నిలువునా దగా... | Vertically dishonesty ... | Sakshi
Sakshi News home page

నిలువునా దగా...

Published Mon, Feb 16 2015 1:27 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

Vertically dishonesty ...

  • రాష్ట్రంలో పత్తి రైతుల దీన స్థితి
  • మద్దతు ధర ఇవ్వని సీసీఐ.. నిలువునా ముంచుతున్న వ్యాపారులు
  • వర్షాభావం కారణంగా బాగా తగ్గిపోయిన దిగుబడి
  • నాణ్యత లేదంటూ రూ. 250 వరకూ సీసీఐ కోత
  • దళారులతో కుమ్మక్కు.. బినామీ రైతుల పేరిట కొనుగోళ్లు
  • అధికారుల అండతో రెచ్చిపోయిన ప్రైవేటు వ్యాపారులు, దళారులు
  • ధరలో క్వింటాల్‌కు నాలుగైదు వందల వరకూ దోపిడీ
  • రైతుల పరిస్థితి అగమ్యగోచరం.. పెట్టుబడులూ దక్కని దుస్థితి
  • ఆవేదనతో ఆత్మహత్యకు పాల్పడుతున్న రైతులు
  • కొద్దినెలల్లోనే పదుల సంఖ్యలో బలవన్మరణాలు
  • సాక్షి, నెట్‌వర్క్: కాలం కలసిరాక ఒకటికి రెండు సార్లు వేసిన విత్తనాలతో పెట్టుబడి బాగా పెరిగింది. వానలు సరిగా కురవక పత్తి దిగుబడి తగ్గింది. ఆ కాస్త దిగుబడికీ మద్దతు ధర ఇవ్వకుండా సీసీఐ దెబ్బకొట్టింది. తేమ శాతం, పింజ పొడవు పేరిట నిలువునా ముంచింది. దళారులు, వ్యాపారులకు మాత్రం ‘సరైన’ ధర కట్టబెట్టింది. ఏదోలా అమ్ముకునే దుస్థితిని రైతుకు తెచ్చిపెట్టింది. తెగించి వ్యాపారులకు అమ్ముకున్న రైతులకు మాత్రం నిండా నష్టాలు, కష్టాలు, కన్నీళ్లే మిగిలాయి.  ప్రతీసారిలాగే ఈసారి కూడా పత్తి రైతు నిలువునా దోపిడీకి గురయ్యాడు. సీసీఐతో పాటు దళారులు, వ్యాపారులు కలసి పత్తి రైతును నిలువునా ముంచారు.

    రైతులకు అండగా నిలవాల్సిన సీసీఐ (భారత పత్తి సంస్థ) కూడా ధరలో అధికారికంగానే కోతపెట్టడం గమనార్హం. క్వింటాలుకు రూ.4,050 కనీస మద్దతు ధర ఇవ్వాల్సి ఉండగా... తేమ శాతం, స్టేఫుల్ లెన్త్ (పింజ పొడవు) తదితర నాణ్యతల పేరుతో సీసీఐ రూ. 3,800 చొప్పున మాత్రమే చెల్లిస్తోంది. అంతేకాదు తేమ పేరుతో కొద్దిరోజులు కొనుగోళ్లను సీసీఐ నిలిపివేయడంతో... రైతులు పత్తిని దళారులు, ప్రైవేటు వ్యాపారులకు విక్రయించాల్సి వచ్చింది. దీంతో వారు. రూ. 3,550 నుంచి రూ. 3,650 వరకే పత్తిని కొనుగోలు చేశారు. దాదాపుగా ఒక్కో క్వింటాల్‌పై నాలుగె దు వందల వరకు దండుకున్నారు.
     
    పెరిగిన భారం...

    ఖరీఫ్ ప్రారంభంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా పత్తి విత్తనాలు మొలకెత్తలేదు. దాంతో రెండు, మూడు సార్లు విత్తుకోవాల్సి వచ్చింది. దీనికి తోడు చుక్కలనంటిన ఎరువులు, పురుగు మందుల ధరలతో సాగు వ్యయం విపరీతంగా పెరిగింది. ఒక్కో ఎకరం పత్తి సాగుకు రైతులు వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది. కానీ వర్షాలు లేక దిగుబడి ఎకరానికి నాలుగైదు క్వింటాళ్లకు తగ్గిపోయింది. దీనికితోడు మద్దతు ధర దక్కక... రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. చేతికందిన పంటనంతా విక్రయిస్తే కనీసం పెట్టుబడి కూడా రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్కువ ధరకు పత్తిని విక్రయిస్తే.. అప్పులే మిగులుతుండడంతో ఆవేదన చెందిన రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పంట కోసం పెట్టిన పెట్టుబడులు, చేసిన అప్పులు కళ్ల ముందే మెదిలి ఖమ్మం మార్కెట్ యార్డులో గొర్రెముచ్చు వెంకటి అనే రైతు గుండెపోటుతో మృతి చెందిన ఘటన పత్తి రైతు దయనీయ స్థితికి అద్దం పడుతోంది. తెలంగాణలో పత్తి పంట సాధారణ సాగు విస్తీర్ణం 15.32 లక్షల హెక్టార్లుకాగా.. ఈ ఏడాది 16.21 లక్షల హెక్టార్లలో సాగయింది. ప్రధానంగా ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ, ఖమ్మం, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాలో పత్తి అధికంగా సాగు చేశారు.
     
    వ్యాపారులతో కుమ్మక్కు..

