నిద్రమాత్రలు ఇచ్చి, మానసిక రోగులుగా మారుస్తున్నారు
మైనారిటీ తీరిన మమ్మల్ని ఇళ్లకు పంపించేయండి
విశాఖలో నడిరోడ్డుపై ప్రభుత్వ వసతి గృహంలోని బాలికల ఆందోళన
ఆరిలోవ: జాతీయ రహదారిని ఆనుకుని విశాఖ వ్యాలీ స్కూల్‌కు సమీపంలోని ప్రభుత్వ బాలికల వసతిగృహంలో బుధవారం సాయంత్రం ఐదుగురు బాలికలు కలకలం సృష్టించారు. తమను హింసిస్తున్నారని, నిద్రమాత్రలు ఇచ్చి మానసిక రోగులుగా మారుస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ గోడదూకి రోడ్డుపైకి వచ్చారు. హాస్టల్ పర్యవేక్షణాధికారి ఎ.వి. సునీత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ద్వారకా ఏసీపీ అన్నెపు నర్సింహమూర్తి, ఆరిలోవ సీఐ మల్లేశ్వరరావు, ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు అక్కడకు చేరుకుని బాలికలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
అయినా వారు లోపలికి వెళ్లేందుకు నిరాకరించారు. విషయం తెలుసుకున్న రూరల్ తహసీల్దార్ పాల్‌కిరణ్ అక్కడకు చేరుకుని, సూపరింటెండెంట్ నుంచి వివరాలు సేకరించారు. అనంతరం ఆయన ఏసీపీ, ఆరిలోవ సీఐతో చర్చించారు. వీరంతా బాలికలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు శాంతించలేదు. మరోపక్క.. తహసీల్దార్, చిల్డ్రన్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యులు, బాలుర పరిశీలన గృహం సూపరింటెండెంట్ వచ్చి బతిమాలినా ఆ బాలికలు ససేమిరా అన్నారు.
దీంతో.. వారిని ఏయే జిల్లాల సీడబ్ల్యూసీల నుంచి తీసుకొచ్చారో.. వారితో సంప్రదించి ఆయా జిల్లాలకు తీసుకెళ్లిపోవాలని అధికారులు కోరారు. బాలికల తల్లిదండ్రులకు ఫోన్‌చేసి, వారిని ఇళ్లకు తీసుకుపోవాలని సూచించారు. దీంతో బాలికలు శాంతించారు. అనంతరం ఉమెన్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ జయదేవి వసతిగృహానికి చేరుకుని సంఘటనపై ఆరా తీశారు.
మమ్మల్ని ఇంటికి పంపించేయండి..
తమకు మైనార్టీ తీరిపోయినా బయటకు పంపడంలేదని.. వసతిగృహంలో కుమారి అనే సహాయకురాలు తమను ఇబ్బంది పెడుతున్నట్లు బాలికలు వాపోయారు. తమను మానసిక రోగులుగా చిత్రీకరించి, నిద్రమాత్రలు ఇస్తున్నారని ఆరోపించారు. తమను వెంటనే ఇంటికి పంపించేయాలని కోరారు. దీనిపై గృహం సూపరింటెండెంట్ సునీత మాట్లాడుతూ.. బాలికలందర్నీ ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు తెలిపారు.
మైనారిటీ తీరిన తర్వాత కూడా సీడబ్ల్యూసీ అనుమతితోనే బయటికి పంపిస్తామని, తమకు తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేమన్నారు. ఐదుగురిలో నలుగురు బాలికలకు కొద్దిరోజులుగా మెంటల్ కేర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. వారి తల్లిదండ్రులకు ఫోన్‌చేశామని, వారొస్తే బాలికలను అప్పగిస్తామని వెల్లడించారు. మరోవైపు.. ఈ సంఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత ఆరా తీసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్, సీపీని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment