేదని పొంగులేటి అన్నారు. కనీస మద్దతు ధర 4050 రూపాయలకు కూడా కొనుగోలు చేయడం లేదని పొంగులేటి ఆవేదన వ్యక్తం చేశారు. దళారులు 3 వేల రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలో పత్తి క్వింటాలకు 7200 రూపాయలకు కొనుగోలు చేసిందనే విషయాన్ని పొంగులేటి మీడియా దృష్టికి తీసుకువచ్చారు. నేడు కనీస మద్దతు ధర కూడా గిట్టుబాటు కావడం లేదన్నారు. పత్తి రైతును ఆదుకోవడానికి సీసీఐ, ఇతర సంస్థల ద్వారా కొనుగోలు చేపట్టాలని పొంగులేటి డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలో హుదూద్ ప్రళయం విషాదానే మిగిల్సిందని ఆయన తెలిపారు. ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు ఏపీలో కలిపిన ప్రాంతాల్లో త్వరలో పర్యటిస్తానన్నారు. ఖమ్మం జిల్లాలో జరిగిన నష్టాన్ని అంచనావేసి ప్రభుత్వానికి నివేదికనందిస్తామని ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. -
పత్తిరైతును ఆదుకోవాలి: పొంగులేటి
-
పత్తి రైతులూ జాగ్రత్త
ఖమ్మం వ్యవసాయం: ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ ఎం.వెంకట్రాములు, డాక్టర్ ఆర్. శ్రీనివాస్‌లు ఇటీవల చింతకాని మండలం పాతర్లపాడు, కోమట్లగూడెం గ్రామాల్లోని పత్తి చేలను పరిశీలించారు. వారికి కాండం మచ్చ తెగులు సోకిన పైర్లు కనిపించాయి. రెండేళ్లుగా ఈ తెగులు రాష్ట్రంలోని ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో అక్కడక్కడా కనిపించిందని, ఈ ఏడాది ఖమ్మం జిల్లాలోనూ కనిపిస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రైతులు ఈ తెగులు పట్ల అప్రమత్తంగా ఉండాలని, వెంటనే నివారణ చర్యలు చేపట్టకపోతే తీరని నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఈ తెగులు ప్రభావం ఉందని వారు చెబుతున్నారు. ఈ తెగులుపై వరంగల్, గుంటూరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాల్లో నిపుణులు పరిశోధనలు జరుపుతున్నారని చెప్పారు. వాతావరణంలో మార్పుల వల్లే ఇది వ్యాప్తి చెందుతోందని పేర్కొన్నారు. ఈ తెగులుతో పాటు ఆకుమచ్చ, పిండినల్లి, తామరపురుగుల ఉధృతి కూడా ఉందని అన్నారు. రైతులు అప్రమత్తంగా ఉండి సకాలంలో నివారణ చర్యలు చేపట్టాల్సిందిగా సూచించారు. కాండం మచ్చ తెగులు: ఈ తెగులు ఆశించినప్పుడు ప్రధాన కాండం చివర లేత చిగురు ఎండిపోయి విరిగి పోతుంది. తరువాత ముదురు కొమ్మలు, బెరడుపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడుతాయి. కొమ్మలు, కాండం పైనుంచి కిందకు ఎండుతాయి. ఈ తెగులు తెరపలు తెరపలుగా మొక్కల మీద ఆశించటం వలన అవి ఎండిపోతాయి. ఈ తె గులు ఆశించిన మొక్కల నుంచి పక్క మొక్కలకు వలయాకారంలో వ్యాప్తి చెందుతుంది. రైతులు ఈ లక్షణాలను గమనించి తగిన నివారణ చర్యలు తీసుకోవాలి. లీటర్ నీటిలో ప్రొపికొనజోల్ 1 మి.