అనంతపురం టౌన్ : లాభాల కోసం మిల్లర్లు.. కమీషన్ల కోసం అధికారులు కుమ్మక్కై వరి రైతుల నోట్లో మట్టి కొట్టారు. ఐకేపీ ఆధ్వర్యంలో మహిళా సంఘాలు సేకరించిన వరి ధాన్యాన్ని సివిల్ సప్లయీస్ అధికారులు కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు.
దీంతో సేకరించిన ధాన్యం గోదాముల్లోనే నిల్వ ఉండిపోయింది. వివరాల్లోకెళితే.. ధాన్యానికి సరైన ధర లభించకపోవడంతో ‘వరి రైతు డీలా’ శీర్షికన సాక్షిలో గత నెల 28న ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు.
ఇందిరా క్రాంతి పథం ఆధ్వర్యంలో ఈ నెల ఐదో తేదీన జిల్లా వ్యాప్తంగా ఆరు చోట్ల (ధర్మవరం, కల్లూరు, కణేకల్లు, కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం, నీలకంఠాపురం) వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఏ గ్రేడ్ వరి ధాన్యానికి క్వింటా రూ.1345, సాధారణ రకానికి రూ.1310 మద్దతు ధర నిర్ణయించి మహిళా సంఘాల ద్వారా ధాన్యం సేకరణ చేయించారు. ఇప్పటివర కు ధర్మవరం, కల్లూరు, కణేకల్లు కేంద్రాల ద్వారా 1020 క్వింటాళ్లు సేకరించారు.
నిబంధనల ప్రకారం రైతుల నుంచి మహిళా సంఘాలు ధాన్యం సేకరిస్తే వాటిని సివిల్‌సప్లయీస్ అధికారులు కొనుగోలు చేయాలి. మహిళా సంఘాలకు కమీషన్ పోనూ మిగిలిన మొత్తాన్ని రైతులకు చెల్లించాలి. ఇదే గనుక జరిగితే తమ ఆదాయానికి గండి పడుతుందనుకున్న ప్రైవేట్ వ్యాపారులు, మిల్లర్లు సిండికేట్ అయ్యారు.
రైతుల నుంచి క్వింటా ధాన్యం రూ.900 నుంచి రూ.950కే కొని అధిక ధరలకు విక్రయించుకుని సొమ్ము చేసుకుంటున్న వీరంతా ఒక నిర్ణయానికి వచ్చారు. సివిల్ సప్లయీస్ అధికారులతో కుమ్మక్కై ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని కొనకుండా అడ్డుకట్ట వేయించారని తెలుస్తోంది. అధికారులు కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోవడంతో మహిళా సంఘాలు సేకరించిన 1020 క్వింటాళ్ల ధాన్యం ఆయా కొనుగోలు కేంద్రాల గోడౌన్‌లలోనే నిల్వ ఉండిపోయింది. దీంతో రైతులకు కూడా మహిళా సంఘాలు డబ్బు చెల్లించలేకపోతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి ఐకేపీ కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.
రేపు డబ్బులిస్తాం
ఇందిరా క్రాంతి పథం ద్వారా మహిళా సంఘాలు ప్రారంభించిన కొనుగోలు కేంద్రాలకు పెద్దగా ధాన్యం రావడం లేదు. కల్లూరు నుంచి మాత్రమే కొంత వరి వచ్చింది. మహిళా సంఘాలు కొనుగోలు చేస్తే డబ్బులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పటి వరకూ కొనుగోలు చేసిన ధాన్యానికి రేపే డబ్బులిస్తాం. కొనుగోలు కేంద్రాలు ఎక్కడా మూత వేయాల్సిన అవసరం లేదు.
- వెంకటేశం, జిల్లా మేనేజర్, పౌరసరఫరాలశాఖ
రైతుల నోట్లో మట్టి
Published Sat, Jun 28 2014 2:21 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement