
బెంగళూరు: వీడియో కాల్ చేసి.. ఆపై నగ్నఫొటోలున్నయంటూ బెదిరింపులకు పాల్పడుతున్న ఘటనలు ఈ మధ్య తరచూ చూస్తున్నదే. అయితే అలాంటి సైబర్ నేరంలో చిక్కుకుని.. వాళ్ల బెదిరింపులకు భయపడి వృద్ధ దంపతులు బలవన్మరణానికి పాల్పడిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. పైగా అప్పటికే రూ.50 లక్షలు చెల్లించిన ఆ జంట.. ఇంకా చేసేది లేక ఈ ఘాతుకానికి దిగింది.
బెళగావి జిల్లా ఖానాపుర తాలూకా బీడి గ్రామంలో గ్రామంలో విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి డియోగో నజరత్(83), పావీయా నజరత్(79) దంపతులు నివాసం ఉంటున్నారు. గత రెండు రోజులుగా ఇంటినుంచి ఎంతకూ బయటకు రాకపోవడంతో స్వసహయ సంఘం మహిళలు వెళ్లి చూడగా.. విగతజీవులుగా కనిపించారు. సమాచారం అందుకున్న నందగడ పోలీసులు వచ్చి పరిశీలించారు.
డియోగో గొంతు, మణికట్టు వద్ద కత్తి కోసిన గాయం కనిపించింది. ఘటన స్థలంలో సూసైడ్ నోట్ లభించింది. దీంతో మృతదేహాలను పోస్టుమార్టం కోసం బీమ్స్ ఆస్పత్రికి తరలించారు. ‘‘నా వయసు 82 ఏళ్లు.. నా భార్య వయసు 79 సంవత్సరాలు. ఈ వయసులో మాకు ఆదుకోవడానికి ఎవరూ లేరు. సమాజంలో ఎంతో గౌరవంగా ఇంతకాలం బతికాం. కానీ, ఇప్పుడు ఈ వేధింపులు భరించలేకపోతున్నాం. ఎవరిని సాయం అడిగి.. ఎవరి దయ మీదా బతకాలనీ అనుకోవడం లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని డియోగో స్వదస్తూరితో రాసిన లేఖ అది.
నెల రోజులుగా వేధింపులు..
సూసైడ్ నోట్ ఆధారంగా కీలక విషయాలు వెలుగు చూశాయి. దంపతులను సైబర్ నేరగాళ్లు నెల రోజులుగా వేధిస్తున్నారు. తాము పోలీసులమంటూ పరిచయం చేసుకున్నారు. మా వద్ద మీ నగ్న చిత్రాలున్నయంటూ ఫోన్‌లో బెదిరించారు. అడిగినంత డబ్బులు ఇవ్వకంటే ఆ చిత్రాలను సామాజిక మాధ్యమాలలో వైరల్ చేస్తామంటూ బెదిరించారు.
ఆ వేధింపులు తాళలేక రూ.50 లక్షలు చెల్లించారు. అయినా మరింత నగదు కావాలని ఒత్తిడి చేశారు. దీంతో బలవన్మరణానికి పాల్పడాలని నిర్ణయించుకున్నారు. పావీయా నిద్రమాత్రాలు మింగి ఆత్మహత్య చేసుకుంది. డియాగో డెత్‌నోట్ రాసి చాకుతో గొంతు కోసుకోని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటన స్థలాన్ని బెళగావి జిల్లా ఎస్పీ పరిశీలించి కేసు దర్యాప్తులో ఉందని వెల్లడించారు.
లేఖలో.. సుమిత్రా బిర్రా, అనిల్ యాదవ్ అనే ఇద్దరి పేర్లను డియాగో ప్రస్తావించారు. తాను న్యూఢిల్లీ నుంచి టెలికామ్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నానని సుమిత్రా , అనిల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుగా పరిచయం చేసుకుని మరీ బెదిరింపులకు దిగారట. నగ్నఫోల్‌కాల్స్ ఉన్నాయని.. సిమ్ కార్డ్ దుర్వినియోగం కింద చట్టపరమైన చర్యలు ఉంటాయని బెదిరించారట. అయితే.. అప్పటికే రూ.50 లక్షలు చెల్లించామని.. ఇంకా కావాలని డిమాండ్ చేశారని.. బంగారం మీద రుణం కూడా తీసుకుని చెల్లించామని లేఖలో డియాగో వాపోయాడు. స్నేహితుల వద్ద నుంచి తెచ్చిన అప్పును తన భార్య నగలు అమ్మి చెల్లించాలని సూసైడ్ నోట్‌లో కోరిన డియాగో.. తమ ఇద్దరి మృతదేహాలను మెడికల్ కాలేజీకి అప్పగించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశాడు.
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com