    2004-07 మధ్య సీసీఐ పత్తి కొనుగోళ్లలో జరిగిన భారీ అక్రమాలపై ఇటీవల సీబీఐ దృష్టి సారించింది. తాజాగా సీసీఐ అధికారుల నివాసాలపై దాడులు చేసి కోట్ల రూపాయల నగదు, బంగారం స్వాధీనం చేసుకుంది కూడా. అయితే ఈ ఏడాది కూడా సీసీఐ పత్తి కొనుగోళ్లలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయి. సీసీఐ అధికారులు దళారులతో కుమ్మక్కై బినామీ రైతుల పేరుతో అక్రమ కొనుగోళ్లకు తెరలేపారు. రైతులు తెచ్చిన పత్తిలో తేమ అధికంగా ఉందంటూ కొనుగోళ్లకు తిరస్కరించిన సీసీఐ అధికారులు... అదే పత్తిని రైతుల నుంచి దళారులు కొనుగోలు చేసి తీసుకువస్తే కనీస మద్దతు ధర కట్టబెట్టారు. బినామీ రైతుల పేరుతో ఈ డబ్బులు చెల్లించారు. ఇలా ఒక్కో క్వింటాల్‌పై సుమారు రూ. 400 వరకు దళారులు, సీసీఐ అధికారులు కలిసి పంచుకున్నారు. మార్కెట్‌కు రైతులు తీసుకొస్తున్న పత్తిలో చాలా వరకు బ్రోకర్లే తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. రైతుల పేరిట బినామీ పట్టా పాస్‌బుక్, బ్యాంక్ ఖాతాలను సృష్టించి సీసీఐకి ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో సీసీఐ ఇప్పటివరకు 49.89 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసింది. ఇందులో సుమారు 30 శాతానికిపైగా పత్తి దళారుల వద్ద కొనుగోలు చేసినదేననే అంచనా. ఈ లెక్కన క్వింటాల్‌కు రూ.400 చొప్పున 15 లక్షల క్వింటాళ్లకు సుమారు రూ. 60 కోట్ల మేరకు సీసీఐ అధికారులు, దళారులు కలిసి దండుకున్నారనే ఆరోపణలున్నాయి. కరీంనగర్ జిల్లాలో సీసీఐ 25.64 లక్షల క్వింటాళ్లను కొనుగోలు చేయగా.. అందులో సుమారు 10 లక్షల క్వింటాళ్ల పత్తిని బినామీ రైతుల పేరిట వ్యాపారులే విక్రయించినట్లు ఆరోపణలున్నాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ దాదాపుగా ఇదే పరిస్థితి.
     
     పెట్టుబడికీ దిక్కులేదు..
    ‘‘ప్రైవేటు అప్పు చేసి నాలుగున్నర ఎకరాల్లో పత్తి వేసిన. 90 వేల దాకా ఖర్చయింది. వానలు పడలె.. కరెంటు లేక పంటకు నీళ్లు అందలె. దానితోటి దిగుబడి ఎకరానికి నాలుగు క్వింటాళ్లు కూడా దాటలేదు. అప్పుకు అసలు, వడ్డీతో కలిపి లక్ష రూపాయలకు చేరింది. కానీ పత్తి అమ్మితే రూ. 70 వేలు కూడా రాలేదు. దీంతో నష్టమే మిగిలింది. ప్రభుత్వమే ఆదుకోవాలి..’’
     - నర్సింగ్, బీంసారి, ఆదిలాబాద్

     నష్టాలే మిగిలాయి..
     ‘‘పదిహేను ఎకరాల్లో పత్తి సాగు చేసిన. వానలు పడక మొదటిసారి వేసిన విత్తనాలు మొలకెత్తలేదు. మరోసారి వేసుకోవాల్సి వచ్చింది. అయినా కాలం లేక దిగుబడి సరిగా రాలేదు. గతేడాది 130 క్వింటాళ్ల దిగుబడి వస్తే... ఈ సారి 70 క్వింటాళ్లు కూడా రాలేదు. మూడు లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే రెండున్నర లక్షలు వచ్చినాయి. నష్టాలె మిగిలాయి.’’
     - లస్మారెడ్డి, సుంకిడి, తలమడుగు    

     వానల్లేక దెబ్బ పడ్డది..
     ‘‘ఈ ఏడాది వర్షాలు సరిగా పడక పంట దిగుబడి బాగా తగ్గింది. ఎకరాకు 5 క్వింటాళ్లకు మించలేదు. కాలం సరిగా కాకపోవడంతో మూడు సార్లు విత్తనాలు వేయాల్సి వచ్చింది. తగ్గిన దిగుబడితో కనీసం పెట్టుబడి కూడా పూడలేదు. రెండు ఎకరాలు సాగుచేస్తే 15 బస్తాల దిగుబడి వచ్చింది. క్వింటాల్‌కు రూ. 3,500 మాత్రమే ధర పెట్టారు.’’
     - చవగాని వెంకటరామయ్య, రాయగూడెం, ఖమ్మం జిల్లా

     వ్యాపారుల సరుకే కొన్నారు..
     ‘‘ప్రభుత్వం పత్తి కొనుగోలుకు సీసీఐ కేంద్రాన్ని ఏర్పాటు చేసినా... రైతులకు ఎంత మాత్రం ఉపయోగపడ లేదు. వ్యాపారులు రైతుల దగ్గర పత్తిని రూ. 3,300 నుంచి రూ. 3,600 దాకా కొని.. దానిని సీసీఐ కేంద్రాల్లో రూ. 4,050 వరకు అమ్ముకుంటున్నారు. సీసీఐ కేంద్రాలతోటి వ్యాపారులే లాభపడుతున్నారు.’’
     - పండుగ శేషాద్రి, ముష్టికుంట్ల, ఖమ్మం జిల్లా

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement