Cotton farmer
-
రోడ్డెక్కిన పత్తి రైతు
నాదెండ్ల: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పత్తి కొనుగోలు కేంద్రంలో రైతులకు మద్దతు ధర లభించటం లేదని, సాకులు చెబుతూ పత్తిని కొనుగోలు చేయకుండా తిరస్కరిస్తున్నారంటూ సోమవారం రైతులు రోడ్డెక్కారు. పల్నాడు జిల్లా గణపవరంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న వెంకటకృష్ణ ఎంటర్‌ప్రైజెస్‌లో ఇటీవల సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. నిబంధనల పేరుతో 90 శాతం పత్తి లోడులను తిరస్కరిస్తున్నారంటూ రైతులు ఆందోళనకు దిగారు. జాతీయ రహదారిపై బైఠాయించి.. పత్తి లోడు ట్రాక్టర్లను జాతీయ రహదారికి అడ్డంగా నిలిపి దిగ్బంధనం చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. తేమ 12 శాతం మించిందని, పత్తిలో కాయ ఉందని, తడిసిపోయిందంటూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి కొనుగోలు ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క రోజు కూడా రైతులకు న్యాయం జరగలేదని వాపోయారు. గత ప్రభుత్వంలో సీసీఐ కొనుగోలు కేంద్రంలో రైతులకు పూర్తిగా న్యాయం జరిగిందని తెలిపారు. ఇటీవల కురిసిన వర్షానికి ఎకరాకు 2–3 క్వింటాళ్ల మేర దిగుబడి నష్టపోయామని, కూలి ధరలు పెరిగి సాగు భారంగా మారిందన్నారు. రైతులు ఆందోళనకు దిగారన్న సమాచారంతో రూరల్ సీఐ సుబ్బానాయుడు సిబ్బందితో చేరుకుని రైతులతో మాటా్లడారు. సీఐ తాను ఉన్నతాధికారులతో మాట్లాడతానని సర్దిచెప్పి ఆందోళన విరమింపచేశారు. అనంతరం సీసీఐ బయ్యర్ రమే ష్ బాబు, రైతులతో సంప్రదింపులు చేశారు. -
అమృత్ పత్తి.. ఎకరానికి 20 క్వింటాళ్ల దిగుబడి! ఎలా సాగు చేయాలంటే?
పత్తి దిగుబడుల పరంగా ఎకరానికి 20 క్వింటాళ్లు సాధించిన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం కొల్హారికి చెందిన యువ రైతు ఫడ్ విజయ్ ఆదర్శంగా నిలుస్తున్నారు. రెట్టింపు దిగుబడి సాధించిన విషయం ఆ నోటా ఈ నోటా తెలుసుకొని పరిసర గ్రామాల రైతులు ఆసక్తిగా పొలాన్ని చూసి వెళ్తున్నారు. సాధారణ సాగులో కొంత మందికి 6 నుంచి 8 క్వింటాళ్లు, మరికొంత మందికి 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అయితే, ఈ రైతు ఏకంగా రెట్టింపు కంటే అధిక దిగుబడి సాధించడమే రైతులను ఆకర్షిస్తోంది. ఫడ్ విజయ్‌కు మహరాష్ట్రలోని యవత్మాల్ జిల్లా అంబోడ గ్రామంలో చుట్టాలు ఉన్నారు. ఒకసారి ఆ గ్రామానికి వెళ్లినప్పుడు అక్కడ అమృత్ ప్యాటర్న్‌లో సాగు చేయడాన్ని గమనించాడు. దిగుబడి అధికంగా వస్తుందని ఆ రైతులు చెప్పడంతో ఆ వైపు మొగ్గు చూపాడు. అమృత్ పద్ధతి అంటే..? యవత్మాల్ జిల్లా మహాగావ్ తాలూకా అంభోద గ్రామానికి చెందిన రైతు శాస్త్రవేత్త అమృత్‌రావు దేశ్‌ముఖ్ తన క్షేత్రంలో అనేక ఏళ్లపాటు ప్రయోగాలు చేసి ఈ సాగు పద్ధతిని రూపొందించారు. అందువల్లనే అమృత్ ప్యాటర్న్ అని పేరు వచ్చింది. ఏకంగా 50 క్వింటాళ్ల వరకు ఎకరంలో పత్తి దిగుబడి సాధించిన ఘనత ఆయనిది. ఆదిలాబాద్ జిల్లాలో సాధారణంగా పత్తి సాగులో రైతులు మొక్కల మధ్య కొంచెం అటూ ఇటుగా ఒక అడుగు, వరుసల మధ్య 3 నుంచి 4 అడుగులు లేదా 4 నుంచి 5 అడుగుల దూరం పాటిస్తారు. అమృత్ ప్యాటర్న్‌లో మొక్కల మధ్య దూరం కచ్చితంగా ఒక అడుగు ఉండే చూస్తారు. ఒక వరుస మధ్య 4 అడుగులు, ఆ పక్కన వరుస మధ్య దూరం 6 అడుగుల దూరం పాటిస్తారు. అంటే.. మొదటి రెండు వరుసల మధ్య దూరం నాలుగు అడుగులు.. రెండు, మూడు వరుసల మధ్య ఆరు అడుగుల దూరం అనుసరిస్తారు. ఇదే తీరులో చేనంతా పాటిస్తారు. ఇదే విధానాన్ని విజయ్ అవలంభించారు. నెల తర్వాతే ఎరువులు.. పత్తి సాగులో మొదటి నెల రోజుల పాటు ఎలాంటి ఎరువులు, పురుగుమందులు వాడలేదు. ఇలా చేయటం వల్ల మొక్కకు కొమ్మలు ఎక్కువగా వస్తాయి. విత్తిన నెల తర్వాత ఎకరాకు ఒక బ్యాగు 10:26:26 వేశారు. ఆ తర్వాత నెలలోనూ అదే మోతాదులో అదే ఎరువుతో పాటు అతి తక్కువ ధరకు లభ్యమయ్యే పురుగుల మందు వాడినట్టు వివరించారు. మూడో నెల తర్వాత 5 కేజీల సల్ఫర్, ఆ తర్వాత 25 కేజీల మెగ్నీషియం నెలకు అందిస్తే సరిపోతుందని విజయ్ తెలిపారు. తద్వారా ప్రతి మొక్కకు వచ్చే కొమ్మలైనా ప్రధాన కొమ్మ, పిల్ల కొమ్మలు చాలా తక్కువ దూరంలో వస్తాయని తెలిపారు. పూత, కాత ఎక్కువగా రావడంతో పాటు రాలిపోకుండా ఉంటాయని విజయ్ వివరించారు. సాళ్ల మధ్య ఎక్కువ దూరం పెట్టడం వల్ల గాలి, వెలుతురు బాగా తగిలి అధిక దిగుబడి వస్తోంది. చీడపీడల బెడద తక్కువగా ఉంటుందని అనుభవపూర్వకంగా విజయ్ చెబుతున్నారు. ఎకరానికి రూ. 20 వేలు ఖర్చయ్యింది. 20 క్వింటాళ్ల పత్తి తీసిన తర్వాత మళ్లీ నీటి తడి ఇచ్చారు. ఫలితంగా మున్ముందు కూడా మరికొంత పత్తి దిగుబడి రావచ్చని విజయ్ ఆశిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి అమృత్ పద్ధతిని అవలంభించడం ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధ్యమవుతుంది. ఎరువులు, పురుగుల మందులు ఎక్కువగా వాడే అవసరం పడదు. కలుపు తీయడంతో పాటు ఎరువులు, మందుల ఖర్చుల్లో చాలా ఆదా అవుతుంది. అధిక సాంద్రతతో పూత, కాత రావడం జరుగుతుంది. – సాయిప్రణీత్(96768 83233), వ్యవసాయ విస్తరణాధికారి, కొల్హారి గ్రామం సాగు పద్ధతి మార్చుకొని అధిక దిగుబడి సాధించా... రెండేళ్ల కింద పత్తి సాగులో ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. మహరాష్ట్రలో కొంతమంది రైతులు అవలంభిస్తున్న అమృత్ ప్యాటర్న్‌లో గతేడాది పత్తి సాగు చేశాను. కొన్ని కాయలు కూడా కుళ్లిపోయాయి. అప్పుడు 9 నుంచి 11 క్వింటాళ్ల మధ్య దిగుబడి వచ్చింది. అమృత్ విధానాన్ని పూర్తిస్థాయిలో పాటించకపోవడంతో దిగుబడి అంతకు పరిమితమైంది. రెండో ఏడాది.. గడిచిన వానా కాలంలో ఈ విధానంలో అమృత్ ప్యాటర్న్‌లో అన్ని పద్ధతులను పూర్తిస్థాయిలో అవలంభించాను. ఎకరానికి 20 క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చింది. – ఫడ్ విజయ్ (77024 42958), ఇన్నోవేటివ్ పత్తి రైతు, కొల్హారి గ్రామం, గుడిహత్నూర్ మండలం, ఆదిలాబాద్ జిల్లా – గొడిసెల కృష్ణకాంత్ గౌడ్, స్టాఫ్ రిపోర్టర్, సాక్షి, ఆదిలాబాద్. చదవండి: Goat Farming: మేకలు, నాటు కోళ్ల పెంపకం.. ఏడాదికి రూ. 8–9 లక్షల నికరాదాయం! మరి ఖర్చు? Red Rice Health Benefits: బియ్యంపై పొరలో ‘ప్రోయాంతో సైనిడిన్’..అందుకే అలా! ఎర్ర బియ్యం వల్ల.. -
Photo Feature: కరోనా వ్యాక్సిన్ చెక్‌పోస్ట్ చూశారా!
ఎన్నికలు జరిగేటప్పుడు లేదా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో గ్రామ శివార్లలో పోలీసులు వాహనాలను తనిఖీ చేయడం మనకు తెలిసిందే. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి రాజాపురం గ్రామంలో వంద శాతం కరోనా వ్యాక్సినేషన్ పూర్తిచేయాలనే లక్ష్యంతో ఎర్రగుంట పీహెచ్సీ సిబ్బంది వినూత్న ఆలోచన చేశారు. గ్రామంలోకి ప్రవేశించే చోట తాళ్లు కట్టి.. వచ్చివెళ్లే ప్రతీ ఒక్కరినీ వ్యాక్సినేషన్‌పై ఆరా తీశారు. వ్యాక్సిన్ వేయించుకున్న వారిని మాత్రమే ఆ దారి ద్వారా అనుమతించి.. లేని వారికి అక్కడికక్కడే వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా ఇరవై మందికి పైగా టీకా పంపిణీ చేశారు. – అన్నపురెడ్డిపల్లి పురి విప్పిన నెమలి కాదు గుస్సాడీ కిరీటం దీపావళి పండగ సందర్భంగా ఆదివాసీలు ప్రత్యేకంగా నిర్వహించుకునే దండారి ఉత్సవాలకు గిరిజనులు సన్నద్ధమవుతున్నారు. తరతరాలుగా వస్తున్న తమ సంస్కృతి సంప్రదాయాలను కొనసాగించేందుకు దండారీలో కీలకమైన గుస్సాడీ కిరీటాలను తయారు చేయిస్తున్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం పిట్టగూడలో నెమలి పింఛాలతో గుస్సాడీ కిరీటాలను తయారు చేశారు. వాటిని ఆదివాసులు ద్విచక్ర వాహనాలపై ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం నర్సాపూర్‌కు తీసుకొచ్చారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ రామా... కనవేమిరా... అయితే మార్కెట్.. లేదంటే ప్రకృతి.. రైతునెప్పుడూ కన్నీరు పెట్టిస్తూనే ఉంది. ఈసారి పత్తికి ధర బాగుంది అని సంతోషించేలోపే ప్రకృతి కన్నెర్రజేసింది. జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో చెట్టుమీదే పత్తి తడిచి పచ్చిముద్దయ్యింది. తడిసిన పత్తిని ఏరి కల్లాల్లోనో, ఇళ్ల ముందో ఆరబెడుతున్నారు రైతులు. తలమడుగు మండలం కజ్జర్ల గ్రామంలో మంగళవారం ఓ రైతు పత్తి పంటను రామాలయం ముందు ఇలా ఆరబెడుతూ కన్పించాడు. – సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
ఈ నామ్.. గందరగోళం
జమ్మికుంట(హుజూరాబాద్) : జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్లో మొదటి సారిగా పత్తి బస్తాలకు ఈ నామ్ పద్ధతిలో కొనుగోళ్లకు మంగళవారం అన్నిఏర్పాట్లు చేయగా మార్కెట్‌కు వచ్చిన పత్తి బస్తాలను ప్రధాన వ్యాపారులు ఎవరు ఆన్లైన్ కొనుగోళ్లకు ముందుకు రాలేదు. దీంతో బీ టైప్ వ్యాపారులు ఆన్లైన్ కొనుగోళ్లలో పాల్గొన్నారు. పోటీ లేక రైతులకు కనీస ధర లభించలేదని రైతులు వాపోయారు. జమ్మికుంట పత్తి మార్కెట్‌కు వివిధ ప్రాంతాల నుంచి 200 వాహనాల్లో రైతులు లూజ్ పత్తిని మార్కెట్‌కు తీసుకురాగా మార్కెటింగ్ శాఖ అధికారులు వాటికి వేలంపాటతో కొనుగోళ్లు జరిపారు. దీంతో గంట వ్యవధిలోనే లూజ్ పత్తి వాహనాలు మార్కెట్ యార్డు నుంచి వెళ్లిపోయాయి. బస్తాల్లో వచ్చిన పత్తికి మాత్రమే అధికారులు ఈ నామ్ పద్ధతి మొదలు పెట్టడంతో రైతులు మధ్యాహ్నం 1 గంటవరకు యార్డులో ఎదురు చూపులు తప్పలేదు. నామ్‌కు విరుద్ధంగా తూకాలు.. ఈ నామ్ పద్ధతిని అమలుకు శ్రీకారం చుట్టిన క్రమంలో మార్కెట్‌కు వచ్చిన పత్తి బస్తాలను ఆన్లైన్ కాకముందే యార్డులో అడ్తిదారులు కొందరు ధరలు నిర్ణయించి తూకాలు మొదలు పెట్టారు. దీంతో మార్కెట్ సూపర్వైజర్ గౌస్ తూకాలను నిలిపివేసి అడ్తిదారుల తీరుపై మండిపడ్డారు. నామ్ కొనుగోళ్లు ప్రారంభిస్తే ఎందుకు తుకాలు వేస్తున్నారని ప్రశ్నించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు పొద్దంతా యార్డులో ఏలా ఉంటారని, లూజ్ పత్తి తీసుకువచ్చిన రైతులు అమ్మకాలు పూర్తిచేసుకుని మార్కెట్ బయటకు వెళ్తుంటే బస్తాల రైతులు ఏం పాపం చేశారని అడ్తిదారులు ప్రశ్నించారు. ఒక్క, బస్తా, రెండు బస్తాలు తీసుకు వచ్చిన రైతులు అన్లైన్ కోసం గంటల కొద్ది ఎదురు చూస్తారా అంటూ సూపర్వైజర్ను నిలదీశారు. దీంతో అడ్తిదారులు తూకాలను నిలిపివేసి ఈ నామ్ వరకు ఎదురు చూడక తప్పలేదు. ముందుకు రాని వ్యాపారులు.. మార్కెట్లో ఈ నామ్ అమల్లోకి రావడం...అందులో కేవలం బస్తాలకే అమలు చేయడంతో ప్రధాన వ్యాపారులు ఇటువైపు కన్నెత్తి చూడలేదు. దీంతో బీ టైపు వ్యాపారులు ఇష్టానుసరంగా రైతులు తీసుకువచ్చిన బస్తాల పత్తికి ఆన్లైన్లో ధరలు నిర్ణయించారు. క్వింటాల్‌కు రూ.4,170 పత్తి మార్కెట్‌కు వివిధ ప్రాంతాల నుంచి రైతులు 96 క్వింటాళ్ల పత్తిని బస్తాల్లో తీసుకరాగా బీ టైప్ వ్యాపారులు ఆన్లైన్ క్వింటాల్ పత్తికి గరిష్ట ధర రూ. 4,170 నిర్ణయించారు. మోడల్ ధర రూ. 3,900, కనిష్ట ధర రూ. 3,500 చెల్లించారు. -
దగా చేసిన ధనుష్
వత్సవాయి మండలంలోని భీమవరం, మక్కపేట, ఇందుగపల్లి, వత్సవాయిలో ధనుష్–3, 4, 6 రకం వంగడాలతో 500 ఎకరాల్లో పత్తిసాగు చేపట్టారు. మొక్కలు ఏపుగా పది అడుగుల ఎత్తు∙పెరిగి కొమ్మలతో విస్తరించాయి. పైరును చూసిన రైతులు అధిక దిగుబడులు ఖాయం అని సంతోషించారు. అయితే ఆశించిన స్థాయిలో పూత, పిందె రాలేదు. అరకొరగా కాసిన కాయలు సన్నగా ఉండటంతో ఎకరానికి ఒకటి రెండు క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వస్తోంది. కోత ఖర్చులు కూడా రావడంలేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సాక్షి, భీమవరం (వత్సవాయి) : ఆరుగాలం కష్టపడి సాగు చేసినా ఎకరాకు క్వింటా కూడా దిగుబడి రాలేదు. తాము సాగు చేసింది కల్తీ విత్తనాలు అని తెలిసి తెల్లబోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని మొరపెట్టుకుంటున్నారు. మండలంలోని భీమవరం, మక్కపేట, ఇందుగపల్లి, వత్సవాయి గ్రామాలలో ఈ ఏడాది కొత్తగా వచ్చిన ధనుష్–3, 4, 6 రకం విత్తనాలను సుమారు 500 ఎకరాల్లో సాగు చేశారు. భీమవరం 250 ఎకరాలు, మక్కపేట 100, ఇందుగపల్లిలో 100, వత్సవాయిలో 50 ఎకరాలలో సాగు చేశారు. ఈ విత్తనాలను వత్సవాయి గ్రామంలోని ఒక షాపు నుంచి, భీమవరం గ్రామంలోని ఓ ప్రైవేటు వ్యక్తి నుంచి కొనుగోలు చేసి సాగు చేశారు. మొదట్లో పత్తి మొక్కలు ఏపుగా పది అడుగులకుపైగా పెరిగాయి. పంట ఎత్తు మాత్రం పెరిగింది కానీ పూత, పిందె మాత్రం ఆశించినంతగా రాలేదు. అక్కడక్కడా కాసిన పత్తి కాయలు కూడా సన్నగా కాశాయి. ఎకరానికి క్వింటా, రెండు క్వింటాళ్లు మాత్రమే దిగుబడులు రావడంతో రైతులకు ఏం చేయాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు. వేరే కంపెనీలకు చెందిన విత్తనాలను నాటిన రైతులకు 8 నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడులు వస్తుండడంతో కల్తీ విత్తనం వల్లనే నష్టపోయామని గ్రహించారు. ఎకరానికి లక్ష పెట్టుబడి పత్తి పంట సాగుచేయడానికి ఎకరానికి లక్ష రూపాయల వరకు పెట్టుబడులు పెట్టారు. సరాసరి కౌలు ఎకరానికి 30 వేలు కాగా ట్రాక్టర్ కిరాయి, విత్తనాలు, కూలీలు, పురుగుమందులు, ఎరువులు కలిపి మరో రూ.70 వేల వరకు పెట్టుబడులు పెట్టారు. ఎకరానికి 1, 2 క్వింటాళ్లు వస్తుండడంతో తీత కూలి ఖర్చులు కూడా రావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి తీతకు ఆసక్తి చూపని కూలీలు ఈ రకం విత్తనం సాగు చేసిన రైతులకు పత్తి తీసేందుకు కూడా కూలీలు రావడం లేదని చెబుతున్నారు. కాయ సన్నగా ఉండడంతోపాటు సక్రమంగా పగలకపోవడంతో కూలీలకు కూలి గిట్టుబాటు కావడంలేదు. పత్తిని తీసేందుకు కూలీలు రాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కల్తీ విత్తనాల వల్లనే నష్టపోయామని తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. మండల వ్యవసాయాధికారి పీఎం కిరణ్‌ను వివరణ కోరగా భీమవరం, మక్కపేట, ఇందుగపల్లి గ్రామాల నుంచి ధనుష్ విత్తనం వల్ల నష్టపోయాం తమను ఆదుకోవాలని 60 అర్జీలు వచ్చినట్లు చెప్పారు. విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశాం. -
'కాంగ్రెస్ నేతలే పంటలను తగులబెడుతున్నారు'
