సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : పత్తి రైతుకు భరోసా ఇవ్వాల్సిన సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) దళారులు, వ్యాపారులకు అండగా నిలుస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతుల పత్తిని మాత్రమే కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిన ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ జిన్నింగ్ మిల్లుల యజమానులు, దళారుల పత్తిని యథేచ్ఛగా అక్రమంగా కొనుగోలు చేస్తోంది. వీరితో కుమ్మక్కవుతున్న సీసీఐ అధికారులు పెద్ద ఎత్తున అక్రమ దందాకు తెరలేపారు.
రైతులు తీసుకువచ్చిన పత్తిలో తేమ అధికంగా ఉందంటూ తిరస్కరిస్తున్న సీపీవోలు (కాటన్ పర్చేస్ ఆఫీసర్లు).. తమతో కుమ్మక్కైన వ్యాపారుల పత్తి నాణ్యతను ఏ మాత్రం పరిశీలించకుండానే కొనుగోళ్లు చేస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ అక్రమాల్లో ఆ సంస్థలోని కింది నుంచి పైవరకు స్థాయిని బట్టి ముడుపులు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారాల్లో సీపీవోలు కీలకంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అక్రమ కొనుగోళ్లు.. 30 శాతానికి పైనే..
ఈ కొనుగోలు సీజన్‌లో సీసీఐ జిల్లాలో 22 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 5.14 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసినట్లు మార్కెటింగ్ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ పత్తి విలువ సుమారు రూ.208 కోట్ల వరకు ఉంటుంది. ఇలా సీసీఐ కొనుగోలు చేసిన పత్తిలో సుమారు 30 శాతం పైగా పత్తిని దళారులు, వ్యాపారుల వద్దే కొనుగోలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ అక్రమ కొనుగోలు చేసిన పత్తి విలువ సుమారు రూ.50 కోట్లకుపైగానే ఉంటుందంటే.. ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఏ మేరకు అక్రమాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
బినామీ రైతుల పేరుతో..
ఆరుగాలం శ్రమించి పండించిన పత్తికి కనీస మద్దతు ధరైనా దక్కుతుందనే ఎంతో ఆశతో రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తున్నారు. తీరా ఇక్కడికి వచ్చాక పత్తిలో తేమ శాతం 12 మించి ఉందంటూ కాటన్‌పర్చేజ్ అధికారులు రైతుల పత్తిని కొనుగోలును తిరస్కరిస్తున్నారు. చేసేదేమీ లేక ఆ రైతులు ఆ పత్తిని ప్రైవేటు వ్యాపారులకు విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారులు ధరలో రూ.300 నుంచి రూ.400 వరకు కోత విధించి క్వింటాల్‌కు రూ.3,500 నుంచి 3,600 చొప్పున కొనుగోలు చేస్తున్నారు.
ఇలా రైతుల వద్ద కొనుగోలు చేసిన ఇదే పత్తిని బినామీ రైతుల పేరుతో సీసీఐకి రూ.4,050 (కనీస మద్దతు ధర) చొప్పున విక్రయిస్తున్నారు. ఒక్కో క్వింటాల్‌పై సుమారు రూ.400 చొప్పున సీసీఐ అధికారులు, వ్యాపారులు కలిసి పంచుకుంటున్నారు. ఇలా నిత్యం వేల క్వింటాళ్ల అక్రమ కొనుగోళ్లతో రూ.లక్షలు దండుకుంటున్నారు. బోగస్ పట్టాదారు పాసుపుస్తకాల జిరాక్స్‌లను పెట్టి ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు.
చెక్కుల విధానంతో అక్రమాలకు ఊతం..
రైతుల వద్ద కొనుగోలు చేసిన పత్తికి సంబంధించిన డబ్బుల చెల్లింపుల్లో ప్రస్తుతం చెక్కుల విధానం అమలవుతోంది. కానీ నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసే విధానం ఉంటే ఈ అక్రమ కొనుగోళ్లకు చాలా వరకు చెక్ పడుతుంది. కానీ ఈ ఖాతాల్లో జమ చేసే విధానాన్ని అమలు చేయడంలో సీసీఐ అధికారులు కావాలనే జాప్యం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
ఈ విధానం అమలయ్యేలా చూడాల్సిన జిల్లా అధికార యంత్రాం గం కూడా ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. గతేడాది సీజన్‌లో నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే పత్తి డబ్బులు జమ చేసే వారు. దీంతో ఈ అక్రమాలకు చెక్ పడింది. కానీ ఈ ఏడాది కొనుగోలు సీజన్ ఊపందుకున్నా ఆన్‌లైన్ చెల్లింపుల విధానం ఇంకా అమలు చేయడం లేదు.
విజిలెన్స్ దృష్టి సారించాలి..
సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అక్రమ దందాపై కాటన్ కార్పొరేషన్ విజిలెన్స్ విభాగం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొనుగోళ్ల తీరుపై పూర్తిస్థాయిలో విచారణ చేపడితే రూ.కోట్లలో జరుగుతున్న అక్రమ దందా వెలుగు చూస్తుందని పత్తి రైతులు పేర్కొంటున్నారు. సీసీఐ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కావడం జిల్లాలో అడిగే నాథుడే లేకపోవడంతో అధికారులు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్న చందంగా తయారైందనే ఆరోపణలున్నాయి.
అక్రమ దందాకు సీఛీఐ
Published Thu, Nov 20 2014 2:36 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement