ఇస్లామాబాద్: సోమవారం అర్ధరాత్రి బలూచిస్తాన్‌లోని పంజ్‌గూర్ జిల్లాలో ఒక వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ల్యాండ్‌మైన్ పేల్చారు దుండగులు. ఈ పేలుడులో యూనియన్ కౌన్సిల్ (యుసి) ఛైర్మన్‌తో సహా కనీసం ఏడుగురు మరణించారని అధికారులు ప్రకటించారు.
సోమవారం సాయంత్రం ఒక వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తున్న బల్గతార్ యుసి ఛైర్మన్ ఇష్తియాక్ యాకూబ్ తోపాటు వాహనంలో ప్రయాణిస్తున్న ఇతరులను లక్ష్యంగా చేసుకుని దుండగులు రిమోట్ సాయంతో పేల్చడానికి ల్యాండ్‌మైన్ అమర్చారని పంజ్‌గూర్ డిప్యూటీ కమిషనర్ అమ్జద్ సోమ్రో తెలిపారు.
వాహనం బల్గతార్ ప్రాంతంలోని చకర్ బజార్ వద్దకు రాగానే దుండగులు రిమోట్ సాయంతో వాహనాన్ని పేల్చివేశారని ఫలితంగా అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. మృతుల్లో మహ్మద్ యాకూబ్, ఇబ్రహీం, వాజిద్, ఫిదా హుస్సేన్, సర్ఫరాజ్, హైదర్ ఉన్నట్లు వీరంతా బల్గతార్, పంజ్‌గూర్ ప్రాంతానికి చెందినవారని అన్నారు.
ఈ ప్రమాదం జరిగిన చోటే 2014లో ఇష్తియాక్ యాకూబ్ తండ్రి యాకుబ్ బల్గాత్రి తోపాటు అతని పదిమంది అనుచరులను కూడా ఇదే తరహాలో బాంబుదాడిలో హత్య చేయబడ్డారు. ఆనాటి ఆ దాడికి సూత్రధారులం తామేనంటూ బలూచ్ లిబరేషన్ ఫ్రంట్(BLF) అప్పుడే ప్రకటించింది. తాజాగా జరిగిన సంఘటనకు కూడా వారే బాధ్యులై ఉంటారని అధికారులు భయపడుతున్నారు.
ఇది కూడా చదవండి: ఇటలీ తీరంలో పడవ బోల్తా.. ఇద్దరి మృతి
Comments
Please login to add a commentAdd a comment