
మత పెద్ద సహా ఐదుగురి మృతి..
20 మందికి గాయాలు
పెషావర్: వాయవ్య పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తూంక్వా ప్రావిన్స్‌లో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభానికి ముందు ఘోరం జరిగింది. నౌషేరా జిల్లా అకోరా ఖట్టక్ పట్టణంలో మతపరమైన సదస్సులో ఆత్మాహుతి దాడి చోటుచేసుకోవడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది గాయ పడ్డారు. శుక్రవారం సదస్సులో జుమ్మా ప్రార్థనలు జరుగుతుండగా ఓ దుండగుడు తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో జమీయత్ ఉలేమా ఇస్లామ్ (జేయూఐ) అధినేత, మదర్సా– ఇ–హకానియా మసీదు నిర్వాహకుడు హమీదుల్ హక్ హక్కానీతోపాటు మరో నలుగురు అక్కడి కక్కడే మృతిచెందారు.
హక్కానీ లక్ష్యంగానే ఈ దాడి జరిగినట్లు భావిస్తున్నామని స్థానిక ఐజీ జుల్ఫీకర్ హమీద్ చెప్పారు. 1968లో జన్మించిన హక్కానీ తన తండ్రి మౌలానా సమీ ఉల్ హక్ మరణం తర్వాత జేయూఐ అధినేతగా బాధ్యతలు చేపట్టారు. మతపెద్దగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రాణాపాయం ఉండడంతో పోలీసులు ఆయనకు ఆరుగురు సెక్యూరిటీ గార్డులతో రక్షణ కల్పిస్తున్నారు. అయినప్పటికీ ఆత్మాహుతి దాడిలో హక్కానీ మర ణించడం స్థానికంగా సంచలనం సృష్టించింది. ఆ త్మాహుతి దాడికి ఎవరు కారకులన్నది ఇంకా తెలియ రాలేదు. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.