మార్కెటింగ్ కమిషనర్, జాయింట్ కలెక్టర్‌ను వేడుకున్న రైతులు
గుంటూరు మిర్చి యార్డులో ఉచిత భోజన పథకం ప్రారంభం
కొరిటెపాడు (గుంటూరు): ‘అయ్యా..! మీ భోజనానికో దండం. మాకు ఉచిత భోజనం అవసరం లేదు. మెరుగైన ధర ఇప్పించేలా చూడండి మహాప్రభో అని మిర్చి రైతులు మార్కెటింగ్ శాఖ కమిషనర్ ఎం.విజయ సునీత, గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.భార్గవ్‌తేజను వేడుకున్నారు. మిర్చి యార్డులో రైతులకు ఉచిత భోజన పథకాన్ని మార్కెటింగ్ శాఖ కమిషనర్, జాయింట్ కలెక్టర్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా యార్డుకు వచ్చిన రైతులంతా వారిద్దరినీ కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.
మిర్చి యార్డులో ధరలు రోజురోజుకు పతనమవుతున్నాయని వాపోయారు. వారం క్రితం రూ.16 వేలు పలికిన క్వింటాల్ మిర్చి ప్రస్తుతం రూ.10 వేలు–రూ.13 వేల మధ్య ఊగిసలాడుతున్నాయని తెలిపారు. గత ఏడాది ఇదే సమయంలో క్వింటాల్‌కు రూ.21 వేల నుంచి రూ.26 వేల వరకు ధరలు లభించాయని గుర్తు చేశారు. ఉదయం పూట బేరం అయిన కాయలు కూడా మధ్యాహ్నానికి ధరలు మారిపోతున్నాయని వివరించారు.
కౌలు ధరలు, ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చులు భారీగా పెరిగిపోతున్నాయన్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి పంటను యార్డుకు తీసుకొస్తే కనీసం ఖర్చులు కూడా దక్కడం లేదని రైతులు వాపోయారు. ఎకరానికి రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు సాగు ఖర్చులయ్యాయని, దిగుబడి మాత్రం ఎకరాకు సగటున 10 క్వింటాళ్లు (తాలు, ఎరుపు కలిపి) కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు.
ఇవే ధరలు కొనసాగితే ఎకరాకు సుమారు రూ.60 వేల నుంచి రూ.లక్ష వరకు నష్టం వచ్చే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మేమే ఎంతో మందికి అన్నం పెడుతున్నాం. మాకు కావాల్సింది ఉచిత భోజనం కాదు. మెరుగైన ధర కల్పించి మా ప్రాణాలు, మా కుటుంబ సభ్యుల ప్రాణాలు కాపాడండి’ అంటూ చేతులు జోడించి రైతులంతా వేడుకున్నారు.
ఈ సందర్భంగా మార్కెటింగ్ శాఖ కమిషనర్ ఎం.విజయ సునీత, జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ మాట్లాడుతూ రైతులకు మెరుగైన ధర వచ్చేలా శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment