'మీరు రాళ్లతో కొడితే మేము ఫుల్ మీల్స్తో కొడతాం'
'మీరు రాళ్లతో కొడితే మేము పూలతో కొడతాం, ఫుల్ మీల్స్తో కొడతాం' అంటున్నారు భారత ప్రజలతో సత్సంబంధాలు కోరుకుంటున్న పాకిస్తాన్ ప్రజలు. భారత్లోని హిందూ మతఛాందసవాదులనుద్దేశించి ఈ మాటలు అనడమేకాదు, పాకిస్తాన్లో 'డంకిన్ డోనట్స్' 26 ఫ్రాంచైజ్లు కలిగిన ఓ వ్యాపారవేత్త భారత పర్యాటకుల కోసం ఉచిత భోజన స్కీమ్ను అమలు చేస్తున్నారు. స్వల్పకాల పర్యటన కోసం పాకిస్తాన్కు వచ్చే భారతీయులకు ఇస్లామాబాద్, లాహోర్, పెషావర్ బ్రాంచిల్లో అక్టోబర్ 17 వ తేదీ నుంచి ఈ ఉచిత భోజన స్కీమ్ను అమలు చేస్తుండగా నేటి వరకు దాదాపు 2,500 మంది భారతీయులు భోజనం చేసి తమ సౌభ్రాతృత్వాన్ని చాటి చెప్పారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేశంలో హిందూ మతఛాందసవాసులు పేట్రేగిపోతున్న విషయం తెలిసిందే. బెదిరింపులకు భయపడి ప్రముఖ పాకిస్తానీ గజల్ సింగర్ గులాం అలీ తాను ముంబైలో నిర్వహించాల్సిన కచేరీని కూడా రద్దుచేసుకున్నారు. భారత్ గడ్డపై పాకిస్తాన్ క్రికెట్ జట్టును ఆడనీయమని హెచ్చరికలు చేయడమే కాకుండా ముంబైలోని బీసీసీఐ కార్యాలయంపై సోమవారం శివసేన కార్యకర్తలు దాడులకు కూడా తెగబడడంతో పాకిస్తాన్ క్రికెట్ అంపైర్ , కామెంటేటర్లు భారత్-దక్షిణాఫ్రికా వన్ డే సిరీస్ నుంచి తప్పుకున్న విషయమూ తెల్సిందే. పాక్ క్రికెట్ అంపైర్ అలెన్ డర్ , కామేంటేటర్లు వాసిం అక్రమ్, షోహబ్ అక్తర్ లు పాకిస్తాన్ కు వెళ్లిపోతున్నట్టు ప్రకటించారు.
ఇంతకూ భారత పర్యాటకులకు ఉచిత భోజన సదుపాయం కల్పించాలనే ఆలోచన పాక్ వ్యాపారవేత్త ఇక్బాల్ లతీఫ్ కు ఎందుకొచ్చిందంటే... ఇనాయత్ అలీ అనే పాకిస్తానీ జాతీయుడు, తన కుటుంబసభ్యులతో అక్టోబర్ 16వ తేదీన ముంబైలోని బెండీ బజార్కు వచ్చారు. హోటల్ గది కోసం దాదాపు 40 హోటళ్లు తిరిగారు. ఏ హోటల్ కూడా ఆయన్ని, ఆయన కుటుంబసభ్యులను బస చేసేందుకు అనుమతించలేదు. భారత్ను సందర్శించే విదేశీయులు, ముఖ్యంగా పాకిస్తానీయులు 'ఫారమ్-సి' పత్రం కలిగి ఉండాలి. అది లేదన్న కారణంగా ఇనాయత్ అలీ కుటుంబాన్ని హోటల్లోకి అనుమతించలేదు. ఫలితంగా ఆయన కుటుంబం ఒక రాత్రి పోలీసు స్టేషేన్కు సమీపంలోని ఫుట్పాత్పై, మరో రాత్రి రైల్వేస్టేషన్ సమీపంలోని ఫుట్పాత్పై పడుకోవాల్సి వచ్చింది. హోటళ్లు అనుమతించని విషయాన్ని అక్టోబర్ 16వ తేదీనే పాకిస్తానీ టీవీ ఛానళ్లు ప్రముఖంగా ప్రసారం చేయడంతో పాక్ వ్యాపారి లతీఫ్ కు ఉచిత భోజన స్కీమ్ స్ఫురించింది. వెంటనే తన ఫ్రాంచైజీ హోటళ్ల ముందు ఉచిత భోజనం అంటూ ఇరువైపులా భారత్, పాకిస్తాన్ జాతీయ జెండాల చిహ్నాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
ఉచిత భోజనానికి ఆశించినంత స్పందన లేకున్నా తన వ్యాపారం మాత్రం 30శాతం అభివృద్ధి చెందిందని, భారత ప్రజలతో సత్సంబంధాల కోసం తాను తీసుకున్న ఈ చిరు చర్యను ఎంతోమంది కస్టమర్లు అభినందిస్తున్నారని, సరిహద్దు నుంచి ఓ పాకిస్తాన్ సైనికుడు కూడా ఫోన్ చేసి మరీ తనను అభినందించారని లతీఫ్ తెలిపారు. అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ఆక్కడ తన హోటల్ ను సందర్శించి అల్పాహార విందును స్వీకరించారని, ఇదే హోటల్లో ఇప్పుడు భారతీయులకు వడ్డించడాన్ని తాను ఎంతో గౌరవంగా, గొప్పగా ఫీలవుతున్నానని లతీఫ్ వ్యాఖ్యానించారు. ఇరువైపులా కొన్ని మతఛాందసవాద శక్తులు మినహా ఇరుదేశాల ప్రజలు శాంతియుత సత్సంబంధాలనే కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. సంకుచిత స్వభావాన్ని వీడాలని, ప్రేమను పంచి ఫలితాన్ని చూడాల్సిందిగా శివసేనను తాను కోరుకుంటున్నానని ఆయన అన్నారు. పాకిస్తాన్ సోదరుల కోసం భారత హోటళ్లు కూడా ఇలాంటి స్కీమ్ ను ఏర్పాటు చేస్తే స్పందన మాట అటుంచి వ్యాపారం మాత్రం పెరిగిపోతుందని లతీఫ్ చిట్కా సూచించారు.