లీ కలిపి పిచికారీ చేయాలి. బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు వాతావరణం మబ్బులుపట్టి, ముసురు వర్షాలు పడినప్పుడు ఈ తెగులు ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడి ఆకులు పండుబారి రాలిపోతాయి. దీని నివారణకు కాపర్ ఆక్సీ క్లోరైడ్ 30 గ్రాములు, ఒక గ్రాము స్ట్రెప్టోసైక్లిన్ 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పిండినల్లి పిండిపురుగు పిల్ల, తల్లి పురుగులు కొమ్మలు, కాండం, మొగ్గలు, పువ్వులు, కాయల నుంచి రసాన్ని పీలుస్తాయి. ఈ పురుగు ఆశించిన మొక్కలు ఎదగక గిడసబారి పోతాయి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే మొక్కలు పూర్తిగా చనిపోయే ప్రమాదం ఉంది. ఈ పిండినల్లి కలుపు మొక్కలు అయిన వయ్యారిబామ (పార్థీనియం), తుత్తురబెండ వంటి వాటి మీద ఉంటుంది. కాబట్టి ఈ మొక్కలను తీసివేసి నాశనం చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే ప్రొఫేన్ఫాస్ లేదా మిథైల్ పెరాథియాన్ 3 మి.లీ లేదా ఎసిఫేట్ రెండు గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఈ మందులతో పాటు ట్యాంక్‌కు 10 గ్రాములు డిటర్జెంట్ సర్ఫ్‌ను కలిపి వాడాలి. తామరపురుగులు ఈ పురుగులు ఆకుల అడగు భాగాన చేరి రసం పీల్చటం వలన ఆకుల అంచులు పైకి ముడుచుకుంటాయి. దీని నివారణకు పిప్రోనిల్ 2 మి.లీ లేదా ఎసిఫేట్ 1 గ్రాము లీటర్ నీటిలో కలిపి ఆకుల అడుగు భాగం బాగా తడిసేటట్లు పిచికారీ చేయాలి. -
రైతన్నా మేలుకో.. పంటలను కాపాడుకో
* వ్యవసాయ క్షేత్రాలను సందర్శించిన శాస్త్రవేత్తలు * మొక్కజొన్న, పత్తికి ఆశించే తెగుళ్ల నివారణకు సలహాలు, సూచనలు * రోలింగ్ స్టెమ్ అప్లికేటర్ వాడకంపై అన్నదాతలకు అవగాహన సదాశివపేట: ఆరుతడి, వర్షాధార పంటలైన మొక్కజొన్న, పత్తి సాగులో చీడపీడల నివారణకు చర్యలు చేపట్టి ఎక్కువ దిగుబడులు సాధించవచ్చని సంగారెడ్డి ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ డాక్టర్. ఏ శ్రీనివాస్ 9989623819, శాస్త్రవేత్త డాక్టర్. ఎం శ్రీనివాస్ 9440512029 రైతులకు సూచించారు. మండల పరిధిలోని పలు గ్రామాల్లో రైతులు సాగు చేస్తున్న మొక్కజొన్న, పత్తి పంటలను గురువారం సందర్శించిన వీరు రైతులకు పలు సలహాలు, సూచనలు అందజేశారు. మొక్కజొన్నలో కాండం తొలిచే పురుగు... ప్రస్తుతం మొక్కజొన్న పంటల్లో కాండం తొలుచు పురుగు లక్షణాలు కనిపిస్తున్నాయని అధికారులు తెలిపారు మొవ్వులో చేరే కాండం తొలిచే, లద్దె పురుగులు లేత ఆకులను తింటాయని పేర్కొన్నారు. దీనివల్ల ఆకులపై వరుస క్రమంలో రంధ్రాలు ఏర్పడడంతో పాటు వాటి విసర్జితాలు కనిపిస్తాయన్నారు. మొవ్వను పట్టుకుని లాగినట్లయితే సులభంగా ఊడి వస్తుందని వివరించారు. వర్షాభావ పరిస్థితుల్లో దీని తీవ్రత అధికంగా ఉంటుందని సూచించారు. కాండం తొలుచు పురుగు నివారణకు కార్బోఫ్యురాన్ 3జీ గుళికలను ఇసుకలో కలుపుకుని మొవ్వులో పడే విధంగా వేయాలని తెలిపారు. పత్తి పంటలకు తెల్ల దోమ, పిండి నల్లి... పత్తి పంటలకు తెల్ల దోమ, తామర పురుగు, పిండినల్లి ఆశించినట్లు గుర్తించామని తెలిపారు. దీని నివారణకు లీటరు నీటిలో పావులీటర్ మోనోక్రొటోఫాస్ మందును లేదా ఐదు లీటర్ల నీటిలో కిలో ఇమిడాక్లోప్రిడ్ పౌడర్‌ను కలిపి కాండం లేత భాగంపై రుద్దాలని సూచించారు. పంట విత్తిన 20, 40, 60, 80 రోజుల దశలో మోనోక్రొటోఫాస్ మందును మొక్క కాండంపై పూస్తే రసం పీల్చే పురుగుల ఉధృతిని నివారించవచ్చని సూచించారు. ఇలా చేస్తే పంటపై పురుగు మందును పిచికారీ చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ విధానంతో మిత్ర పురుగులు, వాతావరణానికి ఎలాంటి కీడు జరగదని చెప్పారు. పత్తి మొక్కపై మందును పూయడానికి ‘కృషి విజ్ఞాన్ కేంద్రం వైరా’ వారి సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన రోలింగ్ స్టెమ్ అప్లికేటర్‌ను వినియోగించి తక్కువ శారీరక శ్రమతో పని పూర్తి చేయవచ్చని వివరించారు. ఈ పరికరం అవసరమైన రైతులు సంగారెడ్డిలోని ఏరువాక కేంద్రంలో సంప్రదించాలని తెలి పారు. రోలింగ్ స్టిమ్ అప్లికేటర్ వినియోగించే విధానాన్ని క్షే త్ర స్థాయిలో రైతులకు ప్రదర్శించి చూపించారు. వర్షాభావ పరిస్థితుల్లో నేలలో తగినంత తేమ లేని పక్షంలో 0.2 శాతం యూరియా (2 గ్రాములు) లీటర్ నీటికి కలిపి అన్ని పం టలపై పిచికారీ చేయవచ్చని సూచించారు. ఈ కార్యక్రమ ంలో మండల వ్యవసాయ అధికారి బాబునాయక్, ము నిపల్లి ఏఓ శివకుమార్, సదాశివపేట మండల వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రవీణ్‌కుమార్, శ్రీనివాస్, ఆత్మ బీటీఎం షేక్‌అహ్మద్, రైతులు పాల్గొన్నారు. -
మరో ప్రయత్నం
ఖమ్మం వ్యవసాయం: పత్తి రైతులు మరోసారి జీవన పోరాటానికి సిద్ధమవుతున్నారు. గత మే నెలలో అకాల వర్షాలు కురవడంతో దుక్కులు దున్ని జూన్ మొదటి, రెండో వారంలో పత్తి విత్తనాలు వేశారు. అయితే అప్పటినుంచి వరుణుడు ముఖం చాటేయడంతో ఆ విత్తనాలను బతికించుకోవడానికి నానా కష్టాలు పడ్డారు. కొందరు ట్యాంకర్లతో నీరు తెచ్చి పత్తి మొక్కలకు పోశారు. వీటిలో నల్లరేగడి నేలలో వేసినవిత్తనాలు కొంతమేర మొలకెత్తినా.. ఎర్ర, దుబ్బ నేలల్లో వేసిన విత్తనాలు ఎందుకూ పనికిరాకుండా పోయాయి. కా గా, ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గతంలో వేసిన భూములను మళ్లీ దున్ని, కొత్త విత్తనాలు వేస్తున్నారు. రెండుసార్లు విత్తనాలు వేయాల్సి రావడంతో ఖర్చు రెట్టింపయినా వారు వెనుకాడడం లేదు. జిల్లాలో ప్రతి ఏడాది 1.52 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేస్తుంటారు. కాగా ఈ ఏడాది వ్యవసాయ శాఖ ప్రణాళిక ప్రకారం 1.90 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేసే అవకాశం ఉందని గుర్తించారు. అయితే జూన్‌లో దాదాపు లక్ష హెక్టార్లలో పత్తి విత్తనాలు వేశారు. వర్షాలు కురవక విత్తనాలు మొలకెత్తకపోవడంతో ప్రస్తుతం 70 వేల హెక్టార్లలో మరోసారి విత్తనాలు వేసి తమ భవిష్యత్తును పరీక్షించుకుంటున్నారు. తడిసి మోపెడవుతున్న ఖర్చులు... మొదటిసారి వేసిన విత్తనాలు మొలకెత్తకపోవడంతో ఇప్పుడు రైతులకు ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఒక్కో హెక్టారుకు దుక్కి దున్నడానికి రూ.4 వేలు, అచ్చు తోలడానికి రూ.500, విత్తనాలకు రూ.2 వేలు, అవి వేసే కూలీలకు రూ.7వేల వరకు ఖర్చు చేశారు. ఆ విత్తనాలు మొలకెత్తకపోవడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. గత ఐదు రోజులుగా వర్షాలు పడుతుండటంతో మళ్లీ అంత ఖర్చు చేసి విత్తనాలు వేస్తున్నారు. ఇప్పుడైనా వర్షాలు కురుస్తాయా.. లేక మళ్లీ నష్టం చవిచూడాల్సి వస్తుందా అని ఆందోళన చెందుతున్నారు. దిగుబడి తగ్గే ప్రమాదం... పత్తి సాగు ఆలస్యం కావడంతో దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని వ్యవసాయ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ సమయానికి పత్తి ఏపుగా పెరిగి పిందె స్థాయికి వచ్చేదని, ఈ ఏడాది వర్షాలు లేకపోవడంతో ఇంకా విత్తనాలు వేసే దశలోనే ఉండడంతో ఆ ప్రభావం దిగుబడిపై ఉంటుందని చెపుతున్నారు.