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం శాసనసభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. పత్తికి కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ఇచ్చి కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ సారి పత్తి రైతులకు మంచి మద్దతు ధర వస్తుందని ఆశిస్తున్నామని సీఎం చెప్పారు. 48 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేశారని తెలిపారు. ఇప్పటికీ 5 శాతం లోపే పత్తి మార్కెట్లోకి వచ్చిందన్నారు. కొన్ని చోట్ల మంచి పత్తికి కనీస మద్దతు ధర కంటే ఎక్కువనే ఇచ్చి కొనుగోలు చేస్తున్నారని వెల్లడించారు. మద్దతు ధర కోసమే రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. పంట కాలనీలు వేసి.. పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. కొన్ని చోట్ల కాంగ్రెస్ నేతలే పంటలను తగులబెట్టే కార్యక్రమం చేపడుతున్నారని సీఎం పేర్కొన్నారు. రైతులకు నష్టపరిహారం ఇవ్వాలంటే నాలుగు సంవత్సరాల బడ్జెట్ కూడా సరిపోదని సీఎం తెలిపారు. రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించాం. నాణ్యమైన కరెంట్‌ను అందిస్తున్నాం. రుణాలు మాఫీ చేయడంలో విజయం సాధించామని సీఎం తెలిపారు. -
దగాపడ్డ పత్తి రైతు
సాక్షి, పెద్దపల్లి: పత్తి రైతుకు మళ్లీ కష్టకాలం వచ్చింది. ఆరుగాలం కష్టపడి, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని పండించిన పంటకు కనీస ధర రాని దుస్థితి నెలకొంది. వ్యాపారులు కుమ్మక్కై రైతులను దోచుకునేందుకు సిద్ధమయ్యారు. నాణ్యత, తేమ శాతం సాకుతో క్వింటాల్‌కు రూ. వెయ్యి మాత్రమే ఇస్తామంటూ నిలువు దోపిడీకి తెరతీశారు. దీంతో గుండెలు మండిన రైతులు నిరసనకు దిగారు. పత్తి ఏరడానికైన కూలీ కూడా రావడం లేదంటూ రోడ్డెక్కారు. పత్తిని తగలబెట్టడమో.. మందు తాగి చావడమో తప్ప తమకు గత్యంతరం లేదని ఆందోళన చేశారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ దీనికి వేదికైంది. పత్తి కొనుగోళ్లు చేపట్టిన తొలిరోజే.. తేమ శాతం ఎక్కువగా ఉందంటూ సీసీఐ చేతులెత్తేయగా, వ్యాపారులు కుమ్మక్కై దారుణంగా ధర తగ్గించడంతో రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. నిర్ఘాంతపోయిన రైతన్న పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో సోమవారం సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అయితే రైతులు తెచ్చిన పత్తిలో తేమ 12 శాతం కన్నా అధికంగా ఉందంటూ సీసీఐ అధికారులు కొనుగోలు చేయలేదు. సాంకేతిక లోపం పేరుతో ఆన్‌లైన్‌నూ పక్కన పెట్టారు. ఇదే అదనుగా వ్యాపారులు దోపిడీకి దిగారు. క్వింటాల్‌కు రూ.1,000 నుంచి రూ.1,500 ఇస్తామని రైతులకు షాకిచ్చారు. మొదటి రోజు మార్కెట్‌కు 297 మంది రైతులు పత్తి తీసుకురాగా.. 89 మంది రైతులకు సంబంధించిన పత్తికి రూ.1,000 నుంచి రూ.1,500 వరకే ధర నిర్ణయించారు. దీంతో రైతులు ఆందోళనకు దిగారు. రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేశారు. పెద్దపల్లి టౌన్ సీఐ వచ్చి రైతులకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపచేశారు. అటు వ్యాపారులు కూడా రూ.2 వేల పైన చెల్లించి పత్తి కొనుగోలుకు ముందుకువచ్చారు. ఇదో పెద్ద కుట్ర వాస్తవానికి పత్తి మద్దతు ధర క్వింటాల్‌కు రూ.4,320. నాణ్యత లేకుంటే సాధారణంగా రూ.2 వేల నుంచి రూ. 3 వేల వరకు చెల్లిస్తుంటారు. కానీ సోమవారం పెద్దపల్లి మార్కెట్లో వ్యాపారులు కేవలం రూ.1,000 మాత్రమే చెల్లిస్తామనడం వెనుక కుట్ర ఉందని రైతులు పేర్కొంటున్నారు. కొంతమంది మిల్లర్లు, మార్కెట్లోని వ్యాపారులు కుమ్మక్కై కావాలనే ధరను తగ్గించేశారని.. దాంతో రైతులు మార్కెట్దాకా రాకుండా మిల్లర్లకే విక్రయిస్తారన్న ఉద్దేశంతో కుట్ర పన్నారని మండిపడుతున్నారు. మార్కెట్లో తాము ధర పెంచి కొనుగోలు చేసినా.. తర్వాత మిల్లర్లు కొనకపోతే నష్టపోతామని, అందుకే వాళ్లు చెప్పినట్లు చేస్తున్నామని ఓ వ్యాపారి బహిరంగంగానే పేర్కొనడం గమనార్హం. ఖమ్మంలోనూ ఆందోళన ఖమ్మం వ్యవసాయం: పత్తికి తగిన ధర కల్పించాలని, సీసీఐ ద్వారా కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో రైతులు, వామపక్షాల నేతలు సోమవారం ధర్నా చేశారు. తేమ నిబంధనను సడలించి పత్తి కొనుగోళ్లు చేయించాలని.. క్వింటాల్‌కు రూ.7 వేలు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. పత్తి కొనుగోళ్లలో అన్యాయం, సీసీఐ కేంద్రం ప్రారం భంపై మాట్లాడేందుకు రైతులు, నేతలు సోమవారం యార్డులోని కార్యాలయానికి వెళ్లగా సూపర్వైజర్లు మాత్రమే ఉండడంతో.. మార్కెట్ అధికారి రావాలంటూ ధర్నాకు దిగారు. మార్కెట్ కార్యదర్శి, సీసీఐ అధికారి యార్డుకు చేరుకుని రైతులు, నేతలతో మాట్లాడారు. రెండు రోజుల్లో రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. మా రక్తం తాగుతరా? ఈ మార్కెట్ ఎందుకు?.. మమ్మల్ని మోసం చేయడానికా? మా రక్తం తాగడానికి పెట్టిన్రా.. క్వింటాల్‌కు వెయ్యి ఇస్తరా.. పత్తి ఏరడానికి కూలీలకైన ఖర్చు కూడా కాదు.. ఇగ మందు తాగి చావడమే దిక్కు.. – మహిళా రైతు దామ కనకవ్వ, పెద్దపల్లి జిల్లా సబ్బితం నాణ్యత లేనందునే.. ఇటీవలి వర్షాలతో పత్తి నాణ్యత దెబ్బతిన్నది. దాంతో ధర పెట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. కొద్దిరోజులైతే మళ్లీ రైతులు అనుకున్నంత ధర వస్తుంది.. – గంట రమేశ్, ట్రేడర్, పెద్దపల్లి -
చెక్కులు వద్దంటూ రైతుల నిరసన
పరకాల: వరంగల్ రూరల్ జిల్లా పరకాల వ్యవసాయ మార్కెట్లో పత్తి రైతులకు అడ్తిదారులు చెక్కులు ఇవ్వడంపై నిరసన వ్యక్తం చేశారు. నగదు రూపంలో ఇవ్వకుండా చెక్కులు, ఆన్లైన్ చెల్లింపులు జరపడంతో బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోందంటూ మార్కెట్ అధికారులతో వాగ్వాదానికి దిగడంతో కొంత సేపు కొనుగోళ్లు నిలిచిపోయారుు. పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ తీసుకున్న నిర్ణయాలతో చాలాకాలం తర్వాత రైతులు మార్కెట్‌కు సరుకులను తీసుకొస్తున్నారు. మార్కెట్‌కు సరుకులను తీసుకొచ్చిన రైతులకు నగదు రూపంలో ఇవ్వకుండా చెక్కులు, ఆన్లైన్ ద్వారా చెల్లింపులు జరపాలని మార్కెట్ కమిటీ నిర్ణరుుంచింది. దీంతో కొంతమంది రైతులు గేటుకు తాళం వేసే ప్రయత్నించగా, వారిని చైర్మన్ అడ్డుకుని నచ్చజెప్పారు. ధర విషయంలో కూడా అత్యధికంగా రూ. 5,100లతో కొనుగోళ్లు చేరుుంచారు. -
అప్పుల బాధతో పత్తి రైతు ఆత్మహత్య
జయశంకర్‌జిల్లా: అప్పుల బాధ తాళలేక ఓ పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జయశంకర్ జిల్లా చిట్యాల మండలంలోని గిద్దెముత్తారం గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పంచిక శంకర్(30) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో పంట దిగుబడి సరిగ్గా రాకపోవడం.. చేసిన అప్పులు తీర్చే దారికానరాక తన పత్తి చేనులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుదాఘాతంతో పత్తి రైతు మృతి
పొలంలో దున్నుతున్న రైతు ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌నకు గురై మృతి చెందాడు. వివరాలివీ... ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం పడమటి నర్సాపురం గ్రామానికి చెందిన తెల్లబోయిన వెంకటేశ్వర్లు(53) రెండెకరాల్లో పత్తి సాగు చేశాడు. మంగళవారం మధ్యాహ్నం కలుపు తీతలో భాగంగా దున్నుతున్నాడు. నాగలికి పక్కనే స్తంభం నుంచి ఉన్న జీ వైర్ తాకటంతో షాక్‌తో వెంకటేశ్వర్లు పడిపోయాడు. చుట్టుపక్కల వారు గమనించి కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వెంకటేశ్వర్లుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ముగ్గురికీ వివాహాలయ్యాయి. -
పత్తిగింజలు మొలకెత్తకపోవడంతో.. ఆగిన రైతు గుండె
పత్తిగింజలు మొలకెత్తలేదనే మనోవేదనతో రైతు గుండె ఆగిన ఘటన వరంగల్ జిల్లా ఆత్మకూరులో ఆదివారం జరిగింది.మండల కేంద్రానికి చెందిన బుచ్చికొండ సమ్మిరెడ్డి(56) తనకున్న మూడెకరాల్లో వారం రోజుల క్రితం పత్తి విత్తనాలు వేశాడు. అప్పటి నుంచి వర్షాలు కురవకపోవడంతో 10 శాతం కూడా మొలకెత్తలేదు. వ్యవసాయం కోసం చేసిన అప్పు ఇప్పటికే రూ. 2 లక్షలు ఉన్నాయి. ఈ ఏడాది బ్యాంకుల్లో రుణం కోసం ప్రయత్నించి విఫలమయ్యూడు. ఇలా ఆవేదనకు గురవుతూ ఆదివారం ఉదయం భార్య వనమ్మతో కలిసి చేనుకు వెళ్లాడు. గింజలు మొలకెత్తక పోవడంతో ఆవేదనతో అలాగే కుప్పకూలిపోయూడు. పొరుగున ఉన్న రైతులు 108ను పిలిపించేలోపే మృతిచెందాడు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. -
పత్తి బీమాకు ధీమా కరువు!
♦ ఈ నెల 14 వరకు ప్రీమియం చెల్లింపు గడువు ♦ బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో చెల్లించని రైతులు సాక్షి, హైదరాబాద్: పత్తి రైతు మీద కత్తి కట్టినట్లుగా ఉంది పరిస్థితి. బీమాకు ధీమా కరువైంది. ఖరీఫ్ ఇంకా ఊపందుకోలేదు. పత్తి పంట బీమా గడువు మాత్రం సమీపిస్తోంది. ఈ నెల 14వ తేదీ నాటికి పత్తి పంట బీమాకు ప్రీమియం చెల్లించాలి. లేకుంటే వారికి ఒక్క పైసా బీమా సొమ్ము చేతికందదు. తెలంగాణ సర్కారే స్వయంగా ఈ తేదీని గడువుగా నిర్ణయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా గత ఖరీఫ్‌లో 42 లక్షల ఎకరాల్లో పత్తినే సాగు చేశారు. ఈసారి పత్తి సాగును తగ్గించాలని సర్కారు భావిస్తున్నా రైతులు ఇతర పంటలవైపు మరలడంలేదు. పత్తి పంటకు నష్టం జరిగితే వాతావరణ ఆధారిత బీమా పథకం (డబ్ల్యుబీసీఐఎస్) కింద రైతులు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. రైతులు తీసుకునే రుణం నుంచే బ్యాంకులు ప్రీమియం సొమ్మును మినహాయించుకుంటాయి. బ్యాంకులు ఇప్పటికీ కొత్త రుణాలు ఇవ్వకపోవడంతో రైతులు చాలామంది ప్రీమియం చెల్లించే పరిస్థితి లేకుండా పోయింది. కనీసం రుణం తీసుకునే రైతుల వివరాలు ఇస్తే వారు ప్రీమియం చెల్లించినట్లుగా భావించి బీమా జాబితాలో చేర్చుతామని బీమా కంపెనీలు చెప్పినా బ్యాంకులు పట్టించుకోవడంలేదన్న ఆరోపణలున్నాయి. మూడో విడత రుణమాఫీ సొమ్ము విడుదల చేయకుండా ఏమాత్రం కొత్త రుణాలు ఇవ్వబోమని బ్యాంకులు తేల్చి చెబుతున్నాయి. మరోవైపు ప్రీమియం గడువు పెంపుపైన సర్కారు శ్రద్ధ చూపడంలేదు. పత్తికి బీమా ప్రీమియాన్ని రైతులు మొత్తం బీమా సొమ్ములో 5 శాతం చెల్లించాలి. మిగిలిన ప్రీమియాన్ని కేంద్ర, రాష్ట్రాలు భరించాల్సి ఉంది. తమ వాటాను భరించడానికి సిద్ధంగా లేకపోవడం వల్లే రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ ప్రారంభం కాకముందే ప్రీమియం చివరి తేదీ ప్రకటించిందన్న విమర్శలూ ఉన్నాయి. తద్వారా రైతుల సంఖ్యను, రాయితీ సొమ్ము తగ్గించుకోవచ్చనేది సర్కారు ఆలోచన. అనుకూలమైన గడువు తేదీలు ప్రకటించుకోవాలని కేంద్రం స్పష్టం చేసినా రాష్ట్ర సర్కారు మాత్రం ఈ నెల 14ని చివరి గడువుగా ప్రకటించిందన్న విమర్శలున్నాయి. -
పత్తిరైతు ఆత్మహత్య
అప్పుల బాధ తాళలేక పత్తిరైతు ఉరి వేసుకొని తనువు చాలించాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా డిండి మండలం దాసరనెమలిపూర్ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శీనయ్య(38) పత్తి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోవడంతో.. వాటిని తీర్చే దారికానరాక ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చే సుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అన్నదాత ఆత్మహత్య
నల్లగొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలం నంబాపురం గ్రామ పంచాయతీ పరిధి బూడిదగట్టు గ్రామంలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దేపావత్ పాండునాయక్(40) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పత్తి సాగు కోసం, కుటుంబ అవసరాల కోసం మొత్తం రూ.4లక్షలు అప్పు చేశాడు. వర్షాభావ పరిస్థితులకు దిగుబడి రాకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. దీంతో సోమవారం రాత్రి ఉంట్లోనే పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. -
పత్తి రైతు ఆత్మహత్య
అప్పుల బాధ భరించలేక పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నల్లగొండ జిల్లా హాలియా మండలం రంగుండ్ల గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా పుల్లచెరువు మండలానికి చెందిన రమావత్ శివ(30) ఐదేళ్ల క్రితం రంగుండ్లకు వలస వచ్చాడు. అప్పటి నుంచి గ్రామంలో ఏడెకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి సాగు చేస్తున్నాడు. ఈక్రమంలో అప్పులు పెరిగిపోవడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పొలంలో రైతు ఆత్మహత్య
అప్పుల బాధతో మనస్తాపం చెందిన ఓ రైతు నల్లగొండ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్నాడు. మేళ్లచెర్వు మండలం మల్లారెడ్డిగూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బూక్యా కోట్య (50) పత్తి, మిరప సాగు చేశాడు. పత్తి పంట ఎండిపోగా, మిరపకు తెగులు సోకింది. దీంతో రూ.6 లక్షల అప్పులు తీర్చలేనేమోనని మనస్తాపం చెందిన కోట్య శనివారం రాత్రి పొలంలో పురుగుల ముందు తాగి ప్రాణాలు కోల్పోయాడు. కాగా.. పొలంలో విగత జీవిగా పడిఉన్న కోట్యాను ఆదివారం పొరుగు రైతులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అప్పులబాధతో పత్తి రైతు ఆత్మహత్య
చింతపల్లి: పత్తి పంట పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోవడంతో పాటు కూతురు వివాహం కోసం చేసిన అప్పు ఎక్కువవడంతో.. వాటిని తీర్చే దారి కానరాక ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం కొక్కిరాల తండలో శనివారం చోటు చేసుకుంది. తండాకు చెందిన కొర్ర భాను(44) తనకున్న రెండున్నర ఎకరాల భూమితో పాటు మరో ఐదున్నర ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి పంట సాగు చేశాడు. ఆశించిన మేర దిగుబడి రాకపోవడంతో.. పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పలు పెరిగిపోయాయి. దీనికి తోడు వారం రోజుల క్రితమే కూతురు వివాహం కోసం కూడా అప్పు చేశాడు. అవి తీర్చడం గురించి మధన పడుతున్న భాను ఈ రోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అప్పుల బాధతో పత్తి రైతు ఆత్మహత్య
చందంపేట: నల్గొండ జిల్లా చందంపేట మండలం నేరేడుగుమ్ము గ్రామంలో ఓ పత్తిరైతు బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన యాదయ్య(40) అనే రైతు తనకున్న 3 ఎకరాల పొలంలో పత్తి పంట వేశాడు. వర్షాభావంతో పంట ఎండిపోవడంతో అప్పుల బాధ ఎక్కువైంది. దీంతో మనస్థాపం చెందిన యాదయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు -
పత్తిరైతు ఆత్మహత్య
అప్పుల బాధ తాళలేక పత్తి రైతు తనువు చాలించాడు. తెచ్చిన అప్పులు తీర్చే దారి కానరాక పోవడంతో.. బలవంతంగా తనువు చాలించాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా పాల్వంచ మండలంలోని యానంబయలు పంచాయతి పరిధిలోని మందెరకలపాడు గ్రామంలో ఆదివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన కాటి నారాయణ(38) నాలుగెకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో పంట దిగుబడి సరిగ్గా లేకపోవడంతో.. మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
గుండెపోటుతో పత్తిరైతు మృతి
హాలియ: అప్పుల బాధ ఎక్కువై ఓ పత్తి రైతు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా హాలియ మండలం రంగుండ్ల గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బల్లు(48) అనే రైతు తనకున్న రెండున్నర ఎకరాలతో పాటు ఐదెకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాడు. పత్తి పంట ఆశించిన మేర దిగుబడి రాకపోవడంతో రెండు మూడు రోజులుగా అన్యమనస్కంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం గుండెపోటుకు గురై మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పత్తి రైతు ఆత్మహత్య
రాయికల్: అప్పుల బాధ తాళలేక పత్తి రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా రాయికల్ మండలం మైథాపూర్‌లో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మల్లారెడ్డి (50) అనే రైతు పత్తి సాగు చేశాడు. ఈ క్రమంలో పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోవడంతో.. అప్పు తీర్చే దారి కానరాక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పత్తి రైతు ఆత్మహత్య
అప్పుల బాధ భరించలేక మరో అన్నదాత బలయ్యాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా హాలియ మండలం రంగుండ్ల గ్రామంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బానోతు పర్ష్యా(25) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ ఏడాది తనకున్న ఐదెకరాల భూమిలో పత్తి సాగు చేశాడు.. ఆశించిన స్థాయిలో దిగుబడి లేకపోవడంతో.. అప్పులు తీర్చే దారి కానరాక ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
పత్తి రైతు ఆత్మహత్య
చందుర్తి: అప్పు తెచ్చి పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పత్తి పంట దిగుబడినివ్వక పోవడంతో.. తెచ్చిన అప్పులు తీర్చే దారి కానరాక పత్తి రైతు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా చందుర్తి మండలం బండపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మల్యాల దేవయ్య(55) పత్తి పంట సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో పెరిగిపోయిన అప్పులు తీర్చే దారి కనపడక పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
నల్లగొండ జిల్లా హాలియా మండలం అనుములకు చెందిన ఓ పత్తి రైతు అప్పుల భారంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన కృష్ణయ్య(60) తనకున్న ఆరెకరాల్లో పత్తి సాగు చేశాడు. అయితే, ఈ ఏడాది పత్తి దిగుబడులు సరిగ్గా రాలేదు. పెపైచ్చు మంచిధర కూడా లభించకపోవటంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దాదాపు రూ.5 ల క్షల వరకు అప్పులున్నాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం రాత్రి ఇంట్లోనే ఉరి వేసుకుని తనువు చాలించాడు. -
పత్తిరైతు ఆత్మహత్య
పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పుటు రైతు పీక మీద కత్తిలా దాపరించడంతో.. వాటిన తీర్చే దారి కానరాక పురుగుల మందు తాగి తనువు చాలించాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా డిండి మండలం కానాపూర్ పంచాయతి పరిధిలోని జోత్యతండాలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నామర్ల శ్రీను(36) తనకున్న ఎనిమిదెరాలతో పాటు మరో ఆరెకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి పంట సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో పెట్టుబడుల కోసం భారీ మొత్తంలో ప్రైవేటు వ్యక్తులనుంచి అప్పు తీసుకొచ్చాడు. కానీ పంట దిగుబడి సరిగ్గా లేకపోవడంతో.. అప్పులు తీర్చే దారి కానరాక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.