Private traders
-
Telangana: పొలం నుంచి మిల్లుకు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వానాకాలపు వరి కోతలు ఊపందుకున్నాయి. చాలా జిల్లాల్లో 40శాతం వరకు కోతలు, నూర్పిడి పూర్తయి ధాన్యం రాశులు పోగుపడ్డాయి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో తెరుచుకోకపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. అవసరాలకు, అప్పులు తీర్చడానికి డబ్బులు లేక.. ఇంకా వేచి చూడలేక.. దళారులు, మిల్లర్లను ఆశ్రయిస్తున్నారు. రైతుల అవసరాన్ని ఆసరాగా తీసుకుంటున్న దళారులు, మిల్లర్లు అగ్గువ ధరకే ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. రకాన్ని బట్టి మద్దతు ధరకన్నా మూడు వందల నుంచి ఆరు వందలదాకా తక్కువ రేటు చెల్లిస్తున్నారు. దీనికితోడు తేమశాతం, తాలు పేరుతో తరుగుతీస్తూ రైతులను దోచుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా త్వరగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో పౌరసరఫరాల అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నవిమర్శలు వ్యక్తమవుతున్నాయి. మూడో వంతు కేంద్రాలే.. ప్రస్తుత వానాకాలంలో పెరిగిన వరి సాగుకు అనుగుణంగా 6,575 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని.. కోటీ రెండు లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని పౌరసరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. వానాకాలం కోతలు మొదలై 15 రోజులు దాటినా.. ఇప్పటివరకు తెరిచిన కొనుగోలు కేంద్రాలు 2,142 మాత్రమే. ముఖ్యంగా నల్లగొండ, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ ఉమ్మడి జిల్లాల్లో వరికోతలు వేగంగా సాగుతున్నాయి. కానీ కొనుగోలు కేంద్రాలు తెరిచే విషయంలో పౌరసరఫరాల శాఖ తాత్సారం చేస్తోంది. తెరిచిన కొనుగోలు కేంద్రాల వద్ద వేచి ఉన్న రైతులకు టోకెన్లు ఇచ్చి రోజులు గడుస్తున్నా.. వడ్లు కొనే పరిస్థితి లేదు. నల్లగొండ నుంచి పెద్దపల్లి దాకా పెద్ద సంఖ్యలో రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం రాశులు పోసి కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. తమ టోకెన్ నంబర్ ఎప్పుడు వస్తుందోనని ఎదురుచూడటంతోనే గడిచిపోతోందని నల్లగొండకు చెందిన రమేశ్ అనే రైతు వాపోయారు. రాష్ట్రంలో కోటి టన్నులకుపైగా ధాన్యం సేకరణ లక్ష్యం పెట్టుకోగా.. ఇప్పటివరకు 2.36 లక్షల టన్నులు మాత్రమే సేకరించారు. కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు పేరుకుపోయి ఉన్నాయి. వానలు పడితే తడిసి నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ధరకన్నా తక్కువతో.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాకపోవడం, ఏర్పాటైన చోట కొనుగోళ్లకు రోజుల తరబడి వేచి చూసే పరిస్థితి కారణంగా రైతులు నేరుగా మిల్లర్లను, దళారులకు అమ్ముకుంటున్నారు. మిల్లర్లు వెంటనే కొనుగోలు చేస్తుండటం, డబ్బులు చెల్లిస్తుండటంతో.. అగ్గువ సగ్గువకైనా ధాన్యాన్ని అప్పగిస్తున్నారు. రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకొంటున్న దళారులు, మిల్లర్లు.. రకం, తేమశాతం, ఇతర అంశాలను బట్టి క్వింటాల్‌కు రూ.1,360 నుంచి రూ.1,650 వరకే చెల్లిస్తున్నారు. వరి ఏ గ్రేడ్‌కు రూ.1,960.. బీ గ్రేడ్‌కు రూ.1,940గా కేంద్రం ప్రకటించిన మద్దతు ధరల కంటే ఇవి ఐదారు వందలదాకా తక్కువ కావడం గమనార్హం. సన్న వడ్లకే కాస్త ధర.. వచ్చే యాసంగి నుంచి దొడ్డు బియ్యం, ఉప్పుడు (పారాబాయిల్డ్ రైస్)ను కొనుగోలు చేయబోమని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ఇప్పటికే ప్రకటించింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు పలు సూచనలు చేసింది. దీంతో వానాకాలం పంట విషయంలో కూడా మిల్లర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే దొడ్డు వడ్లను మాత్రమే తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. సన్న వడ్లను మాత్రం నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. సన్నరకాలకు క్వింటాల్ రూ.1,600 వరకు ఇచ్చి కొనుగోలు చేస్తుండగా.. రైతులెవరైనా దొడ్డు వడ్లను తెస్తే మరో రెండు, మూడు వందలు తక్కువగా ఇస్తున్నారు. దీనికితోడు తేమ, తాలు అంటూ మరింత కోత పెడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో ఇప్పటికే వరి దిగుబడి దశకు చేరింది. కోతలు వేగంగా సాగుతున్నాయి. కానీ ఇప్పటికీ భువనగిరి, సూర్యాపేటల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. కరీంనగర్ జిల్లాలో శుక్రవారం పలు కొనుగోలు కేంద్రాలను మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లాలో శనివారం మొదలు కానున్నాయి. కానీ ఇప్పటికే ఆలస్యం కావడంతో చాలా మంది రైతులు ధాన్యాన్ని మిల్లులకు విక్రయిస్తున్నారు. కస్టమ్ మిల్లింగ్ పూర్తికాకున్నా.. గత యాసంగికి సంబంధించిన లక్షల టన్నుల ధాన్యం ఇప్పటికీ మిల్లుల్లో ఉంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ఆ ధాన్యాన్ని మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ చేసి ఎఫ్‌సీఐకి పంపించాల్సి ఉంది. కానీ ఆ పని ఆపేసి.. రైతుల నుంచి వానాకాలం పంటను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతుల నుంచి తక్కువ ధరకే సన్నరకాల ధాన్యం కొనవచ్చని.. డిమాండ్ వచ్చినప్పుడు రెట్టింపు రేటుకు అమ్ముకోవచ్చన్నది మిల్లర్లు ఆలోచన అని మార్కెటింగ్ వర్గాలు చెప్తున్నాయి. రూ.1,650కే అమ్ముకోవాల్సి వచ్చింది నాకున్న ఒకటిన్నర ఎకరం భూమిలో సన్నరకం వరి వేశాను. పదిహేను రోజుల కింద పంటకోసి నూర్పిడి పూర్తయింది. ప్రభుత్వ కొనుగోలు కేం ద్రాలు ఏర్పాటు కాలేదు. వానలు పడతాయన్న భయంతో వడ్లను వ్యాపారులకు అమ్ముకున్నా. 28 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటాల్‌కు రూ.1,650 రేటుకే అమ్ముకోవాల్సి వచ్చింది. – షేక్ నిస్సార్, బర్ధీపూర్ గ్రామరైతు, బోథ్ మండలం -
ఉల్లి @ 80
రైతు బజార్లలో విక్రయాలు బంద్ దిగిరాని ఉల్లి ధరలు మూడు రోజుల్లో రూ. 30 పెరుగుదల విజయవాడ : విజయవాడలో ఉల్లిపాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రైవేటు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి ఉల్లి ధరలను రోజురోజుకు పెంచేస్తున్నారు. సోమవారం నగరంలో ప్రైవేటు మార్కెట్లలో ఉల్లిపాయలు కేజీ రూ. 80 ధర పలికింది. వ్యాపారులు మూడు రోజులుగా రోజుకు రూ. 10 చొప్పున సోమవారం నాటికి రూ.30 పెంచేశారు. మూడు రోజుల నుంచి నగరంలో రైతుబజార్లలో ఉల్లి విక్రయాలు బంద్ అయ్యాయి. జిల్లాలోని 17 రైతు బజార్లలో సోమవారం ఉల్లిపాయల విక్రయాలు జరుగలేదు. కర్నూల్ నుంచి ఉత్పత్తి తగ్గిపోవటంతో మార్కెటింగ్ అధికారులు రైతు బజార్లకు మూడు రోజుల నుంచి ఉల్లి సరఫరా చేయలేకపోతున్నారు. దాంతో ప్రైవేటు మార్కెట్లో వ్యాపారులు కేజీ రూ.50 నుంచి రూ. 80కి పెంచేశారు. ఉల్లిపాయలు దొరక్క ప్రజలు షాపులు, మార్కెట్లకు పరుగులు తీశారు. రెండు రకాల గ్రేడులు వ్యాపారులు ఉల్లిపాయలను రెండు రకాలుగా గ్రేడ్ చేసి అధిక రేటు వసూలు చేస్తున్నారు. ఎందుకూ పనికిరాని నాసిరకం ఉల్లిని కేజీ రూ. 50కి విక్రయిస్తున్నారు. మంచి రకం ఉల్లి కేజీ రూ. 80 వసూలు చేస్తున్నారు. రైతు బజార్లలో కేజీ రూ. 20కి సరఫరా చేసిన ఉల్లిని బయటి మార్కెట్లో రూ. 50కి విక్రయిస్తున్నారు. రానున్న రోజుల్లో ఉల్లిధరలు మరింతగా పెరగవచ్చని వ్యాపారులు చెపుతున్నారు. వచ్చే నెలాఖరు వరకు ఉల్లిపాయల కొరత ఇలానే ఉంటుందని వ్యాపారులు పేర్కొంటున్నారు. వచ్చే నెలాఖరునాటికి సోలాపూర్‌లో ఉల్లి పంట వస్తుందని, అప్పటికి గాని ఉల్లిపాయల ఉత్పత్తులు పెరిగి ధర తగ్గే అవకాశం ఉంటుందని చెపుతున్నారు. రైతు బజార్ల చుట్టూ తిరుగుతున్న ప్రజలు బయటి మార్కెట్లో ఉల్లి కొనుగోలు చేయలేక సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలు రైతు బజార్ల చుట్టూ తిరుగుతున్నారు. అక్కడ అధికారులు, సిబ్బంది రేపు రండి మాపు రండని ప్రజలకు చెప్పి పంపుతున్నారు. కొందరు ప్రజలు రైతు బజార్లలోకి ఎప్పడు వస్తుందో తెలుసుకుని ఉరుకులు, పరుగులతో క్యూలెన్లలో ఉల్లి కోసం కాపు కాస్తున్నారు. -
రూ. 30 కోట్లు మింగారు..!
చిలకలూరిపేట : భారత పత్తి కొనుగోలు సంస్థ (సీసీఐ)అధికారుల అవినీతిలో ఇదో కొత్త కోణం. కాటన్ సీడ్స్‌ను తమకు తెలిసిన ఆయిల్ మిల్లులకు తక్కువ ధరకు అందజేసి సీసీఐ బయ్యర్లు, అధికారులు కోట్లు గడించారు. క్వింటాకు రూ. 50 చొప్పున మామూళ్లు అందుకొని రైతులను, ప్రభుత్వాన్ని మోసం చేశారు. ఈ ఏడాది మార్కెట్లో కనిష్టంగా రూ. 2800, గరిష్టంగా రూ. 3,300 వరకు మాత్రమే ప్రైవేటు వ్యాపారులు పత్తిని కొనుగోలు చేశారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సీసీఐ రంగంలోకి దిగింది. రైతుల నుంచి తక్కువ మొత్తంలో కొనుగోలు చేసి పెద్ద స్థాయిలో అవినీతికి పాల్పడ్డారు. ఈ విషయంపై ప్రస్తుతం సీబీఐ విచారణ కొనసాగుతోంది. జిన్నింగ్‌కు మిల్లులకు సరఫరా చేసిన పత్తిలో విత్తనాలు తొలగించి ప్రెస్సింగ్ చేసి దూది బేళ్లను సీసీఐ గోడౌ న్లకు తరలిస్తారు. కిలో పత్తి జిన్నింగ్ చేస్తే అందులో 66 శాతం కాటన్‌సీడ్, 33 శాతం మాత్రమే పత్తి వస్తుంది. అలా వచ్చిన కాటన్ సీడ్‌ను ఆయిల్ మిల్లులకు తరలిస్తారు. గణపవరం, తిమ్మాపురం, యడ్లపాడు పరిధిలో స్థానిక మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు బంధువులు, ఆయన అనుచరులకు సంబంధించిన మిల్లులు ఉన్నాయి. ఇక్కడే ఆయిల్‌మిల్లు యజమానులు కీలక పాత్ర వహిస్తారు. రాష్ట్రంలోని అన్ని ఆయిల్ మిల్లులకు స్థానిక ఆయిల్ మిల్లుల యజమానులే నాయకత్వం వహించి సీడ్ ధర నిర్ణయిస్తారు. సిండికేట్‌గా మారటంతో కాటన్‌సీడ్ ఎట్టిపరిస్థితుల్లోనూ వారు నిర్ణయించిన ధర కంటే ఎక్కువ పలకదు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సారి సీసీఐ 93 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసింది. దీనికి సుమారు 60 లక్షల క్వింటాళ్ల విత్తనాలు వచ్చి ఉంటాయి. ఈ విత్తనాల ధరను నిర్ణయించేదే సీసీఐ, బయ్యర్లే. దీంతో తమకు తెలిసిన మిల్లు యజమానులతో కుమ్మకై తక్కువ ధర నిర్ణయిస్తారు. దీనికి ఆయా మిల్లుల యజమానులు సీసీఐ అధికారులకు, బయ్యర్లకు క్వింటాకు 50 రూపాయలు చొప్పున ఇచ్చారని సమాచారం. దీని ద్వారా 60 లక్షల క్వింటాళ్లకు 30 కోట్ల రూపాయలు అందినట్టు ఇట్టే తెలిసిపోతుంది. పత్తి మద్దతు ధరపై ప్రభావం... కొన్ని రోజుల కిందట వరకు పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక తదితర చోట్ల క్వింటా రూ. 1300 ఉంటే రాష్ట్రంలో కాటన్ సీడ్ ధర రూ. 1100 ఉండటం విశేషం. ఇదే ధరకు బయట జిన్నింగ్‌మిల్లుల నుంచి ఆయిల్ మిల్లుల యజమానులు సీడ్ కొనుగోలు చేస్తారు. ఇలా కాటన్ సీడ్ ధర పతనం కావటంతో ఆ ప్రభావం పత్తి మద్దతు ధరపై కూడా పడుతుంది. ఆంధ్రప్రదేశ్,తెలంగాణ ప్రాంతాల్లో పత్తికి మద్దతు ధర లభించదు. ఈ ఏడాది స్థానికంగా సీసీఐ కేంద్రాల ద్వారా ప్రభుత్వం రూ. 4050 మద్దతు ధర ప్రకటించగా ఇతర రాష్ట్రాల్లో ఇదే ధరకు ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేసిన విషయాన్ని కొంతమంది ప్రస్తావిస్తున్నారు. ఈ వ్యత్యాసానికి కారణం కాటన్సీడ్ను కొలుగోలు చేసే మిల్లుల యజమానులు సిండికేట్‌గా మా రటమేనని రైతు నాయకులు చెబుతున్నారు. -
ఇక దోచుకున్నంత..!
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియూ (సీసీఐ) పత్తి కొనుగోళ్లు బంద్ పెట్టింది. సోమవారం నుంచి ఆయా మార్కెట్ యూర్డుల్లోని కేంద్రాలను మూసివేసింది. దీంతో పత్తి రైతులను దోచుకునేందుకు ఎదురుచూస్తున్న ప్రైవేట్ వ్యాపారులకు కలిసి వచ్చింది. సీసీఐ కొనుగోళ్లు నిలిచిపోరుున మొదటిరోజే పత్తి ధర గణనీయంగా పడిపోరుుంది. జిల్లాలోనే పెద్దదైన జమ్మికుంట మార్కెట్లో క్వింటాల్ పత్తి ధర రూ.3500-3700 మాత్రమే పలికింది. 24 గంటల వ్యవధిలోనే రూ.200 వరకు పడిపోయింది. జమ్మికుంట రూరల్ : జిల్లాలో జమ్మికుంట, పెద్దపల్లి మార్కెట్ యూర్డుల్లో గత డిసెంబర్ నుంచి సీసీఐ పత్తికి మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయడంతో రైతులు కొంత ప్రయోజనం పొందారు. ఇంకా పత్తి అమ్మకాలు పూర్తికాకుండానే ఉన్నఫళంగా సీసీఐ కొనుగోళ్లు బంద్ చేయడంతో రైతులు తక్కువ ధరకు పత్తిని అమ్ముకునే పరిస్థితి దాపురించింది. ఈ నాలుగు నెలల కాలంలోనూ సీసీఐ అధికారులు, వ్యాపారులతో కుమ్మక్కై పెద్ద ఎత్తున బినామీ వ్యాపారం నడిపినట్టు ఆరోపణలు వెల్లువెత్తారుు. సంవత్సరాంతం ఆడిటింగ్ పేరిట పత్తి కొనుగోళ్లకు స్వస్తి చెప్పడంతో వ్యాపారులు ఆడిందే ఆటగా మారిందనే అనుమానాలు వాదనలు వినిపిస్తున్నారుు. ఒక్కరోజులోనే ఎంత తేడా..? సోమవారం జమ్మికుంట మార్కెట్లో జరిగిన క్రయవిక్రయాలను పరిశీలిస్తే వ్యాపారులు రైతులను నట్టేట ముంచుతున్నారనేది స్పష్టమవుతోంది. గరిష్ట ధర క్వింటాల్‌కు రూ.4060గా నిర్ణయించినప్పటికీ మచ్చుకు కొంత చెల్లించి మిగతా మొత్తాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి రైతులను దోచుకున్నారనే ఆరోపణలు వినిపించారుు. సీపీఐ పత్తిని కొనుగోలు చేసిన సందర్భంలో బస్తాల్లో వచ్చిన పత్తికి ప్రైవేట్ ట్రేడర్లు రూ.3700-3900 వరకు చెల్లించారు. సీసీఐ పత్తి కొనుగోళ్లను నిలిపివేయడంతో అదే వ్యాపారులు కేవలం రూ.3500-3700 వరకు చెల్లిస్తూ సోమవారం కొనుగోళ్లు చేపట్టారు. మార్కెట్‌కు 401 క్వింటాళ్ల లూజ్ పత్తి రాగా, 284 క్వింటాళ్ల పత్తి బస్తాలు వచ్చాయి. లూజ్ పత్తికి క్వింటాల్‌కు రూ.4060 ధరగా నిర్ణయించి అతి కొద్దిగా మాత్రమే కొనుగోలు చేశారు. మిగతా పత్తికి తేమ, నాణ్యత పేరుతో తక్కువ ధర చెల్లించారు. గతవారం రోజుల్లో రోజుకు సుమారు 2500 క్వింటాళ్ల పత్తి మార్కెట్‌కు రాగా సోమవారం 686 క్వింటాళ్లు మాత్రమే అమ్మకానికి వచ్చింది. ఏప్రిల్‌లో తెరుచుకుంటాయూ? జమ్మికుంట మార్కెట్లో సీసీఐ ఇప్పటివరకు 2,73,132 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసింది. ప్రైవేట్ వ్యాపారులు 92,933 క్వింటాళ్లు కొన్నారు. అయితే ఏప్రిల్‌లో సీసీఐకి అమ్మితే ధర అధికంగా వస్తుందని ఆశపడ్డ రైతులకు ఇప్పుడు నిరాశే మిగిలింది. సంవత్సరాంతపు ఆడిటింగ్ పూర్తయిన తరువాత ఏప్రిల్ మొదటి వారంలో సీసీఐ తిరిగి పత్తిని కొనుగోలు చే స్తుందని ప్రచారం జరగడంతో రైతులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇప్పటికి రైతుల ఇళ్లలో వేల క్వింటాళ్ల పత్తి నిల్వలున్నారుు. ఆలస్యంగా అమ్మితే మంచి ధర వస్తుందని ఆశించగా, ఇప్పుడు ఆసలుకే ఎసరు వచ్చే ప్రమాదముందని అన్నదాతలు వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి పత్తి రైతులకు మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. ఒక్క రోజులోనే ఎంత తేడా..? జమ్మికుంటలో వ్యాపారులు చెల్లించిన ధరలు మొన్న రూ.37003900 నిన్న రూ.35003700 జమ్మికుంటలో పత్తి కొనుగోళ్లు (క్వింటాళ్లు) సీసీఐ కేంద్రంలో 2,73,132 వ్యాపారులు 92,933 -
నిలువునా దగా...
రాష్ట్రంలో పత్తి రైతుల దీన స్థితి మద్దతు ధర ఇవ్వని సీసీఐ.. నిలువునా ముంచుతున్న వ్యాపారులు వర్షాభావం కారణంగా బాగా తగ్గిపోయిన దిగుబడి నాణ్యత లేదంటూ రూ. 250 వరకూ సీసీఐ కోత దళారులతో కుమ్మక్కు.. బినామీ రైతుల పేరిట కొనుగోళ్లు అధికారుల అండతో రెచ్చిపోయిన ప్రైవేటు వ్యాపారులు, దళారులు ధరలో క్వింటాల్‌కు నాలుగైదు వందల వరకూ దోపిడీ రైతుల పరిస్థితి అగమ్యగోచరం.. పెట్టుబడులూ దక్కని దుస్థితి ఆవేదనతో ఆత్మహత్యకు పాల్పడుతున్న రైతులు కొద్దినెలల్లోనే పదుల సంఖ్యలో బలవన్మరణాలు సాక్షి, నెట్వర్క్: కాలం కలసిరాక ఒకటికి రెండు సార్లు వేసిన విత్తనాలతో పెట్టుబడి బాగా పెరిగింది. వానలు సరిగా కురవక పత్తి దిగుబడి తగ్గింది. ఆ కాస్త దిగుబడికీ మద్దతు ధర ఇవ్వకుండా సీసీఐ దెబ్బకొట్టింది. తేమ శాతం, పింజ పొడవు పేరిట నిలువునా ముంచింది. దళారులు, వ్యాపారులకు మాత్రం ‘సరైన’ ధర కట్టబెట్టింది. ఏదోలా అమ్ముకునే దుస్థితిని రైతుకు తెచ్చిపెట్టింది. తెగించి వ్యాపారులకు అమ్ముకున్న రైతులకు మాత్రం నిండా నష్టాలు, కష్టాలు, కన్నీళ్లే మిగిలాయి. ప్రతీసారిలాగే ఈసారి కూడా పత్తి రైతు నిలువునా దోపిడీకి గురయ్యాడు. సీసీఐతో పాటు దళారులు, వ్యాపారులు కలసి పత్తి రైతును నిలువునా ముంచారు. రైతులకు అండగా నిలవాల్సిన సీసీఐ (భారత పత్తి సంస్థ) కూడా ధరలో అధికారికంగానే కోతపెట్టడం గమనార్హం. క్వింటాలుకు రూ.4,050 కనీస మద్దతు ధర ఇవ్వాల్సి ఉండగా... తేమ శాతం, స్టేఫుల్ లెన్త్ (పింజ పొడవు) తదితర నాణ్యతల పేరుతో సీసీఐ రూ. 3,800 చొప్పున మాత్రమే చెల్లిస్తోంది. అంతేకాదు తేమ పేరుతో కొద్దిరోజులు కొనుగోళ్లను సీసీఐ నిలిపివేయడంతో... రైతులు పత్తిని దళారులు, ప్రైవేటు వ్యాపారులకు విక్రయించాల్సి వచ్చింది. దీంతో వారు. రూ. 3,550 నుంచి రూ. 3,650 వరకే పత్తిని కొనుగోలు చేశారు. దాదాపుగా ఒక్కో క్వింటాల్‌పై నాలుగె దు వందల వరకు దండుకున్నారు. పెరిగిన భారం... ఖరీఫ్ ప్రారంభంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా పత్తి విత్తనాలు మొలకెత్తలేదు. దాంతో రెండు, మూడు సార్లు విత్తుకోవాల్సి వచ్చింది. దీనికి తోడు చుక్కలనంటిన ఎరువులు, పురుగు మందుల ధరలతో సాగు వ్యయం విపరీతంగా పెరిగింది. ఒక్కో ఎకరం పత్తి సాగుకు రైతులు వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది. కానీ వర్షాలు లేక దిగుబడి ఎకరానికి నాలుగైదు క్వింటాళ్లకు తగ్గిపోయింది. దీనికితోడు మద్దతు ధర దక్కక... రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. చేతికందిన పంటనంతా విక్రయిస్తే కనీసం పెట్టుబడి కూడా రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్కువ ధరకు పత్తిని విక్రయిస్తే.. అప్పులే మిగులుతుండడంతో ఆవేదన చెందిన రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పంట కోసం పెట్టిన పెట్టుబడులు, చేసిన అప్పులు కళ్ల ముందే మెదిలి ఖమ్మం మార్కెట్ యార్డులో గొర్రెముచ్చు వెంకటి అనే రైతు గుండెపోటుతో మృతి చెందిన ఘటన పత్తి రైతు దయనీయ స్థితికి అద్దం పడుతోంది. తెలంగాణలో పత్తి పంట సాధారణ సాగు విస్తీర్ణం 15.32 లక్షల హెక్టార్లుకాగా.. ఈ ఏడాది 16.21 లక్షల హెక్టార్లలో సాగయింది. ప్రధానంగా ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ, ఖమ్మం, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాలో పత్తి అధికంగా సాగు చేశారు. వ్యాపారులతో కుమ్మక్కు.. 2004-07 మధ్య సీసీఐ పత్తి కొనుగోళ్లలో జరిగిన భారీ అక్రమాలపై ఇటీవల సీబీఐ దృష్టి సారించింది. తాజాగా సీసీఐ అధికారుల నివాసాలపై దాడులు చేసి కోట్ల రూపాయల నగదు, బంగారం స్వాధీనం చేసుకుంది కూడా. అయితే ఈ ఏడాది కూడా సీసీఐ పత్తి కొనుగోళ్లలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయి. సీసీఐ అధికారులు దళారులతో కుమ్మక్కై బినామీ రైతుల పేరుతో అక్రమ కొనుగోళ్లకు తెరలేపారు. రైతులు తెచ్చిన పత్తిలో తేమ అధికంగా ఉందంటూ కొనుగోళ్లకు తిరస్కరించిన సీసీఐ అధికారులు... అదే పత్తిని రైతుల నుంచి దళారులు కొనుగోలు చేసి తీసుకువస్తే కనీస మద్దతు ధర కట్టబెట్టారు. బినామీ రైతుల పేరుతో ఈ డబ్బులు చెల్లించారు. ఇలా ఒక్కో క్వింటాల్‌పై సుమారు రూ. 400 వరకు దళారులు, సీసీఐ అధికారులు కలిసి పంచుకున్నారు. మార్కెట్‌కు రైతులు తీసుకొస్తున్న పత్తిలో చాలా వరకు బ్రోకర్లే తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. రైతుల పేరిట బినామీ పట్టా పాస్‌బుక్, బ్యాంక్ ఖాతాలను సృష్టించి సీసీఐకి ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో సీసీఐ ఇప్పటివరకు 49.89 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసింది. ఇందులో సుమారు 30 శాతానికిపైగా పత్తి దళారుల వద్ద కొనుగోలు చేసినదేననే అంచనా. ఈ లెక్కన క్వింటాల్‌కు రూ.400 చొప్పున 15 లక్షల క్వింటాళ్లకు సుమారు రూ. 60 కోట్ల మేరకు సీసీఐ అధికారులు, దళారులు కలిసి దండుకున్నారనే ఆరోపణలున్నాయి. కరీంనగర్ జిల్లాలో సీసీఐ 25.64 లక్షల క్వింటాళ్లను కొనుగోలు చేయగా.. అందులో సుమారు 10 లక్షల క్వింటాళ్ల పత్తిని బినామీ రైతుల పేరిట వ్యాపారులే విక్రయించినట్లు ఆరోపణలున్నాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ దాదాపుగా ఇదే పరిస్థితి. పెట్టుబడికీ దిక్కులేదు.. ‘‘ప్రైవేటు అప్పు చేసి నాలుగున్నర ఎకరాల్లో పత్తి వేసిన. 90 వేల దాకా ఖర్చయింది. వానలు పడలె.. కరెంటు లేక పంటకు నీళ్లు అందలె. దానితోటి దిగుబడి ఎకరానికి నాలుగు క్వింటాళ్లు కూడా దాటలేదు. అప్పుకు అసలు, వడ్డీతో కలిపి లక్ష రూపాయలకు చేరింది. కానీ పత్తి అమ్మితే రూ. 70 వేలు కూడా రాలేదు. దీంతో నష్టమే మిగిలింది. ప్రభుత్వమే ఆదుకోవాలి..’’ - నర్సింగ్, బీంసారి, ఆదిలాబాద్ నష్టాలే మిగిలాయి.. ‘‘పదిహేను ఎకరాల్లో పత్తి సాగు చేసిన. వానలు పడక మొదటిసారి వేసిన విత్తనాలు మొలకెత్తలేదు. మరోసారి వేసుకోవాల్సి వచ్చింది. అయినా కాలం లేక దిగుబడి సరిగా రాలేదు. గతేడాది 130 క్వింటాళ్ల దిగుబడి వస్తే... ఈ సారి 70 క్వింటాళ్లు కూడా రాలేదు. మూడు లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే రెండున్నర లక్షలు వచ్చినాయి. నష్టాలె మిగిలాయి.’’ - లస్మారెడ్డి, సుంకిడి, తలమడుగు వానల్లేక దెబ్బ పడ్డది.. ‘‘ఈ ఏడాది వర్షాలు సరిగా పడక పంట దిగుబడి బాగా తగ్గింది. ఎకరాకు 5 క్వింటాళ్లకు మించలేదు. కాలం సరిగా కాకపోవడంతో మూడు సార్లు విత్తనాలు వేయాల్సి వచ్చింది. తగ్గిన దిగుబడితో కనీసం పెట్టుబడి కూడా పూడలేదు. రెండు ఎకరాలు సాగుచేస్తే 15 బస్తాల దిగుబడి వచ్చింది. క్వింటాల్‌కు రూ. 3,500 మాత్రమే ధర పెట్టారు.’’ - చవగాని వెంకటరామయ్య, రాయగూడెం, ఖమ్మం జిల్లా వ్యాపారుల సరుకే కొన్నారు.. ‘‘ప్రభుత్వం పత్తి కొనుగోలుకు సీసీఐ కేంద్రాన్ని ఏర్పాటు చేసినా... రైతులకు ఎంత మాత్రం ఉపయోగపడ లేదు. వ్యాపారులు రైతుల దగ్గర పత్తిని రూ. 3,300 నుంచి రూ. 3,600 దాకా కొని.. దానిని సీసీఐ కేంద్రాల్లో రూ. 4,050 వరకు అమ్ముకుంటున్నారు. సీసీఐ కేంద్రాలతోటి వ్యాపారులే లాభపడుతున్నారు.’’ - పండుగ శేషాద్రి, ముష్టికుంట్ల, ఖమ్మం జిల్లా -
సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో...
‘సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన పత్తి డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం.. మధ్య దళారుల మోసాల బారిన పడకుండా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజర్‌కు సిఫార్సు లేఖ రాశాం. రైతులు తప్పని సరిగా వారి బ్యాంకు పాసుపుస్తకం, పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్ కాపీలను సీసీఐకి ఇవ్వాలి. మూడు రోజుల్లో ఈ నిర్ణయం అమలయ్యేలా చూస్తాం’ అని మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ టి.శ్రీనివాస్ పేర్కొన్నారు. ఖరీఫ్ కొనుగోళ్ల సీజన్ ఊపందుకున్న నేపథ్యంలో ఈ సందర్భంగా ఆయనతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ.. - సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ సాక్షి : పత్తి కొనుగోళ్లలో ప్రైవేటు వ్యాపారులు తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. అలాగే ధరలో కోత పెడుతున్నారు. ఈ అక్రమాలకు ఎలా చెక్ పెడుతున్నారు..? అసిస్టెంట్ డెరైక్టర్ : రైతులు పత్తిని నేరుగా ప్రైవేటు వ్యాపారులకు విక్రయించడంతో ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. అలా కాకుండా రైతులు పత్తిని మార్కెట్ యార్డుల్లోనే విక్రయిస్తే తూకాల్లో మోసాలకు తావుండదు. ప్రైవేటు వ్యాపారుల కాంటాల పనితీరును ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని సీజన్ ప్రారంభానికి ముందే తూనికల కొలతల శాఖ అధికారులకు లేఖ రాశాం. సాక్షి : తేమ పేరుతో సీసీఐ కొనుగోళ్లకు నిరాకరిస్తోంది కదా..? ఏడీ : 12 శాతం లోపు తేమ ఉన్న పత్తిని ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.4,050 చొప్పున సీసీఐ కొనుగోలు చేస్తోంది. ఈ ఖరీఫ్ కొనుగోలు సీజన్లో ఇప్పటి వరకు 2.48 లక్షల క్వింటాళ్ల పత్తి సీసీఐ కొనుగోలు చేసింది. ప్రైవేటు వ్యాపారులు కొన్నది కేవలం 46 వేల క్వింటాళ్లు మాత్రమే. సాక్షి : ప్రైవేటు వ్యాపారులు పెద్ద మొత్తంలో మార్కెట్ ఫీజు, వ్యాట్ ఎగవేస్తున్నారు. జీరో వ్యాపారాన్ని నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఏడీ : రైతుల ఉత్పత్తులు ముఖ్యంగా పత్తి, సోయా క్రయవిక్రయాలు వ్యాపారుల వద్ద కాకుండా, మార్కెట్ యార్డుల్లోనే క్రయవిక్రయాలు జరిగేలా జాగ్రత్త పడుతున్నాం. నేరుగా కొనుగోలు చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. సాక్షి : మొక్కజొన్న కొనుగోళ్ల మాటేమిటి? ఏడీ : జిల్లాలో ఈసారి మార్క్‌ఫెడ్ ద్వారా ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోళ్లు చేపట్టింది. జిల్లాలో ఆరు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఇప్పటివరకు 30,976 క్వింటాళ్ల మొక్కజొన్నను కనీస మద్దతు ధర రూ.1,310 చొప్పున మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసింది. రైతులు నాణ్యమైన మొక్కజొన్నను ఈ కేంద్రాల్లో విక్రయించవచ్చు. సాక్షి : సోయా కొనుగోళ్లు ఎలా ఉన్నాయి? ఏడీ : జిల్లాలో ఆదిలాబాద్, భైంసా, కుభీర్ మార్కెట్ యార్డులకు ఇప్పుడిప్పుడే సోయాబీన్ వస్తోంది. ఈసారి ఈ పంట దిగుబడి పడిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయినట్లు తెలిసింది. కానీ ధర మాత్రం కొంత ఆశాజనకంగా ఉంది. కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,560 (పసుపు పచ్చ రకం) ఉండగా, ప్రస్తుతం రూ.3,400 నుంచి 3,500 వరకు పలుకుతోంది. ఇప్పటి వరకు ఎనిమిది వేల క్వింటాళ్లు యార్డుల్లో క్రయవిక్రయాలు జరిగాయి. సాక్షి : దూర ప్రాంతాల నుంచి పత్తిని యార్డుకు తెస్తున్న రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిసార్లు కాంటాలు కాక రోజుల తరబడి యార్డులోనే పడిగాపులు కాయాల్సి వస్తోంది. వారి కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు..? ఏడీ : ఇలాంటి రైతుల సౌకర్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం మెదక్ జిల్లాలో అమలు చేస్తున్న మాదిరిగా ‘సద్దిమూట’ పథకాన్ని జిల్లాలో కూడా అమలు చేయాలనే యోచనలో ఉన్నాం. ఎవరైనా దాతలు ముందుకొస్తే ఈ పథకాన్ని అమలు చేసి, రైతులకు ఉచితంగా భోజన వసతిని కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం. -
తూకంలో మోసం!
