రాళ్లపాడు ప్రాజెక్టు వద్ద ఆందోళనకు దిగిన కుడి కాలువ పరిధిలోని రైతులు
ఇద్దరు రైతుల ఆత్మహత్యాయత్నం... అడ్డుకున్న తోటి రైతులు
ప్రాజెక్టులో చేపల పెంపకం కోసమే నీరు విడుదల చేయడం లేదని ఆగ్రహం
కందుకూరు/లింగసముద్రం: సాగునీటి కోసం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని రాళ్లపాడు ప్రాజెక్టు ఆయకట్టు రైతులు ఆందోళనకు దిగారు. ఆదివారం ప్రాజెక్టు వద్ద బైఠాయించి నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని నినదించారు. ఈ ఏడాది రాళ్లపాడు ప్రాజెక్టులోకి పూర్తి స్థాయిలో నీళ్లు వచ్చాయి. దీంతో ప్రాజెక్టు కుడి కాలువ కింద ఉన్న లింగసముద్రం, కొండాపురం మండలాల రైతులు నెల రోజులుగా పెద్ద ఎత్తున నార్లు పోశారు.
వారం కిందట కుడికాలువ గేటు ఊడి కింద పడిపోవడంతో నీటి విడుదల నిలిచిపోయింది. గేటుకు మరమ్మతులు చేసి పైకి లేపడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో నీరు రాక నారు ఎండిపోతోంది. ఈ పరిస్థితుల్లో ఆదివారం ఒక్కసారిగా రెండు మండలాల రైతులు ఆందోళనకు దిగారు. ప్రాజెక్టుపై రోడ్డు మీద బైఠాయించి వాహన రాకపోకలను అడ్డుకున్నారు.
అధికారులు, ప్రజా ప్రతినిధులు ఆయకట్టు రైతులను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రాజెక్టులో చేపల పెంపకంపై ఉన్న శ్రద్ధ... రైతులపై లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రాజెక్టులో పది రోజుల కిందట చేప పిల్లలను వదిలారని, అవి పెరిగేందుకు నీరు అవసరం కావడంతో కావాలనే కొందరు నాయకులు నీటి విడుదల కాకుండా జాప్యం చేయిస్తున్నారని ఆరోపించారు.
ధర్నా చేయడానికి వీల్లేదంటూ గొడవ
ఈ ఏడాది ప్రాజెక్టులో చేపలు వేసిన టీడీపీ నాయకుడు మద్దెల రామారావు వచ్చి ఇక్కడ ధర్నా చేయడానికి వీల్లేదని రైతులతో వాగ్వాదానికి దిగారు. రామారావుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘ప్రాజెక్టులో చేపలు వేసి గేట్లు పైకి లేవకుండా మీరే చేస్తున్నారా...’ అని మండిపడ్డారు. దీంతో కొద్దిసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది.
ఇద్దరు రైతుల ఆత్మహత్యాయత్నం
ఈ తరుణంలో చినపవని గ్రామానికి చెందిన తూమాటి బాలకోటయ్య అనే రైతు పురుగు మందు తాగేందుకు ప్రయత్నించగా, వెంటనే తమకు న్యాయం జరగకపోతే ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకుంటానని మరోరైతు సిద్ధమయ్యారు.
మిగిలిన రైతులు వారిని అడ్డుకుని సమస్య పరిష్కారం కోసం పోరాటం చేద్దామని సర్ది చెప్పారు. అదే సమయంలో అక్కడి చేరుకున్న వలేటివారిపాలెం ఎస్‌ఐ మదిరినాయుడు, గుడ్లూరు ఎస్‌ఐ వెంకట్రావ్, ప్రాజెక్టు ఈఈ వెంకటేశ్వర్లు రైతులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా, నీరు ఇచ్చే వరకు ధర్నాను విరమించే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు.
చేతులెత్తేసిన నిపుణుడు బాషా
ఊడిపడిపోయి కిందకు చేరిన గేటును పైకి లేపేందుకు నాలుగైదు రోజులుగా ప్రయత్నం చేస్తున్న నరసరావుపేటకు చెందిన నిపుణుడు, మెకానిక్ బాషా ఆదివారం పూర్తిగా చేతులెత్తేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీరు ఉండడం వల్ల మరమ్మతులు చేయడం సాధ్యంకాని, ఇక తాము ఏమీ చేయలేమని తేల్చి చెప్పారు.
ఎమ్మెల్యే ప్రచార ఆర్భాటంపై రైతుల ఆగ్రహం
కాలువకు నీరు రాక తాము అల్లాడుతుంటే ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాత్రం నీటిని విడుదల చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. నీరు విడుదలయ్యాయో... లేదో.. మా పొలాల వద్దకు వచ్చి చూస్తే తెలుస్తుందని మండిపడ్డారు.
25 ఎకరాల్లో వరినారు పోశాను
ప్రాజెక్టులోకి పూర్తి స్థాయిలో నీరు వచ్చాయని తెలియడంతో 25 ఎకరాల్లో వరి నారుమడులు పెట్టాను. తుపాను కారణంగా కురిసిన వర్షాలకు దుక్కులు కూడా దున్నాను. కుడికాలువకు నీరు విడుదల చేస్తారని 10 రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. నీరు విడుదల కాకపోవడం వరినారు ఎండిపోయింది. – ఇనుకొల్లు సతీష్, ఆయకట్టు రైతు, చినపవని, లింగసముద్రం మండలం
చేపల కోసమే నీరు విడుదల చేయడం లేదు
కొందరు నేతలు రాళ్లపాడు ప్రాజెక్టులో చేపలు వదిలారు. చేపలకు నీరు ఉంచుకోవాలనే ఉద్దేశంతో సాగుకు సక్రమంగా నీటిని విడుదల చేయడం లేదు. ఈ ఏడాది పుష్కలంగా ప్రాజెక్టులో నీరు ఉండడంతో 10 ఎకరాల్లో వరినార్లు పోశాను. నీరు విడుదల కాకపోవడంతో నార్లు ఎండిపోతున్నాయి. – టి.కమలాకర్‌రెడ్డి, పెదపవని, లింగసముద్రం మండలం
Comments
Please login to add a commentAdd a comment