సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : పత్తి రైతులను దోపిడీ చేయడం షురువైంది. ప్రైవేటు వ్యాపారుల ఎత్తుగడలు ఫలించాయి. ధరలో కోత విధించి దండుకోవడానికి అధికారికంగానే లైన్ క్లియరైంది. రాష్ట్రంలో ఏ మార్కెట్‌లోనూ లేనివిధంగా తేమ శాతం పేరుతో సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొనుగోళ్ల నుంచి తప్పుకోవడంతో పత్తి రైతులకు ప్రైవేటు వ్యాపారులే దిక్కయ్యారు. దీన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారులు ధర దోపిడీ పర్వానికి తెరలేపారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆరుగాలం శ్రమించి పండించిన పత్తి పంటకు కనీస మద్దతు ధర కల్పించండి మహాప్రభో అంటూ మూడు రోజులుగా రోడ్డెక్కి నెత్తినోరు మొత్తుకున్నా పత్తి రైతుల ఆవేదన చివరకు అరణ్య రోదనగానే మిగిలిపోయింది. రైతుల ఉత్పత్తులకు కనీస మద్దతు ధర అందేలా వ్యాపారుల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన మార్కెటింగ్ శాఖ అధికారులు దగ్గరుండి కనీస మద్దతు ధరలో కోత విధిస్తుండడం విమర్శలకు దారితీస్తోంది.
కొనుగోళ్లతోపాటే దోపిడీ ప్రారంభం..
రెండు రోజులుగా నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడి మంగళవారం ఎట్టకేలకు పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయని జిల్లా అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంటే.. ప్రారంభమైంది కొనుగోళ్లు కాదని, ప్రైవేటు వ్యాపారుల దోపిడీ అని పత్తి రైతులు లబోదిబోమంటున్నారు. ధరలో రూ.350 చొప్పున కోత విధించడంతో మార్కెట్ యార్డుకు పది క్వింటాళ్లు తెస్తున్న రైతులు సగటున రూ.3,500 నుంచి రూ.5,000 వరకు నష్టపోవాల్సి వస్తోంది. పెరిగిన సాగు వ్యయానికి, వచ్చిన రాబడికి భారీ మొత్తంలో తేడా ఉండడంతో ఆందోళన చెందుతున్నారు.
సీసీఐ ధర క్వింటాల్‌కు రూ.3,885..
కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.4,050 చొప్పున కొనుగోలు చేయాల్సిన సీసీఐ తేమ పేరుతో రూ.3,885కి ధర తగ్గించింది. తేమ శాతం 17కు మించి ఉన్న పత్తిని అసలు కొనుగోలు చేయడం లేదు. అంతకుమించి తేమ ఉన్న పత్తిని వ్యాపారులు తీసుకుంటున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో 20 శాతానికి మించి తేమ ఉంటుండటంతో రైతులకు ప్రైవేటు వ్యాపారులే దిక్కవుతున్నారు. దీంతో యార్డుకు వస్తున్న పత్తిలో కనీసం ఐదు శాతానికి మించి సీసీఐ కొనుగోలు చేయడం లేదు.
నేటి నుంచి కొనుగోళ్లు బంద్..
ప్రారంభమైన ఒక్క రోజులోనే పత్తి కొనుగోళ్లకు బ్రే క్ పడింది. సోమవారం అసలు కొనుగోళ్లే ప్రారంభం కాలేదు. మంగళవారం నుంచి తూకాలు వేస్తున్నారు. ఇంతలోనే దీపావళి పండుగ పురస్కరించుకుని ఈ నెల 22 నుంచి 26 వరకు మార్కెట్ యార్డుల్లో కొనుగోళ్లు జరగవని ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ కార్యదర్శి ఎ.కిష్టాగౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27 నుంచి తిరిగి కొనుగోళ్లు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు.
పత్తి రైతులను దోపిడీ చేయడం ...
Published Wed, Oct 22 2014 2:37 AM | Last Updated on Sat, Sep 2 2017 3:13 PM
Advertisement