వెంకటగిరి గ్రామానికి చెందిన రైతులు పరమేశ్వరరెడ్డి, జనార్ధన్‌రెడ్డి తమ పత్తి పంటను పొలం నుంచి రాగానే వే-బ్రిడ్జ్‌లో తూకం వేసి చనుగొండ్ల గ్రామంలోని ప్రైవేట్ వ్యాపారస్తులకు అమ్మాడు. 28 క్వింటాళ్ల పత్తి తీసుకుపోగా తూకాల్లో 4 క్వింటాళ్లు మోసం చేసినట్లు బయటపడింది. పంచాయితీ చేసి 2.5 క్వింటాళ్లకు వ్యాపారస్తుల దగ్గరి నుంచి రైతులు డబ్బులు కట్టించుకుని వచ్చారు. ప్యాలకుర్తిలో ఎలక్ట్రానిక్ కాటాలో 15కిలోలు మైనస్‌లో పెట్టి జోలాపురం లింగన్న అనే రైతు నుంచి ప్రైవేట్ వ్యాపారస్తులు పత్తిని కొనుగోలు చేశారు. ఆ రైతుకు అనుమానం వచ్చింది. స్వయంగా తనే కాటా ఎక్కి బరువును చూసుకున్నాడు. 75 కేజీల బరువు ఉండాల్సిన లింగన్న 60 కేజీలే కాటాలో చూపించడంతో వ్యాపారిని నిలదీశాడు. జరిగిన మోసం బయటికి రాకుండా ఆ రైతుకు అంతో ఇంతో ముట్టజెప్పి వ్యాపారి పరారయ్యాడు. విత్తనాల కొనుగోలు నుంచి పంట ఉత్పత్తులు అమ్మే వరకు రైతన్నను నట్టేట ముంచేస్తున్నారు. మోసపోవడం రైతు వంతైంది. ఎంతో కష్టపడి ప్రకృతి, చీడపీడల నుంచి పంటను కాపాడుకున్న పత్తి రైతులు దళారుల చేతిలో దగాకు గురవుతున్నారు. అరకొర వర్షాలతో చేతికొచ్చిన పత్తి పంటను అమ్ముకునేలోపే కొందరు దళారులు గద్దల్లా వాలుతున్నారు. అడ్వాన్స్ ఇచ్చి బుట్టలో వేసుకుని అధిక ధర ముసుగులో కొల్లగొడుతున్నారు. - కోడుమూరు ఖరీఫ్‌లో సాగు చేసిన పత్తి పంట నెలరోజులుగా కోతకు రావడంతో కొందరు వ్యాపారులు గ్రామాల్లో డబ్బు సంచులతో వాలిపోతున్నారు. నియోజకవర్గంలోని కోడుమూరు, గూడూరు, సి.బెళగల్ మండలాలకు ఆదోని మార్కెట్‌యార్డ్ కొనుగోలు కేంద్రం. అక్కడ క్వింటా రూ.3,800 నుంచి రూ.4,100 వరకు వ్యాపారస్తులు పత్తిని కొనుగోలు చేస్తున్నారు. రవాణా ఖర్చులు భరించలేని రైతులకు దళార్లు ఎరవేస్తున్నారు. ఎలక్ట్రానిక్ కాటాపై అవగాహనలేని వారిని సులువుగా మోసం చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ కాటాలో పత్తిని తూకం వేస్తూ వ్యాపారస్తులు తమ చేతిలో రిమోట్‌ను ఆపరేట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. క్వింటాకు 15 కేజీలు మోసం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో దాదాపు 75వేల ఎకరాల్లో పత్తిపంట సాగైంది. ఈ ఏడాది ఎన్నడూలేని విధంగా దళార్లు గ్రామాలకు చేరుకుంటున్నారు. నేరుగా ఇళ్ల వద్దకే వచ్చి పత్తిని కొనుగోలు చేస్తామని ముందస్తుగా రైతులకు అడ్వాన్స్ ఇస్తున్నారు. గద్వాల, శాంతినగర్, అయిజ, బళ్లారి తదితర ప్రాంతాల నుంచి ప్రైవేట్ వ్యాపారస్థులు పత్తిని కొనుగోలు చేసుకుని ఇతర ప్రాంతాలకు పత్తిని తరలిస్తున్నారు. మధ్య దళారులకు కమీషన్ ఎర వేస్తూ పంటను విక్రయించే రైతులను తమ వద్దకు తీసుకెళ్లేలా చేస్తున్నారు. గ్రామాల్లో యథేచ్ఛగా జీరో బిజినెస్ జరుగుతున్నా అధికారులు మేల్కొవడం లేదు. సరిహద్దు ప్రాంతాలైన ఆలూరు, ఆస్పరి, ఎమ్మిగనూరు, కోడుమూరు, మాదవరం ప్రాంతాల్లో ఉన్న చెక్‌పోస్టు సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతుండటంతో వీరి వ్యాపారం జోరుగా సాగుతుందనే విమర్శలు ఉన్నాయి. అక్రమాలకు పాల్పడితే క్షమించం అన్ని చెక్‌పోస్టులను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. బోగస్ పర్మిట్లపై నిఘా పెట్టాం. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేశాం. అక్రమ వ్యాపారస్తులను ప్రోత్సహించే చెక్‌పోస్ట్ సిబ్బందిని ఉపేక్షించేది లేదు. - ఉపేంద్రకుమార్, ఏడీఎం -
పత్తి రైతులను దోపిడీ చేయడం ...
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : పత్తి రైతులను దోపిడీ చేయడం షురువైంది. ప్రైవేటు వ్యాపారుల ఎత్తుగడలు ఫలించాయి. ధరలో కోత విధించి దండుకోవడానికి అధికారికంగానే లైన్ క్లియరైంది. రాష్ట్రంలో ఏ మార్కెట్లోనూ లేనివిధంగా తేమ శాతం పేరుతో సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొనుగోళ్ల నుంచి తప్పుకోవడంతో పత్తి రైతులకు ప్రైవేటు వ్యాపారులే దిక్కయ్యారు. దీన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారులు ధర దోపిడీ పర్వానికి తెరలేపారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పత్తి పంటకు కనీస మద్దతు ధర కల్పించండి మహాప్రభో అంటూ మూడు రోజులుగా రోడ్డెక్కి నెత్తినోరు మొత్తుకున్నా పత్తి రైతుల ఆవేదన చివరకు అరణ్య రోదనగానే మిగిలిపోయింది. రైతుల ఉత్పత్తులకు కనీస మద్దతు ధర అందేలా వ్యాపారుల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన మార్కెటింగ్ శాఖ అధికారులు దగ్గరుండి కనీస మద్దతు ధరలో కోత విధిస్తుండడం విమర్శలకు దారితీస్తోంది. కొనుగోళ్లతోపాటే దోపిడీ ప్రారంభం.. రెండు రోజులుగా నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడి మంగళవారం ఎట్టకేలకు పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయని జిల్లా అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంటే.. ప్రారంభమైంది కొనుగోళ్లు కాదని, ప్రైవేటు వ్యాపారుల దోపిడీ అని పత్తి రైతులు లబోదిబోమంటున్నారు. ధరలో రూ.350 చొప్పున కోత విధించడంతో మార్కెట్ యార్డుకు పది క్వింటాళ్లు తెస్తున్న రైతులు సగటున రూ.3,500 నుంచి రూ.5,000 వరకు నష్టపోవాల్సి వస్తోంది. పెరిగిన సాగు వ్యయానికి, వచ్చిన రాబడికి భారీ మొత్తంలో తేడా ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. సీసీఐ ధర క్వింటాల్‌కు రూ.3,885.. కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.4,050 చొప్పున కొనుగోలు చేయాల్సిన సీసీఐ తేమ పేరుతో రూ.3,885కి ధర తగ్గించింది. తేమ శాతం 17కు మించి ఉన్న పత్తిని అసలు కొనుగోలు చేయడం లేదు. అంతకుమించి తేమ ఉన్న పత్తిని వ్యాపారులు తీసుకుంటున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో 20 శాతానికి మించి తేమ ఉంటుండటంతో రైతులకు ప్రైవేటు వ్యాపారులే దిక్కవుతున్నారు. దీంతో యార్డుకు వస్తున్న పత్తిలో కనీసం ఐదు శాతానికి మించి సీసీఐ కొనుగోలు చేయడం లేదు. నేటి నుంచి కొనుగోళ్లు బంద్.. ప్రారంభమైన ఒక్క రోజులోనే పత్తి కొనుగోళ్లకు బ్రే క్ పడింది. సోమవారం అసలు కొనుగోళ్లే ప్రారంభం కాలేదు. మంగళవారం నుంచి తూకాలు వేస్తున్నారు. ఇంతలోనే దీపావళి పండుగ పురస్కరించుకుని ఈ నెల 22 నుంచి 26 వరకు మార్కెట్ యార్డుల్లో కొనుగోళ్లు జరగవని ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ కార్యదర్శి ఎ.కిష్టాగౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27 నుంచి తిరిగి కొనుగోళ్లు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు. -
సీసీఐ.. అంతే..!
తేమ సాకు.. పత్తి రైతుకు షాకు పత్తి రైతులను ప్రైవేట్ వ్యాపారులు నిలువు దోపిడీ చేస్తుంటే.. మద్దతు ధర అందించి ఆదుకోవాల్సిన సీసీఐ ప్రేక్షకపాత్ర వహిస్తోంది. పత్తిలో తేమ, నాణ్యత సాకుతో కొనుగోళ్లు చేపట్టకుండా గంపెడాశలతో వచ్చిన రైతులకు షాకిస్తోంది. మద్దత ధర రూ.4050 కనిష్టం రూ.3500 మోడల్ రూ.3700 గరిష్టం రూ.3900 జమ్మికుంట: పత్తి మార్కెట్ సీజన్ షురువైంది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కాస్త ఆలస్యంగానే మేల్కొంది. జిల్లాలో మొదటి పత్తి కొనుగోలు కేంద్రాన్ని కరీంనగర్ మార్కట్లో తెరిచింది. రెండో కేంద్రాన్ని మంగళవారం మంత్రి ఈటెల రాజేందర్ చేతుల మీదుగా జమ్మికుంట మార్కెట్లో ప్రారంభిం చింది. మొన్నటిదాకా ప్రైవేట్ వ్యాపారుల చేతిలో చిత్తయిన రైతులు సీసీఐ రాకతో మద్దతు ధర లభిస్తుందని ఆశపడ్డారు. బుధవారం కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి పలువురు రైతులు సుమారు ఐదు వేల క్వింటాళ్ల పత్తిని మార్కెట్‌కు తీసుకొచ్చారు. కానీ.. తేమ సాకుతో బస్తాలు చూసేందుకు సీసీఐ అధికా రులు ముఖం చాటేశారు. ఉదయం 11 గంటల వరకు సీసీఐ కొనుగోళ్లు చేపట్టలేదు. అధికారులు కనీసం తేమ పరిశీలించేందుకు కూడా ముందుకు రాకపోవడం రైతులను నిరాశ పరిచింది. సమాచారం అందుకున్న సాక్షి మార్కెట్‌కు వెళ్లి రైతులను పలకరించింది. ‘సీసీఐ పత్తి కొంటుం దని పొద్దున్నుంచి చూస్తున్నా.. పగలైనా ఒక్క బస్తా కొనలేదు..’ అని జమ్మికుంట మండలం గండ్రపల్లికి చెందిన మల్లారావు అనే రైతు అధికారుల తీరుపై మండిపడ్డాడు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మార్కెట్లోకి వచ్చిన పాత్రికేయులను చూసిన సీసీఐ అధికారులు ఓ పత్తి కూటు వద్ద తేమ పరికరంతో పరీక్షించారు. 12 నుంచి 16 శాతం వరకు తేమ ఉందని, తాము కొనలేమని చేతులెత్తేశారు. దీంతో ఇదే పత్తిని ప్రైవేట్ వ్యాపారులు గరిష్టంగా క్వింటాల్‌కు రూ.3900 వరకు చెల్లించారు. వేలాది బస్తాలకు మాత్రం రూ.3500 నుంచి రూ.3700 ధర మాత్రమే పెట్టారు. సర్కారు మద్దతు ధర క్వింటాలుకు రూ. 4050 లభిస్తుందని ఆశించిన రైతులు.. ఎప్పటిలాగే సీసీఐ తీరుతో వ్యాపారుల చేతిలో నష్టపోయా రు. తమకు ఇంత అన్యాయం జరుగుతుంటే సర్కారు ఏం చేస్తోందని పలువురు రైతులు ప్రశ్నించారు. మంత్రి ఈటెల రాజేందర్ స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. -
సీసీఐ మీనమేషాలు..
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : పత్తి రైతుకు ఈ ఏడాది ‘మార్కెట్’ కష్టాలు తప్పేలా లేవు. ఈ సీజనులో పత్తి కొనుగోళ్లకు ప్రైవేటు వ్యాపారులు ప్రస్తుతానికి ఆసక్తి చూపకపోవడంతో రైతులు సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)పైనే ఆశలు పెట్టుకున్నారు. కానీ.. ప్రభుత్వ రంగ సంస్థ పత్తి కొనుగోళ్లను ప్రారంభించడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. ఈ నెల 27 వరకు కొనుగోళ్లు ప్రారంభించే ప్రసక్తే లేదని సంస్థ అధికారులు తేల్చిచెబుతున్నారు. దీంతో పత్తి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఖరీఫ్ ప్రారంభంలో కరువు.. తర్వాత అధిక వర్షాలు.. ఇలా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని రైతులు పత్తిని పండించి అమ్ముకుందామంటే దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. వెంటనే పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలని గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమీక్షలో రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీష్‌రావు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. కానీ.. సీసీఐ తీరును పరిశీలిస్తే ఈ ఆదేశాలు ఇప్పట్లో అమలుకు నోచుకునే పరిస్థితి కనిపించడం లేదు. రైతులు మాత్రం పత్తిని మార్కెట్ యార్డులకు తరలిస్తున్నారు. సోమవారం నుంచి ప త్తిని ఆదిలాబాద్ మార్కెట్ యార్డు కు తీసుకువస్తామని రైతు సంఘాల నాయకులు కలెక్టర్ ఎం.జగన్మోహన్ను కలిసి విజ్ఞప్తి చేశారు. అదే జరి గితే యార్డుకు వచ్చిన పత్తిని కొనుగోలు చేసే వారెవరో తెలియక మా ర్కెటింగ్ శాఖ అధికారులు తలలు పట్టుకోవాల్సి వస్తోంది. బేల, తల మడుగు, ఆదిలాబాద్ మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో రైతులు పత్తిని మార్కెట్ యార్డుకు తరలించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. పత్తి కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.4,050లుగా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే.. ఈసారి కూడా పత్తి రైతుకు కనీస మద్దతు ధర లభించే అవకాశాలు కనిపించడం లేదు. జిల్లాలో ప్రధానంగా ఆదిలాబాద్‌తోపాటు, భైంసా మార్కెట్ యార్డుకు రైతులు ఎక్కువగా పత్తిని తీసుకువస్తారు. 21 కేంద్రాల ద్వారా పత్తి కొనుగోళ్లు.. ఈ సీజన్లో ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో 21 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చే స్తామని సీసీఐ ఆదిలాబాద్ బ్రాంచ్ మేనేజర్ అర్జున్ధవా పేర్కొన్నారు. ఈ మేరకు సీసీఐ ఆయా కేంద్రాల పరిధిలో ఉన్న జిన్నింగ్ మిల్లులతో ఒప్పందం కుదుర్చుకుంది. కానీ.. కొనుగోళ్లు మాత్రం మరో పక్షం రో జుల తర్వాతేనని ఆ సంస్థ అధికారు లు చెబుతున్నారు. వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం ఈ ఖరీఫ్ సీజ న్లో ఆదిలాబాద్ జిల్లాలో 3.18 లక్ష ల హెక్టార్లలో పత్తి సాగు చేసినట్లు అంచనాకొచ్చారు. ఈ లెక్కన సు మారు 35 నుంచి 40 లక్షల క్వింటాళ్ల పత్తి మార్కెట్‌కు వచ్చే అవకాశాలున్నట్లు మార్కెటింగ్ శాఖ అంచనా. అయితే.. ఈ సీజనులో పత్తి కొనుగోళ్లపై ఇటీవల అఖిలపక్ష నాయకులతో సమావేశం నిర్వహించిన జి ల్లా అధికార యంత్రాంగం, ఈనెల 14న ప్రైవేటు వ్యా పారులతో సమావేశం కావాలని నిర్ణయించారు. -
రైతుల నోట్లో మట్టి
