కరాచీ: మసీదుల్లో మిలాదునబి వేడుకలే లక్ష్యంగా పాకిస్తాన్‌లో శుక్రవారం జరిగిన రెండు వేర్వేరు ఆత్మాహుతి దాడుల్లో 58 మంది మృత్యువాతపడగా మరో 100 మందికి పైగా గాయాలపాలయ్యారు. బలూచిస్తాన్ ప్రావిన్స్ మస్తుంగ్ జిల్లా కేంద్రంలోని ఓ మసీదులో ప్రార్థనల సమయంలో జరిగిన బాంబు దాడిలో 54 మంది చనిపోయారు. మరో 100 మంది గాయపడ్డారు. మృతుల్లో డీఎస్‌పీ నవాజ్ గషో్కరి కూడా ఉన్నారు.
గుర్తు తెలియని దుండగుడు డీఎస్‌పీ నవాజ్ కారు పక్కనే నిలబడి తనను తాను పేల్చేసుకున్నాడని అధికారులు తెలిపారు. క్షతగాత్రుల్లో సుమారు 20 మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. అదేవిధంగా, ఖైబర్ ఫంక్తున్వా ప్రావిన్స్ హంగు నగరంలోని దవోబా పోలీస్ ఠాణాలోకి అయిదుగురు ఉగ్రవాదులు ప్రవేశించారు. భద్రతా బలగాలతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతం కాగా మరో నలుగురు పారిపోయారు.
వారిలో ఒకరు పక్కనే ఉన్న మసీదులోకి చేరుకుని తనను పేల్చేసుకున్నాడు. ఈ దాడిలో మసీదులో ఉన్న నలుగురు ప్రాణాలు కోల్పోగా మరో 12 మంది గాయపడ్డారు. మిగతా ముగ్గురు ఉగ్రవాదుల కోసం వేట సాగుతోందని పోలీసులు చెప్పారు. ఈ దాడులకు తాము కారణం కాదంటూ తెహ్రీక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్ తెలిపింది. ఉగ్ర సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్)కు చెందిన కీలక కమాండర్‌ను భద్రతా బలగాలు కాల్చి చంపిన మరునాడే ఈ ఘటన చోటుచేసుకోవడంతో ఐఎస్ పాత్రపై అనుమానాలు తలెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment