free meals
-
దివ్యాంగులకు ఉచిత భోజనం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: కలెక్టరేట్‌కు వచ్చే దివ్యాంగుల సమస్యలను తెలుసుకుని, పరిష్కరించడమే కాక వారి ఆకలి తీర్చేలా ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. పాలనలో తనకంటూ ప్రత్యేకతను చూపుతున్న ఆయన.. ప్రజా సమస్యల పరిష్కారంలో వినూత్న పంథా అనుసరిస్తున్నారు. ప్రతీ సోమవారం జరిగే ప్రజావాణితోపాటు వివిధ పనుల కోసం జిల్లా నలుమూలల నుంచి దివ్యాంగులు కలెక్టరేట్‌కు వస్తుంటారు. అయితే వీరు ఆకలితో వెళ్లొద్దనే భావనతో కలెక్టరేట్ క్యాంటీన్లో ఉచితంగా మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించాలని కలెక్టర్ నిర్ణయించారు. ఈ పథకం ఈ నెల 5వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.కడుపు నిండా తినేలా..: ఉచిత భోజనం అంటే అన్నం, ఒక కూర కాకుండా.. పూర్తి మెనూతో అమలయ్యేలా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అన్నం, ఆకుకూర పప్పు, రోటిపచ్చడి, రెండు కూరలు, సాంబార్ లేదా రసం, పెరుగుతో దివ్యాంగులకు భోజనాన్ని సమకూరుస్తారు. కలెక్టరేట్లోని కార్యాలయాలకు ఇందుకోసం కూపన్లు ఇస్తారు. ఆయా శాఖలకు 40% వైకల్యంతో ఉన్న దివ్యాంగులు వస్తే కూపన్లు అందజేయనున్నారు. ప్రతీరోజు జారీ చేసిన కూపన్ల వివరాలను రిజిస్టర్లో నమోదు చేసి, ఒక్కో భోజనానికి రూ. 80 చొప్పున క్యాంటీన్ నిర్వాహకులకు నెలకోమారు చెల్లిస్తారు. దివ్యాంగులకు ఉచిత భోజన సదుపాయం కల్పిస్తున్నామనే విషయాన్ని కలెక్టరేట్లోని ప్రవేశ మార్గాల్లో బోర్డులు ఏర్పాటు చేయించనున్నారు.‘సదరం’నంబర్ ఆధారంగా..దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ నంబర్ ఆధారంగా కూపన్ జారీ చేస్తారు. ఈ కూపన్‌తో కలెక్టరేట్ క్యాంటీన్లో ఉచితంగా భోజనం చేయొచ్చు. ఇందుకోసం క్యాంటీన్ బాధ్యులకు రూ.80 చొప్పున చెల్లిస్తాం. దివ్యాంగుల నుంచి వచ్చిన విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకున్నాం. బుధవారం నుంచి ఉచిత భోజన కార్యక్రమం ప్రారంభమవుతుంది. – ముజమ్మిల్‌ఖాన్, కలెక్టర్, ఖమ్మం -
మీ భోజనానికో దండం.. మిర్చికి మంచి ధర ఇప్పించండి
కొరిటెపాడు (గుంటూరు): ‘అయ్యా..! మీ భోజనానికో దండం. మాకు ఉచిత భోజనం అవసరం లేదు. మెరుగైన ధర ఇప్పించేలా చూడండి మహాప్రభో అని మిర్చి రైతులు మార్కెటింగ్ శాఖ కమిషనర్ ఎం.విజయ సునీత, గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.భార్గవ్తేజను వేడుకున్నారు. మిర్చి యార్డులో రైతులకు ఉచిత భోజన పథకాన్ని మార్కెటింగ్ శాఖ కమిషనర్, జాయింట్ కలెక్టర్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా యార్డుకు వచ్చిన రైతులంతా వారిద్దరినీ కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. మిర్చి యార్డులో ధరలు రోజురోజుకు పతనమవుతున్నాయని వాపోయారు. వారం క్రితం రూ.16 వేలు పలికిన క్వింటాల్ మిర్చి ప్రస్తుతం రూ.10 వేలు–రూ.13 వేల మధ్య ఊగిసలాడుతున్నాయని తెలిపారు. గత ఏడాది ఇదే సమయంలో క్వింటాల్‌కు రూ.21 వేల నుంచి రూ.26 వేల వరకు ధరలు లభించాయని గుర్తు చేశారు. ఉదయం పూట బేరం అయిన కాయలు కూడా మధ్యాహ్నానికి ధరలు మారిపోతున్నాయని వివరించారు.కౌలు ధరలు, ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చులు భారీగా పెరిగిపోతున్నాయన్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి పంటను యార్డుకు తీసుకొస్తే కనీసం ఖర్చులు కూడా దక్కడం లేదని రైతులు వాపోయారు. ఎకరానికి రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు సాగు ఖర్చులయ్యాయని, దిగుబడి మాత్రం ఎకరాకు సగటున 10 క్వింటాళ్లు (తాలు, ఎరుపు కలిపి) కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. ఇవే ధరలు కొనసాగితే ఎకరాకు సుమారు రూ.60 వేల నుంచి రూ.లక్ష వరకు నష్టం వచ్చే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మేమే ఎంతో మందికి అన్నం పెడుతున్నాం. మాకు కావాల్సింది ఉచిత భోజనం కాదు. మెరుగైన ధర కల్పించి మా ప్రాణాలు, మా కుటుంబ సభ్యుల ప్రాణాలు కాపాడండి’ అంటూ చేతులు జోడించి రైతులంతా వేడుకున్నారు. ఈ సందర్భంగా మార్కెటింగ్ శాఖ కమిషనర్ ఎం.విజయ సునీత, జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ మాట్లాడుతూ రైతులకు మెరుగైన ధర వచ్చేలా శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. -
పేద విద్యార్థులకు పెన్నిధి
మహబూబ్‌నగర్ రూరల్: విద్యార్థులు, పేదలు, ఆస్పత్రుల్లో రోగుల సహా యకులకు హరే కృష్ణ మూవ్మెంట్ ద్వారా ఉచితంగా భోజనం అందించడం అభినందనీయమని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ మండలం కోడూర్లో అరబిందో ఫార్మా ఫౌండేషన్ సహకారంతో హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 20 వేల భోజనాలు అందించే సామర్థ్యం కలిగిన సెంట్రలైజ్డ్ కిచెన్‌ను, మహబూబ్‌నగర్ నియోజ కవర్గంలోని 20 వేలమంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉదయం అల్పా హారం అందించే ‘స్వస్త్య ఆహార’ పథకాన్ని మంత్రి శనివారం ప్రారంభిం చారు. ఆయన మాట్లాడుతూ ఈ పథకం పేద విద్యార్థులకు పెన్నిధి లాంటిదని పేర్కొన్నారు. కార్యక్రమంలో అరబిందో ఫార్మా ఫౌండేషన్ డైరెక్టర్ మదన్‌మోహన్‌రెడ్డి, ఫౌండర్ సత్యగౌర చంద్రదాస్ ప్రభూజి, జెడ్పీ చైర్మన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ తదితరులు పాల్గొన్నారు. -
క్షత్రియ సమితి.. సేవానిరతి
ఆకివీడు: మానవత్వానికి కొదవ లేదు.. దాతృత్వానికి అవధుల్లేవు.. అన్నట్టు ఉంది పశ్చిమ గోదావరి జిల్లా చెరుకుమిల్లి గ్రామం. అనాథలను ఆదుకుంటూ, ఆపదలో ఉన్నవారికి చేదోడు వాదోడుగా ఉంటూ, గ్రామాభివృద్ధికి తమ వంతు ఆర్థిక సహాయం అందజేస్తూ జన్మభూమి రుణం తీర్చుకుంటున్నారు గ్రామానికి చెందిన క్షత్రియ సేవా సమితి నిర్వాహకులు. గ్రామానికి చెందిన పలువురు క్షత్రియ సామాజికవర్గానికి చెందినవారు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. వారు సంపాదించిన దానిలో కొంత సేవా కార్యక్రమాలకు ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు. ఎక్కడెక్కడో సేవలు చేసేకన్నా సొంత గ్రామంలో ఏదో ఒక కార్యక్రమం చేయాలనే తలంపుతో గ్రామంలో క్షత్రియ సేవా సమితిని ఏర్పాటుచేశారు. ట్రస్టు ఏర్పాటు చేసిన డాక్టర్ దాట్ల సత్యనారాయణరాజు సూచనల మేరకు 2007లో రిజిస్ట్రేషన్ చేయించారు. అనంతరం ఆయన సూచనల మేరకు 25 మంది ఒంటరి వృద్ధులు, వ్యక్తులకు రోజూ రెండు పూటలా భోజనాన్ని అందిస్తున్నారు. ఇంటి వద్దకే క్యారేజీలతో భోజనం పంపించే ఏర్పాట్లు చేశారు. మొదట్లో క్షత్రియ, క్షత్రియేతరులకు క్యారేజీల ద్వారా భోజనం అందజేశారు. ప్రస్తుతం క్షత్రియ సామాజికవర్గంలోని వృద్ధులు, వితంతువులు, అనాథలకు క్యారేజీల భోజనం అందజేస్తున్నారు. క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో పూర్తి ఆర్థిక సహకారాన్ని వెచ్చిస్తున్నారు. రుచితో పాటు నాణ్యత క్యారేజీల ద్వారా అందిస్తున్న ఆహారం ఇంట్లో వండుకున్నట్టుగా ఉంటుందని, రుచితో పాటు నాణ్యత మెండు అని వృద్ధులు అంటున్నారు. రోజూ ఉదయం పప్పు, పచ్చడి, రసం, కూర లేదా పులుసు కూర, పెరుగు, సాయంత్రం ఇగురు కూర, వేపుడు, సాంబారు, పచ్చడి, పెరుగుతో భోజనాన్ని అందిస్తున్నారు. కరోనా విపత్తులోనూ.. కరోనా విపత్తులోనూ ఉచిత భోజనాన్ని వృద్ధుల ఇళ్లకు చేర్చారు. కరోనాను ఎదుర్కొనేలా రోజూ కోడి గుడ్డు, చికెన్ భోజనాన్ని అందించారు. దాతలు ప్రత్యక్ష దేవుళ్లు ఇక్కడ దాతలు మాతకు ప్రత్యక్ష దేవుళ్లు, 14 ఏళ్లుగా ఉచితంగా భోజనం చేస్తున్నాను. ఉదయం 8 గంటలు, సాయంత్రం 4 గంటలకు క్యారేజీలు సిద్ధమవుతాయి. సంస్థ ఆఫీసు దగ్గరకు వెళ్లి తెచ్చుకోలేనివారికి ఇళ్లకే పంపిస్తున్నారు. నేను 14 ఏళ్లుగా వెళ్లి తెచ్చుకుంటున్నాను. ఈ గ్రామంలో పుట్టినందుకు అదృష్టవంతుడిగా భావిస్తున్నాను. – దాట్ల రామలింగరాజు, చెరుకుమిల్లి ఇబ్బంది లేకుండా.. రెండు పూటలా భోజనం ఇబ్బంది లేకుండా పెడుతున్నారు. పిల్లలు దగ్గర లేకపోవడంతో గతంలో భోజనానికి చాలా ఇబ్బంది పడే దాన్ని. ఇంట్లో వండుకునే విధంగానే రుచి, శుచి క్యారేజీల్లో భోజనం ఉంటుంది. దాదాపు 13 ఏళ్లుగా ఇక్కడ భోజనం చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. వీరి కార్యక్రమం అభినందనీయం. – మంతెన కస్తూరి, చెరుకుమిల్లి వండుకునే బాధలేదు ముసిలిదానినై పోయాను. ఇంటి వద్దకే భోజనం పంపిస్తున్నారు. వృద్ధాశ్రమాలకన్నా ఈ విధానం ఎంతో బాగుంది. పిల్లలు హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఇక్కడ ఒక్కదాన్నే ఉంటున్నాను. పనిమనిషి మిగిలిన పనులు చేస్తుంది. పిల్లలు అప్పుడప్పుడూ వచ్చి వెళుతుంటారు. క్షత్రియ సేవాసమితి ఔదార్యం ఎంతో గొప్పది. చాలా ఆనందంగా ఉంది. – దాట్ల మంగమ్మ, చెరుకుమిల్లి రుచీశుచితో.. సేవా సమితి ప్రాంగణం శుభ్రతగా ఉంచడంతో పాటు రుచికరమైన ఆహారం అందిస్తున్నాం. పెరడులో పండిన పంటలను వినియోగిస్తున్నాం. దాతలు అందించిన కూరగాయలు, పిండి వంటలను కూడా క్యారేజీల్లో పంపుతున్నాం. నిత్య పర్యవేక్షణతో కార్యక్రమం నడుస్తోంది. –దాట్ల వెంకట కృష్ణంరాజు, ఇన్చార్జి, సేవాసమితి, చెరుకుమిల్లి -
తిరిగివ్వొద్దు... పదిమందికి సాయపడండి!
ముంబైకి చెందిన హీనా మాండవియ కొడుకు హర్ష్‌కు ఐదేళ్లు ఉన్నప్పుడు భర్త కారు యాక్సిడెంట్లో మరణించారు. దీంతో కుటుంబ భారం హీనా మీద పడింది. ఆర్థిక సమస్యలతో సతమతమవుతోన్న హీనా కొంతమంది దాతల సాయానికి తోడు రెక్కల కష్టంతో కుటుంబాన్ని లాక్కొచ్చింది. ఆర్థికంగా కాస్త నిలదొక్కుకున్నాక తనను ఆదుకున్న దాతలకు డబ్బు తిరిగివ్వబోతే..‘‘డబ్బులు వద్దమ్మా.. ఆపదలో ఉన్న ఓ పదిమందిని ఆదుకోండి! అని చెప్పడంతో హీనా, హర్ష్‌లు ఇద్దరూ కలిసి వేలమంది నిరుపేదల ఆకలి తీరుస్తూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తున్నారు. గుజరాత్‌లోని జామ్ నగర్‌కు చెందిన హీనా... భర్త చనిపోయాక, హర్ష్‌కు మంచి విద్యను అందించేందుకు ముంబైకు మారారు. జీవిక కోసం హీనా టిఫిన్లు తయారు చేసి ఇస్తే.. హర్ష్ ఇంటింటికి తిరిగి వాటిని విక్రయించేవాడు. వీరి టిఫిన్లు శుచిగా రుచిగా ఉండడం తో కస్టమర్ల సంఖ్య రోజురోజుకి పెరిగింది. తల్లీ కొడుకులు పడుతున్న కష్టాన్ని గమనించిన ఒక కస్టమర్ అప్పట్లో కొంత సాయం చేశారు. ఆ డబ్బుతో ‘హర్ష్ థాలి అండ్ పరాటా’ పేరుతో ముంబైలో ఒక టిఫిన్ సెంటర్‌ను ప్రారంభించారు. మొదట్లో హీనా ఒక్కతే టిఫిన్ సెంటర్‌ను చూసుకునేది. హర్ష్ డిగ్రీ పూరై్తన తరువాత వ్యాపారాన్ని విస్తరించాడు. ఆన్లైన్ బిజినెస్ బాగా జరగడంతో వారి ఆర్థిక ఇబ్బందులు కూడా కాస్త సర్దుకున్నాయి. లాక్డౌన్ కాలంలో... గతేడాది లాక్ డౌన్ సమయంలో ఎంతోమంది ఆకలితో అలమటించారు. ఇది చూసిన ఓ కస్టమర్ వందమందికి భోజనం పెట్టగలరా? అని అడగడంతో తల్లీకొడుకులు వెంటనే ఒప్పుకుని వందమందికి ఉచితంగా ఆహారం అందిం చారు. ఈ ప్రేరణతో హర్ష్ అదేరోజు సాయంత్రం ‘ఉచితంగా భోజనం సరఫరా చేస్తాం’ అని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. కొంతమంది దాతలు సాయం చేయడానికి ముందుకు రావడంతో వీరు రోజూ 100 నుంచి 150 మంది ఆకలి తీర్చేవారు. అప్పటినుంచి ఇప్పటివరకూ తల్లీకొడుకులు నిరుపేదల ఆకలి తీరుస్తున్నారు. ‘‘స్థోమత లేకపోయినప్పటికి అమ్మ నన్ను మంచి స్కూల్లో చదివించాలనుకుంది. మా పరిస్థితిని అర్థం చేసుకున్న స్కూల్ డైరెక్టర్ మొత్తం ఫీజును మాఫీ చేశారు. చదువుకుంటూనే అమ్మకు టిఫిన్ల తయారీలో సాయపడేవాడిని. డిగ్రీ అయ్యాక నేను టì ఫిన్ సెంటర్ బాధ్యత తీసుకుని ఆన్లైన్లో వ్యాపారాన్ని విస్తరించడంతో మా ఆదాయం మూడు రెట్లు పెరిగింది. ఆర్థికపరిస్థితులు మెరుగు పడడంతో నా చిన్నప్పటి స్కూలు డైరెక్టర్ ఇంటికి వెళ్లి ఆయన చేసిన సాయానికి కృతజ్ఞతగా కొంత డబ్బు ఇవ్వబోతే.. అతను ‘‘నాకు ఇప్పుడు ఆ డబ్బు తిరిగి ఇవ్వనక్కరలేదు. అయితే నాలా మీరు మరికొంత మందికి సాయం చేయండి’’ అని చెప్పారు. అప్పటి నుంచి అవకాశం కోసం ఎదురు చూసిన మేము గతేడాది లాక్డౌన్ కాలంలో వంద ధాబాలలో ఫుడ్ తయారు చేయించి అడిగిన వారందరికీ ఆకలి తీర్చేవాళ్లం. ప్రస్తుతం కూడా పరిస్థితులు అప్పటిలానే ఉన్నాయి. అందుకే ఇప్పుడు కూడా నిరుపేదల ఆకలి తీరుస్తున్నాం’’ అని హర్ష్ చెప్పాడు. -
సేవలోనే అందం ఆనందం..
అందాల పోటీల్లో గెలుపొందిన తర్వాత దాదాపు ప్రతి బ్యూటీక్వీన్ చెప్పేమాట సేవాబాట పడతామనే. అయితే ఆ మాటను నిలబెట్టుకునేవారు అరుదే. దీనికి తాను భిన్నం అంటున్నారు నగరానికి చెందిన మౌనిక. ఐదేళ్ల క్రితం మిస్ హైదరాబాద్ కిరీటాన్ని గెలుచుకున్న ఈ బ్యూటీ... సేవలోనే అందం ఆనందం అంటున్నారు. సాక్షి, రంగారెడ్డి: ‘కేన్సర్‌పై ఎంతగా అవగాహన పెరుగుతున్నా.. ఇంకా కేన్సర్ మరణాలు ఆగడం లేదు’ అంటున్న మౌనిక తంగల్లపల్లి.. ఐదేళ్ల క్రితం తన ప్రాచుర్యానికి బాట వేసిన మిస్ హైదరాబాద్ టైటిల్‌ని కేన్సర్ బాధితుల సేవకు ఒక మార్గంగా మలుచుకున్నారు.2014లో మిస్ హైదరాబాద్ టైటిల్ గెలిచిన అనంతరం మిస్ ఇండియా టూరిజం ఇంటర్నేషనల్ కూడా గెలుచుకున్న మౌనిక ఉత్సవి ఫౌండేషన్ ప్రారంభించారు. అప్పటి నుంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విభిన్న రకాల అంశాలను ఎంచుకుని నిధుల సమీకరణ చేస్తున్నారు. ఏటా పెరుగుతున్న కేన్సర్ మరణాలు, ఆ వ్యాధి బాధితుల కోసం జుంబా, యోగా తదితర ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. అదే క్రమంలో అక్షర్ బ్యాండ్‌తో గత నెల 14న నగరంలోని స్కైలాంజ్లో ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. రానున్న ఫిబ్రవరి వరకూ ఈ ఈవెంట్స్ కొనసాగిస్తామని వచ్చే నిధులను కేన్సర్ వ్యాధి నివారణకు కృషి చేస్తున్న సంస్థలకు అందిస్తామని అంటున్నారు మౌనిక. ర్యాప్ సింగర్ ‘షేర్ ఎ మీల్’ అన్నదానం రోజూ ఆకలితో అలమటించే వారెందరో. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూసే అచేతన హృదయాలేనో.. ఉరుకుల పరుగుల నగర జీవితంలో మనసుతో వినగలిగితే వినిపించే ఆకలి కేకలెన్నో... అవి వినే తీరిక కొందరికి ఉండదు. విన్నా వాటి కోసం చేయగలిగే స్తోమత మనకి లేదనుకుంటారు మరికొందరు. అయితే ఆ యువకుడు మాత్రం తనతో పాటు మరొకరి ఆకలి తీర్చలేనా? అనుకున్నాడు. రోజూ ఒక్కరికైనా కడుపు నిండా భోజనం పెడుతున్నాడు. అంతులేని తృప్తిని మనసులో నింపుకొంటున్నాడు. ‘ఇప్పటికీ ఓ మనిషి ఆకలితో బాధపడడం అది సాటి మనుషులుగా మన అందరికీ అవమానం’ అంటాడు మేఘ్రాజ్ రవీంద్ర. అలాంటి ఆలోచనలో నుంచే ఆయన షేర్ ఎ మీల్ పేరిట వ్యక్తిగతంగా ఒక కార్యక్రమం రూపొందించుకున్నాడు. తనవంతుగా రోజుకి ఒకరికైనా ఆకలి తీర్చాలనే ఆలోచనతో తన సంపాదనలో రోజూ ఒక్కరికి అన్నదానం చేస్తున్నాడు. ఒక సంవత్సరం గడిచాక రెట్టింపైన ఆనందంతో తదుపరి ఏడాది నుంచి నిత్యం కనీసం ఇద్దరికి అన్నం పెడుతున్నాడు. గత 3 సంవత్సరాలుగా ఆయన అన్నసేవ నిర్విరామంగా కొనసాగుతూ వస్తోంది. ఇప్పటికి దాదాపు 1600 మందికి పైగా ఆకలి కడుపులకు వ్యక్తిగతంగా సాంత్వన చేకూర్చాడు. నిత్యం తను గాంధీ హాస్పిటల్, కేన్సర్ హాస్పిటల్, పద్మారావునగర్ తదితర ప్రాంతాలలో ఉన్న అన్నార్తుల ఆకలి తీరుస్తున్నాడు. పాటే ఉపాధి బాట.. వ్యక్తిగతంగా మేఘరాజ్ ర్యాప్ సింగర్. తాజాగా విడుదలైన జార్జిరెడ్డి సినిమాలోనూ ఓ పాత్ర పోషించాడు. గొప్ప ఆదాయం లేకపోయినా మరొకరి ఆకలి తీర్చడంలోని ఆనందం ఎంత ఖర్చు పెట్టినా రాదంటాడు మేఘరాజ్. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చూసిన ఎంతో మంది యువత తనని ఆదర్శంగా తీసుకుని వారు కూడా ఇలా అన్నదానం చేయడం ఇంకెంతో సంతోషాన్ని ఇస్తుంది అంటున్నాడు. ఆకలి తీర్చే క్రమంలో తనకు ఎదురైన అనుభవాలు, ఆవేదనలు, ఆకలి అవస్థలు ఏన్నో ఎన్నెన్నో.. ‘ఇలాగే కొనసాగిస్తూ భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మందికి ఆకలి తీర్చాలి’ అనేదే తన ధ్యేయం అంటున్నాడు మేఘరాజ్. -
వాషింగ్టన్లో ఓ రెస్టారెంట్ ఉచితంగా భోజనం
-
డబ్బులక్కర్లేదు.. తృప్తిగా తినండి
వాషింగ్టన్ : అగ్రరాజ్యం అమెరికాలో వైట్ హౌస్‌కు కొద్ది దూరంలో సకినా హలాల్ గ్రిల్ అనే ఓ హైఫై రెస్టారెంట్ ఉంది. ఆ చుట్టుపక్కల ఇంకొన్ని రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. కానీ వాటికి, సకినా రెస్టారెంట్‌కు ఓ తేడా ఉంది. చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా సరే.. దర్జగా హలాల్ రెస్టారెంట్‌కు వెళ్లి కడుపునిండా నచ్చిన భోజనం తిని రావచ్చు. మిమ్మల్నేవరు బిల్లు కట్టమని ఇబ్బంది పెట్టరు. నమ్మశక్యంగా లేకపోయినప్పటికి ఇది వాస్తవం. గత ఐదేళ్లలో ఇప్పటికే దాదాపు 80 వేల మందికి ఉచితంగా ఆహారం పెట్టి కడుపు నింపింది ఈ రెస్టారెంట్. వివరాలు.. పాకిస్తాన్‌కు చెందిన ఖాజి మన్నన్ అనే వ్యక్తి 2013లో అమెరికాలో ఈ రెస్టారెంట్‌ని ప్రారంభించాడు. ఎవరైనా సరే నాకు ఉచితంగా భోజనం కావాలని అడిగితే.. ‘రండి.. తృప్తిగా భోంచేసి వెళ్లండి. డబ్బులు చెల్లించే వారు ఎంత దర్జాగా తింటారో మీరు కూడా అలానే తినండి. మొహమాట పడకండి’ అంటున్నారు ఖాజి. ఈ ఆలోచన వెనక తాను పడిన కష్టాలున్నాయంటారు ఖాజి. ‘నా చిన్నతనంలో ఓ పూట తిండి దొరికితే చాలనుకునేవాన్ని. ఆహారం కోసం నేను పడిన కష్టం మరొకరు పడకూడదనుకున్నాను. అందుకోసం రాత్రింబవళ్లు శ్రమించి పైసా పైసా కూడబెట్టి ఈ రెస్టారెంట్‌ని ప్రారంభించాను. ఇప్పటికి కూడా చెత్త కుప్పల దగ్గర ఆహారం ఏరుకునే జనాలను చూస్తే నాకు ఎంతో బాధ కల్గుతుంది’ అంటారు ఖాజి. ఈ ఏడాది నుంచి మరింత మందికి తన సేవలను అందించాలనుకుంటున్నారు ఖాజి. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : వాషింగ్టన్లో ఓ రెస్టారెంట్ ఉచితంగా భోజనం -
రూ. 5 కోట్లు కావాలన్నాడు.. ఆఖరికి జైలుకెళ్లాడు
బీజింగ్ : హోటల్‌కెళ్లి సుష్టుగా భోంచేయడం.. ఆపై బిల్లు ఎగ్గొట్టడం కోసం ప్లేట్లో వెంట్రుకలు, బొద్దింకలు లాంటివి వేయడం చాలా సినిమాల్లో చూశాం కదా. ఇదే ట్రిక్కు ప్రయోగించబోయి.. ఆఖరుకి జైలు పాలయ్యడో వ్యక్తి. బిల్లు ఎగ్గొట్టడం కోసం ఏకంగా భోజనంలో చచ్చిన ఎలుకను వేశాడు. ఆ తర్వాత ఏమైంది... చదవండి. చైనా రాజధాని బీజింగ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. హైదిలావో అనేది చైనాలో చాలా ఫేమస్ రెస్టారెంట్. దీన్ని దృష్టిలో ఉంచుకున్న ఓ వ్యక్తి సదరు రెస్టారెంట్లో ఉచితంగా భోజనం చేయాలని భావించాడు. ఎలా అని ఆలోచిస్తుండగా రోడ్డు పక్కన ఓ చచ్చిన ఎలుక కనిపించింది. దాంతో అతడి బుర్రలోకి ఓ ఆలోచన వచ్చింది. ఆ ఎలుకను తీసుకుని రెస్టారెంట్‌కు వెళ్లాడు. భోజనం ఆర్డర్ చేశాడు. తినడం పూర్తయిన తరువాత తనతో పాటు తీసుకువచ్చిన ఎలుకను ప్లేట్లో వేశాడు. ఆ తర్వాత తనకు భోజనంలో ఎలుక వచ్చిందని చెప్పి నానా హంగామా సృష్టించాడు. ఈ విషయం బయటకు తెలిస్తే రెస్టారెంట్‌కున్న పేరు పొతుందని భావించిన యాజమాన్యం.. సదరు వ్యక్తి బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. కానీ అందుకతడు ఒప్పుకోలేదు. దాంతో ఓ రెండు లక్షల రూపాయలు ఇస్తామంది. ఆ వ్యక్తి దాన్ని కూడా తిరస్కరించి.. ఏకంగా ఐదు కోట్ల రూపాయలు కావాలని డిమాండ్ చేశాడు. ఈ వివాదం ఎటు తేలకపోవడంతో.. సదరు రెస్టారెంట్ యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభంచడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఉచితంగా భోజనం చేయాలని భావించి.. చచ్చిన ఎలుకను తెచ్చి ఈ నాటకం ఆడానని.. కానీ చివర్లో అత్యాశకు పోవడంతో దొరికిపోయానని విచారం వ్యక్తం చేశాడు. పోలీసులు సదరు వ్యక్తిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. -
ఆకలి తీర్చే ఆప్తులు
సిటీకి చెందిన అమూల్య డాక్టర్. ఓ రోజు విధులు ముగించుకొని ఇంటికెళ్తుండగా ఆకలితో అలమటిస్తున్న వృద్ధుడిని చూసి చలించిపోయింది. రూ.200 ఇచ్చి ఏమైనా తినమని చెప్పింది. ఇంకా ఇలాంటి వారెందరో ఉన్నారనే ఆలోచన ఆమెను ఆలోచింపజేసింది. అంతే.. స్నేహితులతో కలిసి ఓ గ్రూప్ ఏర్పాటు చేసి రోజుకు 150 మంది ఆకలి తీరుస్తోంది. యూఎస్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన అమూల్య నగరంలో ఓ హాస్పిటల్ నిర్వహిస్తోంది. ఆమె సందేశంతో ముందుకొచ్చిన నవనీత్, ఉమ, తేజ, సంస్కృతిలతో కలిసి నగరంలోని ప్రధాన సిగ్నల్ పాయింట్స్ వద్ద ఉండే యాచకులు, దూర ప్రాంతాల నుంచి ఆస్పత్రులకు వచ్చే పేదలకు భోజనం అందిస్తోంది. ఈ బృందం ప్రతి రోజు సుమారు 150 మందికి ఆహార ప్యాకెట్లు అందజేస్తోంది. ఇందుకు రోజుకు రూ.5 వేలు ఖర్చు చేస్తున్నట్లు అమూల్య చెప్పారు. కృష్ణా జిల్లాలోని పెడన సమీపంలోని కప్పలదొడ్డిలో 40 వృద్ధ కుటుంబాలున్నాయని తెలుసుకున్న అమూల్య... ప్రతి నాలుగు నెలలకు అక్కడి వెళ్లి, వారికి కావాల్సినవి అందజేస్తున్నారు. మమ్మల్ని ఎప్పుడెప్పుడు చూస్తామా? అని వారు ఎదురుచూస్తుంటే మాకెంతో ఆనందంగా ఉంటుందన్నారు. అందరి ఆకలి తీర్చాలి.. మేం ప్రస్తుతం కొద్ది మంది ఆకలే తీరుస్తున్నాం. భవిష్యత్తులో మరింత మంది ఆకలి తీర్చాలని అనుకుంటున్నాం. స్నేహితులు కూడా ఖర్చు విషయంలో రాజీ పడట్లేదు. ఎంత ఖర్చయినా అందరి ఆకలి తీర్చాలనేదే మా కోరిక. మాతో మరింత మంది కలిసి రావాలని ఆశిస్తున్నాం.– అమూల్య -
భోజ్యేషు బాబు
బజార్‌ఘాట్‌లోని నిలోఫర్ కేఫ్ అందరికీ తెలిసిందే. అయితే కేఫ్ యజమాని అనుముల బాబురావు సేవా దృక్పథం కొంతమందికే తెలుసు. ఎంతో కష్టపడి హోటల్లో క్లీనర్ నుంచి ఓనర్‌గా ఎదిగిన బాబురావు.. తనవంతుగా సమాజానికి సేవ చేయాలని సంకల్పించాడు. ప్రతిరోజూ 800 మందికి ఉచితంగా భోజనం అందజేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. బాబురావు స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా దేగ్గం మండలం లగ్గాలా గ్రామం. మహారాష్ట్రలోని పెద్దనాన్న కిరాణా దుకాణంలో పనిచేస్తూ చదువుకున్నాడు. పదో తరగతిలో పుస్తకాలు కొనుగోలు చేసేందుకు డబ్బులు లేకపోవడంతో ఆయన తండ్రి పాడి ఆవును విక్రయించి రూ.125 ఇచ్చాడు. అది చూసి బాబురావు ఎంతో చలించిపోయాడు. ఆర్థిక పరిస్థితిని తలుచుకొని బాధపడుతూ ఇంట్లో చెప్పకుండా హైదరాబాద్ వచ్చేశాడు. మొదట ఓ బట్టల షాప్‌లో పనిచేశాడు. తర్వాత కింగ్‌కోఠిలోని రాక్ సీ హోటల్లో క్లీనర్‌గా చేరాడు. అక్కడి నుంచి నిలోఫర్‌కు వచ్చాడు. బాబురావు పనితనాన్ని మెచ్చిన హోటల్ యజమాని టీ మాస్టర్‌గా, మేనేజర్‌గా ప్రమోట్ చేశాడు. 1993లో ఏకంగా అదే హోటల్‌ను అద్దెకు తీసుకున్న బాబురావు... తర్వాత దాన్ని కొనుగోలు చేశాడు. బాబురావు చక్కటి టీ మాస్టర్.. ఆయన టీకి అందరూ ఫిదా అవ్వాల్సిందే. కష్టాలు కదిలించాయి... నిలోఫర్, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రులకు వచ్చే వారి కష్టాలు బాబురావును కదిలించాయి. వారికి తనవంతుగా సేవ చేయాలన్న ఆలోచనతో ఉచిత భోజన సదుపాయం ఏర్పాటు చేశాడు. 15 ఏళ్ల క్రితం ఏర్పాటైన ఈ ఉచిత భోజనం నేటికీ కొనసాగుతోంది. ప్రస్తుతం ఉదయం 500 మందికి టిఫిన్, మధ్యాహ్నం 300 మందికి ఉచితంగా భోజనం అందజేస్తున్నాడు. ఇందుకు ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసి, వారికి జీతాలు ఇస్తున్నాడు. క్యాన్స్ర్ చికిత్స పొందుతూ ఎవరైనా మృతి చెందితే స్వగ్రామానికి తరలించేందుకు ఆర్థిక సహాయం అందజేస్తున్నాడు బాబురావు. సిబ్బందికి గుర్తింపు... కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపునిస్తారు బాబురావు. ఆయన దగ్గర ఒక్కొక్కరు 15–20 ఏళ్లుగా పనిచేస్తున్నారు. సిబ్బంది అందరికీ వంటల తయారీలో ప్రత్యేకంగా శిక్షణనిస్తున్నారు. టీ, బిస్కెట్స్, కేక్‌లు, కేఫ్‌లో అందించే ప్రత్యేక రుచుల తయారీ గురించి నేర్పిస్తారు. ప్రావీణ్యమున్న వారికి పదోన్నతులు కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నారు. ఇక్కడి విధానంపై ఆసక్తితో యశోద ఫౌండేషన్ 20 మందికి శిక్షణనిచ్చే బాధ్యతను బాబురావుకు అప్పగించింది. భవిష్యత్తులో ఆస్పత్రి.. వినియోగదారులకు నాణ్యమైన సేవలందిస్తూ నమ్మకంగా పనిచేసినప్పుడే విజయం వరిస్తుంది. మేం తక్కువ ధరలోనే నాణ్యమైన టీ, బిస్కెట్స్ అందిస్తాం. కేఫ్ నిలోఫర్ ఉస్మానియా బిస్కెట్లు నగరంలోని 36 షాపుల్లో అందుబాటులో ఉన్నాయి. వీటి నుంచి వచ్చే ఆదాయంతోనే పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. భవిష్యత్‌లో ఓ ఆస్పత్రి నిర్మించాలని అనుకుంటున్నాను. – అనుముల బాబురావు -
బ్రాహ్మణులకు ‘నారాయణ ప్రసాదం’
కర్నూలు(అర్బన్): బ్రాహ్మణులు మృతి చెందితే వారి కుటుంబాలకు నారాయణ ప్రసాద పథకం ద్వారా ఉచిత భోజన సదుపాయాలు కల్పిస్తామని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ కోఆర్డినేటర్ సముద్రాల హనుమంతరావు తెలిపారు. శనివారం స్థానిక కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పథకం ద్వారా బియ్యం, కందిపప్పు, నూనె, నెయ్యి తదితర వస్తువులను అందించాలనుకునే వారు సంకల్‌బాగ్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలోని నగర సంఘం ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్‌ను సంప్రదించాలన్నారు. ఈ దేవాలయంలోని వనానికి నారాయణవనం అని పేరు పెట్టామన్నారు. ఎండోమెంట్తో సంబంధం లేకుండా అర్చకులు, పురోహితుల ఉపనయనాలకు రూ.25 వేలు, చంద్రశేఖర్ పథకం ద్వారా వధూవరులకు రూ.1 లక్ష అందిస్తామన్నారు. త్వరలోనే కర్నూలు నగరంలో బ్రాహ్మణులు అపకర్మలు చేసుకునేందుకు భవనంతో పాటు విశ్రాంతి భవనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పేద బ్రాహ్మణ విద్యార్థులకు హాస్టల్ వసతి, వేద పాఠశాల, వృద్ధాశ్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి హెచ్‌కే మనోహర్‌రావు, నగర అధ్యక్షుడు కళ్లె చంద్రశేఖరశర్మ, ఉపాధ్యక్షుడు ఎస్ చంద్రశేఖర్, సీవీ దుర్గాప్రసాద్, శ్యాంసుందరశర్మ, హెచ్‌కే రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
నిజమైన కృతజ్ఞుడు..!
బెర్లిన్: కీడు చేసినవారిని మరిచిపోయినా పర్వాలేదుగానీ.. మంచి చేసినవారిని మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. అవకాశం వచ్చినప్పుడల్లా వారిపట్ల చేతనైనంత కృతజ్ఞత చూపించుకోవడం ప్రతి మనిషికి ఉండాల్సిన విజ్ఞత. అదే విషయాన్ని నిరూపించుకున్నాడు ఓ సిరియన్ శరణార్థి. కట్టుబట్ట సొంతగూడు వదిలేసి అకస్మాత్తుగా తమ దేశాన్ని విడిచి వచ్చిన తమను అక్కున చేర్చుకున్న జర్మనీ దేశంపట్ల సిరియా శరణార్థి అలెక్సా అస్సాలి రుణం తీర్చుకునే ప్రయత్నం ప్రారంభించి అందరిచేత ప్రశంసలు అందిపుచ్చుకున్నాడు. కన్నీళ్లు నింపుకొని, కన్నవారిని చేతపట్టుకొని వచ్చిన తమకు జర్మనీ ఆశ్రయం ఇచ్చిన తీరు మరవలేమని అందుకే తన ఈ ఉడతా భక్తి సాయం అంటూ ఓ వీధిలో నిల్చుని స్వయంగా ఆహారం వండి ఉచితంగా జర్మన్ ప్రజలకు పంచిపెడుతూ వారి మనసులు కొల్లగొట్టేశాడు. అలెక్సా అస్సాలి అనే సిరియా శరణార్థి గత నెలలో జర్మనీకి వలస వచ్చాడు. ఆ సమయంలో జర్మనీ తనను అక్కున చేర్చుకున్న విధానానికి ముగ్గుడైపోయాడు. తాను ఆశ్రయం పొందిన వెంటనే సేద తీరకుండా తమకు సాయం చేసిన జర్మనీకి ఏదో చేయాలన్న తహతహతో బెర్లిన్ లోని అలెగ్జాండ్రాప్లాట్స్ స్టేషన్ వద్ద వేడివేడిగా వంట చేసి అక్కడ ఉన్న ఆశ్రయం లేనివారికి, పేదలకు ఉచిత ఆన్నదానం చేయడం ప్రారంభించాడు. దీన్నంతటిని వీడియో తీసిన కొందరు ఇంటర్నెట్ లో పెట్టగా కొద్ది సమయానికే 27లక్షల మంది వీక్షించారు. -
'మీరు రాళ్లతో కొడితే మేము ఫుల్ మీల్స్‌తో కొడతాం'
'మీరు రాళ్లతో కొడితే మేము పూలతో కొడతాం, ఫుల్ మీల్స్‌తో కొడతాం' అంటున్నారు భారత ప్రజలతో సత్సంబంధాలు కోరుకుంటున్న పాకిస్తాన్ ప్రజలు. భారత్‌లోని హిందూ మతఛాందసవాదులనుద్దేశించి ఈ మాటలు అనడమేకాదు, పాకిస్తాన్లో 'డంకిన్ డోనట్స్' 26 ఫ్రాంచైజ్‌లు కలిగిన ఓ వ్యాపారవేత్త భారత పర్యాటకుల కోసం ఉచిత భోజన స్కీమ్‌ను అమలు చేస్తున్నారు. స్వల్పకాల పర్యటన కోసం పాకిస్తాన్‌కు వచ్చే భారతీయులకు ఇస్లామాబాద్, లాహోర్, పెషావర్ బ్రాంచిల్లో అక్టోబర్ 17 వ తేదీ నుంచి ఈ ఉచిత భోజన స్కీమ్‌ను అమలు చేస్తుండగా నేటి వరకు దాదాపు 2,500 మంది భారతీయులు భోజనం చేసి తమ సౌభ్రాతృత్వాన్ని చాటి చెప్పారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేశంలో హిందూ మతఛాందసవాసులు పేట్రేగిపోతున్న విషయం తెలిసిందే. బెదిరింపులకు భయపడి ప్రముఖ పాకిస్తానీ గజల్ సింగర్ గులాం అలీ తాను ముంబైలో నిర్వహించాల్సిన కచేరీని కూడా రద్దుచేసుకున్నారు. భారత్ గడ్డపై పాకిస్తాన్ క్రికెట్ జట్టును ఆడనీయమని హెచ్చరికలు చేయడమే కాకుండా ముంబైలోని బీసీసీఐ కార్యాలయంపై సోమవారం శివసేన కార్యకర్తలు దాడులకు కూడా తెగబడడంతో పాకిస్తాన్ క్రికెట్ అంపైర్ , కామెంటేటర్లు భారత్-దక్షిణాఫ్రికా వన్ డే సిరీస్ నుంచి తప్పుకున్న విషయమూ తెల్సిందే. పాక్ క్రికెట్ అంపైర్ అలెన్ డర్ , కామేంటేటర్లు వాసిం అక్రమ్, షోహబ్ అక్తర్ లు పాకిస్తాన్ కు వెళ్లిపోతున్నట్టు ప్రకటించారు. ఇంతకూ భారత పర్యాటకులకు ఉచిత భోజన సదుపాయం కల్పించాలనే ఆలోచన పాక్ వ్యాపారవేత్త ఇక్బాల్ లతీఫ్ కు ఎందుకొచ్చిందంటే... ఇనాయత్ అలీ అనే పాకిస్తానీ జాతీయుడు, తన కుటుంబసభ్యులతో అక్టోబర్ 16వ తేదీన ముంబైలోని బెండీ బజార్‌కు వచ్చారు. హోటల్ గది కోసం దాదాపు 40 హోటళ్లు తిరిగారు. ఏ హోటల్ కూడా ఆయన్ని, ఆయన కుటుంబసభ్యులను బస చేసేందుకు అనుమతించలేదు. భారత్‌ను సందర్శించే విదేశీయులు, ముఖ్యంగా పాకిస్తానీయులు 'ఫారమ్-సి' పత్రం కలిగి ఉండాలి. అది లేదన్న కారణంగా ఇనాయత్ అలీ కుటుంబాన్ని హోటల్లోకి అనుమతించలేదు. ఫలితంగా ఆయన కుటుంబం ఒక రాత్రి పోలీసు స్టేషేన్కు సమీపంలోని ఫుట్‌పాత్‌పై, మరో రాత్రి రైల్వేస్టేషన్ సమీపంలోని ఫుట్‌పాత్‌పై పడుకోవాల్సి వచ్చింది. హోటళ్లు అనుమతించని విషయాన్ని అక్టోబర్ 16వ తేదీనే పాకిస్తానీ టీవీ ఛానళ్లు ప్రముఖంగా ప్రసారం చేయడంతో పాక్ వ్యాపారి లతీఫ్ కు ఉచిత భోజన స్కీమ్ స్ఫురించింది. వెంటనే తన ఫ్రాంచైజీ హోటళ్ల ముందు ఉచిత భోజనం అంటూ ఇరువైపులా భారత్, పాకిస్తాన్ జాతీయ జెండాల చిహ్నాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఉచిత భోజనానికి ఆశించినంత స్పందన లేకున్నా తన వ్యాపారం మాత్రం 30శాతం అభివృద్ధి చెందిందని, భారత ప్రజలతో సత్సంబంధాల కోసం తాను తీసుకున్న ఈ చిరు చర్యను ఎంతోమంది కస్టమర్లు అభినందిస్తున్నారని, సరిహద్దు నుంచి ఓ పాకిస్తాన్ సైనికుడు కూడా ఫోన్ చేసి మరీ తనను అభినందించారని లతీఫ్ తెలిపారు. అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ఆక్కడ తన హోటల్ ను సందర్శించి అల్పాహార విందును స్వీకరించారని, ఇదే హోటల్లో ఇప్పుడు భారతీయులకు వడ్డించడాన్ని తాను ఎంతో గౌరవంగా, గొప్పగా ఫీలవుతున్నానని లతీఫ్ వ్యాఖ్యానించారు. ఇరువైపులా కొన్ని మతఛాందసవాద శక్తులు మినహా ఇరుదేశాల ప్రజలు శాంతియుత సత్సంబంధాలనే కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. సంకుచిత స్వభావాన్ని వీడాలని, ప్రేమను పంచి ఫలితాన్ని చూడాల్సిందిగా శివసేనను తాను కోరుకుంటున్నానని ఆయన అన్నారు. పాకిస్తాన్ సోదరుల కోసం భారత హోటళ్లు కూడా ఇలాంటి స్కీమ్ ను ఏర్పాటు చేస్తే స్పందన మాట అటుంచి వ్యాపారం మాత్రం పెరిగిపోతుందని లతీఫ్ చిట్కా సూచించారు. -
బాసరలో భక్తులకు ఉచితభోజనం
-
రోజూ లక్షమందికి అన్నదానం
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోదావరి పుష్కరాల అన్నదాన కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. గోదావరి పుష్కరాల సందర్భంగా ప్రతి రోజూ లక్ష మందికి అన్నదానం చేయనున్నారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు కొవ్వూరులో పుష్కరఘాట్ పనులను పరిశీలించారు. గోసంరక్షణశాలను చంద్రబాబు సందర్శించారు. -
నిత్యాన్నదాన విరాళాలు రూ. 600 కోట్లు
తిరుమల: టీటీడీ శ్రీవారి నిత్యాన్నప్రసాదం ట్రస్టుకు విరాళాలు రూ. 600 కోట్లు దాటాయి. 1985, ఏప్రిల్ 6వ తేదీన టీటీడీ శ్రీవారి నిత్యాన్నదానాన్ని స్కీముగా ప్రారంభించారు. 1994 తర్వాత ట్రస్టుగా మార్చి స్వయం ప్రతిపత్తి హోదాను కల్పించారు. రోజుకు రెండువేల మందితో ప్రారంభించిన ఈ పథకం 30 ఏళ్లపాటు మహాయజ్ఞంలా కొనసాగుతూ ప్రస్తుతం రోజుకు 1.11 లక్షల నుంచి 1.42 లక్షల వరకు అన్నప్రసాదాలు వడ్డిస్తున్నారు. -
విమానాశ్రయంలో 'వింత' భోజనప్రియుడు
బీజింగ్ : విమాన టికెట్టును ఎవరైనా విమానయానం కోసమే ఉపయోగిస్తుంటారు. టిక్కెట్టుతో సమకూరే అదనపు ఉచిత సౌకర్యాలేవైనా ఉంటే, ప్రయాణం వరకూ మాత్రమే వాటిని ఉపయోగిస్తారు. చైనాలోని ఒక వింత వ్యక్తి మాత్రం విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లో రాజపూజితంగా దొరికే ఉచిత భోజనం కోసమే టికెట్టు తీసుకున్నాడు. టికెట్టును ఎప్పుడూ రద్దు చేసుకున్నా, డబ్బును పూర్తిగా వాపసు చేసే వెసులుబాటు కల్పించిన ఈస్టర్న్ చైనా ఎయిర్‌లైన్స్‌లో ఫస్ట్ క్లాస్ టికెట్టు కొని, దాంతో విమానంలో ప్రయాణించకుండా, ఎప్పటికప్పుడు ప్రయాణాన్ని రద్దు చేసుకుంటూ 300సార్లు అదే టికెట్టును రీబుకింగ్ చేసుకున్నాడు. షాంగ్లీ ప్రావిన్స్ జియాన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రతిసారీ లాంజ్ సిబ్బందికి ఠీవిగా తన టికెట్టు చూపేవాడు. లాంజ్‌లో చక్కర్లు కొడుతూ, టికెట్టుపై లభించే ఉచిత భోజనాన్ని సుష్టుగా ఆరగించేవాడు. తర్వాత టికెట్టును మరుసటి తేదీకి మార్చుకునేవాడు. ఏడాది వ్యవధిలో ఏకంగా 300 సార్లు ఉచిత భోజనాన్ని ఆస్వాదించాడు. విమానాశ్రయ సిబ్బంది అడ్డుకోవడంతో టికెట్టును రద్దు చేసుకుని, డబ్బును పూర్తిగా వాపసు తీసుకున్నాడు.