అనంతపురం టౌన్ : లాభాల కోసం మిల్లర్లు.. కమీషన్ల కోసం అధికారులు కుమ్మక్కై వరి రైతుల నోట్లో మట్టి కొట్టారు. ఐకేపీ ఆధ్వర్యంలో మహిళా సంఘాలు సేకరించిన వరి ధాన్యాన్ని సివిల్ సప్లయీస్ అధికారులు కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. దీంతో సేకరించిన ధాన్యం గోదాముల్లోనే నిల్వ ఉండిపోయింది. వివరాల్లోకెళితే.. ధాన్యానికి సరైన ధర లభించకపోవడంతో ‘వరి రైతు డీలా’ శీర్షికన సాక్షిలో గత నెల 28న ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఇందిరా క్రాంతి పథం ఆధ్వర్యంలో ఈ నెల ఐదో తేదీన జిల్లా వ్యాప్తంగా ఆరు చోట్ల (ధర్మవరం, కల్లూరు, కణేకల్లు, కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం, నీలకంఠాపురం) వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఏ గ్రేడ్ వరి ధాన్యానికి క్వింటా రూ.1345, సాధారణ రకానికి రూ.1310 మద్దతు ధర నిర్ణయించి మహిళా సంఘాల ద్వారా ధాన్యం సేకరణ చేయించారు. ఇప్పటివర కు ధర్మవరం, కల్లూరు, కణేకల్లు కేంద్రాల ద్వారా 1020 క్వింటాళ్లు సేకరించారు. నిబంధనల ప్రకారం రైతుల నుంచి మహిళా సంఘాలు ధాన్యం సేకరిస్తే వాటిని సివిల్‌సప్లయీస్ అధికారులు కొనుగోలు చేయాలి. మహిళా సంఘాలకు కమీషన్ పోనూ మిగిలిన మొత్తాన్ని రైతులకు చెల్లించాలి. ఇదే గనుక జరిగితే తమ ఆదాయానికి గండి పడుతుందనుకున్న ప్రైవేట్ వ్యాపారులు, మిల్లర్లు సిండికేట్ అయ్యారు. రైతుల నుంచి క్వింటా ధాన్యం రూ.900 నుంచి రూ.950కే కొని అధిక ధరలకు విక్రయించుకుని సొమ్ము చేసుకుంటున్న వీరంతా ఒక నిర్ణయానికి వచ్చారు. సివిల్ సప్లయీస్ అధికారులతో కుమ్మక్కై ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని కొనకుండా అడ్డుకట్ట వేయించారని తెలుస్తోంది. అధికారులు కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోవడంతో మహిళా సంఘాలు సేకరించిన 1020 క్వింటాళ్ల ధాన్యం ఆయా కొనుగోలు కేంద్రాల గోడౌన్లలోనే నిల్వ ఉండిపోయింది. దీంతో రైతులకు కూడా మహిళా సంఘాలు డబ్బు చెల్లించలేకపోతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి ఐకేపీ కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. రేపు డబ్బులిస్తాం ఇందిరా క్రాంతి పథం ద్వారా మహిళా సంఘాలు ప్రారంభించిన కొనుగోలు కేంద్రాలకు పెద్దగా ధాన్యం రావడం లేదు. కల్లూరు నుంచి మాత్రమే కొంత వరి వచ్చింది. మహిళా సంఘాలు కొనుగోలు చేస్తే డబ్బులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పటి వరకూ కొనుగోలు చేసిన ధాన్యానికి రేపే డబ్బులిస్తాం. కొనుగోలు కేంద్రాలు ఎక్కడా మూత వేయాల్సిన అవసరం లేదు. - వెంకటేశం, జిల్లా మేనేజర్, పౌరసరఫరాలశాఖ -
రుణమో.. బ్యాంకరూ..!
ఆదిలాబాద్ అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : ఆకాశంలో మేఘాలు ఊరిస్తున్నాయి. చిరుజల్లులు కురిసిన కొద్దీ రైతులు ఖరీఫ్ పనులకు సిద్ధం అవుతున్నారు. వారం రోజు ల్లో నైరుతి రుతుపవనాలు వస్తాయనే సమాచారంతో విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసుకుంటున్నారు. వీటికి కావాల్సిన రుణాల కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. బ్యాంకు అధికారులు మాత్రం రుణమాఫీ సమసేంత వరకు కొత్త రుణాలు ఇవ్వడం కుదరదని చెబుతున్నారు. ఇక చేసేది లేక అదును దాటిపోయే పరిస్థితి ఉండటంతో అధిక వడ్డీలకైనా సరే అని ప్రైవేటు వ్యాపారుల ను ఆశ్రయిస్తున్నారు. కొంత మంది వడ్డీదారులు పట్టాపాస్ బుక్ దగ్గర పెట్టుకొని, అగ్రిమెంట్, ఒప్పంద పత్రాలు రాయించుకుని 20 శాతం చొప్పున వడ్డీ ఇవ్వాలని రాయించుకు ని అప్పు ఇస్తున్నారు. పంటలను కూడా తమకే అమ్మాలని షరతు పెడుతున్నట్లు సమాచారం. జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌లోనే రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు వడ్డీ వ్యాపారం సాగుతోందని సమాచారం. రైతుల బతుకులు మారడం లేదు. దళారులు మాత్రం రూ.కోట్లకు పడగలెత్తుతున్నారు. ఇక్కడ విచిత్రమేమిటంటే కొందరు వడ్డీ వ్యాపారులు బ్యాంకుల వద్ద రుణం తీసుకుని రైతులకు అధిక వడ్డీకి ఇవ్వడం విశేషం. 80 శాతం సరుకు రూపేణా.. రైతులకు అప్పు కింద 80 శాతం సరుకు రూపే ణా, 20శాతం నగదు రూపేణా అందిస్తుంటా రు. ఉదాహరణకు పది ఎకరాల భూమి ఉన్న రై తుకు సుమారు రూ.20 వేల విలువ గల విత్తనా లు, రూ.20వేల విలువగల క్రిమిసంహారక మం దులు ఇస్తుంటారు. పంట కాలం మధ్యలో దీపావళి పండగ సమయంలో కలుపు తీసేందుకు మరో రూ.20 వేలు నగదుగా అందిస్తారు. రైతు వద్ద నుంచి పట్టాదారు పుస్తకం తీసుకోవంతోపాటు ప్రామిసరీ నోట్‌ను రాయించుకుంటారు. జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో ఇలా ఉంటే తూర్పు ప్రాంతంలో ఇలా దళారుల దగ్గర నుంచే అప్పులు తీసుకున్న రైతులు పత్తి, ధాన్యం వాళ్లకే అమ్మాలి. మార్కెట్లో ఉన్న ధర కంటే తక్కువ ధర రూ.150 నుంచి రూ.250 లకు వారు కొనుగోలు చేస్తున్నారు. ఇచ్చిన అసలు రుణాలుకు వడ్డీ 20 శాతం రాయించుకున్న ఒప్పంద ప్రకారం చెల్లించాలని షరతులు పెడుతున్నారు. పంట పండిన తర్వాత సీజన్(జూన్ నుంచి జనవరి) మొత్తం అప్పుకు కలిపి 20 శాతం వడ్డీని వసూలు చేస్తుంటారు. మరో మోసం. కమీషన్ ఏజెంట్ల నుంచి అప్పులు తీసుకున్న రైతులు పంటను వారి ద్వారానే విక్రయించాలనే షరతు ఉంటుంది. రైతులు నేరుగా ఆయా కమీషన్ ఏజెంట్లు సూచించిన జిన్నింగ్ మిల్లులకు తీసుకెళ్లి పత్తిని విక్రయిస్తుంటారు. అక్కడ మధ్య దళారులు క్వింటాలుకు రూ.150 నుంచి రూ.250 చొప్పున ధర వ్యత్యాసం రైతు వద్ద సరుకును కొనుగోలు చేసి బడా వ్యాపారులకు విక్రయిస్తారు. వడ్డీ వ్యాపారులకు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది. రైతుల బతుకు మాత్రం మారడం లేదు. రైతులకు పండించిన పంటకు అసలు ధర రాక ఇటు తీసుకున్న రుణానికి అసలు వడ్డీ కట్టలేక అప్పుల ఊబిలో కురుకుపోయి. గత నాలుగైదు ఏళ్లలో అధికంగా ఆత్మహత్యల పాలవుతున్నారు. -
దారుణంగా పడిపోయిన ధాన్యం ధర
ఎన్నికల మిషతో సొమ్ము చెల్లింపు వాయిదా ఖర్చులు గిట్టుబాటు కాక రైతుల ఆందోళన ప్రేక్షక పాత్ర వహిస్తున్న మార్కెటింగ్ శాఖ తిరువూరు, న్యూస్‌లైన్ : ఎన్నికల హడావుడిలో పడి అధికారులు, ప్రజాప్రతినిధులు రైతుల గోడు పట్టించుకోవట్లేదు. దాళ్వా వరికోతలు చివరిదశకు చేరుతున్నా పౌరసరఫరాల సంస్థ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లు ఇష్టానుసారం ధర నిర్ణయించి రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. తిరువూరు నియోజకవర్గంలోని రెండు వ్యవసాయ సబ్డివిజన్లలో 20 వేల ఎకరాల్లో దాళ్వా సాగైంది. ఎకరాకు గరిష్టంగా 45 బస్తాల ధాన్యం దిగుబడి రావడంతో గత ఖరీఫ్ సీజన్లో ప్రకృతి అననుకూలతతో పంటనష్టం చవిచూసిన రైతాంగం ఈ దాళ్వా సీజన్లో తమ అప్పులు కొంతమేర తీరతాయని ఆశ పడ్డారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో మద్దతు ధర లభించక పెట్టుబడులు కూడా దక్కని పరిస్థితి నెలకొనడంతో ఆందోళన చెందుతున్నారు. మిల్లర్లు, ధాన్యం వ్యాపారులు కొన్న ధాన్యానికి వెంటనే డబ్బు చెల్లించలేమని, ఎన్నికల కారణంగా చెక్‌పోస్టులలో నగదు సీజ్ చేస్తున్నందున మే రెండోవారంలో సొమ్ము ఇస్తామని చెబుతుండటంతో గిట్టుబాటు ధర రాకపోగా అసలు సొమ్ములకే ఎసరు వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. దారుణంగా పడిపోయిన ధరలు... దాళ్వా ధాన్యానికి ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లు రోజుకొక ధర నిర్ణయిస్తున్నారు. సీజన్ ప్రారంభంలో క్వింటాలు ధర రూ.950 చొప్పున నిర్ణయించిన మిల్లర్లు ఇప్పుడు రూ.780కి మించి ఇవ్వలేమంటున్నారని రైతులు వాపోతున్నారు. యంత్రాలతో కోసిన వరి క్వింటాలుకు 17 కిలోల తరుగు వస్తున్నందున మద్దతు ధర వర్తించదని వ్యాపారులు చెబుతున్నారు. ఆరుదల ధాన్యానికి మాత్రమే 75 కిలోలకు రూ.1010 చొప్పున చెల్లిస్తున్నామని, దాళ్వా ధాన్యానికి ధర పలకట్లేదని వ్యాపార వర్గాలు కరాఖండిగా చెబుతుండటంతో గత్యంతరం లేక రైతులు ధాన్యం విక్రయిస్తున్నారు. కలెక్టరు దృష్టికి తీసుకెళ్లినా... దాళ్వా ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఆవశ్యకతను ఇటీవల తిరువూరు వచ్చిన జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు దృష్టికి పలువురు రైతులు తీసుకెళ్లారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే అంశం పరిశీలిస్తామని కలెక్టరు తెలిపినప్పటికీ ఇంతవరకు తదనుగుణంగా చర్యలు చేపట్టకపోవడంతో దాళ్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు అప్పు ఇచ్చిన వ్యాపారులు కల్లాల్లోనే ధాన్యాన్ని తక్కువ ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నా తప్పనిసరి పరిస్థితుల్లో తెగనమ్మవలసి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా రైతుల ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలని రైతులు కోరుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. కనీసం గిట్టుబాటు ధర లభించేవరకు మార్కెట్ కమిటీ గోదాముల్లో రైతుబంధు పథకంపై రైతుల ధాన్యాన్ని నిల్వ చేసుకునే సదుపాయం కల్పించాలని కోరుతున్నారు. -
జాడలేని సీసీఐ
ఆదిలాబాద్ అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : రెండు నెలల క్రితం పత్తి కొనుగోళ్లు అట్టహాసంగా ఆరంభించిన సీసీఐ వెయ్యి క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసింది. దీంతో జిల్లాలో ప్రైవేటు వ్యాపారులు చెప్పిన ధరకే రైతులు విక్రయిస్తున్నారు. సీసీఐ అధిక ధర చెల్లిస్తామంటున్నా రైతులు కన్నెత్తి చూడటం లేదు. ప్రధాన కారణం ప్రభుత్వం నిబంధనలు విధించడంతో ప్రైవేట్‌కే విక్రయిస్తున్నారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో అక్టోబర్ 30న కొనుగోళ్లు ప్రారంభించారు. రైతులు పట్టాపాసు పుస్తకం, బ్యాంక్ ఖాతా నంబర్‌తోపాటు వీఆర్వో ధ్రువీకరణపత్రం తీసుకురావాలని, 8 శాతం తేమ నిబంధన కారణంగా రైతులు వెనుకంజ వేస్తున్నారు. తీసుకొచ్చిన పత్తిలో నాణ్యత పేరిట కొర్రీలు పెడుతుండటంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించి నష్టాలు చవిచూస్తున్నారు. రైతులను ఆదుకుంటామని, గిట్టుబాటు ధర కల్పిస్తామని అధికారులు పేర్కొన్నా లాభం లేదు. 17 కేంద్రాల్లో కొనుగోళ్లు నిల్ జిల్లా వ్యాప్తంగా 17 మార్కెట్ యార్డులు ఉన్నాయి. వీటిలో సీసీఐ కాంటాలు తెరిచినా పత్తి విక్రయించడానికి రైతులు ముందుకు రావడం లేదు. కాగా, భైంసా మార్కెట్ యార్డులో 473 క్వింటాళ్లు, లక్సెట్టిపేటలో 532 క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు జరి పారు. 1,005 క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. గతేడాది 12 మార్కెట్ యార్డుల ద్వారా డిసెంబర్ నెల చివరి వరకు 12.13 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసింది. ఈ ఏడాది వెయ్యి క్వింటాళ్లు కూడా కొనుగోలు చేయలేదు. సవాలక్ష నిబంధనలు సీసీఐ అధికారులు నిబంధన పేరిట ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు వాపోతున్నారు. నిబంధనలు లేకుండా గతేడాది కొనుగోలు చేసిన విధంగా ఈసారి కూడా కొనుగోలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. సీసీఐ ద్వారా కొనుగోలు చేస్తే రైతులకు మేలు జరగడంతోపాటు ప్రభుత్వానికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. సీసీఐ అధికారులు అలాంటి దిశగా చర్యలు చేపట్టకపోవడంతో కొనుగోళ్లు జరగక పోవడానికి కారణమని తెలుస్తోంది. మార్కెట్ యార్డులో ప్రైవేట్ వ్యాపారుల కంటే ప్రతీరోజు పత్తి వేలంలో పది.. ఇరవై రూపాయలు పెంచుతున్నప్పటికీ రైతులు ఆసక్తి చూపడం లేదు. ప్రైవేట్ వ్యాపారులు 12 శాతం తేమ వరకు ఎలాంటి కోత విధించకుండా కొనుగోలు చేస్తుండగా సీసీఐ మాత్రం 8 శాతం వరకే ప్రకటించిన ధరను చెల్లిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా.. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 13.17 లక్షల క్వింటాళ్ల పత్తిని ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేశారు. గతేడాది డిసెంబర్ చివరి వరకు 12,82 లక్షల క్వింటాళ్ల పత్తి మార్కెట్ యార్డుల్లో కొనుగోళ్లు జరిగింది. గతేడాది మొత్తం 17 మార్కెట్ యార్డుల్లో 27.36 లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు జరిగింది. ఈయేడాది ఇప్పటివరకు 17.99 లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు జరిగింది. అధిక వర్షాల కారణంగా ఈ ఏడాది పత్తి పంట దిగుబడి తగ్గింది. గతేడాది ఎకరానికి 15 నుంచి 20 క్వింటాళ్ల వరకు దిగుబడి రాగా, ఈ ఏడాది 6 నుంచి 10 వరకు కూడా దిగుబడి రావడం లేదని రైతులు పేర్కొంటున్నారు. ఈసారి పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని వాపోతున్నారు. క్వింటాలుకు కనీసం రూ.6వేలు మద్దతు ధర చెల్లిస్తే కొంతమేరకు నష్టం పూడ్చుకునే వీలుంటుందని పేర్కొంటున్నారు.