
సాక్షి, వైఎస్సార్: వివేకా హత్య కేసులో కూటమి ప్రభుత్వ కుట్రను ఆయన పీఏ కృష్ణారెడ్డి బయటపెట్టారు. కేసును తిరగతోడి ఇప్పుడు తన ఇంటికి వచ్చి పోలీసులు మళ్లీ విచారించినట్టు చెప్పారు. అయితే, ఈ కేసులో తాను గతంలో చెప్పిందే ఇప్పుడు కూడా చెప్పినట్టు ఆయన తెలిపారు. కానీ, వాళ్లు స్టేట్‌మెంట్ ఎలా రాసుకున్నారో అనే అనుమానం ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
తాజాగా వివేకా పీఏ కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి, ఏఎస్పీ రాంసింగ్ వారికి అనుకూలంగా స్టేట్‌మెంట్ ఇవ్వమని గతంలో నన్ను ఇబ్బంది పెట్టారు. అప్పట్లో పోలీసు స్టేషన్‌లో, ఎస్పీ వద్ద వారి బెదిరింపులపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో పులివెందుల కోర్టులో ప్రైవేటు కేసు వేశాను. కోర్టు ఆదేశాల మేరకు ఆనాడు కేసు కట్టారు.
తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చాక కేసును తిరగతోడి నన్ను ఇంటికి వచ్చి విచారించారు. నేను గతంలో చెప్పినదే చెప్పా.. కానీ, వాళ్లు స్టేట్‌మెంట్ ఎలా రాసుకున్నారో అనే అనుమానం ఉంది. దీంతో ఇప్పటికి 10 సార్లు నా స్టేట్‌మెంట్ రికార్డ్ ఇవ్వమని డీఎస్పీని కోరినా స్పందన లేదు. నిన్న కోర్టులో నేను పెట్టింది తప్పుడు కేసు అని పిటిషన్ వేశారని తెలిసింది. దీంతో ఈరోజు కూడా నేను నా స్టేట్‌మెంట్ కాపీ కోసం డీఎస్పీ ఆఫీసుకు వచ్చాను. ఇప్పుడు కూడా డీఎస్పీ అందుబాటులో లేరు.

నా స్టేట్‌మెంట్ నా చేతికి ఇస్తే వాళ్లు ఫాల్స్ కేసు అంటున్న అంశంపై స్పష్టత ఇస్తాను. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సునీత ఏం ప్రభావితం చేసిందో తెలియదు.. కేసును మళ్లీ విచారించారు. అప్పటికీ, ఇప్పటికీ నా స్టేట్‌మెంటులో ఎటువంటి మార్పు లేదు. కానీ, పోలీసులు దీన్ని ఫాల్స్ కేసు అని ఎలా చెప్పారో తేలాల్సి ఉంది. అందుకే నా స్టేట్‌మెంట్ ఎలా రికార్డ్ చేశారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. పోలీసులు మాత్రం ఇప్పటి వరకూ నా స్టేట్‌మెంట్ నాకు ఇవ్వడం లేదు’ అని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment