కరాచీలో సిరా గుర్తు చూపిస్తున్న మహిళా ఓటర్లు
ఇస్లామాబాద్: పొరుగుదేశం పాకిస్తాన్‌లో హింసాత్మక ఘటనల మధ్య సాధారణ ఎన్నికలు ఎట్టకేలకు ముగిశాయి. మొత్తం 12.8 కోట్ల మంది ఓటర్ల కోసం 6.50 లక్షల మంది భద్రతా సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహించారు. పోలింగ్ నేపథ్యంలో గురువారం ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించింది. ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఆ వెంటనే అధికారులు ఓట్ల లెక్కింపు ప్రక్రియను మొదలు పెట్టారు. శుక్రవారం ఉదయాని కల్లా ఫలితాల సరళిపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.
ఉగ్రదాడుల్లో ఆరుగురు మృతి
ఖైబర్ ఫంక్తున్వా ప్రావిన్స్‌లో జరిగిన వేర్వేరు ఘటనల్లో ఆరుగురు భద్రతా సిబ్బంది చనిపోయారు. డేరా ఇస్మాయిల్ ఖాన్‌లోని కలాచి వద్ద భద్రతా సిబ్బంది వాహనాన్ని బాంబుతో పేలి్చన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఘటనలో నలుగురు జవాన్లు చనిపోయారు. మరో ఘటన..బలోచిస్తాన్‌లోని ఖరాన్‌లో మందుపాతర పేలి ఇద్దరు పోలీసులు చనిపోగా మరో ఏడుగురు గాయపడ్డారు. భద్రతా కారణాలు చూపుతూ అధికారులు ఇరాన్, అఫ్గానిస్తాన్ సరిహద్దులను గురువారం మూసివేశారు.
సరుకు రవాణా వాహనాలతోపాటు పాదచారులను సైతం అనుమతించలేదు. పోలింగ్ ప్రారంభమైన వెంటనే మొబైల్, ఇంటర్నెట్ సరీ్వసులను దేశవ్యాప్తంగా నిలిపివేశారు. అయితే, రిగ్గింగ్‌ను యథేచ్ఛగా కొనసాగించేందుకే ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం నిలిపివేసిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీనిపై ఎన్నికల కమిషనర్ సికందర్ సుల్తాన్ రజా స్పందిస్తూ ఉగ్రదాడులు జరిగితే బాధ్యతెవరిదని ప్రశ్నించారు. ఎన్నికలకు, ఇంటర్నెట్‌తో ఎటువంటి సంబంధం లేదన్నారు.
మద్దతుదారుల మధ్య ఘర్షణ
అటోక్ నియోజకవర్గంలో రెండు చోట్ల పీఎంఎల్–ఎన్, పీటీఐ పార్టీ మద్దతుదారుల మధ్య ఘర్షణతో పోలింగ్ 5 గంటలపాటు ఆగిపోయింది. కొన్ని ప్రాంతాల్లో సిబ్బంది విధులకు రాకపోవడం, బ్యాలెట్ పేపర్లు చాలినన్ని అందకపోవడం, బ్యాలెట్ పేపర్లలో తప్పులు వంటి కారణాలతో చాలా చోట్ల పోలింగ్ ఆలస్యమైంది. బలోచిస్తాన్, ఖైబర్ ఫంక్తున్వా ప్రావిన్స్‌ల్లో వర్షం, అతిశీతల వాతావరణ పరిస్థితుల మధ్య చాలా చోట్ల ఓటేసేందుకు జనం బయటకు రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment