
సీసీఐ నిబంధనలు సడలించాలంటూ ఆందోళన
జాతీయ రహదారిపై బైఠాయింపు.. భారీగా ట్రాఫిక్ జామ్
నాదెండ్ల: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పత్తి కొనుగోలు కేంద్రంలో రైతులకు మద్దతు ధర లభించటం లేదని, సాకులు చెబుతూ పత్తిని కొనుగోలు చేయకుండా తిరస్కరిస్తున్నారంటూ సోమవారం రైతులు రోడ్డెక్కారు. పల్నాడు జిల్లా గణపవరంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న వెంకటకృష్ణ ఎంటర్‌ప్రైజెస్‌లో ఇటీవల సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది.
నిబంధనల పేరుతో 90 శాతం పత్తి లోడులను తిరస్కరిస్తున్నారంటూ రైతులు ఆందోళనకు దిగారు. జాతీయ రహదారిపై బైఠాయించి.. పత్తి లోడు ట్రాక్టర్లను జాతీయ రహదారికి అడ్డంగా నిలిపి దిగ్బంధనం చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. తేమ 12 శాతం మించిందని, పత్తిలో కాయ ఉందని, తడిసిపోయిందంటూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పత్తి కొనుగోలు ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క రోజు కూడా రైతులకు న్యాయం జరగలేదని వాపోయారు. గత ప్రభుత్వంలో సీసీఐ కొనుగోలు కేంద్రంలో రైతులకు పూర్తిగా న్యాయం జరిగిందని తెలిపారు. ఇటీవల కురిసిన వర్షానికి ఎకరాకు 2–3 క్వింటాళ్ల మేర దిగుబడి నష్టపోయామని, కూలి ధరలు పెరిగి సాగు భారంగా మారిందన్నారు.
రైతులు ఆందోళనకు దిగారన్న సమాచారంతో రూరల్ సీఐ సుబ్బానాయుడు సిబ్బందితో చేరుకుని రైతులతో మాటా్లడారు. సీఐ తాను ఉన్నతాధికారులతో మాట్లాడతానని సర్దిచెప్పి ఆందోళన విరమింపచేశారు. అనంతరం సీసీఐ బయ్యర్ రమే ష్ బాబు, రైతులతో సంప్రదింపులు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment